Tuesday, 12 March 2019

వుండండి నాన్నా!



చాలా రోజులుగా కూతురున్న ఊరికి వెళ్ళలేదు నారాయణ రెడ్డి. ఇప్పుడతనికి ఆ వూర్లో పనుంది . ఇప్పుడు కూతురు కోసం కాకుండా పనికోసం వచ్చానంటే కూతురు బాధపడుతుంది . పైకి ఏమీ అనకపోయినా మనసులో అయినా నన్ను పట్టించుకోలేదు కదా అనుకుంటుంది . నిజమే కూతుర్ని పట్టించుకోలేదు. పట్టించుకోకూడదని కాదు అలాంటి పరిస్థితిలో వున్నాను మరి అనుకున్నాడు. నారాయణ రెడ్డి అంటే వూర్లో మంచి వ్యవసాయపు భూములున్న వ్యక్తి . ఆరు నూరైనా నూరు ఆరైనా మాట మీద నిలబడే ఖచ్చితమైన మనిషి , నలుగురికి సాయం చేయడంలోను, కుటుంబ వివాదాలొస్తే, భూమి తగాదా లొస్తే, తగవు తీర్చే పెద్దమనుషుల్లో నిజంగా పెద్ద మనిషి. నొప్పివ్వక తానొవ్వక అనే సిద్ధాంతంతో పాటు ఎవరైనా నొప్పించినా, అతడే పరిస్థితిల్లో అలా చేశాడో అనుకుని, మనసుని మళ్లించుకుని, మన్నించి మర్చిపోయే వాడు. అందుకే అతని వదనంలో శాంతం తాండవిస్తుంది, లేత గులాబీ రంగులో ఎనభైలో కూడా ఆయన ఛాయ మెరుస్తుంది. నీ కొడుకుల మొహాల్లో ముడతలున్నాయి నీవేమి అమృతం తాగావా అని అతని స్నేహితులు అబ్బుర పోతుంటారు . తల దించుకునే పనెప్పుడూ ఆయన చేయలేదు. కష్టాలకు కన్నీళ్లకు క్రుంగక, లొంగక మేరు పర్వతంలా నిలబడ్డాడు.

కానీ ఇవాళెందుకో ఆయన మనసుకు కష్టoగా వుంది. ఎప్పుడో అమ్మిన ఓ భూమి తాలూకు రిజిస్ట్రేషన్ గురించి పేరు రాయడంలో ఏదో పొరపాటు జరిగినందుకు వాళ్ళు కారు పంపిస్తాం రమ్మన్నారు. తీరా బయలు దేరుతుంటే ఆయనలో ఈ సందేహం మొదలయ్యింది. కూతురికి వస్తున్నానని ఫోన్ చేద్దామని అనుకున్నాడు కానీ మనసొప్ప లేదు. పని మీద వస్తున్నానని చెప్పడం అతనికి కష్టoగా వుంది. భార్యకు చెప్పేశాడు. “జానకికి నువ్వు ఫోన్ చెయ్యి నేను వస్తున్నానని “ అన్నాడు. అమ్మా కూతురు రోజూ మాట్లాడుకుంటుంటారు అప్పుడప్పుడు ‘నాన్న కివ్వమ్మా ‘ అని కూతురు అడిగితే మాట్లాడుతుంటాడు ,అదే పనిగా కూతురుకు అతనేమీ ఫోన్ చేయడు .

దారి వెంట అంతా కూతురు గురించి ఆలోచించాడు నారాయణరెడ్డి . సంవత్సరం దాటింది కూతుర్ని చూసి అతనికి అయిదేళ్ల వయసులో వున్నప్పుడు తల్లిని కోల్పోయాడు. అతనికి లీలగా గుర్తున్నది చనిపోయే ముందు తల నిమిరిన తల్లి చేతి స్పర్శ , అంతవరకు ఏడ్వని అతని తాత కూతుర్ని చితిపై పడుకో బెట్టాక పొడవైన ఆమె జడ చితి పైనుండి నేలపై జీరాడుతుంటే దాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలు పగిలేలా మనవడిని హత్తుకుని భోరుమనడo. నారాయణ రెడ్డి తన తల్లి అందం, రంగు, పొడవాటి జుట్టు పుణికి తెచ్చుకున్న కూతుర్ని చూసుకుని మా అమ్మ అని మురిసిపోయేవాడు . అతని తల్లి పేరు జానకి. అదే పేరు కూతురుకు పెట్టుకున్నాడు. వూర్లో ఆడపిల్లలు ఎవరూ చదువుకోకున్నా జానకిని బీఎస్సీ బియ్యీడీ చదివించాడు. జానకి తమ్ముళ్లు డిగ్రీలు చేసినా వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండిపోయారు.

జానకికి టీచర్ వుద్యోగం వచ్చింది.మంచి కుటుంబం నుండి సంబంధం కూడా వెతుక్కుంటూ వచ్చింది. ఒక్కడే కొడుకు, అత్తామామ మంచి వాళ్ళని తెలిసింది. అల్లుడు బంగారం, కెమిస్ట్రీ లెక్చరర్ గా పని చేస్తున్నాడు. కట్న కానుకలు ఏమీ అడగలేదు. జానకి అదృష్టానికి నారాయణరెడ్డి మురిసిపోయాడు. ఉన్నంతలో పెళ్లి బాగా చేశాడు. జానకి కాన్పుకు అమ్మగారింటికి వచ్చింది, ఆరునెలలు మనవడ్ని మురిపెంగా క్రిందపెట్టకుండా మోశాడు. మళ్ళీ మనుమరాలు పుట్టింది. మూడో నెలలోనే బాబుకు స్కూల్ ఉందని జానకి బిడ్డను తీసుకుని వెళ్ళిపోయింది. కొడుకులకు పెళ్లిళ్లు అవడం, వాళ్లకు పిల్లలు పుట్టడం, వాళ్ళతో అనుబంధం, ఇలా సాగుతున్న సమయంలో జానకి భర్త గుండెపోటుతో మరణించాడు. కుమిలి పోతున్న కూతుర్ని చూసి కన్న వాళ్ళ హృదయాలు భగ్గుమన్నాయి. అత్తమామలు కోడల్ని బాగా చూసుకున్నా ,తల్లి దండ్రుల ప్రేమ , అండ ఆ సమయంలో అవసరమని జానకి దగ్గర చాలా కాలం వున్నారు.

కాలం అన్ని గాయాల్ని మాన్పుతుంది. నెమ్మదిగా జానకి ఉద్యోగానికి వెళ్ళింది. పిల్లల్ని మంచిగా తీర్చింది. అమ్మాయికి పెళ్లి చేసింది. పెళ్ళయాక కూతురు అల్లుడు అమెరికా వెళ్లిపోయారు . కొడుకు ముందే అమెరికాకు చదవడానికి వెళ్లి అక్కడే వుండిపోయాడు. అత్తా మామ నాలుగేళ్లలో ఒకరు ముందు ఒకరు వెనక కాలం చేశారు . ఇప్పుడు జానకి ఒక్కతే వుంది. అది తలుచుకుంటేనే తండ్రి మనసు బరువవుతుంది. అత్త కాలం చేశాక ఓ ఆరు నెలలు అమెరికాలో వున్న కూతురు, కొడుకు దగ్గరకు వెళ్ళొచ్చింది. జానకి పుట్టింటికి వచ్చినప్పుడు నారాయణ రెడ్డి ఓ స్నేహితుడి కి ఆరోగ్యం బాగా లేకపోతే బెంగుళూరు హాస్పిటల్ కు వెళుతోంటే సహాయంగా వెళ్ళాడు అందువలన కూతుర్ని చూడక ఏడాది అయింది.

‘ఎప్పుడూ తమ్ముళ్ల దగ్గరే ఉంటారే …ఏం నాన్నా నా దగ్గరకు రారేం ?’ అని కూతురు అడగలేదు కానీ … కూతురు దగ్గర ఉండలేక పోతున్నానే అపరాధ భావం అతనికే కలిగింది. జానకి కూతురు, కొడుకు ఒంటరిగా వున్న అమ్మను వదిలి ఎందుకు అమెరికాలో వున్నారో అర్థం కాలేదు . బంధాలు, బాంధవ్యాలు అనేవి లేకుండా స్వార్థం పెరిగి పోతోంది , సాంకేతికంగా ఎదిగి , సౌకర్యాలు పెరిగి మానవుడు సంకుచితుడు అయిపోతున్నాడు . ఏమవుతాయి మానవ సంబంధాలు ? ఎన్నో బాధ్యతలు ,బాధలు వున్నా, నా కూతురు ఒంటరిగా ఉందని తలచుకుని మేం బాధ పడుతున్నామే … జానకి పిల్లలకు ఎందుకు ఆ ఆలోచన రావడం లేదు? మార్పు సహజమే .. తరాల అంతరాలలో తేడాలుంటాయి కానీ కనీసం కన్నతల్లి గురించి ఆలోచించలేని పరిస్థితి ఉంటుందా! ఏమో మరి ప్రాధాన్యతలు మారిపోయాయి! మానవ సంబంధాలన్నీ ఆర్ధిక సంబంధాలు అయినప్పుడు…డబ్బు తెచ్చే సౌకర్యాలు , సంతోషాలకు ప్రాధాన్యత పెరుగుతుంది . నా బంగారు తల్లికి అల్లుడు పోవడంతోటే అన్ని శాంతులు అన్ని సంతోషాలు పోయాయి … ఇప్పుడు గానీ అల్లుడు ఉంటే జానకి గురించి తాను ఇలా వ్యధ చెందేవాడా! తెలియకుండానే కళ్ళలో కన్నీళ్లు తిరిగాయి . అల్లుని మంచితనం , అందమైన చిరునవ్వు , కూతురి కళ్ళలో నైరాశ్యం గుర్తుకొచ్చేకొద్దీ నారాయణ రెడ్డి కి దుఃఖం ఎక్కువయింది. కారులో వున్నది అపరిచితులు కాబట్టి వాళ్ళు అతని కేసి చూడలేదు . వాళ్ళ మధ్య సంభాషణ కూడా జరగలేదు కాబట్టి నారాయణ రెడ్డికి కూతురి గురించిన ఆలోచనలు బాధించాయి . అయిదు గంటల ప్రయాణంతో అలిసిపోయి కూతురింటికి వచ్చాడు.

తల్లి పోలికలున్న కూతుర్ని చూస్తే అతనికి ఒక రకంగా సంతోషం మరొక రకంగా కూతురు ఇలా ఒంటరయిందే అని బాధ. చాలా కాలం తర్వాత కూతురుతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ భోంచేశాడు మరుసటి రోజు “సెలవు పెడతా నాన్నా !” అని జానకి చెప్పగానే

“రిజిస్ట్రాఫీసు లో పని చూసుకోవాలి కదా సెలవు ఎందుకు వృధా చేసుకుంటావు ? రోజంతా బయటే వుంటాను కదమ్మా !” అన్నాడు.

మధ్యాహ్నం భోజనానికి ఏర్పాటు చేసి స్కూలుకు వెళ్ళిపోయింది జానకి . సాయంత్రం తండ్రి కిష్టమైన కూరలు వండి పెట్టింది. నారాయణ రెడ్డికి మనసు చల్లగా వుంది. కూతురు సమక్షం ఆయనకు ప్రశాంతత నిచ్చింది. అదీ ఇదీ మాట్లాడుతూ

“అమ్మా పిల్లల్ని మన దేశం వచ్చేయమని చెప్పరాదా! ఇక్కడ వాళ్లకు ఉద్యోగాలుండవా ఏమిటీ ? నీవు ఒక్కదానివి అయ్యావు … నీ పిల్లలు ఇక్కడుంటే నీవు వాళ్ళ దగ్గరకు పోవడమో వాళ్ళు నీ దగ్గరకు రావడమో చేయొచ్చు కదా ! ”

“లేదు నాన్నా…నేనేమీ చెప్పను వాళ్ళ జీవితం వాళ్ళిష్టం .. వాళ్లకు నచ్చినట్లు వుంటారు, వాళ్లకు ఇష్టమున్న చోట వుంటారు .. నేనెందుకు కల్పించుకోవడం ? ఒక వేళ నేను అడిగినా, వాళ్ళేమీ స్పందించరు… ఒంటరితనం అంటారా…అది నాకు అలవాటయింది” జానకి కళ్ళలో నిస్తేజం చూసి అతనికి చాలా కష్టమేసింది.

“బడి సంగతేంటమ్మా గవర్నమెంట్ బళ్ళు పూర్తిగా అధ్వాన్నం అయిపోతున్నాయని పేపర్లో రాస్తున్నారు. “ అన్నాడు

“నిజమే నాన్నా… స్కూళ్లు మూతపడే పరిస్థితికి వచ్చాయి .. అందరూ కాన్వెంట్ కెలితేనే చదువనుకుంటున్నారు, మధ్యాహ్న భోజనపథకం కొంతవరకు కొన్నాళ్ళు పిల్లల్ని బడికి రప్పించింది కానీ ఇప్పుడు అదీ పని చేయడం లేదు ఒకటి నుండి పది తరగతులకు 54 మంది వున్నారు . వాళ్లలో బడికి వచ్చేది ముప్పైమందే … ఆసక్తి పోతోంది నాన్నా ఈ వుద్యోగం చేయడం పై! ఒకప్పుడు పేద, పల్లె విద్యార్థులకు చదువు చెప్పడంలో ఎంతో ఇష్టం ఉండేది . మనవూర్లో మాకు ఎంత బాగా చెప్పేవాళ్ళు … మా టీచర్లను చూసి నేను టీచర్ కావాలని కోరుకున్నా … కానీ ఇప్పుడు పరిస్థితులు ఈ వృత్తికి గౌరవం ఇచ్చేలా లేవు … విద్యార్థులకు గురువుల పట్ల గౌరవం కూడా లేదు .. టీచర్లలో కూడా మునుపటి నిబద్ధత కూడా లేదు… “

“విలువలన్నీ మారిపోయాయమ్మా .. మంచిని మరిచి వంచనే నేర్చిన వాడు నెగ్గుకొస్తున్నాడు … పోనీ నీకు వుద్యోగంలో తృప్తి లభించకపోతే.. వదిలేసి మా దగ్గరకొచ్చేయమ్మా నీ పిల్లల దగ్గరకు కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్లొచ్చు “

“అలా పూర్తిగా నిరాశలో లేనులే నాన్నా …చదువుకోవాలని వచ్చే ఒక్క విద్యార్థికైనా చదువు చెప్పడం నా విధి కదా! ”-

“నీ ఇష్టం తల్లీ ..నీకు ఏది చేయాలనిపిస్తే అది చేయమ్మా .. నీవు సంతోషంగా , ప్రశాంతంగా వుండు “ అంటుంటే ఆతని గొంతు వణికింది

ఎగసి పడే అలలా వుండే కూతురు కదలిక లేని సరస్సులా నిబ్బరంగా వుంది. జానకి నవ్వితే గలగల పాడే సెలయేరులా అనిపించేది. జానకి ఇంట్లో ఉంటే తుళ్ళింతలు, కేరింతలు వుట్టిపడేవి. జానకి పెళ్లయి వెళ్ళి పోయాక ఇంట్లోని నిశ్శబ్దం తట్టుకోలేక…నారాయణరెడ్డి, అతని భార్యా ,తమ్ముళ్లు దిగాలు పడ్డారు. నెమ్మదిగా జానకి “ఆడ” పిల్ల అని “ఈడ” పిల్ల కాదని గ్రహించారు. త్వరలోనే అందరికి జానకి ఒక చుట్టం లాగా అయిపొయింది. మర్యాదలు పాటించడం మొదలు పెట్టారు . తమ్ముని భార్యలు భయంతో అణకువతో ఆమెకు సేవ చేయడానికి వస్తే జానకి నవ్వేసేది “.. నా ఇంట్లో నాకు మర్యాదలా ! “అని చిరు కోపం ప్రదర్శించేది. అయినా అవి అలానే సాగేవి .

భర్త మరణం తర్వాత జానకి ఎప్పుడూ మౌనంగానే ఉండేది. పిల్లలు కూడా అదే ధోరణిలో వాళ్ళమ్మను అంటిపెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు. ఇపుడెలా వున్నారో మరి ఏండ్ల తరబడి అమ్మను చూడకుండా! అడ్డాలనాడు బిడ్డలు, గడ్డాలనాడు కాదు అని ఇలాంటి పరిస్థితిలోనే పెద్దలు అని వుంటారు.

సాయంత్రం స్కూలు నుండి రాగానే తండ్రికి తాను తీసుకొచ్చిన చీనీ పండ్లు వలిచి ఇచ్చింది జానకి. సాయంత్రం నుండి జానకి దగ్గుతూనే వుంది.

“డాక్టర్ దగ్గరకు వెళ్లరాదా అమ్మా! ఇప్పుడైనా వెళదాం పద !” అన్నాడు తండ్రి .

“ఇది జలుబు వలన లే నాన్నా … క్లాసులు తీసుకుంటే సాయంత్రం కొంచం ఉంటుంది … ప్రొద్దునకు తగ్గుతుందిలే. మీరు పడుకోండి, ఏవైనా కావాలంటే లేపండి.. మందులన్నీ వేసుకున్నారా ? ఇదిగో నీళ్లు మీ మంచం ప్రక్కనే పెట్టాను.” జానకి అన్ని జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోతుంటే

“ఉదయాన్నే వెళ్ళిపోతాను తల్లీ .. తీసుకొచ్చిన వాళ్ళు మళ్ళీ కారులో దిగబెడతామంటున్నారు “ అన్నాడు.

“ఉండొచ్చు కదా నాన్నా కొన్ని రోజులు! “అనబోయి తమాయించుకుంది జానకి.

నాన్నతో అలా సాయంత్రాలు గడపడం .. ఆమెకు బావుంది. కానీ నాన్నకు వ్యవసాయం , వూర్లో ఎన్నో పనులు, అమ్మ ఉంటే కూడా తొందర పెడతాడు వెళ్లాలని, కానీ జానకి తల్లి మాత్రం వస్తే పదిరోజులు తక్కువ కాకుండా ఉంటుంది. నారాయణ రెడ్డి మాత్రం అతని సొంత వూరు విడిచి ఉండలేడు. ఎందుకు నాన్నని ఉండమని అడిగి బాధించడం? అనుకుంది జానకి .

ఎన్ని రోజులుండగలడు ? తానెప్పుడైనా ఒంటరే ! ఈ ఒంటరితనానికి తానెప్పుడో అలవాటుపడింది … మెల్లిగా కళ్ళుమూసుకుంది . కానీ నిద్రరాలేదు . భర్త గుర్తుకొచ్చి ఆమెకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చాయి ఇంత ప్రపంచానికి చోటుండగా అతనికెందుకు లేదు ? అన్న ప్రశ్న పాతికేళ్లుగా ఆమె వేసుకుంటోంది.

మూడురోజులుగా జానకి జలుబు దగ్గుతో బాధపడుతోంది . సెలవు లేదని స్కూలుకు అలాగే వెళుతోంది. పక్క గదిలో కూతురు దగ్గుతోంటే కన్నతండ్రి కి కునుకు పట్టలేదు .లేచి వచ్చి చూశాడు.రోజంతా అలసిపోవడం వలన జానకి అంత దగ్గు వస్తున్నా నిద్ర పోతోంది. జానకి ని ఒంటరిగా చూస్తున్న కొద్దీ తండ్రి మనసులో అలజడి మొదలైంది . ఉదయాన్నే జానకిని వదిలి ప్రయాణం చేయాలంటే మనసొప్పడం లేదు. కొన్ని రోజులు జానకి దగ్గర వుండి పోతే బావుంటుంది అనిపిస్తోంది . వ్యవసాయం, బాధ్యతలు ఇంకా వూర్లో పంచాయితీలు అనుకుంటూ జానకి గురించి పట్టించుకొనే లేదు. పెళ్లి, కాన్పులు చేయగానే ఆడపిల్ల బాధ్యతలు తీరిపోయాయనే భావనతోనే వున్నాము. కష్టం వచ్చినప్పుడు కూడా వచ్చి కొంతకాలం వుండి పోయాం, కానీ ఎందుకో ఇప్పుడు జానకిని వదిలి వెళ్ళబుద్ధి కావడం లేదు, మనసులో ఏదో పీకుతోంది, ఇక్కడ పొద్దుపోని మాట వాస్తవమే, అయితే జానకి స్కూలుకు వెళ్ళినప్పుడు ఏదో చదువు కుంటూ గడిపేస్తే సరిపోతుంది. కానీ ఉదయమే వెళతానని చెప్పేశానే... వెళ్లి కొన్నిరోజుల తర్వాత మళ్ళీ వద్ధునా! ఇలా ఆలోచిస్తూ నిద్ర పోయాడు.

ఉదయాన్నే టిఫిన్ చేస్తుండగానే కారు వచ్చింది. కూతురు వుండి పొమ్మంటే ఉందామని వున్నాడు… నారాయణ రెడ్డి. జానకి వాళ్ళమ్మకు, తమ్ముళ్లకు, పిల్లలకు ఏవో సంచిలో సర్దింది . తండ్రి తెచ్చిన డబ్బాలు మళ్ళీ నిండుగా బరువుగా వున్నాయి. నారాయణ రెడ్డి గుండె కూడా బరువెక్కింది. జానకి నిర్లిప్తంగా స్కూలుకు తయారవుతూ తండ్రి కి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు చెబుతోంది . మూడురోజులు తండ్రి సమక్షంలో బాగా గడిచాయి . “ఇంకొన్ని రోజులు వుండండి నాన్నా” అందామని వున్నా …

“పనులున్నాయి పోవాలమ్మా .. ఇంకోసారి వస్తాలే “ అనే సమాధానం తండ్రి దగ్గర నుండి వస్తుందని జానకి నోరువిప్పలేదు.

కారులో కూర్చున్నాడు నారాయణ రెడ్డి .. ‘వుండండి నాన్నా’ అంటుందేమో జానకి అని ఎదురు చూసిన అతనికి నిరాశ కలిగింది. కూతురు తన సమక్షాన్ని అంతగా ఆశించడం లేదన్న విషయం అతన్ని బాధించింది. కారు కదులుతుండగా చూశాడు కూతురు కళ్ళలో లీలగా తిరిగిన కన్నీళ్లు. అవి చెప్పకనే చెప్పాయి“వుండండి నాన్నా “ అని. అప్పటికే కారు సందు మలుపు తిరిగింది.

No comments:

Post a Comment