Wednesday, 13 March 2019

ఇంగ్లిష్ టీచర్


సుజన ఆరోగ్యం బాగా పాడయ్యింది. ఏమీ మాట్లాడదు. మాట్లాడుతూ మాట్లాడుతూ మౌనంగా అయిపోతుంది. యాభై లోకి రాగానే కోర్టు లో తన క్లర్క్ వుద్యోగానికి వాలంటరీ రాజీనామా ఇచ్చేసింది. నేను ఆఫీసు నుండి ఇంటికి వచ్చేప్పటికి నవ్వుతూ కాఫీ అందించేది , అక్కడి కెళదాం ,ఇక్కడికెళదాం అని ప్రణాళికలు పెట్టేది, నాకు పని వత్తిడి ఉంటే తన స్నేహితులతో వెళ్లిపోయేది , షాపింగ్ లని ,కిట్టీ పార్టీలని , స్నేహితుల పిల్లల పెళ్లిళ్లకు చక్కగా అలంకరించుకుని వెళ్ళేది, మా సంతానం అజయ్, అనిమ బాగా చదువుకున్నా రు, అనిమ తానే మంచి వరుడ్ని ఎన్నుకుంది ,పెళ్లి చేశాo ,భర్తతో అమెరికా వెళ్ళిపోయింది, అజయ్ కూడా అమెరికాలోనే ఎమ్మెస్ చేశాడు , తర్వాత ఎంబీఏ చేసి వుద్యోగం చేస్తున్నాడు, మొన్నటి వరకు ఏమీ ఆదుర్దా పడే విషయాలు ఉండేవి కావు . కానీ సుజన కొద్ది రోజులుగా ప్రతి చిన్న విషయానికి కోపం ,విసుగు చూపడం , ఏడవటం ఇలా తన నైజం కానివి చేస్తోంది. ఎవరినీ కలవడానికి ఇష్టపడడం లేదు ,ఎవరైనా వచ్చినా మొక్కుబడిగా పలకరించడం , టీవీ కూడా పెట్టుకోకుండా గదిలోనే ఎప్పుడూ పడుకోవడం , కారణం అడిగితే తలనొప్పి అనడం, డాక్టర్ దగ్గరకు వెళదామంటే తర్వాత వెళదాం అని చెప్పేసి తప్పించుకోవడం ,గట్టిగా నిలదీస్తే ఏడవటం నాకేమీ అర్థం కావడం లేదు మోనోపాజ్ సమస్య అని డాక్టర్లు అన్నా , ఆమె ఎక్కువ దిగులు పడుతున్నది అజయ్,అనిమల గురించి అని నాకు తెలుసు. వాళ్ళను అమెరికా పంపడానికి సుజన వ్యతిరేకించలేదు , వెళ్ళాక కూడా రెండేళ్లు వాళ్ళు దూరంగా వున్నారని అని బాధపడేది కూడా కాదు , స్కైప్ లో మాట్లాడుతుండేది కాబట్టి దాదాపుగా వాళ్ళని రోజూ చూసేది, వాళ్ళు వంట చేయడం కొత్త కార్లు కొనడం , పార్టీలకు వెళ్లడం స్నేహితులతో గడపడం అన్నీ స్కైప్ లో వాళ్ళు చూపడం అవన్నీ నాకు చెప్పడం , అలా కాలం బాగానే గడిచింది . రాను రాను లాప్టాప్ లో స్కైప్ సంభాషణలు తగ్గిపోయాయి ,స్మార్ట్ ఫోన్లో వీడియో కాల్స్ కొద్దికాలం నడిచాయి , ఆఫీసుకు వెళ్తూ డ్రైవింగ్ చేస్తూ కొన్ని రోజులు మాట్లాడే వాళ్ళు , నెమ్మదిగా వారంలో ఒక్క రోజు ఏదో సమయం లో పలకరింపులు జరిగేవి , అనిమ అప్పుడప్పుడైనా మాట్లాడేది కానీ అజయ్ అసలు దొరికే వాడు కాదు , వాట్స్ ప్ లో కాల్ చేయమని మెసేజ్ పెట్టినా కాల్ చేయలేదని ఎప్పుడూ నాకు పిర్యాదు చేసేది , అజయ్ దొరికినప్పుడు వాడితో కన్నవారితో మాట్లాడే తీరిక లేదా అని పోట్లాడేది , వాళ్ళ ఉజ్వల భవిష్యత్ కోసం మేము చేసిన త్యాగాలు ఏకరువు పెట్టేది . కన్న వాళ్లకు అది బాధ్యత కదా అని వాడన్నాడని వాడికి తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేదా వాడిలా మాట్లాడతేమిటండీ మీరు వాళ్ళనేమీ అనరా అని నాతో పోట్లాడేది . ఇది ఇలా జరుగు తుండగానే అనిమ తన భర్త నుండి విడిపోయింది, ఇద్దరిమధ్య ఎందుకు గొడవలొచ్చాయో కూడా అనిమ తల్లితో చెప్పలేదు. కూతురు చేసిన పని అసలు నచ్చలేదు సుజనకు అల్లుడు చాలా మంచివాడని ఇదే అతనితో చిన్నవాటికి గొడవ పడి ఉంటుందని మందలించమని నన్ను పోరుతుంటే, కూతురును అడిగాను , తన వ్యక్తిగత విషయాల్లో కల్పించుకోవడానికి మాకు హక్కు లేదని అనిమ అనడం నాకు బాధ అనిపించినా, సుజనకు అది అవమానంగా , అసహజమైన పరిణామంగా అనిపించి త్రీవ్ర మైన నొప్పిని కలిగించింది .ఆ వార్త ఎలాగో మా బoధువులకు కూడా తెలిసి పోయింది, తన పెంపకంలో లోపమేముందో అని ఆత్మ పరిశీలన చేసుకోవడం లోనే సుజనా త్రీవ్ర ఘర్షణకు గురయ్యింది .అనిమతో మాట్లాడినప్పుడంతా సుజన కాపురం చక్కదిద్దుకోమని చెప్పడంతో అనిమ కూడా సుజనతో మాట్లాడ్డం తగ్గించింది .పిల్లలిద్దరి ప్రవర్తన గురించి నాకు కూడా బాధగానే వుంది కానీ చేయగలిగింది ఏమీలేదని నాకు తెలుసు , కానీ సుజన వాళ్ళ కారణంగా నలగడం నాకు నచ్చడం లేదు .సైకాలజిస్ట్ దగ్గరకు తీసికెళ్ళి చూపించినా ఫలితం లేకపోయింది. ఇన్నాళ్లు పిల్లల భవిష్యత్తు గురించి ఇద్దరం ఆలోచించాము. బీ ఎస్ ఎన్ ఎల్ ఇంజనీర్ గా నాకు వుద్యోగ ధర్మం తో రోజులో సగం సమయం గడిచి పోతుంది , కానీ సుజన ఇంట్లో వుండి ఇలా వేదన పడి నలుగుతోంది .


కర్నూలు లో నేను డిగ్రీ చదువుకున్న ఉస్మానియా కాలేజ్ నుండి పూర్వ విద్యార్థుల సమ్మేళనంకు తమ భార్యలతో రమ్మని ఆహ్వానం అందింది. ముప్పైఏళ్ళ క్రిందట చదువుకున్నప్పటి తోటి విద్యార్థులను కలవడం అంటే నాకు చాలా ఉత్సాహం కలిగింది . కర్నూల్ అనగానే నాకే కాదు సుజనకు కూడా ఉత్సాహం కలుగుతుందని అనుకున్నాను . దానికి కారణం అక్కడున్న ఇంగ్లిష్ టీచర్ రేచల్. ఆమె దగ్గరే నేను సుజన కలుసుకుంది . సుజనకు రేచల్ మేడం అంటే ఎంతో ఇష్టం. మా పెళ్లయ్యాక చాలా ఏళ్ళు హైదరాబాదులో వుద్యోగం చేసినా కర్నూల్ లో మా ఇద్దరి కుటుంబాలు లేకపోయినా మేము రేచల్ మేడం ను కలవడానికి వెళ్ళేవాళ్ళం . దాదాపుగా అయిదేళ్లయింది మేడం ని కలవక , క్రిస్మస్ కు గ్రీటింగ్స్ చెప్పడo తప్ప తర్వాత మేడం కు ఫోన్లు చేయడం కూడా మర్చిపోతున్నాం . కర్నూల్ కు చాలాసార్లు వెళ్లినా మేడం లేక , కొన్నిసార్లు మాకు కుదరక, కలవలేకపోయాం .


ఇంటర్ లో ఉండగా ఇంగ్లిష్ లో సుజన నేను ఇద్దరం వెనకబడేవాళ్ళం. మేము రెండో సంవత్సరం లోకి రాగానే క్రొత్తగా వచ్చిన రేచల్ మేడం మాకు ఇంగ్లిష్ అంటే వున్న భయం పోగొట్టింది ,అంతే కాదు మాకంటే నాలుగయిదేళ్లు పెద్దదయిన మేడం మాతో ఒక స్నేహితురాలిగా కలిసిపోయి, మాలో చదువు పట్ల ఆసక్తిని కలిగించింది. ఆమెను ఇష్టపడని విద్యార్థులు ఉండేవారు కాదు. సుజన నాకు క్లాస్మేట్ అయినా పరిచయం అయింది మాత్రం మేడం ఇంటి దగ్గరే. కాలేజ్ చదువు అయినా తర్వాత కూడా చాలా మంది మేడం ఇంటికి వెళ్లేవారు , అక్కడే మా పరిచయం ప్రేమగా , పెళ్లిగా మారింది . మేడం ని కలవడం వలన సుజనకు సంతోషం కలుగుతుంది. రెండురోజులన్నా కొంచం మార్పు ఉంటుంది అనుకున్నా. కర్నూల్ కు వెళదామనగానే ,రేచల్ మేడం ను చూద్దామనగానే సుజన కళ్ళలో కాంతి, ముఖం లో ఉత్సాహం కనపడగానే నాకు చాలా సంతోషం కలిగింది .


సుజన నా ప్రాణం ,నా జీవితానికి ఒక అర్థం కలిగించిన జీవన జ్యోతి , ఆమెకు కష్టం కలిగించింది నా బిడ్డలు అయినా వాళ్ళను నేను క్షమించలేకపోయాను . వాళ్ళతో కోట్లాడి మరుసటిరోజు పిల్లలతో ఆమె మామూలుగా మాట్లాడగలుగుతుంది కానీ నేను వాళ్ళతో మామూలుగా మాట్లాడలేకున్నాను. సుజన తర్వాతే నాకు ఎవరైనా. ఇన్నాళ్లు రేచల్ మేడం దగ్గరకు వెళ్లాలని నాకు ఆలోచన కలగనoదుకు నన్ను నేను తిట్టుకున్నాను . వారం రోజులు సెలవు పడేసి కర్నూల్ బయలుదేరాం .


మా కాలేజ్ పూర్వ విద్యార్థులతో కళకళ లాడింది . ఈ మధ్య వాట్సప్ లో మా క్లాస్మేట్స్ ఫోన్ నంబర్లు దొరకడం వలన చాలా మంది కలిసి మాట్లాడుకుంటున్నాం , మెసేజ్ చేసుకుంటున్నాము మిగతా వాళ్ళు కూడా ఇప్పుడు కలిశారు. చాలా మంది భార్యా సమేతంగా వచ్చారు అందరం సంతోషంగా గడిపాo కానీ అందరు మాలాగే పిల్లలపట్ల నిరాశగా మాట్లాడారు , వాళ్ళ ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగినందుకు మంచి ఉద్యోగాల్లో వుంటున్నoదుకు గర్వపడినా, వెంటనే వాళ్ళ కళ్ళలో పిల్లలు భౌతికంగానే కాక మానసికంగా దూరమయ్యారని బాధని గమనించాను . నాకు, సుజన కున్న సమస్యనే అందరిదీ కూడా అని గ్రహించాక నాకు కొంత ధైర్యం కలిగింది కానీ సుజనకు అది తనకొక్కరికే కలిగిన బాధగా ,తన దురదృష్టంగా భావించడం ఆపలేదు .నాకు ఆమెను కన్విన్స్ చేసే శక్తి సన్నగిల్లింది . ఆమెకున్న సమస్య కంటే ఆమె ఊహించుకునే సమస్యే ఎక్కువ అని నాకు అర్థమైనా అది చెప్పే ధైర్యం నాకు లేదు ఎందుకంటే సుజన మానసిక పరిస్థితి ఇప్పటి కంటే ఇంకా అద్వాన్నంగా అవుతుందేమో అనే భయం నాకుంది .

స్నేహితులందరూ వెళ్ళిపోయాక మేము రేచల్ మేడం దగ్గరకు వెళ్లాలని ఫోన్ చేసాం .

“నేను బయట వున్నాను ఓ గంటలో వస్తాను, మీరు ఇంటికి వెళ్లిపోండి, ఇల్లు మారాను ఇంటి గుర్తులు చెప్పారు. సుజన ఉత్సాహంగా వుంది మేడం ను కలవబోతున్నందుకు.రేచల్ మేడం ఇల్లు కనుక్కోవడం కష్టమేమీకాలేదు. వూరికి కొంచం దూరంగా వుంది. చిన్న ఇల్లు పెద్ద తోట. గేటు తీసుకుని లోపలి వెళ్ళే లోపల ఒకమ్మాయి ఎదురుగా వచ్చింది.

”మేడం ఫోన్ చేశారు. మీరు స్నానం చేసుకుని రండి ,కాఫీ పెడతాను, నా పేరు గాయత్రి “ అంది

“ఓహ్ అలాగా, నేను సుజన ఇతను నా భర్త ముకుంద్ ,మాకు ఇంటర్ లో మేడం లెక్చరర్, సార్ ఎలా వున్నారు ? ఏమైనా మేలేనా ?” అంది సుజన

“ ఉహూ.. అలాగే వున్నారు.. రండి చూద్దురు గానీ, ఈ మధ్య మరీ బాగా లేకుంటే స్కాన్ చేపించారు ఆ రిపోర్ట్ తీసుకుని వెళ్లారు సీతారాం డాక్టర్ దగ్గరకు, చాలా రద్దీగా ఉందట “ అంది గాయత్రి


గాయత్రి తీసికెళ్ళిన గదిలో మంచానికి అతుక్కుని వున్న ఆయన్ని చూస్తే కళ్ళకు నీళ్ళొచ్చాయి.వాళ్ళ పెళ్ళిలో ఆజానుబాహుడైన జాన్ సార్ తో మేడం ఎంతో అందమైన జంట .మేడం పెళ్లి కి అతిథులంతా విద్యార్థులే. పదేళ్ల క్రిందట ట్రైన్ ఆక్సిడెంట్ లో వెన్నెముక దెబ్బతినడం వలన మంచానికి పరిమితం అయిపోయారు. చికిత్స కోసం ఎన్నో చోట్లకి తిరిగారు. .అయినా ఆయన పరిస్థితిలో మార్పు లేదు.


స్నానం చేసి బయటికి వచ్చేసరికి ఒక రెండేళ్ళ బాబు నా దగ్గరకు పరుగున వచ్చాడు ఎత్తుకోమని చేతులు చాస్తూ .ఎత్తుకుని ఆశ్చర్యంగా చూశాను ఎవరబ్బాయని ! మేడం నవ్వుతూ నుంచున్నారు . “ఎలా వున్నారు ముకుంద్ ? చాలాకాలం అయింది మిమ్మల్ని చూసి, ఈ మధ్య సుజనను మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నాను “ నా చేతుల్లోంచి వాడు మేడం దగ్గరకు ఉరికాడు.వాడ్ని చూస్తే గుండె నిండా హాయి నిండింది. బొద్దుగా, ఉంగరాల జుట్టుతో, కిలకిలా నవ్వుతూ హడావుడిగా అటు ఇటు తిరుగుతూ ఉంటే వాడినే చూడాలనిపిస్తుంది. మేడంలో నాకు పెద్ద మార్పేమీ కనపడలేదు అలాగే వున్నారు. ఆమెను చూస్తే నాకు ఇంటర్ రోజులు గుర్తొచ్చాయి మమ్మల్ని ఆమె తీర్చిన పద్ధతి గుర్తొచ్చింది ఎన్నో సార్లు నలుగురు అయిదుమంది అబ్బాయిలం అక్కడే భోంచేసేవాళ్ళం. ఎంతమందికి ఆమె ఇంగ్లీషంటే భయం పోగొట్టి చదువులో ముందుకు పోనిచ్చారో లెక్కలేదు . ఎంతో మంది ఆమెను దేవతలా చూసేవారు . చిరునవ్వు చెదరకుండానే ఓపిగ్గా మా ఇంగ్లిష్ రాని మొద్దుల్ని మెరకలుగా చేసిందో ! ఇలాంటి కరుణామయి ఈ రోజు మారుమూల ఓ చిన్న ఇంట్లో ,అవిటివాడై మంచాన పడ్డ భర్తతో విభవం వీడి జీవించడం నాకు మింగుడు పడలేదు .


“ చేతన్ ఉంటే సమయమే చాలదు వీడి ముద్దు మాటలు వింటే అన్నీ మర్చిపోతాం “ అని మేడం అంటుండగానే సుజన స్నానం చేసి వచ్చింది . మేడం సుజన ముఖాల్లో ఆనందం తాండవించింది . ఇద్దరూ చేతులు పట్టుకుని ఒకరినొకరు కౌగలించుకున్నారు . సుజనను అలా చూడక ఎన్ని రోజులైందో…! అనిమ అజయ్ ల గురించి దిగులు పడుతూ సుజన ఎంత పాడయ్యింది?

సుజన చేతన్ తో ఆడుకుంటూ మేడంతో మాట్లాడుతోoది.చేతన్ కొత్త పాత లేకుండా అందరి దగ్గరకు రావడం నాకు ఆశ్చర్యం కలిగింది ముగ్గురం చేతన్ ను తీసుకుని తోటలోకి వచ్చాం ఊపిరి తీసుకోలేకపోయింది సుజన. తోట అంత అద్భుతంగా వుంది అనేక రకాల పూల మొక్కలతో. హైదరాబాదులో మాకున్న అపార్ట్మెంట్ లో బాల్కనీలో సుజన కూడా చాలా చెట్లు పెట్టింది. మొక్కల మధ్య తిరుగుతూ అడిగాను

“మీ పాత ఇల్లు అమ్మేశారా మేడం … ఎంత పెద్ద ఇల్లు ! ఎంత బావుండేది ఆ ఇల్లు . ఎన్ని చెట్లు ! ఎన్ని మొక్కలు … ఎందుకని అమ్మేశారు ?”

మేము చదువుకునే రోజుల్లో మేడం వుండే ఆ పెద్ద ఇల్లు మేడం ఆంగ్లో ఇండియన్ తాతగారు బ్రిటిష్ స్టైల్లో కట్టించింది. యాభై సెంట్ల లో ముందంతా పెద్ద తోట, తర్వాత పెద్ద ఇల్లు, రాజభవనం లాగా ఉండేది.ఇంట్లో ఆ కాలం నాటికే అధునాతనమైన పరికరాలు ఉండేవి .జర్మన్ షెపర్డ్, బుల్ డాగ్ ,లాబ్రిడార్ కుక్కలు ఏమీ అనకున్నా భయపడి చచ్చేవాళ్ళం . మేడం నాన్నగారు కర్నూల్ లోనే ప్రఖ్యాతి చెందిన లాయర్. మేడం ఒక్కతే కూతురు, ఇంపాలా కారులో రాజకుమారి లాగా కాలేజ్ కు వచ్చేది. ఆమెకు వుద్యోగం చేసే అవసరం లేకున్నా కేవలం బోధన పట్ల ఆమెకున్న ఆసక్తి వలన చేసేది.

ఇప్పుడు ఆ ఇల్లు అమ్మేసిందంటే ఆర్థికపరమైన ఇబ్బందుల వలన ఉండొచ్చు ..

“అంత పెద్ద ఇల్లు మాకు అవసరం లేదు పైగా డబ్బు అవసరం కూడా మమ్మల్ని అది అమ్మేట్టు చేసింది. ఆ ఇల్లు అమ్మాక ఈ ఇంటిని మీ జూనియర్ సుదర్శన్ ఆరు నెలల్లో కట్టించాడు. తాతగారి ఇల్లు అని కొంచం మమకారం ఉండేది . కానీ తప్పలేదు . మేడం ముఖం లో కొద్దిగా కూడా బాధ కనపడలేదు. “

“సార్ స్కాన్ గురించి ఏమన్నారు మేడం డాక్టర్ ?”

“జాన్ నాడీ వ్యవస్థ పని చేయడం మానేస్తోంది, మెమరీ లాస్ వచ్చింది ఎవర్నీ గుర్తు పట్టడం లేదు “

“రోషన్ రోజా ఎలా వున్నారు మేడం ఎక్కడున్నారు ? ఈ మధ్య రాలేదా ?”..

“రోషన్ జర్మన్ అమ్మాయిని పెళ్లి చేసుకుని అక్కడే వున్నాడు , రోజా స్టేట్స్ లోనే వుంది తను కూడా అమెరికాలోనే సెటిల్ అయిన అబ్బాయిని చేసుకుని సంతోషంగా వుంది.. రెండేళ్ల క్రిందట వచ్చారు .. బాగా బిజీగా వుంటారు .మేం వెళ్లాలంటే జాన్ కి హెల్త్ ఇష్యూస్…. “

“అదేంటి మేడం బిజీ అంటే ఎలా ? వాళ్ళను కనీ, పెంచి,పెద్ద చేసి, చదివించి ఇంత వాళ్ళు అయ్యాక వాళ్ళుతాము బిజీ అని మనల్ని పట్టించుకోకుంటే ఎలా మేడం ? ఈ కాలం పిల్లలు అందరు ఇలా తయారయ్యారేంటి ? జీవితం అంటే ఇంతేనా ! పిల్లల నిర్లక్ష్యం భరిస్తూ ఏడుస్తూ చావడమేనా ? అనిమ అజయ్ కూడా అంతే మేడం… ఫోన్ చేయడానికి కూడా వాళ్లకు తీరిక లేదు ఆదివారాలు శనివారాలు కూడా ఫ్రెండ్స్ తో పిక్ నిక్ లతో బిజీ అదేమని నిలదీస్తే అసలు మాట్లాడరు… , బిజీ బిజీ ఈ మాట వింటే కోపం వస్తుంది … నా పిల్లల గురించి అనుకుంటే బాధ , మీ పరిస్థితి చూస్తుంటే .. సార్ పరిస్థితి చూస్తుంటే నాకు దుఃఖం వస్తుంది మేడం, పిల్లల్ని మీరు వచ్చేయమని అడగలేదా రోజా అమెరికాలో ఉండకపోతే వాళ్ళ నాన్న గారిని చూసుకోవడానికి ఇండియా వచ్చేయరాదా … ఏముంది మేడం అమెరికాలో జీవితం ఉరుకుల పరుగుల జీవితం .. డాలర్లు తప్ప అక్కడయితే నాకు ఏమీ కనపడలేదు. మనం చస్తే కూడా వాళ్ళు రావడానికి లేదు… ఏదో రావాలంటే రావాలని వచ్చే వాళ్ళకోసం శవాల్ని కుళ్లిపోయే వరకు ఫ్రీజర్ బాక్సుల్లో పెట్టడమెందుకు మేడం నేను చచ్చిపోతే వాళ్లకు చెప్పాల్సిన అవసరం కూడా లేదని ముకుంద్ కు చెప్పా మేడం … “దుఃఖం తో గొంతు పెగల్లేదు సుజన కళ్ళలో కన్నీళ్లు బుగ్గల పై ఉరికాయి.

మేడం నెమ్మదిగా సుజనను దగ్గరకు తీసుకుని కన్నీళ్లు తుడిచింది… ఏమీ మాట్లాడలేదు . చాలాసేపు సుజన ఏడుస్తూనే వుంది .. నేను ప్రేక్షకుడిని అయ్యాను మేడం ఏమి చెబుతుందో అని ఎదురు చూశాను ..ఆమె ఏమీ చెప్పలేదు సరికదా… అసలు మాట్లాడలేదు. జారుతున్న సుజన కన్నీళ్లను తుడుస్తూ వుంది . తర్వాత నాకు అనిపించింది .. ఆమె ఏమిచెబుతుంది ? ఏమి చెప్పగలదు ? ఆమెదీ అదే పరిస్థితి కదా !

నెమ్మదిగా సుజన తేరుకుని “సారీ మేడం .. నా బాధంతా చెప్పి మిమ్మల్ని విసిగించాను .. అంది పేలవంగా నవ్వుతూ .

“ఏమీ పరవాలేదు … పద లోపలి వెళదాం … ఆ .. మర్చిపోయా నీకు కొన్ని మొక్కలు చూపాలి ఒక ఫ్రెండ్ తెచ్చిచ్చింది పూలు రెండు నెలల వరకు వాడవు ..” అని ఆ మొక్కల ప్రక్కకు దారి తీసింది

నిజంగానే ఆ మొక్కలపై పూలు గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి .. వాటిని చూసి సుజన ముఖం లో దుఃఖం మాయమవడం కళ్ళు ఆనందంతో మెరవడం గమనించాను. మేడం సుజన మూడ్ ని మార్చడానికి చేసిన ప్రయత్నం ఓహ్ ఆమె ఒక గొప్ప టీచర్ అన్న విషయం గుర్తుచేసింది. అక్కడి నుండి ఇంకో ప్రక్కకు వెళ్లాం అక్కడ ఓ మూల కుందేళ్ళ చిన్న ఇల్లు వుంది… తెలుపు ,గోధుమ రంగు నలుపు రంగుల్లో కుందేళ్ళను చూసి చేతన్ సంతోషం తో అరవడం సుజన కూడా చిన్నపిల్లలా వాటి దగ్గర ఆడడం నాకు సంతోషాన్నిచ్చింది .

“చేతన్ కోసం కుందేళ్ళను తెచ్చాం వీడి ఆనందం చూడు ముకుంద్ “ మేడం చేతన్ చూసి మురిసిపోతోంది ..

“రోజాకు , రోషన్ కు పిల్లలు లేరా మేడం “ అన్నాను

“ఇద్దరికీ వున్నారు రోషన్ కు పాప , రోజాకు కూడా పాపని ఫోటోలు చూపిస్తాలే”

మొక్కల్ని , కుందేళ్ళని చూస్తున్న కొద్దీ మేడం వాటితో చాలా కాలం గడుపుతుంది అనిపించింది .

చీకటి పడుతుండగా లోపలి వెళ్లాం మేడం సార్ దగ్గరకు తీసి కెళ్ళింది . చిన్నపిల్లాడిని ఒడిలోకి తీసుకున్నట్లు అతన్ని ఒడిలోకి తీసుకుంది బుద్ధిగా ఆమె వొడిలో పడుకున్నాడు . “

ముకుంద్ సుజనా వచ్చారు చూడు… జాన్” అన్నది కానీ జాన్ సార్ మమ్మల్ని గుర్తుపట్టలేదు మేడం మాటలు అర్థం అయ్యాయో కూడా తెలియలేదు… అన్నం పప్పు కలిపి మిక్సి కేసి మెత్తగా చేసి రెండు గిన్నెల్లో వేసింది ఒక గిన్నె నుండి స్పూన్ తో సార్ కు తినిపించింది మరో గిన్నెలో నుండి చేతన్ కు తిని పించింది చేతన్ తింటూ ఉంటే ఆయన తింటున్నారు … చేతన్ తినకుండా ప్రక్కకు పోతే ఆయన చేతన్ లేడు కాబట్టి తాను తినమని మారాం చేస్తున్నారు . గాయత్రి చేతన్ ను పట్టుకొచ్చింది “తాతయ్య తొందరగా తినేశాడని చేతన్ని, చేతన్ తొందరగా తినేశాడని జాన్ ని ఇద్దరినీ లాలించి బుజ్జగించి మేడం తినిపించారు ,


“రోజూ ఇలాగ చేస్తే కానీ ఇద్దరు తినరు….అంతకు ముందయితే ఇద్దరికీ వేరు వేరు గా పెట్టటానికి

చాలా ఇబ్బంది పడేదాన్ని .. ఇప్పుడు ఇద్దరూ పోటీగా తింటున్నారు ‘అన్నారు

ఎవరీ గాయత్రి .. ఆమె బిడ్డపై మేడం కెందుకు అంత మమకారం ? మేడం సందర్భం వచ్చి నప్పుడు చెబుతారులే అనుకున్నాను

రోషన్ రోజాల ఫోటోలు చూపారు..

“జర్మన్ అమ్మాయి కోడలు గా వప్పుకున్నారా మేడం?” అంది సుజన

“మనం వప్పుకోవడం, వప్పుకోక పోవడం అన్న ప్రశ్న ఏముంది సుజనా! వాళ్ళ పెళ్లి వాళ్ళ ఇష్టం”

“మనకేమీ ప్రమేయం లేదా… మన బిడ్డల పెళ్ళిళ్ల లో .. మన కుటుంబం లోకి వచ్చే అమ్మాయి మనకు తెలియవద్దా మేడం? “

“వాళ్ళు అనుకోవాలి కదా మనం అంతా ఒక కుటుంబం అని వాళ్ళు వాళ్ళు ఏర్పర్చుకున్నదే కుటుంబం అనుకుంటున్నారు. వాళ్ళ జీవితంలో మనకు చోటు లేదని అనుకుంటున్నారు .మనమేమి చేయగలం సుజనా? వాళ్ళు అలా అనుకున్నప్పుడు అది జర్మన్ అయినా ఇండియన్ అయినా మనకెందుకు? వాళ్ళు దూరంగా వుండాలని అనుకున్నప్పుడు మనం దగ్గరగా పోవాలని అనుకున్నా ప్రయోజం లేదు కదా ! మనకు దగ్గరగా రావాలని ప్రయత్నించే వాళ్లను ప్రేమించే నైజం మనంఅలవర్చుకోవాలి…లేకపోతే మనకు ప్రేమించడానికి ఎవరూ వుండరు, మనల్ని ప్రేమించే వాళ్ళు వుండరు“

సుజన ఆలోచిస్తూ వుంది

మేడం రిటైర్ అయినప్పటి ఫోటోలు చూపారు. మేము సీనియర్ ఇంటర్ లో ఉండగా మేడం ఇరవై రెండు వయసులో కాలేజ్ లెక్చరర్ గా తన ప్రస్థానం మొదలెట్టారు. ఒక టీచర్ రిటైర్ మెంట్ కు అప్పటి విద్యార్థులే కాక ముప్పై అయిదేళ్ల క్రిందటి విద్యార్థులు కూడా రావడం బహుశా చాలా తక్కువ మంది టీచర్ల కు జరిగే గౌరవం అనుకుంటా .ఫోటోలు చూసాక .. సుజన చేతన్ ని ఆడిస్తూ ఉంటే, నేను సుజన పిల్లల గురించి పడుతున్న వేదన గురించి ,పిల్లల ప్రవర్తన లో అంత మార్పు ఎందుకొచ్చిందో నా కున్న సందేహం కూడా మేడం కు చెప్పాను ,దానికి పరిష్కారం చెప్పమని అడిగాను .

” సుజన నువ్వు ఒక వారం ఇక్కడుండండి” అన్నారు మేడం

తలఊపాను

“చేతన్ తో సుజన ఎంత సంతోషంగా వుందో చూడండి మేడం .. ఆమె నవ్వులు చూడక ఎన్ని రోజులైందో.. గాయత్రి ఎవరు మేడం ? “

సుజన చేతన్ ఎత్తుకుని వచ్చి పడీపడీ నవ్వుతోంది .. ముకుంద్ వీడు ట్విన్కిల్ ట్విన్కిల్ లిట్టిల్ స్టార్ రైమ్ చెబుతాడు విను. చేతన్ చెప్పు కన్నా “ వాడు సిగ్గు పడుతూ తల ని పైకెత్తి స్టార్స్ ని చూపిస్తూ వచ్చీరానీ ముద్దు మాటలతో చెబుతుంటే నిజంగానే మాకు చెప్పలేని సంతోషం కలిగింది మేడం ,సుజన ఒకరి తర్వాత ఒకరు వాడ్ని ముద్దులాడారు . పసి పిల్లలు ఎంత సంతోషాన్ని తెస్తారు ఇంటికి ?

“గాయత్రి నా స్టూడెంటే తన తల్లిదండ్రుల ఇష్టానికి వ్యతిరేకంగా ఓ అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుoది. వాడు కొద్దికాలం తర్వాత ఇంకో అమ్మాయిని పెళ్ళిచేసుకుని ఇంటికి తెచ్చి, వద్దన్న గాయత్రిని నిండు గర్భవతిని చంపడానికి ప్రయత్నించాడు .. మృతువుతోపోరాడి బ్రతికింది .. ఆశ్రయం కోసం వచ్చింది, నిజానికి గాయత్రి రోజా కంటే కూడా ఎక్కువ నాకు .. రోషన్,రోజాల పిల్లలు మన దగ్గర వుండరు .. మన, పర ఎందుకు ముకుంద్? .ఎవరికీ మనం అవసరమో, ఎవరు మనల్ని ఆశిస్తారో ఎవరు మన ప్రేమని గౌరవిస్తారో వాళ్ళే మనవాళ్ళు .గాయత్రి ఈ రెండేళ్లలో బాగా చదువుకుంది … వుద్యోగం వస్తే వెళ్ళిపోతుంది .. తన జీవితం తాను నిర్మించుకుంటుంది . అది కూడా నేను ఆశిస్తున్నా తన కంటూ ఒక సొంత జీవితం వుండాలని... ”

సుజన మేడం మాటలు వింటూ ఆలోచిస్తోంది

రాత్రి నా గుండెలపై తలపెట్టుకుని ” ముకుంద్ ఎంతబావుంది కదూ ఇక్కడ ! నాకయితే ఇక్కడే ఉండిపోవాలని వుంది .. ”

“ఉందాం వారం రోజులు”

“ఆహా… ఇక్కడే ఉండిపోదాం “

“సరే ఆలోచిద్దాం”

ఉదయాన్నే గాయత్రి లేపింది ” సార్..మేడం వాకింగ్ వెళుతున్నారు మీరు వస్తారా అని అడిగారు”

సుజన ఎగిరి కూర్చుంది.

మేము బయటికి వచ్చేప్పటికి మేడం సార్ కు స్నానం చేపించి వీల్ చైర్ లో కూర్చోపెట్టి సార్ వళ్ళో చేతన్ ను కూర్చో పెట్టి బెల్ట్ వేశారు .. వాడు బుద్ధిగా కూర్చున్నాడు .. సార్ ఏదో మాట్లాడుతున్నాడు కానీ అవి మాకు అర్థం కాలేదు. మేడం వాటికి సమాధానం చెబుతోంది .. చేతన్ తో ఆయనేదో నవ్వుతూ చెబుతున్నాడు చేతన్ ఆయన్ని మాటి మాటికీ మెడ చుట్టూ చేతులు వేసి ముద్దు పెడుతున్నాడు . మేడం కి ఇద్దరూ పసివాళ్లే అనిపించింది . ముగ్గురం ఒకరి తర్వాత ఒకరం వీల్ చైర్ ని తోసుకుంటూ వెళ్లాం .

దార్లో వృద్ధాశ్రo తీసికెళ్ళారు. అక్కడున్న కొందరితో మాట్లాడాను. అక్కడ ఏదో నిరాశలో వుండే ముసలివాళ్ళు,రోగులు వుంటారనుకున్నా .. కానీ అక్కడ చాలా అర్థవంతమైన జీవితం నడుస్తోంది. చదువుకున్న వాళ్ళు , నిరక్షరాస్యులు కూడా ఉన్నారట. చాలా విశాలమైన ఆ ప్రదేశంలో మంచి తోట పెట్టారు . పూల మొక్కలతో పాటు ,వరి, కూరగాయలు ,ఆకుకూరలు పండిస్తున్నారు. వాళ్లకు సరిపోయి మళ్ళీ మార్కెట్ కు కూడా వేస్తారట. వాళ్లలో ఎక్కడా నిరాశ కనపడలేదు. చదుకున్న వాళ్ళకోసం చిన్న లైబ్రరరీ నడుస్తోంది న్యూస్ పేపర్లు పత్రికలు ,పుస్తకాలు వున్నాయి.అక్కడివాళ్ళతో మేడం మాట్లాడుతుంటే వాళ్ళకళ్ళలో మెరుపు చూశాను .. “ప్రతిరోజూ వస్తాను ఇక్కడికి … ఎంతో బావుంటుంది ఈ వాతావరణం” అన్నారు మేడం

“పిల్లలు వుండి కూడా ఇలాంటి చోట ఉండాల్సిన దురదృష్టం పట్టింది కదా మేడం వీళ్ళకి, వీళ్ళను చూస్తుంటే బాధగా వుంది” అంది సుజన

“అదృష్టం దురదృష్టం అనేవి లేవు సుజనా! జీవితాన్ని ఎలా వచ్చినా స్వీకరించాలి . మనకు అనుగుణంగా మార్చుకోగలిగితే మార్చుకోవాలి. మార్చలేనిదాన్ని అంగీకరించి ముందుకు పోవాలి… పిల్లల్ని మనం దోషులుగా చేయలేం ప్రతి దానికి వాళ్ళమీద చాలా ప్రభావాలున్నాయి . మన సంస్కారం వాళ్ళకెందుకు రాలేదంటే, వాళ్ళు ప్రపంచపు పోకడల్ని ఎక్కువ చూస్తున్నారు ,వాటికి ఎక్కువ ప్రభావితమవుతున్నారు . మనకాలంలో మనం తల్లి దండ్రులమీద ఎక్కువ ఆధారపడ్డాం , ఎక్కువ సమయం గడిపాం అందుకని వాళ్ళతో మనకు అనుబంధం వుంది , ప్రతి దానికి వాళ్ళ అనుమతి కోరాం ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోలేకపోయేవాళ్ళం .ఇప్పుడు వీళ్లకు మనం ఇచ్చిన స్వేచ్ఛ , నిర్ణయాన్ని తీసుకునే అధికారం, వాళ్ళని ఎక్కువ స్వతంత్రాన్ని తీసుకునేలా చేశాయి. ఇప్పటి ప్రపంచపు రీతులు,సోషల్ మీడియా, చిన్న వయసులో ఆర్ధిక స్వాతంత్యం యువత పై ఎక్కువ ప్రభావం చూపాయి. ఇక్కడే ఇలావుంటే అమెరికాలో వున్న జీవన విధాన ప్రభావం అక్కడి కెళ్లిన మనవాళ్లపై పడకుండా ఎలా వుంటుంది? అతి కొద్దికాలం లో మనదేశం కూడా అమెరికా లాగే ఉంటుంది మనం అప్పుడు దానికి అలవాటు పడిఉంటాం .”

దార్లో సుజనకు మేడం కు జరుగుతున్న సంభాషణ ఉంటున్నాను

“పాతికేళ్ళు మనతోవుండి ఈ దేశం ఇచ్చిన చదువును , అవకాశాల్ని ఉపయోగించుకుని మన త్యాగం తో ఎదిగి ఇప్పుడు మా జీవితంలో మీకు చోటు లేదంటే , మన గురించి ఆలోచనే చేయకుంటే మనం ఏమవుతున్నా వాళ్లకు సంబంధం లేదంటే ఎలామేడం ?” సుజన కళ్ళలో నీళ్లు తిరిగాయి

“ సుజనా హృదయ సంస్కారం పనిచేయని చోట ఏదీ పని చేయదు, నాకు తెలిసి అది బాహ్యమైన విషయాలను తెలియజేయడం వలన ఏర్పడదు. సాధారణంగా డబ్బు ,కరియర్ లాంటి వాటికి ప్రాధాన్యత హెచ్చినచోట అది అసలు ఏర్పడదు.”

“ఏమో మేడం.. పిల్లలు నన్ను పట్టించుకోవడం లేదని. వాళ్ళు మాకు కాకుండా పోయారని నేను చాలా క్రుంగి పోతున్నాను, ముకుంద్ నా బాధ చూడలేక వాళ్లకు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా , వాళ్ళు లెక్కచేయడం లేదు”

“మన పిల్లలు మనకెప్పుడూ మన ప్రపంచంగా అనిపిస్తూ వుంటారు , పసితనం లో వాళ్లకు మనం తప్ప లోకం తెలియనంతవరకు వాళ్లకు మనమే కదా ప్రపంచం ! తర్వాత కూడా అలా ఎలావుంటారు ? ఇప్పుడు చేతన్ ని మనం ఎలా పెంచామో , ముద్దులాడామో వాడు పెద్దయ్యాక గ్రహిస్తాడంటావా?... ఇది ప్రకృతి ధర్మం సుజనా..మన జీవితం మనo జీవించి..వాళ్ళ జీవితం కూడా మనమే జీవించాలంటే ఎలా సుజనా !”

“అయితే మనమేం చేయాలి మేడం? నాకయితే పిల్లలు లేకుండా పండుగలు లేవు , ప్రతి నిమిషం వాళ్ళు గుర్తొస్తారు , ఒక్క రోజు వాళ్ళు మాట్లాడకపోతే జీవితం శూన్యంగా అనిపిస్తుంది”

“ వాళ్లకు నచ్చినట్లు వాళ్ళు గడుపుతున్నారు కదా ! మనం కూడా సమయాన్ని క్వాలిటేటివ్ గా గడపాలి. మనకంటూ వున్నది ఒకటే జీవితం, ఇందులో ఎన్ని ఒడిదుడుకులున్నా, మనం చేయాల్సిన పనులు చేయాలి ,చేయాలనుకున్న పనులు , ఇష్టమైన పనులు చేయాలి. ఉద్యోగ రీత్యా కానీ ,బాధ్యతల వలన కానీ ఇంతకాలం మనకు తీరిక లేదనుకో ఇప్పుడు మనకు సంతోషాన్నిచ్చే స్నేహితుల్ని బంధువుల్ని కలవాలి, మనకిష్టమైన ప్రదేశాలు తిరగాలి. ఒకటి జరగలేదని ఇంకేవీ జరగరాదా సుజనా !”

సుజన దీర్ఘంగా ఆలోచిస్తోంది .

స్థితప్రజ్ఞత తో కూడిన ఆమెను చూస్తూనే వున్నాను ముప్పై అయిదేళ్ల నుండి; వృద్ధాప్యం ఆమెను

ఏ మాత్రం అనిశ్చలంగా గానీ చంచలంగా చేయలేదు. భాధలు ఆమె ఆత్మస్థైర్యాన్ని దెబ్బ తీయలేదు

భర్త అనారోగ్యం ,అవిటితనం, పిల్లల నిర్లక్ష్యం , కరిగి పోయిన ఆస్తులు , వెడలిపోయిన అంతస్తులు ఏవీ ఆమెను కృంగదీయలేదు .ఎన్ని సమస్యలు ఎదురైనా ఆమె చిరునవ్వు చెదరలేదు , జీవిత సమరానికి ఆమె బెదర లేదు . మాకు, ఇంకా అనేక మంది వయసుమళ్లుతున్న వాళ్ళకి సాధ్యం కానిది ఈమెకు ఎలా సాధ్యమయింది ? సుజన కు ఇప్పుడు రేచల్ మేడం నిజమైన చదువు నేర్పాలి .

“దీపావళికి ఓ స్నేహితురాలు ఇవాళ రాత్రికి భోజనానికి రమ్మంది వెళదాం” అంది మేడం

“మీరు వెళ్లి రండి మిమ్మల్ని పిలుస్తే మేము వస్తే ఎంబావుంటుంది ? అన్నాను

“అదేం లేదు మీరున్నారని చెప్పా ..అందర్నీ పిలిచింది”

సార్ తో సహా అందరం వెళ్లాం . మేడం స్నేహితురాలు విజయ ఇంటి ముంగిట్లోకి వెళ్ళగానే ఆ ముగ్గులు, ముగ్గుల్లో అందంగా అలంకరించిన దీపాలు మమ్మల్ని ఆశ్చర్య చకితుల్ని చేశాయి. ప్రక్కనున్న రాంప్ పైనుండి సార్ వీల్ చైర్ ని తీసుకొచ్చా0. ఆ రాంప్ సార్ కోసమే కట్టించారని మేడం చెప్పారు . లోపలికి వెళ్ళాక ఇల్లు మొత్తం ఒక అందమైన కళాఖండంలా అనిపించింది. మమ్మల్ని పలకరించిన వ్యక్తిని చూడగానే నేను సుజన ఆమె క్యాన్సర్ పేషంట్ అని గ్రహించాము. కానీ ఆమె ఎంత చలాకీగా తిరుగుతోందో చూసి ఆశ్చర్యపోయాం . ఆమె మాటలు వింటే , పెదవుల పై కదలాడే చిరునవ్వు చూస్తే….ఆమె ఎంత ఆశావాదో అర్థమయింది . ఆమె చాలా రకాల వంటకాలు చేశారు . అన్నీ స్వయంగా చేశారట . బాగా చదవడం ,ఇల్లు ,తోట అంత చక్కగా పెట్టుకోవడం ఆమె హాబీ అని మేడం చెప్పారు . కీమో థెరిపి తీసుకుంటున్నట్లు ఆమె పిల్లలు కూడా ఎక్కడో ఉన్నట్లు వాళ్ళిద్దరి సంభాషణ లో తెలిసింది. భర్త మరణించినట్లు ఒక ఫొటోకు పూల దండ వేయడం వలన , అతనామె భర్త అని అతను ఆమె తీసుకున్న ఫోటో వలన తెలిసింది. ఆమె తో మాట్లాడ్డం ఒక ఎడ్యుకేషన్ అనిపించింది . ఆమె పెద్దగా చదువుకోలేదని , డిగ్రీలేవీ లేవని మేడం ప్రోద్భలం తోనే పుస్తకాల చదవడం మొదలెట్టానని ఆమె చెప్పి నప్పుడు మేము నమ్మలేక పోయాము.


విజయ గారి గురించి మేడం చెబుతున్నారు దారిలో . “ఫోర్త్ స్టేజ్ లో వున్న లింఫాటిక్ క్యాన్సర్ తో బాధపడుతున్నారు . క్యాన్సర్ వచ్చిందని తెలిసి సింగపూర్ లో వున్న కొడుకు కూతురు వచ్చి తీసికెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించారు . ఎక్కువకాలం బ్రతికే అవకాశం లేదని తెలిశాక ఆమె ఇక్కడే వుండాలని నిర్ణయించుకున్నారు . పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు.భర్త అయిదేళ్ల క్రిందటే మరణించారు. ”

“ఆమె ఉక్కు మహిళ లాగా వుంది మేడం.. ఇన్ని సమస్యలతో .. కూడా అంత ఆశావాదమా !”

“జీవితo పై ప్రేమ… బ్రతికిస్తుంది ముకుంద్ ..అదీ చాలా అర్థవంతమైన జీవనం సాగించడానికి”

సుజన ఏమీ మాట్లాడకుండా అలోచిస్తూ ఉండిపోయింది.



మరుసటి రోజు మేం మేడం దగ్గర సెలవు తీసుకున్నాం . “ఈ వారం రోజులు మన పిల్లలు మనకసలు ఫోన్ చేయలేదని నీవు ఒక్క సారి కూడా అనలేదు సుజనా ..!”

“అవును ముకుంద్.. నేను ఇంకెప్పుడూ అలా వాళ్ళ ఫోన్ రాకపోతే ,వాళ్ళు మనల్ని పట్టించుకోలేదని బాధపడను , మంచాన పడ్డ సార్ తో , పట్టించుకోని పిల్లలతో నలుగురికి సహాయం చేస్తూ మేడం ఎంతో సంతోషంగా వుంది కదా ! క్యాన్సర్ తో బాధపడుతూ కూడా పిల్లల్ని ఆశించకుండా ఒంటరిగా తనకు నచ్చినట్లుగా వున్న విజయ గార్ని చూశాక , భర్త వదిలేసినా చిన్న బిడ్డని పట్టుకుని తన జీవితాన్ని చదువుతో దిద్దుకోవడానికి ప్రయత్నిచే గాయత్రి , వీళ్ళని చూసి కూడా నేను ఏడిస్తే ఎలా ? నన్ను ప్రాణంలా చూసుకునే నీవుండగా కూడా, లేని వాటి గురించి ఇంతకాలం బాధపడ్డాను, నిన్ను బాధపెట్టాను . ముందుగా పనిలో నిమగ్నమవుతాను , ఇంక ఎప్పుడూ విచారంగా ఉండను . పిల్లల పట్ల కూడా నాకేమీ వ్యతిరేకత లేదు.“

సుజన మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి . థాంక్స్ మేడం అనుకున్నా మనసులో .


Published in koumudi in November 2018

కూతురు


"అమ్మా నీవు స్నానానికి వెళ్ళినప్పుడు సరయు అంటి ఫోన్ చేశారు, మళ్ళీ ప్రోగ్రాం కానీ వేశారా? నేను హాస్టల్ కు వెళ్ళేంత వరకు ఏమీ పెట్టుకోవద్దమ్మా ప్లీజ్ " అంది నా కూతురు మైత్రి .

అల్ ఇండియా హెల్ప్ల్ లెస్ విమెన్ అండ్ చిల్ద్రెన్ సంస్థలో వాలంటీర్ గా నా స్నేహితురురాలు సరయు కౌషిక్ పనిచేస్తోంది . భర్త పెద్ద పారీశ్రామిక వేత్త , సరయు అందరు డబ్బున్న వాళ్ళలాగా విలాసాలు, వినోదాలు, కిట్టి పార్టీలు వగైరా లో ఆనందం వెతుక్కోకుండా, సామాజిక సేవ పట్ల ఇష్టం, బాధ్యత పెంచుకుంది. తన సంస్థ తరపు నుండే కాకుండా , తను వ్యక్తిగతంగా చాలా డబ్బు ఖర్చుపెడుతుంది . ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటుంది . ఆమె ఎప్పుడూ గుర్తింపు, పొగడ్త కోరుకోవడం నేను చూడలేదు.సరయు పరిచయం అయాక చాలా సార్లు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా చదువుకున్న ,తెలివైన, కరుణ కలిగిన వ్యక్తిగా ఆమెంటే నాకు చాలా గౌరవం వుంది. అందుకే వుద్యోగం చేసే నేను, తీరిక సమయం దొరికి నప్పుడు, ఉడతా భక్తిగా సరయుకు సహాయం చేస్తుంటాను .

సరయుకు ఫోన్ చేశా..
"మాధురీ ... ... ఒక రిపోర్టర్ నాకు ఫోన్ చేశాడు కూతురు ఇంటి నుండి గెంటి వేసిందని ఒక ముసలాయన న్యూస్ పేపర్ వాళ్లకు వచ్చి చెప్పాడట . దీన్ని సెన్సేషన్ న్యూస్ గా వేయడం కంటే, టీవీలో చూపడం కంటే ఆ కూతుర్ని కొంచం కౌన్సిలింగ్ చేసి బాధ్యత గలిగిన వ్యక్తిగా మారిస్తే మేలు కదా ! అన్నాడు. నాకు అదే మంచిది అనిపించింది. మనం వాళ్ళింటికి వెళదాం. మీరు నాతో వస్తే బావుంటుందని అనిపించింది . ప్లీజ్ వస్తారా!"

"తప్పకుండా ... వస్తాను "అన్నాను

పిలానీలోఇంజనీరింగ్ చదువుతున్న నా కూతురు మైత్రి సెలవులని వారం కిందట వచ్చింది. సెలవుల్లో తనని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని మారాం చేసే కూతుర్నిఎలాగో బుజ్జగించి సరయుతో బయలు దేరా. రిపోర్టర్ తో వున్న ముసలాయనను చూసి, మనసుకు కష్టం వేసింది. 80 ఏళ్ల వయసులో ఆయన్ని కూతురిలా తరమడం అన్యాయం, కొడుకులు చేశారంటే వింటున్నాం కానీ ... కూతురు ఇలా చేసిందంటే కొంచం ఆశ్చర్యం, సందేహం కూడా కలిగాయి..
ఆయన్ని అడిగాం ఏమయ్యింది ? అని

"నన్ను, నా భార్యను నా కూతురు మీకు తిండి పెట్టలేను వెళ్లి పొండి అంది తల్లీ, కనీ, పెంచి, పెద్ద చేశాం, పెళ్లి చేశాం, మాకింత ముద్ద పెట్ట మంటే చాతకాదు పొమ్మంది . నా భార్యను నా చుట్టాలింట్లో పెట్టి, పేపరోళ్ళ కు చెప్పమని నా కూతురింటికి దగ్గరలో వున్న ఆసామి చెబితే వచ్చాను" అన్నాడు.

"సరే పదండి, మీ అమ్మాయితో మాట్లాడి, మీకు న్యాయం చేస్తాం. ఆమె కాదు, కూడదంటే అప్పుడు మిమ్మల్నివృద్ధుల ఆశ్రమం లో వదులుతాను, సరేనా...దిగులు పడకండి" అంది సరయు.

ముగ్గురం ఆ ముసలాయన చూపిన ఇంటి దగ్గర దిగాం . చిన్న సందులో చిన్న ఇల్లు అది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటికి మేము, ముసలాయన రావడాన్నిఆసక్తిగా, ఆశ్చర్యంగా చూశారు. ఇంట్లోకి వెళ్లాం, రెండు పాత ప్లాస్టిక్ కుర్చీలు , ఓ ప్రక్క మంచం, పరుపు వున్నాయి . పేదరికం తెలుస్తున్నా ,ఆ ఇల్లు చాలా పరిశుభ్రంగా వుంది . మా అలికిడికి లోపలి నుండి ఒక 45 ఏళ్ళు పైబడిన స్త్రీ వచ్చింది. పచ్చటి చాయతో వున్నా రక్త హీనత తో పాలిపోయి వున్న ఆమె, ఆశ్చర్యంగా మమ్మల్ని,ముసలాయన్ని మార్చి మార్చి చూసింది. తర్వాత" మీరు ఎవరండి, ఎవరు కావాలి ?" అని " కూర్చోండి " అంది.

మేము అక్కడున్నకుర్చీల్లో,రమేష్ మంచం మీద కూర్చున్నాం.
"అమ్మ ఏదీ.నాన్నా.?.నువ్వు,అమ్మ నవీన్ దగ్గరికి పోలేదా ?"అంది వాళ్ళ నాన్న కేసి తిరిగి.
ముసలాయన పలకలేదు. మారు మాటాడకుండా బయట వున్న అరుగు మీద కూర్చున్నాడు .
"చెప్పండమ్మా ఎవరు మీరు.. నాకు గుర్తు రావడం లేదు " అంది ఆమెకు మేము వాళ్ళ నాన్నతో వచ్చామని తెలియలేదు.

రమేష్ గొంతు సవరించుకుని "అమ్మా ఈమె సరయు గారు ,ఆమె మాధురి గారు, నా పేరు రమేష్, నేను ఒక రిపోర్టర్ ని, మీ నాన్న నా దగ్గరకు వచ్చి మీరు అమ్మానాన్నని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారని చెప్పారు,వాళ్ళు ఈ వయసులో మీరు కాదంటే ఎక్కడికి పోతారు ? అందుకే మీకు నచ్చ చెప్పాలని వీళ్ళిద్దరి ని నేనే తీసుకొచ్చాను " అన్నాడు .

ఆ మాటలు వినగానే కోపం తోనో, అవమానం తోనో, ఆమె ముక్కుపుటాలు అదిరాయి,కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా అయాయి.దానితో పాటు ఆ కళ్ళలో కన్నీరు తిరిగింది . దు:ఖంతో నోట్లోంచి మాట రాలేదు. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఎంత సేపటికి ఆమె నుంచి సమాధానం లేదు .

సరయు నాకేసి చూసి, ఏమైనా అడుగు అన్నట్లు సైగ చేసింది .

నా కెందుకో ఆమెను చూస్తుంటే అంత సంస్కారహీనురాలు కాదనిపించింది.ఆవేశంలో ఏదో అనుకుని, అపార్థాలతో ఇలా జరిగిందేమో అనిపించింది, ఏమయినప్పటికీ ఎలాగూ వచ్చాం కాబట్టి, ఏదో విధంగా నచ్చ చెప్పడం మంచిదనిపించింది.
"చూడండి.... ఇది మీ కుటుంబ విషయమే , మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించాలి ,కానీ తల్లిదండ్రులు,వృద్ధులు కదా ... వాళ్ళు ఎక్కడికి పోతారు ..? ఆయన వయసు చూడండి ... పాపం ఎంత దీనంగా వున్నారో ... మా సంస్థ తరపున నుండి మీకు ఆర్ధిక సహాయం కూడా చేస్తాము .. వాళ్ళని మీ దగ్గరే ఉండనివ్వండి ." ఎందుకో చెప్పడం.. అయితే చెప్పాను,కానీ నాకు బాగా అనిపించలేదు.

ఆమె గట్టిగా నిట్టూర్పు వదిలింది.

"వృద్ధుల పట్ల , సమాజం పట్ల మీకు గల బాధ్యతను నేను గౌరవిస్తున్నాను . నేను మీలాగా పెద్ద చదువులు చదవలేదు, కాదు మమ్మల్ని చదివించలేదు .నా భర్త కు ఆరోగ్యం బాగాలేదు, మా ఆర్ధిక పరిస్థితి బాగా లేదు నా ఇద్దరు పిల్లలు డబ్బులేక మంచి చదువులు చదువుకోలేక నిరాశలో వుండి పోయారు ,ఈ సమస్యల్లో మాకు వీళ్ళిద్దరి ని, వాళ్ళు నా తల్లి దండ్రులే కావచ్చు,కానీ నేను పోషించలేను. అందుకే మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాను. అంతే కానీ వీళ్ళను నేను నా ఇంటి నుండి గెంటివేయలేదే ...!" ఆమె మాటల్లో స్థిరత్వం, నిజాయితి కనపడ్డాయి .



సరయు, నేను ఆశ్చర్యపోయాము . "ఆయనకు కొడుకులున్నారా ?" ఇద్దరం ఒకే సారి అన్నాము.

"ఇద్దరు కొడుకులున్నారు...అంతేకాదు వాళ్ళు చాలా స్థితిమంతులు ,మా నాన్న ఆస్తి అంతా కొడుకుల కిచ్చారు, ఆస్తి తీసుకున్న కొడుకులు కదా వీళ్ళను చూసుకోవాలి ... "

"తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కొడుకులైనా, కూతుర్లయినా ఒకటే కదండీ ... మీ దగ్గర వుండాలని ఉందేమో వాళ్లకు " అంది సరయు .

"చూడండి... మీరు విషయాన్ని ఒకే కోణం నుండి చూస్తున్నారు ... వృద్ధులైన నా తల్లిదండ్రుల గురించి మీరు సానుభూతి తో వున్నారు ... మధ్యతరగతి కుటుంబాల్లో ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రిందట ఆడపిల్లల పరిస్థితి ఏమిటో మీకు తెలియనట్టుంది, మా కుటుంబ విషయమే ఇది ,మేము ఎక్కడా ఈ విషయాలు ఎవరికీ చెప్పుకోలేదు ... ఈ రోజు మా తల్లిదండ్రులు మేం వాళ్ళని బయటికి గెంటి వేశాం అని పేపర్ వాళ్లకు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నా ..."

ఆమెకు కష్టం కలిగించే విషయమైనా, ఆమె స్పష్టంగా, నెమ్మదిగా చెప్పడం విన్నాం ...

"మా నాన్న ఒక చిన్న ఉద్యోగిగా పని చేసేవారు . ఆయనకు పెద్దగా చదువు లేకున్నా, డబ్బును చాలా జాగ్రత్తగా దాచి, దాన్ని పదింతలు చేసే తెలివితేటలు వున్నాయి. నేను, నా చెల్లెలు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు , మా అమ్మ చదువు కోలేదు, ప్రపంచం తెలియదు, కానీ నాన్న ఏది చెబితే, అదే సరి అయినదని నమ్మేది. నేను చెల్లి మున్సిపల్ స్కూల్లో చదివాం ,మా తమ్ముల్లిద్దర్నీ వానులో సెయింట్ జోసెఫ్ స్కూలుకు పంపేవారు. మా అమ్మ రోజూ మా తమ్ముల్లిద్దరికీ ఉదయాన్నే పాలు బోర్నవిటా,కోడిగుడ్డువుడకపెట్టి ఇచ్చేది ,మాకు బోర్నవిటా రుచి కూడా తెలియదు , మా చెల్లి ఆశగా చూసేది వాళ్ళు పాలు త్రాగుతూ వుంటే ; "మాకు కూడా కోడిగుడ్డు,బోర్నవిటా ఇవ్వమ్మా "అని అడిగేది ... "మగపిల్లలకు బలం వుండాలని మీ నాన్నవాళ్ళకే ఇవ్వమన్నాడు, ఆడపిల్లలు త్రాగితే తొందరగా ఎదుగుతారు, వద్దులే" అనేది. నేను వప్పుకున్నట్టుగా చెల్లెలు వప్పుకోలేకపోయేది. ఏడ్చేది,కొట్లాడేది. లాక్కునేది, దెబ్బలు తినేది. పాలు కోడిగుడ్డు మాకు అందని చందమామ. అమ్మకూడా తినేది కాదు. ఆమెకు కోరికలు అనేవి ఉండేవి కాదు నాన్న చెప్పినట్లు, ఆయనకు నచ్చినట్లు చేయడమే ఆమె జీవితం. ఆడపిల్లలంటే ఆమె లాగే ఉండాలనే ఆమె నమ్మేది ."

"మా చదువుల గురించి నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. పదోతరగతిలో నేను మా స్కూల్లో అత్యధిక మార్కులు సంపాదించి జిల్లా కలెక్టర్ తో బహుమతి అందుకున్నా . కానీ మా నాన్న నన్ను కాలేజిలో చేర్పించలేదు ,నా చెల్లెలు తొమ్మిదవ తరగతిలో ఉండగానే దానికి టైఫాయిడ్ వస్తే ,సరిగ్గా వైద్యం చేపించక , రోగం తిరగ పెట్టి అర్థ సంవత్సరం చడువుపోయింది . అయినా అది నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది . దాన్ని కూడా కాలేజ్ లో చేర్చలేదు. అయితే ఏడవతరగతి లో తప్పిన మా పెద్ద తమ్ముడ్ని ట్యూషన్లు చెప్పించి ,పరీక్ష రాస్తూ వుంటే సెంటర్ల చుట్టూ తిరిగాడు, మార్కులు వేయించి పాసు చేయించుకున్నాడు. "

"పదహారేళ్ళ వయసులో నన్ను ఒక్క మాట కూడా అడగకుండా, చదువులేని వ్యక్తితో , పెళ్లి నిశ్చయం చేశారు. నోరు తెరిచి నాకీ పెళ్లి ఇష్టం లేదనే ధైర్యం లేదు మాకా రోజుల్లో. సంపాదించిన డబ్బునంతా కొడుకులకు దాచకపోతే కూతురికి మంచి సంబంధం తేవాల్సింది అని హితవు ఎవరైనా చెప్పినా, నాన్న వినేవాడు కాదు . నా పెళ్లి అయిన రెండో సంవత్సరమే చెల్లికి కూడా యోగ్యత లేని, చదువు పెద్దగా లేని వాడి కిచ్చి పెళ్లి చేశాడు. తమ్ముల్లిద్దర్నీ కర్నాటక లో డొనేషన్ కట్టి ఇంజనీర్లను చేశాడు.. మేం ఎంత ఇబ్బందుల్లో వున్నా నాన్న మాకెప్పుడూ ఆర్ధిక సహాయం చేయలేదు."

"నాన్న తమ్ముళ్ళకు ఆస్తి పంచారు, తమ కంటూ కొంచం కూడా ఉంచుకోలేదు. పంపకాలు చేస్తున్నప్పుడైనా ఆడపిల్లలకు చెరి యాభై వేలు ఇవ్వమని పెద్దమనుషులు చెప్పినా, మా నాన్న ఒప్పుకోలేదు . ఏనాడో పెళ్లి అయిన ఆడపిల్లలకు ఎందుకివ్వాలని పెద్దమనుషులనే కోప్పడ్డాడు. మా అమ్మకు ఇవ్వాలని వున్నా, ఆమె మాట నెగ్గదని తెలిసి ఏమీ మాట్లాడలేదు. అమ్మా నాన్న సొంత ఇంట్లోనే వుండేవారు. తమ్ముళ్ళు అన్నీ అమ్మేసి తమ దగ్గరకు వచ్చేయమంటే , అమ్మేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయారు. బిజినెస్ కు డబ్బు అవసరమని పెద్ద తమ్ముడు నాన్న దగ్గరున్న డబ్బు ,అమ్మ బంగారం అంతా తీసుకుని నష్టపోయాడు . అమ్మా నాన్న బరువయ్యారు. పెద్ద తమ్ముని భార్య పోరుపడలేక, చిన్న తమ్ముని దగ్గరకు పోతే, అంతా పెద్దోడికే పెట్టావని చిన్న తమ్ముడు, వాడి భార్య సాధించారు . విధిలేక వూరికి వెళ్ళిపోయి అక్కడే వుండినారు. నేనే వీళ్ళు పడుతున్న బాధచూడలేక, కొంతకాలం క్రిందట నా దగ్గరకు తెచ్చుకున్నా. ఎంతకాలమైనా వీళ్ళు ,తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళే ఆలోచన చేయలేదు. "

"నా కుటుంబ పరిస్థితి ని బట్టి చాలా కాలంగా మా అమ్మా నాన్నబాధ్యత తమ్ముళ్ళకు వివరించి సహాయం అడుగుదామని చెబుతున్నా. వాళ్ళు ఏ మాత్రం నా మాటలు పట్టించుకోలేదు. తమ్ముళ్ళ తో నేను మాట్లాడతాను అన్నా వప్పుకోలేదు . ముందు చూపు లేకుండా వున్న దంతా కొడుకుల కిచ్చి వీధిన పడిన వీళ్ళకు ఈ స్థితి ఎందుకొచ్చింది ? మమ్మల్ని కూడా మా తమ్ముళ్ళ లాగా చదివించి వుంటే ఆడపిల్లలు, మగ పిల్లలు అనే తేడా లేకుండా పెంచి వుంటే , మేం మా భర్తల్ని ఎదిరించి అయినా సంపాదించి మా తల్లిదండుల్ని చూసుకునేవాళ్ళం . కానీ మా చేతుల్లో విద్యలేదు, డబ్బులేదు, మాకు స్వాతంత్యం కూడా లేదు , ఏమిచేయగలం ?"

ఆమె ఆగి ఊపిరి తీసుకుంది
ముసలాయన కేసి చూశాం. ఆమె చెప్పింది వినపడిందో, లేదో ..అర్థమయిందో, కాలేదో మరి, ఏ భావమూ లేదు అతని ముఖంలో. ఆమె ముఖం దీనంగా మారింది .

" వాళ్ళను మేం కోరేది ఒక్కటే ... మాకేమీ ఇవ్వొద్దు , వాళ్ళ అవసరాల కొసమైనా కొంత ఆస్తిని ,డబ్బును మీ దగ్గరుంచుకోమని ... ఎంత మంది కొడుకులు ఎంత హీనంగా చూసి వీళ్ళను తిరస్కరించినా వాళ్ళే తమ వారసులని ,తమ సంపాదన అంతా కొడుకులకే చెందాలనే మన తల్లి దండ్రుల నైజం మారాలి . ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఆస్తి ఇస్తున్నారు ? ఆస్తి గురించి కాదు, ఆమ్మాయిని ,అబ్బాయిని తేడా లేకుండా పెంచాలి.. ఇద్దరినీ వారసులు, వంశో ద్దారకులు గానే గుర్తించాలి. మీరు చదువుకున్నవారు ,సమాజసేవ చేసేవారు , మార్చండి ఈ వ్యవస్థలో కూతురుకున్న స్థానాన్ని. "

మాకేం చెప్పాలో తోచలేదు. మళ్ళీ ఆమే మాట్లాడింది

"మా అమ్మా నాన్న ను మీరు చెప్పడం వలన నేను చూసుకేలేనమ్మా ... తమ్ముళ్ళు చూసుకోని రోజు వాళ్ళు నా భాధ్యతే . నేను కోరింది ఒక్కటే వాళ్ళను ఆస్తి అంతా వాళ్ళ కిచ్చారు కదా ... మీకు ఇప్పుడు కావాలని అడగండి .. మీరు ఇచ్చింది మీరు అడగడం లో తప్పేముంది? వెళ్లి వాళ్ళని నిలదీయమని చెప్పాను. కానీ వీళ్ళకు కొడుకుల ఆనందం తప్ప , వీళ్ళ అవసరాలు కానీ, మా అవస్థలు కానీ అవసరం లేదు .ఈ దేశం లో ఆడపిల్లల గతి యింతేనమ్మా ... ఇప్పుడే కాదు ,రామాయణ కాలం నాటి నుంచి అంతే. దశరథుడు కూతురు శాంత తో తృప్తిపడ్డాడా... కొడుకులకోసం శాంతను రోమపాదునికి దత్తత ఇచ్చాడు . దశరథుని కొడుకుల ముచ్చట కూతురి వలన తీరిందనే సత్యం ఎంతమందికి తెలుసు ? శాంత ఔదార్యం ఎక్కడైనా కీర్తించ బడిందా ?"

"మా బిడ్డల సాక్షిగా చెబుతున్నానమ్మా ,మాకున్న దాంట్లోనే వాళ్లకు పెడతాం , చివరి వరకు మా అమ్మా నాన్నని నేను చూసుకుంటాను . ఎవరి సహాయం కూడా మాకు అవసరం లేదు. " కన్నీళ్ళతో ఆమె కళ్ళు నిండిపోయాయి. ఉద్వేగంతో గొంతు పెగల్లేదు.

నోరేత్తలేకపోయాం. మా దగ్గర మాటలు లేవు. ముగ్గురం ముఖాలు చూసుకున్నాం. రామాయణంలో రాముడికి ఒక అక్క వుందని , యూనివర్సిటి డిగ్రీలున్న మా ముగ్గురికి తెలియలేదు. మేడి పండులాంటి ఈ సమాజం లో ఎన్ని పురుగులున్నాయో ! ముసలాయన అరుగు మీదనే నిశ్చలంగా వున్నాడు . కూతురు గురించి చెప్పాడు కానీ ఇద్దరు కొడుకులు కూడా చూడ లేదని ఒక్క మాట కూడా అనలేదు . రక్తం లో జీర్ణించుకుపోయిన ఈ స్త్రీ పురుష తేడాలు ,ఎలా పోగొట్ట గలం ?

ఆమె లోపలి కి వెళ్లి నాలుగు గ్లాసుల్లో మజ్జిగ తెచ్చింది. మేము త్రాగి బయటికి వచ్చాము . బయట తండ్రికి గ్లాసు నోటికి అందించి మజ్జిగ త్రాపిస్తున్న ఆమెను చూసి మాకు హృదయం ద్రవించింది . నా కయితే ,ఆమె మహోన్నత వ్యక్తిత్వం ముందు మేము మరుగుజ్జులం అనిపించింది.ఆమెకు మేము కౌన్సిలింగ్ చేయడమేమిటి ? సమాజపు రీతుల గురించి ఆమె మాకు ఎంతో తెలియ చేసింది. మేమింక ముసలాయన దగ్గరకు కూడా పోలేదు. మా అవసరం అతనికి లేదు.

"మళ్ళీ కలుస్తాం మేడం " అన్నాడు రమేష్.

ఆమె ఏదో అనబోయి మౌనం వహించింది. చేతులు జోడించి కళ్ళతోనే వీడుకోలు తీసుకున్నాం .

"ఆమె పేరేంటో అడగనేలేదు మేడం ... ఆమె గురించి రాస్తాను . అమె సామాన్యంగా వున్న, సామాన్యుల్లో వున్న, చాలా గొప్ప మనిషి, మన జాతి సంపద " కార్లో కూర్చున్నాక అన్నాడు రమేష్.

"ఆమెకు పేరెందుకు ? ఆమె ఒక "కూతురు " అంది సరయు.

నాకు కూతురుంది, అనుకున్నా మనసులో తృప్తిగా

Tuesday, 12 March 2019

వుండండి నాన్నా!



చాలా రోజులుగా కూతురున్న ఊరికి వెళ్ళలేదు నారాయణ రెడ్డి. ఇప్పుడతనికి ఆ వూర్లో పనుంది . ఇప్పుడు కూతురు కోసం కాకుండా పనికోసం వచ్చానంటే కూతురు బాధపడుతుంది . పైకి ఏమీ అనకపోయినా మనసులో అయినా నన్ను పట్టించుకోలేదు కదా అనుకుంటుంది . నిజమే కూతుర్ని పట్టించుకోలేదు. పట్టించుకోకూడదని కాదు అలాంటి పరిస్థితిలో వున్నాను మరి అనుకున్నాడు. నారాయణ రెడ్డి అంటే వూర్లో మంచి వ్యవసాయపు భూములున్న వ్యక్తి . ఆరు నూరైనా నూరు ఆరైనా మాట మీద నిలబడే ఖచ్చితమైన మనిషి , నలుగురికి సాయం చేయడంలోను, కుటుంబ వివాదాలొస్తే, భూమి తగాదా లొస్తే, తగవు తీర్చే పెద్దమనుషుల్లో నిజంగా పెద్ద మనిషి. నొప్పివ్వక తానొవ్వక అనే సిద్ధాంతంతో పాటు ఎవరైనా నొప్పించినా, అతడే పరిస్థితిల్లో అలా చేశాడో అనుకుని, మనసుని మళ్లించుకుని, మన్నించి మర్చిపోయే వాడు. అందుకే అతని వదనంలో శాంతం తాండవిస్తుంది, లేత గులాబీ రంగులో ఎనభైలో కూడా ఆయన ఛాయ మెరుస్తుంది. నీ కొడుకుల మొహాల్లో ముడతలున్నాయి నీవేమి అమృతం తాగావా అని అతని స్నేహితులు అబ్బుర పోతుంటారు . తల దించుకునే పనెప్పుడూ ఆయన చేయలేదు. కష్టాలకు కన్నీళ్లకు క్రుంగక, లొంగక మేరు పర్వతంలా నిలబడ్డాడు.

కానీ ఇవాళెందుకో ఆయన మనసుకు కష్టoగా వుంది. ఎప్పుడో అమ్మిన ఓ భూమి తాలూకు రిజిస్ట్రేషన్ గురించి పేరు రాయడంలో ఏదో పొరపాటు జరిగినందుకు వాళ్ళు కారు పంపిస్తాం రమ్మన్నారు. తీరా బయలు దేరుతుంటే ఆయనలో ఈ సందేహం మొదలయ్యింది. కూతురికి వస్తున్నానని ఫోన్ చేద్దామని అనుకున్నాడు కానీ మనసొప్ప లేదు. పని మీద వస్తున్నానని చెప్పడం అతనికి కష్టoగా వుంది. భార్యకు చెప్పేశాడు. “జానకికి నువ్వు ఫోన్ చెయ్యి నేను వస్తున్నానని “ అన్నాడు. అమ్మా కూతురు రోజూ మాట్లాడుకుంటుంటారు అప్పుడప్పుడు ‘నాన్న కివ్వమ్మా ‘ అని కూతురు అడిగితే మాట్లాడుతుంటాడు ,అదే పనిగా కూతురుకు అతనేమీ ఫోన్ చేయడు .

దారి వెంట అంతా కూతురు గురించి ఆలోచించాడు నారాయణరెడ్డి . సంవత్సరం దాటింది కూతుర్ని చూసి అతనికి అయిదేళ్ల వయసులో వున్నప్పుడు తల్లిని కోల్పోయాడు. అతనికి లీలగా గుర్తున్నది చనిపోయే ముందు తల నిమిరిన తల్లి చేతి స్పర్శ , అంతవరకు ఏడ్వని అతని తాత కూతుర్ని చితిపై పడుకో బెట్టాక పొడవైన ఆమె జడ చితి పైనుండి నేలపై జీరాడుతుంటే దాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలు పగిలేలా మనవడిని హత్తుకుని భోరుమనడo. నారాయణ రెడ్డి తన తల్లి అందం, రంగు, పొడవాటి జుట్టు పుణికి తెచ్చుకున్న కూతుర్ని చూసుకుని మా అమ్మ అని మురిసిపోయేవాడు . అతని తల్లి పేరు జానకి. అదే పేరు కూతురుకు పెట్టుకున్నాడు. వూర్లో ఆడపిల్లలు ఎవరూ చదువుకోకున్నా జానకిని బీఎస్సీ బియ్యీడీ చదివించాడు. జానకి తమ్ముళ్లు డిగ్రీలు చేసినా వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండిపోయారు.

జానకికి టీచర్ వుద్యోగం వచ్చింది.మంచి కుటుంబం నుండి సంబంధం కూడా వెతుక్కుంటూ వచ్చింది. ఒక్కడే కొడుకు, అత్తామామ మంచి వాళ్ళని తెలిసింది. అల్లుడు బంగారం, కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. కట్న కానుకలు ఏమీ అడగలేదు. జానకి అదృష్టానికి నారాయణరెడ్డి మురిసిపోయాడు. ఉన్నంతలో పెళ్లి బాగా చేశాడు. జానకి కాన్పుకు అమ్మగారింటికి వచ్చింది, ఆరునెలలు మనవడ్ని మురిపెంగా క్రిందపెట్టకుండా మోశాడు. మళ్ళీ మనుమరాలు పుట్టింది. మూడో నెలలోనే బాబుకు స్కూల్ ఉందని జానకి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. కొడుకులకు పెళ్లిళ్లు అవడం, వాళ్లకు పిల్లలు పుట్టడం, వాళ్ళతో అనుబంధం, ఇలా సాగుతున్న సమయంలో జానకి భర్త గుండెపోటుతో మరణించాడు. కుమిలి పోతున్న కూతుర్ని చూసి కన్న వాళ్ళ హృదయాలు భగ్గుమన్నాయి. అత్తమామలు కోడల్ని బాగా చూసుకున్నా ,తల్లి దండ్రుల ప్రేమ , అండ ఆ సమయంలో అవసరమని జానకి దగ్గర చాలా కాలం వున్నారు.

కాలం అన్ని గాయాల్ని మాన్పుతుంది. నెమ్మదిగా జానకి ఉద్యోగానికి వెళ్ళింది. పిల్లల్ని మంచిగా తీర్చింది. అమ్మాయికి పెళ్లి చేసింది. పెళ్ళయాక కూతురు అల్లుడు అమెరికా వెళ్లిపోయారు . కొడుకు ముందే అమెరికాకు చదవడానికి వెళ్లి అక్కడే వుండిపోయాడు. అత్తా మామ నాలుగేళ్లలో ఒకరు ముందు ఒకరు వెనక కాలం చేశారు . ఇప్పుడు జానకి ఒక్కతే వుంది. అది తలుచుకుంటేనే తండ్రి మనసు బరువవుతుంది. అత్త కాలం చేశాక ఓ ఆరు నెలలు అమెరికాలో వున్న కూతురు, కొడుకు దగ్గరకు వెళ్ళొచ్చింది. జానకి పుట్టింటికి వచ్చినప్పుడు నారాయణ రెడ్డి ఓ స్నేహితుడి కి ఆరోగ్యం బాగా లేకపోతే బెంగుళూరు హాస్పిటల్ కు వెళుతోంటే సహాయంగా వెళ్ళాడు అందువలన కూతుర్ని చూడక ఏడాది అయింది.

‘ఎప్పుడూ తమ్ముళ్ల దగ్గరే ఉంటారే …ఏం నాన్నా నా దగ్గరకు రారేం ?’ అని కూతురు అడగలేదు కానీ … కూతురు దగ్గర ఉండలేక పోతున్నానే అపరాధ భావం అతనికే కలిగింది. జానకి కూతురు, కొడుకు ఒంటరిగా వున్న అమ్మను వదిలి ఎందుకు అమెరికాలో వున్నారో అర్థం కాలేదు . బంధాలు, బాంధవ్యాలు అనేవి లేకుండా స్వార్థం పెరిగి పోతోంది , సాంకేతికంగా ఎదిగి , సౌకర్యాలు పెరిగి మానవుడు సంకుచితుడు అయిపోతున్నాడు . ఏమవుతాయి మానవ సంబంధాలు ? ఎన్నో బాధ్యతలు ,బాధలు వున్నా, నా కూతురు ఒంటరిగా ఉందని తలచుకుని మేం బాధ పడుతున్నామే … జానకి పిల్లలకు ఎందుకు ఆ ఆలోచన రావడం లేదు? మార్పు సహజమే .. తరాల అంతరాలలో తేడాలుంటాయి కానీ కనీసం కన్నతల్లి గురించి ఆలోచించలేని పరిస్థితి ఉంటుందా! ఏమో మరి ప్రాధాన్యతలు మారిపోయాయి! మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు అయినప్పుడు…డబ్బు తెచ్చే సౌకర్యాలు , సంతోషాలకు ప్రాధాన్యత పెరుగుతుంది . నా బంగారు తల్లికి అల్లుడు పోవడంతోటే అన్ని శాంతులు అన్ని సంతోషాలు పోయాయి … ఇప్పుడు గానీ అల్లుడు ఉంటే జానకి గురించి తాను ఇలా వ్యధ చెందేవాడా! తెలియకుండానే కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి . అల్లుని మంచితనం , అందమైన చిరునవ్వు , కూతురి కళ్ళలో నైరాశ్యం గుర్తుకొచ్చేకొద్దీ నారాయణ రెడ్డి కి దుఃఖం ఎక్కువయింది. కారులో వున్నది అపరిచితులు కాబట్టి వాళ్ళు అతని కేసి చూడలేదు . వాళ్ళ మధ్య సంభాషణ కూడా జరగలేదు కాబట్టి నారాయణ రెడ్డికి కూతురి గురించిన ఆలోచనలు బాధించాయి . అయిదు గంటల ప్రయాణంతో అలిసిపోయి కూతురింటికి వచ్చాడు.

తల్లి పోలికలున్న కూతుర్ని చూస్తే అతనికి ఒక రకంగా సంతోషం మరొక రకంగా కూతురు ఇలా ఒంటరయిందే అని బాధ. చాలా కాలం తర్వాత కూతురుతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాడు మరుసటి రోజు “సెలవు పెడతా నాన్నా !” అని జానకి చెప్పగానే

“రిజిస్ట్రాఫీసు లో పని చూసుకోవాలి కదా సెలవు ఎందుకు వృధా చేసుకుంటావు ? రోజంతా బయటే వుంటాను కదమ్మా !” అన్నాడు.

మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేసి స్కూలుకు వెళ్ళిపోయింది జానకి . సాయంత్రం తండ్రి కిష్టమైన కూరలు వండి పెట్టింది. నారాయణ రెడ్డికి మనసు చల్లగా వుంది. కూతురు సమక్షం ఆయనకు ప్రశాంతత నిచ్చింది. అదీ ఇదీ మాట్లాడుతూ

“అమ్మా పిల్లల్ని మన దేశం వచ్చేయమని చెప్పరాదా! ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలుండవా ఏమిటీ ? నీవు ఒక్కదానివి అయ్యావు … నీ పిల్లలు ఇక్కడుంటే నీవు వాళ్ళ దగ్గరకు పోవడమో వాళ్ళు నీ దగ్గరకు రావడమో చేయొచ్చు కదా ! ”

“లేదు నాన్నా…నేనేమీ చెప్పను వాళ్ళ జీవితం వాళ్ళిష్టం .. వాళ్లకు నచ్చినట్లు వుంటారు, వాళ్లకు ఇష్టమున్న చోట వుంటారు .. నేనెందుకు కల్పించుకోవడం ? ఒక వేళ నేను అడిగినా, వాళ్ళేమీ స్పందించరు… ఒంటరితనం అంటారా…అది నాకు అలవాటయింది” జానకి కళ్ళలో నిస్తేజం చూసి అతనికి చాలా కష్టమేసింది.

“బడి సంగతేంటమ్మా గవర్నమెంట్ బళ్ళు పూర్తిగా అధ్వాన్నం అయిపోతున్నాయని పేపర్లో రాస్తున్నారు. “ అన్నాడు

“నిజమే నాన్నా… స్కూళ్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి .. అందరూ కాన్వెంట్ కెలితేనే చదువనుకుంటున్నారు, మధ్యాహ్న భోజనపథకం కొంతవరకు కొన్నాళ్ళు పిల్లల్ని బడికి రప్పించింది కానీ ఇప్పుడు అదీ పని చేయడం లేదు ఒకటి నుండి పది తరగతులకు 54 మంది వున్నారు . వాళ్లలో బడికి వచ్చేది ముప్పైమందే … ఆసక్తి పోతోంది నాన్నా ఈ వుద్యోగం చేయడం పై! ఒకప్పుడు పేద, పల్లె విద్యార్థులకు చదువు చెప్పడంలో ఎంతో ఇష్టం ఉండేది . మనవూర్లో మాకు ఎంత బాగా చెప్పేవాళ్ళు … మా టీచర్లను చూసి నేను టీచర్ కావాలని కోరుకున్నా … కానీ ఇప్పుడు పరిస్థితులు ఈ వృత్తికి గౌరవం ఇచ్చేలా లేవు … విద్యార్థులకు గురువుల పట్ల గౌరవం కూడా లేదు .. టీచర్లలో కూడా మునుపటి నిబద్ధత కూడా లేదు… “

“విలువలన్నీ మారిపోయాయమ్మా .. మంచిని మరిచి వంచనే నేర్చిన వాడు నెగ్గుకొస్తున్నాడు … పోనీ నీకు వుద్యోగంలో తృప్తి లభించకపోతే.. వదిలేసి మా దగ్గరకొచ్చేయమ్మా నీ పిల్లల దగ్గరకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు “

“అలా పూర్తిగా నిరాశలో లేనులే నాన్నా …చదువుకోవాలని వచ్చే ఒక్క విద్యార్థికైనా చదువు చెప్పడం నా విధి కదా! ”-

“నీ ఇష్టం తల్లీ ..నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయమ్మా .. నీవు సంతోషంగా , ప్రశాంతంగా వుండు “ అంటుంటే ఆతని గొంతు వణికింది

ఎగసి పడే అలలా వుండే కూతురు కదలిక లేని సరస్సులా నిబ్బరంగా వుంది. జానకి నవ్వితే గలగల పాడే సెలయేరులా అనిపించేది. జానకి ఇంట్లో ఉంటే తుళ్ళింతలు, కేరింతలు వుట్టిపడేవి. జానకి పెళ్లయి వెళ్ళి పోయాక ఇంట్లోని నిశ్శబ్దం తట్టుకోలేక…నారాయణరెడ్డి, అతని భార్యా ,తమ్ముళ్లు దిగాలు పడ్డారు. నెమ్మదిగా జానకి “ఆడ” పిల్ల అని “ఈడ” పిల్ల కాదని గ్రహించారు. త్వరలోనే అందరికి జానకి ఒక చుట్టం లాగా అయిపొయింది. మర్యాదలు పాటించడం మొదలు పెట్టారు . తమ్ముని భార్యలు భయంతో అణకువతో ఆమెకు సేవ చేయడానికి వస్తే జానకి నవ్వేసేది “.. నా ఇంట్లో నాకు మర్యాదలా ! “అని చిరు కోపం ప్రదర్శించేది. అయినా అవి అలానే సాగేవి .

భర్త మరణం తర్వాత జానకి ఎప్పుడూ మౌనంగానే ఉండేది. పిల్లలు కూడా అదే ధోరణిలో వాళ్ళమ్మను అంటిపెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఇపుడెలా వున్నారో మరి ఏండ్ల తరబడి అమ్మను చూడకుండా! అడ్డాలనాడు బిడ్డలు, గడ్డాలనాడు కాదు అని ఇలాంటి పరిస్థితిలోనే పెద్దలు అని వుంటారు.

సాయంత్రం స్కూలు నుండి రాగానే తండ్రికి తాను తీసుకొచ్చిన చీనీ పండ్లు వలిచి ఇచ్చింది జానకి. సాయంత్రం నుండి జానకి దగ్గుతూనే వుంది.

“డాక్టర్ దగ్గరకు వెళ్లరాదా అమ్మా! ఇప్పుడైనా వెళదాం పద !” అన్నాడు తండ్రి .

“ఇది జలుబు వలన లే నాన్నా … క్లాసులు తీసుకుంటే సాయంత్రం కొంచం ఉంటుంది … ప్రొద్దునకు తగ్గుతుందిలే. మీరు పడుకోండి, ఏవైనా కావాలంటే లేపండి.. మందులన్నీ వేసుకున్నారా ? ఇదిగో నీళ్లు మీ మంచం ప్రక్కనే పెట్టాను.” జానకి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంటే

“ఉదయాన్నే వెళ్ళిపోతాను తల్లీ .. తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కారులో దిగబెడతామంటున్నారు “ అన్నాడు.

“ఉండొచ్చు కదా నాన్నా కొన్ని రోజులు! “అనబోయి తమాయించుకుంది జానకి.

నాన్నతో అలా సాయంత్రాలు గడపడం .. ఆమెకు బావుంది. కానీ నాన్నకు వ్యవసాయం , వూర్లో ఎన్నో పనులు, అమ్మ ఉంటే కూడా తొందర పెడతాడు వెళ్లాలని, కానీ జానకి తల్లి మాత్రం వస్తే పదిరోజులు తక్కువ కాకుండా ఉంటుంది. నారాయణ రెడ్డి మాత్రం అతని సొంత వూరు విడిచి ఉండలేడు. ఎందుకు నాన్నని ఉండమని అడిగి బాధించడం? అనుకుంది జానకి .

ఎన్ని రోజులుండగలడు ? తానెప్పుడైనా ఒంటరే ! ఈ ఒంటరితనానికి తానెప్పుడో అలవాటుపడింది … మెల్లిగా కళ్ళుమూసుకుంది . కానీ నిద్రరాలేదు . భర్త గుర్తుకొచ్చి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి ఇంత ప్రపంచానికి చోటుండగా అతనికెందుకు లేదు ? అన్న ప్రశ్న పాతికేళ్లుగా ఆమె వేసుకుంటోంది.

మూడురోజులుగా జానకి జలుబు దగ్గుతో బాధపడుతోంది . సెలవు లేదని స్కూలుకు అలాగే వెళుతోంది. పక్క గదిలో కూతురు దగ్గుతోంటే కన్నతండ్రి కి కునుకు పట్టలేదు .లేచి వచ్చి చూశాడు.రోజంతా అలసిపోవడం వలన జానకి అంత దగ్గు వస్తున్నా నిద్ర పోతోంది. జానకి ని ఒంటరిగా చూస్తున్న కొద్దీ తండ్రి మనసులో అలజడి మొదలైంది . ఉదయాన్నే జానకిని వదిలి ప్రయాణం చేయాలంటే మనసొప్పడం లేదు. కొన్ని రోజులు జానకి దగ్గర వుండి పోతే బావుంటుంది అనిపిస్తోంది . వ్యవసాయం, బాధ్యతలు ఇంకా వూర్లో పంచాయితీలు అనుకుంటూ జానకి గురించి పట్టించుకొనే లేదు. పెళ్లి, కాన్పులు చేయగానే ఆడపిల్ల బాధ్యతలు తీరిపోయాయనే భావనతోనే వున్నాము. కష్టం వచ్చినప్పుడు కూడా వచ్చి కొంతకాలం వుండి పోయాం, కానీ ఎందుకో ఇప్పుడు జానకిని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు, మనసులో ఏదో పీకుతోంది, ఇక్కడ పొద్దుపోని మాట వాస్తవమే, అయితే జానకి స్కూలుకు వెళ్ళినప్పుడు ఏదో చదువు కుంటూ గడిపేస్తే సరిపోతుంది. కానీ ఉదయమే వెళతానని చెప్పేశానే... వెళ్లి కొన్నిరోజుల తర్వాత మళ్ళీ వద్ధునా! ఇలా ఆలోచిస్తూ నిద్ర పోయాడు.

ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగానే కారు వచ్చింది. కూతురు వుండి పొమ్మంటే ఉందామని వున్నాడు… నారాయణ రెడ్డి. జానకి వాళ్ళమ్మకు, తమ్ముళ్లకు, పిల్లలకు ఏవో సంచిలో సర్దింది . తండ్రి తెచ్చిన డబ్బాలు మళ్ళీ నిండుగా బరువుగా వున్నాయి. నారాయణ రెడ్డి గుండె కూడా బరువెక్కింది. జానకి నిర్లిప్తంగా స్కూలుకు తయారవుతూ తండ్రి కి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెబుతోంది . మూడురోజులు తండ్రి సమక్షంలో బాగా గడిచాయి . “ఇంకొన్ని రోజులు వుండండి నాన్నా” అందామని వున్నా …

“పనులున్నాయి పోవాలమ్మా .. ఇంకోసారి వస్తాలే “ అనే సమాధానం తండ్రి దగ్గర నుండి వస్తుందని జానకి నోరువిప్పలేదు.

కారులో కూర్చున్నాడు నారాయణ రెడ్డి .. ‘వుండండి నాన్నా’ అంటుందేమో జానకి అని ఎదురు చూసిన అతనికి నిరాశ కలిగింది. కూతురు తన సమక్షాన్ని అంతగా ఆశించడం లేదన్న విషయం అతన్ని బాధించింది. కారు కదులుతుండగా చూశాడు కూతురు కళ్ళలో లీలగా తిరిగిన కన్నీళ్లు. అవి చెప్పకనే చెప్పాయి“వుండండి నాన్నా “ అని. అప్పటికే కారు సందు మలుపు తిరిగింది.

Tuesday, 28 February 2017

దిద్దుబాటు


డిసెంబర్ నెలలో ఉండాల్సిన చలి లేకపోవడంతో ,ఇంకా సూర్య కిరణాలు వేడెక్కక పోవడంతో ఉదయం ఆహ్లాదకరంగా వుంది. ఆదివారం కావడం తో ఆఫీసు కెళ్ళే తొందర లేక మనసుకు విశ్రాంతిగా వుంది . ప్రతి ఆదివారం ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు నాకు. రావూరి భరద్వాజ గారి "పాకుడు రాళ్ళు " తీసుకుని పైనున్న నా గదిలో కిటికీ దగ్గర కూర్చున్నాను. గోల వినపడ్డం తో విశాలంగా వుండే కిటికీ లోనుండి క్రిందికి చూశాను.నా కొడుకు అనూప్ వాడి స్నేహితులు తోటలో కుర్చీలు వేసుకుని క్యారమ్స్ ఆడుతున్నారు. నూనూనుగు మీసాల యవ్వనం తో తుళ్ళింత లాడుతున్నారు . ఏ బాదరబందీ లేని వయసు లో కేరింతలాడుతున్నారు. ఇంకో రెండేళ్లలో ఈ యువకులంతా కంప్యూటర్ల ముందు చలనం లేని జీవితాలకు బలవుతారనుకుంటే బాధేసింది. బాగా చదివే అనూప్ ను డిగ్రీ చదివించి సివిల్స్ కు ప్రయత్నించాలని, ఒక ఆదర్శవంతమైన కలెక్టర్ చేయాలనే నా ఆశను వాడు ఆశయంగా తీసుకోలేదు. కంప్యూటర్ ఇంజనీరింగ్ పై వాడికున్న ఆసక్తి ని తండ్రిగా గౌరవించాల్సి వచ్చింది. పిల్లలపై నుండి నా చూపుల్ని, ఆలోచనలను మరల్చి పుస్తకం లోకి తలదూర్చాను. అరవై, డెబ్బైల మధ్య కాలం లో తెలుగు సినిమా రంగo నేపథ్యంగా కథానాయకి మంజరి జీవిత చరిత్ర ఆసక్తి కరంగా వుండడంతో అందులో లీనమైపొయాను .


అకస్మాత్తుగా అనూప్ అతని స్నేహితుల మధ్య ఓ భిన్న స్వరం వినపడి తల త్రిప్పి, క్రిందికి తోటలోకి చూశాను.పాప్ కార్న్ అమ్మే ఓ ముసలాయన తన పెద్ద మూటను పిల్లల ముందు పెట్టాడు. అక్కడున్న ఆరుమందికి పేపర్ కవర్లలో ఒక డబ్బాతో పాప్ కార్న్ వేసిచ్చాడు. అతనికి ఎనభై దాకా వయసుంటుంది . కుర్రాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు . నేను ఆసక్తిగా వింటున్నాను.


"రోజుకు ఎన్ని మూటలు అమ్ముతావు తాతా?" అనూప్ అడిగాడు


"ఎన్నో ఎక్కడ నాయనా ! ఒక్క మూట అమ్మే సరికి నా ఊపిరి పోతుంది " ముసలాయన భుజం మీది తుండు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు .


"ఎంత సంపాదిస్తావేమిటి?" మరో ప్రక్కనుండి వచ్చింది ప్రశ్న


"ఇయన్నీ అమ్మితే నూరు మిగులుతుంది నాయనా "


"అన్నీ అయిపోతాయా ? మిగలవా ? మిగిలితే మెత్తగా అయిపోతాయి కదా ఎవరు కొంటారు ?" రఫిక్ మంచి ప్రశ్న వేశాడు


"బట్టి కాడ్నించి అట్లే అమ్మడానికి పోతా బాబూ ... మధ్యానం కల్లా అయిపోతాయి ,చల్లకాలం ఒక్కోసారి మిగిలి పోతే మేం ఇంట్లోకి వాడుకుంటాం "


" మెత్తగా అయిపోతే మీరు మాత్రం ఎలా తింటారు తాతా ?" రోహన్ ఆసక్తిగా అడిగాడు


"ఏం జేస్తాం నాయనా ... పేలపిండి చేసుకుంటాం "


"అదెలా చేస్తారు ?" నకుల్ కు ధర్మ సందేహం కలిగింది


" బెల్లం, ఈ పేలాలు కలిపి దంచుతాం ,పొడి తింటాం ,ముద్దలు చేసుకుని కూడా తింటాం"


"రోజుకు నూరంటే, నెలకు మూడువేలు... మీ ఇంట్లో ఎంతమంది వున్నారు ? సరిపోతాయా ! మూడు వేల కోసం ఈ వయసులో కష్టపడుతున్నావే " అనూప్ సానుభూతి పలుకులు విని, వాడు ఆ కోణంలో ఆలోచించడం తో నేను తృప్తి పడ్డాను .


ఆరు మంది కుర్రాళ్ళు ,రెండోసారి మళ్ళీ ఆరు డబ్బాలు వేయించుకునేటప్పటికి ముసలాయన అక్కడే వున్న అరుగు మీద నింపాదిగా కూర్చున్నాడు . " నేను, నా ముసల్ది, కోడలు, మనవడు వున్నాం బాబూ ... వానలు పడక, పంటలు పండక మా పల్లె ఇడిచి పెట్టి ఈ వూరు వచ్చినాము. నా కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ,వాడున్నంత కాలం ఆటో వేసి సంపాదించేవాడు, నా మనవడ్ని చదివించాడు,మమ్మల్ని కూచో పెట్టి సాకాడు . నా కొడుకు చనిపోయాక నాకీ తిప్పలు వచ్చాయి ,కొడుకు జబ్బు నయం కాలా,చచ్చిపాయ , అప్పు మాత్రం మిగిలింది, నా కోడలు కూడా పనికి పోతుంది ఇంతా జేసినా వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం " వృద్ధుని గొంతు దు:ఖం తో జీరబోయింది. అతని ముఖం నాకు స్పష్టంగా కనపడక పోయినా, కొడుకును తలుచుకుని అతని కళ్ళలో నీరు తిరిగి ఉంటుందని ఊహించా . మనసు బరువెక్కింది .


కుర్రాళ్ళు అంత స్పందించినట్లు నాకు అనిపించలేదు. అరుగురిలొ ఇద్దరి సంభాషణ వేరే విషయాల మీదకు వెళ్ళింది. "జీ.. బ్రా కి మస్కులైన్ జెండర్ చెప్పురా చూద్దాం ?" అన్నాడొకడు .


ఇంగ్లీషు పట్ల ఆసక్తి కనపర్చే నేను ... మగ జీబ్రాని ... స్టాల్లోన్ లేక మేల్ జీబ్రా ... ఆడదాన్ని మేర్ అంటారేమో అనుకుంటూ , ఆసక్తిగా కుర్రాళ్ళు ఏమి చెబుతారో ... అని ఎదురు చూశాను.


ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు , పైగా ఎవరికీ సమాధానం మీద ఆసక్తి లేకపోయింది , ఆడుతున్న క్యారమ్స్ లో రెడ్ కొట్టడం,ఫాలో అప్ కొట్టడం పై ఘర్షణ పడ్డారు .


"మగ జీబ్రాని ఏమంటారో చెప్పురా మాకెవరికీ తెలియదులే ... సరేనా !" అన్నాడు నకుల్


"జీ... బనియన్ ... హి... హీ "అన్నాడు


"అదేంటి జీ బనియన్ ఎప్పుడూ వినలేదే ... నువ్వు చెప్పేది నిజమేనా... ! రేయ్...నకుల్! గూగుల్ సర్చ్ కొట్టరా... తప్పయిందో... ! వీడికుంది " అన్నాడు అభిజిత్


"జీ... బ్రా ఆడది రా అప్పుడు జీ బనియన్ కదా మగది ... " వెకిలిగా నవ్వాడు వాడు


"ఒహ్హో అలా వచ్చావా... వీడు అడిగాడంటే ఇలాంటిదే వుంటుంది అనుకున్నా ..." అభిజిత్ అన్నాడు


ఒకరి వీపుపై ఒకరు కొట్టుకుంటూ .... అందరు నవ్వడం మొదలెట్టారు .


నేను కాస్త నిరాశ పడ్డా... వాళ్ళ ఆసక్తులు గమనించి . కానీ సర్ది చెప్పుకున్నా ... ఆ వయసులో కొందరికి అలాంటి ఆసక్తి వుంటుందిలే అని.


లాన్ పక్కనున్న కుళాయి చూపిస్తూ " ఆ నీళ్ళు తాగొచ్చా నాయనా ? అన్నాడు ముసలాయన


"ఆ ..... తాగు పో తాతా !"ఆన్నాడు అనూప్


ముసలాయన నీళ్ళ కోసం పోగానే ఇద్దరు కుర్రాళ్ళు పిడికిళ్ళతో పాప్ కార్న్ తీసుకుని తమ కవర్లలో వేసుకున్నారు ,


తప్పు అన్నట్లుగా రఫిక్ వారించబోయాడు.


తప్పేమీ లేదన్నట్లుగా తలెగరేశారు అభిజిత్ , అనూప్. .


నేను యధాలాపంగా వాళ్ళని చూస్తూ,వాళ్ళ సంభాషణ వింటున్నవాడ్ని,ఈ సంఘటన తో వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. పైనున్న నా గదినుండి వాళ్ళు నాకు స్పష్టంగా కనపడుతున్నారు, వాళ్ళ మాటలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి. వాళ్ళు తలెత్తి పైకి పరీక్షగా చూస్తే తప్ప నేను వాళ్లకు కనపడను.


ముసలాయన నీళ్ళు త్రాగివచ్చి "మీరంతా చదువుకుంటున్నారా బాబూ! లేకుంటే వుద్యోగం చేస్తున్నారా ? నా మనవడు కూడా బియ్యే చదివినాడు మొన్నే పరీక్షలు పాసయినాడు ,మీరంతా పెద్దోళ్ళ పిల్లలు కదా ! మా వాడికి ఏదైనా చిన్న వుద్యోగం చూడండి నాయనా !" అన్నాడు


ఇంతలోకే కుర్రాళ్ళ సంభాషణ సినిమాల మీదకి వెళ్ళింది. మధ్యాహ్నం మాట్నీకి వెంకటేష్ ,పవన్ కళ్యాన్ ల గోపాల గోపాల నా లేక అక్షయ్ కుమార్ బేబి నా , ఏది వెళ్లాలని చర్చ మొదలెట్టారు . ముసలాయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు.


కాసేపయ్యాక మళ్ళీ తన అభ్యర్థనని వాళ్ళ ముందుంచాడు .


అనూప్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ,మిగతావాళ్ళు కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు.


"రేయ్.... తాత తన మనవడికి వుద్యోగం అడుగుతున్నాడురా ! "రఫిక్ స్నేహితులకు ముసలాయన అభ్యర్థన వినిపించాడు . "ఓ ఆర్నెల్లు పోతే మాకే కావాల ఉద్యోగాలు .. ఎవరిస్తార్రా ? " ఓ కొత్త ముఖం అంది


ఆ కుర్రాడు వీళ్ళలో కొత్తగా చేరినట్లుంది నేనింతకు ముందు చూడలేదు.


ముసలాయన మళ్ళీ కొంచం గట్టిగా "మీరంతా ఉన్నోళ్ళు కదా బాబూ మీ నాయనల్ని అడిగి నా మనవడికి వుద్యోగం చూడండి " అన్నాడు వాళ్ళకు వినిపించేలా .


"తాతా... వీళ్ళ నాయన మన జిల్లా కలెక్టర్,వాడ్నిఅడుగు ఖచ్చితంగా నీ మనవడికి వుద్యోగం ఇప్పిస్తాడు." అన్నాడు ఆ కొత్త కుర్రాడు అనూప్ ని చూపిస్తూ.

అందరు నవ్వును ఆపుకుంటున్నారు.


"అవునా బాబూ...! మా వాడికి వుద్యోగం ఇప్పిస్తావా ? శానా కష్టాల్లో వున్నాం బాబూ " ముసలాయన అభ్యర్థన నా గుండెలకు తాకింది. రెండోసారి అతని కళ్ళలో కన్నీరు తిరిగి వుంటుంది. అనూప్ ఏం చెబుతాడో అని నేను నా చెవుల్ని రిక్కించి విన్నాను నా గుండె వేగంగా కొట్టుకుంది.


"అవును తాతా... మా నాన్న కలెక్టర్, నీ మనవడికి వుద్యోగం ఇప్పిస్తాలే ... రేపు పది గంటలకు కలెక్టర్ ఆఫీసుకు వచ్చేయ్ ... నీ మనవడికి తెలిసుంటుంది లే ... నీ మనవడి పేరేంటి ... మా నాన్నకు చెప్పాలి " అనూప్ మాటలకు నాకు కళ్ళు బైర్లు కమ్మాయి .


"నా పేరు సోమప్ప బాబూ " ముసలాయన గొంతులో ఆనందం చూసి నాకు మతి పోయింది .


"నీ పేరు కాదహే ... నీ మనవడి పేరు చెప్పు... వుద్యోగం వచ్చాక మాకందరికీ పార్టి ఇవ్వాలి " ఆ కొత్త కుర్రాడు ఎగతాళి నిండిన స్వరం విని నాకు వెంటనే వెళ్లి వాడి చెంపలు పగలగొట్టాలని పించింది. జరగబోయేది చూద్దామని ఆగాను .


" నా మనవడి పేరు వెంకటేశ్వర్లు బాబూ...బియ్యే ఫస్ట్ న పాస్ అయాడు కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడు ..ఇంగ్లీషు మాట్లాడేది నేర్చుకుంటున్నాడు. " ఆశ, ఆనందం నిండిన గొంతుతో అన్నాడు ముసలాయన .


" వోక్కే.. కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడా...గుడ్.. వెరీ గుడ్ అయితే వుద్యోగం గ్యారంటీలే ..... రేపు పది గంటలకు కలెక్టరాఫీసు దగ్గరికి, గుర్తుంది కదా! " . అనూప్ చెబుతోంటే మిగతా కుర్రాళ్ళoతా నవ్వునాపుకుంటున్నారు. నాకు ఒక్క సారిగా అదః పాతాళానికి జారినట్లనిపించింది .... తలలోకి ఏదో బరువంతా చేరినట్లనిపించింది. శరీరమంతా కంపించింది. వీడిని కలెక్టర్ చేసివుంటే ఏం చేసేవాడు ? ఒక చదువురాని అమాయకుడైన పేద వృద్ధుని తమ సరదా కోసం ఎంత అవలీలగా నమ్మించారు ? ఈ యువత దేశాన్ని ఏం చేయబోతోంది ? నా ఆశయాలకు తగిన కొడుకును నేను కనలేకపోయానా! నా పెంపకంలో లోపముందా ? నా రక్తం లో గానీ, వాళ్ళమ్మ రక్తం లో గానీ ఇంత జాలిలేని తనం లేదే ! ఈ నాటి విద్య సంస్కారాన్ని ఇవ్వలేక పోతోందా ...! సమాజపు రీతుల్లో నైతికత నశించిందా ! నా కొడుకు ఇలా ప్రవర్తించడానికి కారణాలు వెతుక్కుంటూ ... కిటికీ కడ్డీని గట్టిగా పట్టుకున్నాను .


ముసలాయన సంచిని కట్టుకోబోతూ మళ్ళీ అందరికి తలా పిడికెడు పాప్ కార్న్ వాళ్ళ చేతుల్లోకి వేశాడు. కుర్రాళ్ళు జేబుల్లోంచి డబ్బులు తీసిచ్చారు. సంచిని భుజాన పెట్టుకుని మళ్ళీ అందరికి దండాలు పెట్టాక "రేపు పది గంటలకు కలెక్టరాఫీసు దగ్గరే వుంటాo బాబు తమరు వస్తారు కదా ...! "


"నేనున్నా లేకపోయినా ... మా నాన్నకు చెప్పుంటా, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి, సోమప్ప వస్తారని...ఏదో ఒక వుద్యోగం ఇప్పిస్తా కదా!" అనూప్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే అన్నాడు


"అలాగే బాబు" వంగి పోయిన అతని నడుము, తేలిగ్గానే వున్నా, ఆ సంచి ఎత్తుకోగానే మరింత వంగి పోయింది.


వారం తర్వాత ఆదివారం మళ్ళీ క్యారమ్స్ ఆడడానికి అనూప్ స్నేహితుల దండును తీసుకొచ్చాడు . స్నేహితులంతా తోటలోకి దారి తీస్తే నీళ్ళ బాటిల్ కోసం లోపలి వచ్చిన అనూప్ సోఫాలో కూర్చున్న సోమప్పను ఆయన మనవడ్ని చూసి కంగారుగా నన్ను వాళ్ళమ్మను మార్చి మార్చి చూశాడు. "దండాలు బాబు నీ దయవల్ల నా మనవడికి వుద్యోగం వచ్చింది ,నీ ఋణం ఎలా తీర్చుకోగలం ?" ముసలాయన చెబుతోంటే అనూప్ కు నోట మాట రాలేదు.


"థాంక్స్ సార్... !" సోమప్ప మనవడు అనూప్ తో చేయి కలుపుతూ అన్నాడు. తాత మనవడు సెలవు తీసుకుని వెళ్లి పోయారు.


అనూప్ ముఖంలో కత్తి వాటుకు నెత్త్హురు చుక్క లేదు ,ఉలుకు పలుకు లేకుండా సోఫా లో కూర్చున్నాడు .


"నీవు చేసిన తప్పను సరిదిద్దడానికి మీ నాన్న ఎంత మంది చుట్టూ తిరిగాడో, ఎంత కష్టపడ్డాడో తెలుసా ...! ఆ ముసలాయన్ని ఆట పట్టించడానికి నీకు సిగ్గు లేదా !ఆయన వయసేంటి, ఆర్ధిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏంటి ? నీవు, నీ స్నేహితులు చేసిందేమిటి ? ఇంత మానవత్వం లేని మనిషివి ఎలా అయ్యావురా! ఎందుకురా నీకు చదువులు ? ఛీ... ఛీ... నీలాంటి జాలి లేని వెధవని కన్నా నేమిటిరా !" వాళ్ళమ్మ ఉక్రోషంతో కేకలేస్తూ వుంది .


మౌనంగా వున్న నాతో... "ఏమిటండి మీరేమి అనరా వాడ్ని " అంది కోపంగా .


నిజానికి నాకు అనూప్ ని ఏమీ అనాలనిపించలేదు, తల్లిదండ్రుల నుండి విజ్ఞత నేర్చుకునే స్థితిలో లేదు నేటి యువతరం. కానీ అక్కడి నుండి లేచి "మేము దిద్దలేని తప్పులు చేయకు నాన్నా! " అని నా గదిలోకి వచ్చేశాను.


Published in Navya on 12th February 2017

సముద్రం


ఇచ్చాపురంలో మురళి పెళ్లి అనగానే నా మనసు ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యింది. ఇచ్చాపురం కు అయిదు మైళ్ళ దూరంలో వుండే కవిటి అనే వూర్లో నాకు వూహ తెలిసిన బాల్యం మొదలయ్యింది. నాకు ఏడు నుండి పదేళ్ళు వచ్చేవరకు మేము నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాము. తర్వాత నాన్న కు హైదరాబాదు బదిలీ అయింది. మా చదువు గురించి అమ్మ, నాన్నకు వేరే వూరు బదిలీ అయినా మమ్మల్ని హైదరాబాదులోనే హాస్టల్లో పెట్టి కొంతకాలం, అమ్మ మాతో వుంటే నాన్నే శని , ఆదివారాలు సెలవులో రావడం ఇలా జరిగి పోయి హైదరాబాదు తప్ప వేరే లోకం, ప్రాంతాలు తెలియకుండా పోయాయి. తర్వాత బదిలీ లేని సాఫ్ట్ వేర్ వుద్యోగంలో యంత్రాల్లా పనిచేయడం, శని, ఆదివారాల్లో ఇంట్లో పనులు చూసుకోవడం, పిల్లల్ని సినిమాకో బజారుకో తీసికెళ్ళి గడిపేయడం, లేదా హైదరాబాదులోనే జరిగే దగ్గరి వాళ్ళ పెళ్ళిళ్ళకో, ఇంకేదైనా సంబరాలకు మొక్కుబడిగా వెళ్లి వచ్చేయడం ... ఇలా జీవితం సగం గడిచిపోయింది. ఎన్నోసార్లు కవిటి జ్ఞాపకం వస్తూ వుంటుంది ...అక్కడికి వెళ్లి రావాలని ఎంతో కాలంగా అనుకుంటూనే వున్నాను ...ఇప్పటికి అవకాశం దొరికింది. మురళికి ఇచ్చాపురం అమ్మాయి పరిచయం ,ప్రేమ, పెళ్లి జరగడం నా కవిటి పర్యటన కోసమే అన్నట్టుంది .


ఆనందంగా తలంబ్రాలు పోసుకుంటున్న వధూవరులపై ఆశ్చింతలు వేసి, కళ్ళతోనే వీడుకోలు పలికి కవిటి బయలుదేరాను. ఇచ్చాపురం బస్స్టాండ్ లో కవిటి వెళ్ళే బస్సు కోసం చూస్తుంటే షేరింగ్ ఆటో వాళ్ళ ఆహ్వానాల దాడికి ఆశ్చర్యపోయాను . ఎన్ని ఆటోలో ! ఆ రద్దీ కి ఆటోలో ప్రయాణం ప్రమాదమని గ్రహించి బస్సు ఎక్కేశాను. చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మగారి వూరు కడపకు వెళ్ళాలంటే పెద్ద ప్రహసనంగా వుండేది. కవిటి నుండి ఇచ్చాపురం బస్సులో వచ్చి ,లేకుంటే పలాస 60 కిలోమీటర్లు వెళ్లి, హైదరాబాదు కు 950 కిలోమీటర్లు వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుండి కడపకు వెళ్ళడానికి 400 మైళ్ళు . అందుకే ఎండాకాలంలో తప్ప వూరికి ప్రయాణాలు ఉండేవి కాదు .దసరా, సంక్రాంతి సెలవుల్లో నాన్న గారు చుట్టుప్రక్కల వున్న ప్రదేశాలు చూపించేవారు. కవిటి దారి వెంట మార్పులు నన్ను ఆశ్చర్య పరుస్తూండగానే కవిటి వచ్చేసింది. బస్ దిగి చుట్టూ చూశాను .ఆటోలు తప్ప నా చిన్ననాటి గుర్రం జట్కా బళ్ళు, రిక్షాలు ఒక్కటి కూడా లేవు.


కవిటిలో ఒకటవ తరగతిలో చేరాను, అన్నయ్య మూడో తరగతి, ఇద్దరం బుజానికి బ్యాగు లేసుకుని ప్రభుత్వ అప్పర్ ప్రైమరి స్కూలు కు వెళ్ళే దారి వెంట తెగ కబుర్లు చెప్పుకునేవాళ్ళం .అన్నయ్యకు అన్ని తెలుసనే భావనలో వుండి ప్రతి సందేహాన్ని అన్నయ్యకు చెప్పి నివృత్తి చేసుకునే వాడ్ని. ఒరిస్సా రాష్ట్రo ప్రక్కనే కాబట్టి ఒరియా భాషా ప్రభావం అక్కడ బాగా వుండేది, చాలా మంది ఒరియా మాట్లాడేవాళ్ళు , మాక్కూడా ఒరియా బాగానే వచ్చేది . కానీ ఇప్పుడొక పదం కూడా గుర్తులేదు . ఆటో ఎక్కి ముందుగా నేను నాన్న గారి బాంక్ చూడదలచుకున్నాను. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గరకు వెళ్ళమన్నాను. ఆటో దిగి బ్యాంక్ ముందు దిగి ఆశ్చర్య పోయాను. నాన్న పనిచేసేరోజుల్లో ఎంత చిన్నగా వుండేది, రెండే గదుల్లో వుండేది. అంతా వేరుగా వుంది ...! అచ్చంగా ఆధునిక బ్యాంకు కు వుండే హంగులన్నీ అమరి వున్నాయి .చెక్క బల్లల స్థానాన ,అందమైన డేకోలం టేబుళ్లు ,అల్మైరాలు , మానేజరు రూము ప్రత్యేకంగా వుంది ...అప్పుడయితే నాన్నకు ప్రత్యేకంగా రూం వుండేది కాదు ..మిగతా స్టాఫ్ తో పాటే వుండేవారు. నాన్న కూర్చునే చోటు కోసం చూశా ..వుహూ అది ఎక్కడో కూడా అర్థం కాలా! ఒక రకమైన నిరాశ నన్ను ఆవరించింది. బ్యాంకు పని మీద కాక మరేదో పని మీద వచ్చానని గ్రహించిన అక్కడి క్లర్క్ "ఏమి కావాలి సర్ " అన్నాడు. ఏమి చెప్పాలో తోచక, నవ్వి బయటకు వచ్చేశాను.


నా జ్ఞాపకాల్లో వున్న నాన్న బ్యాంకు రూపు రేఖలు కాలంతో మారిపోవడం చాలా సహజమైన మార్పు కాని ..అలాగే వుండాలని మనసు కోరుకోవడం కూడా అంతే సహజం కాబోలు. అక్కడి నుండి మేము చిన్నప్పుడున్న శివాలయం వీధికి తీసికెళ్ళమని చెప్పా ఆటో అబ్బాయితో . శివాలయం వీధికి వెళ్ళాక, "ఎక్కడాపమంటారు ?" అన్నాడు


ఎక్కడని చెప్పను ? అందుకే దిగి ఆటో అబ్బాయికి డబ్బు లిచ్చి , ఆ వీధిని పరిశీలిస్తూ నడిచా. మా ఇల్లు వీధికి మధ్యలో వుండేది ...ఎంత ప్రయత్నించినా ...నా చిన్ననాటి రోజుల్లో వున్న ఇల్లు ఒక్కటి కూడా కనపడలా ...! మేమున్నది ఇరవై అయిదేళ్ళ క్రిందటి మాట .. ఇంకా మార్పులు జరగకుండా ఉంటాయా ! అయినా మా ఇల్లు వున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ వున్న ఒక మధ్య వయస్కుడ్ని అడిగా " ఇక్కడ దశరథ రామయ్య గారి ఇల్లు వుండేది ..ఆయన టీచర్ గా పని చేసేవారు...మీకు తెలుసాండి ?"అని


"తెలియదండి " ముక్తసరిగ్గా చెప్పి వెళ్లి పోయారు .


చాలా మందిని అడిగా ..చివరిగా ఒక పెద్దాయన "దశరథ రామయ్య గారు చాలా కాలం క్రిందటే పోయారు బాబు ఆయన కొడుకులు ఇల్లు ఎప్పుడో అమ్మేశారు, కొన్న వాళ్ళు పాతదాన్ని కూలదోసి క్రొత్త గా కట్టి బాడుగాకిచ్చారు అదే చూడు బాబు "అన్నాడు.


ఒక లేత ఆకుపచ్చరంగు వేసిన ఇల్లు చూపిస్తూ. ఒకప్పుడు చుట్టూ ప్రహరి గోడతో విశాలమైన ఖాళీ స్థలంలో తోట ,పెద్ద వరండాతో విశాలమైన గదులతో వుండే ఆ ఇల్లు ...ఎంత బాగుండేది ? ఇంటి ముందు అశోక చెట్టు ..అన్ని పండ్ల మొక్కలు వేసి వున్నారు దశరథ రామయ్య గారు.ఆయన బాడుగ తీసుకోవడానికి వచ్చినప్పుడు మొక్కలన్నీ చూసి , వాటిని బాగా చూసుకోమని చెప్పేవారు. దాని స్థానంలో ఇప్పుడు అగ్గి పెట్టేల్లాంటి చిన్న ఇళ్ళు, క్రింద పైన కట్టారు ,మొక్కలకు అసలు స్థలమే లేదు. వుస్సూరన్నది ప్రాణం. తమాయించుకున్నా. మా ఇంటికెదురుగా వుండే బాబ్జి వాళ్ళ నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు ...వాళ్ళెక్క డున్నారో ! మా ఇంటికి నాలుగిళ్ళ తర్వాత రాజారామ్ అనే అబ్బాయికి పోలియో వచ్చి కాళ్ళు సన్నగా అయిపోయాయి, ఆడుకోవడానికి వచ్చి ఆడలేక చూస్తూ కూర్చునేవాడు. వాడితో నాకు బాగా స్నేహం వుండేది ,అమ్మ ఇచ్చిన తాయిలం ఇద్దరం పంచుకునేవాళ్ళం . నాన్నకి బదిలీ అయ్యాక మేము హైదరాబాద్ వస్తుంటే వాడి దు:ఖం నా కళ్లలో ఇప్పటికి మెదులుతోంది .ఎక్కడున్నాడో... ఏమయ్యాడో ! కాలం ఎవరిని ఎక్కడికి తీసు కెలుతుందో! ఎదురింట్లో అడిగా బాబ్జి గురించి వాళ్ళ నాన్న గురించి .కానీ వాళ్ళు కూడా ఎప్పుడో బదిలీ అయి వెళ్లి పోయారు కాబట్టి ఎవరికీ తెలియలేదు .రాజారామ్ వాళ్ళు కూడా అక్కడ లేరు. నాకు గుర్తు వున్న పేర్లన్నీ అడిగా కానీ ఎవరూ లేరు .అన్నయ్యకు కూడా నాకు గుర్తున్న వ్యక్తులే గుర్తున్నారు. వీధి మొత్తం ఒక క్రొత్త ప్రపంచం అయిపొయింది నాకు ...ఉండ లేకపోయా ! ఈ వీధిలో ఒకప్పుడు ఆడుకున్న ఆటలు ..చేసిన అల్లరి అన్నీ కళ్ళముందు మెదిలాయి.



వీధి చివరకు వచ్చి ఒక్క సారి వెను తిరిగి చూశాను .దగ్గరలో తొక్కుడు బిళ్ళ ఆడుతూ చింపిరి జుట్టు తో రెండు జళ్ళ సీత కనపడింది .నాకు ఆశ్చర్యం వేసింది ఇరవై అయిదేళ్ళ క్రిందటి సీత మాత్రం అలాగే ఎలా వుందో అర్థం కాలా ! నాకు నవ్వొచ్చింది ..! గతం జ్ఞాపకాల్లో నాకు మతి బ్రమించినట్ట్లుంది ..లేకపోతే సీత రాగిరంగు జుట్టుతో అలాగే ఎలావుంటుంది ? పూజారి కూతురు సీత రెండు జడలేసుకుని వాటికి రిబ్బన్లు కట్టుకుని మాతోటే ఆడేది. అంతా బ్రమ ...! నా ఆలోచనలు సీత చుట్టూ తిరిగాయి ..సీత వాళ్ళ నాన్న గారు దగ్గరలోని గుడిలోపూజారి. మేము సాయంత్రమయే సరికి అమ్మ కొంగు పట్టుకుని గుడి దారి పట్టేవాళ్ళం ..అమ్మ రాని రోజుల్లో కూడా వెళ్లి ఆటలాడి, గుడికి వెళితే పూజారి గారు ప్రసాదం పెట్టేవారు. అయితే గుడిలోని బావి దగ్గర చేతులు కడుక్కుని శుభ్రమైన చేతులు చూపిస్తే తప్ప ఆయన ప్రసాదం పెట్టేవారు కాదు. ఆ చక్కర పొంగలి,పులిహోర రుచి ఇప్పుడు నా నాల్కపై నీరూరేటట్టు చేసింది ...తల విదిలించి ముందుకు సాగాను .శివాలయం వెళదామని ..అంతలోనే నాకు గుడి కంటే దగ్గరలో వున్న బడి గుర్తొచ్చింది. నా చిన్నప్పటి బడి ఎలావుందో ....మరి!



శివాలయం వీధి నుండి నేను బడి వున్న తూర్పు ప్రాంతానికి వెళ్లాను ... అప్పుడు బడి దగ్గరలో ఇళ్ళేవి లేవు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఇళ్ళే వున్నాయి . వూరు పెద్దగా అవలేదు రోడ్లు అంతంత మాత్రంగానే వున్నాయి, పరిశుభ్రత విషయానికి వస్తే ఆ రోజుల్లో ఆటోలు ,మోటార్ సైకిళ్ళు,కార్లు ,సిటి బస్సులు లేవు కాబట్టి ఇంత కాలుష్యం లేదు .వూరు శుభ్రంగా , ప్రశాంతంగా వుండేది. మనం శాస్త్రీయ విజ్ఞానం పెరిగే కొద్దీ ఆనందాన్ని ,సహజత్వాన్ని కోల్పోతున్నాo అనిపిస్తుంది. బడి దగ్గరకు వెళ్ళాక నాకేమీ అర్థం కాలేదు .మా స్కూలు హైస్కూల్ అయింది, చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా వుండే మా బడి ఇప్పుడు కేవలం సిమెంట్ నిర్మాణంలా అయింది, గురుకులం లాగా వుండే మా బడికి ఆ ఆనవాళ్ళు ఇప్పుడు లేవు. బడి భవంతి పెద్దగా అయినా గోడలన్నీ రంగులు వెలిసి పోయి, బడి ప్రాంగణమంతా పిచ్చి పిచ్చి మొక్కల తో నిండి పోయి బడి రూపు రేఖలు మారిపోయాయి. బడిలోకి వెళ్లి హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లాను. “నేను చిన్నప్పుడు ఇక్కడే చదివాను అప్పుడున్న టీచర్లు ఎవరైనా వున్నారా?” అని అడిగాను, స్టాఫ్ రిజిస్టర్ ఇచ్చారు చూసుకోమని. నాకు గుర్తున్న టీచర్లు ఎవరూ లేరు. హెడ్ మాస్టారు ఉదాసీనంగా చూశారు .ఇన్నేళ్ళ తర్వాత తన చిన్న నాటి బడిని చూసుకోవడానికి వచ్చిన ఒక పూర్వ విద్యార్థినయిన నా పట్ల ఆ బడి హెడ్ మాస్టారుకు కొంచం అయినా ఆసక్తి చూపించాల్సిన బాధ్యత వుంది అనిపించింది .కాని ...ప్చ్... మనం వుండాలి బాధ్యత గా. అంతేకానీ ఎదుటి వ్యక్తిని ఇలా వుండాలని నిర్దేశించే హక్కు మనకెక్కడిది ? బడి ముందు వుండే వేప చెట్టు కోసం చూశాను, లేదు, ఆ ప్రాంతంలో ఒక గొనెసంచి పరచుకుని పిప్పరమెంట్లు, బెల్లంచిక్కీలు, వేరుసెనగకాయలు అమ్మే ముసలావిడ గుర్తొచ్చింది… ఎక్కడుందో! ...ఏమయ్యిందో! ఎలా కనుక్కోవడం? బయటికి వచ్చా ..అదోకరకమైన నిరుత్సాహం ..నిరాశ. ఇంటర్వెల్ కొట్టడంతో పిల్లలందరూ పరుగున బయటికి వచ్చారు...ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు సైతం కార్పోరేట్ స్కూళ్ళకు పంపుతున్నారు, ప్రభుత్వ బళ్ళకు ఇంక ఏమాత్రం చదువు ఆసక్తి లేనివాల్లో, మధ్యాహ్నం భోజనం కోసమో... వస్తున్నారు..పెద్ద పిల్లల్ని ఆసక్తిగా చూసి అడిగా ఇక్కడ ఒక ముసలావిడ పళ్ళు పిప్పరమెంట్లు అమ్మ్మేది చూశారా మీరు ఇప్పుడు పదో తరగతికి వచ్చారు కదా చిన్నప్పుడు మీ ఒకటో తరగతిలోనో రెండో తరగతిలోనో ?"



"వుహూ మేము చూడలేదు అంకుల్, ఇక్కడ ముసలావిడ ఎవరూ ఏమీ అమ్మడం లేదు, మేము అక్కడ షాపు దగ్గర కొంటాము" అన్నారు. నెమ్మదిగా బడి దాటి నడిచాను ...ఆకలిగా వుంది ...కానీ ఏమీ తినాలన్పించలేదు. ఆకాశం మేఘావ్రుతంగా వుంది కానీ వాన కురిసేలా లేదు ...చల్లగానే వుంది ....వూరు మొత్తం తిరిగాను ...ఎక్కడా పరిచయమైన ముఖాలు కనపడలేదు ....అశోక్ సినిమా హాలు దగ్గర ఆగాను. ఆ హాలులోనే సినిమాలు ఎక్కువగా చూశాము ...మాయాబజారు సినిమాలో ఆ మంత్రాలు మాయలు చూసి పొందిన ఆనందం గుర్తొచ్చింది .సమయం చూసుకున్నా అయిదవుతోంది ..గుడి దగ్గరకు వెళ్ళొచ్చు, పూజారిగారు వచ్చి వుంటారు సీత గురించి తెలుస్తుంది ... అందరికి బదిలీలు వుంటాయి పూజారి గారికి వుండవు కదా! నాలో ఉత్సాహం కలిగింది. గుడి దగ్గర పడుతోంటే ఒక రకమైన గుండె దడ కలిగింది ... ఏదో తెలియని అనుభూతి ..గుడి అలాగే వుంది కానీ పాడు పడి పోయింది.. మెట్లన్నీ రాళ్ళు జారి వున్నాయి, పిచ్చి చెట్లన్ని పెరిగి వున్నాయి. ఎప్పుడూ భక్తులతో ముఖ్యంగా ఆడ వాళ్ళతో కళ కళ లాడే గుడి ఇంత నిర్మానుష్యంగా ఉందేమిటి ? గుడిలో దీపం వెలగక పోతే నేనింక గుడి మూతపడింది అనుకోవాల్సి వచ్చేది. గుడి బయటే ఓ సన్నని ఇరవై ఏళ్ళ కుర్రాడు కూర్చుని వున్నాడు .వేషధారణ బట్టి పూజారి అనిపించింది..మరి సీత వాళ్ళ నాన్న గారు ఏమయ్యారు ?


"గుడిలో పూజారి మీరేనా?"


"అవునండి "


"ముందుండే పూజారి ..రమణ శాస్త్రి గారు లేరా "


" ఆయన చనిపోయారండి ..వాళ్ళబ్బాయి పౌరోహిత్యం నేర్చుకోలేదండి ...ఏదో ఫ్యాక్టరీ లో వుద్యోగం చేస్తారండి ...అందుకే నేను చేస్తున్నానండి "అన్నాడు


"వాళ్ళబ్బాయి ...మిగతా కుటుంబం ఎక్కడుంది మీకు తెలుసా "


"శివాలయం వీధిలోనే ముందు వున్న చోటే ఉన్నారండి...ముందున్న స్థలం లో కిరాణా షాపు వుంది చూడండి "


కిరాణా అంగడి వుండటం మూలాన వాళ్ళ ఇల్లు కనుక్కోలేక పోయా నన్నమాట...సీత ఎక్కడుందో ! పెళ్ళయి వుంటుంది ..పిల్లలు కూడా వుంటారు?.. ఎక్కడుందో అడ్రస్ కనుక్కుని సీతను కలవాలి వీళ్ళ ఆచూకి ఒక్కటే తెలిసింది ..." కొంచం సంతోషం వేసింది .


"అర్చన చేయించామంటారా?" పూజారి అడిగాడు


శిథిలమై పోయిన గుడిని, వైభవం ,ప్రాభవం కోల్పోయిన దేవుడ్ని చూస్తే నాస్తికుడ్ని అయినా ఆ గుడి పరిస్థితి కి కృంగి పోయాను. గుడికి పెద్దగా భక్తులు వచ్చేట్టు కనపడలేదు...ప్రజలు కొత్త దేవుళ్ళని ...కొత్త గుళ్లని మాత్రమే దర్శిస్తున్నారన్న మాట .


"అర్చన చేయించమంటారా..సార్ ?" మళ్ళీ అడిగాడు


".. అర్చనా ! ..ఆ ..చేయించండి "అన్నా


"గోత్రం "అడిగాడు


"తెలియదు ..." అన్నా కుటుంబ సభ్యుల పేర్లు అడిగాడు, చెప్పాను


హారతి ఇచ్చాడు. నవ్వుకుంటూ కళ్ళ కద్దు కున్నా . వెను తిరగ బోతూ చిరిగిన ధోవతితో పేదరికం, దైన్యం కనిపిస్తున్న ఆ పూజారిని చూస్తే నాకు ఏదో చేయాలనిపించింది ..వాలెట్ లోంచి వేయి రూపాయల నోటు తీసి జాగ్రత్తగా పళ్ళెం లో వేశాను .


"నా దగ్గర చిల్లర లేదు సార్ " అన్నాడు నమ్రతగా ..


"మీకే ..ఉంచుకోండి " అన్నా. అతని కళ్ళు మెరిశాయి .


మెట్లు దిగుతుంటే బాధేసింది. ఈ మెట్ల మీద ఆడుకున్న స్నేహితులేరి? ఆ అందమైన బాల్యం ఏది? కాలం ఎంత క్రూరమైనది? మనసులో వివరించలేని నొప్పి కలిగింది .


శివాలయం వీధిలో కిరాణం కొట్టు వెనకాల వున్న పూజారి ఇల్లు చూడగానే నాకు ఉత్సాహం వచ్చింది ...బయటే ఉదయం కనపడ్డ రాగిరంగు జుట్టున్న రెండు జళ్ల అమ్మాయి అచ్చు సీత లా వుంది, సీత కూతురేమో ..ఉదయం చూసింది బ్రమ కాదన్న మాట ...నాకు ఆశ్చర్యం తో మాట రాలేదు . తేరుకుని "రమణ శాస్త్రి గారిల్లు ఇదేనా ?"అడిగా .


"అవునండి..కానీ తాతయ్య పోయారు ...మీరెవరు ?"


"తెలుసమ్మా నీ పేరేంటి?"


"సీతామహాలక్ష్మి ."


"సీత కూతురివా? మీ అమ్మ ఉందా ..? నేను మీ అమ్మ చిన్నప్పటి స్నేహితుడ్ని."


"అమ్మ కూడా పోయారండి నే పుట్టగానే,అందుకే తాతయ్య నాకు అమ్మ పేరే పెట్టారటండి ...అమ్మమ్మ ఉన్నారండి, కానీ ఎవర్ని గుర్తుపట్టలేరండి ..మామయ్యేమో ఇంకా ఫ్యాక్టరీ నుండి రాలేదండి ...రండి లోపలి ..."


జీవితం ఇంత సంక్లిష్టమైనదా ! కాలం ఇంత గారడీ చేస్తుందా ... షెల్లీ మార్పు జీవన సూత్రం అంటాడు. కానీ ఎందుకు ఈ మార్పు ను నేను తట్టుకోలేకపోతున్నాను. గిరుక్కున వెనుతిరిగి బయటికి వచ్చాను .ఆలోచనకు అందని విధంగా మొద్దుబారి పోయింది నా బుర్ర, నాకు తెలియకుండానే ఎలాగో నా చివరి మజిలి సముద్రతీరం చేరాను.


అప్పుడప్పుడే చీకటి పడుతోంది ...ఆకాశం ఏ చిత్రకారునికి కలపడం సాధ్యం కాని లేత పసుపు, కనకాంబరం కలిసిన రంగులో వుంది ...ఆకాశం క్రింద ఇంకో అద్భుతం ...ఈ సంద్రం! ..ఈ గాలి ...అప్పుడే సముద్ర గర్భం నుండి పైకి లేస్తున్న పూర్ణ చంద్ర బింబం వెదజల్లుతున్న వెన్నెలలు, ఎగసి పడుతున్న అందమైన అలలు !ఆహా ఎంత ఆహ్లాదకరంగా వుందీ ప్రదేశం! ఇరవై అయిదేళ్ళ తర్వాత నా చిన్ననాటి జ్ఞాపకాల్లోనివి ఏవీ లేవు, వున్నా అలాగే లేవు, అన్ని మారి పోయాయి ..కానీ ఈ సంద్రం ....ఈ అలలు ..వెండి పొడి లాంటి ఇసుక...అలాగే వున్నాయి. నేను అన్నయ్య ఆడుకున్న ఇసుకలో మా పాదాల గుర్తులు లేవు ...మేము కట్టుకున్న గుజ్జన గూళ్ళు లేవు, కానీ ఇసుక అలాగే వుంది, అవే ఎగిసిపడే అలలు,అదే చందమామ ,అదే అలల నురుగు ..అవే కొబ్బరి చెట్లు, అవే మెరిసే తారకలు .... అదే చల్లగాలి. ఈ సహజమైన ప్రకృతికి మార్పు లేదు, మరణం లేదు. మనసు నిండా హాయి నింపుకుని అక్కడే కూర్చున్నా. నాకు తెలియకుండానే ఇసుకలో నా చేతులు గుజ్జన గూళ్ళు కట్టడం మొదలెట్టాయి.

మ్యాజిక్ రియలిజం - ఓ క్రొత్త వొరవడి తో మిడ్ నైట్ చిల్ద్రన్


ఇటీవల కాలం లో మ్యాజిక్ రియలిజం అనే అత్యాధునిక సాహితీ ప్రక్రియ బాగాప్రసిద్ది పొందింది..ప్రపంచాన్నితన రచనలతో ఓ వూపు వూపిన సాల్మన్ రష్ది తన 'మిడ్ నైట్ చిల్దరెన్' అనే నవలని మ్యాజిక్ రియలిజం లోనే వ్రాసారు.1920 లో యూరప్ లో ఫ్రాంజ్ రొహ్అనే కళా చరిత్రకారుడు ఇటాలియన్ పత్రిక " నోవోసేంటో" లో తన వ్యాసంలో కళల్లోఉండాల్సిన వాస్తవికత గురించి చెబుతూ మ్యాజిక్ రియలిజం పదాన్ని వాడాడు. 1949 లో అలిజో కార్పెంటియర్ అనే క్యూబా నవలా రచయిత మొదటిసారిగా సాహిత్యం లో వాడారు. లాటిన్ అమెరికన్ ప్రక్రియ గా చెప్ప బడే మ్యాజిక్ రియలిజం రచనల్లో సామాన్యమైన విషయాలకు కల్పన జోడించినా అసహజంగా అనిపించదు. ఇది ఒక దేశం లేక ప్రాంత చరిత్ర, రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కథ తో మమేకం చేస్తుంది. మ్యాజిక్ రియలిజం, అలిజో కార్పెంటియర్ ,జువాన్ కార్లోస్ ఒనేట్టి , జూలియా కార్టజర్, జార్జ్ లూయీ బోర్జెస్ , మిగెల్ ఏంజెల్ ఆస్తురియస్, కార్లోస్ ఫ్యుఎంతిస్, మారియో వర్గ ల్లోస మరియు గాబ్రియల్ గార్సియ మార్క్వెజ్ లాంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల చేతుల్లోపరిణితి చెందింది. లాటిన్ అమెరికన్ ప్రక్రియగా పేరు పొందిన మ్యాజిక్ రియలిజం మొట్ట మొదట గా జర్మనికి చెందిన గంటర్ గ్రాస్ చేతిలో ప్రతిభావంతంగా "టిన్ డ్రం" నవల గా రూపు దిద్దుకుంది .రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తర్వాత, జర్మనీలో ,పోలాండ్ లో వున్న రాజకీయ ,సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవనం ఎలా సాగిందో ఆస్కార్ అనే ముఖ్య పాత్రధారి (protagonist ) వివరిస్తాడు. తన తండ్రి ఎవరో తెలియని అనిశ్చిత పరిస్థితిలో, తన మూడో ఏట పెరగ కూడదని నిర్ణయించుకుని మరుగుజ్జుగా ఉండిపోయి,హిట్లర్ యొక్క అరాచకాలు, నాజీలకు యూదులకు మధ్య జరిగిన అమానుష సంఘటనలకి ప్రత్యక్ష సాక్షి గా నాటి జర్మన్ అక్రుత్యాలని వివరిస్తాడు. ఈ నవల గ్రాస్ కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. గ్రాస్, మ్యాజిక్ రియలిజంను "టిన్ డ్రం " నవలతో విశ్వవ్యాప్తం చేసాడు .

మ్యాజిక్ రియలిజం ను ప్రపంచవ్యాప్తం చేసిన మరోమహా కావ్యం మార్క్వెజ్ యొక్క 'వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యుడ్ " ఇది స్పానిష్ సాహితీ చరిత్రను తిరగ రాసింది. ఇంగ్లీషు తో పాటు ఎన్నో భాషల్లో కి అనువదించ బడిన ఈ నవల రచయితకు నోబెల్ పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. నవలలో, ఏడు తరాల వారు, మకoడో అనే చిన్న పట్టణాన్ని నిర్మించి, అభివృద్ధి చేసి,ఎలాదాని వినాశనానికి కారకులవుతారో రచయిత వివరిస్తాడు .ఆధునిక మానవుని ఆశలు,హద్దులు దాటి అతని వినాశనానికి ఎలా హేతువులు అవుతున్నాయో మనం చదువుతాము. లాటిన్ అమెరికన్ చరిత్రతో పాటు, కొలంబియా లో జరిగిన ప్రతి సంఘటన బుయoడియ కుటుంబ సభ్యుల జీవితాల తో ముడిపడి వుంటాయి.నవల లోని లాటిన్ అమెరికన్ చరిత్ర చదువుతున్నపుడు వళ్ళుగగుర్పాటు కు గురవుతుంది .బాల్యంలో జరిగిన బనానా మస్సక్రే లేక అరటి తోట దగ్గరి మారణ హోమం మార్క్వెజ్ హృదయ ఫలకం నుండి చెదిరి పోలేదు . కథలో ఆర్లియనో బుయoడియ ఆ ఘోర సంఘటనకు సాక్షిగా నిలబడతాడు. నియంతల పాలన లో ప్రజల జీవితాలకు విలువే లేదు , కనపడడం లేదని అనుకున్న వ్యక్తిని ఇంక శాశ్వతంగా మర్చిపోవాల్సిందే,ప్రశ్నించడం ఆన్ని నేరాల్లోకి పెద్ద నేరం ,ఆ అభియోగం మీద వెళ్ళిన వారు తిరిగి రారు.నాగరికత పేరుతో మకాండోలోఎన్నో మార్పులు సంభవించాయి.సమిష్టి కుటుంబం చెదిరిపోయి,చివరికి వావి వరుస మరిచి వ్యామోహం లో పడ్డ అన్నాచెల్లికి, తోక తో పుట్టిన శిశువును చీమలు తినివేయడంతో నవల ముగుస్తుంది.భావితరం గతిని ముందుగానే ఊహించిన వుర్సుల బుయoడియ,తన కుటుంబాన్ని, మకాండోపట్టణాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం ఫలించదు.యదార్థ సంఘటనలతో పాటు కల్పన నిండిన ఈ రక్త చరిత్ర ను ప్రపంచమంతా,అబ్బురంగా చదివింది . అమ్మమ్మ తాతయ్యల చెంత పెరిగిన మార్క్వెజ్ ,కథ చెప్పడం తన అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నా నంటాడు నోబెల్ బహుమతి తీసుకుంటూ.

ఈ రెండు నవలల తర్వాత మ్యాజిక్ రియలిజం ప్రక్రియలో చాలా నవలలు వచ్చాయి అయితే మళ్ళి ఓ ప్రభంజనం సృష్టించింది మాత్రం సాల్మన్ రష్డి యొక్క "మిడ్ నైట్ చిల్దరన్". ఈ నవలతో రాత్రి కి రాత్రి రష్డి ఒక సెలబ్రిటీ అయిపోయాడు.మిడ్నైట్ చిల్డ్రన్ ఇంగ్లీషు సాహిత్యం లో ఒక గొప్ప స్థానాన్ని పొందడమే కాకుండా రష్డి మాన్ బుకెర్ బహుమతిని గెలుచుకున్న ప్రథమ భారతీయుడై తర్వాత తరం వారైన విక్రం సెత్, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగ లాంటి వారికి బుకర్ బహుమతిని తన వారసత్వంగా అందించాడు. 1981లొ బుకర్ ప్రైజు ,1993 లో బుకర్ ఆఫ్ ది బుకర్ ను, 2008 లో ద బెస్ట్ బుకర్ ప్రైజు ను పొందిందిన ఏకైక గ్రంధమిదే.


రష్డి 1947 జూన్ 19 న బాంబే లో నగీన్ ,ఆనిస్ అహమ్మద్ రుష్ది దంపతులకు జన్మించాడు .ధనవంతులు, విద్యావంతులైన తల్లి దండ్రుల ప్రభావం వలన రష్డి కి చిన్ననాటి నుండి స్వేఛ్చ గా ఆలోచించడం అలవడింది.14 వ ఏటనే లండన్ లోని రగ్బీ పాఠశాలలో చేరాడు, తర్వాత కింగ్స్ కాలేజి, కేంబ్రిడ్జ్ లో చరిత్ర ప్రధానంగా బియ్యే చేసాడు. 1964లో రష్డి తల్లిదండ్రులు పాకిస్తాను లో స్థిరపడ్డారు ,రష్డి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా, పాకిస్తాన్లోని పరిస్థితుల్ని జీర్ణించుకోలేక తిరిగి లండన్ వెళ్లి పోయాడు. మల్టీ మీడియా గ్రూపులో కొంతకాలం పని చేసాక, డేవిడ్ హారే, స్నూ విల్సన్, హోవార్డ్ బ్రెంతాన్, స్టీఫెన్ పోలియోకఫ్ లాంటి రచయితలతో పరిచయం పెంచుకున్నాడు.ఈ పరిచయాలు అతన్ని రచయితగా మారడానికి ఎంతో దోహదం చేశాయి. అతని మొదటి నవల "గ్రైమస్ "1979 లో వచ్చింది, కానీ అటు పాఠకుల్ని గానీ ఇటు విమర్శకుల్ని గానీ అది మెప్పించలేకపోయింది. రష్డి మంచి చదువరి ,అతని అపార జ్ఞానం,ఇంగ్లీషుపై అతని పట్టు ,ఇంగ్లీషు వారిని సైతం అబ్బుర పరిచింది .1981 లోవచ్చిన "మిడ్ నైట్ చిల్దరన్ ",భారతదేశం స్వాతంత్రానికి ముందు, తర్వాత, ఇందిరా గాంధి ఎమర్జెన్సి అరాచకాలను వివరిస్తుంది.అతను రాసిన "షేం("SHAME ) సాటానిక్ వెర్సెస్ (SATANIC VERSES ) "హరూన్ అండ్ సి ఆఫ్ స్టోరీస్ "(HAROUN AND SEA అఫ్ STORIES) నవలలు మ్యాజిక్ రియలిజం ప్రక్రియ ద్వారానే రాయబడ్డాయి. "సాటానిక్ వెర్సెస్" ముస్లిం ల మనోభావాల్ని కించపరిచే విధంగా వున్నదని ఆ నవలని మొట్టమొదటి సారిగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం బహిష్కరించడం శోచనీయం. తరువాత ఇరాన్ ముస్లిం నాయకుడైన ఆయతుల్ల ఖుమేని, ఖురాన్నిఅవమానించిన గ్రంధంగాను దాని రచనకు భాద్యులై న వారినందరినీ ఇస్లాం మతవ్యతిరేకులు గా తీర్మానించి ఫత్వా విధించాడు. ప్రతి ముస్లిం రష్డి ని చంపడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చాడు. రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అతన్ని రక్షణ భారాన్ని అప్పటి మార్గరెట్ థాచర్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంది.ప్రపంచవ్యాప్తంగా రష్దిపై ఫత్వాని అమానుషమైన చర్యగా వర్ణించాయి. అన్ని దేశాలు, ఫత్వాని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసాయి. కానీ ఖుమేని అందుకు అంగీకరించలేదు అన్ని ముస్లిం దేశాలు రష్డి పుస్తకాన్ని క్షుద్ర సాహిత్యంగా గా వర్ణించాయి. ఖుమేని మరణం తర్వాత రష్డి ఫత్వాని లెక్క చేయలేదు, తన సొంత సెక్యూరిటీతో సాహితీ సభలకు తిరుగుతూ వున్నాడు. ఒక లిటరరీ ఇకన్ గా వెలుగొందుతూ తర్వాత ది మూర్స్ లాస్ట్ సై,(THE MOOR 'S LAST SIGH ) The Ground Beneath Her Feet , Fury, Shalimar the Great, The Enchantress of Florance మరియు Luka and the Fire of Life నవలలను వ్రాసారు.

భారతదేశం వచ్చి తన బాల్యం గడిపిన ఇల్లు "విండ్సర్ విల్లా" ను చూసి రష్డి చలించి పోయాడు. బాంబే చూడగానే తన సొంతగూడు చేరుకున్న అనుభూతి కలిగిందని ,ఇదే తనను "మిడ్నైట్ చిల్డ్రన్" రాయడానికి ప్రేరేపించిందని అతను చెప్పుకున్నాడు. "మిడ్నైట్ చిల్దరన్" రాయడానికి గ్రాస్ యొక్క "టిన్ డ్రం", మార్క్వెజ్ యొక్క"వన్ హుండ్రేడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యు డ్" ఎంతో ప్రభావం చూపినట్లుగా రష్డి అంగీకరించాడు.. పాఠకులు రష్డి "వన్ హండ్రెడ్ యియర్స్ అఫ్ సాలిట్యుడ్ " నుండి మ్యాజిక్ ని, గ్రాస్ "టిన్ డ్రం" నుండి రియలిజం ను తీసుకున్నట్లు గ్రహిస్తారు.

మ్యాజిక్ రియలిజం కు కొన్ని సిద్దాంతాలు (manifestations) వున్నాయి. ఇది మ్యాజిక్ మరియు రియలిజం ల మిశ్రమం. కల్లోల ప్రాంతాల్లోనే ఎక్కువ గా రాయబడ్డ ఈ ప్రక్రియ పోస్ట్ కలోనియల్ (post colonial and post modern) అత్యoత ఆధునిక సాహిత్యం గా చెప్పబడుతోంది. "మిడ్ నైట్ చిల్దరన్ " నవల, సలీం సినాయ్ ఆత్మకథ. అతను తన స్నేహితురాలైన పద్మకు తన కథను వివరిస్తూ ఉంటాడు. తన ముప్పైవ ఏట అడుగు పెట్టె సమయం దగ్గర పడుతుండగా తన శరీరం చీలి పోతు న్నట్టు గా,తన అవయవాలన్నీ వీడి పోతున్నట్లుగా అనిపించడం తో తన అంతం దగ్గర పడుతుందని భావించిన సలీం తన కథను పద్మ కు చెబుతాడు. ఉత్తమ పురుషం లో మొదలయ్యే ఈ కథ సలీం నర్లికర్ నర్సింగ్ హోమ్ లో1947 ఆగస్టు 15 వ తేది అర్థరాత్రి భారతదేశానికి స్వాతoత్ర్యం ప్రకటించిన క్షణం లోనే పుట్టడం తోమొదలవుతుంది అదే సమయం లోనే మరో మిడ్ నైట్ చైల్డ్ శివ కూడా పుడతాడు .తర్వాత గంట వరకు పుట్టిన 1001 పిల్లలే మిడ్ నైట్ చిల్డ్రన్ .వీరికందరికి ఏదో ఒక మానవాతీత శక్తులు వుంటాయి .అయితే చాలామంది పిల్లలు బాల్యం లోనే చనిపోతారు. 581 పిల్లలు మాత్రం బ్రతికి సలీం తో మిడ్ నైట్ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ లో తమ ఆలోచనలని పంచుకుంటారు.


సలీం 1915 సంవత్సరం నుండి కథ మొదలు పెడతాడు. కాశ్మీర్ కు చెందిన తన తాత గారైన డాక్టర్ ఆడం అజీజ్ గురించి మొదటి అధ్యాయం లో ప్రస్తావిస్తాడు. సంపన్న వర్గానికి చెందిన ఘని సాహెబ్ కూతురు నసీంను ఆడం ను 1918 లో పెళ్లి చేసుకుని ఆగ్రా వస్తున్నపుడు, గాంధి అరెస్టుకు నిరసనగా హర్తాల్ ప్రకటించినప్పుడు జరిగిన హింసాకాండలోభాగంగా, జలియన్ వాళభాగ్ ఉదంతం జరగడం,అక్కడ జరిగిన మారణ హోమం, జెనరల్ డయ్యర్ క్రూర చర్య , ఆడం అజీజ్, డాక్టర్ గా తన వృత్తి ధర్మం నిర్వహించి రక్త సితమైన దుస్తులతో రావడంతో,సలీం యొక్క కుటుంబ సభ్యులు భారత దేశ చరిత్ర లో చోటు చేసుకుంటారు. ఇది మొదలుకుని సలీం జీవిత చరిత్ర భారత దేశ చరిత్ర తో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది.

ఆడం అజీజ్ నసీం లకు ముగ్గురు కూతుర్లు అలియ,ముంతాజ్, ఎమరాల్డ్ ,ఇద్దరు కొడుకులు ముస్తఫా,హనీఫ్. ఆడం అజీజ్ దేశ విభజనను వ్యతిరేకించే మియాన్ అబ్దుల్లా ను అభిమానిస్తాడు.అయితే మియాన్ అబ్దుల్లా హత్య చేయబడతాడు. అతని అనుచరుడైన నాదిర్ ఖాన్ కూడా ప్రమాదం లో వున్నాడని భార్యఅభిమతానికి వ్యతిరేకంగా అతనికి తన ఇంటిలో ఆశ్రయ మిస్తాడు.నాదిర్ ఖాన్ ముంతాజ్ ప్రేమ లో పడి రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంటారు .అయితే రెండు సమత్సరాల తర్వాత కూడా కన్యగా వున్న ముంతాజ్ ను వదిలి పెట్టి నాదిర్ ఖాన్ పారి పోతాడు. పాకిస్తాన్ సైన్యాధికారి మేజర్ జుల్ఫీకర్ ఎమరాల్డ్ కు భర్తగా వస్తాడు.అంతవరకు అలియ ను పెళ్లి చేసు కోవాలనుకుంటున్న అహ్మద్ సినాయ్ అనే వ్యాపారి ముంతాజ్ ను పెళ్లి చేసుకుంటాడు.ముంతాజ్ తన పేరును అమీనా గా మార్చుకుని అతని తో డిల్లి కి పయనమవుతుంది.

గర్భవతిగా వున్నఅమీనాను చూసి ఆమె గర్భం లోవున్నబిడ్డ తన దేశాని కంటే పెద్ద వాడు,కాని చిన్న వాడు కాలేడని జ్యోతిష్కుడు చెబుతాడు. టెర్రరిస్టుల దాడిలో అహ్మద్ ఫ్యాక్టరీ కాలిపోవడంతో అతను డిల్లి వదిలి బాంబే కు మకాం మారుస్తాడు. అక్కడ విలియం మేతోల్ద్ అనే బ్రిటిష్ దేశస్థుని ఇల్లు కొనుక్కుంటాడు. మేతోల్ద్ ఎస్టేట్ గా పిలవబడే ఆప్రాంతం లో చాలా కుటుంబాలు వుంటాయి. వారి కందరికీ వీ విల్లి వింకి అనే గాయకుడు తన పాటలతో వినోదం పంచుతుంటాడు. అతని భార్య వనిత కూడా గర్భవతి. అయితే ఆమెకు మేతోల్ద్ తో వున్న అక్రమ సంభందం తో బిడ్డ కలగ బోతున్నాడు. అమీనా, వనిత, నర్లికర్ నర్సింగ్ హోమ లో 1947 ఆగస్టు 15 అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు మగబిడ్డల్ని ప్రసవిస్తారు. అయితే కమ్యూనిస్ట్ ప్రేమికుడు జోసెఫ్ దికోస్ట ప్రభావం వలన మేరి పెరిరియ అనే నర్సు ,పిల్లలిద్దరి పేర్ల ట్యాగులను మార్చి ధనవంతుల బిడ్డను పేదవారికి, పేదవారి బిడ్డను ను ధనవంతుల చెంతకు చేర్చడం ద్వారా సమాజం లోని అసమానతలు పోగొట్టడం లో తన వంతు పాత్ర పోషించానని అనుకుంటుంది. కానీ పాప భీతి తో అమీనా ఇంటికి ఆయాగా వచ్చి సలీం ను చూసుకుంటుంది. వనిత, శివ పుట్టగానే చనిపోతుంది. వీ విల్లి వింకి శివ ను తీసుకుని వెళ్లి పోతాడు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన నిముషం లోనే పుట్టిన సలీం కు ఆన్ని పత్రికలకు అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తాయి. స్వతoత్ర భారతదేశం లో పుట్టిన మొదటి బిడ్డగా ప్రధాన మంత్రి నెహ్రు సైతం సలీం కు ప్రత్యేకంగా అభినందనలను వుత్తరం ద్వారా తెలుపు తారు. సలీం కు వెడల్పాటి ముఖము, అతిపెద్దదైన దోసకాయ వంటి ముక్కు,నీలికళ్ళు ఒక ప్రత్యేకతను ఇస్తాయి.


సలీం చెల్లెలు జమీల, ఆమెను బ్రాస్ మంకీ అని పిలుస్తుంటారు.సలీం తోటి పిల్లలు అతని ముక్కు, మొహం గురించి చేసే ఎగతాళి నుడి తప్పించుకోవడానికి స్నానాల గదిలో (washing chest ) లో దాక్కుంటాడు. అమీనా అది చూసి సలీంను ఒక రోజంతా మాట్లాడ కూడదని శిక్షిస్తుంది. మౌనంగా వున్న ఆ సమయంలో సలీం ఏవేవో శబ్దాల్ని వింటాడు.తనకు వేరే వాళ్ళ ఆలోచనల్ని చదివే శక్తీ మరియు టేలిపతి వున్నాయని గ్రహిస్తాడు.ఇక్కడినుండి రష్ది మ్యాజిక్ రియలిజం వుపయోగించి సలీం మానవాతీత శక్తులను సహజమైన ధోరణి లో పాఠకుడు గ్రహించెట్లు చేస్తాడు.ఇదే మ్యాజిక్ రియలిజం లోని మ్యాజిక్. సలీం తనతో పాటు జన్మించిన 1001 మంది పిల్లలలో 581 మంది మాత్రమే జీవించి తమ పదవ జన్మ దినాన్ని జరుపుకున్నారు.వీరందరికీ అద్భుత శక్తులు వున్నాయి. అర్థరాత్రికి దగ్గరగా జన్మించిన వాళ్లకి ఎక్కువ, తరవాత ...తరవాత పుట్టిన వాళ్లకితక్కువ శక్తులు వుంటాయి. సలీం తో పాటు జన్మించి సలీం స్థానం లోకి వెళ్లి పోయిన మరో పిల్ల వాడైన శివకు బలమైన పెద్ద మోకాళ్ళు వుండి ఎప్పుడూ యుద్ధం చేయడానికి సిద్దంగా ఉంటాడు. అతని స్థానాన్నిచేజిక్కుంచుకున్న తనను శివ ఏమి చేస్తాడో అని సలీం ఎప్పుడూ భయపడుతుంటాడు.

సలీం ఒక ప్రమాదంలో ఒక వేలు తెగినప్పుడు జరిపిన రక్త పరీక్షలో సలీం అమీనా అహ్మద్ ల కొడుకు కాదని తేలుతుంది. హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే సలీం ను అతని మేన మామ హనీఫ్ ఇంటికి పంపుతారు. సలీం తిరిగి తన ఇంటికి వచ్చిన కొంతకాలానికి హనీఫ్ ఆత్మహత్య చేసుకుంటాడు.హనీఫ్ సంస్మరణ సభలో మేరి తాను చేసిన తప్పును అంగీకరిస్తుంది అహ్మద్ బాగా త్రాగడం అలవాటుచేసుకుని అమీనాను సలీం ను తీసుకుని బయటకు వెళ్ళ మనడంతో అమీనా పిల్లలిద్దరిని తీసుకుని పాకిస్తాన్లో వున్న తన సోదరి ఎమరాల్డ్ దగ్గరికి వెళ్లి పోతుంది. అక్కడ ఎమరాల్డ్ భర్త జుల్ఫీకర్ సైనిక తిరుగుబాటు చేయడంతో మార్షల్ లా విధిస్తారు.

నాలుగు సంవత్సరాల తర్వాత, అహ్మద్ కు గుండె జబ్బు రావడం తో అమీనా పిల్లలతో భారతదేశానికి తిరిగి వస్తుంది. చైనా భారత దేశంతో యుద్దానికి దిగుతుంది. సలీం ముక్కుకు సంభందించిన జబ్బు కు ఆపరేషన్ జరిగినప్పుడు అతని టేలిపతి శక్తులన్నీ పోతాయి, అయితే వాటి స్థానే వాసనలు గ్రహించే అద్భుతమైన శక్తి రావడం తో ఇతరుల వుద్వేగాల్ని అతను గ్రహించ గలుగుతాడు. చైనా తో జరిగిన యుద్ధం లో భారత దేశం ఎంతోమంది సైనికుల్ని కోల్పోతుంది. అహ్మద్ అమీనా శాశ్వతంగా పాకిస్తానులోనే స్థిరపడాలని నిర్ణయించుకుని పిల్లలను తీసుకుని భారతదేశం వదిలిపోతారు.జమీల పాకిస్తానులో ఒక గొప్ప గాయకురాలిగా పేరు సంపాదించుకుంటుంది. భారత దేశానికి పాకిస్తానుకు జరిగిన యుద్ధం లో జరిగిన వైమానిక దాడుల్లో సలీం, జమీల తప్ప సలీం కుటుంబంలో అందరూమరణిస్తారు. వైమానిక దాడుల్లో ఆడం అజీజ్ యొక్క వెండి ఉమ్మి తొట్టి సలీం తలపై పడడం తోఅతని మెదడు దెబ్బతిని గతాన్ని మర్చి పోతాడు. అతన్ని పాకిస్తాన్ మిలటరీ, వేట కుక్క లాగ ఉపయోగించుకుంటుంది.అతని వాసన పసిగట్టే శక్తిని పాకిస్తానీ సైనికులు, బంగ్లా దేశం కోసం యుద్ధం చేస్తున్నసైనికులను , భారత దేశపు గూడాచారులను కనిపెట్టే దానికి ఉపయోగిస్తారు. సలీం కు తాను మిలటరీ లోనికి ఎలా వచ్చింది తెలియదు అయితే జమీల తన సొంత చెల్లెలు కాదని తెలిసాక ఆమె పట్ల తన ప్రేమను ప్రదర్శించి నందుకు శిక్ష గానే అతన్ని మిలటరీ వాళ్లకు అప్పగించినట్లు సలీం అనుమానిస్తాడు. పాకిస్తాను సైన్యం లో ఉండగానే బంగ్లా దేశ స్వతంత్రం కోసం సహాయం చేస్తాడు. ఎన్నో భయంకరమైన ఉదంతాలను చవి చూసిన సలీం తన ముగ్గురు అనుచరులతో తప్పించుకుని సుందర్ బన్స్ చేరుకుంటాడు.అక్కడే సలీం మర్చిపోయిన తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడుకానీ అతని పేరు మాత్రం అతనికి గుర్తురాదు. సుందర వనాల్ని వదల గానే సలీం కు పార్వతి -మంత్రగత్తె కనిపిస్తుంది.ఆమె కూడా సలీం తో పాటు అర్థ రాత్రి పుట్టిన పిల్లలలో ఒకతి. పార్వతి సలీం కు తన పేరును గుర్తు చేయడమే కాకుండా అతన్ని క్షేమంగా తన బుట్టలో తీసుకుని భారతదేశం చేరుస్తుంది. సలీం, పార్వతి తో పాటు పాములాడించే పిక్చర్ సింగ్ తో మంత్రాల వాళ్ళు వుండే ఒక గుడి సెలో వుండి పోతాడు.సలీం పెళ్ళికి నిరాకరించడం తో పార్వతి, శివ తో స్నేహం చేస్తుంది. శివ ఇప్పుడు ఒక యుద్ధయోధుడు .కానీ ఏ మాత్రం నైతిక విలువలు పాటించని శివ తో పార్వతి ఉండలేకపోతుంది. శివ కు ఎంతోమంది అక్రమ సంతానం వుంటారు. అతని అరాచాకాలకి ఎంతోమంది స్త్రీలు బలవుతారు.

పార్వతి పెళ్లి కాకుండా శివ బిడ్డను తన గర్భం లో మోస్తూ తిరిగి పిక్చర్ సింగ్, సలీంల దగ్గరికి వస్తుంది.అయితే చుట్టుపక్కల వాళ్ళంతా పార్వతిని తమ దగ్గరకు రానివ్వరు అప్పుడు సలీం పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే ఇందిరా గాంధి, కుమారుడు సంజయ్ గాంధి కుటుంబ నియంత్రణ పథకాన్నిమొదలు పెడతారు.పార్వతి కి బిడ్డ పుట్టగానే ఇందిరా గాంధి ప్రభుత్వం సలీం పార్వతి ఉంటున్న ప్రాంతాన్ని నాశనం చేస్తుంది .శివ బలవంతంగా సలీం ను కుటుంబ నియంత్రణ కేంద్రానికి తీసి కెళ్ళ గానే పార్వతి మరణిస్తుంది. సలీం, శివ ఆధీనం లో అర్థరాత్రి తన తో పాటు పుట్టిన వాళ్ళందరి పేర్లు చెబుతాడు . వాళ్ళందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం ద్వారా వాళ్ళ లోని అద్భుత శక్తుల్ని నాశనం చేయడం ద్వారా ఇందిరా గాంధి ప్రభుత్వానికి వున్న ప్రమాదాన్ని నివారించ గలిగినామని అనుకుంటారు. అయినప్పటికీ ఇందిరా గాంధి ఎన్నికల్లో వోడి పోతారు. సలీం తో పాటు అర్థరాత్రి జన్మించిన వారందరూ సలీం తో విడుదల అవుతారు.సలీం, పార్వతి బిడ్డ ఆడం ను వెతుక్కుంటూ వెళతాడు. పిక్చర్ సింగ్ దగ్గరున్న ఆడం ను తీసుకుని ముగ్గురు బాంబే వెళతారు.

బాంబే లో ఒక చోట చట్నితిన్నసలీం అది తన ఆయా మేరి చేసిన చట్నిగా గుర్తించి, ఆ చట్ని ఫాక్టరీ దగ్గరకు వెళతాడు అక్కడ గేటు దగ్గరే పద్మ కనపడుతుంది .సలీం మేరీ ని కలిసాక ఆడం సంరక్షణ ను పద్మకు అప్పగించి తన ఆత్మకథని వివరిస్తాడు. తన కథ విని తన ప్రేమను అర్థం చేసుకున్న పద్మ ను సలీం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.అయితే తన 31 వ పుట్టిన రోజున, అదే భారతదేశపు 31 స్వాతంత్రదినం రోజున తన శరీరం కోట్ల కొలది అణుదూళిగా మారడం వలన తన మరణం సంభవిస్తుందని సలీం జోస్యం చెప్పడం తో కథ ముగుస్తుంది.



మిడ్నైట్ చిల్దరన్ లో మ్యాజిక్ రియలిజం

ఈ కథను రష్డి మ్యాజిక్ రియలిజం లో ఎలా చెప్పాడన్నది అతని 647పేజీల నవల చదివితేనే సంపూర్ణంగా అర్థమవుతుంది . (Manifestations of Magic Realism ) మాజిక్ రియలిజం యొక్క సిద్ధాంతాల గురించి తెలుసుకుంటే నవల ఇంకా బాగా అర్థమవుతుంది. నవల భారతదేశ స్వాతoత్రానికి ముందు తర్వాత, ఇందిరా గాంధి ఎమెర్జెన్సిరోజుల గురించి వ్రాయబడ్డది. బ్రిటిష్ వారు వదిలి వెళ్ళాకకూడా మన దేశం ఏ మాత్రం ప్రశాంతంగా లేదు. దేశ విభజన , భారీ వలసల తో ,కాందిశీకుల ప్రవేశంతో, హిందూ ముస్లింల ఘర్షణలతో ,భాషాప్రయుక్త రాష్ట్రాల గొడవలతో, పొరుగు దేశాల సరిహద్దు సమస్యలతో చైనా ,పాకిస్తాను యుద్ధ కవ్వింపు లతో అతలాకుతలంగా వున్న అనిశ్చిత భారత రాజకీయ పరిస్థితుల్లో పెరిగిన రష్డి ,వాటి తో పాటు తల్లి తండ్ర్లు లు పాకిస్తాన్ కు వలస వెళ్ళడం ,తన కిష్టమైన, పుట్టి పెరిగిన బాంబే ని కోల్పోవడం లాంటి బాధాకరమైన ,సంఘటనల్ని తన నవలకి వస్తువుగా తీసుకున్నాడు. ఇలాంటి నేపథ్యమే మ్యాజిక్ రియలిజం లాంటి సాహితీ ప్రక్రియకు కావలసింది.


ఊహ కల్పనల తో పాటు ,అతీంద్రియ శక్తులు కలిగిన అర్థరాత్రి పుట్టినపిల్లలు మిడ్ నైట్ చిల్డ్రన్ నవలని మ్యాజిక్ కు దగ్గర చేస్తే, చరిత్రలో మరువలేని అధ్యాయాలు కొన్నిరియలిజం దగ్గర చేస్తాయి . ,మహాత్మ గాంధి 7 ఏప్రిల్ 1919 లో జరిపిన హర్తాల్ ,13 ,ఏప్రిల్ 1919 న జరిగిన జలియన్ వాలా భాగ్ లో జరిగిన మారణ కాండ,ఆ హింసాకాండలో గాయపడిన క్షతగాoత్రుల ను ఆడం అజీజ్ చికిత్స చేయడం ,ఆడం గుండె పై గాయం భారతదేశపు చరిత్రలో మానిపోని గాయంగా,చెదిరిపోని మచ్చగా వుండి పోయిందంటాడు రచయిత. ఇంకా అనేక మంది నాయకులు విభిన్న రీతుల్లో బ్రిటష్ వారితో పోరాడిన వైనం , మియాన్ అబ్దుల్లా ,నాదిర్ ఖాన్లు చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోయిన కొందరి త్యాగం గుర్తుకొస్తుంది.1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం ,do or die ,నినాదం తో మొదలయ్యి కొన్ని చోట్ల హింసగా మారి అహ్మద్ ఫాక్టరీ కాలి పోతుంది. తర్వాత అతను బాంబే వెళ్లి పోవడం జరుగుతుంది.1947 లో స్వతంత్రం ప్రకటించడం ,అదే సమయం లోనే సలీం ,శివ, 1000ఇతరపిల్లలు జన్మించడం సలీం కు TheTimes of India బహుమతి తో పాటు ప్రధాన మంత్రి వుత్తరం అందుకోవడం,చరిత్రలోను నవలలోను చోటు చేసుకున్నా వుదంతాలే . కవాస్ మానెక్ షా నానావతి అనే నేవీ కమాండర్ తన స్నేహితుడైన ప్రేమ్అహుజ ను కాల్చి చంపడం 1959 లో సంచలనం కలిగించింది. కమాండర్ భార్య తో అక్రమ సంభంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోమని కోరినప్పుడు తిరస్కరించినందుకు గాను ఆహుజాను చంపినట్లు ,పోలీసులకు లొంగిపోయిన కమాండర్ చెబుతాడు..ఈ వార్తకు పత్రికలు చాలా ప్రధాన్యత నిచ్చాయి ఈ సంఘటన ఆధారంగా నవలలో సలీం ,తన ఇంటి పక్కనే వున్న కమాండర్ సబర్మతి భార్య లీలను ,ఆమె ప్రియుడు హోమీ కత్రాక్ లను హత్య చేసి పోలీసులకు లొంగి పోవడం గురించి చెబుతాడు. లీల హామీల శృంగారం, హత్యల, గురించి మాట్లాడుతూ, అవిదేయులైన భార్యలకు,తల్లులకు ఇదేగతి అని హెచ్చరిస్తాడు సలీం. అమీనా తన మొదటి భర్తను నాదిర్ ఖాన్ ను కలవడానికి వెళ్ళ బోతూ ఈ సంఘటనతో భయ పడి ఆగి పోతుంది.


సామాజిక, రాజకీయ సంఘటనల గురించి ఎన్నో ఉదాహరణలు నవలలో చూస్తాము గాంధి చంపబడినట్లు తెలియ గానే ముస్లింలు అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుంటారు. సలీం కుటుంబం కూడా. కానీ రేడియో లో హంతకుడి పేరు విని ఆమీన,"అతను ముస్లిం కాదు , గాడ్సేఅవడం వలన అంటే ,హిందూ అవడం వలన మనల్ని బ్రతికించాడు" అంటుంది. 1957 లొభారతదేశం 14 రాష్ట్రాలు గాను,7 కేంద్రపాలిత ప్రాంతాలు గాను విభజించిన తరువాత , బాంబే మాత్రం చాలా బాషలు మాట్లాడే రాష్ట్రం కావడం తో అలాగే ఉంచారు.దానివలన 1957 ఫిబ్రవరి లో సంఘర్షణ మొదలైంది.ఇందులో భాగంగా సలీం కొంతమంది ఉద్యమకారుల చేతుల్లో చిక్కుతాడు గుజరాతిలో మాట్లాడమన్న వారితో తనకు తెలిసిన ఒక గుజరాతి పద్యం చెబుతాడు. .ఉద్యమకారులు ఆ పద్యం లోని ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని నినాదం గా మార్చుకోవడం తో సలీం,బాషా ప్రయుక్త రాష్ట్రాలకు కారణ భూతుడవడమే కాకుండా బాంబే రాష్ట్రంగా విడిపోవడాని కి ప్రత్యక్షంగా కారణమయాడు.


హృదయ విదారకమైన పేదరికంతో వుండే కొన్ని ప్రాంతాలు నాగరిక సమాజానికి మచ్చలాంటివి ,అయితే పేదరికం లేకుoడా చేయడం పాలకుల పని, భాద్య్హత, కానీ గుడిసల్ని కూలదోయడం కాదు, పిక్చర్ సింగ్, పార్వతి వాళ్ళు వుండే గుడిసెలు సంజయ్ గాంధి బుల్డోజర్లతో కూల్చి వేయడం లాంటి సంగతులను ఎన్నో చరిత్ర తనలో దాచుకున్నది. ఎన్నోసామాజిక,ఆర్ధిక అసమానతలకు తల్లడిల్లే జనం పై రాజకీయ నాయకులకు ఎంత బాధ్యత వుంటుందో ..వోటు పడగానే వోటర్ల ను మరిచే సంసృతి అలవడిన వాళ్ళు పేద వాళ్ళను ఎంత హీనంగా చూస్తారో ! తమ అభివృద్ధి కోసం అడ్డు వచ్చిన పేదవారిని అడ్డు తొలగించు కోవడం కోసం నాయకులు ఎంత గా దిగజారుతారో ..రష్డి వివరంగా రచించారు.


మ్యాజిక్ రియలిస్ట్ నవలలు చాలా కష్టమైన భాషలో వుంటాయి. "మిడ్నైట్ చిల్దరన్" కూడ ఇందుకు మినహాయింపు కాదు . రష్డి ఇంగ్లీష్ ను భారతీయం చేసారు.ఆయన చేతిలో అది ఒక ప్రత్యేకమైన భారతీయ భాషగా మారి పోయింది. భారతీయ భాష లోని ఎన్నో పదాల్ని అతను ఇంగ్లీషు లో కలిపి వాడాడు. ఇంగ్లీషు సాహిత్యం వ్రాసిన భారతీయులలో రష్డి లా ఖ్యాతి గడించిన వారు లేరు. అతని కి భాష పై గట్టి పట్టు వున్నది. కొత్త పదాల్ని ఉపయోగించడం లో రష్డి అందె వేసిన చెయ్యి."మిడ్ నైట్ చిల్దరన్ " షోకేసుల్లో పెట్టుకునే ఒక పుస్తకం మాత్రమే ,ఇది చదవడం అంత తేలిక కాదు "అని ఒక విమర్శకుడు అన్నాడు భారత దేశ చరిత్ర తో అవగాహన లేని వాళ్లకు ఈ నవల అంతా సులభంగా అర్థం కాదు.కానీ విచిత్రమేమంటే భారతీయుల కంటే దీన్ని భారతదేశ చరిత్ర తెలియని విదేశీయులే ఎక్కువ చదివినట్లు మిడ్నైట్ చిల్ద్రెన్ అమ్మకాలు..విమర్శలు,అవార్డులు తెలుపుతున్నాయి.


మ్యాజిక్ రియలిస్ట్ నవలల్లో అద్భుతాలు,అనూహ్య మైన సందర్భాలు, కల్పనలు, ఊహల్లో మాత్రమే సాధ్యమయే సంఘటనలు దర్సనమిస్తాయి .ఈ నవల పేరులోనే కల్పన వున్నది. స్వతంత్రం వచ్చిన గంట లోపల పుట్టిన పిల్లలకు అద్భుత శక్తులు వుండడం అన్నదే ఒక కల్పన. సాహిత్యమే కల్పన, ఊహలతో కూడుకున్నది.రష్డి ప్రతి పేజీలో ఊహను, కల్పనను,వాస్తవాన్ని కలిపి కథగా అల్లుతాడు. మిడ్ నైట్ చిల్దరన్ కల్పన వున్ననవలే కానీ వుట్టి కల్పన కాదు.


రష్డి కథ చెప్పే విధానం వినూత్న పద్దతిలో వుంటుంది. సలీం కథని తన శ్రోత ఆయిన పద్మతో , "ఒకానొకప్పుడు " అంటూ మొదలు పెడతాడు. అంతే కాదు,వర్తమానం నుండి గతం లోకి గతం నుండి భవిష్యత్తు లోనికి రచయిత వెళుతుంటాడు. 1918 లోకాశ్మీర్ లో అజీజ్ తో మొదలవాల్సిన కథ 1947 లొ సలీం తో బాంబే లో మొదలయ్యి మళ్ళి వెనక్కి వెళుతుంది. ఇది కూడా మ్యాజిక్ రియలిస్ట్ నవలలు నడిచే పద్దతే. జానపద కథను చెప్పే రీతిని రష్డి అద్భుతంగా,విజయవంతంగా ప్రయోగించి ఎంతో మంది కొత్త రచయితలకు మార్గదర్సకుడు అయాడు.


కొందరు రచయితలు ,ముఖ్యంగా తమ మాతృ దేశాన్నివీడడం వలన ఒకరకమైన దూరాన్ని(alienation) అనుభవిస్తుoటాడు.మ్యాజిక్ రియలిస్టు నవలాకారులు ఈ రకమైన కష్టాన్ని అనుభవిస్తారు ,సొంత గడ్డను వదిలి పరాయి దేశాల్లో వున్నప్పుడు మాతృ దేశం గురించి రాయడం ద్వారా కొంతవరకి త్రుప్తిని పొండుతారేమో! ఈ అభిప్రాయాన్ని రష్డి చాలా ఇంటర్వ్యులలో చెప్పారు. తమ అనుభవాలని, తమ జీవితం లో జరిగిన సంఘటనల్నిరచయిత తన కథలో చెప్పడం అన్నది చాలా సాధారణమైన అంశం.అలాగే ఈ నవల రష్డి ఆత్మకథలా అనిపించడం లో కూడా ఆశ్చర్యం లేదు. మిడ్నైట్ చిల్ద్రన్ నవల ముగింపు లో స్పష్టత లేదు. మ్యాజిక్ రియలిస్ట్ నవలలు ఇలాగే అస్పష్టంగా ముగుస్తాయి. పాఠకులు తమకు తోచిన ముగింపును అన్వయించుకోవచ్చు.


Vividha Andhrajyothi- 2014