Tuesday, 16 April 2013

పునరంకితం



-- 

పునరంకితం (Published in Vishaalakshi March 2013)

"ఎందుకిలా చేసావు ?" 
హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చాక, కోలుకుంటున్న స్వాతి ని అడగకుండా వుండ లేక పోయాను. మౌనంగా కళ్ళు దించుకుంది. వాలిన ఆ కనురెప్పల నుండి కన్నీరు జారుతుందని నాకు తెలుసు.ఆ కన్నీరు చూసే ధైర్యం నాకు లేదు. ఎవరి సంతోషం కోసమైతే నా జీవితాంతం శ్రాయశక్తుల ప్రయత్నం చేసానో ఆమె ఇవాళ నాకు కనీసం తనకో సమస్య వున్నట్లు కూడా చెప్పక పోవడం బాధ కల్గించడం లేదు, ఆశ్చర్యం కలిగిస్తోంది. చిననాటి నుండి స్వాతి నాకు అపురూప మైన స్నేహితురాలు, ఆత్మీయురాలు,వాళ్ళ కుటుంబానికి నా కుటుంబానికి వున్న స్నేహం, స్వాతి ఆత్త కూతురు రవళి తో నా వివాహం మరింత చేరువ చేసింది.  స్వాతి వయసులో నా కంటే  చిన్నదయినా మా ఇద్దరికీ మంచి స్నేహం,  నా పాప పూజ అంటే ఎంత ప్రాణమో,స్వాతి అన్నా అంతే  ప్రాణం నాకు ,కాని నా ప్రాణ స్నేహితురాలికి ప్రాణం తీసుకునేంత కష్టం ఏమొచ్చింది?

వారం క్రిందట స్వాతి  మాటల్లోని  త్రీవ్ర నైరాశ్యం గమనించి రవళి తో  అదే అన్నాను. ఇద్దరం  స్వాతి తో మాట్లాడడానికి ప్రయత్నం చేసినా ఫోన్ దొరకలా. స్వాతి హైదరాబాదులో ఉద్యోగంలో చేరాక హాస్టల్లో ఉంటోంది, అంత తరచుగా ఫోన్ లో  మాట్లాడం , నా మనసేదో కీడు శంకించింది.స్వాతి కెప్పుడు  కష్టం వచ్చినా నాలో అలజడి కలుగుతూ వుంటుంది. నా ఆవస్త గమనించి రవళి వెంటనే బయలుదేరమంది, పాపకి జ్వరం వస్తున్నా. 

స్వాతి హాస్టల్ చేరే టప్పటికి రాత్రి పదకొండు అయింది. హాస్టల్ వార్దన్ అంత రాత్రి లేపనంది, అతి కష్టం మీద ఒప్పించి పంపా, గదిలో తను ఒక్కతే  వుందని, రూమ్మేటు వూరికెల్లిందని చెప్పాక నా నరాలన్నీ ఉద్వేగం తో బిగుసుకు పోయాయి. వార్డన్ గాభరాగా ఎంత కొట్టినా తలుపు తీయడం లేదనడం తో ఒక్కసారిగా వార్డన్ తో పాటు గది కేసి పరిగెత్తాను పార్టిషన్ కోసం పెట్టిన కార్డ్ బోర్డ్ గోడని పగలగొట్టా... రక్తపు మడుగులో స్వాతి ...చేతి పై బ్లేడు తో కోసుకుంది. కేర్ హాస్పిటల్ లో ఐ సి యు లో మృత్యువు తో పోరాడి  కోలుకుంది. స్వాతి ఇలా చేయడం నాకు గాని వాళ్ళఅమ్మ నాన్న కి గాని అర్థం కాలా, స్వాతి లో సాహసం, సంయమనం , స్థితప్రజ్ఞత సమ పాళ్ళలో వుంటాయి.అందరు అమ్మాయిల్లా ఆకర్షణలు, అల్పమైన వాటి కోసం ఆరాటం లేని స్థిరమైన వ్యక్తిత్వం స్వాతిది, ఏ ఒడిదుడుకులైనా అవలీలగా ఎదుర్కోగలిగినదే కాక జీవితాన్ని ఎంతో ప్రేమిస్తుంది, ఏది కావాలనుకున్నా దాని సాధించుకోగలిగిన ధీశాలి. ఈమె ఆత్మహత్య చేసుకోవడమా? దోమ కుడితే " చూసావా నా శరీరం పై  ఎలా దద్డులోచ్చాయో" అని కలవరపడే స్వాతి,తన స్వహస్తాలతో కత్తి తో కోసుకుని రక్తాన్ని చిందించి ధార పోసిందే! రక్తం కనపడితే కళ్ళు తిరుగుతాయే స్వాతికి.. ఇప్పుడు రక్తపు మడుగులో మునిగిందే! 

ఏమి జరిగి వుంటుంది వుంటుంది?  హృదయానికి ఎంతో గాయం అయివుంటే తప్ప  ఈరకమైన నిర్ణయం తీసుకోదు..కాని స్వాతి కి ఏ సమస్యా లేదే ! ఒకవేళ వున్నాఅది నాకు గాని వాళ్ళ అమ్మానాన్నకి గాని తెలియ కుండా వుండవే .. ఏ విషయం లో కష్టం కలిగింది !ప్రేమ లో విషాదమా!  హాస్యాస్పదం !....దానికి అవకాశమే లేదు ఎందు కంటే ప్రేమలో పడితే కదా విషాదం సంగతి ! తనకి అన్నిరకాలుగా నచ్చిన వ్యక్తి దొరికితేనే పెళ్లి జరుగుతుందని లేకపోతే కన్య గానే ఉంటానని స్వాతి  స్పష్టం చేసింది. ఆమె అమ్మానాన్నకూడా ఆమె అభిప్రాయాన్ని గౌరవిస్తారు. మరి ఇంకేంటి? అడిగినప్పుదంతా మౌనమే సమాధానం.  "ఊరికే అడగకు కొంచం కోలుకోనీ" అని  రవళి అనడం తో కాస్త విరామం ఇచ్ఛా ..

కన్న కూతురు ప్రాణాలు తీసుకునేంత కష్టంలో వుందంటే తల్లిదండ్రులు ఎలా క్షోభ పడతారో తెలియని అజ్ఞాని కాదు , ఆకర్షణ  లో పడేందుకు టీన్స్ లో లేదు. నా ఆలోచనలు ఎటు పరిగెత్తినా చివరకి సమాధానం  దొరకలా,......కాదు  స్వాతి ఇవ్వలా! లెక్చరర్ గా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్ని దిద్దిన నాకు ఈ పరీక్ష అతి కష్టమైంది.

ఈసారి  అసహనం  తో కూడుకున్న స్వరం తో అడిగా.. "ఎందుకు ప్రాణాలు తీసుకోవాలనుకున్నావు?" వారం రోజులు వాళ్ళ అమ్మానాన్న తో పాటు ఐ సి యు లో, నిద్ర, ఆహారం లేక కృశించిన నా మొహం లోని వేదన అర్థమైందేమో ..
."నన్నేమి అడగకు ..జీవించడం కష్టమనిపించింది ...ఆ బాధ భయంకరం .. మరణమొక్కటే ఆ బాధని పోగొట్ట గలదు అనిపించింది..  ప్రయత్నించా...ప్చ్ .."
"స్వాతీ ఏంటిది? బాధకు కష్టానికి భయపడెంత సామాన్యమైన దానివా ?నమ్మలేకున్నా.. ఏమిజరిగిందో  చెప్పు.."
మౌనమే సమాధానమైంది.
స్వాతి వున్న పరిస్తితుల్లో ప్రేమ, నమ్మకం దగ్గరే గాయపడినట్లుంది,అయితే అది నా దగ్గర దాస్తోంది అంటే అది తనకే అర్తరహిత మైనదని అనిపించింది. తను అలాంటి పరిస్థిలో చిక్కుకున్నదుకు అవమాన పడుతోంది ." చెప్పలేం, కథ కంటే కూడా ఎక్కువున్నాయి మలుపులు జీవితంలో"There is a foolish corner in the brain of the wisest man. .అంటారు . అలా జరుగుతోందా!  స్వాతి నాకు  పసితనం నుండి తెలుసు నా దగ్గర తనకే రహస్యాలు లేకున్నా ఇపుడు ఈ విషయం చర్చించడం తనకి ఇష్టం లేదు.అడగే కొద్దీ ఇబ్బంది పడుతోంది...తెలుసుకుని చేయగలిగింది ఏమీ  లేనపుడు మాత్రమే, స్వాతి ఈ నిర్ణయానికి వచ్చి వుంటుంది .తన అభిప్రాయాన్ని గౌరవించడం నా ధర్మం ... నెమ్మదిగా తనకి ధైర్యం చెప్పడం , తన గాయాన్ని మానేట్టు చేయడమే ఇప్పుడు నా బాధ్యత ...
"మనం ఇతరులకు ఏది ఇస్తామో అదే వాళ్ళ దగ్గర నుండి ఆశిస్తాము, ఇది మానవ నైజం ,ప్రేమకి ప్రేమ ,విశ్వాసానికి  విశ్వాసం, నమ్మకానికి నమ్మకం తిరిగి రావాలని కోరుకుంటాము, చాలామందితో పొందగలం కూడా, కాని కొన్నిసార్లు మనకి ఆశాభంగం కలుగుతుంది, ప్రేమకి మోసం, నమ్మకానికి ద్రోహం జరుగుతుంది , అయినా మనం ప్రేమ, విశ్వాసం, విధేయత, క్షమ ఇవ్వాలి. లేకపోతే మన లోని సంస్కారం చెడిపోయి, మనం శూన్యులుగా మారి మనల్ని మనం మరింత కష్ట పెట్టుకుంటాము , అందుకే మనకు కష్టం కలిగించిన వారిని మనస్పూర్తిగా క్షమించడం, మనసు నుండి చెరిపివేయడమే మనకు  మంచిది అదే మనకు రక్ష!" నేను నమ్మిన సిద్ధాంతం చెబుతున్నాను......ధారాపాతంగా వర్షిస్తున్న స్వాతి  కన్నీళ్లు చూసి చలించిపోయాను. అదురుతున్న పెదవుల్ని పంటి తో నొక్కి పెట్టి దుఖ్హాన్ని అడుపుచేస్తోంది ...నేను ఓదార్చలేదు, ప్రశ్నించ లేదు, అర్థగంట తర్వాత లేచి మొహం కడుక్కుని  నిశ్చలంగా, నిర్మలంగా వచ్చి కూర్చుంది.
నాకు ఆసక్తి లేదు  ఏది తనను బలవన్మరణం వరకు తీసుకు పోయిందో..ఏది తనను అంత గాయ పెట్టిందో .. నాక్కావలిసింది  స్వాతి తనకు తానుగా  ఆ కష్టం నుండి బయటికి రావడం, తనకు శాంతి  గా జీవించడానికి కావలిసిన స్ఫూర్తి పొందడం. అదే తనకు తానుగా విధించుకున్నపరిమితులనుండి ఆమెను విముక్తి చేస్తుంది. ఆమె సామర్థ్యమే, ఆమె మేధా శక్తే  ఆమెను కాపాడాలి ,ఆమె బలహీనత కారణంగా వచ్చిన వేదన నుండే ఉద్భవించిన బలమే ఆమెను కాపాడాలి. నెమ్మదిగా లేచి  స్వాతి తల నిమిరి ఇంటి దారి పట్టా.       
నాకు తెలుసు జీవితంలో బాధలు, బరువులు, కష్టాలు, కన్నీళ్లు మనిషిని మరింత ఉన్నతంగా, మరింత ధృడంగా,మరింత మానవీయంగా చేస్తాయని!   
.

No comments:

Post a Comment