Wednesday, 26 September 2012

మేలుకొలుపు


Published in Andhra Jyothi Sunday, 5th August 2012)

గేటు శబ్దమయితే తలత్రిప్పి చూశా ! రుమ , చరిత, చరణ్. యింత ఉదయమే ..ఒహ్హో రుమ పెళ్లి గురించి చర్చలు  కాబోలు .."రండి".. చదువుతున్న హిందూ పేపర్ మడిచి పెట్టి అన్నాను . "ఎంత హాయిగా కూర్చున్నావురా.. నీ చల్లటి తోటలో ! ..అదృష్టవంతుడివి..! ఎంత ఆహ్లాదకరంగా వుంది వాతావరణం ! అవునూ... మాకు  దూరంగా ఎందుకు ఇంతదూరం కట్టుకున్నావురా ఇల్లు? ఈ తోట కోసమేనా ?" చరణ్ నా తోటని పరికించి చూసి మెచ్చుకోలుగా అన్నాడు.
"అవును... ఏంటి శుభలేఖలు ఎప్పుడు తయారవుతాయి ?"అన్నాను. 
"రుమా.... నీవు పిన్నితో మాట్లాడుతూ వుండుపో" అని చరణ్ అనడంతో రుమ లోపలి వెళ్ళింది. "తోట చూద్దాం ..పద" అనడం తో చరిత కూడా మెల్లిగా లోపలి కి వెళ్ళింది. ఏదో తేడాగా అనిపించింది, ఇద్దరం తోట చూస్తూ మౌనంగా నడిచాము కాసేపు. చరణ్ ఏదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది.. నాకు పెదనాన్న కొడుకైన చరణ్ నాకంటే పెద్దవాడైనా, మేం పేర్లు పెట్టుకునే పిల్చుకుంటాము,స్నేహితుల్లాగే కష్టం సుఖం పంచుకుంటాము. మా నాన్నగారు ఎప్పుడో తీసుకున్న పొలం టౌన్ కి దగ్గర కావడంతో నేను పొలం లోనే చిన్న ఇల్లు కట్టుకుని నా కిష్టమైన మొక్కల పెంపకమనే అభిమతాన్ని నెర వేర్చు కుంటున్నా!కానీ నా బాల్యం నుండి వున్నవీధిని, అదే వీధిలో వుండే నా బంధు వర్గాన్ని ముఖ్యంగా చరణ్ ని , వాడి కూతురు రుమా ని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ వుంటాను .రుమా మా అన్నదమ్ముల పిల్లల్లో ఒక్కతే ఆడపిల్ల ..అందుకే అందరికి ముద్దు, తెలివైంది ఎంతో సరదాగా ఉంటూ, అందర్నీతన మంచి గుణాలతో ఆకట్టుకుంటుంది. త్వరలో రుమ పెళ్లి, రాహుల్ మంచి యోగ్యుడైన అబ్బాయి అని అందరూ అనుకుని నిర్ణయించారు. నిశ్చితార్థం  ఘనంగా జరిగింది, పెళ్లి త్వరలోనే అనుకుంటున్నారు ...మరి ఈ సందర్భం లో ..ఏదో  సలహా కోసం వచ్చినట్లుంది చరణ్ .  
"రుమ పెళ్లి ఎప్పుడను కుంటున్నారు ?" అడిగాను .
"రుమ పెళ్లి చేసుకోను అంటోంది...కారణం చెప్పడం లేదు, ఆ అబ్బాయి కి కూడా చేసుకోను అని చెప్పేసింది, అతను రుమాను చాలా ప్రేమిస్తాడు, అతనికి కారణం చెప్ప లేదంట, మనిద్దరి అభిప్రాయాలు వేరు వేరు అన్నదట, ఎంగేజ్మెంట్ రింగ్, అతనిచ్చిన కొన్ని గిఫ్త్స్ కూడా ఇచ్చేసిందట, రుమ తో తల బొప్పికట్టింది ...రుమను ఇంక మార్చగలిగింది నువ్వొక్కడివే .."
"అదేంటి..ఇద్దరూ ఇష్టపడ్డారు, అప్పుడప్పుడు ఆ అబ్బాయి వస్తుంటాడు ..రుమ  ని కలుస్తుంటాడు అన్నావు కదా! "
"అవును, ఏదో మరి నాకు తెలియదు..రుమ ని పెళ్ళికి వప్పించాలి, వప్పిస్తానని మాట ఇవ్వు "
"చరణ్..నేను మాట ఇవ్వలేను ... ముందు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఆలోచిద్దాం "
తోటలోని మొక్కల్ని చూసుకుంటూ కొద్దిసేపు ఇద్దరం ఆన్ని సంగతులు మర్చిపోయాం. అలా ఇలా తిరిగి ఇంట్లోకి వెళ్ళాం. చరిత, రుమ,నా భార్య అమల..పూరి చేస్తున్నారు. అందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తుండగా..."మీ బాబాయ్ తోట ఎంత బావుందో రుమా, చామంతులు ఎన్ని రంగులున్నాయో ..తెలుసా! నీవు అవి చూస్తూ మనింటికి రావేమో ! మీ బాబాయ్ తో వెళ్లి చూడు... ఎప్పుడో ఒక కొటేషన్ చదివాను ..అదేంటంటే... ఒక గంట సంతోషంగా ఉండడానికి మధువు సేవించు ,ఒక  రోజు సంతోషంగా ఉండడానికి మంచి భోజనం చెయ్యి, కొంతకాలం సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకో, ఎప్పటికి సంతోషంగా ఉండడానికి తోట పెంచుకో అని ... నిజంగా నీ తోట చూసాక మనసంతా తేలిగ్గాను,శరీరం  ఉత్సాహంగాను వుంది.'అన్నాడు. చరణ్ అంతరంగం నాకు రుమకు ఇద్దరికీ అర్థమైంది,ఇద్దరినీ తోటలోకి వెళ్లి మాట్లాడమని అతని ఉద్దేశం . 
ఇద్దరం తోటలోకి నడిచాము.. మామూలుగా అయితే రుమ నాతో చాలా చనువుగా వుంటుంది కానీ  వాళ్ళ నాన్ననాకు  ఏదో చెప్పి ఉంటాడనే విషయం తెలిసి కాబోలు .. మౌనంగా వుండి పోయింది.
"చెప్పు రుమా పెళ్లి వద్దని అంటున్నావట ..కారణం ఏంటి ?"నేరుగా అడిగేశాను 
తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది 
"అతనికి ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా?"          
"వుహూ "
"మరి  ఏదైనా అఫైర్ లో వున్నట్టు తెలిసిందా "
"వుహూ "
"మరి "
మౌనం మాత్రమే  కాసేపు...తర్వాత  
"బాబాయి అతనితో నాకు పెళ్లి ఇష్టం లేదు ప్లీజ్ ...కారణాలే కావాలంటే నేను ఏవైనా చెప్పొచ్చు .కానీ అతనికి మీరు చెప్పే చెడు అలవాట్లు లేవు, కానీ అతనిలో నాకు నచ్చని గుణాలు చెబితే మీరు ఒప్పుకోరు ..."
"చెప్పి చూడు "
"అతన్నిపెళ్లి చేసుకోమని బలవంత పెట్టనంటే  చెబుతాను '
ఒక్క  నిముషం నేను ఆలోచనలో పడ్డాను ...వాగ్దానం చేసానంటే చిక్కుల్లో పడతాను ...తర్వాత చరణ్ కు రుమాకు ఇద్దరికీ ఇబ్బంది  కలిగిస్తానేమో! ఏమి చేయాలి? రుమా చదువుకున్నఅమ్మాయి, పైగా ఎంతో స్వేచ్చగా ఆలోచించే వాతావరణం లో పెరిగింది ..ఆమె నిర్ణయాలకు తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డురారు, అయితే పెళ్లి ఇంకో నెల వుండగా ఇలా నచ్చలేదు అనడం ఏంటి ? సంవత్సరం నుండి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ..ఇదేంటి ? ఏమయితేనేం ? తను పెళ్లి చేసుకోను అని చెప్పాక ఇంక నేను నచ్చ చెప్పేదేముంది ..కనీసం తన ఆలోచన అయినా తెలుసుకోవాలి కదా...!    
"నీకిష్టం లేకుంటే ఎందుకు చేస్తాం తల్లి.. చెప్పు నీ సమస్య ఏంటో .."అన్నాను. 
"బాబాయ్...మామూలుగా అయితే ..ఏ అమ్మాయికైనా  రాహుల్ ఒక డ్రీం హస్బండ్ ..నేను కూడా అతన్ని ఇష్టపడ్డాను ..కానీ కానీ కొన్ని విషయాల్లో అతని ప్రవర్తన నేను భరించలేకపోతున్నా ...అతనికి నేనంటే చాలా ఇష్టం, కానీ నా అభిప్రాయాల్ని సిల్లి గా ఉంటాయని కొట్టివేస్తాడు ..నా పెట్ అనిమల్స్ ని అసహ్యించుకుంటాడు ..నా అక్వేరియం చూసి ఇందులో ఆనందం ఏముంది..చేపలు కూడా ఇష్టమా నీకు అంటాడు ,..మొన్న నా పుట్టినరోజని నాకు డైమండ్ రింగ్  కొన్నాడు, కానీ  అనాధ  శరణాలయం కు  వెళదామంటే, పుట్టిన రోజు ఆత్మీయులతో గడపాలి కానీ  అనాధలతో గడపడం ఏంటి  అన్నాడు? నీకు  తెలుసుకదా బాబాయ్ నాకు పుట్టిన రోజు చేసుకోవడమే ఇష్టం వుండదు కానీ అతను  తెలుసుకుని వచ్చాడు కదా అతన్ని నిరాశ పరచడం ఎందుకని అతనితో బయటికి వెళ్ళా ! అతని తత్వం వేరే బాబాయ్ ...చాలా స్వార్థపరుడు...  హోటల్ దగ్గర సర్వర్ పొరపాటు చేస్తే వాడ్ని కొట్టాడు . ఇతను పెట్టె హడావుడికి వాడికి చేయి వణికి గ్లాస్ లో పోయాల్సిన నీళ్ళని  ప్రక్కకు పోసాడు...అవి కాస్త  నా డ్రెస్ మీద పడ్డాయి అంతకు ముందు  కూల్ వాటర్ తేలేదని తిట్టాడు ..మళ్ళి కిన్లే కంపెని తేలేదని గొణిగాడు..." కాసేపు ఆగింది నా ప్రక్క చూసి, "ఫస్ట్ టైం కాబోయే భార్య ను ఇంప్రెస్స్  చేద్దామని ఎక్కువ ఎక్సైట్  అయాడేమో అనుకున్నా ..కానీ నాకు అలా అనిపించలేదు ...వచ్చేప్పుడు దారిలో ఒక ముసలాయన  వడ దెబ్బ కొట్టి పడిపోయాడు...ఎవరో దారిన పోయే వాళ్ళే  కారు ఆపి అడిగారు హాస్పిటల్ కి తీసి కెళ్ల మని, వాళ్ళతో గొడవేసుకున్నాడు.."బుద్దిలేదా కారు నాపడానికి నేను తీసికెల్లను..ఏ ఆటోనో వస్తే తీసి కెల్లండి ఆన్నాడు  ..నేను కల్పించుకోబోతే నీకు తెలీదులే మనకు సినిమాకు టైం అవుతుంది పద అన్నాడు ... ముసలాయనకు సహాయం చేయడానికి వచ్చినతను మా ఇద్దర్ని చూసిన చూపును నేనిప్పటికీ మరచిపోలేకున్నా ...మేము అక్కడుండగానే ఇంకో కారు ఆపి విషయం అడిగి దగ్గరున్న నర్సింగ్ హోమ్ కు తీసి కెళ్ళారు ...ఇంటికొచ్చాక నేను అన్నయ్యను తీసుకుని నర్సింగ్ హోమ్  వెళ్లి చూసి అతనికి సారీ చెప్పి వచ్చాను.
పైగా తాను చేసింది కరెక్టని ..ఇలాంటి వాళ్ళ విషయాల్లో తలదూర్చకూడదని ...పాపం అని ఏదైనా సహాయం చేస్తే మెడకు చుట్టుకుంటుందని ..ఏదో లెక్చర్ ఇచ్చాడు ... అతనికి నా వ్యక్తిత్వం ..నా ఆలోచనలు ..అభిప్రాయాలు ఏవీ పట్టవు అతను ఏది చెబితే అది వినాలి, పోనీ మంచి విషయాలైతే వినొచ్చు ..పేదల పట్ల దయ చూపిస్తే తప్పు ..నిస్సహాయులకు సహాయం చేస్తే తప్పు ..సంగీతం సాహిత్యం చెత్త అట,  దానికి కేటాయించే సమయం కరీర్ కు ఇస్తే  ఏదైనా డెవెలప్మెంట్ వుంటుంది అంటాడు ...అతనితో జీవితం అంటే అతను పీల్చమన్నగాలి పీల్చాలి ..తినమన్న తిండి తినాలి .కట్టుకోమన్న బట్టలు కట్టుకోవాలి ..అతను చెప్పిన ప్రతి పని చేయాలి ..అతను చేసిన పనిని మెచ్చుకోవాలి .డబ్బు సంపాదించడం దాన్ని దాచుకోవడం తప్ప జీవితంలో ఇంకేది అతని దృష్టిలో విలువైనది లేదు ... నాకొద్దు బాబాయ్ ఆ రిజర్వ్ బాంకును నేను పెళ్లి చేసుకోను ...ఒకటి రెండు రోజుల్లోనే అతనంటే విరక్తి ..కోపం అసహ్యం కూడా కలుగుతున్నాయి. థాంక్ గాడ్ ..ఫార్చునేట్ గా నా బర్త్ డే  రావడం తో  ఈ మహానుభావుడి సంగతి తెలిసింది  ...హి ఇస్ అన్బేరబుల్ బాబాయ్ ..ప్లీజ్ సేవ్ మి ...ఇవన్ని చెబితే ...వీళ్ళకు సిల్లీగా వుంటాయి, పైకి  చాలా మేధావిగా కనిపించే ఈ ఐ అయిటియన్ తో జీవించడం కంటే ఈ పూల తోటలో మాలిగా జీవించడం మేలు బాబాయ్ .. నన్నారాతి మనిషికి కట్ట బెట్ట కండి  ..సాడిస్టు భర్తల్ని డివోర్స్ చేసుకుని  ఒంటరిగా అమ్మాయిలు ధైర్యంగా బ్రతుకుతున్నారు .ఎంగేజ్మెంట్ అయినందుకు పరువు పోతుందని ఆ హృదయం లేని  మనిషి తో నేను జీవితాన్ని ఊహించలేను బాబాయ్ ..." దీనంగా అన్నా , రుమా మాటల్లో స్థిరత్వాన్ని చూసి మురిసి పోయా ...నా వారసురాలు రుమా.
ఇరవై ఐదేళ్ళ క్రితం నేను పడ్డ  వేదనే  నాలో మెదిలింది.." రుమా.. నేను కూడా ఇదే నరకం అనుభవించా నా పెళ్లి విషయం లో ... ఒక స్కూల్ టీచర్ గా పనిచేసే ఓ అమ్మాయితో నా పెళ్లి నిశ్చయమైంది.అనుకోకుండా ఒక రోజు ఆమె పనిచేసే స్కూల్ కి వెళ్ళడం, తను చదువెలా చెబుతుందోనని ఆమె క్లాసు దగ్గర నిలబడ్డ నాకు, ఆమె పసిపిల్లల్ని దారుణంగా కొట్టే విధానం చూసి ఆదిరిపోయాను.స్త్రీ కి ఉండాల్సిన ప్రేమ ,కరుణ, ఓర్పు , దయాగుణం లేని ఆమె సౌందర్యం నాకు వద్దనిపించింది ..ఆ విషయం చెప్పి పెళ్లి వద్దంటే అందరూ నన్ను వింతమనిషిని చూసినట్లు చూసారు..ఎంతో విమర్శించారు. నాకు పెళ్లి వద్దన్నా వినిపించుకోలేదు ..చివరికి ఇంటినుంచి పారిపోయి ఆ పెళ్లి తప్పించుకున్నా ..మా నాన్న నాతో ఓ రెండేళ్లదాకా మాట్లాడలేదు కూడాను ..నీ సంగతి వేరేలే నేను మానేజ్ చేస్తాకదా! అసలు కారణం  చెప్పొద్దు..అసలు ఏ కారణం చెప్పొద్దు...చరణ్  కు  నేను చెబుతా కదా!"
"థాంక్ యు బాబాయ్ "ఉత్సాహంగా నా చేతిని పట్టుకుని ముద్దుపెట్టుకుంది . తలనిమిరి "బంగారు తల్లివి కదా నీవు సంతోషంగా వుండు "అన్నాను 
ఇద్దరం తోటంతా తిరిగాం ...రుమ తన వాజ్ లోకి పూలు తెంపుకుంది ..ఇద్దరం ఇంట్లోకి వచ్చాం. చరణ్ నా కళ్ళలోకి ఆశగా చూసాడు ..  
"చరణ్....  రుమాకు రాహుల్ తో పెళ్లి  నేను కూడా వద్దంటే కారణాలు చెప్పాల్నా ?"   
ఆశ్చర్యంగా చూసాడు...తర్వాత  లేదన్నట్లు తల ఊపాడు .
"పెళ్లి  వద్దనుకున్నామని వాళ్లకు చెప్పేయ్...నాకు తెలుసు అతనితో రుమ సంతోషంగా ఉండలేదు ...పరువుకోసం జీవితాల్ని బలిఇచ్చే అనాగరిక కాలం లేము ..అంత అజ్ఞానం లో కూడాలేము...రుమను ఈ విషయం లో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను .."
చరణ్ ఏదో అనబోయి ..మళ్ళి "సరే రా ...నీవు చెప్పాక దాంట్లో ఇంక వేరే ఆలోచన చేయను ...రుమ   నీలాగే ఆలోచిస్తుంది,  నీకే తెలుసు రుమ మనసు..వాళ్లకు చెప్పేస్తాను.. పరువేంటి రా ..రుమ సంతోషమే ముఖ్యం నాకు .."చరణ్  కళ్ళలో తడి.       
రుమ  పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి  చుట్టేసింది... చరణ్ కళ్ళల్లో తడి స్థానే పితృ ప్రేమ ,   ఇప్పుడు ..అతని మనసే ఒక పూల తోట లా గుభాలించింది.

No comments:

Post a Comment