Tuesday, 28 February 2017

దిద్దుబాటు


డిసెంబర్ నెలలో ఉండాల్సిన చలి లేకపోవడంతో ,ఇంకా సూర్య కిరణాలు వేడెక్కక పోవడంతో ఉదయం ఆహ్లాదకరంగా వుంది. ఆదివారం కావడం తో ఆఫీసు కెళ్ళే తొందర లేక మనసుకు విశ్రాంతిగా వుంది . ప్రతి ఆదివారం ఒక మంచి పుస్తకం చదవడం అలవాటు నాకు. రావూరి భరద్వాజ గారి "పాకుడు రాళ్ళు " తీసుకుని పైనున్న నా గదిలో కిటికీ దగ్గర కూర్చున్నాను. గోల వినపడ్డం తో విశాలంగా వుండే కిటికీ లోనుండి క్రిందికి చూశాను.నా కొడుకు అనూప్ వాడి స్నేహితులు తోటలో కుర్చీలు వేసుకుని క్యారమ్స్ ఆడుతున్నారు. నూనూనుగు మీసాల యవ్వనం తో తుళ్ళింత లాడుతున్నారు . ఏ బాదరబందీ లేని వయసు లో కేరింతలాడుతున్నారు. ఇంకో రెండేళ్లలో ఈ యువకులంతా కంప్యూటర్ల ముందు చలనం లేని జీవితాలకు బలవుతారనుకుంటే బాధేసింది. బాగా చదివే అనూప్ ను డిగ్రీ చదివించి సివిల్స్ కు ప్రయత్నించాలని, ఒక ఆదర్శవంతమైన కలెక్టర్ చేయాలనే నా ఆశను వాడు ఆశయంగా తీసుకోలేదు. కంప్యూటర్ ఇంజనీరింగ్ పై వాడికున్న ఆసక్తి ని తండ్రిగా గౌరవించాల్సి వచ్చింది. పిల్లలపై నుండి నా చూపుల్ని, ఆలోచనలను మరల్చి పుస్తకం లోకి తలదూర్చాను. అరవై, డెబ్బైల మధ్య కాలం లో తెలుగు సినిమా రంగo నేపథ్యంగా కథానాయకి మంజరి జీవిత చరిత్ర ఆసక్తి కరంగా వుండడంతో అందులో లీనమైపొయాను .


అకస్మాత్తుగా అనూప్ అతని స్నేహితుల మధ్య ఓ భిన్న స్వరం వినపడి తల త్రిప్పి, క్రిందికి తోటలోకి చూశాను.పాప్ కార్న్ అమ్మే ఓ ముసలాయన తన పెద్ద మూటను పిల్లల ముందు పెట్టాడు. అక్కడున్న ఆరుమందికి పేపర్ కవర్లలో ఒక డబ్బాతో పాప్ కార్న్ వేసిచ్చాడు. అతనికి ఎనభై దాకా వయసుంటుంది . కుర్రాళ్ళు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తున్నాడు . నేను ఆసక్తిగా వింటున్నాను.


"రోజుకు ఎన్ని మూటలు అమ్ముతావు తాతా?" అనూప్ అడిగాడు


"ఎన్నో ఎక్కడ నాయనా ! ఒక్క మూట అమ్మే సరికి నా ఊపిరి పోతుంది " ముసలాయన భుజం మీది తుండు తీసుకుని ముఖం తుడుచుకున్నాడు .


"ఎంత సంపాదిస్తావేమిటి?" మరో ప్రక్కనుండి వచ్చింది ప్రశ్న


"ఇయన్నీ అమ్మితే నూరు మిగులుతుంది నాయనా "


"అన్నీ అయిపోతాయా ? మిగలవా ? మిగిలితే మెత్తగా అయిపోతాయి కదా ఎవరు కొంటారు ?" రఫిక్ మంచి ప్రశ్న వేశాడు


"బట్టి కాడ్నించి అట్లే అమ్మడానికి పోతా బాబూ ... మధ్యానం కల్లా అయిపోతాయి ,చల్లకాలం ఒక్కోసారి మిగిలి పోతే మేం ఇంట్లోకి వాడుకుంటాం "


" మెత్తగా అయిపోతే మీరు మాత్రం ఎలా తింటారు తాతా ?" రోహన్ ఆసక్తిగా అడిగాడు


"ఏం జేస్తాం నాయనా ... పేలపిండి చేసుకుంటాం "


"అదెలా చేస్తారు ?" నకుల్ కు ధర్మ సందేహం కలిగింది


" బెల్లం, ఈ పేలాలు కలిపి దంచుతాం ,పొడి తింటాం ,ముద్దలు చేసుకుని కూడా తింటాం"


"రోజుకు నూరంటే, నెలకు మూడువేలు... మీ ఇంట్లో ఎంతమంది వున్నారు ? సరిపోతాయా ! మూడు వేల కోసం ఈ వయసులో కష్టపడుతున్నావే " అనూప్ సానుభూతి పలుకులు విని, వాడు ఆ కోణంలో ఆలోచించడం తో నేను తృప్తి పడ్డాను .


ఆరు మంది కుర్రాళ్ళు ,రెండోసారి మళ్ళీ ఆరు డబ్బాలు వేయించుకునేటప్పటికి ముసలాయన అక్కడే వున్న అరుగు మీద నింపాదిగా కూర్చున్నాడు . " నేను, నా ముసల్ది, కోడలు, మనవడు వున్నాం బాబూ ... వానలు పడక, పంటలు పండక మా పల్లె ఇడిచి పెట్టి ఈ వూరు వచ్చినాము. నా కొడుకు క్యాన్సర్ వచ్చి చనిపోయాడు ,వాడున్నంత కాలం ఆటో వేసి సంపాదించేవాడు, నా మనవడ్ని చదివించాడు,మమ్మల్ని కూచో పెట్టి సాకాడు . నా కొడుకు చనిపోయాక నాకీ తిప్పలు వచ్చాయి ,కొడుకు జబ్బు నయం కాలా,చచ్చిపాయ , అప్పు మాత్రం మిగిలింది, నా కోడలు కూడా పనికి పోతుంది ఇంతా జేసినా వడ్డీ కూడా కట్టలేకపోతున్నాం " వృద్ధుని గొంతు దు:ఖం తో జీరబోయింది. అతని ముఖం నాకు స్పష్టంగా కనపడక పోయినా, కొడుకును తలుచుకుని అతని కళ్ళలో నీరు తిరిగి ఉంటుందని ఊహించా . మనసు బరువెక్కింది .


కుర్రాళ్ళు అంత స్పందించినట్లు నాకు అనిపించలేదు. అరుగురిలొ ఇద్దరి సంభాషణ వేరే విషయాల మీదకు వెళ్ళింది. "జీ.. బ్రా కి మస్కులైన్ జెండర్ చెప్పురా చూద్దాం ?" అన్నాడొకడు .


ఇంగ్లీషు పట్ల ఆసక్తి కనపర్చే నేను ... మగ జీబ్రాని ... స్టాల్లోన్ లేక మేల్ జీబ్రా ... ఆడదాన్ని మేర్ అంటారేమో అనుకుంటూ , ఆసక్తిగా కుర్రాళ్ళు ఏమి చెబుతారో ... అని ఎదురు చూశాను.


ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు , పైగా ఎవరికీ సమాధానం మీద ఆసక్తి లేకపోయింది , ఆడుతున్న క్యారమ్స్ లో రెడ్ కొట్టడం,ఫాలో అప్ కొట్టడం పై ఘర్షణ పడ్డారు .


"మగ జీబ్రాని ఏమంటారో చెప్పురా మాకెవరికీ తెలియదులే ... సరేనా !" అన్నాడు నకుల్


"జీ... బనియన్ ... హి... హీ "అన్నాడు


"అదేంటి జీ బనియన్ ఎప్పుడూ వినలేదే ... నువ్వు చెప్పేది నిజమేనా... ! రేయ్...నకుల్! గూగుల్ సర్చ్ కొట్టరా... తప్పయిందో... ! వీడికుంది " అన్నాడు అభిజిత్


"జీ... బ్రా ఆడది రా అప్పుడు జీ బనియన్ కదా మగది ... " వెకిలిగా నవ్వాడు వాడు


"ఒహ్హో అలా వచ్చావా... వీడు అడిగాడంటే ఇలాంటిదే వుంటుంది అనుకున్నా ..." అభిజిత్ అన్నాడు


ఒకరి వీపుపై ఒకరు కొట్టుకుంటూ .... అందరు నవ్వడం మొదలెట్టారు .


నేను కాస్త నిరాశ పడ్డా... వాళ్ళ ఆసక్తులు గమనించి . కానీ సర్ది చెప్పుకున్నా ... ఆ వయసులో కొందరికి అలాంటి ఆసక్తి వుంటుందిలే అని.


లాన్ పక్కనున్న కుళాయి చూపిస్తూ " ఆ నీళ్ళు తాగొచ్చా నాయనా ? అన్నాడు ముసలాయన


"ఆ ..... తాగు పో తాతా !"ఆన్నాడు అనూప్


ముసలాయన నీళ్ళ కోసం పోగానే ఇద్దరు కుర్రాళ్ళు పిడికిళ్ళతో పాప్ కార్న్ తీసుకుని తమ కవర్లలో వేసుకున్నారు ,


తప్పు అన్నట్లుగా రఫిక్ వారించబోయాడు.


తప్పేమీ లేదన్నట్లుగా తలెగరేశారు అభిజిత్ , అనూప్. .


నేను యధాలాపంగా వాళ్ళని చూస్తూ,వాళ్ళ సంభాషణ వింటున్నవాడ్ని,ఈ సంఘటన తో వాళ్ళని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను. పైనున్న నా గదినుండి వాళ్ళు నాకు స్పష్టంగా కనపడుతున్నారు, వాళ్ళ మాటలు కూడా స్పష్టంగా వినపడుతున్నాయి. వాళ్ళు తలెత్తి పైకి పరీక్షగా చూస్తే తప్ప నేను వాళ్లకు కనపడను.


ముసలాయన నీళ్ళు త్రాగివచ్చి "మీరంతా చదువుకుంటున్నారా బాబూ! లేకుంటే వుద్యోగం చేస్తున్నారా ? నా మనవడు కూడా బియ్యే చదివినాడు మొన్నే పరీక్షలు పాసయినాడు ,మీరంతా పెద్దోళ్ళ పిల్లలు కదా ! మా వాడికి ఏదైనా చిన్న వుద్యోగం చూడండి నాయనా !" అన్నాడు


ఇంతలోకే కుర్రాళ్ళ సంభాషణ సినిమాల మీదకి వెళ్ళింది. మధ్యాహ్నం మాట్నీకి వెంకటేష్ ,పవన్ కళ్యాన్ ల గోపాల గోపాల నా లేక అక్షయ్ కుమార్ బేబి నా , ఏది వెళ్లాలని చర్చ మొదలెట్టారు . ముసలాయన మాటలు ఎవరూ పట్టించుకోలేదు.


కాసేపయ్యాక మళ్ళీ తన అభ్యర్థనని వాళ్ళ ముందుంచాడు .


అనూప్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతున్నాడు ,మిగతావాళ్ళు కూడా ఆయన మాటలు పట్టించుకోలేదు.


"రేయ్.... తాత తన మనవడికి వుద్యోగం అడుగుతున్నాడురా ! "రఫిక్ స్నేహితులకు ముసలాయన అభ్యర్థన వినిపించాడు . "ఓ ఆర్నెల్లు పోతే మాకే కావాల ఉద్యోగాలు .. ఎవరిస్తార్రా ? " ఓ కొత్త ముఖం అంది


ఆ కుర్రాడు వీళ్ళలో కొత్తగా చేరినట్లుంది నేనింతకు ముందు చూడలేదు.


ముసలాయన మళ్ళీ కొంచం గట్టిగా "మీరంతా ఉన్నోళ్ళు కదా బాబూ మీ నాయనల్ని అడిగి నా మనవడికి వుద్యోగం చూడండి " అన్నాడు వాళ్ళకు వినిపించేలా .


"తాతా... వీళ్ళ నాయన మన జిల్లా కలెక్టర్,వాడ్నిఅడుగు ఖచ్చితంగా నీ మనవడికి వుద్యోగం ఇప్పిస్తాడు." అన్నాడు ఆ కొత్త కుర్రాడు అనూప్ ని చూపిస్తూ.

అందరు నవ్వును ఆపుకుంటున్నారు.


"అవునా బాబూ...! మా వాడికి వుద్యోగం ఇప్పిస్తావా ? శానా కష్టాల్లో వున్నాం బాబూ " ముసలాయన అభ్యర్థన నా గుండెలకు తాకింది. రెండోసారి అతని కళ్ళలో కన్నీరు తిరిగి వుంటుంది. అనూప్ ఏం చెబుతాడో అని నేను నా చెవుల్ని రిక్కించి విన్నాను నా గుండె వేగంగా కొట్టుకుంది.


"అవును తాతా... మా నాన్న కలెక్టర్, నీ మనవడికి వుద్యోగం ఇప్పిస్తాలే ... రేపు పది గంటలకు కలెక్టర్ ఆఫీసుకు వచ్చేయ్ ... నీ మనవడికి తెలిసుంటుంది లే ... నీ మనవడి పేరేంటి ... మా నాన్నకు చెప్పాలి " అనూప్ మాటలకు నాకు కళ్ళు బైర్లు కమ్మాయి .


"నా పేరు సోమప్ప బాబూ " ముసలాయన గొంతులో ఆనందం చూసి నాకు మతి పోయింది .


"నీ పేరు కాదహే ... నీ మనవడి పేరు చెప్పు... వుద్యోగం వచ్చాక మాకందరికీ పార్టి ఇవ్వాలి " ఆ కొత్త కుర్రాడు ఎగతాళి నిండిన స్వరం విని నాకు వెంటనే వెళ్లి వాడి చెంపలు పగలగొట్టాలని పించింది. జరగబోయేది చూద్దామని ఆగాను .


" నా మనవడి పేరు వెంకటేశ్వర్లు బాబూ...బియ్యే ఫస్ట్ న పాస్ అయాడు కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడు ..ఇంగ్లీషు మాట్లాడేది నేర్చుకుంటున్నాడు. " ఆశ, ఆనందం నిండిన గొంతుతో అన్నాడు ముసలాయన .


" వోక్కే.. కంప్యూటర్ కూడా నేర్చుకున్నాడా...గుడ్.. వెరీ గుడ్ అయితే వుద్యోగం గ్యారంటీలే ..... రేపు పది గంటలకు కలెక్టరాఫీసు దగ్గరికి, గుర్తుంది కదా! " . అనూప్ చెబుతోంటే మిగతా కుర్రాళ్ళoతా నవ్వునాపుకుంటున్నారు. నాకు ఒక్క సారిగా అదః పాతాళానికి జారినట్లనిపించింది .... తలలోకి ఏదో బరువంతా చేరినట్లనిపించింది. శరీరమంతా కంపించింది. వీడిని కలెక్టర్ చేసివుంటే ఏం చేసేవాడు ? ఒక చదువురాని అమాయకుడైన పేద వృద్ధుని తమ సరదా కోసం ఎంత అవలీలగా నమ్మించారు ? ఈ యువత దేశాన్ని ఏం చేయబోతోంది ? నా ఆశయాలకు తగిన కొడుకును నేను కనలేకపోయానా! నా పెంపకంలో లోపముందా ? నా రక్తం లో గానీ, వాళ్ళమ్మ రక్తం లో గానీ ఇంత జాలిలేని తనం లేదే ! ఈ నాటి విద్య సంస్కారాన్ని ఇవ్వలేక పోతోందా ...! సమాజపు రీతుల్లో నైతికత నశించిందా ! నా కొడుకు ఇలా ప్రవర్తించడానికి కారణాలు వెతుక్కుంటూ ... కిటికీ కడ్డీని గట్టిగా పట్టుకున్నాను .


ముసలాయన సంచిని కట్టుకోబోతూ మళ్ళీ అందరికి తలా పిడికెడు పాప్ కార్న్ వాళ్ళ చేతుల్లోకి వేశాడు. కుర్రాళ్ళు జేబుల్లోంచి డబ్బులు తీసిచ్చారు. సంచిని భుజాన పెట్టుకుని మళ్ళీ అందరికి దండాలు పెట్టాక "రేపు పది గంటలకు కలెక్టరాఫీసు దగ్గరే వుంటాo బాబు తమరు వస్తారు కదా ...! "


"నేనున్నా లేకపోయినా ... మా నాన్నకు చెప్పుంటా, వెంకటేశ్వర్లు అనే అబ్బాయి, సోమప్ప వస్తారని...ఏదో ఒక వుద్యోగం ఇప్పిస్తా కదా!" అనూప్ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతూనే అన్నాడు


"అలాగే బాబు" వంగి పోయిన అతని నడుము, తేలిగ్గానే వున్నా, ఆ సంచి ఎత్తుకోగానే మరింత వంగి పోయింది.


వారం తర్వాత ఆదివారం మళ్ళీ క్యారమ్స్ ఆడడానికి అనూప్ స్నేహితుల దండును తీసుకొచ్చాడు . స్నేహితులంతా తోటలోకి దారి తీస్తే నీళ్ళ బాటిల్ కోసం లోపలి వచ్చిన అనూప్ సోఫాలో కూర్చున్న సోమప్పను ఆయన మనవడ్ని చూసి కంగారుగా నన్ను వాళ్ళమ్మను మార్చి మార్చి చూశాడు. "దండాలు బాబు నీ దయవల్ల నా మనవడికి వుద్యోగం వచ్చింది ,నీ ఋణం ఎలా తీర్చుకోగలం ?" ముసలాయన చెబుతోంటే అనూప్ కు నోట మాట రాలేదు.


"థాంక్స్ సార్... !" సోమప్ప మనవడు అనూప్ తో చేయి కలుపుతూ అన్నాడు. తాత మనవడు సెలవు తీసుకుని వెళ్లి పోయారు.


అనూప్ ముఖంలో కత్తి వాటుకు నెత్త్హురు చుక్క లేదు ,ఉలుకు పలుకు లేకుండా సోఫా లో కూర్చున్నాడు .


"నీవు చేసిన తప్పను సరిదిద్దడానికి మీ నాన్న ఎంత మంది చుట్టూ తిరిగాడో, ఎంత కష్టపడ్డాడో తెలుసా ...! ఆ ముసలాయన్ని ఆట పట్టించడానికి నీకు సిగ్గు లేదా !ఆయన వయసేంటి, ఆర్ధిక పరిస్థితి, కుటుంబ పరిస్థితి ఏంటి ? నీవు, నీ స్నేహితులు చేసిందేమిటి ? ఇంత మానవత్వం లేని మనిషివి ఎలా అయ్యావురా! ఎందుకురా నీకు చదువులు ? ఛీ... ఛీ... నీలాంటి జాలి లేని వెధవని కన్నా నేమిటిరా !" వాళ్ళమ్మ ఉక్రోషంతో కేకలేస్తూ వుంది .


మౌనంగా వున్న నాతో... "ఏమిటండి మీరేమి అనరా వాడ్ని " అంది కోపంగా .


నిజానికి నాకు అనూప్ ని ఏమీ అనాలనిపించలేదు, తల్లిదండ్రుల నుండి విజ్ఞత నేర్చుకునే స్థితిలో లేదు నేటి యువతరం. కానీ అక్కడి నుండి లేచి "మేము దిద్దలేని తప్పులు చేయకు నాన్నా! " అని నా గదిలోకి వచ్చేశాను.


Published in Navya on 12th February 2017

4 comments:

  1. Story line & narration style are both good.
    Dialogues of Sommappa are realistic.

    ReplyDelete
    Replies
    1. thank you siddu, what about samudram ? I think you recollect your school days after reading that story

      Delete
    2. Nostalgic, Aunt! You've interpreted the words we feel about our school. We miss our school very much, had great memories! I like the style of writing & ending the story in a poetic way.

      Delete
  2. what a crazy blogs i'm following your blogs please give some suggestions please subscribe and support me
    my youtube channel garam chai:www.youtube.com/garamchai

    ReplyDelete