Saturday 9 February 2013

కల కాని నిజం


కల కాని నిజం 

స్తిరత్వం కంటే మార్పే సత్యమైనదనికాలాన్నిమాయా కల్పిత మైన దానిగా కాకనిశ్చయమైన దాన్నిగా పరిగణించాలనిమానవునికి స్వతంత్రత అనేది వుందని, ఆలోచనలు, భావాలు మనం కష్టించి పని చేయడానికి ఉపకరిస్తాయనికాని సత్యం తెలుసుకోవడానికి ఆలోచనా విధానాల ప్రయోజకత్వం కొలబద్దగా తీసుకోవడాన్నితాను వ్యతిరేకమని అంటాడు బెర్గసన్అతని దృష్టిలో  ఆలోచనలు,భావాలు సత్యాన్నిబలపర్చడమే కాకుండా తప్పుగా కూడా ప్రతిబింబిస్తాయి.నిత్యం మారే  సత్యాన్ని, ప్రతిబింబాలైన  ఆలోచనలు తెలుసుకోలేవు, అది  అంతరంగానికి (ఇంట్యుషన్ కి)  మాత్రమే  అందుతుంది.....భవిష్యత్తు  తలుపులు  ఎపుడు  తెరుచుకునే  వుంటాయి, జీవితం ఎప్పటికప్పుడు  కొత్తదనాన్ని, నవ్య దృష్టిని తెచ్చుకుంటుంది ..క్రొత్త, క్రొత్త  పథకాలను వేసుకుంటూ, తలచుకున్నపుడల్లా  మార్గాన్నిమార్చుకుంటూ, ప్రయాణం  సాగించగలదు ....హెన్రీ  బెర్గసన్ వేదాంతం  అర్థమైనట్లే  అయి  మళ్ళి  అగమ్య గోచరంగా  అనిపిస్తుంది. మలయ మారుతం నా వదనాన్ని సుతారంగా తాకి  వెళ్ళింది .చిన్న చిన్న చినుకులు చల్లగా మేని పై పడి అపూర్వమైన అనుభూతిని కలిగించాయి. స్వచమైన గాలిని గుండెల నిండా పీల్చుకున్నాను. తలెత్తిన నాకు కనువిందు ఇంద్ర ధనుస్సు ..ఈ చర్మ చక్షువులకి  ఎంత గొప్ప వరము! చేతిలోని గోపి చoద్ "తత్వవేత్తలు"  పుస్తకాన్ని మూసి షర్టులో దాచుకుని, చెప్పులు  వదలి వత్తుగా ఉన్న పచ్చటి గడ్డి పై నడుస్తూ ఆనందాన్ని అనుభవిస్తున్ననేను, ఒక్కసారి అచేతనంగా అయిపోయాను. అపురూపమైన ఆ రూపం నన్ను కంపింప చేసింది. నా  అచేతనత్వం నుండి వచ్చిన చైతన్యం, ఇరవై ఏళ్ళనాటి జ్ఞాపకాల దొంతరను కదిలించాయి. కలలోను, ఇలలోనూ, నిద్రలోను, మెలకువలోను, స్పృహ లోను, నిస్పృహ లోను కొన్ని రూపాలు మరపు రావు. కాలం యొక్క ప్రభావం కొన్నిటిపై పడదు. ఆ రూపమే 'హిమబిందు. 'కృష్ణ శాస్త్రి ,శ్రీ శ్రీ ,తిలక్, షేక్స్పియర్, మిల్టన్, కీట్స్, షెల్లీ, టెన్నిసన్ ,ఇలియట్ ల సాహితీ స్రవంతి లో  ఓల లాడుతున్ననా మస్తిష్కం యొక్క మత్తుని దించిన రూపమది.

ముందు నడుస్తున్న ఆమె వెంటే  నా అడుగులు వడివడిగానడిచాయి. అదే బ్రాడ్ నెక్ ...శంఖం లాంటి మెడ క్రిందుగా మోకాళ్ళవరకు జీరాడుతున్న నల్లని జడ ! ఆ రూపం అపురూపం, నా స్మృతి పథం లో నిలిచి పోయిన దివ్యరూపం ,ఇరవై ఏళ్లుగా  నా కళ్ళలో ఆరని ఆశా దీపం హిమబిందు ! చిన్న చిన్న చినుకులు పెద్దగయాయి.హిమబిందు వడివడిగా నడచి కొంచం దూరంలో ఉన్న చెట్టు క్రిందకు వెళ్ళింది, నేను ఇంకో చెట్టు క్రింద ఆగిపోయాను .... నా ఆలోచనలు గతం లోకి వెళ్ళాయి.

అవి నేను ఎమ్మే ఫైనల్  చేసే రోజులు ..యూనివర్సిటీ  దగ్గర స్నేహితులతో  బాతాఖాని వేస్తున్న నాకు యమునా హాస్టల్ నుండి వస్తున్న జూనియర్ అమ్మాయిల్లో హిమ బిందు  మొదటి చూపులోనే ఆకర్షించింది , అప్పటికి ఆమె పేరు తెలియదు, ఫాకల్టీ కూడా తెలియదు,ఓ వారం దాకా ఆమెను చూడ్డం తప్ప,ఇంకేమి ఆలోచన కూడా చేయలేదు. అమ్మాయిల గురించి వాకబు చేయడం గానీ వాళ్ళ గురించి మాట్లాడడం గాని నాకు ఇష్టం వుండేది కాదు.టి ఎస్. ఇలియట్,వేస్ట్ లాండ్ పై సెమినార్ ఇస్తున్న నేను, తదేకంగా వింటున్న ఆమెను చూసి ఉన్మత్తుడ్ని అయాను. ఆమె మా జూనియర్ అని తెలియ గానే కలిగిన సంతోషం అంతా..ఇంతా  కాదు. హిమబిందు రూపం ఎక్కడికెళ్ళినా  ఏమి చేస్తున్నామెదులుతూనే వుండేది. ముఖ్యంగా ఆమె జడ! ఆ జడ చూస్తే  నాకు వురేసుకోవాలనిపించేది .... ఆ ఆలోచన నాకు నవ్వు తెప్పించేది. నాలో నేనే నవ్వు కోవడం చూసి స్నేహితులంతా అర్థం కానట్టు చూసేవారు. తరువాత ఆమె పేరు తెలుసుకున్నా," హిమబిందు"అందమైన రూపానికి మరింత అందమైన పేరు.

సాహిత్యం తో ఆమె కున్న అభిరుచి అప్పుడపుడు జరిగే సెమినార్ల లోను, డిబెట్స్ లో  తెలిసేది. అయితే ఇంగ్ల్లీషు డిపార్ట్మెంట్ లో అమ్మాయిలు అబ్బాయిలు మాట్లాడుకునే సంస్కృతి వుండేది కాదు ఆరోజుల్లో ..అందుకే ఆమెతో మాట్లాడే ప్రయత్నం ఎప్పుడూ చేయ లేదు. మనసులో ఆరాధించడం తప్ప, ఆమంటే  ఇష్టం అనికూడా నేనేవరితోను అనలేదు కూడాను. నా చదువు అయిపోయాక ,ఉద్యోగం వచ్చాక అప్పుడు ఆమెకు నా ప్రేమ సంగతి చెప్పాలని, పెళ్లి గురించి తన అభిప్రాయం అడగడం ఎలాగో రిహార్సల్ చేసుకునే వాడ్ని.

ఓ పది రోజుల పాటు,ఇంటర్ స్టేట్ క్రికెట్ ఆడడానికి తిరుచ్చి వెళ్లి వచ్చేటప్పటికి ,డిపార్టుమెంటు లో వార్త ఏమిటంటే ,హిమబిందు కి పెళ్లి కుదిరిందని ...నా కలల  సౌధం కూలిపోయింది,నా కళ్ళలో తిరిగిన కన్నీళ్ళు, కళ్ళలోనే ఇంకిపోయాయి. ప్రేమించడమే నిజమైతే, ప్రియురాలి సుఖమే కోరుకునే రోజులవి. వలచాను, ఆమె మరొకరిది అని తెలియగానే మరిచాను. ఇన్నేళ్ళ  తర్వాత ఆమె కనిపించింది. ఆమె తో మాట్లాడాలనిపించింది ....ఆమె నన్ను చూడ లేదు. మెల్లిగా వర్షం లోనే ఆమె కేసి నడిచి ఎదురుగా  నిలిచాను. "మీరు.. మీరు .రామ్.. .కదూ! " ఆమె ఆగింది. 
ఆమెకు నా పూర్తి పేరు కూడా తెలిసినట్లు లేదు ..యూనివర్సిటి లో నా స్నేహితులు అలాగే పిలిచేవారు నన్ను. ఆమె లో పెద్దగా మార్పు లేదు, వయసుతో పాటు వచ్చిన పెద్దరికం తప్ప. పెద్ద బొట్టు,నీలి రంగు ప్రింటెడ్ సిల్క్ చీర, వక్షం క్రిందుగా పొడుగ్గా నల్లపూసల దండ . ...ఇరవై ఏళ్ళ క్రిందట నన్ను వెంటాడిన నవ్వు. 
"ఏమి చేస్తున్నారు?"అంది. 
"ఆర్ట్స్ కాలేజ్ లో లెక్చరర్ గా ..మీరు.....మీ వారు  " ఆగాను .
"స్టేట్ బాంక్ లో మానేజర్ గా చేస్తున్నా, మాసబ్ ట్యాంక్ బ్రాంచ్, మా వారు కూడా బాంక్ మానేజరే, హైదరాబాద్ లో; ఒక పాప మెడిసిన్ చేస్తోంది ఉస్మానియాలో ..ఎల్ టి సి మీద ఊటీ వచ్చాం. ఆయన ఫాక్స్ లో  మెసేజ్  పంపడానికి వెళ్లారు ...మీ క్లాస్ మేట్స్ ఎవరెవరు ఎక్కడున్నారు?" ఆమె అడుగుతుంటే ...జవాబు చెబుతున్నా, కానీ ఏదో ధ్యాస  లోనే వున్నా. నాకేం పట్టలేదు, కొనదేలిన ఆ ముక్కు ..భావాలు నిండిన కళ్ళు , తెల్లటి ఆమె వదనం , స్వచ్చమైన ఆ నవ్వు  చూస్తూ వున్నా. వర్షంతగ్గడం తో ఇద్దరం నడవడం మొదలుపెట్టాము ,ఆమె కుచ్చిళ్ళు,పట్టుకుని నడుస్తుంటే నల్లటి చెప్పుల్లో తెల్లటి పాదాలు  కాళ్ళకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ఎంతో శోభగా వున్నాయి. ఎ  థింగ్  అఫ్  బ్యూటీ  ఇస్  జోయ్  ఫర్  ఎవెర్ . ఆమె నడక ఎంతో హుందాగా వుంది. ఆమె కదులుతున్న మబ్బులా, నీలిరంగు చీర ఆకాశంలా శోభాయమానంగా  వుంది, జీవితం లో ఎప్పుడూ..బిందు  ప్రక్కన నడిచే అదృష్టం వస్తుందనుకోలా .. నా కలల రాణి ఏ ఇంటి  దీపమయ్యిందో ! ఏ అదృష్టవంతుడ్నివరించిందో !  ఆమె ఏమి అడుగుతుందో,  నేనేమి  సమాధానం చెబుతున్నానో  నాకే తెలియలా! నేను పరధ్యానం లో ఉండగానే...
  "నే వెళతా నండి ..ఇదిగోండి నా  విసిటింగ్ కార్డు హైదరాబాద్ కొస్తే తప్పకుండా కలవండి"  ఆమె మెల్లగా కదిలింది. అచేతనంగా నిలబడ్డా.... గ్రీకు పురాణ కథలో పాతాళ లోకం నుండి దేవుడ్ని ఒప్పించి యురిడిస్ని తీసుకు వస్తూ దైవాజ్ఞను ధిక్కరించి తల త్రిప్పి చూసిన ఆరిఫియాస్ ని వదిలి వెళ్ళిన యురిడిస్ లా  ఆమె మెల్లిగా కనుమరుగవుతూ వుంది .
" వెళ్ళిపోకు బిందూ....   వెళ్ళిపోకు.".. మెల్లిగా గొణుక్కుంటూన్నట్లు మొదలై ఆమె వెంటే వెళుతూ  "బిందూ  ..బిందూ " అని .అరుస్తున్నాను . 
"ఏంటి..ఏమైంది .." కదిలిస్తున్నా రెవరో... బరువుగా కళ్ళు తెరిచాను . 
ఊటీ పచ్చదనంలో ఇరవై ఏళ్ళ క్రిందటి నా డ్రీం గర్ల్ హిమ బిందు ఏది? కళ్ళు నులుముకుని మళ్లీ చూసాను .
"నేనెక్కడున్నాను ?" గొణిగాను. 
"ఎనిమిదవుతోంది, నేను కాలేజ్ కి వెళ్ళాలి, తమరేమైనా ఇవాళ సెలవు తీసు కుంటారా?" ఎదురుగా  బిందు. 
"బిందూ  నువ్వు ..నువ్వు   ..ఇక్కడ... నేను... ." జుట్టు పైకి సిగ చుట్టి ,వంట గది వేడికి చిరు చెమటల్ని తుడుచుకుంటున్న  హిమ బిందును చూడగానే మనసు కలుక్కుమంది ...వాస్తవ లోకంలోకి రాగానే నాకు ఆస్కార్ వైల్డ్ మాటలు గుర్తొచ్చాయి ."జీవితంలో రెండు విషాదాలున్నాయ్.ఒకటి అనుకున్నది జరగక పోవడం, రెండోది జరిగి పోవడం " (There are only two tragedies in life: one is not getting what one wants, and the other is getting it.)


 (published in vipula in December 2012