Wednesday, 26 September 2012

చీకటి

   (Published  in Vishaalakshi,Feb, 2012)               


"అన్నా కాలికి దెబ్బ తగిలింది,రాయి కొట్టుకుంది...." ఎనిమిదేళ్ళ చిన్నా, చిల్లర కొట్టు రాజు దగ్గరకు వచ్చి ఆగాడు.
రాజు వెంటనే "అమ్మా... చిన్నా కేమో కాలికి దెబ్బతగిలిందంట చూడు " అన్నాడు . 
"అరె ..గోరు ఊడి వచ్చేట్టు  వుందే..అబ్బోరక్తం చాలా కారుతోంది ..వుండు కాస్త కాఫీ పొడి వేసి కట్టు కడతాను " అని లోపలికి పరిగెత్తింది . 
"వాడ్ని బెదర గొట్టకు, కాఫీ పొడి అలాంటివి వేయకమ్మా! గాయం కడిగి మందుల డబ్బా లో వున్న పొడి వెయ్యి ." అని,  " చిన్నగాయమే లేరా చిన్నా! తగ్గి పోతుందిలే,  అయినా రాత్రయింది కదరా ఎక్కడికెళ్ళావు?" అన్నాడు  రాజు. 
"వాళ్ళ నాన్నకు రాత్రి డ్యూటి కదా! అన్నం తీసుకుని పోయి నట్టుంది...వీధి లైటు వెలగక నాల్గు రోజు లయింది. చీకట్లో ఏ రాయో తగిలినట్లుంది,పద నేను ఇంటికాడ వదుల్తా "అంటూ వాడికాలికి మందు వేసి కట్టుకట్టి ఇంటి దగ్గర వదిలి వచ్చింది రాజు వాళ్ళమ్మ.


ఆ రోజూ మొదలుకుని  వీధిలో వున్న ఒక్కగానొక్క కరెంటు దీపం వెలగక చీకట్లో పడుతున్న ఇబ్బందులు రాజు తో ఎవరో ఒకరు వెల్లబోసు కుంటున్నారు. ప్రొద్దున్నేన్యూస్ పేపర్ కోసం వచ్చిన గోపి సార్ ను అడిగాడు రాజు  "సార్ మన వీధి లైటు  వెలగడం లేదు కదా ...మీరు కరేంటోళ్ళకు కాస్త చెప్పండి." 
"నేను స్కూల్ పోయే టప్పటికి ఆఫీసు తెరిచి వుండరు, వచ్చేప్పటికిఆఫీసు మూసి వుంటారు..ఫోన్ నెంబర్ తెలీదు, చేసినా పట్టించుకోరు రాజూ"  అన్నాడు .
తర్వాత రాజు చాలా మందికి చెప్పి చూసాడు .అందరూ ఏదో ఒక కారణం చెప్పడం తప్ప, ఎవరూ  కంప్లైంటు ఇవ్వలేదు.అయితే అందరూ లైటు వెలగక ఇబ్బంది పడుతూనే వున్నారు.

రాజు కరెంటు ఆఫీసు నంబరు తెలుకుని ఫోన్ చేసాడు. పదిసార్లు చేస్తే కూడా ఆ ఫోన్ ఎవరు ఎత్తలేదు .పదకొండోసారికి నిద్రమత్తు తో వున్న ఓ గొంతు పలికింది తీక్షణంగా  "ఏం గావాల ?" అంటూ . 
"నెహ్రు నగర్ మూడో వీధిలో లైట్ వెలగడం లేదు, పది రోజులయింది సార్ చాలా ఇబ్బంది గా వుందిసార్...."  ఇంకా రాజు ఏదో చెప్పే లోగానే
"వీధి లైట్లు మా పని కాదు మున్సిపాలిటి వాళ్ళని అడుగు .." అని ఫోన్ పెట్టేసాడు, మున్సిపాలిటి వాళ్ళ నంబర్ కావాలి అని రాజు అడగ బోయే లోగానే. 
 రాజుకు తమ వీధి కార్పొరేటర్ గుర్తొచ్చాడు ..వినాయక చవితికి చందా అడగడానికి చాలా మందిని వెంటేసుకుని వచ్చాడు....చందా ఇవ్వను అన్న రాజును. . నాస్తికుడివా ఇంకా నానా మాటలు అని వాళ్ళ అమ్మతో నూట పదార్లు చందా తీసు కెళ్ళాడు. కార్పొరేటర్  నంబర్ కూడా ఎలాగోలా సంపాదించి ఫోన్ చేసాడు .వాళ్ళ భార్య ఫోనేత్తింది ఆయన హైద్రాబాద్ పోయాడు , ఎప్పుడొస్తాడో  తెలీదoది .

 పట్టుదల వదలని విక్రమార్కుడిలా ,మున్సిపాలిటి వాళ్లకు సంబంధం అన్నాడు కదాని ఎలాగోలా మున్సిపాలిటి వాళ్ళ నంబరు కనుక్కుని ఫోన్ చేసాడు .ఎన్నోసార్లు చేసి చేసి విసిగి పోయాక ఎవరో మహాను భావుడు కాల్ సెంటర్ కి చేయమని నంబర్ ఇచ్చాడు .అది కంప్లైంటు రికార్డు చేసుకుంటుంది తర్వాత వాళ్ళు వచ్చి రిపేరు చేస్తారు అని చెప్పడం తో కాల్ సెంటరు కు చాలాసార్లు ఫోన్ చేసాడు అది పలకనే లేదు .రాజుకు విసుగొచ్చింది అయినా ఎవరికి చేయాలో ఎలా కనుక్కోవాలో ఆలోచిస్తూనే వున్నాడు  .

రాజుకు రాత్రి అన్నం తింటుండగా ఏవో కేకలు వినపడ్డాయి ...రాజు వాళ్ళమ్మ బయటికి వెళ్లి వచ్చింది ."ఏమయ్యిoదమ్మా "అన్నాడు .
"మన వీధి చివర రామయ్య కూతురు రాధ అదే నరసమ్మ లేదూ ఆ పిల్ల హాస్పిటల్ నుండి వస్తుంటే చీకట్లో ఆకతాయి వెధవలు వెంటపడి అల్లరి చేసారంట ..ఆ పిల్ల భయపడి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అన్నకు,  నాన్నకు చెప్పిందంట, వాళ్ళ ను చూసి వెధవలు పారిపోయారంట..కలికాలం గాకపోతే చదువుకున్నోళ్ళు, బుద్ధిగా వుద్యోగం చేసే పిల్లను అల్లరి చేయడమేంటి ?"గొణుక్కుంటూ రాజు తిన్న పళ్ళెం కడగడానికి పోయింది.
రాజు ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా వీధిలైటు వెలగాలి అంతేకాదు మరో రెండు లైట్లు ఈ వీధికి రావాలి.  కొట్టులో కూర్చుని మళ్ళి ఒకసారి కాల్ సెంటర్ కు ఫోన్ చేసాడు ..వుహూ అదేం పలకలేదు.రికార్డు చేసుకుందో  లేదో అర్థం కాలేదు.  ఎలాగో ఓ స్నేహితుడి సహాయం తో టెలిఫోన్  డైరెక్టరి నుండి  మున్సిపల్ ఆఫీసు ఫోన్ నంబర్లన్నీ రాసుకున్నాడు.అసిస్టంట్ ఇంజనీరుకు ఫోన్ చేసాడు ,కాల్ సెంటర్ కు చేయమని ఉచిత సలహా ఇచ్చి ఫోన్ పెట్టేసాడు రాజు చెప్పేది వినకుండా. మళ్ళిఅసిస్టంట్ ఇంజనీర్ కే  చేసి, దానికెన్నిసార్లు చేసినా ఫలితం లేదని ,వీధివాళ్ళు పడుతున్న ఇబ్బంది చెప్పబోతుంటే " ఆపవయ్యా మీ వీధి  అడ్రస్ చెప్పు" అన్నాడు 
 అడ్రెసు చెప్పి "తొందరగా రిపేరు చేయండి సార్.."అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు .
"ఆ చేస్తాం ..చేస్తాం మాకు నీ వీధి ఒక్కటే కాదు బాబు  ..బోలెడు వీధులున్నాయి..బోలెడు కంప్లైంట్లు వున్నాయి" అని విసుగ్గా ఫోన్ పెట్టాశాడు . 
రాజుకు మనస్సు చివుక్కు మంది. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏమిచేస్తారులే ..ఎన్నో పిర్యాదులు విసిగి పోయి ఉంటారనుకున్నాడు.

తర్వాత మూడు రోజులు గడిచాయి. వీధిలో ఒక ముసలాయన చీకట్లో కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. దేవుడి దయవల్ల కాళ్ళు చేతులు విరగ
లేదని వాళ్ళు అనుకుంటుంటే "ఆ దయగల దేవుడు కింద ఎందుకు పడేశాడు?"అన్నాడు కోపమొచ్చి . "నోరుముయ్యి.... దేవుడి గురించి అలామాట్లడకురా..కళ్ళు పోతాయి " అని, నోరు జారి అన్నమాటకు, కన్నీళ్ళు పెట్టుకుని... వస్తున్న దుక్ఖాన్ని రాజు గ్రహించకూడదని లోపలి వెళ్ళింది రాజు వాళ్ళమ్మ .

మళ్ళి అసిస్టంట్  ఇంజనీరుకు ఫోన్ చేసాడు," లైన్ మాన్ వస్తాడు.అంత తొందరైతే ఎట్లాగయ్యా."అన్నాడు .మళ్ళి రెండు రోజులు గడిచాయి ...సాయంత్రం అలా,ఇలా వెళ్ళే పిల్లలు, పెద్దలు, రాజు కొట్టులో కొనే పని వున్నా లేకున్నా పలకరించే వాళ్ళు. ఇప్పుడు చీకటి పడ్డాక ఎవరూ బయటకు రావడం లేదు. వెన్నెల రాత్రుల్లోమాత్రం పిల్లలు ఆడుకుంటున్నారు కానీ ఇంకే సందడి లేదు. వూరి చివర కాబట్టి వాహనాల సందడి కూడా లేదు. డివిజనల్ ఇంజనీర్ నంబర్ కు ఫోన్ చేసాడు ..   అటెండర్ ఫోన్ తీసాడు.సర్ ఇంకా రాలేదన్నాడు. 
"ఎప్పుడొస్తాడు?"  
"ఏమో వస్తే వస్తాడు, లేక పోతే రాడు ఇంతకి నువ్వు ఎవరయ్యా ? సార్ సెల్లు నంబరు లేదా?"అన్నాడు విసుగ్గా.  
"లేదు ఇస్తావా ..మా వీధిలో లైటు వెలగడం లేదు ఎవరికీ ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు."ఆత్రంగా అన్నాడు రాజు.
"ఇంకా నయం... ఫోన్ పెట్టేయ్ ... సెల్లు నంబరు తీసుకుని కంప్లైంటు చేస్తాడంట" గొణుక్కుంటూ ఫోన్ పెట్టాడు.

మళ్ళీ మధ్యాహ్నం డివిజనల్ ఇంజనీర్ కు ఫోన్ చేసాడు,మళ్లీ  అటెండర్ ఫోన్ తీసాడు, రాజు ఫోన్ పెట్టేసాడు. సాయంత్రం చేసాడు, మళ్ళీ అటెండర్ .. మరుసటి రోజూ కాల్ సెంటర్ కు, అసిస్టంట్ ఇంజనీర్ కు , డివిజనల్ ఇంజనీర్ కు ఫోన్ చేసాడు.ఎవరి దగ్గరి  నుండి బాధ్యత గా సమాధానం రాలేదు. రాజుకు దుక్ఖం వచ్చింది. తను చేసిన యుద్ధం లో ఘోర పరాజయం పొందిన సైనికుడిలా వాపోయాడు . వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూసి తల్లడిల్లిన తల్లి మనసుకు ఏమీ అర్థం కాలేదు. తన తోటి వారంతా చదువు కుంటుంటే పేదరికం కారణంగా, తండ్రి లేని కారణంగా చిల్లర కొట్టుకే పరిమితమైనందుకు ఏడుస్తున్నాడో లేక  దేనికో అర్థం కాక , ఏమీ చెప్పి ఓదార్చాలో తెలియక రాజు తల నిమురుతూ ఉండిపోయింది .కాసేపటికి కన్నీళ్ళు తుడుచుకుని "అమ్మా నేను గోపి సార్ ఇంటికి వెళ్లొస్తాను, నువ్వు కొట్టులో వుండు." అని  బయలు దేరాడు. బయటి నుంచే రాజును చూసిన గోపి సంతోషంగా ఆహ్వానించాడు. రాజు చెప్పినట్లు  మున్సిపల్ కమీషనర్ కు ఇంగ్లీషులో  వుత్తరం రాసి దాన్నిపోస్ట్ చేస్తానని తీసుకున్నాడు.రాజు హృదయం కొంత తేలికయిoది. తాను చివరి ప్రయత్నం చేసాడు.ఫలితం ఏదైనా తానిక విచారించకూడదు అనుకున్నాడు. దాని సంగతి మర్చిపోయాడు.

మధ్యాహ్నం నిద్ర లో వుండగా రాజును తట్టి లేపింది వాళ్ళమ్మ ".రాజూ... మన వీధి లైటు వెలుగు తొందిరా  ఎవరో వచ్చి రిపేరు చేసారు " అంది. "అవునా! నిజమా అమ్మా!" ఆనందంగా లేచి రాబోతూ..క్రింద పడబోతున్న రాజు కు తన చేతిని ఆసరాగా ఇచ్చి బయటికి తీసుకు వచ్చింది, పది రోజులు గా రాజు కొట్టులో వున్నఫోన్ నుండి కరెంటు,మున్సిపాలిటీ ఉద్యోగుల తో చేస్తున్నఒంటరి పోరాటం చూస్తూనే వుంది. మరి ఏ ఉద్యోగికి కరుణ కలిగి స్పందించాడో... ఆమెకు దుక్ఖం ఆగలేదు ... "నీవు చూడలేని వెలుతురు గురించి నీకెందుకురా తాపత్రయం ?"  కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగా అంది తల్లి . " చీకటి ఎంత దుర్భరమో ...గుడ్డి వాడికంటే ఎవరికి బాగా తెలుసమ్మా? నాకు శాశ్వతమైన చీకటి, ఎవరికీ కాసేపు వుండడం కూడా నాకిష్టం లేదమ్మా.... "  కనిపించని రాజు కళ్ళలో మెరుపు.  "నా బంగారు తండ్రి ...లోకం చూడలేని నీకే లోకం గురించి యింత బాధ వుందే, కళ్ళున్న గుడ్డి వాళ్లురా బాధ్యత లేని  ఈ జనమంతా...   " రాజు బుగ్గల్ని ప్రేమగానిమురుతూ అంది అతని తల్లి.
                                                    

No comments:

Post a Comment