Friday 22 November 2013

మనుషులు -మమతలు

నుషులు -మమతలు 

ఇల్లు  అమ్ముదాం    నాన్నా...., ఎంత లేదన్నా కోటి  దాకా  వస్తుంది …కుమార్  ఒకటి,  నేనొకటి, అపర్ణ  సరోవర్ లో ఫ్లాట్స్  తీసుకుంటాం  మిగతాది  లోన్ తీసుకుని ... పాతిక  దాకా రెంట్  వస్తుంది …దాంతో లోన్ కట్టుకుంటాం .." చిన్నకొడుకు కమల్ మొదలెట్టాడు పాతపాటే . 
'మీకు ఇద్దరికీ ఇల్లు కొనిచ్చాకదా ..ఈ  ఇల్లు  అమ్మే  ప్రసక్తే  లేదు …" కోపం వస్తున్నా, ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పాను .
"మీరిక్కడ, మేమక్కడ  మీ గురించి  మాకక్కడ  టెన్షను....  ఇల్లు  అమ్మితే  నా దగ్గర  కొన్ని  రోజులు, అన్నదగ్గర  కొన్ని  రోజులు  ఉండొచ్చు  .ఏమి  చేసుకుంటారు  యింత  పెద్ద ఇల్లు? చేసే వాళ్ళు  లేరు. ఈ  రోజుల్లో ఇండిపెండెంట్  హౌస్ , గార్డన్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం ?! అవసరమా ఈ  వయసులో …"  ఏదో గొణుగుతున్నాడు కొడుకు. 
ఛ !  మనసంతా  చికాగ్గా  వుంది. అక్కడి  నుండి బయటికి వచ్చా .ఇలా మాట్లాడితే కొడుకులంటేనే అసహ్యంగా  వుంటుంది, వాళ్ళకి  తెలుసు  ఎంత  కష్టపడి ఇల్లుకట్టుకున్నానో... వాళ్ళమ్మ  జ్ఞాపకాల్ని  ఈ  ఇంటిలో  వెతుక్కుంటున్నానని కూడా తెలుసు. అయినా  ప్రతిసారి  ఇదే చర్చ.  వచ్చి,  మామిడి చెట్టు క్రింద కూర్చున్నా.  ఈ చెట్టు అంటే  రాజీకి  ఎంతో ఇష్టం , ఇది  శేఖరన్న  కోడూరు నుండి తెచ్చిచ్చాడు.  బేనీషా జాతికి చెందిన ఈ చెట్టు, ఎన్ని తీయని పండ్లు కాసిందో ..! ప్రతిసారి మొదటి పండు శేఖరన్నకే ఇచ్చే వాళ్ళం. అన్న గుర్తొచ్చాడు, నిన్న చాలా నీరసంగా వున్నాడు ...ఈ కొడుకు కోడలు వచ్చిన గొడవలో పడి ఆయన దగ్గరికే వెళ్ళలేదు ...ముందు ఇంట్లోంచి బయటకు పోతే మనశ్శాంతి వుంటుంది. లోపలికి  వెళ్లి, చొక్కా తగిలించుకుని బయట పడ్డా! 
అన్న నన్ను చూసి హాయిగా నవ్వాడు, "అన్నా ఆలశ్యం అయిపొయింది ...ఏదో కొడుకు వస్తే  మాట్లాడుకుంటూ ...." ఆగి పోయా..మామూలుగా అయితే అన్న దగ్గర దాచే పని లేదు కానీ....ఇప్పుడు.... ఆరోగ్యం బాగాలేనప్పుడు నా బాధ చెప్పి ఆయన్ని బాధపెట్టడం దేనికి అని చెప్పలేదు.
" ఏమంటున్నారు కొడుకులు ? ఇల్లు అమ్మి డబ్బులివ్వమంటున్నారా!" 
హనుమంతుని ముందు కుప్పిగంతులా... నవ్వి వూర్కున్నా. 
"వేణూ  ఎందుకో నిన్ను విడిచి పోతానేమో అనిపిస్తోందిరా "అన్నాడు.
"అన్నా వెళ్లి పోవడం జరిగితే ఇద్దరం ఒకటే సారి ....  నన్ను రాజి వదిలి పోయింది ...నిన్ను వొదిన వదిలి పోయింది.  కానీ ఇప్పుడు  నన్ను విడిచి నీవు, నిన్ను విడిచి నేను వుండలేమన్నా... " అంటుంటే నాకు దుక్ఖం వచ్చింది.
చిన్న నాటినుండి పేద కుటుంబం నుండి వచ్చిన నేను- రాజశేఖర్ అన్న అండదండలతోనే ఎదిగాను ..నిజానికి ఆర్థికంగా అన్నకంటే ఎక్కువే ఎదిగాను. అన్న పరోపకారంతో సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేక పోయాడు. కొడుకులిద్దరూ మళ్ళీ   టీచర్లు గానే వుండిపోయారు ..వాళ్లకు అన్న లాగే పెద్దగా సంపాదన మీద మనసుండేది కాదు . వాళ్ళ ఇష్టానికి వదిలేవాడు. 
ఎప్పుడూ అన్న  ఇంటి నిండా మనుషులు. బావ మరదుల్ని, చెల్లెలి కొడుకుల్ని,స్నేహితుల కొడుకుల్ని చదివించడం ఆయనకే చెల్లింది.ఇంటిల్లిపాదికి చేసిపెట్టడం, ఎంత మంది చుట్టాలు హాస్పిటల్ పని మీద వచ్చినా వాళ్లకి వండి పెట్టడం- ఆ మహా తల్లి కే చెల్లింది.ఎంతో మందికి విద్యా  దానం చేసిన ఆయన సంపాదించుకుంది కేవలం మంచితనమే ...ఆయన ఎప్పుడూ ఏదీ కావాలని కోరుకోవడం నేను చూడాలా. కన్నీళ్ళతో మసక బారిన నాకళ్ళలో అన్నరూపం సరిగ్గా కనపడలా.
" వేణూ ...  పెన్షన్లో డబ్బు మిగిలించా ...దాన్ని మన వూర్లో మనం చదువు కున్న బడికి ఇవ్వాలని వుందిరా!"
" అన్నా ! నీకు చెప్పగలిగిన  వాడ్నికాను కానీ  .... పిల్లలకు ఏమీ ఇవ్వక పోతివి ...ఈ డబ్బులన్నా చెరి కొంత ఇస్తే, మేలు కదా!  వాళ్ళకి మాత్రం పెద్ద ఉద్యోగాలు ఉన్నాయా...!"           
"లేదురా ...విద్య తప్ప వాళ్లకు నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు . నా చదువే నాకు ఆధారమయ్యింది  వాళ్ళకు మాత్రం ఆ విద్య, ఉద్యోగాలతో జరగదా ? మన వూర్లో బడి కూలిపోయే స్థితి లో వుంది, మనకు విద్య నేర్పిన ఆ బడి ఇంకా  ఎంతో మందికి విద్య నివ్వాలి."
నేనేమి మాట్లాడలేదు
"విల్లు రాసేంత ఆస్తి  నేనేమి కూడ బెట్టలేదు, నీ పేర చెక్కు రాసిస్తా నువ్వే డ్రా చేసుకుని, మనూరు వెళ్లి , మనబడి రిపేరు చేసే దానికి పర్మిషను గట్రా సంపాయించి..అంతా బాగుచేయించాలి . పోయిన సారి వూరికి పోయినప్పుడు బడి చూసి చాలా బాధేసింది." వణుకుతున్న చేతులతో చెక్ రాసి నా చేతుల్లో పెట్టాడు. 
నెమ్మదిగా చిన్న నాటి సంగతులు చెప్పుకొచ్చాడు. నేను అన్నని ఎన్నో తరగతి అని అడిగే వాడ్ని, బియ్యేఅని చెబితే, మళ్లీ బియ్యే అంటే ఎన్నో తరగతి ? అని అడిగే వాడ్ని. నా తల నిమిరి అన్నపదమూడు, పద్నాలుగు అని చెప్పేవాడు. అన్న సెలవుల్లో వూరికి వస్తున్నాడని తెలియగానే బస్సు దగ్గరికి పరిగెత్తే వాడ్ని. మా వూర్లో అన్న మొదటి బియ్యే...వూర్లో చదువుకున్న పెద్ద హీరో.   నాగేశ్వర్ రావ్,రామారావ్ ల కంటే అందగాడు నా దృష్టిలో ...ఈ నాటికి ఆయన వదనంలో చెదరని         ఆ దరహాసం.   ఒక్క ముడుతకూడాలేని ఆయన ముఖంలో ఎప్పుడూ విచారమెరగను నేను. ప్రతిదానికి తీవ్రంగా చలించే నేను, అన్న దగ్గరికి వచ్చి గోలంతా వెళ్ళ గ్రక్కితే  ఒక్క చిరునవ్వు నవ్వి "అంతా సర్దుకుంటుంది లేరా !"అనేవాడు 
అన్నకు  నిద్ర వస్తోందనిపించి ఇంటికి వచ్చా .

అన్న పెన్షన్ డబ్బుల్ని కొడుకులు ఆశిస్తారేమో! వాళ్ళ ఆర్ధిక పరిస్థితి ఎలావుందో, ఒక్కసారి అన్నకొడుకుల్ని అడిగితే పోలా! అన్నకు నచ్చ చెప్పొచ్చు .
పెద్దవాడు మధుకు ఫోన్ చేశా ... మామూలు సంభాషణ అయాక  " నాన్న దగ్గరున్న డబ్బుల్ని నాకిచ్చాడు.  ఏమి చేస్తే బాగుంటుoదిరా! నీ ఆర్ధిక పరిస్థితి ఏంటి, నీకేమయినాడబ్బు అవసరముందా? అలాగే తమ్ముడి పరిస్థితి ఏంటి ?మీరు మీ నాన్న లాగే తొణకరు బెణకరు." అన్నా.
"లేదు బాబాయ్, నాకేమి ఇబ్బంది లేదు.నా కొడుకులిద్దరూ బాగానే  చదువుకుంటున్నారు. ఏదో తగిన ఉద్యోగాలు వస్తాయి, తమ్ముడికే ఇద్దరూ ఆడపిల్లలు, పెళ్లి చేయాలంటే అవసరముంటుంది, వాడికి ఇవ్వండి.  నాకు తెలిసి నాన్నకు ఆ డబ్బుని ఇంకేదో చేయాలని ఆలోచన ఉండాలే.. మీరేమైనా నాన్నకు హితబోధ చేసారా ?" అన్నాడు.       
"అబ్బే ..అదేం లేదురా! మీ నాన్న సంగతి తెలుసుగా...ఉక్కు .. సరే రా ఉంటా "అని పెట్టేసా.
అమ్మో వాళ్ళ నాన్నభిలాయ్ ఉక్కు అయితే కొడుకు విశాఖ ఉక్కు..చూద్దాం చిన్నవాడు ఏమంటాడో ...రాణా కి ఫోన్ చేశా ... 
"హ్హై ..బాబాయ్ చెప్పండి" అన్నాడు .
సంగతి చెప్పా ..."ఆ డబ్బు సంగతి ఏమోబాబాయ్, నాన్నకి వేరే ఆలోచన వున్నట్లు చెప్పాడే...  మదర్ థెరిసా ఆశ్రం కోసమో ...ఇంకేదో ... అలాగని, మరి ఈ డెవెలప్మెంట్ ఏంటో మరి ...సరే గాని అన్న కొడుకు అమెరికా వెళ్ళాలని వున్నాడు. అన్నేమో ఆలోచిస్తున్నాడు.  వాడికి లోన్ కూడా వస్తుంది కానీ..కొంచం మన దగ్గర కూడా వుండాలి కదా....ఆ డబ్బు అన్నకివ్వు ..ఉపయోగ పడుతుంది ."
"నీకు ఆడపిల్లలున్నారు కదా ఆలోచించు ..."
"ఈ రోజుల్లో కూతుర్లు, కొడుకులు తేడా  ఏమీలేదు బాబాయ్ ,ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు, వుద్యోగాలోస్తాయి...  పెళ్లి ళ్ళ కంటారా ...ఏమీ ఇబ్బంది లేదు.  ఆడపిల్లలకు ఎదురు కట్నమిచ్చే రోజులోచ్చేలా వున్నాయి....నో ప్రాబ్లెం.  అంత అవసరమొస్తే,   అన్న కొడుకులకు  మంచి వుద్యోగాలోస్తే... వాళ్ళ చెల్లెళ్ళకు సాయం చేయరా ఏమిటి ?... అందుకని ఆ డబ్బుని అన్నకిచ్చేయ్యి ..."తాపీగా వచ్చిన ఆ సమాధానికి  కాసేపు నా బుర్ర మొద్దుబారింది. ఎవరు  చెప్పారు మానవ సంబంధాలు  మరణించాయని!? కాలమేదైనా, దేశమేదైనా, జాతి యేదైనా, మానవత్వం పూలతోరణంలా పరిమళిస్తూనే వుంటుంది.  సూర్య కిరణాల్లా  ప్రకాశిస్తూనే వుంటుంది .ఆ ముగ్గురి ఔన్నత్యం చూసిన నాకు...నా కొడుకులకు ఏమివ్వాలో అర్థమైంది.... నా ఆస్తిని  ఏమి  చేయ్యాలో తెలిసింది .          

ప్రచురణ : నవ్య అక్టోబర్ 2013

-- 

ముక్కు పుడక


ముక్కు పుడక


సంయుక్త బాధతో మెలికలు తిరిగింది... కడుపులోంచి వస్తున్న కేకని తన చేత్తో నోటిపై పెట్టి ఆపేసింది. దగ్గర్లోవున్న బాటిల్ను అందుకుంది. అందులో నీళ్ళు లేవు... రాత్రే తాగేసింది. ఆమె శారీరక బాధను అధిగమిస్తూ మనసు బాధతో మూల్గింది. కష్టసమయంలో తనకెవరూ లేరన్న వేదన ఆమెను కన్నీళ్ళ పర్యంతం చేసింది. ఇంకెన్నాళ్ళు భరించాలి? ఇంకా ఎంతుంది జీవితం? ఎప్పుడు ముగుస్తుంది ఈ పోరాటం? ఈ ఒంటరితనం, ఈ నిస్సహాయత... ఈ ఆర్తి...! కళ్ళ కొనలనుండి కన్నీరు ధారాపాతంగా జారిపోయాయి.

ఆది నుండి ఎన్నోవేల, లక్షల, కోట్ల స్త్రీల ఆత్మ ఘోషలు ఆమెకు వినపడసాగాయి. ప్రేమ, ఆదరణ, ఆనందం, తృప్తి, గౌరవం కోసం స్త్రీలు సాగించిన మౌన పోరాటంలో విజేతలు లేరా? ఆమె ఆత్మ కూడా ఆమె శరీరం నుండి విడివడి విముక్తి  పొందాలని కోరుతోంది బంధనాల నుండి, బంధాల నుండి; కనపడని సంకెళ్ళ లో బందీగా, స్వేచ్చ వున్నా తీసుకోలేని, రెక్కలున్నా ఎగరలేని, చదువున్నా చైతన్యం లేని, అందం వున్నా ఆనందించలేని, ఆమె, అనంత సముద్రం ముందు ఎండిన గొంతుకతో  కొట్టు మిట్టాడుతోంది. ఆమెకు తెలుసు సముద్రం నీళ్ళు దాహం తీర్చవని అవి త్రాగితే మరింత దాహం ఆవరిస్తుందని, ఆమెకు కావాల్సింది చల్లని నీరిచ్చే చెలిమ. అదెక్కడుంది?.

ప్రశాంతమైన ఆ రాత్రి అల్లకల్లోలంగా వున్న ఆత్మల విన్యాసం ఆమెకు తోచ సాగింది. ఓల్గా నుండి గంగ వరకు ప్రయాణించిన ఆదిమజాతి స్త్రీ, కసిగా శత్రు వర్గపు పసిబిడ్డను రాతి కేసి బాది చంపినప్పుడు ఆమెలో కల్గిన వేదన నుండి ఈనాటి ఆసిడ్ పడ్డ ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు భయపడే అమ్మాయి వరకు, ఆక్రందనలు, అశ్రు సంగీతాలు, మౌన రోదనలు అదిమి పట్టిన కన్నీళ్లు. ఎందుకు శపించరు నీచులైన మానవజాతినంతా ఈ అభాగ్యులు? ఎందుకు ఉపయోగించరు స్త్రీలు తమ తపశ్శక్తిని మృగాన్ని మరిపించే మగజాతిని నిర్వీర్యం చేయడానికి? ఎందుకు ముంచరు తమ కన్నీటి వరద లో  మోసంనేర్చిన మగ అహంకారులను? ఎందుకు భస్మం చేయరు తమ కోపాగ్నిలో? ఎందుకు ద్రోహం చేసే ఈ జాతికి ప్రేమనే పంచుతారు, విధేయులై తలలు వంచుతారు? తమ మాతృత్వాన్ని, సౌభాత్రుత్వాన్ని, ఆడతనాన్ని ఎగతాళి చేసే మగవారి పట్ల ఎందుకు కనికరం చూపుతారు? ఆమె ప్రశ్నించుకుంది. ఆమెకు తెలియదు తనేమి చేసిందో! స్త్రీ అస్తిత్వమే  ప్రేమ పంచడం! సహజమైన ఆ గుణం నుండి ఆమె తనను తాను వేరు చేసుకోలేదు. అదే శక్తి ఆమె కుంటే, ఎందుకు ఎన్ని భగ్నమైన జీవితాలు చూసినా తన ప్రేమ సత్యమని, నిత్యమని నమ్ముతుంది? ప్రతి స్త్రీకి  మోసపోయేంత వరకు ప్రియుడు అమర ప్రేమికుడే! ఎవరికీ జరిగినా తనకు అలాగా జరగదని... తనకున్న ప్రత్యేకతలు తమ ప్రేమను జీవితం కడవరకు జీవింప చేస్తాయని అనుకుంటుంది.

ఆమెకు తన కూతురు గుర్తు వచ్చింది... పాము పడగ నీడ పడకుండా పాపని  కాపాడడానికి కన్న ప్రేమను కూడా చంపుకుంది ఎక్కడో దూరంగా తల్లి దండ్రుల దగ్గర ఉంచింది. తాను లక్ష్మణ రేఖ దాటిన ఫలితాన్ని అనుభవించింది. తల్లి దండ్రులకు తెలియకుండా ప్రేమ మత్తులో తప్పు దారి నడిచింది. ప్రేమించిన వాడు మోజు తీరగానే యముడైనాడు... త్రాగుడు, జూదం, వ్యభిచారం అతన్నినిత్యం పెనవేసుకుని వుంటాయి. అతను కట్టిన తాళి, చేసిన ప్రమాణాలు అన్నీ బూటకాలు. అతి తొందరలోనే అతని దుర్వసనాలకు సంయుక్త వంటి పై బంగారం ఆవిరయింది. ఆమెకు మోసపోయానని అర్థమయింది. సరైన ఆహరం, పోషణ లేక ఆమె శరీరం రోగ గ్రస్తమయింది. ఇలాగే వుంటే మరణం అతి చేరువలో ఉందని అర్థమయింది. చివరిసారిగా తన పాపని చూడాలనుకుంది. దాదాపు ఐదేళ్ళ క్రిందట తన పరిస్థితి మెరుగు పడదనుకున్న తర్వాత పాపని తీసుకుని అమ్మానాన్న దగ్గరకు వెళ్ళింది. శిథిలమైన ఆమె జీవితాన్ని,సౌందర్యాన్ని, శరీరాన్ని చూసిన తల్లితండ్రులు ఏడ్చారు. ఒక్కగానొక్క కూతురెందుకలా చేసిందో, అడిగినా ఆమె నుండి జవాబు లేదు. సంవత్సరం బిడ్డను వాళ్ళకు అప్పగించి చెప్పకుండా వచ్చేసింది. బిడ్డ ఏమయ్యింది అని కూడా అతను ప్రశ్నించలేదు.

డిగ్రీ చదివినా సర్టిఫికేట్ లేని కారణంగా ఏ ఉద్యోగ ప్రయత్నం చేయలేకపోయింది. అతని వుద్యోగం కూడా పోయాక ఇంక ప్రత్యక్ష నరకం మొదలయ్యింది. అతనింట్లో కూడా వుండడం లేదు. ఎక్కడికి వెళతాడో ఏమిచేస్తాడో, ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. నెమ్మదిగా లేచింది. శక్తినంతా కూడగట్టుకుని ఇల్లంతా వెతికింది. వూరికి వెళ్ళడానికి కావలిసిన డబ్బు కోసం అమ్మదగిన వస్తువు ఏదీ కనపడలేదు. వంటి పైనున్న బంగారం అంతా అతను హరించాడు. నిరాశగా కూలబడుతూ ఎదురుగా వున్న అద్డం లోకి చూసింది. ముక్కు పై మిలమిల మెరుస్తూ ముక్కు పుడక కన పడింది. అంత విలువైనది కాదని అతను పట్టించుకోకపోవడం వల్ల అది మిగిలింది. పరీక్షగా అద్దంలో తన మొహాన్ని చూసుకుంది."నీ ముఖంలోని అందమంతా నీ ముక్కులో ఉందోయ్, షార్ప్ గా ఎంత బాగుంటుందో! దానికి తోడు ఆ ముక్కుపుడక మరీ బాగుంటుంది" అనేది తన స్నేహితురాలు వందన. నిజమే తన ముక్కు చాలా బాగుంటుంది ఇప్పటికి బాగుంది... కానీ బుగ్గలే జారిపోయాయి. ముప్పై ఏళ్లకే తన సౌందర్యం మాసిపోయింది. వందన మాటలు ఆమెకు పదే పదే గుర్తుకొచ్చాయి. ఒక్క సారి చిరునవ్వు మెరిసింది ఆమె పెదాలపై. అద్డంలో మరొక్కసారి చూసుకుంది ఆమె వదనాన్ని. పొడుగ్గా వున్న ముక్కుని, ధగ దగా మెరిసే వజ్రం ముక్కు పుడకని, మళ్ళీ మళ్ళీ పెదవులపై చిరునవ్వు రాసాగింది. రోజుకు ఒక్కసారైనా నవ్వలేకపోవడం ఎంత దురదృష్టకరం ? వందన తన ముక్కు అందాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చి, ఆమె లో కొత్త ఉత్సాహాన్ని... జీవితం పై ఆశని నింపాయి. కడుపు నొప్పి తో రాత్రి పడ్డ నరకయాతన కూడా ఆమెకు గుర్తు రాలా!

పదేళ్ళ క్రిందట తను వూరు విడిచి వచ్చేప్పటికి వందన మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోంది, అంటే ఇప్పుడు ప్రాక్టీసు చేస్తూ వుంటుంది. వందన దగ్గరికి వెళ్ళాలి. వందన ఎక్కడుందో కనుక్కోవాలి. ముందు వందనతో మాట్లాడాలి... చెడి స్నేహితుల ఇంటికే వెళ్ళ మన్నారు. దగ్గరలో వున్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళింది. పక్కింటి అమ్మాయి సుమతి అక్కడ పనిచేస్తుంది.

"సుమతీ ఇంటర్నెట్ ద్వారా నా క్లాస్మేట్ డాక్టర్ అంకిరెడ్డి వందన గురించి తెలుసుకోవడం సాధ్యమా!" అని అడిగింది.

"గంటలో కనుక్కోవచ్చు లెండి నేను ప్రయత్నిస్తాను కూర్చోండి"అంది.

వందన చదివిన మెడికల్ కాలేజి వివరాలు, మిగతా వివరాలు చెప్పింది. అర్దగంటలో వందన ఫోన్ నంబరు, హైదరాబాదులో క్లినిక్ వివరాలు, లాండ్ లైన్ నంబరు, సుమతి కనుక్కుంది. తన సెల్ నుండి వందనకు కాల్ చేసి ఇచ్చింది. రింగ్ అవుతున్నా, రెండు మూడు సార్లు చేసినా తీయలేదు. మళ్ళీ మళ్ళీ చేసి నిరాశగా "తీయడం లేదక్కా"అంది.

"పర్లేదులేమ్మా... నంబరు మారిందో లేక వాళ్ళది కాదో... మళ్ళీ ప్రయత్నం చేద్దాం లే " అని ఇంటికి వచ్చేసింది.

కానీ ఎందుకో సంయుక్త కు నిరాశగా లేదు. ఏదో ఆశ ఆమెలో మొలకెత్తింది. వున్న బట్టల్లో మంచివి తీసి సర్దుకుంది. కడుపులో నొప్పి మొదలైంది ఎప్పుడో డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్లు కొనుక్కుని వేసుకుంది. సుమతి దగ్గరకు వచ్చి "సుమతి చిన్న సాయం కావాలి" అంది. "చెప్పక్కా..." అంది. సుమతి. రెండేళ్లుగా ఆమె ఎవర్ని ఏమీ అడగడం చూడలేదు అతను తాగి వచ్చి గొడవ చేసినా ఆమె బయటికి వచ్చేది కాదు. చుట్టు ప్రక్కల వాళ్లకి ఆమెంటే ఎంతో గౌరవం సానుభూతి వున్నాయి.

"ఈ ముక్కుపుడక అమ్మి వద్దామా... నాకు ఎక్కడ అమ్మాలో తెలియదు" అంది. "మీకు... ఆ ముక్కుపడక  చాలా బాగుంది అయినా దానికెంత వస్తుంది? చెప్పండక్కా... నేనేమైనా సహాయంచేయగలనా?"అంది

"లేదమ్మా... నేను మా వూరు వెళతాను... డబ్బు కావాలి, ఇది వజ్రం." అంది.

"సరే అక్కా సాయంత్రం వెళదాం లే" అంది సుమతి.                              

సాయంత్రం అడిగితే సుమతి ని "రేపు వెళదాం అక్కా పనుంది" అంది. ఆమె మళ్ళీ ఆలోచించింది... ఎంతలేదన్నా ముక్కు పుడక్కి పదివేలు వస్తాయి. అప్పుడెప్పుడో పదిహేనేళ్ళక్రిందట అది మూడువేలు అయింది. ఈ ఊరిని, నరకాన్ని గుర్తు చేసే అతన్ని విడిచి వెళ్లి పోతే... ముందు డాక్టర్ కు చూపించుకుంటే... ఆరోగ్యం కుదుట పడితే... ఏ పని చేసుకోరాదు? అమ్మానాన్న దగ్గరికి వెళితే తప్పేంటి? తప్పు చేసినవాళ్ళు ఎప్పటికి ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉండాలా! అమ్మా నాన్నా... పాప... గుర్తొచ్చారు. ఆమె కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి దుఃఖంతో కాదు. ఒక రకమైన ఉద్వేగంతో!

ఎవరో మోసం చేస్తే దురదృష్టాన్ని తిట్టుకుంటూ... కృంగిపోవాల్సిందేనా! ఎవరి తోటి చెప్పుకోక, ఎవరి సహాయం తీసుకోక ఈ నరకం లోనే మ్రగ్గి పోయింది చాలు... ఇంక క్రొత్త గా ఆలోచించాలి. భయంకరమైన గతాన్ని సమాధి చేయాలి. సంయుక్త ప్రశాంతంగా నిద్రపోయింది.

 గో తెలుగు కామ్ 20..సెప్టంబర్ 2013