Wednesday, 26 September 2012

జీవిత ప్రయాణం


(Published in Andhra Pradesh Pathrika Feb, 2011) 

గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్  "వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యుడ్" చదువుతున్నానన్న మాటే గాని   కళ్ళు గేటు ప్రక్కకి ,మనసంతా వస్తానన్న వసంత దగ్గరకి వెళుతున్నాయి .ఎంతో మంది మంచి స్నేహితుల్ని, అదీ ఏ కష్టం వచ్చినా  ఆదుకునేందుకు సిద్దపడే స్నేహితుల్ని సంపాదించుకోవడం నా  అదృష్టం.  అందరూ ఎక్కడెక్కడో వున్నా, దగ్గరలో వున్నది  వసంత మాత్రమే. ముప్పై ఏళ్లుగా చెక్కు చెదరని స్నేహం మాది. మొన్న నేను అమెరికా నుండి వస్తున్నపుడు  ఎయిర్ పోర్ట్  దగ్గరికి బసంతి,  సత్తార్, నయీం వచ్చారు . చెప్పకనే నా గుండెలో భావాల్ని చదవ గలిగిన ప్రాణి సత్తార్. చిన్ననాటినుండి  నా ఆనందానికి, వేదనకు  హేతువులేమిటో అతనికి తెలుసు . ఇవన్ని భరించక తప్పదు అన్న భావాన్ని అతని కళ్ళలో చదివి మౌనంగా వుండిపోయా. 
"వెల్కం  లైఫ్  అస్ ఇట్ కంస్" అంది బసంతి ఎప్పటిలాగే.
అమెరికాలో వుండ లేక వచేస్తానన్నపుడు ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు .ఆ యాంత్రిక జీవనం లో నేను వుండ లేననిఅందరి కి తెలుసు. వసంత 'నచ్చక పోతే ఎందుకు, వచ్చేయ్ మనం ఇక్కడే ప్రశాంతంగా ఉండచ్చు' అనేది ఫోన్ చేసినప్పుదంతా  .

"ఏయ్.. "వసంత ఎదురు గా నుంచుంది, గలగలా నవ్వుతూ, నే వులికిపడ్డా .ఎంత హాయిగా నవ్వుతుందో .
"బాగున్నావు కదా?"  నా బుగ్గల్ని తాకుతూ అంది .
"అహా బాగున్నా"  
"ఏంటి చిక్కి పోయావు? నీళ్ళు వంట లేదా " 
"నీళ్ళెం చేసాయి పాపం! " 
"మరి ఎందుకు? " నవ్విoది 
  "విభాకర్ ఏడి?"అన్నా .
" నీకు పనస తొనలు కొంటున్నాడు వీధి చివర, నే వచ్చేసా ఉండలేక, ఎంతో కాలమైనట్లుగా వుంది నిన్ను చూడక. " 
 "ఏమ్మా పిల్లలు బాగున్నారా?"విభాకర్ పనసతోనలు అందిస్తూ అన్నాడు.తల వూపాను."నేను సాయంత్రం వస్తాను  వసంతా, వెల్లోస్తానమ్మా  " విభాకర్ వెళ్ళిపోయాడు.ఇద్దరం గది లో కూర్చున్నాము. వసంతకి తెచ్చిన డిజిటల్ కెమెరా,విభాకర్ కి ,రఘు ,కిరణ్ లకు తెచ్చిన సెల్ ఫోన్స్ ఇచ్చా ,
"ఎందుకివన్ని?"
 'వద్దా"
 "నాకోసం తెచ్చావుగా.... చాలా బావున్నాయి " సంతోషం నిండిన ఆ వదనం చూస్తే నాకు చాలా బావుంటుంది అలాగే  చూస్తూ ఉండాలనిపిస్తుంది .ఒకరకమైన ప్రశాంతత ను వెదజల్లే మహిమ వుంది,ఆమె దగ్గర. వసంత కబుర్లు చెబుతోంది  నేను వింటున్నాను .కానీ తనేమి చెబుతుందో  గ్రహించ లేక పోతున్నాను .ఎక్కడికి పోతోంది మనుసు?సుదూర తీరాల వెంట,అది పరిగెత్తనూ, నేను పట్టుకు రానూ,ఇదేజరుగుతూ వుంటుంది .
"అమెరికా ఎలావుంటుంది చెప్పు ?"అంది వసంత . 
"అంటే "అన్నా ,
"భూతల స్వర్గం అంటారు కదా ! "
"భూతాల స్వర్గం"అని నవ్వా ,ఇంక పడిపడి  నవ్వడం,తనని చూసి నేను నవ్వడం ,అబ్బ ఎంత కాలాని కి ఇలా నవ్వుతున్నానో ...వసంతనే వంట చేసింది నేను సహాయం చేశా ,ఇద్దరం కలసి భోంచేసాక తోట లోకి వచ్చాం. మొక్కల బాగోగుల గురించి మాట్లాడింది ,ఈ ఆరు నెలల్లో చచ్చిపోయిన మొక్కల గురించి ,కొత్తగా  వేసిన  బంతి పూల గురించి, నా కిష్టమైన గులాబీలను ఎలా కాపాడిందో,మాలి ఊరికి వెళ్ళినపుడు నీళ్ళు పెట్టక ఎర్రగులాబి చచ్చిపోయినట్లయి మళ్ళి ఎలా బ్రతికిందో ఒకవేళ అది చచ్చిపోయి వుంటే తనెంత బాధపడి ఉండేదో...  విభాకర్ స్నేహితుడి ఇంటికి కి వెళ్ళినపుడు ఓ క్రొత్త క్రోటన్ మొక్క కనపడితే దాన్ని అడిగి తెచ్చినందుకు విభాకర్ ఎలా తిట్టాడో ,అన్నీ చెబుతోంది  వింటూ వున్నాను సాయంత్రం వరకి ....అంతగా.. ప్రవాహం లా..  అలసి పోకుండా ఎలా  మాట్లాడ గలదో.. నేనుందుకు నోరు తెరవ లేనో నాకర్థం కాదు...వినేందుకు ఎవరూ లేనపుడు మాటలెలా వస్తాయి? నా ప్రియతం  తో గంటలు గంటలు కబుర్లు చెప్పుకున్న ఆ రోజులుల్ని తలుచుకున్నా.

"ఆ రోజుల్ని తలుచు కున్నపు డల్లా
ఆనంద లాంటి విచారం కల్గుతుంది ,
ప్రతి ఒక్క నిముషం ఒక్కక్క ఒమర్ ఖయ్యాం
రుబాయత్ పద్యాల వంటి రోజులవి ఏవీ ప్రియతం
చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని?  
భావకవి తిలక్ "ఆ రోజులు "  గేయం గుర్తొచ్చింది ,ఎవరు హరించారు మరి  నా పెన్నిధిని ?
 "ఏమిటమ్మా ఎక్కడికి వెళ్లావు?.....తేరి ఖయాల్లోమ్మే ల్ హం..."వసంత కూని రాగానికి  ఈ లోకం లోకి వచ్చా ...వసంత కాఫీ కలుపుకుంది, విభాకర్ వస్తున్నట్లు ఫోన్ చేయగానే ..అతను రాగానే వెళ్ళబోతూ , మళ్లీ బోలెడు జాగ్రత్తలు చెప్పింది తోట గురించి,ఆరోగ్యం గురించి ,దొంగల గురించి ,ఇంక ఏవేవో చెబుతూనే వుంది విభాకర్ నవ్వుతూ ఉండిపోయాడు.
"ఉగాది కి వస్తున్నవుగా"  అంది 
"ఇది ఎన్నో ఆహ్వానం ?" అన్నా. నవ్వింది కనిపించే వరకి చేయి ఊపుతూనే  వుంది కనుమరుగు అయ్యేవరకు. ఇంట్లోకి రాగానే శూన్యంగా అన్పించింది. వసంత వసంతంలా వస్తుంది ఆమె వెళ్ళగానే గ్రీష్మం లా అనిపిస్తుంది .

ఉగాది న తెల్లవారుఝామునే  వసంత ఫోనులో పండగ శుభాకాంక్షలు తెలుపుతూ తొందరగా బయలు దేరమని ఆజ్ఞాపించింది,నే వెళ్ళే టప్పటికి  ముంగిట్లో ముగ్గులు ,మామిడి తోరణాల తో ఇల్లు కళకళ  లాడుతోంది  .విభాకర్ పట్టు పంచె ,వసంత పట్టు చీర లో, కిరణ్, రఘు కొత్త బట్టల్లో  పండుగ వాతావరణానికి నిండుతనాన్ని ఇచ్చారు .వాళ్ళని చూడ గానే నా కొడుకులిద్దరూ గుర్తొచ్చి నా కళ్ళలో తెలియకుండానే తిరిగిన కన్నీటి పొరని మరు క్షణం లోనే చిరు నవ్వు తెర క్రిందికి దించేశాను.
కొత్త చీరె తెచ్చి  "ఇది కట్టుకో, బ్లౌస్ కూడా కుట్టించా,తేలిగ్గా వుంది చూడు "అంది. వసంత మాట మీరడం నాకు చాతకాదు.మార్చుకునివచ్చాక
 "ఎంత బాగుందో  నీకీచీర.. కాదు.. కాదు..ఈ చీరేకే నువ్వు అందాన్ని ఇచ్చావు ,ఏమండీ.. చాలా  బావుంది కదూ..ఏరా కిరణ్ ,నువ్వు చెప్పు రఘూ...."వసంత మాటలకి విభాకర్ సిగ్గుపడుతూ తల ఊపాడు ..     "రియల్లీగ్రేట్ ఆంటీ"పిల్లలిద్దరూ వసంతకేమి తీసిపోరు మాటల్లో .
"అన్నిటికి నవ్వేనా ఆంటీ, మీరు ఎప్పుడు వినేందుకు అలవాటు పడ్డట్టుంది మా అమ్మ మీకు ఛాన్స్ ఇవ్వక "అన్నాడు కిరణ్ .
"చూసావా దీనికి కూడా మళ్ళీ నవ్వే"రఘు మాటలకి అందరం నవ్వేశాం .
వసంత వంట చేస్తూ నాతో కబుర్లు చెబుతోంది .కిరణ్, రఘు వాళ్ళమ్మ చుట్టూ  తిరుగుతూ ఆపని ఈ పని చేస్తున్నారు ,విభాకర్ కూడా అపుడపుడు వచ్చి పోతున్నాడు . వసంత జీవితం లోని ఆనందాన్ని చూసి  నాకు సంతోషం కలిగింది.వసంత  పెద్దగా  చదువుకోలేదు, నా పరిచయం అయాక ఇంటర్ ,డిగ్రీ చేసింది ,విభాకర్ కి కూడా చిన్న ఉద్యోగమే .పిల్లలు బాగా చదువుతున్నా,దూరంగా వెళ్ళకుండా ఉన్న ఊర్లోనే చదువు కున్నారు ,ఇక్కడే ఉద్యోగాలు చూసుకున్నారు ,ఇద్దరూ అమ్మ నాన్నల్ని చూసు కోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు .కిరణ్, రఘు, నా కొడుకుల్లాగా సూపర్ ఇంటేలిజెంత్స్  కాలేదని వసంత ఎప్పుడూ బాధపడేది కాదు.వాళ్లలా ఐ. ఐ. టి, ఐ. ఐ. ఏం చదవ లేకపోయారని ఒత్తిడి తెచ్చేది కాదు.
"నీకు దేవుడు చేసిన అన్యాయానికి నీ పిల్లలకు మంచి చదువునిచ్చి తప్పు దిద్దుకున్నాడు"అనేది. 
"BUT IT IS POOR  COMPENSATION "అనేవాడు  సత్తార్. 
ఉజ్వలంగా  ఎదుగుతున్న కొడుకుల్ని చూసి నా భాద్యతని సక్రమంగా నెరవేర్చినాననేతృప్తి కలిగేది,  కాని BIGGER ARE THE CHILDREN BIGGER ARE THE PROBLEMS ,అని అప్పుడు తెలియలా!ఆందరూ నా అదృష్టాన్ని కీర్తించిన వారే ,నా కష్టం ,నా కృషిని అభినందించిన వారే ...అయితే  AS  THEY  GROW ,THEY GO FARTHER అని ఇప్పుడు తెలుస్తోంది .ఏమి మిగిలింది నాకు? కొడుకులు ఎంత గొప్ప స్తితిలో వున్నా తల్లికి కావలసింది వాళ్ళు తన కళ్ళ ముందు వుండటం .
ఇక్కడికి వచ్చేయమని అడిగి నపుడు "అక్కడేమి ఉండమ్మా?"అన్నారిద్దరూ.
"అమ్మ వుంది "అని చెప్పడానికి  నాకు నోరు పెగల్లేదు .చదువు చెప్పడానికి తప్ప  నేనింక నోరు విప్పి మాట్లాడడం మానేసాను ,ఎవరికీ ఎవరు ?జీవితం చివరి వరకు నడుస్తా డనుకున్నా ప్రియతమ  జీవిత భాగస్వామి ఏడేళ్ళ కే  అంతర్ధాన మయ్యాడు .నా అందాన్ని ,ఐశ్వర్యాన్నిఆశించడం తప్ప, నా ఆశయాల్నినా భావుకత్వాన్ని ,నా అంతరంగాన్ని  అర్థం చేసుకోలేని వారికి  నేను చేరువ కాలేక పోయాను. ,ప్రపంచం చూపిస్తారను కున్న ప్రియ పుత్రులు వాళ్ళ ప్రపంచం వెతుక్కుంటూ ఆవలి ప్రపంచం మీద పడ్డారు .మిగిలింది నాకు నేను ,స్నేహధర్మం మరువని  నిష్కల్మషమైన  స్నేహితులు ,సమాంతర రేఖలా  నను కలవ కుండా, నాకు దూరంగా నాకోసమే బ్రతుకుతున్నాననే" అతను" !                               
   

No comments:

Post a Comment