Friday 22 November 2013

మనుషులు -మమతలు

నుషులు -మమతలు 

ఇల్లు  అమ్ముదాం    నాన్నా...., ఎంత లేదన్నా కోటి  దాకా  వస్తుంది …కుమార్  ఒకటి,  నేనొకటి, అపర్ణ  సరోవర్ లో ఫ్లాట్స్  తీసుకుంటాం  మిగతాది  లోన్ తీసుకుని ... పాతిక  దాకా రెంట్  వస్తుంది …దాంతో లోన్ కట్టుకుంటాం .." చిన్నకొడుకు కమల్ మొదలెట్టాడు పాతపాటే . 
'మీకు ఇద్దరికీ ఇల్లు కొనిచ్చాకదా ..ఈ  ఇల్లు  అమ్మే  ప్రసక్తే  లేదు …" కోపం వస్తున్నా, ఆపుకుంటూ నెమ్మదిగా చెప్పాను .
"మీరిక్కడ, మేమక్కడ  మీ గురించి  మాకక్కడ  టెన్షను....  ఇల్లు  అమ్మితే  నా దగ్గర  కొన్ని  రోజులు, అన్నదగ్గర  కొన్ని  రోజులు  ఉండొచ్చు  .ఏమి  చేసుకుంటారు  యింత  పెద్ద ఇల్లు? చేసే వాళ్ళు  లేరు. ఈ  రోజుల్లో ఇండిపెండెంట్  హౌస్ , గార్డన్ మెయింటైన్ చేయడం ఎంత కష్టం ?! అవసరమా ఈ  వయసులో …"  ఏదో గొణుగుతున్నాడు కొడుకు. 
ఛ !  మనసంతా  చికాగ్గా  వుంది. అక్కడి  నుండి బయటికి వచ్చా .ఇలా మాట్లాడితే కొడుకులంటేనే అసహ్యంగా  వుంటుంది, వాళ్ళకి  తెలుసు  ఎంత  కష్టపడి ఇల్లుకట్టుకున్నానో... వాళ్ళమ్మ  జ్ఞాపకాల్ని  ఈ  ఇంటిలో  వెతుక్కుంటున్నానని కూడా తెలుసు. అయినా  ప్రతిసారి  ఇదే చర్చ.  వచ్చి,  మామిడి చెట్టు క్రింద కూర్చున్నా.  ఈ చెట్టు అంటే  రాజీకి  ఎంతో ఇష్టం , ఇది  శేఖరన్న  కోడూరు నుండి తెచ్చిచ్చాడు.  బేనీషా జాతికి చెందిన ఈ చెట్టు, ఎన్ని తీయని పండ్లు కాసిందో ..! ప్రతిసారి మొదటి పండు శేఖరన్నకే ఇచ్చే వాళ్ళం. అన్న గుర్తొచ్చాడు, నిన్న చాలా నీరసంగా వున్నాడు ...ఈ కొడుకు కోడలు వచ్చిన గొడవలో పడి ఆయన దగ్గరికే వెళ్ళలేదు ...ముందు ఇంట్లోంచి బయటకు పోతే మనశ్శాంతి వుంటుంది. లోపలికి  వెళ్లి, చొక్కా తగిలించుకుని బయట పడ్డా! 
అన్న నన్ను చూసి హాయిగా నవ్వాడు, "అన్నా ఆలశ్యం అయిపొయింది ...ఏదో కొడుకు వస్తే  మాట్లాడుకుంటూ ...." ఆగి పోయా..మామూలుగా అయితే అన్న దగ్గర దాచే పని లేదు కానీ....ఇప్పుడు.... ఆరోగ్యం బాగాలేనప్పుడు నా బాధ చెప్పి ఆయన్ని బాధపెట్టడం దేనికి అని చెప్పలేదు.
" ఏమంటున్నారు కొడుకులు ? ఇల్లు అమ్మి డబ్బులివ్వమంటున్నారా!" 
హనుమంతుని ముందు కుప్పిగంతులా... నవ్వి వూర్కున్నా. 
"వేణూ  ఎందుకో నిన్ను విడిచి పోతానేమో అనిపిస్తోందిరా "అన్నాడు.
"అన్నా వెళ్లి పోవడం జరిగితే ఇద్దరం ఒకటే సారి ....  నన్ను రాజి వదిలి పోయింది ...నిన్ను వొదిన వదిలి పోయింది.  కానీ ఇప్పుడు  నన్ను విడిచి నీవు, నిన్ను విడిచి నేను వుండలేమన్నా... " అంటుంటే నాకు దుక్ఖం వచ్చింది.
చిన్న నాటినుండి పేద కుటుంబం నుండి వచ్చిన నేను- రాజశేఖర్ అన్న అండదండలతోనే ఎదిగాను ..నిజానికి ఆర్థికంగా అన్నకంటే ఎక్కువే ఎదిగాను. అన్న పరోపకారంతో సొంత ఇల్లు కూడా సంపాదించుకోలేక పోయాడు. కొడుకులిద్దరూ మళ్ళీ   టీచర్లు గానే వుండిపోయారు ..వాళ్లకు అన్న లాగే పెద్దగా సంపాదన మీద మనసుండేది కాదు . వాళ్ళ ఇష్టానికి వదిలేవాడు. 
ఎప్పుడూ అన్న  ఇంటి నిండా మనుషులు. బావ మరదుల్ని, చెల్లెలి కొడుకుల్ని,స్నేహితుల కొడుకుల్ని చదివించడం ఆయనకే చెల్లింది.ఇంటిల్లిపాదికి చేసిపెట్టడం, ఎంత మంది చుట్టాలు హాస్పిటల్ పని మీద వచ్చినా వాళ్లకి వండి పెట్టడం- ఆ మహా తల్లి కే చెల్లింది.ఎంతో మందికి విద్యా  దానం చేసిన ఆయన సంపాదించుకుంది కేవలం మంచితనమే ...ఆయన ఎప్పుడూ ఏదీ కావాలని కోరుకోవడం నేను చూడాలా. కన్నీళ్ళతో మసక బారిన నాకళ్ళలో అన్నరూపం సరిగ్గా కనపడలా.
" వేణూ ...  పెన్షన్లో డబ్బు మిగిలించా ...దాన్ని మన వూర్లో మనం చదువు కున్న బడికి ఇవ్వాలని వుందిరా!"
" అన్నా ! నీకు చెప్పగలిగిన  వాడ్నికాను కానీ  .... పిల్లలకు ఏమీ ఇవ్వక పోతివి ...ఈ డబ్బులన్నా చెరి కొంత ఇస్తే, మేలు కదా!  వాళ్ళకి మాత్రం పెద్ద ఉద్యోగాలు ఉన్నాయా...!"           
"లేదురా ...విద్య తప్ప వాళ్లకు నేను ఏమీ ఇవ్వదలుచుకోలేదు . నా చదువే నాకు ఆధారమయ్యింది  వాళ్ళకు మాత్రం ఆ విద్య, ఉద్యోగాలతో జరగదా ? మన వూర్లో బడి కూలిపోయే స్థితి లో వుంది, మనకు విద్య నేర్పిన ఆ బడి ఇంకా  ఎంతో మందికి విద్య నివ్వాలి."
నేనేమి మాట్లాడలేదు
"విల్లు రాసేంత ఆస్తి  నేనేమి కూడ బెట్టలేదు, నీ పేర చెక్కు రాసిస్తా నువ్వే డ్రా చేసుకుని, మనూరు వెళ్లి , మనబడి రిపేరు చేసే దానికి పర్మిషను గట్రా సంపాయించి..అంతా బాగుచేయించాలి . పోయిన సారి వూరికి పోయినప్పుడు బడి చూసి చాలా బాధేసింది." వణుకుతున్న చేతులతో చెక్ రాసి నా చేతుల్లో పెట్టాడు. 
నెమ్మదిగా చిన్న నాటి సంగతులు చెప్పుకొచ్చాడు. నేను అన్నని ఎన్నో తరగతి అని అడిగే వాడ్ని, బియ్యేఅని చెబితే, మళ్లీ బియ్యే అంటే ఎన్నో తరగతి ? అని అడిగే వాడ్ని. నా తల నిమిరి అన్నపదమూడు, పద్నాలుగు అని చెప్పేవాడు. అన్న సెలవుల్లో వూరికి వస్తున్నాడని తెలియగానే బస్సు దగ్గరికి పరిగెత్తే వాడ్ని. మా వూర్లో అన్న మొదటి బియ్యే...వూర్లో చదువుకున్న పెద్ద హీరో.   నాగేశ్వర్ రావ్,రామారావ్ ల కంటే అందగాడు నా దృష్టిలో ...ఈ నాటికి ఆయన వదనంలో చెదరని         ఆ దరహాసం.   ఒక్క ముడుతకూడాలేని ఆయన ముఖంలో ఎప్పుడూ విచారమెరగను నేను. ప్రతిదానికి తీవ్రంగా చలించే నేను, అన్న దగ్గరికి వచ్చి గోలంతా వెళ్ళ గ్రక్కితే  ఒక్క చిరునవ్వు నవ్వి "అంతా సర్దుకుంటుంది లేరా !"అనేవాడు 
అన్నకు  నిద్ర వస్తోందనిపించి ఇంటికి వచ్చా .

అన్న పెన్షన్ డబ్బుల్ని కొడుకులు ఆశిస్తారేమో! వాళ్ళ ఆర్ధిక పరిస్థితి ఎలావుందో, ఒక్కసారి అన్నకొడుకుల్ని అడిగితే పోలా! అన్నకు నచ్చ చెప్పొచ్చు .
పెద్దవాడు మధుకు ఫోన్ చేశా ... మామూలు సంభాషణ అయాక  " నాన్న దగ్గరున్న డబ్బుల్ని నాకిచ్చాడు.  ఏమి చేస్తే బాగుంటుoదిరా! నీ ఆర్ధిక పరిస్థితి ఏంటి, నీకేమయినాడబ్బు అవసరముందా? అలాగే తమ్ముడి పరిస్థితి ఏంటి ?మీరు మీ నాన్న లాగే తొణకరు బెణకరు." అన్నా.
"లేదు బాబాయ్, నాకేమి ఇబ్బంది లేదు.నా కొడుకులిద్దరూ బాగానే  చదువుకుంటున్నారు. ఏదో తగిన ఉద్యోగాలు వస్తాయి, తమ్ముడికే ఇద్దరూ ఆడపిల్లలు, పెళ్లి చేయాలంటే అవసరముంటుంది, వాడికి ఇవ్వండి.  నాకు తెలిసి నాన్నకు ఆ డబ్బుని ఇంకేదో చేయాలని ఆలోచన ఉండాలే.. మీరేమైనా నాన్నకు హితబోధ చేసారా ?" అన్నాడు.       
"అబ్బే ..అదేం లేదురా! మీ నాన్న సంగతి తెలుసుగా...ఉక్కు .. సరే రా ఉంటా "అని పెట్టేసా.
అమ్మో వాళ్ళ నాన్నభిలాయ్ ఉక్కు అయితే కొడుకు విశాఖ ఉక్కు..చూద్దాం చిన్నవాడు ఏమంటాడో ...రాణా కి ఫోన్ చేశా ... 
"హ్హై ..బాబాయ్ చెప్పండి" అన్నాడు .
సంగతి చెప్పా ..."ఆ డబ్బు సంగతి ఏమోబాబాయ్, నాన్నకి వేరే ఆలోచన వున్నట్లు చెప్పాడే...  మదర్ థెరిసా ఆశ్రం కోసమో ...ఇంకేదో ... అలాగని, మరి ఈ డెవెలప్మెంట్ ఏంటో మరి ...సరే గాని అన్న కొడుకు అమెరికా వెళ్ళాలని వున్నాడు. అన్నేమో ఆలోచిస్తున్నాడు.  వాడికి లోన్ కూడా వస్తుంది కానీ..కొంచం మన దగ్గర కూడా వుండాలి కదా....ఆ డబ్బు అన్నకివ్వు ..ఉపయోగ పడుతుంది ."
"నీకు ఆడపిల్లలున్నారు కదా ఆలోచించు ..."
"ఈ రోజుల్లో కూతుర్లు, కొడుకులు తేడా  ఏమీలేదు బాబాయ్ ,ఇద్దరూ బాగా చదువుకుంటున్నారు, వుద్యోగాలోస్తాయి...  పెళ్లి ళ్ళ కంటారా ...ఏమీ ఇబ్బంది లేదు.  ఆడపిల్లలకు ఎదురు కట్నమిచ్చే రోజులోచ్చేలా వున్నాయి....నో ప్రాబ్లెం.  అంత అవసరమొస్తే,   అన్న కొడుకులకు  మంచి వుద్యోగాలోస్తే... వాళ్ళ చెల్లెళ్ళకు సాయం చేయరా ఏమిటి ?... అందుకని ఆ డబ్బుని అన్నకిచ్చేయ్యి ..."తాపీగా వచ్చిన ఆ సమాధానికి  కాసేపు నా బుర్ర మొద్దుబారింది. ఎవరు  చెప్పారు మానవ సంబంధాలు  మరణించాయని!? కాలమేదైనా, దేశమేదైనా, జాతి యేదైనా, మానవత్వం పూలతోరణంలా పరిమళిస్తూనే వుంటుంది.  సూర్య కిరణాల్లా  ప్రకాశిస్తూనే వుంటుంది .ఆ ముగ్గురి ఔన్నత్యం చూసిన నాకు...నా కొడుకులకు ఏమివ్వాలో అర్థమైంది.... నా ఆస్తిని  ఏమి  చేయ్యాలో తెలిసింది .          

ప్రచురణ : నవ్య అక్టోబర్ 2013

-- 

ముక్కు పుడక


ముక్కు పుడక


సంయుక్త బాధతో మెలికలు తిరిగింది... కడుపులోంచి వస్తున్న కేకని తన చేత్తో నోటిపై పెట్టి ఆపేసింది. దగ్గర్లోవున్న బాటిల్ను అందుకుంది. అందులో నీళ్ళు లేవు... రాత్రే తాగేసింది. ఆమె శారీరక బాధను అధిగమిస్తూ మనసు బాధతో మూల్గింది. కష్టసమయంలో తనకెవరూ లేరన్న వేదన ఆమెను కన్నీళ్ళ పర్యంతం చేసింది. ఇంకెన్నాళ్ళు భరించాలి? ఇంకా ఎంతుంది జీవితం? ఎప్పుడు ముగుస్తుంది ఈ పోరాటం? ఈ ఒంటరితనం, ఈ నిస్సహాయత... ఈ ఆర్తి...! కళ్ళ కొనలనుండి కన్నీరు ధారాపాతంగా జారిపోయాయి.

ఆది నుండి ఎన్నోవేల, లక్షల, కోట్ల స్త్రీల ఆత్మ ఘోషలు ఆమెకు వినపడసాగాయి. ప్రేమ, ఆదరణ, ఆనందం, తృప్తి, గౌరవం కోసం స్త్రీలు సాగించిన మౌన పోరాటంలో విజేతలు లేరా? ఆమె ఆత్మ కూడా ఆమె శరీరం నుండి విడివడి విముక్తి  పొందాలని కోరుతోంది బంధనాల నుండి, బంధాల నుండి; కనపడని సంకెళ్ళ లో బందీగా, స్వేచ్చ వున్నా తీసుకోలేని, రెక్కలున్నా ఎగరలేని, చదువున్నా చైతన్యం లేని, అందం వున్నా ఆనందించలేని, ఆమె, అనంత సముద్రం ముందు ఎండిన గొంతుకతో  కొట్టు మిట్టాడుతోంది. ఆమెకు తెలుసు సముద్రం నీళ్ళు దాహం తీర్చవని అవి త్రాగితే మరింత దాహం ఆవరిస్తుందని, ఆమెకు కావాల్సింది చల్లని నీరిచ్చే చెలిమ. అదెక్కడుంది?.

ప్రశాంతమైన ఆ రాత్రి అల్లకల్లోలంగా వున్న ఆత్మల విన్యాసం ఆమెకు తోచ సాగింది. ఓల్గా నుండి గంగ వరకు ప్రయాణించిన ఆదిమజాతి స్త్రీ, కసిగా శత్రు వర్గపు పసిబిడ్డను రాతి కేసి బాది చంపినప్పుడు ఆమెలో కల్గిన వేదన నుండి ఈనాటి ఆసిడ్ పడ్డ ముఖాన్ని అద్దంలో చూసుకునేందుకు భయపడే అమ్మాయి వరకు, ఆక్రందనలు, అశ్రు సంగీతాలు, మౌన రోదనలు అదిమి పట్టిన కన్నీళ్లు. ఎందుకు శపించరు నీచులైన మానవజాతినంతా ఈ అభాగ్యులు? ఎందుకు ఉపయోగించరు స్త్రీలు తమ తపశ్శక్తిని మృగాన్ని మరిపించే మగజాతిని నిర్వీర్యం చేయడానికి? ఎందుకు ముంచరు తమ కన్నీటి వరద లో  మోసంనేర్చిన మగ అహంకారులను? ఎందుకు భస్మం చేయరు తమ కోపాగ్నిలో? ఎందుకు ద్రోహం చేసే ఈ జాతికి ప్రేమనే పంచుతారు, విధేయులై తలలు వంచుతారు? తమ మాతృత్వాన్ని, సౌభాత్రుత్వాన్ని, ఆడతనాన్ని ఎగతాళి చేసే మగవారి పట్ల ఎందుకు కనికరం చూపుతారు? ఆమె ప్రశ్నించుకుంది. ఆమెకు తెలియదు తనేమి చేసిందో! స్త్రీ అస్తిత్వమే  ప్రేమ పంచడం! సహజమైన ఆ గుణం నుండి ఆమె తనను తాను వేరు చేసుకోలేదు. అదే శక్తి ఆమె కుంటే, ఎందుకు ఎన్ని భగ్నమైన జీవితాలు చూసినా తన ప్రేమ సత్యమని, నిత్యమని నమ్ముతుంది? ప్రతి స్త్రీకి  మోసపోయేంత వరకు ప్రియుడు అమర ప్రేమికుడే! ఎవరికీ జరిగినా తనకు అలాగా జరగదని... తనకున్న ప్రత్యేకతలు తమ ప్రేమను జీవితం కడవరకు జీవింప చేస్తాయని అనుకుంటుంది.

ఆమెకు తన కూతురు గుర్తు వచ్చింది... పాము పడగ నీడ పడకుండా పాపని  కాపాడడానికి కన్న ప్రేమను కూడా చంపుకుంది ఎక్కడో దూరంగా తల్లి దండ్రుల దగ్గర ఉంచింది. తాను లక్ష్మణ రేఖ దాటిన ఫలితాన్ని అనుభవించింది. తల్లి దండ్రులకు తెలియకుండా ప్రేమ మత్తులో తప్పు దారి నడిచింది. ప్రేమించిన వాడు మోజు తీరగానే యముడైనాడు... త్రాగుడు, జూదం, వ్యభిచారం అతన్నినిత్యం పెనవేసుకుని వుంటాయి. అతను కట్టిన తాళి, చేసిన ప్రమాణాలు అన్నీ బూటకాలు. అతి తొందరలోనే అతని దుర్వసనాలకు సంయుక్త వంటి పై బంగారం ఆవిరయింది. ఆమెకు మోసపోయానని అర్థమయింది. సరైన ఆహరం, పోషణ లేక ఆమె శరీరం రోగ గ్రస్తమయింది. ఇలాగే వుంటే మరణం అతి చేరువలో ఉందని అర్థమయింది. చివరిసారిగా తన పాపని చూడాలనుకుంది. దాదాపు ఐదేళ్ళ క్రిందట తన పరిస్థితి మెరుగు పడదనుకున్న తర్వాత పాపని తీసుకుని అమ్మానాన్న దగ్గరకు వెళ్ళింది. శిథిలమైన ఆమె జీవితాన్ని,సౌందర్యాన్ని, శరీరాన్ని చూసిన తల్లితండ్రులు ఏడ్చారు. ఒక్కగానొక్క కూతురెందుకలా చేసిందో, అడిగినా ఆమె నుండి జవాబు లేదు. సంవత్సరం బిడ్డను వాళ్ళకు అప్పగించి చెప్పకుండా వచ్చేసింది. బిడ్డ ఏమయ్యింది అని కూడా అతను ప్రశ్నించలేదు.

డిగ్రీ చదివినా సర్టిఫికేట్ లేని కారణంగా ఏ ఉద్యోగ ప్రయత్నం చేయలేకపోయింది. అతని వుద్యోగం కూడా పోయాక ఇంక ప్రత్యక్ష నరకం మొదలయ్యింది. అతనింట్లో కూడా వుండడం లేదు. ఎక్కడికి వెళతాడో ఏమిచేస్తాడో, ఎప్పుడొస్తాడో కూడా తెలియదు. నెమ్మదిగా లేచింది. శక్తినంతా కూడగట్టుకుని ఇల్లంతా వెతికింది. వూరికి వెళ్ళడానికి కావలిసిన డబ్బు కోసం అమ్మదగిన వస్తువు ఏదీ కనపడలేదు. వంటి పైనున్న బంగారం అంతా అతను హరించాడు. నిరాశగా కూలబడుతూ ఎదురుగా వున్న అద్డం లోకి చూసింది. ముక్కు పై మిలమిల మెరుస్తూ ముక్కు పుడక కన పడింది. అంత విలువైనది కాదని అతను పట్టించుకోకపోవడం వల్ల అది మిగిలింది. పరీక్షగా అద్దంలో తన మొహాన్ని చూసుకుంది."నీ ముఖంలోని అందమంతా నీ ముక్కులో ఉందోయ్, షార్ప్ గా ఎంత బాగుంటుందో! దానికి తోడు ఆ ముక్కుపుడక మరీ బాగుంటుంది" అనేది తన స్నేహితురాలు వందన. నిజమే తన ముక్కు చాలా బాగుంటుంది ఇప్పటికి బాగుంది... కానీ బుగ్గలే జారిపోయాయి. ముప్పై ఏళ్లకే తన సౌందర్యం మాసిపోయింది. వందన మాటలు ఆమెకు పదే పదే గుర్తుకొచ్చాయి. ఒక్క సారి చిరునవ్వు మెరిసింది ఆమె పెదాలపై. అద్డంలో మరొక్కసారి చూసుకుంది ఆమె వదనాన్ని. పొడుగ్గా వున్న ముక్కుని, ధగ దగా మెరిసే వజ్రం ముక్కు పుడకని, మళ్ళీ మళ్ళీ పెదవులపై చిరునవ్వు రాసాగింది. రోజుకు ఒక్కసారైనా నవ్వలేకపోవడం ఎంత దురదృష్టకరం ? వందన తన ముక్కు అందాన్ని గురించి అన్న మాటలు గుర్తొచ్చి, ఆమె లో కొత్త ఉత్సాహాన్ని... జీవితం పై ఆశని నింపాయి. కడుపు నొప్పి తో రాత్రి పడ్డ నరకయాతన కూడా ఆమెకు గుర్తు రాలా!

పదేళ్ళ క్రిందట తను వూరు విడిచి వచ్చేప్పటికి వందన మెడిసిన్ మూడో సంవత్సరం చదువుతోంది, అంటే ఇప్పుడు ప్రాక్టీసు చేస్తూ వుంటుంది. వందన దగ్గరికి వెళ్ళాలి. వందన ఎక్కడుందో కనుక్కోవాలి. ముందు వందనతో మాట్లాడాలి... చెడి స్నేహితుల ఇంటికే వెళ్ళ మన్నారు. దగ్గరలో వున్న ఇంటర్నెట్ సెంటర్ కి వెళ్ళింది. పక్కింటి అమ్మాయి సుమతి అక్కడ పనిచేస్తుంది.

"సుమతీ ఇంటర్నెట్ ద్వారా నా క్లాస్మేట్ డాక్టర్ అంకిరెడ్డి వందన గురించి తెలుసుకోవడం సాధ్యమా!" అని అడిగింది.

"గంటలో కనుక్కోవచ్చు లెండి నేను ప్రయత్నిస్తాను కూర్చోండి"అంది.

వందన చదివిన మెడికల్ కాలేజి వివరాలు, మిగతా వివరాలు చెప్పింది. అర్దగంటలో వందన ఫోన్ నంబరు, హైదరాబాదులో క్లినిక్ వివరాలు, లాండ్ లైన్ నంబరు, సుమతి కనుక్కుంది. తన సెల్ నుండి వందనకు కాల్ చేసి ఇచ్చింది. రింగ్ అవుతున్నా, రెండు మూడు సార్లు చేసినా తీయలేదు. మళ్ళీ మళ్ళీ చేసి నిరాశగా "తీయడం లేదక్కా"అంది.

"పర్లేదులేమ్మా... నంబరు మారిందో లేక వాళ్ళది కాదో... మళ్ళీ ప్రయత్నం చేద్దాం లే " అని ఇంటికి వచ్చేసింది.

కానీ ఎందుకో సంయుక్త కు నిరాశగా లేదు. ఏదో ఆశ ఆమెలో మొలకెత్తింది. వున్న బట్టల్లో మంచివి తీసి సర్దుకుంది. కడుపులో నొప్పి మొదలైంది ఎప్పుడో డాక్టర్ రాసిచ్చిన టాబ్లెట్లు కొనుక్కుని వేసుకుంది. సుమతి దగ్గరకు వచ్చి "సుమతి చిన్న సాయం కావాలి" అంది. "చెప్పక్కా..." అంది. సుమతి. రెండేళ్లుగా ఆమె ఎవర్ని ఏమీ అడగడం చూడలేదు అతను తాగి వచ్చి గొడవ చేసినా ఆమె బయటికి వచ్చేది కాదు. చుట్టు ప్రక్కల వాళ్లకి ఆమెంటే ఎంతో గౌరవం సానుభూతి వున్నాయి.

"ఈ ముక్కుపుడక అమ్మి వద్దామా... నాకు ఎక్కడ అమ్మాలో తెలియదు" అంది. "మీకు... ఆ ముక్కుపడక  చాలా బాగుంది అయినా దానికెంత వస్తుంది? చెప్పండక్కా... నేనేమైనా సహాయంచేయగలనా?"అంది

"లేదమ్మా... నేను మా వూరు వెళతాను... డబ్బు కావాలి, ఇది వజ్రం." అంది.

"సరే అక్కా సాయంత్రం వెళదాం లే" అంది సుమతి.                              

సాయంత్రం అడిగితే సుమతి ని "రేపు వెళదాం అక్కా పనుంది" అంది. ఆమె మళ్ళీ ఆలోచించింది... ఎంతలేదన్నా ముక్కు పుడక్కి పదివేలు వస్తాయి. అప్పుడెప్పుడో పదిహేనేళ్ళక్రిందట అది మూడువేలు అయింది. ఈ ఊరిని, నరకాన్ని గుర్తు చేసే అతన్ని విడిచి వెళ్లి పోతే... ముందు డాక్టర్ కు చూపించుకుంటే... ఆరోగ్యం కుదుట పడితే... ఏ పని చేసుకోరాదు? అమ్మానాన్న దగ్గరికి వెళితే తప్పేంటి? తప్పు చేసినవాళ్ళు ఎప్పటికి ఇలా శిక్ష అనుభవిస్తూనే ఉండాలా! అమ్మా నాన్నా... పాప... గుర్తొచ్చారు. ఆమె కళ్ళలో కన్నీళ్ళు తిరిగాయి దుఃఖంతో కాదు. ఒక రకమైన ఉద్వేగంతో!

ఎవరో మోసం చేస్తే దురదృష్టాన్ని తిట్టుకుంటూ... కృంగిపోవాల్సిందేనా! ఎవరి తోటి చెప్పుకోక, ఎవరి సహాయం తీసుకోక ఈ నరకం లోనే మ్రగ్గి పోయింది చాలు... ఇంక క్రొత్త గా ఆలోచించాలి. భయంకరమైన గతాన్ని సమాధి చేయాలి. సంయుక్త ప్రశాంతంగా నిద్రపోయింది.

 గో తెలుగు కామ్ 20..సెప్టంబర్ 2013

Tuesday 16 April 2013

నిరంతరం


నిరంతరం 

 
ఆమె చల్లని వెన్నెలలా  ప్రకాశించింది...తను జీవించి వున్నందుకు గుర్తుగా ఆమె శ్వాసించడమే కాదు ..ఆమె పాదాలు నాట్యం కూడా  చేసాయి విచిత్రమేమంటే ఆమె మరణించే వరకు ఎవరికీ ....చివరకి కన్న కూతురికి కూడా ఆమెకు కాన్సర్ వుందని తెలియదు .ఆమెకు  కాన్సర్ ఎప్పుడు మొదలయిందో ... ఎప్పుడు దాన్ని ఆమె గుర్తించారో ...ఏ డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించు కున్నారో ,  వాళ్ళు ఏమి చెప్పారో ....ఎందుకు వైద్యానికి కూడా పోలేదో ఎవరికీ తెలియ లేదు.

పేద  మురికి వాడలో బడి పెట్టబోతున్న ఓ సామాజిక కార్యకర్త కు సహాయంగా ఒక నాట్య ప్రదర్సన ఇస్తూ ...ప్రదర్సన ముగింపు దశలో ఆమె తడబడిందని...అది గమనించిన గాయని వెంటనే పాట ఆపడంతో అవాక్కయిన ఆమె నెమ్మదిగా నాట్య భంగిమ నుండి అతి నెమ్మదిగా నేలపైరాలుతున్న తార లా  వాలిపోయిందని ...కోమాలోకి వెళ్ళిన ఆమెను డాక్టర్లు బ్రతికించలేక పోయారని, అయితే రక్త పరీక్షలో నే ఆమెకు కాన్సర్ వున్నట్లు గ్రహించిన వాళ్ళు ఆశ్చర్యానికి లోనయినట్లు తెలిసింది. ఒక్కగానొక్క కూతుర్నిదూరంగా చదివిస్తూ ఎప్పుడూ నాట్య ప్రదర్శనలు ఇస్తూ..ఒంటరిగా జీవించే ఆమె జీవితం ఒక మిస్టరీగా ముగిసింది. 

ఆమె అభిమానిగా ..అరాధకురాలిగా నేను మాత్రం ఆమె జీవితాన్ని తెలుసుకో దలిచాను...ఆమె మరణానికి ..ఆమె తన అనారోగ్యాన్ని దాచడానికి  ఇంకా తను జీవించే అవకాశాన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయక పోవడం గురించి కాదు నా ఆసక్తి... అది ఎలా ఆమెకు సాధ్యమయిందో తెలుసుకోవాలనిపించింది ...అంతటి సంయమనం, అంతటి నిభాయింపు, నిగ్రహం, మరణం పట్ల నిర్భయం, మమతల పట్ల నిర్లిప్తత,ఎలా సాధ్యమయిందో తెలుసుకోవాలనిపించింది .... ఆమె అంజలి! ఆమె మహా ప్రస్థానంతో ... నా ప్రస్థానం  మొదలైంది.        
 
అంజలి  గారి కూతురు  యామిని ని  కలవడానికి  వెళ్లాను. అంజలి గారిని చివరి గా  నేను చూడలేదు. మా పరిచయం అయిన నాటి నుండి ఆమె ఒక్క నాట్య ప్రదర్శన కూడా నేను చూడకుండా వుండలేదు...కానీ ఆ రోజూ దృవ్ కు చాలా బాగాలేదు. ఆస్తమా చాలా తీవ్రంగా ఉండింది ...వాడ్ని చూస్తుంటే ...ఏ నిముషంలో ప్రాణాలు పోతాయేమో అనిపించింది..తరువాత వాడికి ఆరోగ్యం కొంచం మెరుగైనా, వాడ్ని వదిలి ప్రయాణం చేయడానికి సాహసించ లేకపోయాను. అలా అంజలి గారి ఆఖరి నాట్య ప్రదర్శన చూడలేక పోయాను. ఆమె ఆఖరి ప్రయాణం కూడా చూడలేకపోయాను. అయినా  నేను  ఆమెను అలా నిర్జీవంగా చూడలేను...  నిరంతరం  జాలువారే  జలపాతం లాంటి ఆమెను నిశ్చలంగా చూడగలనా?

"ఇదెలా జరిగింది ...యామిని? కనీసం నీ దగ్గర కూడా  దాచారంటే ..నేను నమ్మ లేక పోతున్నా..అసలు అమ్మకు తెలియదా తనకా జబ్బు వున్నట్లు ..మొదటే కనుక్కుని వుంటే అమ్మను కాపాడుకునే వాళ్ళం కదా! "
"లేదక్కా నాకేమి చెప్పలేదు .. కొంచం వెయిట్ తగ్గినట్లు అనిపిస్తే అడిగాను ...కొంచం డైట్ చేస్తున్నా అంది ..యూసువల్  గా సింప్టంస్ తెలుస్తాయి ..ఎందుకో మరి తెలియ లేదు....నేను డాక్టర్ గా వుండి తెలుసుకోలేక పోవడం ..ఎందుకో..గిల్టీ గా వుందక్కా .."యామిని దుక్ఖం తో మాట్లాడ లేక పోయింది.
ఏమిచెప్పి ఓదార్చాలో అర్తoకాక మౌనంగా వుండిపోయా .

"అక్కా అమ్మకు బాల కృష్ణ  అనే చిన్న నాటి స్నేహితుడున్నాడు ..అమ్మ చనిపోయినప్పుడు ఆన్ని చేసింది బాలు అంకులే ..ఆయనకు తెలిసి వుంటుంది..అమ్మకు అంకుల్ కు మధ్య  రహస్యాలు వుండవు ...they are great friends ......! నువ్వు తెలుసక్కా అంకుల్ కు. అడిగారు కూడా  ఆ రోజు .. మీ అమ్మకు చాలా ఇష్టం కదా మైత్రి 
అంటే  అన్నారు ..కానీ మీ ఇంటికి కాల్ చేస్తే బాబుకు బాగాలేక హాస్పిటల్ లో వున్నారని చెప్పారు, పేపర్లో, టీవీలో చూస్తారులే అనుకున్నా !అదే జరిగింది ".

"నేను  బాల కృష్ణ  గారిని కలుస్తాను యామిని .."

"ఖచ్చితంగా కలవండి.. నేను ఇంక హైదరాబాదు రాలేను .. మీరే రావాలి నా దగ్గరకు "కన్నీళ్లు తుడుచుకుంటూ అంది యామిని.

"నేనున్నాను...యామిని  నీకు ..అలా అనకు నేను వస్తానులే" 
బాలు  గారి అడ్రెస్ ..ఫోన్ నంబర్  తీసుకున్నా, యామిని తో సెలవు తీసుకుంటూ . 
చెన్నై నుండి హైదరాబాదు ట్రైన్ ఎక్కాను, అంజలి గారితో ..నా అనుబంధం నా కళ్ళలో మెదిలింది 

నాకు నాట్యమంటే ప్రాణం.చిన్నప్పుడు నాట్యం నేర్చుకునే దానికి నేను చేసిన ప్రయత్నం నా అనారోగ్యం కారణంగా విఫల మయ్యాయి, కానీ నాట్య ప్రదర్శనల్ని చూడడానికి మాత్రం తప్పకుండా వెళుతుండేదాన్ని. మొట్టమొదటిసారి   రవీంద్ర  భారతిలో అంజలి గారి నాట్య ప్రదర్శన చూసాను... విశ్వమొహినిలా  తరంగం చేస్తున్న ఆమెను  చూసి  ముగ్ధురాలిని అయ్యాను. సినిమాల్లో లాగా ఆమె అద్బుత నాట్యం చూసి గ్రీన్ రూం లోకి ఎవరూ చుట్టుకోలేదు నేను తప్ప. నన్నుఅబ్బుర  పరిచింది ఆమె వయసు. ఆమెకు నలభై  పైనే  వయసు అని తెలిసాక నాకు మరింత ఆశ్చర్యం కలిగింది. ఆమె అందమైన  వదనానికి చక్కటి శరీరాకృతి ఆమె నాట్యానికి మరింత శోభనిచ్చింది. అమ్మాయికి నాకే ఆమె సౌందర్యం అద్భుతంగా అనిపించింది, మరి మగవాళ్ళకు ఆమె సౌందర్యం ఎంత గొప్పగా వుండి వుంటుందో మరి
అంజలి గారితో పరిచయం పెరిగింది. ఆమె రెడ్డీస్  లాబ్ లో  సైంటిస్టుగా జాబ్ చేస్తూ నాట్యప్రదర్సనలు ఇస్తుంటారు ..ఒక్కరే వుంటారు. ఒక్కదాన్నే వుంటాను అనడం తో నేను ఆమె భర్త గురించి అడగ లేదు. హాల్ లో వున్న అందమైన  అమ్మాయి ఫోటో  చూస్తుంటే ..

“నా  కూతురు"  అన్నారు ..

"మీలాగే వుంది. మీదే చిన్నప్పటి ఫోటో అనుకున్నా" అన్నాను.

"చెన్నైలో చదువుతోంది .. మెడిసిన్  ఫైనల్ ..ఆమె  చదువంతా  చెన్నైలోని మా అమ్మ వాళ్ళింటి లోనే జరిగింది, నేను  వుద్యోగం, ప్రోగ్రామ్స్అంటూ తిరుగుతుంటాను కదా !" నవ్వారు.

వీలు చిక్కినప్పుదంతా నాట్యానికి సంభందించిన పుస్తకాలు అంజలి గారి దగ్గరినుండి తెచ్చుకుని చదివి ఇచ్చేదాన్ని,అంజలి గారు వేరే కళాకారుల  ప్రోగ్రాంలకు నన్నుతనతో కూడా తీసు కెళ్ళేవారు. అందర్నీ అభిమానించేవారు, ఇతర కళాకారుల గొప్పతనాన్నిఎంతో నిగర్వంగా, ప్రేమగా మెచ్చుకునేవారు,ఆమె గొప్ప కళాకారిణి అయినా ఆమెకు చాలా మంది అభిమాన నాట్య కళాకారులుండే వారు. ఆన్ని రకాల నాట్యo గురించి అనర్గళంగా మాట్లాడేవారు. మా కాలేజి కి గెస్ట్ లెక్చరర్ గా పిలిచినప్పుడు  నాట్యం గురించి అంజలి గారు ఇచ్చిన ఉపన్యాసం అందర్నీ ముగ్ధుల్ని చేసింది. ఆమె రూపం, ఆమె జీవన విధానం, నన్నుచాలా ఇంప్రెస్  చేసేది, ఆమెను  ఒక దేవతలా ఆరాధించేదాన్ని, ప్రతి రోజూ అంజలి గారికి మా పెరటి తోటలో పూచే  పువ్వుల్ని అమ్మతో మాల కట్టించి తీసుకెళ్ళేదాన్ని. అవి తీసుకుంటూ ఆ పువ్వుల కంటే అందంగా నవ్వేది.

అంజలి గారి కూతురు యామిని వచ్చినప్పుడంతా ఎక్కువ నాతోనే గడిపేది ఈ సారికూడా  అంజలి గారు ఇండో జర్మన్  ప్రోగ్రాం కు ప్రిపేర్ అవుతూ నన్ను యామిని ని సంతోషంగా ఉంచే బాధ్యత  పెట్టారు …పదిరోజులు … పది క్షణాల్లా గడిచిపోయాయని చెప్పింది యామిని.  అంజలి గారి లాగానే యామిని కూడా...చాలా అందమైనది ... ప్రముఖ నాట్య శిరోమణి యామిని కృష్ణ మూర్తి అభిమానిగా తన కూతురికి ఆ పేరు పెట్టుకున్నారు. కానీ యామినికి   డాన్స్ ఎందుకు నేర్పించలేదంటే..నవ్వి ఊరుకున్నారు. యామిని కూడా నవ్వి "వదిలేయ్... మనకు నచ్చింది మనం చేసుకుందాం.." అంది. వాళ్ళ మాటలు ఏదో మిస్టీరియస్ గా అనిపించేవి . కానీ నాకు వాళ్ళ వ్యక్తిగత జీవితం పై ఆసక్తి వుండేది కాదు....కానీ ఏదో వుంది...అంజలిగారి జీవితంలో ఏదో అపశ్రుతి వుంది లేకపోతే ... ఆ ఆలోచనల తోనే కలత నిదుర  పోయా.

హైదరాబాద్  రాగానే బ్య్యాగ్  పడేసి,స్నానం చేసి , ద్రువ్ కు ఒక ముద్దు ఇచ్చేసి, బయలుదేరా బాలకృష్ణ  గారింటికి ...! అమ్మ వారిస్తున్నా విన లేదు. ప్రయాణపు బడలిక ఒక ప్రక్క, అంజలి గారి ఆకస్మిక మరణం చేసిన గాయంతో నిద్రలేని రాత్రులతో  నిజానికి నేను చాలా..నిస్సారంగా నిరాశగా వున్నాను, ఎక్కడ పడి పోతానో దారిలో అనిపించింది నాకే ....కానీ పట్టుదల నన్ను ముందుకు నడిపించింది .బాలు గారికి ముందే ఫోన్ చేశా, ఆయన నా కోసం బయటే వేచి వున్నారు. ఇద్దరం వాళ్ళ తోటలో కుర్చీలు వేసుకుని కూర్చున్నాము. 

"మైత్రి..నీవంటే అంజలికి చాలా ఇష్టం ..ఎంత ఇష్టమంటే ..నిన్ను తన కూతురిలాగా ప్రేమించింది .నిజానికి తనకూతురి కంటే నిన్నే ఎక్కువ ప్రేమించింది ...అందుకే తన నాట్య శాస్త్రానికి సంభందించిన పుస్తకాలు ...తన కాస్ట్యూమ్స్, మెడల్స్ ఇతర బహుమతులు ,నాట్యానికి సంబంధించిన  ప్రతి వస్తువు నీకే ఇవ్వమన్నారు...అంతే కాదు తన ఇల్లు కూడా నీకే రాసారు ."

"అదేంటి సర్ .అంజలి గారికి తను చనిపోతారని ముందే తెలుసా.... !"వణుకుతున్ననా  గొంతులోంచి కష్టమ్మీద మాట వచ్చింది      
ఆయన తల ఊపారు .
నా కళ్ళలోంచి కన్నీరాగలేదు..

"మీకు  కూడా తెలుసా!"
ఆయన  మళ్ళి తల ఊపారు.

"అదేంటి  తెలిసి ఆమెకు ట్రీట్మెంట్ కూడా ఇప్పించకుండా "....నాకు దుక్ఖం ఆగలేదు చాలా సేపు ఏడ్చాను యామినిని ఓదార్చడం లో గట్టిగా వున్నాను ,ఇంట్లో బయట ఎక్కడ కూడా నిగ్రహాన్ని పోగొట్టుకోలా కానీ ఆమె నన్ను తన వారసురాలిగా అంగీకరించడం తో నా దుక్ఖం రెట్టింపయింది.ఎంతసేపు ఏడ్చానో నాకే తెలియ లేదు. నా ఎదురుగా శిలలా వున్న అతని కళ్ళలో సైతం తడి . 

"చెప్పండి సర్ ఎందుకు మీరు ట్రీట్మెంట్ ఇప్పించ లేదు...అంజలి గారి కి జీవితంమీద అంత గౌరవం వుండేది ఆమె ఎందుకు మరణాన్ని అంత అవలీలగా అంగీకరించారు? "

"జీవితాన్ని ప్రేమించింది కాబట్టే చివరి వరకు అంత సంతోషంగా ఉండింది.. మరణాన్నికూడా అంతే సహజంగా తీసుకుంది...ఆమెకు తెలుసు కాన్సర్ కిచ్చే కీమో తెరిపి ఎంత భయంకరమో !అంతేకాదు అది తన ప్రియమైన వాళ్లకు ఎంత బాధాకరమో !అందరి కళ్ళలో సానుభూతి ని ఆమె భరించలేదు.ఎంత ట్రీట్మెంట్ తీసుకున్నారికవర్ అయే అవకాశాలు తక్కువే అని తనకు తెలుసు ...నాకూ తెలుసు ..నాకెంతో ప్రియమైన నా స్నేహితురాలి కి నచ్చి నట్లు చేయాలనుకున్నా...ఆమెకు చివరి వరకు నాట్యం చేయాలనే కోర్క్ర్ ఉండింది .అది నెరవేర్చుకుంది ."

"సర్..యామిని కి తండ్రి లేడా?" అనుకోకుండా అడిగేశాను.

"వున్నాడు ..అయితే అతని నీడ కూడా యామిని పై పడకుండా అంజలి కాపాడుకుంది ....అంజలి నాట్యం చూసి ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నఅతను..పెళ్ళయ్యాక ఆమెను నాట్యం మర్చిపోమన్నాడు. అతన్ని ఒప్పించడానికి శత విధాల ప్రయత్నించింది..కానీ విన లేదు...కొద్దికాలం నాట్యం మానేసింది.వుద్యోగం మానేయమన్నాడు, అదీ మానేసింది ..కానీ అతను దుర్వసనాలకులోనయ్యాడు. అంజలిని బాగా బాధించేవాడు ..కానీ ఎవరికీ తెలియ చేసేది కాదు. యామినిని మాత్రం అతని కి దూరంగా ఉంచింది. అప్పుడు నేను వైజాగ్ లో ఉండేవాడని అతని గురించి వేరే స్నేహితుల ద్వారా తెలిసి0ది  అతన్ని వదిలి అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి పోమన్నాను. నవ్వి వూరుకుంది. తర్వాత అతను అంజలి ని విడిచి వేరే ఆమెతో వున్నాడు.అప్పుడు కూడా తన ధోరణిలో మార్పు రాలేదు. కానీ ముందు చేస్తున్నవుద్యోగం లోనే  చేరింది ..వాళ్ళు డాన్స్ ప్రోగ్రామ్స్ కు అనుమతించే షరతుమీద.  నా సలహాల్ని వినలేనందుకు నాకొక ఉత్తరం రాసింది అంజలి...ఇదిగో చదువు ..ఇది అంజలి ఫిలాసఫీ.

" బాలూ ...,
                క్షేమం .నిన్ననువ్వు చెప్పిన దాని గురించి ఆలోచించా ! కానీ..జీవితం నాది కదా నీకు నచ్చినట్లు ఎలా ఉండగలను ? నీవు నా ప్రాణ మిత్రుడివి  అయినా.. నీ సలహా పాటించలేను.ఆన్ని ప్రేమలకు సుఖాంతం వుండక్కరలేదు.అసలు నా దృష్టిలో ప్రేమ అనే ప్రవాహానికి అంతమే లేదు ..నీవు ఆత్మలకు మరణం లేదని నమ్ముతావే ,,నేను ప్రేమకు మరణం లేదని నమ్ముతాను.అతని ప్రేమ ఈ రోజు నాకు లభించలేదని నేను బాధపడ్డం లేదు. ప్రేమ పర్యవసానం ఏదైనా ప్రేమ స్వరూపం ఒకటే.  అది వాగ్దానాల్ని     నమ్ముతుంది,అవి నేరవేరాయా లేదా అన్న నిరాశకు ,అనుమానానికి అది లోను కాదు .అతను భౌతికంగా నావాడు కాదు ..నా దగ్గర లేడు..వేరే స్త్రీ దగ్గరే వున్నాడు కానీ అతని పట్ల  నా ప్రేమ  ద్వేషంగా మారితే అతనికేమీ నష్టం లేదు.అది అతని కేమీ హాని చేయదు ..అతన్ని దండించడం ,శిక్షించడం వద్దు .డైవోర్స్ చేసి  భౌతిక మైన బంధాన్ని తెంచు కోగలం..  కానీ అతనిపై నాకున్న ప్రేమ నిశ్చలమైంది.అతను నాకు మోసం చేసినా ,నన్ను త్యజించినా అతని పట్ల నాకు వ్యతిరేకతలేదు ..రాదు ..నా విలువ గ్రహించి నా చెంతకు చేరినా ..అతను గ్రహించకముందే నేను మరణించినా నాకు తేడాలేదు .ఇది హేతుబద్ధమైన ఆలోచన కాకపోవచ్చు ,చదువుకున్న అమ్మాయిని అయివుండి ఇలా మానసిక దౌర్భల్యానికి లోనుకావడం నిన్ను అందరిని బాధించవచ్చు  కానీ ఇది నా ప్రవృత్తి . నా ఆనందానికి హేతువు ప్రేమనివ్వడమే ..తీసుకోవడం కాదు ...ఆశించడం వలన నిరాశ, నిరాశ  నుండి నిర్వేదం, నిర్వేదం నుండి నిస్పృహ...  ఇదే దుక్ఖానికి హేతువు.దుక్ఖం నా దరి చేర రాదంటే ప్రేమించడం ఒక్కటే మార్గం . ప్రేమ తన దిశను,మార్గాన్ని మార్చుకుంటుంది దాన్ని నీవు ఇలాగే వుండాలని  నిర్దేశించలేవు .కేవలం ప్రేమను పొందిన క్షణాల్ని జ్ఞాపకంగాదాచుకోగలం .దాన్ని ఎవరూ దొంగిలించలేరు. కాలం వాటిని మరుగు పరచలేదు .సంతోషం  వెలుగుతున్న క్రొవ్వొత్తిలాంటిది...అది ఆరిపోయేలోగా మరొక క్రొవ్వొత్తి వెలిగించాలి ..లేకపోతే చీకటి లాంటి దుక్ఖం రాజ్యం చేస్తుంది ...అతను లేని నా జీవితాన నాట్యమే నా జీవిత భాగ స్వామి.
అర్థం చేసుకుంటావు కదూ !

నీ అంజలి                             

కన్నీళ్ళతో మసక బారిన కళ్ళతో అలాగే చదివాను ఉత్తరాన్ని ..ఆమె లో  చెలరేగే నెగటివ్   ఎమోషన్స్ అన్నిటిని  తన  నృత్యించే  పాదాల  క్రింద  అణచివేసింది ...శివ తాండవం  లో  ఆమె  ప్రతి  అడుగు  ఆమె  నమ్మకం  పై  అతను  చేసిన  దుశ్చర్య  పై...మహిషాశుర  మర్ధని  గా  ఆమె  చేసిన  కరాళ నృత్యం  ఆమెలోని  కోపం ,ద్వేషం  అసూయ   లాంటి  అన్ వాంటెడ్  ఎమోషన్స్ మీద . ఆ వెలుగులు విరజిమ్మే వదనం వెనక విషాదం ..విషాదాన్ని వినోదంగా మార్చిన ధన్యజీవి ఆమె ...ప్రేమస్వరూపం మార్చుకోదు..దిశను మార్చుకుంటుంది ...ఎంత గొప్పవేదాంతం ...!

"సర్ ..అంజలి గారి నాట్యానికి సంభందించిన వస్తువుల్ని నాకిచ్చారు చాలు... ఆమె నాకు జీవితం పట్ల నిజమైన అవగాహన కలిగించారు ...మనం కోల్పోయిన వాటికంటే ..మనకు వున్న అదృష్టాల్ని మనం మననం చేసుకోవాలి ...ఆ ఇల్లు నాకు చెందడం  అన్యాయం అది ఆమె వారసురాలైన యామినికి చెందనివ్వండి...."

"మైత్రీ...నాట్యం పట్లనీకున్న మక్కువ అంజలికి తెలుసు ...అందుకే ఆమె ఆశయాల్ని నీవు నేరవేర్చగలవనే అంత విశాలమైన ఆ ఇల్లు నీకు రాసారు .పై పోర్షను అంతా నీవుండేందుకు..క్రింద అంతా డాన్స్ స్కూల్ కోసం. డాన్స్ స్కూల్ ఉచితంగా నడప డానికి వీలుగా ఒక fixed deposit కూడా చేసింది ...దాన్ని నీవు ఆదర్శవంతంగా నడపగలవని అంజలి విశ్వాసం.యామిని ని మానవాళికి ఉపయోగపడే ఒక మంచి డాక్టర్ ను చేయాలనే తనకోరిక నెరవేరింది .డాన్స్ స్కూల్  నడపడానికి నీవు..తన వారసురాలివి .నా స్నేహితురాలి ఆశయాల ఆచరణలో నేనుకూడా వున్నానమ్మా ! వెళ్లిరా !"కళ్ళలో తడిని తుడుచుకుంటూ..నన్ను ఆశ్వీరదించారు . 

పునరంకితం



-- 

పునరంకితం (Published in Vishaalakshi March 2013)

"ఎందుకిలా చేసావు ?" 
హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక, కోలుకుంటున్న స్వాతి ని అడగకుండా వుండ లేక పోయాను. మౌనంగా కళ్ళు దించుకుంది. వాలిన ఆ కనురెప్పల నుండి కన్నీరు జారుతుందని నాకు తెలుసు.ఆ కన్నీరు చూసే ధైర్యం నాకు లేదు. ఎవరి సంతోషం కోసమైతే నా జీవితాంతం శ్రాయశక్తుల ప్రయత్నం చేసానో ఆమె ఇవాళ నాకు కనీసం తనకో సమస్య వున్నట్లు కూడా చెప్పక పోవడం బాధ కల్గించడం లేదు, ఆశ్చర్యం కలిగిస్తోంది. చిననాటి నుండి స్వాతి నాకు అపురూప మైన స్నేహితురాలు, ఆత్మీయురాలు,వాళ్ళ కుటుంబానికి నా కుటుంబానికి వున్న స్నేహం, స్వాతి ఆత్త కూతురు రవళి తో నా వివాహం మరింత చేరువ చేసింది.  స్వాతి వయసులో నా కంటే  చిన్నదయినా మా ఇద్దరికీ మంచి స్నేహం,  నా పాప పూజ అంటే ఎంత ప్రాణమో,స్వాతి అన్నా అంతే  ప్రాణం నాకు ,కాని నా ప్రాణ స్నేహితురాలికి ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చింది?

వారం క్రిందట స్వాతి  మాటల్లోని  త్రీవ్ర నైరాశ్యం గమనించి రవళి తో  అదే అన్నాను. ఇద్దరం  స్వాతి తో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఫోన్ దొరకలా. స్వాతి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక హాస్టల్లో ఉంటోంది, అంత తరచుగా ఫోన్ లో  మాట్లాడం , నా మనసేదో కీడు శంకించింది.స్వాతి కెప్పుడు  కష్టం వచ్చినా నాలో అలజడి కలుగుతూ వుంటుంది. నా ఆవస్త గమనించి రవళి వెంటనే బయలుదేరమంది, పాపకి జ్వరం వస్తున్నా. 

స్వాతి హాస్టల్ చేరే టప్పటికి రాత్రి పదకొండు అయింది. హాస్టల్ వార్దన్ అంత రాత్రి లేపనంది, అతి కష్టం మీద ఒప్పించి పంపా, గదిలో తను ఒక్కతే  వుందని, రూమ్మేటు వూరికెల్లిందని చెప్పాక నా నరాలన్నీ ఉద్వేగం తో బిగుసుకు పోయాయి. వార్డన్ గాభరాగా ఎంత కొట్టినా తలుపు తీయడం లేదనడం తో ఒక్కసారిగా వార్డన్ తో పాటు గది కేసి పరిగెత్తాను పార్టిషన్ కోసం పెట్టిన కార్డ్ బోర్డ్ గోడని పగలగొట్టా... రక్తపు మడుగులో స్వాతి ...చేతి పై బ్లేడు తో కోసుకుంది. కేర్ హాస్పిటల్ లో ఐ సి యు లో మృత్యువు తో పోరాడి  కోలుకుంది. స్వాతి ఇలా చేయడం నాకు గాని వాళ్ళఅమ్మ నాన్న కి గాని అర్థం కాలా, స్వాతి లో సాహసం, సంయమనం , స్థితప్రజ్ఞత సమ పాళ్ళలో వుంటాయి.అందరు అమ్మాయిల్లా ఆకర్షణలు, అల్పమైన వాటి కోసం ఆరాటం లేని స్థిరమైన వ్యక్తిత్వం స్వాతిది, ఏ ఒడిదుడుకులైనా అవలీలగా ఎదుర్కోగలిగినదే కాక జీవితాన్ని ఎంతో ప్రేమిస్తుంది, ఏది కావాలనుకున్నా దాని సాధించుకోగలిగిన ధీశాలి. ఈమె ఆత్మహత్య చేసుకోవడమా? దోమ కుడితే " చూసావా నా శరీరం పై  ఎలా దద్డులోచ్చాయో" అని కలవరపడే స్వాతి,తన స్వహస్తాలతో కత్తి తో కోసుకుని రక్తాన్ని చిందించి ధార పోసిందే! రక్తం కనపడితే కళ్ళు తిరుగుతాయే స్వాతికి.. ఇప్పుడు రక్తపు మడుగులో మునిగిందే! 

ఏమి జరిగి వుంటుంది వుంటుంది?  హృదయానికి ఎంతో గాయం అయివుంటే తప్ప  ఈరకమైన నిర్ణయం తీసుకోదు..కాని స్వాతి కి ఏ సమస్యా లేదే ! ఒకవేళ వున్నాఅది నాకు గాని వాళ్ళ అమ్మానాన్నకి గాని తెలియ కుండా వుండవే .. ఏ విషయం లో కష్టం కలిగింది !ప్రేమ లో విషాదమా!  హాస్యాస్పదం !....దానికి అవకాశమే లేదు ఎందు కంటే ప్రేమలో పడితే కదా విషాదం సంగతి ! తనకి అన్నిరకాలుగా నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే కన్య గానే ఉంటానని స్వాతి  స్పష్టం చేసింది. ఆమె అమ్మానాన్నకూడా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మరి ఇంకేంటి? అడిగినప్పుదంతా మౌనమే సమాధానం.  "ఊరికే అడగకు కొంచం కోలుకోనీ" అని  రవళి అనడం తో కాస్త విరామం ఇచ్ఛా ..

కన్న కూతురు ప్రాణాలు తీసుకునేంత కష్టంలో వుందంటే తల్లిదండ్రులు ఎలా క్షోభ పడతారో తెలియని అజ్ఞాని కాదు , ఆకర్షణ  లో పడేందుకు టీన్స్ లో లేదు. నా ఆలోచనలు ఎటు పరిగెత్తినా చివరకి సమాధానం  దొరకలా,......కాదు  స్వాతి ఇవ్వలా! లెక్చరర్ గా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్ని దిద్దిన నాకు ఈ పరీక్ష అతి కష్టమైంది.

ఈసారి  అసహనం  తో కూడుకున్న స్వరం తో అడిగా.. "ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు?" వారం రోజులు వాళ్ళ అమ్మానాన్న తో పాటు ఐ సి యు లో, నిద్ర, ఆహారం లేక కృశించిన నా మొహం లోని వేదన అర్థమైందేమో ..
."నన్నేమి అడగకు ..జీవించడం కష్టమనిపించింది ...ఆ బాధ భయంకరం .. మరణమొక్కటే ఆ బాధని పోగొట్ట గలదు అనిపించింది..  ప్రయత్నించా...ప్చ్ .."
"స్వాతీ ఏంటిది? బాధకు కష్టానికి భయపడెంత సామాన్యమైన దానివా ?నమ్మలేకున్నా.. ఏమిజరిగిందో  చెప్పు.."
మౌనమే సమాధానమైంది.
స్వాతి వున్న పరిస్తితుల్లో ప్రేమ, నమ్మకం దగ్గరే గాయపడినట్లుంది,అయితే అది నా దగ్గర దాస్తోంది అంటే అది తనకే అర్తరహిత మైనదని అనిపించింది. తను అలాంటి పరిస్థిలో చిక్కుకున్నదుకు అవమాన పడుతోంది ." చెప్పలేం, కథ కంటే కూడా ఎక్కువున్నాయి మలుపులు జీవితంలో"There is a foolish corner in the brain of the wisest man. .అంటారు . అలా జరుగుతోందా!  స్వాతి నాకు  పసితనం నుండి తెలుసు నా దగ్గర తనకే రహస్యాలు లేకున్నా ఇపుడు ఈ విషయం చర్చించడం తనకి ఇష్టం లేదు.అడగే కొద్దీ ఇబ్బంది పడుతోంది...తెలుసుకుని చేయగలిగింది ఏమీ  లేనపుడు మాత్రమే, స్వాతి ఈ నిర్ణయానికి వచ్చి వుంటుంది .తన అభిప్రాయాన్ని గౌరవించడం నా ధర్మం ... నెమ్మదిగా తనకి ధైర్యం చెప్పడం , తన గాయాన్ని మానేట్టు చేయడమే ఇప్పుడు నా బాధ్యత ...
"మనం ఇతరులకు ఏది ఇస్తామో అదే వాళ్ళ దగ్గర నుండి ఆశిస్తాము, ఇది మానవ నైజం ,ప్రేమకి ప్రేమ ,విశ్వాసానికి  విశ్వాసం, నమ్మకానికి నమ్మకం తిరిగి రావాలని కోరుకుంటాము, చాలామందితో పొందగలం కూడా, కాని కొన్నిసార్లు మనకి ఆశాభంగం కలుగుతుంది, ప్రేమకి మోసం, నమ్మకానికి ద్రోహం జరుగుతుంది , అయినా మనం ప్రేమ, విశ్వాసం, విధేయత, క్షమ ఇవ్వాలి. లేకపోతే మన లోని సంస్కారం చెడిపోయి, మనం శూన్యులుగా మారి మనల్ని మనం మరింత కష్ట పెట్టుకుంటాము , అందుకే మనకు కష్టం కలిగించిన వారిని మనస్పూర్తిగా క్షమించడం, మనసు నుండి చెరిపివేయడమే మనకు  మంచిది అదే మనకు రక్ష!" నేను నమ్మిన సిద్ధాంతం చెబుతున్నాను......ధారాపాతంగా వర్షిస్తున్న స్వాతి  కన్నీళ్లు చూసి చలించిపోయాను. అదురుతున్న పెదవుల్ని పంటి తో నొక్కి పెట్టి దుఖ్హాన్ని అడుపుచేస్తోంది ...నేను ఓదార్చలేదు, ప్రశ్నించ లేదు, అర్థగంట తర్వాత లేచి మొహం కడుక్కుని  నిశ్చలంగా, నిర్మలంగా వచ్చి కూర్చుంది.
నాకు ఆసక్తి లేదు  ఏది తనను బలవన్మరణం వరకు తీసుకు పోయిందో..ఏది తనను అంత గాయ పెట్టిందో .. నాక్కావలిసింది  స్వాతి తనకు తానుగా  ఆ కష్టం నుండి బయటికి రావడం, తనకు శాంతి  గా జీవించడానికి కావలిసిన స్ఫూర్తి పొందడం. అదే తనకు తానుగా విధించుకున్నపరిమితులనుండి ఆమెను విముక్తి చేస్తుంది. ఆమె సామర్థ్యమే, ఆమె మేధా శక్తే  ఆమెను కాపాడాలి ,ఆమె బలహీనత కారణంగా వచ్చిన వేదన నుండే ఉద్భవించిన బలమే ఆమెను కాపాడాలి. నెమ్మదిగా లేచి  స్వాతి తల నిమిరి ఇంటి దారి పట్టా.       
నాకు తెలుసు జీవితంలో బాధలు, బరువులు, కష్టాలు, కన్నీళ్లు మనిషిని మరింత ఉన్నతంగా, మరింత ధృడంగా,మరింత మానవీయంగా చేస్తాయని!   
.

Saturday 9 February 2013

కల కాని నిజం


కల కాని నిజం 

స్తిరత్వం కంటే మార్పే సత్యమైనదనికాలాన్నిమాయా కల్పిత మైన దానిగా కాకనిశ్చయమైన దాన్నిగా పరిగణించాలనిమానవునికి స్వతంత్రత అనేది వుందని, ఆలోచనలు, భావాలు మనం కష్టించి పని చేయడానికి ఉపకరిస్తాయనికాని సత్యం తెలుసుకోవడానికి ఆలోచనా విధానాల ప్రయోజకత్వం కొలబద్దగా తీసుకోవడాన్నితాను వ్యతిరేకమని అంటాడు బెర్గసన్అతని దృష్టిలో  ఆలోచనలు,భావాలు సత్యాన్నిబలపర్చడమే కాకుండా తప్పుగా కూడా ప్రతిబింబిస్తాయి.నిత్యం మారే  సత్యాన్ని, ప్రతిబింబాలైన  ఆలోచనలు తెలుసుకోలేవు, అది  అంతరంగానికి (ఇంట్యుషన్ కి)  మాత్రమే  అందుతుంది.....భవిష్యత్తు  తలుపులు  ఎపుడు  తెరుచుకునే  వుంటాయి, జీవితం ఎప్పటికప్పుడు  కొత్తదనాన్ని, నవ్య దృష్టిని తెచ్చుకుంటుంది ..క్రొత్త, క్రొత్త  పథకాలను వేసుకుంటూ, తలచుకున్నపుడల్లా  మార్గాన్నిమార్చుకుంటూ, ప్రయాణం  సాగించగలదు ....హెన్రీ  బెర్గసన్ వేదాంతం  అర్థమైనట్లే  అయి  మళ్ళి  అగమ్య గోచరంగా  అనిపిస్తుంది. మలయ మారుతం నా వదనాన్ని సుతారంగా తాకి  వెళ్ళింది .చిన్న చిన్న చినుకులు చల్లగా మేని పై పడి అపూర్వమైన అనుభూతిని కలిగించాయి. స్వచమైన గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. తలెత్తిన నాకు కనువిందు ఇంద్ర ధనుస్సు ..ఈ చర్మ చక్షువులకి  ఎంత గొప్ప వరము! చేతిలోని గోపి చoద్ "తత్వవేత్తలు"  పుస్తకాన్ని మూసి షర్టులో దాచుకుని, చెప్పులు  వదలి వత్తుగా ఉన్న పచ్చటి గడ్డి పై నడుస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్ననేను, ఒక్కసారి అచేతనంగా అయిపోయాను. అపురూపమైన ఆ రూపం నన్ను కంపింప చేసింది. నా  అచేతనత్వం నుండి వచ్చిన చైతన్యం, ఇరవై ఏళ్ళనాటి జ్ఞాపకాల దొంతరను కదిలించాయి. కలలోను, ఇలలోనూ, నిద్రలోను, మెలకువలోను, స్పృహ లోను, నిస్పృహ లోను కొన్ని రూపాలు మరపు రావు. కాలం యొక్క ప్రభావం కొన్నిటిపై పడదు. ఆ రూపమే 'హిమబిందు. 'కృష్ణ శాస్త్రి ,శ్రీ శ్రీ ,తిలక్, షేక్స్పియర్, మిల్టన్, కీట్స్, షెల్లీ, టెన్నిసన్ ,ఇలియట్ ల సాహితీ స్రవంతి లో  ఓల లాడుతున్ననా మస్తిష్కం యొక్క మత్తుని దించిన రూపమది.

ముందు నడుస్తున్న ఆమె వెంటే  నా అడుగులు వడివడిగానడిచాయి. అదే బ్రాడ్ నెక్ ...శంఖం లాంటి మెడ క్రిందుగా మోకాళ్ళవరకు జీరాడుతున్న నల్లని జడ ! ఆ రూపం అపురూపం, నా స్మృతి పథం లో నిలిచి పోయిన దివ్యరూపం ,ఇరవై ఏళ్లుగా  నా కళ్ళలో ఆరని ఆశా దీపం హిమబిందు ! చిన్న చిన్న చినుకులు పెద్దగయాయి.హిమబిందు వడివడిగా నడచి కొంచం దూరంలో ఉన్న చెట్టు క్రిందకు వెళ్ళింది, నేను ఇంకో చెట్టు క్రింద ఆగిపోయాను .... నా ఆలోచనలు గతం లోకి వెళ్ళాయి.

అవి నేను ఎమ్మే ఫైనల్  చేసే రోజులు ..యూనివర్సిటీ  దగ్గర స్నేహితులతో  బాతాఖాని వేస్తున్న నాకు యమునా హాస్టల్ నుండి వస్తున్న జూనియర్ అమ్మాయిల్లో హిమ బిందు  మొదటి చూపులోనే ఆకర్షించింది , అప్పటికి ఆమె పేరు తెలియదు, ఫాకల్టీ కూడా తెలియదు,ఓ వారం దాకా ఆమెను చూడ్డం తప్ప,ఇంకేమి ఆలోచన కూడా చేయలేదు. అమ్మాయిల గురించి వాకబు చేయడం గానీ వాళ్ళ గురించి మాట్లాడడం గాని నాకు ఇష్టం వుండేది కాదు.టి ఎస్. ఇలియట్,వేస్ట్ లాండ్ పై సెమినార్ ఇస్తున్న నేను, తదేకంగా వింటున్న ఆమెను చూసి ఉన్మత్తుడ్ని అయాను. ఆమె మా జూనియర్ అని తెలియ గానే కలిగిన సంతోషం అంతా..ఇంతా  కాదు. హిమబిందు రూపం ఎక్కడికెళ్ళినా  ఏమి చేస్తున్నామెదులుతూనే వుండేది. ముఖ్యంగా ఆమె జడ! ఆ జడ చూస్తే  నాకు వురేసుకోవాలనిపించేది .... ఆ ఆలోచన నాకు నవ్వు తెప్పించేది. నాలో నేనే నవ్వు కోవడం చూసి స్నేహితులంతా అర్థం కానట్టు చూసేవారు. తరువాత ఆమె పేరు తెలుసుకున్నా," హిమబిందు"అందమైన రూపానికి మరింత అందమైన పేరు.

సాహిత్యం తో ఆమె కున్న అభిరుచి అప్పుడపుడు జరిగే సెమినార్ల లోను, డిబెట్స్ లో  తెలిసేది. అయితే ఇంగ్ల్లీషు డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునే సంస్కృతి వుండేది కాదు ఆరోజుల్లో ..అందుకే ఆమెతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ చేయ లేదు. మనసులో ఆరాధించడం తప్ప, ఆమంటే  ఇష్టం అనికూడా నేనేవరితోను అనలేదు కూడాను. నా చదువు అయిపోయాక ,ఉద్యోగం వచ్చాక అప్పుడు ఆమెకు నా ప్రేమ సంగతి చెప్పాలని, పెళ్లి గురించి తన అభిప్రాయం అడగడం ఎలాగో రిహార్సల్ చేసుకునే వాడ్ని.

ఓ పది రోజుల పాటు,ఇంటర్ స్టేట్ క్రికెట్ ఆడడానికి తిరుచ్చి వెళ్లి వచ్చేటప్పటికి ,డిపార్టుమెంటు లో వార్త ఏమిటంటే ,హిమబిందు కి పెళ్లి కుదిరిందని ...నా కలల  సౌధం కూలిపోయింది,నా కళ్ళలో తిరిగిన కన్నీళ్ళు, కళ్ళలోనే ఇంకిపోయాయి. ప్రేమించడమే నిజమైతే, ప్రియురాలి సుఖమే కోరుకునే రోజులవి. వలచాను, ఆమె మరొకరిది అని తెలియగానే మరిచాను. ఇన్నేళ్ళ  తర్వాత ఆమె కనిపించింది. ఆమె తో మాట్లాడాలనిపించింది ....ఆమె నన్ను చూడ లేదు. మెల్లిగా వర్షం లోనే ఆమె కేసి నడిచి ఎదురుగా  నిలిచాను. "మీరు.. మీరు .రామ్.. .కదూ! " ఆమె ఆగింది. 
ఆమెకు నా పూర్తి పేరు కూడా తెలిసినట్లు లేదు ..యూనివర్సిటి లో నా స్నేహితులు అలాగే పిలిచేవారు నన్ను. ఆమె లో పెద్దగా మార్పు లేదు, వయసుతో పాటు వచ్చిన పెద్దరికం తప్ప. పెద్ద బొట్టు,నీలి రంగు ప్రింటెడ్ సిల్క్ చీర, వక్షం క్రిందుగా పొడుగ్గా నల్లపూసల దండ . ...ఇరవై ఏళ్ళ క్రిందట నన్ను వెంటాడిన నవ్వు. 
"ఏమి చేస్తున్నారు?"అంది. 
"ఆర్ట్స్ కాలేజ్ లో లెక్చరర్ గా ..మీరు.....మీ వారు  " ఆగాను .
"స్టేట్ బాంక్ లో మానేజర్ గా చేస్తున్నా, మాసబ్ ట్యాంక్ బ్రాంచ్, మా వారు కూడా బాంక్ మానేజరే, హైదరాబాద్ లో; ఒక పాప మెడిసిన్ చేస్తోంది ఉస్మానియాలో ..ఎల్ టి సి మీద ఊటీ వచ్చాం. ఆయన ఫాక్స్ లో  మెసేజ్  పంపడానికి వెళ్లారు ...మీ క్లాస్ మేట్స్ ఎవరెవరు ఎక్కడున్నారు?" ఆమె అడుగుతుంటే ...జవాబు చెబుతున్నా, కానీ ఏదో ధ్యాస  లోనే వున్నా. నాకేం పట్టలేదు, కొనదేలిన ఆ ముక్కు ..భావాలు నిండిన కళ్ళు , తెల్లటి ఆమె వదనం , స్వచ్చమైన ఆ నవ్వు  చూస్తూ వున్నా. వర్షంతగ్గడం తో ఇద్దరం నడవడం మొదలుపెట్టాము ,ఆమె కుచ్చిళ్ళు,పట్టుకుని నడుస్తుంటే నల్లటి చెప్పుల్లో తెల్లటి పాదాలు  కాళ్ళకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ఎంతో శోభగా వున్నాయి. ఎ  థింగ్  అఫ్  బ్యూటీ  ఇస్  జోయ్  ఫర్  ఎవెర్ . ఆమె నడక ఎంతో హుందాగా వుంది. ఆమె కదులుతున్న మబ్బులా, నీలిరంగు చీర ఆకాశంలా శోభాయమానంగా  వుంది, జీవితం లో ఎప్పుడూ..బిందు  ప్రక్కన నడిచే అదృష్టం వస్తుందనుకోలా .. నా కలల రాణి ఏ ఇంటి  దీపమయ్యిందో ! ఏ అదృష్టవంతుడ్నివరించిందో !  ఆమె ఏమి అడుగుతుందో,  నేనేమి  సమాధానం చెబుతున్నానో  నాకే తెలియలా! నేను పరధ్యానం లో ఉండగానే...
  "నే వెళతా నండి ..ఇదిగోండి నా  విసిటింగ్ కార్డు హైదరాబాద్ కొస్తే తప్పకుండా కలవండి"  ఆమె మెల్లగా కదిలింది. అచేతనంగా నిలబడ్డా.... గ్రీకు పురాణ కథలో పాతాళ లోకం నుండి దేవుడ్ని ఒప్పించి యురిడిస్ని తీసుకు వస్తూ దైవాజ్ఞను ధిక్కరించి తల త్రిప్పి చూసిన ఆరిఫియాస్ ని వదిలి వెళ్ళిన యురిడిస్ లా  ఆమె మెల్లిగా కనుమరుగవుతూ వుంది .
" వెళ్ళిపోకు బిందూ....   వెళ్ళిపోకు.".. మెల్లిగా గొణుక్కుంటూన్నట్లు మొదలై ఆమె వెంటే వెళుతూ  "బిందూ  ..బిందూ " అని .అరుస్తున్నాను . 
"ఏంటి..ఏమైంది .." కదిలిస్తున్నా రెవరో... బరువుగా కళ్ళు తెరిచాను . 
ఊటీ పచ్చదనంలో ఇరవై ఏళ్ళ క్రిందటి నా డ్రీం గర్ల్ హిమ బిందు ఏది? కళ్ళు నులుముకుని మళ్లీ చూసాను .
"నేనెక్కడున్నాను ?" గొణిగాను. 
"ఎనిమిదవుతోంది, నేను కాలేజ్ కి వెళ్ళాలి, తమరేమైనా ఇవాళ సెలవు తీసు కుంటారా?" ఎదురుగా  బిందు. 
"బిందూ  నువ్వు ..నువ్వు   ..ఇక్కడ... నేను... ." జుట్టు పైకి సిగ చుట్టి ,వంట గది వేడికి చిరు చెమటల్ని తుడుచుకుంటున్న  హిమ బిందును చూడగానే మనసు కలుక్కుమంది ...వాస్తవ లోకంలోకి రాగానే నాకు ఆస్కార్ వైల్డ్ మాటలు గుర్తొచ్చాయి ."జీవితంలో రెండు విషాదాలున్నాయ్.ఒకటి అనుకున్నది జరగక పోవడం, రెండోది జరిగి పోవడం " (There are only two tragedies in life: one is not getting what one wants, and the other is getting it.)


 (published in vipula in December 2012