Wednesday, 26 September 2012

మేలుకొలుపు


Published in Andhra Jyothi Sunday, 5th August 2012)

గేటు శబ్దమయితే తలత్రిప్పి చూశా ! రుమ , చరిత, చరణ్. యింత ఉదయమే ..ఒహ్హో రుమ పెళ్లి గురించి చర్చలు  కాబోలు .."రండి".. చదువుతున్న హిందూ పేపర్ మడిచి పెట్టి అన్నాను . "ఎంత హాయిగా కూర్చున్నావురా.. నీ చల్లటి తోటలో ! ..అదృష్టవంతుడివి..! ఎంత ఆహ్లాదకరంగా వుంది వాతావరణం ! అవునూ... మాకు  దూరంగా ఎందుకు ఇంతదూరం కట్టుకున్నావురా ఇల్లు? ఈ తోట కోసమేనా ?" చరణ్ నా తోటని పరికించి చూసి మెచ్చుకోలుగా అన్నాడు.
"అవును... ఏంటి శుభలేఖలు ఎప్పుడు తయారవుతాయి ?"అన్నాను. 
"రుమా.... నీవు పిన్నితో మాట్లాడుతూ వుండుపో" అని చరణ్ అనడంతో రుమ లోపలి వెళ్ళింది. "తోట చూద్దాం ..పద" అనడం తో చరిత కూడా మెల్లిగా లోపలి కి వెళ్ళింది. ఏదో తేడాగా అనిపించింది, ఇద్దరం తోట చూస్తూ మౌనంగా నడిచాము కాసేపు. చరణ్ ఏదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపించింది.. నాకు పెదనాన్న కొడుకైన చరణ్ నాకంటే పెద్దవాడైనా, మేం పేర్లు పెట్టుకునే పిల్చుకుంటాము,స్నేహితుల్లాగే కష్టం సుఖం పంచుకుంటాము. మా నాన్నగారు ఎప్పుడో తీసుకున్న పొలం టౌన్ కి దగ్గర కావడంతో నేను పొలం లోనే చిన్న ఇల్లు కట్టుకుని నా కిష్టమైన మొక్కల పెంపకమనే అభిమతాన్ని నెర వేర్చు కుంటున్నా!కానీ నా బాల్యం నుండి వున్నవీధిని, అదే వీధిలో వుండే నా బంధు వర్గాన్ని ముఖ్యంగా చరణ్ ని , వాడి కూతురు రుమా ని ఎక్కువ జ్ఞాపకం చేసుకుంటూ వుంటాను .రుమా మా అన్నదమ్ముల పిల్లల్లో ఒక్కతే ఆడపిల్ల ..అందుకే అందరికి ముద్దు, తెలివైంది ఎంతో సరదాగా ఉంటూ, అందర్నీతన మంచి గుణాలతో ఆకట్టుకుంటుంది. త్వరలో రుమ పెళ్లి, రాహుల్ మంచి యోగ్యుడైన అబ్బాయి అని అందరూ అనుకుని నిర్ణయించారు. నిశ్చితార్థం  ఘనంగా జరిగింది, పెళ్లి త్వరలోనే అనుకుంటున్నారు ...మరి ఈ సందర్భం లో ..ఏదో  సలహా కోసం వచ్చినట్లుంది చరణ్ .  
"రుమ పెళ్లి ఎప్పుడను కుంటున్నారు ?" అడిగాను .
"రుమ పెళ్లి చేసుకోను అంటోంది...కారణం చెప్పడం లేదు, ఆ అబ్బాయి కి కూడా చేసుకోను అని చెప్పేసింది, అతను రుమాను చాలా ప్రేమిస్తాడు, అతనికి కారణం చెప్ప లేదంట, మనిద్దరి అభిప్రాయాలు వేరు వేరు అన్నదట, ఎంగేజ్మెంట్ రింగ్, అతనిచ్చిన కొన్ని గిఫ్త్స్ కూడా ఇచ్చేసిందట, రుమ తో తల బొప్పికట్టింది ...రుమను ఇంక మార్చగలిగింది నువ్వొక్కడివే .."
"అదేంటి..ఇద్దరూ ఇష్టపడ్డారు, అప్పుడప్పుడు ఆ అబ్బాయి వస్తుంటాడు ..రుమ  ని కలుస్తుంటాడు అన్నావు కదా! "
"అవును, ఏదో మరి నాకు తెలియదు..రుమ ని పెళ్ళికి వప్పించాలి, వప్పిస్తానని మాట ఇవ్వు "
"చరణ్..నేను మాట ఇవ్వలేను ... ముందు తన ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఆలోచిద్దాం "
తోటలోని మొక్కల్ని చూసుకుంటూ కొద్దిసేపు ఇద్దరం ఆన్ని సంగతులు మర్చిపోయాం. అలా ఇలా తిరిగి ఇంట్లోకి వెళ్ళాం. చరిత, రుమ,నా భార్య అమల..పూరి చేస్తున్నారు. అందరం హాయిగా కబుర్లు చెప్పుకుంటూ టిఫిన్ చేస్తుండగా..."మీ బాబాయ్ తోట ఎంత బావుందో రుమా, చామంతులు ఎన్ని రంగులున్నాయో ..తెలుసా! నీవు అవి చూస్తూ మనింటికి రావేమో ! మీ బాబాయ్ తో వెళ్లి చూడు... ఎప్పుడో ఒక కొటేషన్ చదివాను ..అదేంటంటే... ఒక గంట సంతోషంగా ఉండడానికి మధువు సేవించు ,ఒక  రోజు సంతోషంగా ఉండడానికి మంచి భోజనం చెయ్యి, కొంతకాలం సంతోషంగా ఉండడానికి పెళ్లి చేసుకో, ఎప్పటికి సంతోషంగా ఉండడానికి తోట పెంచుకో అని ... నిజంగా నీ తోట చూసాక మనసంతా తేలిగ్గాను,శరీరం  ఉత్సాహంగాను వుంది.'అన్నాడు. చరణ్ అంతరంగం నాకు రుమకు ఇద్దరికీ అర్థమైంది,ఇద్దరినీ తోటలోకి వెళ్లి మాట్లాడమని అతని ఉద్దేశం . 
ఇద్దరం తోటలోకి నడిచాము.. మామూలుగా అయితే రుమ నాతో చాలా చనువుగా వుంటుంది కానీ  వాళ్ళ నాన్ననాకు  ఏదో చెప్పి ఉంటాడనే విషయం తెలిసి కాబోలు .. మౌనంగా వుండి పోయింది.
"చెప్పు రుమా పెళ్లి వద్దని అంటున్నావట ..కారణం ఏంటి ?"నేరుగా అడిగేశాను 
తలవంచుకుని మౌనంగా ఉండిపోయింది 
"అతనికి ఏవైనా చెడు అలవాట్లు ఉన్నాయా?"          
"వుహూ "
"మరి  ఏదైనా అఫైర్ లో వున్నట్టు తెలిసిందా "
"వుహూ "
"మరి "
మౌనం మాత్రమే  కాసేపు...తర్వాత  
"బాబాయి అతనితో నాకు పెళ్లి ఇష్టం లేదు ప్లీజ్ ...కారణాలే కావాలంటే నేను ఏవైనా చెప్పొచ్చు .కానీ అతనికి మీరు చెప్పే చెడు అలవాట్లు లేవు, కానీ అతనిలో నాకు నచ్చని గుణాలు చెబితే మీరు ఒప్పుకోరు ..."
"చెప్పి చూడు "
"అతన్నిపెళ్లి చేసుకోమని బలవంత పెట్టనంటే  చెబుతాను '
ఒక్క  నిముషం నేను ఆలోచనలో పడ్డాను ...వాగ్దానం చేసానంటే చిక్కుల్లో పడతాను ...తర్వాత చరణ్ కు రుమాకు ఇద్దరికీ ఇబ్బంది  కలిగిస్తానేమో! ఏమి చేయాలి? రుమా చదువుకున్నఅమ్మాయి, పైగా ఎంతో స్వేచ్చగా ఆలోచించే వాతావరణం లో పెరిగింది ..ఆమె నిర్ణయాలకు తల్లిదండ్రులు ఎప్పుడూ అడ్డురారు, అయితే పెళ్లి ఇంకో నెల వుండగా ఇలా నచ్చలేదు అనడం ఏంటి ? సంవత్సరం నుండి ఇద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని ..ఇదేంటి ? ఏమయితేనేం ? తను పెళ్లి చేసుకోను అని చెప్పాక ఇంక నేను నచ్చ చెప్పేదేముంది ..కనీసం తన ఆలోచన అయినా తెలుసుకోవాలి కదా...!    
"నీకిష్టం లేకుంటే ఎందుకు చేస్తాం తల్లి.. చెప్పు నీ సమస్య ఏంటో .."అన్నాను. 
"బాబాయ్...మామూలుగా అయితే ..ఏ అమ్మాయికైనా  రాహుల్ ఒక డ్రీం హస్బండ్ ..నేను కూడా అతన్ని ఇష్టపడ్డాను ..కానీ కానీ కొన్ని విషయాల్లో అతని ప్రవర్తన నేను భరించలేకపోతున్నా ...అతనికి నేనంటే చాలా ఇష్టం, కానీ నా అభిప్రాయాల్ని సిల్లి గా ఉంటాయని కొట్టివేస్తాడు ..నా పెట్ అనిమల్స్ ని అసహ్యించుకుంటాడు ..నా అక్వేరియం చూసి ఇందులో ఆనందం ఏముంది..చేపలు కూడా ఇష్టమా నీకు అంటాడు ,..మొన్న నా పుట్టినరోజని నాకు డైమండ్ రింగ్  కొన్నాడు, కానీ  అనాధ  శరణాలయం కు  వెళదామంటే, పుట్టిన రోజు ఆత్మీయులతో గడపాలి కానీ  అనాధలతో గడపడం ఏంటి  అన్నాడు? నీకు  తెలుసుకదా బాబాయ్ నాకు పుట్టిన రోజు చేసుకోవడమే ఇష్టం వుండదు కానీ అతను  తెలుసుకుని వచ్చాడు కదా అతన్ని నిరాశ పరచడం ఎందుకని అతనితో బయటికి వెళ్ళా ! అతని తత్వం వేరే బాబాయ్ ...చాలా స్వార్థపరుడు...  హోటల్ దగ్గర సర్వర్ పొరపాటు చేస్తే వాడ్ని కొట్టాడు . ఇతను పెట్టె హడావుడికి వాడికి చేయి వణికి గ్లాస్ లో పోయాల్సిన నీళ్ళని  ప్రక్కకు పోసాడు...అవి కాస్త  నా డ్రెస్ మీద పడ్డాయి అంతకు ముందు  కూల్ వాటర్ తేలేదని తిట్టాడు ..మళ్ళి కిన్లే కంపెని తేలేదని గొణిగాడు..." కాసేపు ఆగింది నా ప్రక్క చూసి, "ఫస్ట్ టైం కాబోయే భార్య ను ఇంప్రెస్స్  చేద్దామని ఎక్కువ ఎక్సైట్  అయాడేమో అనుకున్నా ..కానీ నాకు అలా అనిపించలేదు ...వచ్చేప్పుడు దారిలో ఒక ముసలాయన  వడ దెబ్బ కొట్టి పడిపోయాడు...ఎవరో దారిన పోయే వాళ్ళే  కారు ఆపి అడిగారు హాస్పిటల్ కి తీసి కెళ్ల మని, వాళ్ళతో గొడవేసుకున్నాడు.."బుద్దిలేదా కారు నాపడానికి నేను తీసికెల్లను..ఏ ఆటోనో వస్తే తీసి కెల్లండి ఆన్నాడు  ..నేను కల్పించుకోబోతే నీకు తెలీదులే మనకు సినిమాకు టైం అవుతుంది పద అన్నాడు ... ముసలాయనకు సహాయం చేయడానికి వచ్చినతను మా ఇద్దర్ని చూసిన చూపును నేనిప్పటికీ మరచిపోలేకున్నా ...మేము అక్కడుండగానే ఇంకో కారు ఆపి విషయం అడిగి దగ్గరున్న నర్సింగ్ హోమ్ కు తీసి కెళ్ళారు ...ఇంటికొచ్చాక నేను అన్నయ్యను తీసుకుని నర్సింగ్ హోమ్  వెళ్లి చూసి అతనికి సారీ చెప్పి వచ్చాను.
పైగా తాను చేసింది కరెక్టని ..ఇలాంటి వాళ్ళ విషయాల్లో తలదూర్చకూడదని ...పాపం అని ఏదైనా సహాయం చేస్తే మెడకు చుట్టుకుంటుందని ..ఏదో లెక్చర్ ఇచ్చాడు ... అతనికి నా వ్యక్తిత్వం ..నా ఆలోచనలు ..అభిప్రాయాలు ఏవీ పట్టవు అతను ఏది చెబితే అది వినాలి, పోనీ మంచి విషయాలైతే వినొచ్చు ..పేదల పట్ల దయ చూపిస్తే తప్పు ..నిస్సహాయులకు సహాయం చేస్తే తప్పు ..సంగీతం సాహిత్యం చెత్త అట,  దానికి కేటాయించే సమయం కరీర్ కు ఇస్తే  ఏదైనా డెవెలప్మెంట్ వుంటుంది అంటాడు ...అతనితో జీవితం అంటే అతను పీల్చమన్నగాలి పీల్చాలి ..తినమన్న తిండి తినాలి .కట్టుకోమన్న బట్టలు కట్టుకోవాలి ..అతను చెప్పిన ప్రతి పని చేయాలి ..అతను చేసిన పనిని మెచ్చుకోవాలి .డబ్బు సంపాదించడం దాన్ని దాచుకోవడం తప్ప జీవితంలో ఇంకేది అతని దృష్టిలో విలువైనది లేదు ... నాకొద్దు బాబాయ్ ఆ రిజర్వ్ బాంకును నేను పెళ్లి చేసుకోను ...ఒకటి రెండు రోజుల్లోనే అతనంటే విరక్తి ..కోపం అసహ్యం కూడా కలుగుతున్నాయి. థాంక్ గాడ్ ..ఫార్చునేట్ గా నా బర్త్ డే  రావడం తో  ఈ మహానుభావుడి సంగతి తెలిసింది  ...హి ఇస్ అన్బేరబుల్ బాబాయ్ ..ప్లీజ్ సేవ్ మి ...ఇవన్ని చెబితే ...వీళ్ళకు సిల్లీగా వుంటాయి, పైకి  చాలా మేధావిగా కనిపించే ఈ ఐ అయిటియన్ తో జీవించడం కంటే ఈ పూల తోటలో మాలిగా జీవించడం మేలు బాబాయ్ .. నన్నారాతి మనిషికి కట్ట బెట్ట కండి  ..సాడిస్టు భర్తల్ని డివోర్స్ చేసుకుని  ఒంటరిగా అమ్మాయిలు ధైర్యంగా బ్రతుకుతున్నారు .ఎంగేజ్మెంట్ అయినందుకు పరువు పోతుందని ఆ హృదయం లేని  మనిషి తో నేను జీవితాన్ని ఊహించలేను బాబాయ్ ..." దీనంగా అన్నా , రుమా మాటల్లో స్థిరత్వాన్ని చూసి మురిసి పోయా ...నా వారసురాలు రుమా.
ఇరవై ఐదేళ్ళ క్రితం నేను పడ్డ  వేదనే  నాలో మెదిలింది.." రుమా.. నేను కూడా ఇదే నరకం అనుభవించా నా పెళ్లి విషయం లో ... ఒక స్కూల్ టీచర్ గా పనిచేసే ఓ అమ్మాయితో నా పెళ్లి నిశ్చయమైంది.అనుకోకుండా ఒక రోజు ఆమె పనిచేసే స్కూల్ కి వెళ్ళడం, తను చదువెలా చెబుతుందోనని ఆమె క్లాసు దగ్గర నిలబడ్డ నాకు, ఆమె పసిపిల్లల్ని దారుణంగా కొట్టే విధానం చూసి ఆదిరిపోయాను.స్త్రీ కి ఉండాల్సిన ప్రేమ ,కరుణ, ఓర్పు , దయాగుణం లేని ఆమె సౌందర్యం నాకు వద్దనిపించింది ..ఆ విషయం చెప్పి పెళ్లి వద్దంటే అందరూ నన్ను వింతమనిషిని చూసినట్లు చూసారు..ఎంతో విమర్శించారు. నాకు పెళ్లి వద్దన్నా వినిపించుకోలేదు ..చివరికి ఇంటినుంచి పారిపోయి ఆ పెళ్లి తప్పించుకున్నా ..మా నాన్న నాతో ఓ రెండేళ్లదాకా మాట్లాడలేదు కూడాను ..నీ సంగతి వేరేలే నేను మానేజ్ చేస్తాకదా! అసలు కారణం  చెప్పొద్దు..అసలు ఏ కారణం చెప్పొద్దు...చరణ్  కు  నేను చెబుతా కదా!"
"థాంక్ యు బాబాయ్ "ఉత్సాహంగా నా చేతిని పట్టుకుని ముద్దుపెట్టుకుంది . తలనిమిరి "బంగారు తల్లివి కదా నీవు సంతోషంగా వుండు "అన్నాను 
ఇద్దరం తోటంతా తిరిగాం ...రుమ తన వాజ్ లోకి పూలు తెంపుకుంది ..ఇద్దరం ఇంట్లోకి వచ్చాం. చరణ్ నా కళ్ళలోకి ఆశగా చూసాడు ..  
"చరణ్....  రుమాకు రాహుల్ తో పెళ్లి  నేను కూడా వద్దంటే కారణాలు చెప్పాల్నా ?"   
ఆశ్చర్యంగా చూసాడు...తర్వాత  లేదన్నట్లు తల ఊపాడు .
"పెళ్లి  వద్దనుకున్నామని వాళ్లకు చెప్పేయ్...నాకు తెలుసు అతనితో రుమ సంతోషంగా ఉండలేదు ...పరువుకోసం జీవితాల్ని బలిఇచ్చే అనాగరిక కాలం లేము ..అంత అజ్ఞానం లో కూడాలేము...రుమను ఈ విషయం లో నేను పూర్తిగా సమర్థిస్తున్నాను .."
చరణ్ ఏదో అనబోయి ..మళ్ళి "సరే రా ...నీవు చెప్పాక దాంట్లో ఇంక వేరే ఆలోచన చేయను ...రుమ   నీలాగే ఆలోచిస్తుంది,  నీకే తెలుసు రుమ మనసు..వాళ్లకు చెప్పేస్తాను.. పరువేంటి రా ..రుమ సంతోషమే ముఖ్యం నాకు .."చరణ్  కళ్ళలో తడి.       
రుమ  పరుగున వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్లి  చుట్టేసింది... చరణ్ కళ్ళల్లో తడి స్థానే పితృ ప్రేమ ,   ఇప్పుడు ..అతని మనసే ఒక పూల తోట లా గుభాలించింది.

కొడుకు

(Published in Vishalakshi Sep2012)


"ఇవాళ ఖచ్చితంగా మనకు విషయం తెలుస్తుంది " భార్య వదనం లోని దీనత్వానికి అతని మనసు చెదురు తుండగా అన్నాడు ఆనంద్.
అతనికేసి చూసి, కళ్ళలో తిరిగిన కన్నీటిని భర్త చూడకుండా తల వాల్చేసింది. కానీ అప్పటికే జారిన కన్నీరు ఆమె బుగ్గల పైకి పాకాయి. అతనికి గుండె పిండి నట్లైంది. పెళ్లినాటి ప్రమాణాలను ఆయన ఏనాడు మరువలేదు. రాధ పరిచయమయినప్పటి నుండి ఈనాటి వరకు ఆమెను ఎంతో ప్రేమగానే కాదు, ఎంతో గౌరవంగా కూడా చూసాడు. ఆమె అభిరుచుల్ని,ఇష్టాలని గౌరవించాడు, ఆమె తల్లి దండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని, తనవారిని ఆదరించినట్లే ఆదరించాడు. ఆమె కోరక ముందే ఆన్ని సమకూర్చాడు. ఒక మంచి స్నేహితురాలిగా మొదలైన ఆమె ఆగమనం అతని జీవితాన్ని పూలవనంలా చేసిందని అతనెప్పుడూ అనుకుంటాడు. దగ్గరయిన కొద్ది దూరమయే అనురాగం కాదు వారిది. ఆకర్షణతో మొదలైనా, వారి ప్రేమ, వివాహoతో మరింత అవగాహనతో, పటిష్టమైన బంధంగా మారింది. అతను ఆమె కిచ్చే ప్రాధాన్యతను చూసి  ప్రతి ఒక్కరు, రాధ అదృష్టాన్ని చూసి ఈర్ష్య పడే వారు. రాధ తన ప్రేమ దేవత అని తన జీవితం లో రాధ ప్రవేశమే ఒక గొప్పమలుపని అతను తన స్నేహితులతో అనేవాడు. రాధ తల్లి కాబోతుందని తెలిసినప్పుడు, అతను ఆనంద పడ్డం కంటే  ఆమె వేవిళ్ళకు కంగారు పడ్డాడు, ప్రసవం లో ఆమె కేమవుతుందో నని వేదన పడ్డాడు. ఒక బిడ్డ చాలని బిడ్డ పుట్టక ముందే రాధకు కూడా చెప్పకుండా ఆపరేషను చేయించుకున్నాడు. ఆన్నిరకాలుగా రాధను ఆనందపెట్టే విధంగాను, కలత పడకుండా చేయగలిగిన ఆనంద్ కుమార్ .. తన సాంత కొడుకు విషయంలో వచ్చిన, కష్టాన్ని పోగొట్ట లేకపోతున్నాడు.

ఆనంద్, రాధల కొడుకు సుజన్ ని అందరి తల్లి దండ్రులలాగే అపురూపంగా పెంచినా, గారాబం చేయలేదు. క్రమశిక్షణ తో పాటు చదువు, సంస్కారం కూడా అలవడే విధంగా వుండేది వాళ్ళ ఇంటి వాతావరణం. ఆనంద్ తల్లి దండ్రులు, చెల్లలు భాను, రాధ తల్లి దండ్రులు, రాధ అన్నయ్య రమేష్, చెల్లెలు గీత తరచు రావడం మూలాన అందరూ కలసి మెలసి వుండే వాళ్ళు. అందువలన సుజన్  సమిష్టి కుటుంబ వాతావరణం లో అసూయ, ద్వేషాలు, అబద్రత లేని బాల్యం తో ఆరోగ్యంగా పెరిగాడు, భాను పిల్లలు, రమేష్ పిల్లలు, గీత పిల్లలు అందరూ సెలవుల్లో ఎక్కడో ఒక చోట కలుస్తూ వుండటం వలన, ఒక్కడే కొడుకు అయినా సుజన్అన్నిటిని అందరితో పంచుకునే వాడు. చదువులో కూడా బాగా ముందుండే వాడు.

ఇంజనీరింగ్ అయిపోయాక ఎమ్మెస్ చేయడానికి అమెరికా వెళతాను అన్నప్పుడు రాధ వ్యతిరేకించింది, ఇండియాలో లేని చదువులా అని. కానీ ఆనంద్, "ఈ కాలం పిల్లలకు మనకు ఎంతో  తేడా వుంది ...వాళ్లకు నచ్చిన చోట, నచ్చిన చదువు, చదవనీ..ప్రపంచం చూడనీ, ఆన్ని బాషలు, సంస్కృతులు తెలుసుకోనీ, అప్పుడు కదా వాడికి మంచి చెడు తెలిసేది"అన్నాడు.
రాధ అయిష్టంగానే కొడుకును పంపింది.వెళ్ళాక రోజూ ఫోన్ చేస్తూ వుండటం వలన కొద్ది రోజుల్లోనే రాధ, ఆనంద్ లకు కొడుకు దూరంగా వెళ్ళాడనే  దిగులు పోయింది. సుజన్ పదినెలలు తర్వాత వచ్చి నెల పాటు వున్నాడు. ఆరోగ్యంగా పసిమి ఛాయ తో వున్న కొడుకును చూసి రాధ,అమెరికాలో సుజన్ ఇబ్బంది పడకుండా చక్కగా తాను కోరుకున్నచదువు, చదువు కుంటున్నందుకు సంతోష పడింది. అక్కడి వింతలు, విశేషాలు జీవన విధానాలు,స్నేహితుల కబుర్లు చెబుతూ వుంటే  ఆసక్తిగా విన్నది, అమెరికా వెళ్లి, సుజన్ పార్ట్ టైం వుద్యోగం చేసి సంపాదించిన డబ్బుతో రాధకు కొన్న ముత్యాల దండ చూసుకుని మురిసి పోయింది. రాధ సంతోషంగా వుండడం చూసి ఆనంద్ కూడా తేలిగా ఊపిరి పీల్చు కున్నాడు.

తర్వాత సుజన్ నుండి ఫోన్లు తక్కు వయాయి ...ప్రాజెక్ట్ వర్క్ తో బిజీ గా వున్నానని అనడంతో,సర్దుకున్నారు, ఏంటో తేడాగా వుందని, రాధ అన్నప్పుడు అదేమీ వుండదులే , చదువు, పరీక్షలు, ప్రాజెక్ట్, మళ్ళి పార్ట్ టైం వుద్యోగం ఇన్నిటి తో సమయం లేక, అమెరికా -ఇండియా టైమింగ్స్ కుదరక అని నచ్చ చెప్పినా, ఏదో అసంతృప్తి ఆనంద్ ని కూడా వేధించేది, చదువు అయిపోయాక వచ్చేస్తే కళ్ళ ముందు ఉంటాడు కదా ..ఎందుకు ఏవేవో ఆలోచనలు చేయడం అని సర్ది చెప్పుకున్నాడు. సుజన్ చదువు అవగానే వెంటనే వుద్యోగం దొరికింది అని ఇండియా కూడా రాలేదు. అక్కడ వుద్యోగం వద్దు వచ్చేయమని చెప్పిన తల్లి దండ్రులకు, మంచి కంపెని లో వచ్చిన వుద్యోగం వదులు కోవడం ఇష్టం లేక చేరాను, త్వరలో ఇండియాకు ట్రాన్స్ఫర్ చేయించు కుంటానని చెప్పి కొంతకాలం మభ్య పెట్టాడు. సుజన్ నెల కొక్కసారి ఫోన్ చేయడం, ...ఎందుకు ఫోన్ చేయడం లేదని గట్టిగా అడిగితే ఫోన్ పెట్టేయడం, వీళ్ళు ఫోన్ చేస్తే తీయ కుండా ఉండడంతో..ఆనంద్, రాధ తీవ్రమైన ఆవేదనకి గురయ్యారు. రాధ ఆనందం కోసం ఏ  కష్టమైనా ఎదుర్కునే ఆనంద్ ...చట్రం లో ని చెరుకు గడలా నలిగి పోయాడు. ఎప్పుడూ నవ్వుతూ అందరికి సంతోషాన్నిపంచే ఈ జంట నిరాశగా, నిర్వేదం తో వుండడం అందర్నీ విచారానికి గురిచేసింది. సుజన్ కారణంగా ఇలా అవుతున్నారని తెలిసినా ఎవరూ ధైర్యం చేసి అడగ లేక పోతున్నారు. సుజన్ స్నేహితులెవరి తోను కూడా మాట్లాడక పోవడం, సెల్ నంబర్ మార్చడం మరింత అనుమానాన్ని రేకెత్తించింది. పదినెలలు గడుస్తున్నాసుజన్ నుంచి ఫోన్ లేదు. ఏమి జరిగిందో అర్థం కాక మరింత క్షోభ కు గురయ్యారు.

 సుజన్ కు ఏమయ్యిందో, ఎందుకిలా చేస్తున్నాడో తెలిస్తే తప్ప రాధని  ఓదార్చలేనని ఆనంద్ కు అర్థమైంది. సుజన్ క్షేమం కంటే కూడా ఆనంద్ కు రాధ గురించే ఎక్కువ దిగులయ్యింది.ఎప్పుడు లేనిది ఆమె ఆనంద్ నుండి కూడా దూరంగా ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఆనంద్ లీవ్ పెట్టేసి సుజన్ ఎక్కడున్నది, ఏం చేస్తున్నది కనిపెట్టడానికి ఢిల్లీ వెళ్ళాడు, ఫ్రెండ్ సహాయం తో ఎంబసిలో వివరాలు కనుక్కున్నాడు. అమెరికా వెళ్ళడానికి వీసా దొరకడం అంత సులభం కాదు అది కూడా ఇన్విటేషన్ లేకుండా ....టూరిస్ట్ గా వెళ్ళడానికి ఏర్పాట్లు చేసుకున్నాడు, రాధ కూడా వస్తాననడంతో తప్ప లేదు. ఎంబసి నుండి తీసుకున్న వివరాలతో కాలిఫోర్నియా లో అడుగు పెట్టారు. క్యుపెర్టినో , పెబుల్ ప్లేస్ దగ్గరకు వచ్చాక10682 ఇంటి నెంబర్ చూసి వణుకు తున్న చేతులతో కాలింగ్ బెల్ నొక్కారు .... ఎవరో వచ్చి తలుపు తీసారు ...   పొట్టి నిక్కరు వేసుకుని, టి షర్టు వేసుకుని బొద్దుగా వున్న ఒక పాతికేళ్ల అమ్మాయి, "ఎవరు కావాలి?" అంది ఇంగ్లీషులో.
".మేము ఇండియా నుండి వచ్చాము ఇక్కడ సుజన్ అనే అతను వున్నాడా?" తూలి పడబోతున్న రాధను పట్టుకుంటూ అడిగాడు.
వీళ్ళను కొంచం తేరి పార చూసి " సుజన్ డార్లింగ్... సంబడి ఫర్ యు ఫ్రం ఇండియా" అని లోపలి వెళ్ళింది.
అది విన్న రాధ కుప్ప కూలి పోయింది .... గుమ్మం దగ్గరికి వచ్చిన సుజన్ తల్లి దండ్రుల్ని చూసి కొయ్య బారి పోయాడు...తల్లి పరిస్థితి చూసి అమ్మా అని దగ్గరగా వచ్చాడు. రెండు సంవత్సరాల తర్వాత కనపడిన కొడుకు మొహం లోకి కూడా చూడకుండా రాధను చేతుల్లోకి ఎత్తుకుని లోపలి తీసుకెళ్ళాడు. నెమ్మదిగా తేరుకున్నరాధను చూసి ఊపిరి పీల్చుకున్నాడు. ఏ దేశానికి చెందిన అమ్మాయో! ఎందుకు చెప్పకుండా పెళ్లి చేసుకున్నాడో, ఎందుకు ఫోను కూడా చేయడం లేదో! ఎందుకలా చేస్తున్నాడో లాంటి ప్రశ్నలు వేయకుండా మౌనంగా వున్న తల్లి దండ్రుల్నిభయం భయంగా చూస్తున్నాడు సుజన్, తర్వాత
.."లూసీ.... మై పేరెంట్స్" అన్నాడు.ఆ అమ్మాయి ప్రక్కనే ఆ అమ్మాయి లాగే వున్నమూడేళ్ళ అబ్బాయి ని చూపిస్తూ, " మార్టిన్  నా కొడుకు" అన్నాడు.
వాడికి మూడేళ్ళు  వున్నాయి అంటే ..సుజన్ అమెరికా వెళ్ళిన వెంటనే ఈ అమ్మాయితో పరిచయం, ప్రేమ, పెళ్లి, పిల్లాడు పుట్టడం జరిగి పోయాయన్నమాట అంటే నాలుగేళ్ళుగా మమ్మల్ని అబద్దాలతో మభ్య పెట్టా  డన్న మాట....ఏనాడే కానీ అసత్యం చెప్పడానికిదారి తీసే పరిస్థితుల్ని కల్పించుకోని నా సుజన్ ...ఇలా జీవిత భాగస్వామిని ఎన్నుకునే విషయంలో యింత రహస్యంగా, అసత్యాల ఆసరాతో ....  ఈసారి ఆనంద్ కు గుండె ఆగినంత పనైయ్యింది. వాడికేది ఇష్టమైతే అదే చేశామే ...ఈ అమ్మాయిని కూడా మేము కాదనే వాళ్ళం కాదే..ఎందుకింత మోసం ?... ఆనంద్ గుండె బాధతో మూల్గింది. రాధ ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయింది. లూసిలో ఏ రకమైన చలనం లేదు...ఉదాసీనంగా చూస్తూ .."ఓకే సుజన్ ..అమ్ గోయింగ్ ..మార్టిన్ లవ్ యూ.".సుజన్ కు ఓ ముద్దు, కొడుక్కు ఓ ముద్దు ఇచ్చి కనీసం వీళ్ళ  ప్రక్క కూడా చూడ కుండా వెళ్లి పోయింది. ఏ మాత్రం సంస్కారం చూపని ఆ అమ్మాయిని చూస్తూ వుండిపోయారు. ఏమీ అడగ కుండా, ఏమీ మాట్లాడకుండా వున్నఅమ్మా నాన్నలకు ఎదురుగా వుండడం సుజన్ కి చాత కాలేదు.
"ఆఫీసుకు వెళ్ళాలి మార్టిన్ ను స్కూల్ లో వదిలి, సాయంత్రం మాట్లాడుదాం,టేబుల్ పైన లంచ్ వుంది, తిని రెస్ట్ తీసుకోండి. " ఇంకేమి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా వెళ్లి పోయాడు.

షాక్ నుండి తేరు కోలా ఇద్దరూ, రాధ చిన్నగా ఏడుస్తోంది ...మౌనంగా ఆమెను చూస్తూ ఉండిపోయాడు. నా నవ్వుల రాణి కి ఈ వేదన ఎందుకు? అతనికి సుజన్ పుట్టిన రోజూ గుర్తొచ్చింది. బిడ్డను తీసుకుని అత్తగారు చూప బోతే వాడ్ని చూడకుండా లేబర్ రూం లోకి వెళ్లి పోయాడు రాధ కోసం, రాధ కళ్ళు తెరిచి బాబు ఎలా వున్నాడని అడిగితే "ముందు నిన్ను చూడాలని వచ్చాను ... నీకు ఎలా వుంది ? " అన్నాడు, ఆ రోజూ రాధకు కోపం వచ్చింది,కానీ బిడ్డ గురించి కంటే రాధకు ఎంత కష్టం కలిగిందో ప్రసవం లో అనుకున్నాడు ...కానీ ఇన్నేళ్ళ తర్వాత ఆ బిడ్డ కారణంగానే ఆమెకు కష్టం కలుగుతూ వుంటే ఏమీ చేయలేకున్నాడు. సుజన్ గురించి వాడి నాయనమ్మ, అమ్మమ్మ ,తాతయ్యలు, మేనమామ,అత్తలు అందరూ అడుగుతారు, వాళ్ళకేం చెప్పాలి? ఆనంద్ కు ఇదంతా కల అయితే బావుండుననుకున్నాడు.అతని కళ్ళ ముందు పెరిగిన చిన్నారి కొడుకు ఇలా గుండెల్లో గునపాలు గుచ్చు తాడనుకోలా ..!

ఆనంద్ టేబుల్ పైనున్న శాండ్విచ్ రాధకు తెచ్చిచ్చాడు.ఆమె తినలేదు ..అతను తినలేక పోయాడు. ఏదో అనాలని, కొడుకును తిట్టి పోయాలని ...ఇంకా  వాడ్ని కసితీరా కొట్టాలని వుంది ఆనంద్ కు ,కానీ బుర్ర మొద్దు బారి పోయింది. సాయంత్రం సుజన్, లూసి, మార్టిన్ వచ్చారు. రాధ లేచి కూర్చుని "ఆనంద్ మనం సుజన్ ని అమ్మాయిని బాబు ని ఇండియా తీసుకెళ్ళి పోదాం" అంది. సాధ్యం కాదని తెలిసినా తల ఊపాడు. ఆ అమ్మాయి లోపలి వెళ్లి బయటికి రాలేదు. సుజన్ ఎదురుగా కూర్చున్నాడు.
"ఎందుకిలా చేసావు"అన్నాడు ఆనంద్.
అతని కంఠం లో కరుకుదనానికి తల్లి కొడుకులు ఇద్దరూ ఉలికి పడ్డారు.
"ఆనంద్..." వారించింది రాధ. అతని చేయి నొక్కింది వద్దన్నట్టు.
"నీ భార్యను, బాబును తీసుకుని ఇండియా వెళదాం,అక్కడ అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు...  మళ్ళి కావాలంటే వద్దువు గానీ లే సుజన్." ప్రాధేయపూర్వకంగా అంది రాధ .
"నేను వస్తాలే అమ్మా, ఆమె రాదు."
 "నీకు సిగ్గు లేదా..ఈ మాట అనడానికి " కోపంగా అరిచాడు ఆనంద్. 
"ఆనంద్... నువ్వువూరుకో ....బాబు ను తీసుకురా నాన్నా! వాడ్ని దగ్గరగా తీసుకుందామని వుంది "అంది.
 లోపలికి  వెళ్లి చాలా సేపు తర్వాత .. బాబును తీసుకొచ్చాడు వాడ్ని దగ్గరగా  తీసుకుని ముద్దు లాడింది రాధ. ఆనంద్ కు రాధ మొహం లోని సంతోషం చూసి మతిపోయింది .ఈమె సుజన్ చేసిన గాయాన్నిఎలా మర్చిపోయిందో అర్థం కాలా ! తల్లి ప్రేమ అంటే ఇదేనేమో ...అనుకున్నాడు.
"ఐ యామ్ యువర్ గ్రాని "అంది రాధ వాడి బుగ్గలు సున్నితంగా తాకుతూ.
పిల్లాడు వెంటనే  తడుము కోకుండా "మమ్మీ సేస్  బొత్ అఫ్ యు ఆర్ బెగ్గర్స్ ..."అని విదిలించుకుని పరిగెత్తాడు.
ఆశ్చర్యం, అవమానంతో దుక్ఖం తన్నుకుని వచ్చేలోగానే ..రాధను పొదివి పట్టుకుని అక్కడే వున్న బాగ్ చేతికి తీసుకుని బయటకు వచ్చాడు ఆనంద్.  టాక్సీ వచ్చే వరకు బయట వున్నా, సుజన్ వాళ్ళ దగ్గరికిరాలేదు. రాత్రి దిగిన హోటల్ కు రావడం,తిరుగు ప్రయాణానికి టికెట్స్ బుక్ చేసుకోవడం.. జరిగి పోయింది. వాళ్ళ ఆనందాన్ని మింగిన అమెరికాను వదిలి ఎయిర్ ఇండియా ఆకాశం లోకి ఎగిసింది. సీట్ బెల్ట్ సర్దుకుంటూ ముందుకు వంగిన ఆనంద్ కు ఎదురుగా పౌచ్ లోమదర్ థేరిసా  ముఖచిత్రంతో వున్న మ్యాగజైన్ కనిపించింది. ఆ ప్రేమ స్వరూపిణి ని చూసిన మరునిముషం లోనే ఆనంద్ కు క్రొత్త ఊపిరి వచ్చింది. సుజన్ తల్లి దండ్రులుగా మా ధర్మం మేం నేరవేర్చాం,కొడుకు గా వాడి ధర్మాన్ని, మేం  నిర్దేశించ లేం ... ఈ జ్ఞానం మాకు లేకపోతే మాకు మనశ్శాంతి లేదు, వుండదు, రాదు అనుకున్నాడు. సంయమనం కోసం కాసేపు వూపిర్ని,మనసుని నిశ్చలం చేసుకున్నాడు. నెమ్మదిగా రాధ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు ఆనంద్, అతను గుండెలోని బాధను అదిమి పెట్టలేదు, తొలగించాడు. కొడుకు చేసిన గాయాన్ని, క్షమ అనే మందుతో మాన్పు కున్నాడు, వాడు సంతోషంగా వుండాలని కోరుకున్నాడు. ఇంక మర్చిపోయాడు 
"రాధా! మనల్ని, మన ప్రేమను కాదని సుజన్  ఇంకో ప్రేమ కోసం వెళ్లి పోయాడు... మనం  ఏది కోల్పోయామో దాన్ని తెచ్చుకోలేనప్పుడు ...మనం ఇవ్వగలిగింది, కోల్పోయిన వాళ్లకు ఇవ్వలేమా! మన  కళ్ళకు కన్నీళ్ళే లేకపోతే... ప్రపంచాన్నియింత స్పష్టంగా, కరుణ తో, సానుభూతి తో చూడ లేమేమో రాధా!" 
అవునన్నట్లుగా తల ఊపి,ఆనంద్ ఎదపై తలవాల్చింది రాధ. ఆమె కను కొనల నుంచి జారిన కన్నీటిని తుడిచి ఇక కన్నీళ్లు వద్దన్నట్లు చూసాడు. రాధ సరే అన్నట్లుగా తల ఊపి,కొంగుతో కళ్ళు తుడుచుకుంది.             
  
                            

                                          

నాన్న


  •  (Published in Vartha,Sunday 6th May2012) 

మెలకువ రాగానే టైం కోసం గోడ ప్రక్క చూశా ...'ఎనిమిది' ...లేచి బయటికి  వచ్చేప్పటికి  రోజూ ప్రొద్దున్నే నాన్న గదిలోంచి  చిన్నగా వినిపించే పాత మధురమైన పాటలు వినపడలా... ఓహ్ నాన్న లేరు కదా , ఎక్కడ నాన్న ఉంటాడో అక్కడ పాత పాటలు వుంటాయి ..నా చిన్న తనం నుండి చూస్తున్నా ..నాన్నకు  పాటలు అంటే   ప్రాణం...క్రొత్తవి పాతవి అని లేకుండా ఆన్ని కాసెట్లు కొనేవాడు.కానీ ఒక సారి వినేసి అందులో మంచి పాటలు లేకపోతే వాటినిష్ట పడే వాళ్లకి ఇచ్చేవాడు. తను మాత్రం ఘంటశాల, సైగల్, రఫీ, ముకేష్, కిషోర్ ల పాటలు మాత్రమే ఎక్కువ వినేవాడు.ఇంట్లోకి రాగానే ఫ్యాన్, లైట్,టేప్రికార్డర్ మూడు ఒకే సారి ఆన్ చేసేవాడు.ఆయన ఇంట్లో వున్నాడనే దానికి నిదర్శనం పాటలు వినపడడమే. ఏదోలా వుంది నాన్న గదిలోంచి ఆ నాస్టాల్జిక్ సంగీతం వినపడక పోయే సరికి ...హాల్లో టోం అండ్ జెర్రి  మూజిక్  వినపడింది. జాయ్  స్కూల్ కి యింకా రెడీ కాలా, కార్టూన్ నెట్ వర్క్ పెట్టుకుని నవ్వు తున్నాడు, టైం చూస్తే ఎనిమిది... పది. వాడు ఎప్పుడు రెడి అవుతాడు?  కంగారుగా టివి కట్టేసి వాడ్ని స్నానానికి లాక్కెళ్ళి నీళ్ళు తిప్పితే, చల్లగా వున్నాయని వాడు పరిగెత్తి పోతున్నాడు. గీజర్ లో నీళ్ళు వేడి అయ్యేప్పటికి లేట్ అవుతుందేమో...  ఏదోలా వానికి  స్నానం చేపించేటప్పటికి చమటలు పట్టాయి.

 సంవత్సరం దాటినప్పటి నుండి జాయ్  ను రాత్రులు తన దగ్గరే పడుకోబెట్టుకునేవాడు నాన్న. రాత్రి కథలు చెప్పి నిద్రపుచ్చడం ... రోజూ ప్రొద్దున్నే వాడ్నిలేపి వాకింగ్ కి తీసికెళ్ళడం,వచ్చేప్పుడు పాల పాకెట్లు తేవడం ,జాయ్  ని  స్నానం చేపించి స్కూల్ కు రెడి చేయడం, వాడికి పాలు కలిపించి  త్రాపించడం, ఎంత మారాం చేసినా వాడికి టిఫిన్ ఎలాగో తినిపించడం, స్కూల్ దగ్గర వదలడం , సాయంత్రం తీసుకు రావడం, హోమ్ వర్క్ చేయించడం జాయ్  ని వదిలి వస్తూ కూరగాయలు తీసుకురావడం ఆయన పనే.ఎప్పుడైనా జాయ్  కి అనారోగ్యం చేసినా డాక్టర్ దగ్గరకి సైతం ఆయనే తీసుకెళ్ళే వాడు. ఇప్పుడు జాయ్  ని తయారు చేయ డానికి  టిఫిన్ తినిపించేదానికి నాకు  నీరసం వచ్చేసింది. 
షాలు ను లేపితే ."..ఏంటి ..వినూ నిద్రపోనీవా!" విసుక్కుంది. 
" నాన్నలేరు కదా, లక్ష్మికి వంట ఏంచేయాలో చెప్పు ..అడుగు తోంది ..జాయ్  ని రెడి చేశా ..స్కూల్ కి తీసుకెల్తున్నా..గెట్ అప్ "అని నేను అనడం తో  మెరుపులా లేచింది షాను. "అవును కదూ మర్చి పోయా .."పరుగు తీసింది.
 నేను రెడి అయ్యి బయటికి వచ్చేప్పటికి,  "పాలు లేవు, పాలపాకెట్ల వాడికి చెప్పలేదా..?" గట్టిగా కేక వేసింది షాలు 
"...మర్చి పోయా ...కాఫి  సంగతేంటి ? " అన్నా 
"..జాయ్  కి పాలు త్రాపించలేదా ?"
"..వాడికి బ్రెడ్ తిని పించాలే !"
"ఏంటి వినూ..  వాడికి పాలు లేకుండా.. నాకుకాఫీ లేకుండా చేసావ్?.. లక్ష్మి..  టిఫిన్  రెడి చెయ్యి లంచ్ కి ఏమ్చేస్తున్నావ్ ?"
"కూర గాయలు లేవమ్మా ...నిన్నంతా మీరు బయటికి వెళ్ళారు కదా నేను చూసుకోలా ."లక్ష్మి సాగ తీసింది. 
"నేను జాయ్ ని వదిలి పాలు, కూరగాయలు  తెస్తాలే ..అవునూ ఎక్కడ తేవాలి ?"
"లక్ష్మీ ...చూసావా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయని అడుగుతున్నారు ..".షాలు పడి పడి నవ్వుతోంది .
"తాతగారు బాబు ని వదిలి రైతు మార్కెట్ లో తెచ్చేవారు సార్ ..ఇవాళ ఇక్కడ నేను తెచ్చుకుంటాలే"అంది లక్ష్మి .

జాయ్  ని వదిలి వచ్చేప్పటికి తొమ్మిదిన్నర అయింది ..గబ గబా రెడి అయి ఏదో తిన్నామనిపించి ఉరుకుల పరుగుల తర్వాత లాప్టాప్ బాగ్ తీసుకుని పరుగు తీసి కారు దగ్గరికి వచ్చేప్పటికి కార్ దుమ్ము కొట్టుకుని వుంది ...నాన్న రోజూ ప్రొద్దున్నే అర్ద గంట పాటు కారు ఎంత శుబ్రంగా కడుగు తాడో గుర్తు వచ్చేప్పటికి కన్నీళ్లు తిరిగాయి ...నా వెంటే వచ్చిన షాలు ఏమైయ్యింది ? అని దగ్గరగా వచ్చింది ..".షాలు అయ్ మిస్ మై డాడ్ సో మచ్ ..ఆయన లేని లోటు నన్ను ప్రతి నిముషం గాయ పరుస్తా వుంది. డెబ్బై ఏళ్ళ వయసు లో  ఆయన ఈ పనులన్నీ ఎలా చేసే వారో ?ఇదెప్పుడూ నేను ఆలోచించ లేదు.ఆయన శ్రమని  టేకెన్ ఫర్ గ్రాన్టేడ్ గా తీసుకున్నా.... ఆయన్ని ఎప్పుడు అక్నాలేడ్జ్ చేయలేదు ..."నా గొంతు వణికింది "...ఐ  మిస్ హిం టూ ... "అంది షాలు ..ఆ మాటల్లో నిజాయితి వుంది.

సాయంత్రం ఇద్దరం ఆఫీసు నుండి వచ్చేప్పటికి జాయ్ బయటే ఆడుకుంటున్నాడు.బ్యాగ్ ఎక్కడో పడేసాడు ...ఆఫీసులో పడిన అలసట రెట్టింపు అయింది జాయ్  ని అలా చూడగానే . ఇల్లు నిశ్సబ్దంగా వుంది ,ఎవరికీ మాట్లాడే ఓపిక కూడా లేదు .

 అమ్మా నాన్న నాతోనే వుండే వాళ్ళు. క్లాస్ వన్  ఆనేస్ట్ ఆఫీసర్ గా రిటైర్ అయిన ఆయన జీవితం ఒక తెరిచిన పుస్తకం .నా దృష్టిలోనే కాదు ...బంధువులు , స్నేహితులు , సహోద్యోగులు, పరిచయస్తులలో,మచ్చ లేని మనిషి .అజాత శత్రువు ,ఎవరిని ఏనాడు తక్కువ చేసి మాట్లాడి ఎరగడు  , చాతనైనంత ఇతరులకు సహాయం చేసిన వాడు తప్ప , ఎవరిని దేనికి సహాయం కోరేవాడు కాడు.  ఆయన్ని ఏ విషయంలోనూ తప్పు పట్టే అవకాశం వుండేది కాదు ...ఆయన్ని ఎవరైనా విమర్శించే దానికి సాహసించారంటే, వాళ్ళ ఔచిత్యాన్ని సందేహించాల్సిందే...  అంత నిజాయితిగా వుంటారాయన.  ఇంట్లో ఏ పని చేయడానికైనా నామోషి గా అనుకునేవాడుకాడు.  నా పసి తనం నుండి చూస్తున్నా, అమ్మ  పెద్దగా చదువుకోకున్నా ఆమెను గౌర వించేవాడు.స్వేచ్చగా  నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చేవాడు ,తమాషాకి కూడా ఆమెను తక్కువ చేసే వాడు కాదు. నాన్న నా ఐడియల్. అమ్మ ,అమెరికాలో వున్న  చెల్లి కి పాప పుడితే అక్కడే వుండి పోయింది. ఈ వయసులో ఇద్దరూ ఎందుకు విడిగా వుండడం అని  చెల్లి, బావ అన్నా ...తల్లిదండ్రులుగా ఇది మా బాధ్యత అని సరిపుచ్చుకున్నారు తప్ప ఏనాడు ...బాధ్యతల్లో బరువు ను, బాధను చూసుకోలా ....నాన్న నా కుటుంబం కోసం, అమ్మ చెల్లి కోసం వుండిపోయారు.

వారం క్రిందట నాన్న చిన్ననాటి  స్నేహితుడు నరేంద్ర  అంకుల్ గురించి తెలిసింది .ఆయనకి కాన్సర్ అని, ఎవరూ చూసుకోక వృద్ధాశ్రమం లో ఉన్నాడని.నాన్న ఆయన్ని తీసుకొచ్చి ఇండో అమెరికన్ కాన్సర్ హాస్పిటల్లో చూపిస్తే ..ఇంక కీమో కు తట్టుకోలేరు ,ఇచ్చినా పెద్ద ప్రయోజనం వుండదని చెప్పడం తో నరేంద్ర అంకుల్ ని  ఇక్కడే ఉండమని అడిగారు, నేను షాలు కూడా ఆయన్ని ఎంతో అడిగాం, కానీ ఆయనొప్పుకోలా ..అందుకే నాన్న ఆయన్ని వదిలి కొన్ని రోజులు అతనితో వుండి వస్తానన్నారు. వెళ్ళారు. వెళ్ళాక తెలుస్తోంది ఆయన లేకపోతే మాకెంత కష్టమో ! మేమెంత ఆయనపై ఆధార పడివున్నామో!

వారం లోపల వస్తామన్నారు కదా! అని అనుకున్నాము కానీ ఆయన వెళ్లి ఒక్క రోజూ కూడా కాలేదు అప్పుడే ఆయన లేకుండా కష్టమనిపిస్తోంది..హాయిగా వెళ్లి వుద్యోగం చేసుకునే వాళ్ళం ...పార్టీలు డిన్నర్లకు జోయ్ ని నాన్న దగ్గర వదిలి నిశ్చింతగా  పెళ్ళయిన క్రొత్తలో లాగానే ఎంజాయ్ చేసేవాళ్ళం.జోయ్ కి ఇంక తాత గారు లేక కథలు లేవు .. మా దగ్గర పడుకుని కథ చెప్పమని గోల చేస్తున్నాడు . షాలు లాప్టాప్ లో పని చేసుకుంటోంది.తనకి వర్క్ ప్రెజర్ ఎక్కువగా వుంటుంది. జాయ్  కి సమయం ఇవ్వలేదు. నాకు ఆఫీసులో పని ఒత్తిడి తట్టుకుని ఉండడమే కష్టం, తొందరగా నిద్రపోతేగాని ఉదయానికి  ఫ్రెష్ గా ఉండలేను .  ఇప్పుడు మా ఇద్దరికంటే జోయ్ తాతగారు లేక ఎక్కువ దిగులు పడ్డాడు.

శుక్రవారం సాయంత్రానికి నేను,షాలు,జాయ్  పూర్తిగా నిస్సహాయంగా అయిపోయాము. వారం అయింది కాబట్టి ఇంక వచ్చేస్తాడు నాన్న... అన్న ఉత్సాహం తో  చిన్న పిల్లాడిలా నాన్నకు  ఫోన్ చేశా "..ఎప్పుడొస్తున్నారు నాన్నా ?" నా గొంతులో అభ్యర్ధన ,ప్రార్థన ఉన్నాయనుకుంటా ...
" లేదు ..నేను రావడం లేదు వినోద్ .. నువ్వు, శాలిని, జాయ్  రండి ..ఫర్ ఏ చేంజ్ " అన్నారు.
బాగా కోపం వచ్చింది నాన్న పై .. ఎందుకు రావడం లేదు ?నాలో నేను గొణుక్కున్నా....
నా  ఉక్రోషం చూసి , షాలు "కూల్.... వెళదాం నాన్న దగ్గరికి .. మనం పడుతున్న ఇబ్బంది చెబితే వస్తారులే" అంది.
"ఆయనెందుకు రావడం లేదు ,అంకుల్ కోసం ఉండిపోవాల్నా?" ..కోపంగా అన్నా.
షాలు కోపంగా చూసింది.."చిన్న పిల్లాడిలా ఆ కోపమేంటి మీ నాన్నగారి మీద."

సిటి కి  యాభై మైళ్ళ దూరం లో వున్న ఆ వృద్ధాశ్రమానికి చేరుకున్నాము ..దూరం నుంచే  నాన్నకు చాలా ఇష్టమైన పాట "ఏ మాలిక్ తేరే బంద్ హం " దో ఆంఖే బారా  హాత్" సినిమాలోది వినపడింది ... నాన్నని చూడగానే మనసంతా తేలికయింది.జాయ్ వెళ్లి నాన్న వొడిలో కూర్చున్నాడు .నరేంద్ర అంకుల్ ని చూసి ఆశ్చర్య పోయా .. వారానికే ఆయనలో ఎంతో మార్పు వచ్చింది ..కళ్ళలో దీనత్వం లేదు, నిరాశ లేదు..ఎంతో సంతోషంగా ..ఉత్సాహంగా వున్నారు, నిజానికి ఆయనే కాదు ..ఆశ్రమం లోనే తేడా కనిపించింది. నేను, నాన్న వచ్చి నరేంద్ర  అంకుల్ ను తీసుకుని వెళ్ళేప్పుడు వున్న వాతావరణమే లేదు. పూర్తిగా మారి పోయింది. ఎంతో  పరిశుభ్రంగా మారిపోయాయి పరిసరాలు, మొక్కలకు పాదులు చేసారు,  కొత్త మొక్కలు తెచ్చి నాటారు .. అక్కడున్న వాళ్ళలో సైతం  ఏదో క్రొత్త ఆశ కనిపించింది...జీవితాన్ని బరువుగా, నిస్సహాయంగా, నిరాశగా, శవాల్లా నడుస్తూ, తామెవరికి అవసరం లేదనే భావనతో వుండే  వృద్ధుల్లో ఎంతో మార్పు కనిపించింది. నాకు తెలుసు ఇదంతా నాన్న ప్రభావం వలన అని .

కాసేపయ్యాక ..మేము ఏదో చెప్పాలనుకునే లోపల జాయ్ "తాతయ్యా మన ఇంటికి వెల్లిపోదాం "అన్నాడు.
నాన్న నవ్వి ఊరుకున్నాడు. అంటే ఆయన కు ఇక్కడి నుండి వచ్చే ఉద్దేశం లేదన్న మాట .
"నాన్నా..మీరు వచ్చేయండి ..జాయ్ వుండ లేకున్నాడు ..చాలా ఇబ్బందిగా వుంది, మేము వచ్చేప్పటికి వాడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు ..."అన్నాను ..నా మాటల్లో నిష్టూరం ధ్వనించింది .
"వినోద్ .. నేను నరేంద్ర  ని వదిలి రాలేను, అతనికి ఎవరూ లేరు ..అతనికి నా అవసరం వుంది. జాయ్  గురించి అంటావా  నాక్కూడా బాధగా వుంది ..కానీ మీరిద్దరూ ఉన్నారుగా వాడికి.... మీ పట్ల తండ్రి గా నా బాధ్యతల్ని, తాత గా జాయ్  పట్ల కూడా ఆన్ని సక్రమంగానే చేసాననుకుంటా ...ఇప్పుడు నా స్నేహితుడి పట్ల కూడా నాకు బాధ్యత వుంది ... వాడికి నా అవసరం వుంది, జాయ్ కి మీరున్నారు, కొంతకాలం.. శాలిని.. జాబ్ మానేయ్యమ్మా .. బాబు కొంచం పెద్దగయ్యాక కావాలంటే చేయోచ్చులే ...అంతే కాకుండా మాది  పెరిగే వయసు ..మేము ఎంతో కాలం జీవించలేము ఏ భాధ్యతల్ని మోయ లేము ..మీకు భారంగా ఉండలేము. మీ అమ్మ నేను ఇక్కడే వుండ దలచాము.ఎవరికీ భారం  కాకుండా బ్రతకడం కూడా ఒక భాద్యతే ..."

"మీరు మా పట్ల చూపిన భాద్యతని ,ధర్మాన్ని , ప్రేమని  మేము కూడా మీ పట్ల చూపే అవకాశం మాకు ఇవ్వరా...పిల్లలు లేని వాళ్ళో, చూడని వాళ్ళో ఇలా
వృద్ధాశ్రమాల్లో  వుండాలి.. మీరెందుకు వుండాలి నాన్నా! మీరేప్పటికి మాతోనే వుండాలి .." నాకు నాన్నని వెంటనే అక్కడి నుండి తీసి కెల్లాలని అనిపించింది.
నాన్న మౌనంగా వుండి పోయారు.ఆయనకు ఇష్టం లేని చర్చ జరిగితే ఆయన చేసే పని అదే, మౌనం.
షాలు నెమ్మదిగా నా దగ్గరకు వచ్చింది .."అక్కడ చెట్లు చూద్దాం రా .. వినూ.." ఏదో చెప్పాలని పిలుస్తోందని అర్థమైంది .
"వద్దు..ఇప్పుడు నాన్న గారిని ఇబ్బంది పెట్టకు...హి ఇస్ రైట్ ఆయన అందరి పట్ల తన బాధ్యతని సమర్థవంతగా నిర్వర్తించారు ....తన స్నేహితుడి పట్లకూడా ఆయన కున్న ప్రేమ, అనురాగాల్నివ్యక్త పరచనీ....నిజానికి మన భాద్యతని  కూడా ఆయన పై పెడుతున్నాము ...ఎందుకో మన దగ్గర కంటే కూడా ఆయన ఇక్కడ సంతోషంగా విశ్రాంతిగా వున్నారేమో ... జాయ్ ను చూసుకోవడానికి లక్ష్మిని సాయంత్రం కూడా రమ్మందాం...మన సమస్యల్ని ఆయన పై ఇంక వేయరాదు. ఆయనను మన భాద్యతల నుండి విముక్తుల్ని చేయాలి "అంది.
షాలు చెప్పింది నిజమే ..ఇంక భాద్యతల బరువు ఆయనపై వేయరాదు ఆయనకు నచ్చిన చోట వుండనీ, నచ్చిన పని చేయని అనిపించింది.కానీ నాకు నాన్నను చూడకుండా వుండడం కష్టం అనిపించింది . ఎక్కడో చదివిన ఒక కొటేషన్ గుర్తొచ్చింది.
Dad, you're someone to look up to , no matter how tall I've grown.



.

చీకటి

   (Published  in Vishaalakshi,Feb, 2012)               


"అన్నా కాలికి దెబ్బ తగిలింది,రాయి కొట్టుకుంది...." ఎనిమిదేళ్ళ చిన్నా, చిల్లర కొట్టు రాజు దగ్గరకు వచ్చి ఆగాడు.
రాజు వెంటనే "అమ్మా... చిన్నా కేమో కాలికి దెబ్బతగిలిందంట చూడు " అన్నాడు . 
"అరె ..గోరు ఊడి వచ్చేట్టు  వుందే..అబ్బోరక్తం చాలా కారుతోంది ..వుండు కాస్త కాఫీ పొడి వేసి కట్టు కడతాను " అని లోపలికి పరిగెత్తింది . 
"వాడ్ని బెదర గొట్టకు, కాఫీ పొడి అలాంటివి వేయకమ్మా! గాయం కడిగి మందుల డబ్బా లో వున్న పొడి వెయ్యి ." అని,  " చిన్నగాయమే లేరా చిన్నా! తగ్గి పోతుందిలే,  అయినా రాత్రయింది కదరా ఎక్కడికెళ్ళావు?" అన్నాడు  రాజు. 
"వాళ్ళ నాన్నకు రాత్రి డ్యూటి కదా! అన్నం తీసుకుని పోయి నట్టుంది...వీధి లైటు వెలగక నాల్గు రోజు లయింది. చీకట్లో ఏ రాయో తగిలినట్లుంది,పద నేను ఇంటికాడ వదుల్తా "అంటూ వాడికాలికి మందు వేసి కట్టుకట్టి ఇంటి దగ్గర వదిలి వచ్చింది రాజు వాళ్ళమ్మ.


ఆ రోజూ మొదలుకుని  వీధిలో వున్న ఒక్కగానొక్క కరెంటు దీపం వెలగక చీకట్లో పడుతున్న ఇబ్బందులు రాజు తో ఎవరో ఒకరు వెల్లబోసు కుంటున్నారు. ప్రొద్దున్నేన్యూస్ పేపర్ కోసం వచ్చిన గోపి సార్ ను అడిగాడు రాజు  "సార్ మన వీధి లైటు  వెలగడం లేదు కదా ...మీరు కరేంటోళ్ళకు కాస్త చెప్పండి." 
"నేను స్కూల్ పోయే టప్పటికి ఆఫీసు తెరిచి వుండరు, వచ్చేప్పటికిఆఫీసు మూసి వుంటారు..ఫోన్ నెంబర్ తెలీదు, చేసినా పట్టించుకోరు రాజూ"  అన్నాడు .
తర్వాత రాజు చాలా మందికి చెప్పి చూసాడు .అందరూ ఏదో ఒక కారణం చెప్పడం తప్ప, ఎవరూ  కంప్లైంటు ఇవ్వలేదు.అయితే అందరూ లైటు వెలగక ఇబ్బంది పడుతూనే వున్నారు.

రాజు కరెంటు ఆఫీసు నంబరు తెలుకుని ఫోన్ చేసాడు. పదిసార్లు చేస్తే కూడా ఆ ఫోన్ ఎవరు ఎత్తలేదు .పదకొండోసారికి నిద్రమత్తు తో వున్న ఓ గొంతు పలికింది తీక్షణంగా  "ఏం గావాల ?" అంటూ . 
"నెహ్రు నగర్ మూడో వీధిలో లైట్ వెలగడం లేదు, పది రోజులయింది సార్ చాలా ఇబ్బంది గా వుందిసార్...."  ఇంకా రాజు ఏదో చెప్పే లోగానే
"వీధి లైట్లు మా పని కాదు మున్సిపాలిటి వాళ్ళని అడుగు .." అని ఫోన్ పెట్టేసాడు, మున్సిపాలిటి వాళ్ళ నంబర్ కావాలి అని రాజు అడగ బోయే లోగానే. 
 రాజుకు తమ వీధి కార్పొరేటర్ గుర్తొచ్చాడు ..వినాయక చవితికి చందా అడగడానికి చాలా మందిని వెంటేసుకుని వచ్చాడు....చందా ఇవ్వను అన్న రాజును. . నాస్తికుడివా ఇంకా నానా మాటలు అని వాళ్ళ అమ్మతో నూట పదార్లు చందా తీసు కెళ్ళాడు. కార్పొరేటర్  నంబర్ కూడా ఎలాగోలా సంపాదించి ఫోన్ చేసాడు .వాళ్ళ భార్య ఫోనేత్తింది ఆయన హైద్రాబాద్ పోయాడు , ఎప్పుడొస్తాడో  తెలీదoది .

 పట్టుదల వదలని విక్రమార్కుడిలా ,మున్సిపాలిటి వాళ్లకు సంబంధం అన్నాడు కదాని ఎలాగోలా మున్సిపాలిటి వాళ్ళ నంబరు కనుక్కుని ఫోన్ చేసాడు .ఎన్నోసార్లు చేసి చేసి విసిగి పోయాక ఎవరో మహాను భావుడు కాల్ సెంటర్ కి చేయమని నంబర్ ఇచ్చాడు .అది కంప్లైంటు రికార్డు చేసుకుంటుంది తర్వాత వాళ్ళు వచ్చి రిపేరు చేస్తారు అని చెప్పడం తో కాల్ సెంటరు కు చాలాసార్లు ఫోన్ చేసాడు అది పలకనే లేదు .రాజుకు విసుగొచ్చింది అయినా ఎవరికి చేయాలో ఎలా కనుక్కోవాలో ఆలోచిస్తూనే వున్నాడు  .

రాజుకు రాత్రి అన్నం తింటుండగా ఏవో కేకలు వినపడ్డాయి ...రాజు వాళ్ళమ్మ బయటికి వెళ్లి వచ్చింది ."ఏమయ్యిoదమ్మా "అన్నాడు .
"మన వీధి చివర రామయ్య కూతురు రాధ అదే నరసమ్మ లేదూ ఆ పిల్ల హాస్పిటల్ నుండి వస్తుంటే చీకట్లో ఆకతాయి వెధవలు వెంటపడి అల్లరి చేసారంట ..ఆ పిల్ల భయపడి పరిగెత్తుకెళ్ళి వాళ్ళ అన్నకు,  నాన్నకు చెప్పిందంట, వాళ్ళ ను చూసి వెధవలు పారిపోయారంట..కలికాలం గాకపోతే చదువుకున్నోళ్ళు, బుద్ధిగా వుద్యోగం చేసే పిల్లను అల్లరి చేయడమేంటి ?"గొణుక్కుంటూ రాజు తిన్న పళ్ళెం కడగడానికి పోయింది.
రాజు ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా వీధిలైటు వెలగాలి అంతేకాదు మరో రెండు లైట్లు ఈ వీధికి రావాలి.  కొట్టులో కూర్చుని మళ్ళి ఒకసారి కాల్ సెంటర్ కు ఫోన్ చేసాడు ..వుహూ అదేం పలకలేదు.రికార్డు చేసుకుందో  లేదో అర్థం కాలేదు.  ఎలాగో ఓ స్నేహితుడి సహాయం తో టెలిఫోన్  డైరెక్టరి నుండి  మున్సిపల్ ఆఫీసు ఫోన్ నంబర్లన్నీ రాసుకున్నాడు.అసిస్టంట్ ఇంజనీరుకు ఫోన్ చేసాడు ,కాల్ సెంటర్ కు చేయమని ఉచిత సలహా ఇచ్చి ఫోన్ పెట్టేసాడు రాజు చెప్పేది వినకుండా. మళ్ళిఅసిస్టంట్ ఇంజనీర్ కే  చేసి, దానికెన్నిసార్లు చేసినా ఫలితం లేదని ,వీధివాళ్ళు పడుతున్న ఇబ్బంది చెప్పబోతుంటే " ఆపవయ్యా మీ వీధి  అడ్రస్ చెప్పు" అన్నాడు 
 అడ్రెసు చెప్పి "తొందరగా రిపేరు చేయండి సార్.."అని ప్రాధేయపూర్వకంగా అడిగాడు .
"ఆ చేస్తాం ..చేస్తాం మాకు నీ వీధి ఒక్కటే కాదు బాబు  ..బోలెడు వీధులున్నాయి..బోలెడు కంప్లైంట్లు వున్నాయి" అని విసుగ్గా ఫోన్ పెట్టాశాడు . 
రాజుకు మనస్సు చివుక్కు మంది. కానీ పాపం వాళ్ళు మాత్రం ఏమిచేస్తారులే ..ఎన్నో పిర్యాదులు విసిగి పోయి ఉంటారనుకున్నాడు.

తర్వాత మూడు రోజులు గడిచాయి. వీధిలో ఒక ముసలాయన చీకట్లో కింద పడి దెబ్బ తగిలించుకున్నాడు. దేవుడి దయవల్ల కాళ్ళు చేతులు విరగ
లేదని వాళ్ళు అనుకుంటుంటే "ఆ దయగల దేవుడు కింద ఎందుకు పడేశాడు?"అన్నాడు కోపమొచ్చి . "నోరుముయ్యి.... దేవుడి గురించి అలామాట్లడకురా..కళ్ళు పోతాయి " అని, నోరు జారి అన్నమాటకు, కన్నీళ్ళు పెట్టుకుని... వస్తున్న దుక్ఖాన్ని రాజు గ్రహించకూడదని లోపలి వెళ్ళింది రాజు వాళ్ళమ్మ .

మళ్ళి అసిస్టంట్  ఇంజనీరుకు ఫోన్ చేసాడు," లైన్ మాన్ వస్తాడు.అంత తొందరైతే ఎట్లాగయ్యా."అన్నాడు .మళ్ళి రెండు రోజులు గడిచాయి ...సాయంత్రం అలా,ఇలా వెళ్ళే పిల్లలు, పెద్దలు, రాజు కొట్టులో కొనే పని వున్నా లేకున్నా పలకరించే వాళ్ళు. ఇప్పుడు చీకటి పడ్డాక ఎవరూ బయటకు రావడం లేదు. వెన్నెల రాత్రుల్లోమాత్రం పిల్లలు ఆడుకుంటున్నారు కానీ ఇంకే సందడి లేదు. వూరి చివర కాబట్టి వాహనాల సందడి కూడా లేదు. డివిజనల్ ఇంజనీర్ నంబర్ కు ఫోన్ చేసాడు ..   అటెండర్ ఫోన్ తీసాడు.సర్ ఇంకా రాలేదన్నాడు. 
"ఎప్పుడొస్తాడు?"  
"ఏమో వస్తే వస్తాడు, లేక పోతే రాడు ఇంతకి నువ్వు ఎవరయ్యా ? సార్ సెల్లు నంబరు లేదా?"అన్నాడు విసుగ్గా.  
"లేదు ఇస్తావా ..మా వీధిలో లైటు వెలగడం లేదు ఎవరికీ ఫోన్ చేసినా పట్టించుకోవడం లేదు."ఆత్రంగా అన్నాడు రాజు.
"ఇంకా నయం... ఫోన్ పెట్టేయ్ ... సెల్లు నంబరు తీసుకుని కంప్లైంటు చేస్తాడంట" గొణుక్కుంటూ ఫోన్ పెట్టాడు.

మళ్ళీ మధ్యాహ్నం డివిజనల్ ఇంజనీర్ కు ఫోన్ చేసాడు,మళ్లీ  అటెండర్ ఫోన్ తీసాడు, రాజు ఫోన్ పెట్టేసాడు. సాయంత్రం చేసాడు, మళ్ళీ అటెండర్ .. మరుసటి రోజూ కాల్ సెంటర్ కు, అసిస్టంట్ ఇంజనీర్ కు , డివిజనల్ ఇంజనీర్ కు ఫోన్ చేసాడు.ఎవరి దగ్గరి  నుండి బాధ్యత గా సమాధానం రాలేదు. రాజుకు దుక్ఖం వచ్చింది. తను చేసిన యుద్ధం లో ఘోర పరాజయం పొందిన సైనికుడిలా వాపోయాడు . వెక్కి వెక్కి ఏడుస్తున్న కొడుకును చూసి తల్లడిల్లిన తల్లి మనసుకు ఏమీ అర్థం కాలేదు. తన తోటి వారంతా చదువు కుంటుంటే పేదరికం కారణంగా, తండ్రి లేని కారణంగా చిల్లర కొట్టుకే పరిమితమైనందుకు ఏడుస్తున్నాడో లేక  దేనికో అర్థం కాక , ఏమీ చెప్పి ఓదార్చాలో తెలియక రాజు తల నిమురుతూ ఉండిపోయింది .కాసేపటికి కన్నీళ్ళు తుడుచుకుని "అమ్మా నేను గోపి సార్ ఇంటికి వెళ్లొస్తాను, నువ్వు కొట్టులో వుండు." అని  బయలు దేరాడు. బయటి నుంచే రాజును చూసిన గోపి సంతోషంగా ఆహ్వానించాడు. రాజు చెప్పినట్లు  మున్సిపల్ కమీషనర్ కు ఇంగ్లీషులో  వుత్తరం రాసి దాన్నిపోస్ట్ చేస్తానని తీసుకున్నాడు.రాజు హృదయం కొంత తేలికయిoది. తాను చివరి ప్రయత్నం చేసాడు.ఫలితం ఏదైనా తానిక విచారించకూడదు అనుకున్నాడు. దాని సంగతి మర్చిపోయాడు.

మధ్యాహ్నం నిద్ర లో వుండగా రాజును తట్టి లేపింది వాళ్ళమ్మ ".రాజూ... మన వీధి లైటు వెలుగు తొందిరా  ఎవరో వచ్చి రిపేరు చేసారు " అంది. "అవునా! నిజమా అమ్మా!" ఆనందంగా లేచి రాబోతూ..క్రింద పడబోతున్న రాజు కు తన చేతిని ఆసరాగా ఇచ్చి బయటికి తీసుకు వచ్చింది, పది రోజులు గా రాజు కొట్టులో వున్నఫోన్ నుండి కరెంటు,మున్సిపాలిటీ ఉద్యోగుల తో చేస్తున్నఒంటరి పోరాటం చూస్తూనే వుంది. మరి ఏ ఉద్యోగికి కరుణ కలిగి స్పందించాడో... ఆమెకు దుక్ఖం ఆగలేదు ... "నీవు చూడలేని వెలుతురు గురించి నీకెందుకురా తాపత్రయం ?"  కన్నీళ్లు ధారాపాతంగా కారుతుండగా అంది తల్లి . " చీకటి ఎంత దుర్భరమో ...గుడ్డి వాడికంటే ఎవరికి బాగా తెలుసమ్మా? నాకు శాశ్వతమైన చీకటి, ఎవరికీ కాసేపు వుండడం కూడా నాకిష్టం లేదమ్మా.... "  కనిపించని రాజు కళ్ళలో మెరుపు.  "నా బంగారు తండ్రి ...లోకం చూడలేని నీకే లోకం గురించి యింత బాధ వుందే, కళ్ళున్న గుడ్డి వాళ్లురా బాధ్యత లేని  ఈ జనమంతా...   " రాజు బుగ్గల్ని ప్రేమగానిమురుతూ అంది అతని తల్లి.
                                                    

మదర్ ఇండియా

 (Published in Vishalakshi Oct 2011)

"ఎండలు చాలా ఎక్కువగా వున్నాయి వెళ్ళవలసిoదేనా?"పదోసారి అడిగాడు ఈశ్వర్. నవ్వితలూపాను, అతనికి తెలుసు ఒకసారి నేను నిర్ణయం చేసాక మార్పువుండదని, కానీ మార్చడానికి ప్రయత్నిస్తూనే ఉంటాడు. ఇవాళ ఉదయాన్నే రాధ ఫోన్ చేసింది. రాజేష్ తోనూ  అత్తగారి  తోను ఏదో విషయoలో గొడవ అయిందని వెంటనే రమ్మని, నిజానికి రాధ అంతసులభంగా గాయపడే రకం కాదు, రమ్మన్నది అంటే చాలా పెద్ద గొడవే అయివుండాలి, వెళ్లవలిసిందే. మా ఇద్దరి స్నేహం లో రాధ ఇలా నన్నుసలహా అడగడం, ఓదార్పు  కోరడం ఇదే మొదటిసారి. టైఫాయిడ్ నుండి ఇపుడిపుడే కోలుకుంటున్న నన్ను రిజర్వేషన్ లేకుండా పంపడానికి ఈశ్వర్ కు  ఇష్టం లేదు, రావడానికి  అతనికి పనివుంది, ఎలాగయితేనేం కాచిగూడా -ఎగ్మూరు ట్రైన్ కి వెళ్ళడానికి స్టేషన్ కి వచ్చాము. సౌఖ్యంగా వుంటే తప్ప ఈశ్వర్ ప్రయాణానికి ఒప్పుకోడు. అతని ఆదుర్దా కి కారణాలు వెతకడం శుద్ధ దండగ ఒకపక్క కోపం వస్తున్నా ఆ లాలనకి, ప్రేమ కి నా గుండె పరవశిస్తూ వుంటుంది. నాకు   రైలు ప్రయాణం ఇష్టం  సామాన్య ప్రజల్ని చూస్తూ గమ్యం చేరుకోవడం బావుంటుంది. రైలుకిటికీలోంచి ప్రకృతి అందాలూ చూడడం లో ఉన్న ఆనందo ఎసి కూపే లో ఎలా దొరుకుతుంది?    

చాలా రద్డ్డీగా వుంది  ఎగ్మూరు జనరల్ కంపార్ట్మెంట్  ఎలాగో ఎక్కి కూర్చున్నా. చుట్టూ ఉన్న మనుషుల్ని పరిసరాల్ని చూస్తున్నాడు ఈశ్వర్. 
"నేను ఇక్కడే వుండి పోవట్లేదు. నాల్గుగంటల్లో రాధ దగ్గరికి వెళ్ళిపోతాను." 
"సరే జాగ్రత్త"నీళ్ళ బాటిల్ అందించి కదిలాడు. రైలు కదిలింది  గోల గోల గా ఉన్న కంపార్ట్మెంట్ కాస్త సర్దుకుంది. చుట్టూవున్న ప్రజల్ని చూసాను, చాలామంది తమిళులే వున్నారు నిలబడ్డవాళ్ళు కూడా మెల్లిగా ఎక్కడో ఒకచోట ప్రాధేయపడి ఇరుక్కుని కూచున్నారు. ఆ సర్డుకోవడంలో నేను బెంచి చివరకి జారుతున్నాను. అతికష్టంమీద కూర్చున్నా. రాధకి ఫోన్ చేసి చెప్పాను రైలేక్కానని. 
"హమ్మయ్య వస్తున్నావా!" అంది ఆ స్వరంలో బేలతనానికి నాకు ఆశ్చర్యం కలిగింది, అంత బేల కాదు రాధ, ఎందుకంత అలజడిగా వుంది?కుటుంబం లో సమస్యలకి అంతెక్కడ? జీవితం అంటేనే సమస్య్సలు ..., నవ్వొచ్చింది తనవరకు వస్తే గాని ఏది అర్థం కాదు, బయటి నుండి అందరికి సలహాలు చెప్పొచ్చు.

నా కాళ్ళకి దగ్గరగా ఒక పెద్దావిడ క్రిందచాప వేసుకుని కాళ్ళు చాపుకుని కూర్చుంది. చుట్టూ ఏవో సామాన్లు సంచులు పెట్టుకుంది. త్వరలోనే  అక్కడవున్న వాళ్ళంతా ఆమె తాలూకు  మనుషులే అని అర్థమైంది నాకు. కొడుకులు కోడళ్ళు మనుమలు మనుమరాండ్రు, మునిమనుమలు సైతం ప్రయాణం చేస్తున్నట్లుంది.అందరూ ఆమెను పైన కూర్చోమని అడిగినా ఆమె క్రిందనే నింపాదిగా గా కూర్చుంది. రైలు వేగం అందుకోగానే ఆమె తన చుట్టూ వున్నడబ్బా లోంచి  లడ్డ్లు, చక్కిలాలు, తీసి కాగితంలో చుట్టి, ఒక్కకరికి ఏవి ఇష్టమో అవి అందించిoది. ఎక్కడా, ఎవరికీ తేడా రాలేదు, ఓ రెండేళ్ళ వాడిని వళ్ళో వేసుకుంది  మరో నాలుగేళ్ళ వాడిని ప్రక్కనే పడుకోబెట్టుకుంది. చిన్నవాడికి  పాలసీసాలో పాలు పట్టింది,పెద్దవాడికి గ్లాసులో పోసి తాగించింది. ఆమె మాట్లాడే  తమిళ బాష రాకున్న ఆమె అందర్నీ తినమని చెబుతోందని అర్థమైంది  నాకూడా  చక్కిలాలు, లడ్డు పేపర్లో చుట్టి ఇచ్చింది. శుబ్రంగా లేని అమెచేతులు  చూస్తూ కాసేపు సందేహించి  అ కళ్ళలో ప్రేమకి చిక్కుబడి పోయి తీసుకున్నా, హమ్మయ్య ఈశ్వర్ లేడు, వుంటే ఇంకేమైనా వుందా దేట్టోల్ తో చేతులు కడుక్కోకుండా అరటిపండు కూడా తిననివ్వడు ఇంక ఈమెను చూస్తేఏమైనా  ఉందా!

ఆమె బంధువర్గమంతా  బాధ్యతంతా ఆమె పై వేసి నిశ్చింతగా  కబుర్లలో పడ్డారు. చిన్నగా తమిళంలో ఓ జోలపాట పాడి చిన్నవాడ్ని నిద్రపుచ్చింది, ఆపాట ఎంత అనునయంగా పాడిందంటే వాడు అంత గొడవ లొనూ  నిద్రపోయాడు. మరో పిల్లాడికి ఏవో కబుర్లు చెబుతోంది, మళ్ళీ కాఫీలు మొదలయ్యాయి సంచిలోంచి ఓ పెద్ద ఫ్లాస్క్ తీసి అందరికిప్లాస్టిక్ గ్లాసుల్లో కాఫీ ఇచ్చింది. ఇంద్రజాలికుడు తన సంచి లోంచి ఎన్నో వస్తువులు తీసి అందర్నీ సంబ్రమపర్చినట్లు అందరికి  ప్రణాళిక బద్దంగా ఏవేవో ఇస్తూనే వుంటే ఆశ్చర్యం కల్గుతోంది  ఈవిడగాని  మన దేశానికీ ఫినాన్సుమినిస్టరయితే  దేశం బాగుపడుతుంది అనిపించింది. పిల్లల్ని లాలించడం దగ్గర్నించి టీనేజర్స్ ని  మందలించడం దగ్గరనుంచి  కొడుకులు కోడళ్ళని హెచ్చరించడం,  అన్ని ఎంత సహజంగా  ఎంత హుందాగా వున్నాయో, ఆమె ఆజ్ఞ ను  కానీ సలహాను కానీ  ఎవ్వరు తీసివేయడంలేదు. హైదరాబాదు నుండి కర్నూల్ చేరే వరకి ఆమెనే చూస్తూన్నాను. ఆమె ప్రతి కదలిక,  ప్రతి మాట వేద వాక్కులా  ఆకుటుంబం  ఆచరిస్తుందంటే  ఆమె త్యాగం, సహనం , ప్రేమ నిచ్చేతీరు  ఓహ్ ....నలిగిన ఆమె చీర, నెరసి రేగిపోయిన జుట్టు, ముడుతలు పడిన  నల్లటి శరీరం, ఏమాత్రం చుట్టానికి బాగాలేని ఆమె రూపం వెనక ఎంత గొప్ప  శ్రమైక జీవన సౌందర్యం వుందో నేను చూడగలిగాను  దిగువ మధ్హ్త తరగతి కుటుoబ పెద్దగా ఆమెను చూస్తున్న కొద్దీ  గౌరవం కలిగింది. ఎవరు గొప్పవాళ్ళు ? ఎక్కడుంటారు?జీవితచరిత్ర వ్రాయతగిన  ప్రాపంచిక జీవితానుభవం ఆమెకు లేకపోవచ్చు, కానీ ఆమె తన కుటుంబానికి చేస్తున్న సేవను ఎలా అంచనా వేయగలం? అది సామాజిక సేవ కాదనగలమా?ఆ మదర్ ఇండియా నన్ను ఎంతో  ప్రభావితం చేసింది. కర్నూల్ రావడం తో కళ్ళతోనే వీడుకోలు తీసుకున్నా ఆమెతో.

ఇల్లంతా నిశ్సబ్దంగా వుంది ..రాధ అత్తగారు ఎప్పటిలా చాలా సంతోషంగా లేకున్నా సాదరంగా ఆహ్వానించారు. భోంచేసేటప్పుడు కూడా మౌనంగానే వున్నారు రాధ, రాజేష్. పిల్లలు కూడా అల్లరి చేయకుండా ఏదో పని చేసుకుంటూన్నారు.మొత్తానికి అందరూ బాగానే కలత చెందినట్లున్నారు .రాధ నేను గదిలోకి వచ్చాము, నేను వెళ్లినపుడంతా  రాజేష్ వెళ్లి హాల్లోని దీవాన్ పై పడుకుంటాడు.
" ఏంటి అంత తీవ్రంగా ఘర్షణ పడ్డట్టున్నారు, ఏమిజరిగింది? "అన్నా. రాధ బుగ్గలపై కన్నీళ్ళు జారుతూనే వున్నాయి ..కాసేపు నేనేమి మాట్లాడ కుండా వున్నాను. కాసేపయ్యాక అనునయంగా అడిగాను "ఏమిజరిగింది ?" 
"ఇన్నేళ్ళుగా ఏనాడైనా నేను అత్తగారి గురించి కానీ రాజేష్ గురించి కానీ అసంతృప్తి గా వున్నానా?ఉద్యోగం చేసి సంపాదించి అత్తగారి చేతికిస్తాను, ఆమె ఏది చెబితే రాజేష్ అదే చేస్తాడు నేను అదే చేస్తాను ఆమె మాట దాటి పోము. ఆమె ఏది చెబితే అది జరగాలి ..ఇన్నేళ్ళయిన ఆమెకి నచ్చిందే చేయాలి మా  పిల్లల విషయం లో కూడా  ఆమె నిర్ణయాలే చెల్లాలంటే  ఎలా? నేహకి ఎం. ఇ. సి  చేరి ఐ.ఎ.ఎస్  చేయాలని  ఇష్టం దానికి ఇంజనీరింగ్ కానీ  మెడిసిన్  కానీ  ఇష్టం లేదు. అత్తగారేమో చదివితే అదే ఇష్టమవుతుంది అంటారు. అదేమో గొడవ చేస్తుంది ..అది చెప్పబోతుంటే ఈవిడ వినరు బై .పి. సి, చేర్పించాల్సిందే అంటారు.నాకు చాలా కోపం వచ్చి మీ పిల్లల ని  మీకు నచ్చినట్లు చదివించుకున్నారు కదా నా పిల్లలని నాకిష్టం వొచ్చినట్లు చదివించు కోనివ్వండి అన్నాను. ఆమె  మౌనవ్రతంతో పాటు సత్యాగ్రహం మొదలెట్టారు.రాజేష్ కు అమ్మ  ఎంత చెబితే అంత  అన్నిటికి ఆమెనే సమర్థిస్తారు. మామగారు వైద్యం అందక చనిపోయారని, నేహ పై ఆమె ఇష్టం, ఆదర్శాలు రుద్దటమేంటి? అన్నాను. దాంతో రాజేష్ కూడా నాతో మాట్లాడడం మానేసాడు. తిక్కరేగి నేను కావాలో అమ్మ కావాలో తెల్చుకోమన్నాను. ఆమాట కొస్తే అమ్మే కావాలి  నీదారిన నీవు వెళ్ళచ్చు అన్నాడు. నాకు ఎవరున్నారు, అమ్మానాన్న లేని అనాధను" వెక్కి వెక్కి ఏడ్చ్చింది రాధ.

 తల్లితండ్రి ని చిన్నపుడే కోల్పోయిన రాధ చాలా మంచిది,  అన్నవదినలకి అనుగుణoగా పెరిగింది, సహనం తో పాటు ఇతరుల్ని అర్థం చేసుకోవడం బాగా తెలిసిన వ్యక్తి, అలాగే ఆమె  అత్తగారు కూడా అంతే మంచిది రాధ ని సాంత కూతురి లాగే చూసింది, ఇద్దరు ఉద్యోగాలకి వెళితే పిల్లల్ని చూసుకున్నారు బాగా చదువుకున్నావిడ కావడం మూలాన రాధకి పిల్లలకి  హోoవోర్క్ చేయించే పనికూడా వుండేది కాదు, నేహ స్కూల్ టాపర్ అవడానికి  ఆమె కృషి ఎంతో వుంది. మరెందుకిపుడు ఘర్షణ మొదలయ్యింది? నాకు రైల్లో ముసలావిడ గుర్తుకొచ్చింది. కొడుకులు, కోడళ్ళు, మనుమళ్ళు, మనుమరాండ్రు అందరూ, మూడు తరాలు ఆమె ఆజ్ఞ ను జవదాటరని నాకు నాల్గు గంటల్లోఆమె ఎలా ఓ కుటుంబానికి ఆలంబనగా వుందో అర్థమైంది. అది సాధ్యమేనా అని ఈకాలం వాళ్ళు అనుకోవచ్చు కానీ సాధ్యమే,ప్రేమ,క్షమ తోనే అది సాధ్యం. ఇక్కడ గుడ్డిగా నా స్నేహితురాలిని  సమర్థిస్తే వచ్చే నష్టం నాకు తెలుసు .. స్నేహమంటే నలుగురిలో సమర్థించినా వాళ్ళ తప్పుల్ని ఒంటరిగా వున్నపుడు, తెలపడం, దిద్దటం. నా మాట అంటే చాలా గౌరవం రాధకు. ఏంచెప్పినా వింటుంది.
"రాధా  నేను చెప్పేది వినాలని, ఒప్పుకోవాలని కూడా అనను, నేను చెప్పేది నీకు నచ్చక పోవచ్చుకూడా ... "  ఆగాను.
"అదేం లేదు,నీకంటే ఆప్తులు, హితులు నాకెవరు లేరు నువ్వు ఏమిచెప్పినా వింటాను " దీనంగా అంది . 
"ఇక్కడ హక్కులు  బాధ్యతల చర్చ కదా! ప్రేమ ఉన్న చోట బాధ్యత, బాధ్యత ఉన్న చోట క్షమ వుంటాయి, మీ అత్తగారికి మాత్రం హక్కు లేదా ఆమెఇష్టం వ్యక్తపరచడానికి? ఎల్.కే.జి  నుండి పది వరకి ఆమె చూసుకుంది నేహ స్కూల్ టాపెర్  కావడానికి ఆమె కారణమని నీవే చెబుతున్నావు, హక్కుల గురించి కంటే భాద్యతలు తీసుకున్న దాని గురించి ఆలోచించు. అమెక్కువా, నేను ఎక్కువా  అని రాజేష్ ని  నీవు అడగటం తప్పు."  
"నీవూ నన్నే  అంటావా" ఉక్రోషంగా అంది. 
"నన్నెందుకు రమ్మన్నావు రాధా ?" అన్నా. 
"నా బాధ అర్థం చేసుకుంటావని, నేనేం చేయాలో చెబుతావని," అంది .
"అయితే విను, రాజేష్ కి నీవూ కావాలి, వాళ్ళమ్మ కూడా కావాలి. రాజేష్ చిన్నతనంలోనే  తండ్రి చనిపోతే ఆమె ఎన్ని కష్టాలుపడి చదివించిందో నీకు తెలుసు, ఆమె ఎన్ని కోల్పోయిందో,ఎంత త్యాగం చేసిందో కూడా తెలుసు, అవి తెలిసి, కొడుకుగా తన బాధ్యతను  రాజేష్ మరవనందుకు గర్వించు. నీవా ప్రశ్న వేస్తే ఏం సమాధానం చెబుతాడు? అతని సమాధానం సరైనదే,  కానీ అతనికి నీవంటే ఎంత ప్రాణమో నీకు తెలియదా? అమ్మే ఎక్కువ అంటే వుడుక్కోకు,  రేపు రేవంత్  కూడా  ఇలాగే ఆంటాడు అపుడు సంతోషమా? ఇవాళ నీవేక్కువని వాళ్ళమ్మని వదిలేస్తే, రేపు రేవంత్ కూడా అదే చేస్తాడుగా!  అపుడు నీ పరిస్థితి ఏంటి?  నేహకు ఇష్టం కానీ పని ఆమె  చేయరు, నాకు తెలిసి, ఓ వారం పోయాక నేహ అయిష్టత కనపర్చితే  ఆమెనే గ్రూప్  మార్పిస్తారనుకుంటా. కాకపోయినా నేహ చాలా తెలివైంది ఇప్పటికి  బై పి సి చదవనీ, తర్వాత తనకిష్ట మైనట్లు, డిగ్రీ చేసి సివిల్స్ కి వెళ్ళచ్చు లేక వాళ్ళ నాన్నమ్మకు నచ్చినట్లు మెడిసిన్ చేసినా సివిల్స్ రాయొచ్చు అది పెద్ద విషయం కాదు, అప్పుడు అంతా సుఖాంతం కదా!. రాధా..  నీలో మంచితనం వుండటం వలెనే కాదు, మీ అత్తగారి మంచితనం వలన కూడా  మీరింతకాలం సంతోషంగా వున్నారు, ఇది గ్రహించు. మాకిలాంటి పెద్ద దిక్కు లేక మేమెంత కష్టపడుతున్నామో నీకు తెలుసు. స్నేహితురాలివని నిన్ను సమర్థిస్తే కుటుంబ వ్యవస్థపై గౌరవం లేని దాన్నవుతాను."
రాధ మౌనంగా వుండి పోయింది, కాసేపు అయాక, "నిజమే, అత్తగారి పై నా కోపం అర్థం లేనిదే, ఆమెకి మేము తప్ప ఎవరున్నారు?  నేహాకు నచ్చ  చెబుతాను.రాజేష్ తో అలా అనకుండా ఉండాల్సింది, గాయపడివుంటాడు. సారీ చెబుతాను .. నీవు వెళ్లి పిలు..." తానుగా పిలవడానికి సిగ్గుపడింది.
 "రాధ పిలుస్తోంది." రాజేష్ కి చెప్పి, రాజేష్ అమ్మగారి గది లోకి వెళ్ళాను.అమేదో రాస్తున్నారు రీడింగ్ టేబుల్ దగ్గర. 
"ఆరోగ్యం బావుందామ్మా?" అన్నారు.
"బావుందమ్మా ..
"ఏమిటీ వ్రాస్తున్నారు?"అన్నాను 
"నేహ అప్లికేషను  ఫిల్ చేస్తున్నా, అయిపొయింది,  ఫోటో అతికించాలి"  అన్నారు.
"ఇటివ్వండి, నేను అతికిస్తాను " అని తీసుకుని ఫోటో అతికించి, యాదృచ్చికంగా, గ్రూప్ వాంటెడ్ చూసా, ఎం.ఇ.సి అని వుంది. హాట్స్ ఆఫ్ టు మదర్ ఇండియా!  అనుకున్నా మనసులోనే. అంతలోనే" మజ్జిగ అత్తయ్యా " అంటూ రాధ వచ్చింది. మెరిసే కళ్ళతో ఆమె అందుకోవడం చూసాక, ఇక్కడ ప్రేమలు  మాత్రమే వున్నాయనిపించింది. నా ప్రయాణపు అలసట,  టైఫాయిడ్ తో వచ్చిన నీరసం అన్నీ పోయాయి. నా ఆనందాన్ని నా ప్రాణమైన ఈశ్వర్ కి వెంటనే చెప్పడానికి ఫోన్ తీసుకున్నా.




అక్షయమైన వెన్నెల

(Published in Andhra Bhoomi, 24 Nov 2011)

మున్సిపల్ కమీషనర్ అయిన నా క్లాస్స్మేట్ మధుని  కలవడానికి వాళ్ళ  ఆఫీసుకు వెళ్లాను.ఇద్దరం తరచూ కలుస్తుంటాము. మాట్లాడుకుంటూ ఉండగానే 
“మీకోసం  ఎవరో అమ్మాయి వచ్చారు సర్, రెండుమూడు సార్లు వచ్చినా బిజీగా వున్నారంటే వెళ్ళిపోయారు, పంపనా ?”అన్నాడు సెక్రెటరి. నా పక్క చూసాడు మధు, మా సమయాన్ని కేటాయించడానికి. ”సరేకానీ” అన్నా. నేను అక్కడే వున్నహిందూ పేపర్ తీసుకున్నా. మధు, వచ్చిన అమ్మాయి ల సంభాషణ  ఇంటరెస్టింగ్ వుండడం  తో హిందూ పేపర్ ప్రక్కన  పెట్టా. క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం గురించి ఆ అమ్మాయి వివరిస్తోంది. తక్కువ ధరలో డస్ట్ బిన్స్ ని ఎలా తయారు చేయొచ్చో... చెబుతూ వాటికి  ఫండ్స్ కూడా తను కల్లెక్ట్  చేస్తానని చెప్పడంతో మరింత  ఆసక్తిగా చూశా. ఆ అమ్మాయి రూపం, వ్యక్తిత్వం  నన్నుచాలా ఆకర్షించించాయి. ఈ కాలం యువతలో యింత మంచి  భావాలా! దేశం, సమాజం పైన యింత ఆసక్తా?  ఓహ్.. .   ప్రశాంతమైన ఆ వదనంలో స్పష్టమైన తన ఆశయాల పట్ల వున్న నమ్మకం నన్నుఅబ్బుర పరిచింది. “అలోచించి చెబుతాను.” అన్నాడు మధు. “థాంక్ యు  సర్ ” అని ఆ  అమ్మాయి వెళ్లి  పోయింది.. “సారీ  రా ’ అన్నాడు మధు.
”పర్లేదు కానీ ఆ అమ్మాయి పేరు ఏంటి, నేవినలా ?"అన్నాను. 
"ఇదిగో కార్డ్ ఇచ్చింది చూడు."ఇచ్చాడు మధు. 
వెన్నెల, పి.ఓ, స్టేట్ బాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్ అని వుంది. ఎంత అందమైన పేరు ? తల్లిదండ్రులు మంచి భావుకులు కాబోలు. అనుకున్నా."ఏంటి డ్రా చేసి చూపించింది? "అడిగా. 
"డస్ట్ బిన్ మోడల్స్....చూడు..." పేపర్ నాకిచ్చాడు.దాంట్లో నాలుగు మోడల్స్, వాటి తయారికి అయ్యే ఖర్చు కూడా రాసింది .
"ఆ అమ్మాయిని నేను మళ్ళి కలవాలి మధూ" అన్నా.
"నీ ఆశయాలకి,  ఆలోచనలకి  దగ్గరగా వుంది కదా...." మధుకు అర్థమైంది.

మూడు రోజుల తర్వాత మధు నన్ను రమ్మన్నాడు ."వెన్నెల వస్తోందా?"అన్నా.
"అమావాస్య రోజున వెన్నెలా ...!". నవ్వాడు 
"నిజంగా ఆ అమ్మాయిఅమావాస్యరోజున కూడా వెన్నెల కురిపించేలా వుంది కదా!" 
 "చెత్త చెదారం తో డీల్ చేసేవాడ్నిబాబూ ...  నీలా  రొమాంటిక్  పోయెట్రి  టీచ్ చేసే వాడ్ని కాను , ఆ అమ్మాయి  చెప్పిన మోడల్ డస్ట్ బిన్ ఓకే చేస్తున్నాము, నీకు పరిచయం చేస్తాను లంచ్ బ్రేక్ లో రాగలవా?"అన్నాడు. 
"కాలేజ్ కు సెలవు పెట్టి అయినా వస్తాను." అన్నాను .నేను వెళ్ళిన కాసేపటికి వెన్నెల కూడా వచ్చింది. 
"ఇతను ఆనంద్ నా బెస్ట్ ఫ్రెండ్,ఇంగ్లీష్ లెక్చరర్, మీలాగే సోషల్ సర్వీసు ఇష్టం .డొనేషన్స్ బాగా ఇస్తాడు మీ ఆర్గనయిజేషన్ కి, అడగండి." అన్నాడు.
"గ్లాడ్ టు  మీట్యు సర్" అంది. 
"రియల్లీ వేరి గ్లాడ్ టు  సి యు .."  నా మనసు హాయిగా అనిపించింది ఆ అమ్మాయిని పలకరించడం. ఆ తర్వాత వెన్నెలను స్టడీ చేయడం నాకిష్టమైన పని గా మారింది .

క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాం కు మా స్టూడెంట్స్ ను కూడా తీసుకెళ్ళడం తో వెన్నెలతో స్నేహం పెరిగింది. కానీ ఆమె కుటుంబం గురించి మాత్రం ఎప్పుడూ ఆమె చెప్పలేదు , నేను అడగలేదు. దానికి ఇంకా టైం వుందని అనుకున్నా.అనుపమతో, ఆక్షయ్ తో కూడా వెన్నెల గురించి  చెప్పేవాడ్ని వాళ్ళుకూడా ఆసక్తిగా వినే వాళ్ళు.  మీ ఇల్లు ఎక్కడ అని ఏదో సందర్భం లో అడిగాను. అడ్రసు చెబుతూ వాళ్ళింటికి రమ్మన్నది. కానీ వెంటనే వెళ్ళలేదు ,సందేహించాను  ఆ అమ్మాయిని ఎక్కువ అబ్సర్వ్ చేసినట్లు ఆమెకు తెలియ కూడదని. 

వెన్నెలను కలవక చాలా రోజులైంది, చూడాలనిపించింది, మా పరిచయం పెరగాలి  ..ఆ  అమ్మాయితో  జీవితాంతo అనుబంధం కావాలి. ఫోన్ చేశా వస్తున్నానని ."మోస్ట్ వెల్కం సర్" అంది."రండి  సర్"  అంది  నన్ను గుమ్మంలో చూడగానే . ఐదేళ్ళ  బాబు టీవీ లో  టాం అండ్  జెర్రీ  చూస్తున్నాడు. వెన్నెల  ఏదో చదువుతూ ఏదో మ్యూజిక్ వింటోంది. వెంటనే  టీవీ, మ్యూజిక్ కూడా ఆపేసింది. "ఇందాక వస్తున్న మ్యూజిక్ పెట్టరా వెన్నెలా ....ఆలాంటి...ట్యూన్తో  తెలుగులో ఏదో పాట వుంది  " అన్నాను .  సి.డి. ప్లే చేస్తూ "అవును సర్ ఇది కార్లైల్ సాంగ్ గా పిలవబడే ఇంగ్లిష్ సినిమా పాట, సాండ్ర కేట్ అనే ఆమె పాడింది, నిజానికి ఇది నమ్జిలిన్ నోరోబంజాద్ అనే  ఆమె పాడిన మంగోలియన్ జానపదగీతం, అండర్  ద సన్ ఆఫ్ ప్లాసిడ్ వాల్డ్  అనేపాటకు అనుకరణ. దీన్నే మనవాళ్ళు "తెలుసా మనసా" పాట కు ట్యూన్ తీసుకున్నారు."  
కార్లీ  డోంట్ బి  సాడ్
లైఫ్  ఇస్  క్రేజి
లైఫ్  ఇస్  మ్యాడ్
డోంట్ బి  అఫ్రైడ్

కార్లీ  డోంట్ బి  సాడ్
దట్స్  యువర్  డెస్టిని
ద  ఓన్లీ  ఛాన్స్
టెక్ ఇట్ , టెక్  ఇట్  ఇన్  యువర్  హాండ్స్
పాట వింటూ, అద్భుతం అనుకున్నా, పాటే కాదు వెన్నెల తెలివి తేటలు కూడా. ఈ అమ్మాయికి తెలియని విషయాలే లేవు ఆశ్చర్యం తో  పాటు నాకు ఆనందం కలిగింది. బాబు రిమోట్ తీసుకుంటూ ... "అమ్మా  ప్లీస్" అన్నాడు .
"మీ  అబ్బాయా ?" ఆశర్యంగా అన్నాను,  కాసేపు ఏమీ తోచలా ...వెన్నెల పెళ్లి కాని  అమ్మాయి లాగే వుంది . ఆమె పై నా ఆశలు... ప్చ్...వెంటనే తమాయించుకున్నా. 
"అవును  సర్, సర్  కి  నమస్తే  చెప్పు  ద్రువ్"  అంది వాడు సిగ్గుగా నమస్తే  చెప్పి , మళ్ళి  టీవీ  రిమోట్  తీసుకోబోయాడు, "నో , నువ్వు  ఇప్పుడు డ్రాయింగ్  చేస్తావన్న మాట" ,అంటూ ఓ  డ్రాయింగ్ బుక్,  వాటర్  కలర్స్  ఇచ్చింది.  బుద్ధిగా  వాడు ఆ పనిలో మునిగి  పోయాడు .
"చెప్పండి  సర్ " అంది.
"ఎంత  వరకు  వచ్చింది డస్ట్ బిన్  ఫండ్  కలెక్షన్ , ముందుగా ఎక్కడ పెట్టాలని ? అడిగా. 
"మొదటిగా  జనరల్  హాస్పిటల్  అనుకున్నాము  సర్, అక్కడే  కదా పరిసరాలు  శుభ్రంగా వుండాల్సింది , వంద ఆర్డర్  చేసాము, తరువాత  ఫండ్స్ ను  బట్టి  మిగతా  ప్రాంతాల్లో చేద్దామని...."ఆగింది. 
"అవునవును అది నిజం, నా  విరాళం  ఇద్దామని, డబ్బు తీసి టీపాయ్  మీద పెట్టా, 
"మీరుకూడా బాధ్యత తీసుకుంటే బావుంటుంది, డబ్బుకంటే  మనుషుల అవసరమే ఎక్కువ వుంది, మాకు  సొసైటి  అలాగేం లేదు ..కొద్దిమంది  స్నేహితులు కలిసి చేస్తున్నాము. మన వూరు శుభ్రంగా పచ్చగావుండాలని " అంది. అందం పై, సొంత ఆనందం పై ఆసక్తి ఉండాల్సిన వయస్సులో సామాజిక శ్రేయస్సు కోరే వ్యక్తిగా ఆమెపై నాకు అపారమైన గౌరవం కలిగింది.
టీపాయ్ మీదా జోసెఫ్  బల్గకోవ్ నావల్
 ది మాస్టర్ అండ్ మార్గరిట  చూసి "ఇది మీరు చదువుతున్నారా "? అన్నా,
"ఊ " అంది"
"ఎమ్మెస్సీఫిజిక్స్  చేశామన్నారు  మరి సాహిత్యం, అదీ మైఖేల్ బల్గకోవ్ అంత ఈజీ కాదు కూడాను....",చిన్నగా నవ్వింది. పక్కనే వున్న బుక్ షెల్ఫ్ చూశా, నబోకావ్, బోరిస్  పాస్తేర్నాక్,అన్నాఅఖ్మతోవా, పాబ్లోనెరుడా, టి.ఎస్.ఇలియట్, తిలక్, శ్రీ శ్రీ , చలం, గురజాడ, బుచ్చిబాబు, గోపీచంద్, ఇంకా లబ్ద ప్రతిష్టులైన ఎంతో మంది కవులు రచయితల పుస్తకాలు చూస్తే నాకు తల తిరిగింది, నేనింతకాలం సాహిత్యం యింత విస్తృతంగా  చదివేవాళ్ళను కలవనే లేదు, సాహిత్యం గురించి నేను ఆక్షయ్ తో తప్ప ఇంకెవరితో మాట్లాడే అవకాశమే లేదు. వెన్నెల కిష్ట మైన రచనల గురించి అడిగినప్పుడు తను చదివిన పుస్తకాలు, తాను చూసిన సినిమాలు, థియేటర్ ప్లేసు, ఒపెరాసు, చూసిన ప్రపంచం, కోరుకునే సమాజం గురించి చెప్పింది. ఓహ్ అద్భుతమైన వ్యక్తి  అనుకున్నా. ఆ అమ్మాయిని చూసే కొద్దీ  ముచ్చటేసింది, అప్పుడు గుర్తొచ్చింది ఈ అమ్మాయి వరించిన భాగ్యశాలి ఎవరో మరి. "మీ వారేం చేస్తుంటారు?" అడిగా. 
కాసేపు మౌనం వహించిన వెన్నెల మెల్లిగా " హీ ఇస్ నో మోర్" అంది.
 ఒక్కసారి నా హృదయం భగ్గుమంది. అప్రయత్నంగా నా కళ్ళలో నీళ్ళు. వెన్నెల మౌనంగా వుండిపోయింది. ఎలాగో గొంతు పెగల్చుకుని "అయాం సారీ వెన్నెలా, మిమ్మల్నిగాయ పెట్టాననుకుంటాను." అన్నా.
"అదేమీలేదు లెండి, ఎప్పుడూ  ఎదుర్కునే  చర్చనే,  అలవాటుపడ్డాను" కళ్ళలో తడి మెరుస్తుండగా నవ్వింది."మా అత్తగారు మామగారు వాకింగ్ వెళ్ళారు, వస్తారు మీకు పరిచయం చేస్తాను, మా మామగారు కూడా బాగా చదువుతారు" అంది. 
ఓహ్ భర్త మరణించినా అతని తల్లి దండ్రుల్ని చూసుకుంటున్నదంటే..హాట్స్ ఆఫ్ టు యు అనుకున్నా. చిన్న చిన్న  కష్టాలకే  కన్నీళ్ళ మయమయే వాళ్ళు ,ధైర్యాన్ని  కోల్పోయి ఆత్మహత్య  చేసుకునే  వాళ్ళున్నలోకంలో ఈ అమ్మాయి తనకష్టాలన్నీ మరిచి కుటుంబం పట్ల  మరియు సమాజం పట్ల ఎంత బాధ్యతతో ప్రవర్తిస్తోంది! …దగ్గరగా వెళ్ళేకొద్దీ కొంత మంది గొప్పవాళ్ళు  సామాన్యులుగా కనపడతారు. కొందరు సామాన్యులుగా కనిపించి చేరువయే  కొద్దీ గొప్పగా కనిపిస్తారు. వెన్నెల మొదటినుండి నాకొక అద్భుతం ఇప్పుడు మరింత అద్భుతంగా కనిపిస్తోంది.

తర్వాత వెన్నెల  అత్తమామలు, అమెరికాలో వెన్నెల అన్నయ్య దగ్గర నుండి వచ్చిన తల్లిదండ్రులు కూడా పరిచయం  కావడంతో నేను తరచు వాళ్ళింటికి  వెల్లేవాడ్ని. వెన్నెల జీవితం లోని చీకటి చూసాక  ఆమె  జీవితంలో పరిపూర్ణత  రావాలంటే  ఆమె మళ్ళి పెళ్లిచేసు కుంటే బాగుంటుంది అనిపించింది. తన  భర్తను ఎంత  ప్రేమించినా, జీవితాన్నిమోడులాగే గడిపెయాలనే  నిర్ణయానికి తను రాకపోయి ఉండచ్చు. తన అభిప్రాయాల్నిగౌరవించే వ్యక్తి  దొరికితే బహుశా చేసుకుంటుందేమో! వాళ్ళ తల్లిదండ్రులతో, అత్తమామలతో  మాట్లాడాలని  నిర్ణయించుకున్నా. అదే విషయం  అనుపమతో అన్నా."నీవు ఆ అమ్మాయి వ్యక్తి గత విషయాల్లో కల్పించు కుంటున్నావేమో ,అంత తెలివైన అమ్మాయికి ఇంకొకరు తన వ్యక్తిగత  విషయాల్లో  కల్పించుకోవడం  నచ్చక పోవచ్చు పైగా ఇది  చాలా సున్నితమైన విషయం."అంది. 
ఆక్షయ్ మాత్రం "అంత స్నేహం ఉందిగా మీకు ఆ కుటుంబంతో, ఇష్టం లేకపోతే  లేదంటారు  కానీ  సిల్లీగా ఆ టాపిక్  తెచ్చినందుకు మీ పట్ల ఏ వ్యతిరేకత రాదనుకుంటా" అన్నాడు ."నువ్వు చెప్పు  ఆక్షయ్ అలాంటి అమ్మాయిని ఇష్టపడని వాళ్లుంటారా?" 
 “చూస్తే  కానీ  చెప్పలేను "అన్నాడు.
 "అయితే  ఎప్పుడొస్తావు ?" అన్నా.
 "త్వరలో." 
"ఆత్వరలో  ఎప్పుడు?"
 గట్టిగా  నవ్వాడు ఆక్షయ్. "సరే  మీకు ఆ అమ్మాయి అంత నచ్చిందంటే ఇంక మీదే ఆఖరి నిర్ణయం." అన్నాడు . 
"నువ్వురావాలి  ఒక వారం కోసమైనా"అన్నాను.

మధు, నేను, వెన్నెల పునర్వివాహం గురించి తల్లి దండ్రుల తో అత్తమామలతోమాట్లాడాము.వాళ్ళు మనస్పూర్తిగా అంగీకరించారు. వెన్నెలకు నచ్చిన వ్యక్తి దొరికితే తమకెంతో సంతోషమని,అదే తాము కూడా కోరుకుంటున్నామని అనడం నాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. వెన్నెల తో మాట్లాడ్డం గురించి రిహార్సల్ చేసుకున్నా. ఎలా మాట్లాడితే, ఎలా మొదలెడితే  బాగుంటుందో అని తెగ ఆలోచించా ...ఆక్షయ్, అనుపమ నేను వెళ్ళాం, వెన్నెల ఇంటికి. ఆమె అప్పుడే బయటికి వెళుతోంది ఫ్రెండ్ పెళ్లి కని. ఎంత చక్కగా అలంకరించుకుందో !...ఆక్షయ్ కళ్ళు మెరిసాయి వెన్నెల్ని చూడగానే. అది నేను గ్రహించాను. వెన్నెల రెండు గంటల్లో వచ్చేస్తానని, భోంచేసి వెళ్ళమనికోరింది .  ద్రువ్ మారాం చేస్తుంటే మేము తెచ్చినచాక్లెట్లు ఇచ్చిమాతో లోపలి తెచ్చాము. వెన్నెల  తల్లి దండ్రులు  అత్తమామలు  వియ్యంకులుగా  కాక  స్నేహితుల్లా  వుండడం మాకు బాగా అనిపించింది. అందరం భోంచేసి వెన్నెల కోసం ఎదురు చూసాం .వెన్నెల  వచ్చాక ఆక్షయ్ ను  పరిచయం  చేశా.
"మిమ్మల్ని చూడకపోయినా మీ గురించి సర్ చెబుతూనే వుంటారు " అంది. 
"మీ గురించి కూడా నాకు  చెబుతుంటారు  అందుకే  మీరు నాకు క్రొత్తగా లేరు." అన్నాడు అక్షయ్. ఇద్దరూ  సాహిత్యంలో  కొత్త పోకడల గురించి మాట్లాడుతుంటే  వింటూ వున్నాను.తర్వాత ఆక్షయ్ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్లి పోయాడు. అనుపమ నేను కూడా వీడుకోలు తీసుకున్నాము. 

మరుసటి రోజూ ఆక్షయ్ తో అనుపమతో మాట్లాడాక వెన్నెల్ని కలిసాను. ”నేను  మీ  శ్రేయోభిలాషిని  కదూ వెన్నెలా !"
“అవును మీరంటే నాకు చాలా గౌరవం సర్, చెప్పండి. ” 
“అయితే  నేను  చెప్పే విషయం  కాస్త  ఆలోచించండి"  
 “చెప్పండి" 
"మీరు  మళ్ళి  పెళ్లి  ఎందుకు  చేసుకో కూడదు?" 
 వెన్నెల  కాసేపు మౌనం వహించింది .“నాకా ఆలోచన ,అవసరం రాలేదు, నేను సంతోషంగానే  వున్నాను సర్. ” 
"మీకు తోడు నీడగా ఒక వ్యక్తి వుంటే ఇంకా బాగుంటుంది కదా ?" 
"నాకు రాజ్ చనిపోతూ అతని తల్లిదండ్రుల్ని అప్పగించాడు , నన్నుస్వీకరించేదానికి సిద్దంగా వుండినా, వీళ్ళ బాద్య్హత తీసుకోవడానికి ఎవరూ సిద్ధంగా వుండరు సర్, అది నాకు తెలుసు అందుకే, ఆ ఆలోచన చేయలేదు ’ 
“ద్రువ్ తో పాటు, మీబాధ్యతల్నిఅన్నిటిని సంతో షoగా పంచుకునే వ్యక్తి దొరికితే మీ కిష్టమేనా ?”
 "ఎందుకో  రాజ్  స్థానం  ఇంకొకరికి  ఇవ్వాలంటే  నాకు చాలా  భయంగా వుంది, అలాంటి  ఆలోచనే  భరించలేను.” ఆమె కళ్ళలో కన్నీరు బుగ్గలపై జారాయి. 
“అయాం సారి వెన్నెలా, జీవితంలో రాబోయే రోజులు మరింత కష్టంగా వుంటాయి ఒంటరి తనంతో, మీ శ్రేయస్సుకోరి చెబుతున్నా. ఆక్షయ్ పై మీ అభిప్రాయమేంటి?” 
“మీ అబ్బాయి ఆక్షయ్ గురించా! ఎందుకు?" కొంచం ఆశ్చర్యంగా అంది 
" వెన్నెలా మిమ్మల్ని చూసిన క్షణంలోనే  మీ అభిమానినైనాను, ఆక్షయ్ ఆలోచన విధానం ఈ కాలం పిల్లల్లా  కాదు, వాడికి మీలాగే నాలాగే సాహిత్యం, సమాజ సేవ ఇంకా చాలా సున్నితమైన భావాలతో ఉంటాడు ..వాడికి  తగిన  అమ్మాయిని  చూసే బాధ్యత నాపై పెట్టాడు. మిమ్మల్నిచూసాక మీరు నచ్చారు వాడికి  ... మీకు ఇష్టమైతే మా ఇంటి కోడలుగా ఆహ్వానిస్తున్నా"  అది చెప్పాక నాకు మనసు తేలికైంది.
 “అంత మంచి చదువు, వుద్యోగం వున్నఆక్షయ్ కి ఆన్నియోగ్యతలు వున్నఅమ్మాయి దొరుకుతుంది, నాపై సానుభూతితోనా ఈ ఆలోచన !" అంది వెన్నెల. ఆమె  గొంతులో కొంచం నిరాశ ధ్వనించింది. 
"మీలాంటి మంచి  అమ్మాయిని ఆక్షయ్ కి చేసుకోవాలనుకోవడంలో సానుభూతి లేదు, స్వార్థం వుంది." వెన్నెల పలకలేదు. వెన్నెల్ని ఒప్పించేందుకు  చాలా శ్రమపడ్డా. ఆక్షయ్ తో మాట్లాడాలి అంది. సరే అన్నా.

ఇద్దరు  మాట్లాడుకున్నారు. ఇద్దరి వదనాల్లో వున్నసంతోషం చూసి నాక్కూడా చాలా సంతోషమేసింది. అందరం రిజిస్టర్ ఆఫీసు కు వెళ్ళ బోయేముందు వెన్నెల అన్నయ్య అన్నాడు
" ఆక్షయ్! నా చిన్నారి అల్లుడు  ద్రువ్ ని నువ్వు బాగా చూసుకోవాలి వాడంటే  మాకు ప్రాణం, ఎంతయినా మీ రక్తం కాదని ఏదైనా ఫీలింగ్స్ వుంటే నేను తీసుకెళతాను." ఆ టాపిక్ రావడం వెన్నెలకు నచ్చలేదు. నాక్కూడా నచ్చలేదు. 
అయితే  అక్షయ్ అదేమీ  పట్టించు కోకుండా “రక్తo ఎవరిదన్నది ముఖ్యం కాదు, ఎవరు బాధ్యత  తీసుకున్నారు అన్నది ముఖ్యం, మానాన్నకి నేను బయిలాజికల్ సన్ ని కాదు, మరి నన్నుఆయన  ఎలా  చూసుకున్నారో నాకు తెలుసు., ఆయన కంటే మంచి తండ్రి ఎవరికీ  వుండరు. మానాన్నకు సాధ్యమైంది నాకెందుకు  సాధ్యం కాదు!" అన్నాడు ద్రువ్ ని చేతుల్లోకి తీసుకుంటూ. అవునా! అన్నట్లు చూసింది వెన్నెల నా ప్రక్క, అనుపమ ప్రక్క, నవ్వి తలవూపాo....వెన్నెల అందంగా, ఆనందంగా నవ్వింది. ఆ నవ్వుల్ని ఆక్షయ్ ఎప్పటికి వాడనివ్వడని నాకు తెలుసు.

ప్రేమికుడు

(Published in Andhra Jyothi, Sunday 24 July 2011)


రొజూ లాగే  సాయంత్రం పార్కు లో నడుస్తున్నా .ఓ ప్రక్క పిల్లలు క్రికెట్టు ఆడుతున్నారు .శలవులు కావడం వలన ఈ మధ్య పిల్లలు ఎక్కువ మందే కనపడుతున్నారు.సంధ్య వేళ కావడం తో  ఆకాశం అరుణ వర్ణం తో  వుండి మెల్లిగా చీకటి తెరల్ని పరుస్తూ వుంది. వేడిగా వున్నా, చెట్ల నీడన వున్న బెంచీల మీద కూర్చుని సేద తీరుతున్నారు కొంతమంది.నా కళ్ళు అలవాటుగా ఓ వృద్ధ దంపతుల కోసం వెతికాయి ఎపుడూ వాళ్ళు కూర్చునే చోటు లో చూశా! కనపడ లేదు.నిర్విరామంగా వుంటారు వాళ్ళు.అతనికి డెబ్బై దాకా వయసుండ వచ్చు , ఆమెకుఅటు ఇటుగా అంతే వయసు వుంటుంది. అతను ఆమెతో ఏదో చెబుతుంటాడు ఆమె తల ఊపుతూ వుంటుంది కానీ మాట్లాడటం అయితే నేను చూడలేదు .తెల్లటి బట్టలు వేసుకుని అతను ,మంచి రంగుల  నేత చీరల్లో ఆమె చాలా హుందాగా వుంటారు. బాగా చదువుకున్నట్లు,చాలా సౌమ్యులు అయినట్లు, జీవితాన్ని పరిపూర్ణంగా, సంతృప్తికరంగా అనుభవించినట్లుగా అనిపిస్తుంది వాళ్ళను చూస్తే.నా పరిశీలన నిజం అయితే వాళ్ళు గొప్ప ఆదర్శ దంపతులు కావచ్చు.ఇవాళ ఎందుకు రాలేదు ? వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఇంటికి వచ్చా .మరుసటి రోజు వాళ్ళ కోసం నా కళ్ళు వెతికాయి,నిరాశ చెందాయి .రెండు మూడు రోజులు వాళ్ళు రాక పోయే సరికి నాకు వాళ్ళిద్దరిలో ఒకరికి ఏదో జరిగిందని అనిపించింది . అక్కడున్న పిల్లల్ని అడిగా,  ఎవరికి వాళ్ళ ఇల్లు తెలియదని అన్నారు .నిరాశగా అనిపించింది. కొన్నిరోజులు వాళ్ళని గురించిన ఆలోచనలు వచ్చేవి. తర్వాత మర్చిపోయాను. 

ఈ రోజు హేమంత్ పుట్టిన రోజు.తెల్ల వారగానే వాళ్ళింటికి వెళదామని తయారయ్యాక ఫోన్ చేస్తే హాస్పిటల్ కు వెళుతున్నాఅక్కడికే రమ్మన్నాడు. "బిజీ గా ఉంటావు కదా "అన్నా."పర్లేదు నీకంటే నాకు ఏదీ ఎక్కువ కాదు" అన్నాడుహేమంత్ . "కానీ పాపం పేషoట్స్..." అన్నాను . "అదే వద్దన్నది " కోపగించుకున్నాడు.  అతనికి అంత తొందరగా కోపమెందుకు వస్తుందో నాకు అర్థం కాదు.తర్వాత కాసేపటికి ఆదంత మర్చిపోయి తను మామూలుగా ఉంటాడు ,నవ్విస్తాడు. హాస్పిటల్లో హేమంత్ బిజీ గా వున్నా, నే వెళ్ళ గానే వచ్చాడు. బోకే ని అందించి విష్ చేశా ..."కాబోయే శ్రీమతి ...వుట్టి బోకే తో సరిపెడతావా..." అన్నాడు హేమంత్ . :"డాక్టర్ .".అని వచ్చి నన్ను చూసి ఆగి పోయింది నర్సు ".ఏంటి" విసుక్కున్న్నాడు హేమంత్. నాకుగిల్టీ గా అనిపించింది ."జస్ట్ ....వేరే డాక్టర్ కి పని  అప్పగించి వస్తాను" అన్నాడు." వద్దు...నేను వెళతాను సాయంత్రం ఇంటికి రా " అన్నాను .అతను కోపంగా చూసాడు.అక్కడ నాతో ఒంటరిగా మాట్లాడడానికి కుదరదు కదా అది అతని కోపానికి కారణం.

ఎలాగో నచ్చ జెప్పి బయటకి  వస్తుండగా పార్కులో కనిపించే వృద్ధుడు కనిపించాడు నర్సుతో మాట్లాడుతూ. నాకు ఆయన్ని చూడగానే చాలా సంతోషంఇ  కలిగింది. " ప్లీజ్ తల్లి టిఫిన్ తినిపించి వెళ్లి పోతా కదా! "ఆయన సిస్టర్ ను ప్రాధేయ పడుతున్నాడు. సిస్టర్ నన్ను చూసి "ఏంటి మేడం ..బాగున్నారా "అంది ఆయన్ను వినిపించుకోకుండా. నేను తల ఊపి ఆయన్ను చూసి "బాగున్నారా...మీరీమధ్య కనపడ్డం లేదు ...ఇక్కడున్నారేంటి?"అన్నాను ."బాగున్నానమ్మా...పార్కులో వాకింగ్ కి వస్తావు కదూ! నా భార్యకు బాగా లేక ఇక్కడ అడ్మిట్ చేసాము . " అన్నారు. "పదండి నేను కూడా చూస్తాను ...సిస్టర్ ... వెళ్ళ వచ్చా? " అడిగాను . " సరే మేడం, పేషంటుకు రోజూ ఈయనే టిఫిన్, అన్నం తినిపించాలంటారు ,డాక్టర్ ఎవర్ని పోనీయకండి  అంటారు అందుకని ...." సిస్టర్  సంజాయిషీ గా   అనడం తో, ఇద్దరం కదిలాం." ఏమయ్యింది మీ మిసెస్ కి ?" అన్నా . "ఆమె కు టై ఫోయిడ్  వచ్చిందమ్మా" అతని వదనం లో రుషి లో వుండే దివ్యతేజస్సు,మహా జ్ఞానిలో వుండే  మేధస్సు  నాకు కనిపించాయి . అతని  కళ్ళలో తాత్వికత  నిండిన చురుకుదనం కూడా వుంది..   " మీరు లేక పోతే టిఫిన్ తినరా...? " అన్నాను  "అదేం లేదు...ఆమె నన్ను గుర్తు పట్టదు...ఆమె కు అల్జీమర్స్ వ్యాధి  వచ్చింది ....అయిదేళ్లుగా ఆమెకు నేనెవరో తెలియదు ."  నాకు నోట మాట రాలేదు కాసేపు ." మరి... మరి .. మీరెవరో గుర్తించలేని వ్యక్తికి మీరే వచ్చి ఎందుకు తినిపించాలి ? సిస్టర్ తినిపిస్తారు కదా! ఎలాగూ ఆమెకు మీరు తెలియదు, ఆమెకు ఎవరు తినిపించినా ఒకటే కదా !"అన్నాను. "నిజమే అమ్మా ఆమెకు నేను తెలియదు ..కానీ ఆమె ఎవరో నాకుతెలుసు ...ఆమె నా భార్యకదా !"   ఒక్క నిముషం నాకు ఆయన మాటలు అర్థం కాలేదు .కానీ నెమ్మదిగా అర్థం కాసాగినై.. .హృదయంలో అదోకరకమైన వుద్యేగం ,బాధ ,విస్మయం,వివరించలేని నొప్పి కలిగినాయి. అప్రయత్నంగా నా కళ్ళలో తిరిగిన కన్నీటిని అతి కష్టమ్మీద అదుపు చేసుకున్నా .ఇలాంటి మహోన్నతమైన ప్రేమికుడ్నిపొందిన ఆమెను చూస్తూ వుండిపోయా.



జీవిత ప్రయాణం


(Published in Andhra Pradesh Pathrika Feb, 2011) 

గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్  "వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యుడ్" చదువుతున్నానన్న మాటే గాని   కళ్ళు గేటు ప్రక్కకి ,మనసంతా వస్తానన్న వసంత దగ్గరకి వెళుతున్నాయి .ఎంతో మంది మంచి స్నేహితుల్ని, అదీ ఏ కష్టం వచ్చినా  ఆదుకునేందుకు సిద్దపడే స్నేహితుల్ని సంపాదించుకోవడం నా  అదృష్టం.  అందరూ ఎక్కడెక్కడో వున్నా, దగ్గరలో వున్నది  వసంత మాత్రమే. ముప్పై ఏళ్లుగా చెక్కు చెదరని స్నేహం మాది. మొన్న నేను అమెరికా నుండి వస్తున్నపుడు  ఎయిర్ పోర్ట్  దగ్గరికి బసంతి,  సత్తార్, నయీం వచ్చారు . చెప్పకనే నా గుండెలో భావాల్ని చదవ గలిగిన ప్రాణి సత్తార్. చిన్ననాటినుండి  నా ఆనందానికి, వేదనకు  హేతువులేమిటో అతనికి తెలుసు . ఇవన్ని భరించక తప్పదు అన్న భావాన్ని అతని కళ్ళలో చదివి మౌనంగా వుండిపోయా. 
"వెల్కం  లైఫ్  అస్ ఇట్ కంస్" అంది బసంతి ఎప్పటిలాగే.
అమెరికాలో వుండ లేక వచేస్తానన్నపుడు ఎవరికీ ఆశ్చర్యం కలగలేదు .ఆ యాంత్రిక జీవనం లో నేను వుండ లేననిఅందరి కి తెలుసు. వసంత 'నచ్చక పోతే ఎందుకు, వచ్చేయ్ మనం ఇక్కడే ప్రశాంతంగా ఉండచ్చు' అనేది ఫోన్ చేసినప్పుదంతా  .

"ఏయ్.. "వసంత ఎదురు గా నుంచుంది, గలగలా నవ్వుతూ, నే వులికిపడ్డా .ఎంత హాయిగా నవ్వుతుందో .
"బాగున్నావు కదా?"  నా బుగ్గల్ని తాకుతూ అంది .
"అహా బాగున్నా"  
"ఏంటి చిక్కి పోయావు? నీళ్ళు వంట లేదా " 
"నీళ్ళెం చేసాయి పాపం! " 
"మరి ఎందుకు? " నవ్విoది 
  "విభాకర్ ఏడి?"అన్నా .
" నీకు పనస తొనలు కొంటున్నాడు వీధి చివర, నే వచ్చేసా ఉండలేక, ఎంతో కాలమైనట్లుగా వుంది నిన్ను చూడక. " 
 "ఏమ్మా పిల్లలు బాగున్నారా?"విభాకర్ పనసతోనలు అందిస్తూ అన్నాడు.తల వూపాను."నేను సాయంత్రం వస్తాను  వసంతా, వెల్లోస్తానమ్మా  " విభాకర్ వెళ్ళిపోయాడు.ఇద్దరం గది లో కూర్చున్నాము. వసంతకి తెచ్చిన డిజిటల్ కెమెరా,విభాకర్ కి ,రఘు ,కిరణ్ లకు తెచ్చిన సెల్ ఫోన్స్ ఇచ్చా ,
"ఎందుకివన్ని?"
 'వద్దా"
 "నాకోసం తెచ్చావుగా.... చాలా బావున్నాయి " సంతోషం నిండిన ఆ వదనం చూస్తే నాకు చాలా బావుంటుంది అలాగే  చూస్తూ ఉండాలనిపిస్తుంది .ఒకరకమైన ప్రశాంతత ను వెదజల్లే మహిమ వుంది,ఆమె దగ్గర. వసంత కబుర్లు చెబుతోంది  నేను వింటున్నాను .కానీ తనేమి చెబుతుందో  గ్రహించ లేక పోతున్నాను .ఎక్కడికి పోతోంది మనుసు?సుదూర తీరాల వెంట,అది పరిగెత్తనూ, నేను పట్టుకు రానూ,ఇదేజరుగుతూ వుంటుంది .
"అమెరికా ఎలావుంటుంది చెప్పు ?"అంది వసంత . 
"అంటే "అన్నా ,
"భూతల స్వర్గం అంటారు కదా ! "
"భూతాల స్వర్గం"అని నవ్వా ,ఇంక పడిపడి  నవ్వడం,తనని చూసి నేను నవ్వడం ,అబ్బ ఎంత కాలాని కి ఇలా నవ్వుతున్నానో ...వసంతనే వంట చేసింది నేను సహాయం చేశా ,ఇద్దరం కలసి భోంచేసాక తోట లోకి వచ్చాం. మొక్కల బాగోగుల గురించి మాట్లాడింది ,ఈ ఆరు నెలల్లో చచ్చిపోయిన మొక్కల గురించి ,కొత్తగా  వేసిన  బంతి పూల గురించి, నా కిష్టమైన గులాబీలను ఎలా కాపాడిందో,మాలి ఊరికి వెళ్ళినపుడు నీళ్ళు పెట్టక ఎర్రగులాబి చచ్చిపోయినట్లయి మళ్ళి ఎలా బ్రతికిందో ఒకవేళ అది చచ్చిపోయి వుంటే తనెంత బాధపడి ఉండేదో...  విభాకర్ స్నేహితుడి ఇంటికి కి వెళ్ళినపుడు ఓ క్రొత్త క్రోటన్ మొక్క కనపడితే దాన్ని అడిగి తెచ్చినందుకు విభాకర్ ఎలా తిట్టాడో ,అన్నీ చెబుతోంది  వింటూ వున్నాను సాయంత్రం వరకి ....అంతగా.. ప్రవాహం లా..  అలసి పోకుండా ఎలా  మాట్లాడ గలదో.. నేనుందుకు నోరు తెరవ లేనో నాకర్థం కాదు...వినేందుకు ఎవరూ లేనపుడు మాటలెలా వస్తాయి? నా ప్రియతం  తో గంటలు గంటలు కబుర్లు చెప్పుకున్న ఆ రోజులుల్ని తలుచుకున్నా.

"ఆ రోజుల్ని తలుచు కున్నపు డల్లా
ఆనంద లాంటి విచారం కల్గుతుంది ,
ప్రతి ఒక్క నిముషం ఒక్కక్క ఒమర్ ఖయ్యాం
రుబాయత్ పద్యాల వంటి రోజులవి ఏవీ ప్రియతం
చప్పుడు కాకుండా ఎవరు హరించారు మన పెన్నిధిని?  
భావకవి తిలక్ "ఆ రోజులు "  గేయం గుర్తొచ్చింది ,ఎవరు హరించారు మరి  నా పెన్నిధిని ?
 "ఏమిటమ్మా ఎక్కడికి వెళ్లావు?.....తేరి ఖయాల్లోమ్మే ల్ హం..."వసంత కూని రాగానికి  ఈ లోకం లోకి వచ్చా ...వసంత కాఫీ కలుపుకుంది, విభాకర్ వస్తున్నట్లు ఫోన్ చేయగానే ..అతను రాగానే వెళ్ళబోతూ , మళ్లీ బోలెడు జాగ్రత్తలు చెప్పింది తోట గురించి,ఆరోగ్యం గురించి ,దొంగల గురించి ,ఇంక ఏవేవో చెబుతూనే వుంది విభాకర్ నవ్వుతూ ఉండిపోయాడు.
"ఉగాది కి వస్తున్నవుగా"  అంది 
"ఇది ఎన్నో ఆహ్వానం ?" అన్నా. నవ్వింది కనిపించే వరకి చేయి ఊపుతూనే  వుంది కనుమరుగు అయ్యేవరకు. ఇంట్లోకి రాగానే శూన్యంగా అన్పించింది. వసంత వసంతంలా వస్తుంది ఆమె వెళ్ళగానే గ్రీష్మం లా అనిపిస్తుంది .

ఉగాది న తెల్లవారుఝామునే  వసంత ఫోనులో పండగ శుభాకాంక్షలు తెలుపుతూ తొందరగా బయలు దేరమని ఆజ్ఞాపించింది,నే వెళ్ళే టప్పటికి  ముంగిట్లో ముగ్గులు ,మామిడి తోరణాల తో ఇల్లు కళకళ  లాడుతోంది  .విభాకర్ పట్టు పంచె ,వసంత పట్టు చీర లో, కిరణ్, రఘు కొత్త బట్టల్లో  పండుగ వాతావరణానికి నిండుతనాన్ని ఇచ్చారు .వాళ్ళని చూడ గానే నా కొడుకులిద్దరూ గుర్తొచ్చి నా కళ్ళలో తెలియకుండానే తిరిగిన కన్నీటి పొరని మరు క్షణం లోనే చిరు నవ్వు తెర క్రిందికి దించేశాను.
కొత్త చీరె తెచ్చి  "ఇది కట్టుకో, బ్లౌస్ కూడా కుట్టించా,తేలిగ్గా వుంది చూడు "అంది. వసంత మాట మీరడం నాకు చాతకాదు.మార్చుకునివచ్చాక
 "ఎంత బాగుందో  నీకీచీర.. కాదు.. కాదు..ఈ చీరేకే నువ్వు అందాన్ని ఇచ్చావు ,ఏమండీ.. చాలా  బావుంది కదూ..ఏరా కిరణ్ ,నువ్వు చెప్పు రఘూ...."వసంత మాటలకి విభాకర్ సిగ్గుపడుతూ తల ఊపాడు ..     "రియల్లీగ్రేట్ ఆంటీ"పిల్లలిద్దరూ వసంతకేమి తీసిపోరు మాటల్లో .
"అన్నిటికి నవ్వేనా ఆంటీ, మీరు ఎప్పుడు వినేందుకు అలవాటు పడ్డట్టుంది మా అమ్మ మీకు ఛాన్స్ ఇవ్వక "అన్నాడు కిరణ్ .
"చూసావా దీనికి కూడా మళ్ళీ నవ్వే"రఘు మాటలకి అందరం నవ్వేశాం .
వసంత వంట చేస్తూ నాతో కబుర్లు చెబుతోంది .కిరణ్, రఘు వాళ్ళమ్మ చుట్టూ  తిరుగుతూ ఆపని ఈ పని చేస్తున్నారు ,విభాకర్ కూడా అపుడపుడు వచ్చి పోతున్నాడు . వసంత జీవితం లోని ఆనందాన్ని చూసి  నాకు సంతోషం కలిగింది.వసంత  పెద్దగా  చదువుకోలేదు, నా పరిచయం అయాక ఇంటర్ ,డిగ్రీ చేసింది ,విభాకర్ కి కూడా చిన్న ఉద్యోగమే .పిల్లలు బాగా చదువుతున్నా,దూరంగా వెళ్ళకుండా ఉన్న ఊర్లోనే చదువు కున్నారు ,ఇక్కడే ఉద్యోగాలు చూసుకున్నారు ,ఇద్దరూ అమ్మ నాన్నల్ని చూసు కోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు .కిరణ్, రఘు, నా కొడుకుల్లాగా సూపర్ ఇంటేలిజెంత్స్  కాలేదని వసంత ఎప్పుడూ బాధపడేది కాదు.వాళ్లలా ఐ. ఐ. టి, ఐ. ఐ. ఏం చదవ లేకపోయారని ఒత్తిడి తెచ్చేది కాదు.
"నీకు దేవుడు చేసిన అన్యాయానికి నీ పిల్లలకు మంచి చదువునిచ్చి తప్పు దిద్దుకున్నాడు"అనేది. 
"BUT IT IS POOR  COMPENSATION "అనేవాడు  సత్తార్. 
ఉజ్వలంగా  ఎదుగుతున్న కొడుకుల్ని చూసి నా భాద్యతని సక్రమంగా నెరవేర్చినాననేతృప్తి కలిగేది,  కాని BIGGER ARE THE CHILDREN BIGGER ARE THE PROBLEMS ,అని అప్పుడు తెలియలా!ఆందరూ నా అదృష్టాన్ని కీర్తించిన వారే ,నా కష్టం ,నా కృషిని అభినందించిన వారే ...అయితే  AS  THEY  GROW ,THEY GO FARTHER అని ఇప్పుడు తెలుస్తోంది .ఏమి మిగిలింది నాకు? కొడుకులు ఎంత గొప్ప స్తితిలో వున్నా తల్లికి కావలసింది వాళ్ళు తన కళ్ళ ముందు వుండటం .
ఇక్కడికి వచ్చేయమని అడిగి నపుడు "అక్కడేమి ఉండమ్మా?"అన్నారిద్దరూ.
"అమ్మ వుంది "అని చెప్పడానికి  నాకు నోరు పెగల్లేదు .చదువు చెప్పడానికి తప్ప  నేనింక నోరు విప్పి మాట్లాడడం మానేసాను ,ఎవరికీ ఎవరు ?జీవితం చివరి వరకు నడుస్తా డనుకున్నా ప్రియతమ  జీవిత భాగస్వామి ఏడేళ్ళ కే  అంతర్ధాన మయ్యాడు .నా అందాన్ని ,ఐశ్వర్యాన్నిఆశించడం తప్ప, నా ఆశయాల్నినా భావుకత్వాన్ని ,నా అంతరంగాన్ని  అర్థం చేసుకోలేని వారికి  నేను చేరువ కాలేక పోయాను. ,ప్రపంచం చూపిస్తారను కున్న ప్రియ పుత్రులు వాళ్ళ ప్రపంచం వెతుక్కుంటూ ఆవలి ప్రపంచం మీద పడ్డారు .మిగిలింది నాకు నేను ,స్నేహధర్మం మరువని  నిష్కల్మషమైన  స్నేహితులు ,సమాంతర రేఖలా  నను కలవ కుండా, నాకు దూరంగా నాకోసమే బ్రతుకుతున్నాననే" అతను" !