Wednesday, 26 September 2012

నాన్న


  •  (Published in Vartha,Sunday 6th May2012) 

మెలకువ రాగానే టైం కోసం గోడ ప్రక్క చూశా ...'ఎనిమిది' ...లేచి బయటికి  వచ్చేప్పటికి  రోజూ ప్రొద్దున్నే నాన్న గదిలోంచి  చిన్నగా వినిపించే పాత మధురమైన పాటలు వినపడలా... ఓహ్ నాన్న లేరు కదా , ఎక్కడ నాన్న ఉంటాడో అక్కడ పాత పాటలు వుంటాయి ..నా చిన్న తనం నుండి చూస్తున్నా ..నాన్నకు  పాటలు అంటే   ప్రాణం...క్రొత్తవి పాతవి అని లేకుండా ఆన్ని కాసెట్లు కొనేవాడు.కానీ ఒక సారి వినేసి అందులో మంచి పాటలు లేకపోతే వాటినిష్ట పడే వాళ్లకి ఇచ్చేవాడు. తను మాత్రం ఘంటశాల, సైగల్, రఫీ, ముకేష్, కిషోర్ ల పాటలు మాత్రమే ఎక్కువ వినేవాడు.ఇంట్లోకి రాగానే ఫ్యాన్, లైట్,టేప్రికార్డర్ మూడు ఒకే సారి ఆన్ చేసేవాడు.ఆయన ఇంట్లో వున్నాడనే దానికి నిదర్శనం పాటలు వినపడడమే. ఏదోలా వుంది నాన్న గదిలోంచి ఆ నాస్టాల్జిక్ సంగీతం వినపడక పోయే సరికి ...హాల్లో టోం అండ్ జెర్రి  మూజిక్  వినపడింది. జాయ్  స్కూల్ కి యింకా రెడీ కాలా, కార్టూన్ నెట్ వర్క్ పెట్టుకుని నవ్వు తున్నాడు, టైం చూస్తే ఎనిమిది... పది. వాడు ఎప్పుడు రెడి అవుతాడు?  కంగారుగా టివి కట్టేసి వాడ్ని స్నానానికి లాక్కెళ్ళి నీళ్ళు తిప్పితే, చల్లగా వున్నాయని వాడు పరిగెత్తి పోతున్నాడు. గీజర్ లో నీళ్ళు వేడి అయ్యేప్పటికి లేట్ అవుతుందేమో...  ఏదోలా వానికి  స్నానం చేపించేటప్పటికి చమటలు పట్టాయి.

 సంవత్సరం దాటినప్పటి నుండి జాయ్  ను రాత్రులు తన దగ్గరే పడుకోబెట్టుకునేవాడు నాన్న. రాత్రి కథలు చెప్పి నిద్రపుచ్చడం ... రోజూ ప్రొద్దున్నే వాడ్నిలేపి వాకింగ్ కి తీసికెళ్ళడం,వచ్చేప్పుడు పాల పాకెట్లు తేవడం ,జాయ్  ని  స్నానం చేపించి స్కూల్ కు రెడి చేయడం, వాడికి పాలు కలిపించి  త్రాపించడం, ఎంత మారాం చేసినా వాడికి టిఫిన్ ఎలాగో తినిపించడం, స్కూల్ దగ్గర వదలడం , సాయంత్రం తీసుకు రావడం, హోమ్ వర్క్ చేయించడం జాయ్  ని వదిలి వస్తూ కూరగాయలు తీసుకురావడం ఆయన పనే.ఎప్పుడైనా జాయ్  కి అనారోగ్యం చేసినా డాక్టర్ దగ్గరకి సైతం ఆయనే తీసుకెళ్ళే వాడు. ఇప్పుడు జాయ్  ని తయారు చేయ డానికి  టిఫిన్ తినిపించేదానికి నాకు  నీరసం వచ్చేసింది. 
షాలు ను లేపితే ."..ఏంటి ..వినూ నిద్రపోనీవా!" విసుక్కుంది. 
" నాన్నలేరు కదా, లక్ష్మికి వంట ఏంచేయాలో చెప్పు ..అడుగు తోంది ..జాయ్  ని రెడి చేశా ..స్కూల్ కి తీసుకెల్తున్నా..గెట్ అప్ "అని నేను అనడం తో  మెరుపులా లేచింది షాను. "అవును కదూ మర్చి పోయా .."పరుగు తీసింది.
 నేను రెడి అయ్యి బయటికి వచ్చేప్పటికి,  "పాలు లేవు, పాలపాకెట్ల వాడికి చెప్పలేదా..?" గట్టిగా కేక వేసింది షాలు 
"...మర్చి పోయా ...కాఫి  సంగతేంటి ? " అన్నా 
"..జాయ్  కి పాలు త్రాపించలేదా ?"
"..వాడికి బ్రెడ్ తిని పించాలే !"
"ఏంటి వినూ..  వాడికి పాలు లేకుండా.. నాకుకాఫీ లేకుండా చేసావ్?.. లక్ష్మి..  టిఫిన్  రెడి చెయ్యి లంచ్ కి ఏమ్చేస్తున్నావ్ ?"
"కూర గాయలు లేవమ్మా ...నిన్నంతా మీరు బయటికి వెళ్ళారు కదా నేను చూసుకోలా ."లక్ష్మి సాగ తీసింది. 
"నేను జాయ్ ని వదిలి పాలు, కూరగాయలు  తెస్తాలే ..అవునూ ఎక్కడ తేవాలి ?"
"లక్ష్మీ ...చూసావా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు ..".షాలు పడి పడి నవ్వుతోంది .
"తాతగారు బాబు ని వదిలి రైతు మార్కెట్ లో తెచ్చేవారు సార్ ..ఇవాళ ఇక్కడ నేను తెచ్చుకుంటాలే"అంది లక్ష్మి .

జాయ్  ని వదిలి వచ్చేప్పటికి తొమ్మిదిన్నర అయింది ..గబ గబా రెడి అయి ఏదో తిన్నామనిపించి ఉరుకుల పరుగుల తర్వాత లాప్టాప్ బాగ్ తీసుకుని పరుగు తీసి కారు దగ్గరికి వచ్చేప్పటికి కార్ దుమ్ము కొట్టుకుని వుంది ...నాన్న రోజూ ప్రొద్దున్నే అర్ద గంట పాటు కారు ఎంత శుబ్రంగా కడుగు తాడో గుర్తు వచ్చేప్పటికి కన్నీళ్లు తిరిగాయి ...నా వెంటే వచ్చిన షాలు ఏమైయ్యింది ? అని దగ్గరగా వచ్చింది ..".షాలు అయ్ మిస్ మై డాడ్ సో మచ్ ..ఆయన లేని లోటు నన్ను ప్రతి నిముషం గాయ పరుస్తా వుంది. డెబ్బై ఏళ్ళ వయసు లో  ఆయన ఈ పనులన్నీ ఎలా చేసే వారో ?ఇదెప్పుడూ నేను ఆలోచించ లేదు.ఆయన శ్రమని  టేకెన్ ఫర్ గ్రాన్టేడ్ గా తీసుకున్నా.... ఆయన్ని ఎప్పుడు అక్నాలేడ్జ్ చేయలేదు ..."నా గొంతు వణికింది "...ఐ  మిస్ హిం టూ ... "అంది షాలు ..ఆ మాటల్లో నిజాయితి వుంది.

సాయంత్రం ఇద్దరం ఆఫీసు నుండి వచ్చేప్పటికి జాయ్ బయటే ఆడుకుంటున్నాడు.బ్యాగ్ ఎక్కడో పడేసాడు ...ఆఫీసులో పడిన అలసట రెట్టింపు అయింది జాయ్  ని అలా చూడగానే . ఇల్లు నిశ్సబ్దంగా వుంది ,ఎవరికీ మాట్లాడే ఓపిక కూడా లేదు .

 అమ్మా నాన్న నాతోనే వుండే వాళ్ళు. క్లాస్ వన్  ఆనేస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయిన ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం .నా దృష్టిలోనే కాదు ...బంధువులు , స్నేహితులు , సహోద్యోగులు, పరిచయస్తులలో,మచ్చ లేని మనిషి .అజాత శత్రువు ,ఎవరిని ఏనాడు తక్కువ చేసి మాట్లాడి ఎరగడు  , చాతనైనంత ఇతరులకు సహాయం చేసిన వాడు తప్ప , ఎవరిని దేనికి సహాయం కోరేవాడు కాడు.  ఆయన్ని ఏ విషయంలోనూ తప్పు పట్టే అవకాశం వుండేది కాదు ...ఆయన్ని ఎవరైనా విమర్శించే దానికి సాహసించారంటే, వాళ్ళ ఔచిత్యాన్ని సందేహించాల్సిందే...  అంత నిజాయితిగా వుంటారాయన.  ఇంట్లో ఏ పని చేయడానికైనా నామోషి గా అనుకునేవాడుకాడు.  నా పసి తనం నుండి చూస్తున్నా, అమ్మ  పెద్దగా చదువుకోకున్నా ఆమెను గౌర వించేవాడు.స్వేచ్చగా  నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చేవాడు ,తమాషాకి కూడా ఆమెను తక్కువ చేసే వాడు కాదు. నాన్న నా ఐడియల్. అమ్మ ,అమెరికాలో వున్న  చెల్లి కి పాప పుడితే అక్కడే వుండి పోయింది. ఈ వయసులో ఇద్దరూ ఎందుకు విడిగా వుండడం అని  చెల్లి, బావ అన్నా ...తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత అని సరిపుచ్చుకున్నారు తప్ప ఏనాడు ...బాధ్యతల్లో బరువు ను, బాధను చూసుకోలా ....నాన్న నా కుటుంబం కోసం, అమ్మ చెల్లి కోసం వుండిపోయారు.

వారం క్రిందట నాన్న చిన్ననాటి  స్నేహితుడు నరేంద్ర  అంకుల్ గురించి తెలిసింది .ఆయనకి కాన్సర్ అని, ఎవరూ చూసుకోక వృద్ధాశ్రమం లో ఉన్నాడని.నాన్న ఆయన్ని తీసుకొచ్చి ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్లో చూపిస్తే ..ఇంక కీమో కు తట్టుకోలేరు ,ఇచ్చినా పెద్ద ప్రయోజనం వుండదని చెప్పడం తో నరేంద్ర అంకుల్ ని  ఇక్కడే ఉండమని అడిగారు, నేను షాలు కూడా ఆయన్ని ఎంతో అడిగాం, కానీ ఆయనొప్పుకోలా ..అందుకే నాన్న ఆయన్ని వదిలి కొన్ని రోజులు అతనితో వుండి వస్తానన్నారు. వెళ్ళారు. వెళ్ళాక తెలుస్తోంది ఆయన లేకపోతే మాకెంత కష్టమో ! మేమెంత ఆయనపై ఆధార పడివున్నామో!

వారం లోపల వస్తామన్నారు కదా! అని అనుకున్నాము కానీ ఆయన వెళ్లి ఒక్క రోజూ కూడా కాలేదు అప్పుడే ఆయన లేకుండా కష్టమనిపిస్తోంది..హాయిగా వెళ్లి వుద్యోగం చేసుకునే వాళ్ళం ...పార్టీలు డిన్నర్లకు జోయ్ ని నాన్న దగ్గర వదిలి నిశ్చింతగా  పెళ్ళయిన క్రొత్తలో లాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం.జోయ్ కి ఇంక తాత గారు లేక కథలు లేవు .. మా దగ్గర పడుకుని కథ చెప్పమని గోల చేస్తున్నాడు . షాలు లాప్టాప్ లో పని చేసుకుంటోంది.తనకి వర్క్ ప్రెజర్ ఎక్కువగా వుంటుంది. జాయ్  కి సమయం ఇవ్వలేదు. నాకు ఆఫీసులో పని ఒత్తిడి తట్టుకుని ఉండడమే కష్టం, తొందరగా నిద్రపోతేగాని ఉదయానికి  ఫ్రెష్ గా ఉండలేను .  ఇప్పుడు మా ఇద్దరికంటే జోయ్ తాతగారు లేక ఎక్కువ దిగులు పడ్డాడు.

శుక్రవారం సాయంత్రానికి నేను,షాలు,జాయ్  పూర్తిగా నిస్సహాయంగా అయిపోయాము. వారం అయింది కాబట్టి ఇంక వచ్చేస్తాడు నాన్న... అన్న ఉత్సాహం తో  చిన్న పిల్లాడిలా నాన్నకు  ఫోన్ చేశా "..ఎప్పుడొస్తున్నారు నాన్నా ?" నా గొంతులో అభ్యర్ధన ,ప్రార్థన ఉన్నాయనుకుంటా ...
" లేదు ..నేను రావడం లేదు వినోద్ .. నువ్వు, శాలిని, జాయ్  రండి ..ఫర్ ఏ చేంజ్ " అన్నారు.
బాగా కోపం వచ్చింది నాన్న పై .. ఎందుకు రావడం లేదు ?నాలో నేను గొణుక్కున్నా....
నా  ఉక్రోషం చూసి , షాలు "కూల్.... వెళదాం నాన్న దగ్గరికి .. మనం పడుతున్న ఇబ్బంది చెబితే వస్తారులే" అంది.
"ఆయనెందుకు రావడం లేదు ,అంకుల్ కోసం ఉండిపోవాల్నా?" ..కోపంగా అన్నా.
షాలు కోపంగా చూసింది.."చిన్న పిల్లాడిలా ఆ కోపమేంటి మీ నాన్నగారి మీద."

సిటి కి  యాభై మైళ్ళ దూరం లో వున్న ఆ వృద్ధాశ్రమానికి చేరుకున్నాము ..దూరం నుంచే  నాన్నకు చాలా ఇష్టమైన పాట "ఏ మాలిక్ తేరే బంద్ హం " దో ఆంఖే బారా  హాత్" సినిమాలోది వినపడింది ... నాన్నని చూడగానే మనసంతా తేలికయింది.జాయ్ వెళ్లి నాన్న వొడిలో కూర్చున్నాడు .నరేంద్ర అంకుల్ ని చూసి ఆశ్చర్య పోయా .. వారానికే ఆయనలో ఎంతో మార్పు వచ్చింది ..కళ్ళలో దీనత్వం లేదు, నిరాశ లేదు..ఎంతో సంతోషంగా ..ఉత్సాహంగా వున్నారు, నిజానికి ఆయనే కాదు ..ఆశ్రమం లోనే తేడా కనిపించింది. నేను, నాన్న వచ్చి నరేంద్ర  అంకుల్ ను తీసుకుని వెళ్ళేప్పుడు వున్న వాతావరణమే లేదు. పూర్తిగా మారి పోయింది. ఎంతో  పరిశుభ్రంగా మారిపోయాయి పరిసరాలు, మొక్కలకు పాదులు చేసారు,  కొత్త మొక్కలు తెచ్చి నాటారు .. అక్కడున్న వాళ్ళలో సైతం  ఏదో క్రొత్త ఆశ కనిపించింది...జీవితాన్ని బరువుగా, నిస్సహాయంగా, నిరాశగా, శవాల్లా నడుస్తూ, తామెవరికి అవసరం లేదనే భావనతో వుండే  వృద్ధుల్లో ఎంతో మార్పు కనిపించింది. నాకు తెలుసు ఇదంతా నాన్న ప్రభావం వలన అని .

కాసేపయ్యాక ..మేము ఏదో చెప్పాలనుకునే లోపల జాయ్ "తాతయ్యా మన ఇంటికి వెల్లిపోదాం "అన్నాడు.
నాన్న నవ్వి ఊరుకున్నాడు. అంటే ఆయన కు ఇక్కడి నుండి వచ్చే ఉద్దేశం లేదన్న మాట .
"నాన్నా..మీరు వచ్చేయండి ..జాయ్ వుండ లేకున్నాడు ..చాలా ఇబ్బందిగా వుంది, మేము వచ్చేప్పటికి వాడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు ..."అన్నాను ..నా మాటల్లో నిష్టూరం ధ్వనించింది .
"వినోద్ .. నేను నరేంద్ర  ని వదిలి రాలేను, అతనికి ఎవరూ లేరు ..అతనికి నా అవసరం వుంది. జాయ్  గురించి అంటావా  నాక్కూడా బాధగా వుంది ..కానీ మీరిద్దరూ ఉన్నారుగా వాడికి.... మీ పట్ల తండ్రి గా నా బాధ్యతల్ని, తాత గా జాయ్  పట్ల కూడా ఆన్ని సక్రమంగానే చేసాననుకుంటా ...ఇప్పుడు నా స్నేహితుడి పట్ల కూడా నాకు బాధ్యత వుంది ... వాడికి నా అవసరం వుంది, జాయ్ కి మీరున్నారు, కొంతకాలం.. శాలిని.. జాబ్ మానేయ్యమ్మా .. బాబు కొంచం పెద్దగయ్యాక కావాలంటే చేయోచ్చులే ...అంతే కాకుండా మాది  పెరిగే వయసు ..మేము ఎంతో కాలం జీవించలేము ఏ భాధ్యతల్ని మోయ లేము ..మీకు భారంగా ఉండలేము. మీ అమ్మ నేను ఇక్కడే వుండ దలచాము.ఎవరికీ భారం  కాకుండా బ్రతకడం కూడా ఒక భాద్యతే ..."

"మీరు మా పట్ల చూపిన భాద్యతని ,ధర్మాన్ని , ప్రేమని  మేము కూడా మీ పట్ల చూపే అవకాశం మాకు ఇవ్వరా...పిల్లలు లేని వాళ్ళో, చూడని వాళ్ళో ఇలా
వృద్ధాశ్రమాల్లో  వుండాలి.. మీరెందుకు వుండాలి నాన్నా! మీరేప్పటికి మాతోనే వుండాలి .." నాకు నాన్నని వెంటనే అక్కడి నుండి తీసి కెల్లాలని అనిపించింది.
నాన్న మౌనంగా వుండి పోయారు.ఆయనకు ఇష్టం లేని చర్చ జరిగితే ఆయన చేసే పని అదే, మౌనం.
షాలు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది .."అక్కడ చెట్లు చూద్దాం రా .. వినూ.." ఏదో చెప్పాలని పిలుస్తోందని అర్థమైంది .
"వద్దు..ఇప్పుడు నాన్న గారిని ఇబ్బంది పెట్టకు...హి ఇస్ రైట్ ఆయన అందరి పట్ల తన బాధ్యతని సమర్థవంతగా నిర్వర్తించారు ....తన స్నేహితుడి పట్లకూడా ఆయన కున్న ప్రేమ, అనురాగాల్నివ్యక్త పరచనీ....నిజానికి మన భాద్యతని  కూడా ఆయన పై పెడుతున్నాము ...ఎందుకో మన దగ్గర కంటే కూడా ఆయన ఇక్కడ సంతోషంగా విశ్రాంతిగా వున్నారేమో ... జాయ్ ను చూసుకోవడానికి లక్ష్మిని సాయంత్రం కూడా రమ్మందాం...మన సమస్యల్ని ఆయన పై ఇంక వేయరాదు. ఆయనను మన భాద్యతల నుండి విముక్తుల్ని చేయాలి "అంది.
షాలు చెప్పింది నిజమే ..ఇంక భాద్యతల బరువు ఆయనపై వేయరాదు ఆయనకు నచ్చిన చోట వుండనీ, నచ్చిన పని చేయని అనిపించింది.కానీ నాకు నాన్నను చూడకుండా వుండడం కష్టం అనిపించింది . ఎక్కడో చదివిన ఒక కొటేషన్ గుర్తొచ్చింది.
Dad, you're someone to look up to , no matter how tall I've grown.



.

No comments:

Post a Comment