Friday 10 June 2016

నల్లపూసల దండ


ఇవాలకూడా రాజుకు రమణికి గొడవైంది వందోసారి. గొడవకి కారణం నల్లపూసల దండే. రమణిని పెళ్లి చేసుకున్నాక పల్లెలో ఉండలేక, సమిష్టి కుటుంబoలో ఇమడలేని భార్యను సముదాయించలేక, పెళ్ళైన కొత్తలో ముద్దుల భార్య ను వదలివుండలేక, ఆమెను చీటికి మాటికి పుట్టింటికి పంపలేక, పంపినా మళ్లీ పిలుచుకుని రాలేక, పెళ్ళాం చాటు మొగుడనే నిందను భరించలేక, అప్పటికే నేర్చుకున్న డ్రైవింగ్ మీద కొండంత ఆశ చేత, ఊర్లోనే వున్న ప్రెసిడెంటుగారి కొడుకులు దగ్గరలోనే వున్న బస్తీలో వుండటం చేత, వాళ్ళతో వున్న సాన్నిహిత్యంతో అక్కడ బ్రతికేయచ్చుననే నమ్మకం చేత, బస్తిలోకి వచ్చి పడ్డాడు రాజు, రమణి ముద్దులగుమ్మతో.

ప్రెసిడెంటు గారి కొడుకు తన స్నేహితుని దగ్గర రాజును డ్రైవర్ గా పెట్టాడు. రమణి కూడా వాళ్ళింట్లోనే వుండి, వాళ్ళ పాపని చూసుకుంటే ఇంకొంచం ఆదాయం, మరి ఇల్లు సదుపాయం కూడా ఉంటుందని చెప్పినపుడు రాజుకు భయం వేసింది. తనని పనిమనిషిగా పెట్టే దానికా బస్తికి తీసుకొచ్చింది అని గొడవ పెడుతుందేమోనని. అందుకే ఆ విషయం ఏమీ చెప్పకుండా వాళ్ళింటికి తీసుకెళ్ళాడు. రాజు యజమాని అనిల్, అతని భార్య నేహ. ఇద్దరూ కాలేజిలో లెక్చరర్లుగా పనిచేస్తారు వాళ్లకి ముద్దులొలికే ఆరునెలల పాప, నేహ అమ్మమ్మగారు కూడా వాళ్ళతో వుంటారు. మొత్తానికి రమణికి బస్తితో పాటు, రాజు వుద్యోగం చేసే యజమాని, అనిల్, నేహ, వాళ్ళ పాప ఊహ కూడా తెగ నచ్చేసారు. అప్పుడే రమణి కూడా పనిచేస్తే వచ్చేలాభం గురించి రాజు చూచాయగా తెలిపాడు భయపడుతూనే. కానీ రమణికి ఆ ఇల్లు, తోటలోని అవుట్ హవుసు, ముద్దుగా వున్న ఊహాతో గడపడం, నేహమేడం స్నేహంగా ఉండండం నచ్చాక, ఎక్కడో ఊరిబయట వున్న వాళ్ళ చిన్నాన్నఇంటిలో ఓ నెల వుందామనుకున్ననిర్ణయాన్నిరద్దు చేసి అవుట్ హవుసు లోకి వెంటనే చేరేద్దాం అనేసింది.

రమణికి అక్కడ ఆన్ని బాగున్నాయి. తమ మధ్య ఎవరూ లేరు, ఉదయాన్నేలేచి పనికి పరుగు తీయక్కర లేదు. నేహమేడం,అనిల్ సారు లేచేప్పటికి ఏడవుతుంది, పాపని చూసుకుని, వంటమనిషికి సాయం చెయ్యడమే కాబట్టి, పని ఒత్తిడిలేదు. రాజు పని నేహ మేడంను కాలేజిలో వదిలి వచ్చేస్తే, మల్లి సాయంత్రం వెళ్లి తీసుకురావడం, బజార్లో పని వుంటే చూసుకోవడం, అంతే. రాజు రమణి సంతోషంగా వున్నారు. నేహ అనిల్ సార్ల దాంపత్యం చూసి రమణి కూడా కొంచం సాత్వికత నేర్చుకుంది.

నేహ మేడం సౌందర్యం ఓ పెద్ద ఆకర్షణగా వుండేది రాజుకు రమణికి. రాజుకు ఆమెను చూస్తే అమితమైన ఆనందం కలిగేది, నేహమేడం పిలిచి పని చెబితే చాలనుకునేవాడు, ఆమెను చూస్తూ వుండిపోవాలనిపించేది, రాములవారి గుళ్ళో సీతమ్మ వారి విగ్రహాన్ని చూసినప్పుడు లాగా. అందంతో పాటు వుండే ఆమె సంస్కారం, పనివాళ్ళను సైతం ఎంతో గౌరవంగా చూడడం, పలకరించడం, ఇంటి వాళ్ళలాగానే మంచి చెడ్డ విచారించడం లాంటి గుణాలు, ఆమె సౌందర్యానికి చందనపు పరిమళం అద్ది నట్ట్లుండేది.

మొదట్లో రాజుకు భార్య కోసం ఊరువిడిచి వచ్చినందుకు కొంచం అపరాధ భావన కలుగుతుండేది, అందువలన తన జీతంలో కొంత వూరికి పంపాలనుకున్నాడు. కొత్తలో పల్లె నుండి బయట పడడానికి రాజు వుద్యోగం చేస్తే వచ్చే జీతంలో సగం అమ్మా నాన్నకు పంపడానికి రమణి ఒప్పుకుంది కాబట్టి,అనిల్ వాళ్ళ జీతంలో సగం నేరుగా వాళ్ళ అమ్మానాన్నకు పంపే ఏర్పాటు చేసాడు. కాలం చాలా హాయిగా చీకు చింత లేకుండా గడిచిపోతూ ఉంది.

మానవ జీవితం ఆనందమయం చేసుకోవడం ఎంత కష్టంమో, దాంట్లోకి దుoఖం రాకుండా చూసుకోవడం అంతకంటే కష్టం. పూలనావలా సాగుతున్న రాజు,రమణిల కాపురంలో నల్లపూసలదండ అశాంతి గింజ నాటింది. అది మొలకెత్తి మొక్కై, మానై, వటవృక్షమై వూడలు జారాయి. నేహను చూసిన మరు నిముషంలోనే రమణి చూపులు ఆమె అందమైన ముఖం పై నుండి ఆమె గుండెలపై వుండే నల్లపూసలదండ పై పడ్డాయి .

"ఏంటో మేడం ఇంకేమి లేనట్లు ఎప్పుడూ ఆ ఒక్క నల్లపూసలదండే వేసుకుంటుంది " అనేది రాజుతో చాలా సార్లు.

రాజు నవ్వి "మేడంకు నగ లెందుకు? ఆమే బంగారంలా వుంటుంది" అని నాలుక కర్చుకున్నాడు.

కానీ రమణి అది పట్టించుకోలా, పైగా "ఎంత అందంగా వుంటుంది కదా మేడం " అన్నది.

బ్రతికి పోయాను అనుకున్నాడు.

తర్వాత కొంత కాలానికి "రాజూ నల్లపూసలు, అని అనుకుంటామా! ఆ నల్లపూసలదండలో వుండేది వజ్రాల డాలరట, అదొక్కటే లక్ష రూపాయలట" అంది రమణి.

”ఆహా ” అని ఊరుకున్నాడు రాజు.

ఇంకొక రోజు "మేడం ఆ నల్లపూసలు తప్ప వేరేది ఎందుకు వేసుకోదో నాకు తెలిసింది" అంది రమణి.

రాజు పలక్కుండా వున్నాడు.

" ఫంక్షన్ కి వేరే నగ వేసుకున్నా, మళ్లీ ఇంటికి రాగానే వెంటనే నల్ల పూసలదండనే వేసుకుంటుంది, అది అనిల్ సారూ, వాళ్ళ పెళ్లికి బహుమతిగా ఇచ్చారట అందుకని. " అంది.

“నీకెవరు చెప్పారు ? చాలా సమాచారమే వుందే ” అన్నాడు రాజు.

“అవ్వ చెప్పింది.... ”.అంది,మరీ ఏదో చెప్పబోతే నిద్ర నటించాడు.

ఆ తర్వాత మొదలైంది అసలు కథ. ”నాకు మేడం దగ్గరున్ననల్లపూసలదండ లాంటిది కావాలి”అంది.

“ఏంటి? " ఆటంబాంబు పక్కనే పడ్డట్టు ఎగిరి పడ్డాడు రాజు.

"వజ్రాలడాలరు వద్దులే , మామూలు రాళ్ళ డాలరు అట్లాన్టివే వుంటాయిట " అంది కొంచం కనికరం చూపిస్తూ.

"నీకేమన్నా పిచ్చా, ఇవి నల్ల పూసలు కాదూ ! " అన్నాడు ఆమె మెడలో నల్లపూసలు చూపిస్తూ.

“చ.. ఇదా . ఇది, అది ఒకటేనా ?”

“ మరి.. నేను అనిల్ సారూ ఒకటేనా ? మనం బంగారం కొనే స్థితిలో లేము, బంగారం మనకు అందే స్థితిలో లేదు.”

పలకకుండా వుండిపోయింది రమణి. మరుసటి రోజు మళ్లీ అదే గొడవ, మౌనంగా వుండి పోయాడు. చాలా గొడవల తర్వాత వూరికి డబ్బులు పంపడం మాని నల్ల పూసలదండకు దాచమంది రమణి .

”డబ్బు పంపక పోతే మా అమ్మానాన్నఇక్కడి నుండి ఈడ్చుకుని వెళ్తారు “అన్నాడు.

రెండు రోజులు ఆ చర్చ రాలేదు.


రమణి రోజూ ఏదో ఒకరకమైన గొడవ మొదలు పెడుతుంది ఆ దండ గురించి. రాజుకు రమణి అంటే భయం పట్టుకుంది. నేహమేడం కనపడినప్పుడు ఆమె మెడలో వున్న నల్ల పూసలదండ చూసాడు ఆమె గమనించకుండా, నిజమే ఆ నల్లపూసలు ఆమెకు చాలా శోభనిచ్చాయి, ఆ వజ్రాలడాలరు మెరిసిపోతోంది, నేహ మేడంకు బాగున్నంత మాత్రాన రమణికి కూడా అందాన్నిస్తుందను కోవడం పొరపాటే, కానీ కోరికలు గుర్రాలు కదా! వాటిని సరిగ్గా స్వారి చేయక పోతే అవి పలు దిక్కులకు పరిగెత్తుతాయి.


"ఇంటిపోరు ఇంతింతగాదయ " అన్నట్లు రమణి పోరుకు రాజు విసిగి పోయాడు. నేహమేడం దండ లాంటిది కొనాలంటే 26 వేల బంగారం ధరతో యాభైవేల దాక అవుతుంది. ఇవాళ రమణితో యుద్ధం తర్వాత రాజు కేమి తోచలేదు. ఇద్దరికీ మాటలు లేవు. ఇంటి కెల్లబుద్ధికాక తోటలో కూర్చున్నాడు. వంట్లోబాగాలేదని రమణి కూడా పనికి పోలేదు. నేహ దగ్గరకు రావడంతో లేచి నుంచున్నాడు రాజు .


“ఏంటి ..రమణికి ఏమయ్యింది ?” అంది.


“ మేడం ..వంట్లో బాగాలేదని ..” నసిగాడు రాజు.


"డాక్టర్ దగ్గరకు వెళతారా, ఫోన్ చేసి చెబుతాను ".


"అంత అవసరం ఏమీ లేదు మేడం, ఏదో చిన్ననలత అంతే." అన్నాడు.


నేహ చాలా విషయాలు అడిగింది రాజు కుటుంబం గురించి, వూరిదగ్గ విషయాలు, పొలాల గురించి, గ్రామ పరిస్థితుల గురించి ఆమె అంత ఆసక్తి చూయించే టప్పటికి .. రాజుకు కొంచం తన భాధకు పరిష్కారం దొరుకుతుందేమో ననిపించింది.


సందేహిస్తూనే అడిగాడు “మేడం మరోలా అనుకోకపోతే కొన్నిరోజులు ... మీరు ఆ నల్లపూసల దండ తీసేసి వేరేది వేసుకోండి ....”


ఆశ్చర్యం, విస్మయం తోటి మాట రాక ఉండిపోయింది నేహ. తర్వాత నిభాయిన్చుకుని రాజు ఎందుకు చెప్పి ఉంటాడో అని ఆలోచించుకాసాగింది ఆన్ని పాజిటివ్ గా తీసుకునే ఆమె ఔన్యత్యం.


"మేడం, యింత ధైర్యం చేసాడేంటి వీడు అనుకుంటారేమో ! నాకు తల్లి లాంటి వారు, వేరేగా అనుకోవద్దు, మీ నల్లపూసలదండ చూసినప్పటి నుండి అలాంటిది కొనమని రమణి చంపేస్తుంది .. మేము బంగారం కొనగలిగిన స్థితిలో లేము , తాళిబొట్టుకు, పెళ్ళికి అయిన ఖర్చుకే మావాళ్ళు అప్పు చేసారు, పంటలులేక, పల్లెలో వాళ్ళు ఎన్నో కష్టాలు పడుతుంటే రమణికి దండ చేయించడం కోసం ఇంటికి డబ్బులు పంపకుంటే వాళ్ళకు నా మొహం ఎలా చూపించేది మేడం మావూర్లో ? భార్యకు నగ చేయించడం కోసం నేను ఇలా దిగజారలేను, అలాగని ఆమె పోరుపడలేక మీకే చెబుతున్నాను " అన్నాడు.


ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుని నేహ హాయిగా నవ్వేసింది.“నీ ప్రాబ్లం నేను పరిష్కరిస్తా కదా! ” అంది.


రాజు ఏదో అనబోయేలోగానే.. నేహ లోపలి వెళ్లి పోయింది.


అనిల్ సారు వాళ్ళ పల్లె కెల్లాలంటే, రాజును కూడా వెళ్ళ మంది నేహ. రాజు వూరికి వెలుతున్నానని చెప్పినా, రమణి పలకలేదు. మేడం ఏదో చేస్తానన్నారుగా ! ఏమీ చేస్తారో చూద్దాం అనుకుని వెళ్లి పోయాడు.


రాజు అనిల్ తిరిగి వచ్చేటప్పటికి గేటు దగ్గరే ఎదురు చూస్తూ నుంచుంది రమణి. ఆమె నగుమోము చూసేటప్పటికి రాజుకు ఆశ్చర్యం కలిగింది, ప్రతిగానవ్వాడు. ఇంట్లోకి రాగానే ఆమె మెడలో నల్లపూసలదండ చూసాడు. కళ్ళు ఎగరేసాడు ఎక్కడిది అన్నట్లు. నవ్వి ఊరుకుంది సిగ్గు పడుతూ. భోజనం తర్వాత విశ్రాంతిగా పడుకున్నాక అతని గుండెలపై వాలిన ఆమెను మళ్ళి అడిగాడు.


"రాజూ.. నువ్వు దండ చేయించేదానికి అడ్వాన్సుఅడిగావట కదా! మేడం చెప్పారు ... వూరికి డబ్బులు పంపడం ఆపరాదని, నేనే ఇంట్లో పనులన్నీచేసే టట్లుంటే, బయటినుండి వచ్చే పనిమనిషి పని, దోబిపని, పాపని చూసే పని ఆన్నిచేస్తే నెల నెలా నాజీతంలో పట్టుకునేట్లు చెప్పి ఈదండ కొన్నారు. మేడం చాలామంచిది కదా రాజూ! దీని ధర సంవత్సరం లోపల తీరి పోతుంది".నవ్వుతూ చెప్పుకు పోతుంది నల్ల పూసల దండ చూసుకుంటూ. ఊపిరి పీల్చుకుని మనసులోనే నేహ మేడంకు ధన్యవాదాలు చెప్పుకున్నాడు రాజు. వారి శ్రామిక జీవన సౌందర్యాని కి ఊహలలోకం వాస్తవమై నిలిచింది.


ఫిబ్రవరి 2016, జాబిల్లి