Wednesday, 26 September 2012

ప్రేమికుడు

(Published in Andhra Jyothi, Sunday 24 July 2011)


రొజూ లాగే  సాయంత్రం పార్కు లో నడుస్తున్నా .ఓ ప్రక్క పిల్లలు క్రికెట్టు ఆడుతున్నారు .శలవులు కావడం వలన ఈ మధ్య పిల్లలు ఎక్కువ మందే కనపడుతున్నారు.సంధ్య వేళ కావడం తో  ఆకాశం అరుణ వర్ణం తో  వుండి మెల్లిగా చీకటి తెరల్ని పరుస్తూ వుంది. వేడిగా వున్నా, చెట్ల నీడన వున్న బెంచీల మీద కూర్చుని సేద తీరుతున్నారు కొంతమంది.నా కళ్ళు అలవాటుగా ఓ వృద్ధ దంపతుల కోసం వెతికాయి ఎపుడూ వాళ్ళు కూర్చునే చోటు లో చూశా! కనపడ లేదు.నిర్విరామంగా వుంటారు వాళ్ళు.అతనికి డెబ్బై దాకా వయసుండ వచ్చు , ఆమెకుఅటు ఇటుగా అంతే వయసు వుంటుంది. అతను ఆమెతో ఏదో చెబుతుంటాడు ఆమె తల ఊపుతూ వుంటుంది కానీ మాట్లాడటం అయితే నేను చూడలేదు .తెల్లటి బట్టలు వేసుకుని అతను ,మంచి రంగుల  నేత చీరల్లో ఆమె చాలా హుందాగా వుంటారు. బాగా చదువుకున్నట్లు,చాలా సౌమ్యులు అయినట్లు, జీవితాన్ని పరిపూర్ణంగా, సంతృప్తికరంగా అనుభవించినట్లుగా అనిపిస్తుంది వాళ్ళను చూస్తే.నా పరిశీలన నిజం అయితే వాళ్ళు గొప్ప ఆదర్శ దంపతులు కావచ్చు.ఇవాళ ఎందుకు రాలేదు ? వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చా .మరుసటి రోజు వాళ్ళ కోసం నా కళ్ళు వెతికాయి,నిరాశ చెందాయి .రెండు మూడు రోజులు వాళ్ళు రాక పోయే సరికి నాకు వాళ్ళిద్దరిలో ఒకరికి ఏదో జరిగిందని అనిపించింది . అక్కడున్న పిల్లల్ని అడిగా,  ఎవరికి వాళ్ళ ఇల్లు తెలియదని అన్నారు .నిరాశగా అనిపించింది. కొన్నిరోజులు వాళ్ళని గురించిన ఆలోచనలు వచ్చేవి. తర్వాత మర్చిపోయాను. 

ఈ రోజు హేమంత్ పుట్టిన రోజు.తెల్ల వారగానే వాళ్ళింటికి వెళదామని తయారయ్యాక ఫోన్ చేస్తే హాస్పిటల్ కు వెళుతున్నాఅక్కడికే రమ్మన్నాడు. "బిజీ గా ఉంటావు కదా "అన్నా."పర్లేదు నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు" అన్నాడుహేమంత్ . "కానీ పాపం పేషoట్స్..." అన్నాను . "అదే వద్దన్నది " కోపగించుకున్నాడు.  అతనికి అంత తొందరగా కోపమెందుకు వస్తుందో నాకు అర్థం కాదు.తర్వాత కాసేపటికి ఆదంత మర్చిపోయి తను మామూలుగా ఉంటాడు ,నవ్విస్తాడు. హాస్పిటల్లో హేమంత్ బిజీ గా వున్నా, నే వెళ్ళ గానే వచ్చాడు. బోకే ని అందించి విష్ చేశా ..."కాబోయే శ్రీమతి ...వుట్టి బోకే తో సరిపెడతావా..." అన్నాడు హేమంత్ . :"డాక్టర్ .".అని వచ్చి నన్ను చూసి ఆగి పోయింది నర్సు ".ఏంటి" విసుక్కున్న్నాడు హేమంత్. నాకుగిల్టీ గా అనిపించింది ."జస్ట్ ....వేరే డాక్టర్ కి పని  అప్పగించి వస్తాను" అన్నాడు." వద్దు...నేను వెళతాను సాయంత్రం ఇంటికి రా " అన్నాను .అతను కోపంగా చూసాడు.అక్కడ నాతో ఒంటరిగా మాట్లాడడానికి కుదరదు కదా అది అతని కోపానికి కారణం.

ఎలాగో నచ్చ జెప్పి బయటకి  వస్తుండగా పార్కులో కనిపించే వృద్ధుడు కనిపించాడు నర్సుతో మాట్లాడుతూ. నాకు ఆయన్ని చూడగానే చాలా సంతోషంఇ  కలిగింది. " ప్లీజ్ తల్లి టిఫిన్ తినిపించి వెళ్లి పోతా కదా! "ఆయన సిస్టర్ ను ప్రాధేయ పడుతున్నాడు. సిస్టర్ నన్ను చూసి "ఏంటి మేడం ..బాగున్నారా "అంది ఆయన్ను వినిపించుకోకుండా. నేను తల ఊపి ఆయన్ను చూసి "బాగున్నారా...మీరీమధ్య కనపడ్డం లేదు ...ఇక్కడున్నారేంటి?"అన్నాను ."బాగున్నానమ్మా...పార్కులో వాకింగ్ కి వస్తావు కదూ! నా భార్యకు బాగా లేక ఇక్కడ అడ్మిట్ చేసాము . " అన్నారు. "పదండి నేను కూడా చూస్తాను ...సిస్టర్ ... వెళ్ళ వచ్చా? " అడిగాను . " సరే మేడం, పేషంటుకు రోజూ ఈయనే టిఫిన్, అన్నం తినిపించాలంటారు ,డాక్టర్ ఎవర్ని పోనీయకండి  అంటారు అందుకని ...." సిస్టర్  సంజాయిషీ గా   అనడం తో, ఇద్దరం కదిలాం." ఏమయ్యింది మీ మిసెస్ కి ?" అన్నా . "ఆమె కు టై ఫోయిడ్  వచ్చిందమ్మా" అతని వదనం లో రుషి లో వుండే దివ్యతేజస్సు,మహా జ్ఞానిలో వుండే  మేధస్సు  నాకు కనిపించాయి . అతని  కళ్ళలో తాత్వికత  నిండిన చురుకుదనం కూడా వుంది..   " మీరు లేక పోతే టిఫిన్ తినరా...? " అన్నాను  "అదేం లేదు...ఆమె నన్ను గుర్తు పట్టదు...ఆమె కు అల్జీమర్స్ వ్యాధి  వచ్చింది ....అయిదేళ్లుగా ఆమెకు నేనెవరో తెలియదు ."  నాకు నోట మాట రాలేదు కాసేపు ." మరి... మరి .. మీరెవరో గుర్తించలేని వ్యక్తికి మీరే వచ్చి ఎందుకు తినిపించాలి ? సిస్టర్ తినిపిస్తారు కదా! ఎలాగూ ఆమెకు మీరు తెలియదు, ఆమెకు ఎవరు తినిపించినా ఒకటే కదా !"అన్నాను. "నిజమే అమ్మా ఆమెకు నేను తెలియదు ..కానీ ఆమె ఎవరో నాకుతెలుసు ...ఆమె నా భార్యకదా !"   ఒక్క నిముషం నాకు ఆయన మాటలు అర్థం కాలేదు .కానీ నెమ్మదిగా అర్థం కాసాగినై.. .హృదయంలో అదోకరకమైన వుద్యేగం ,బాధ ,విస్మయం,వివరించలేని నొప్పి కలిగినాయి. అప్రయత్నంగా నా కళ్ళలో తిరిగిన కన్నీటిని అతి కష్టమ్మీద అదుపు చేసుకున్నా .ఇలాంటి మహోన్నతమైన ప్రేమికుడ్నిపొందిన ఆమెను చూస్తూ వుండిపోయా.



1 comment:

  1. aunty me story pina comment chese antha pedha vadini kanuu kani!! challa bavunnai aunty!! asalu మేలుకొలుపు and ప్రేమికుడు naku chala nachai, koncham dagara ga anni pinchai :) meruu ellane konasagalli anni korukuntuna

    ReplyDelete