Wednesday 13 March 2019

కూతురు


"అమ్మా నీవు స్నానానికి వెళ్ళినప్పుడు సరయు అంటి ఫోన్ చేశారు, మళ్ళీ ప్రోగ్రాం కానీ వేశారా? నేను హాస్టల్ కు వెళ్ళేంత వరకు ఏమీ పెట్టుకోవద్దమ్మా ప్లీజ్ " అంది నా కూతురు మైత్రి .

అల్ ఇండియా హెల్ప్ల్ లెస్ విమెన్ అండ్ చిల్ద్రెన్ సంస్థలో వాలంటీర్ గా నా స్నేహితురురాలు సరయు కౌషిక్ పనిచేస్తోంది . భర్త పెద్ద పారీశ్రామిక వేత్త , సరయు అందరు డబ్బున్న వాళ్ళలాగా విలాసాలు, వినోదాలు, కిట్టి పార్టీలు వగైరా లో ఆనందం వెతుక్కోకుండా, సామాజిక సేవ పట్ల ఇష్టం, బాధ్యత పెంచుకుంది. తన సంస్థ తరపు నుండే కాకుండా , తను వ్యక్తిగతంగా చాలా డబ్బు ఖర్చుపెడుతుంది . ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటుంది . ఆమె ఎప్పుడూ గుర్తింపు, పొగడ్త కోరుకోవడం నేను చూడలేదు.సరయు పరిచయం అయాక చాలా సార్లు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా చదువుకున్న ,తెలివైన, కరుణ కలిగిన వ్యక్తిగా ఆమెంటే నాకు చాలా గౌరవం వుంది. అందుకే వుద్యోగం చేసే నేను, తీరిక సమయం దొరికి నప్పుడు, ఉడతా భక్తిగా సరయుకు సహాయం చేస్తుంటాను .

సరయుకు ఫోన్ చేశా..
"మాధురీ ... ... ఒక రిపోర్టర్ నాకు ఫోన్ చేశాడు కూతురు ఇంటి నుండి గెంటి వేసిందని ఒక ముసలాయన న్యూస్ పేపర్ వాళ్లకు వచ్చి చెప్పాడట . దీన్ని సెన్సేషన్ న్యూస్ గా వేయడం కంటే, టీవీలో చూపడం కంటే ఆ కూతుర్ని కొంచం కౌన్సిలింగ్ చేసి బాధ్యత గలిగిన వ్యక్తిగా మారిస్తే మేలు కదా ! అన్నాడు. నాకు అదే మంచిది అనిపించింది. మనం వాళ్ళింటికి వెళదాం. మీరు నాతో వస్తే బావుంటుందని అనిపించింది . ప్లీజ్ వస్తారా!"

"తప్పకుండా ... వస్తాను "అన్నాను

పిలానీలోఇంజనీరింగ్ చదువుతున్న నా కూతురు మైత్రి సెలవులని వారం కిందట వచ్చింది. సెలవుల్లో తనని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని మారాం చేసే కూతుర్నిఎలాగో బుజ్జగించి సరయుతో బయలు దేరా. రిపోర్టర్ తో వున్న ముసలాయనను చూసి, మనసుకు కష్టం వేసింది. 80 ఏళ్ల వయసులో ఆయన్ని కూతురిలా తరమడం అన్యాయం, కొడుకులు చేశారంటే వింటున్నాం కానీ ... కూతురు ఇలా చేసిందంటే కొంచం ఆశ్చర్యం, సందేహం కూడా కలిగాయి..
ఆయన్ని అడిగాం ఏమయ్యింది ? అని

"నన్ను, నా భార్యను నా కూతురు మీకు తిండి పెట్టలేను వెళ్లి పొండి అంది తల్లీ, కనీ, పెంచి, పెద్ద చేశాం, పెళ్లి చేశాం, మాకింత ముద్ద పెట్ట మంటే చాతకాదు పొమ్మంది . నా భార్యను నా చుట్టాలింట్లో పెట్టి, పేపరోళ్ళ కు చెప్పమని నా కూతురింటికి దగ్గరలో వున్న ఆసామి చెబితే వచ్చాను" అన్నాడు.

"సరే పదండి, మీ అమ్మాయితో మాట్లాడి, మీకు న్యాయం చేస్తాం. ఆమె కాదు, కూడదంటే అప్పుడు మిమ్మల్నివృద్ధుల ఆశ్రమం లో వదులుతాను, సరేనా...దిగులు పడకండి" అంది సరయు.

ముగ్గురం ఆ ముసలాయన చూపిన ఇంటి దగ్గర దిగాం . చిన్న సందులో చిన్న ఇల్లు అది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటికి మేము, ముసలాయన రావడాన్నిఆసక్తిగా, ఆశ్చర్యంగా చూశారు. ఇంట్లోకి వెళ్లాం, రెండు పాత ప్లాస్టిక్ కుర్చీలు , ఓ ప్రక్క మంచం, పరుపు వున్నాయి . పేదరికం తెలుస్తున్నా ,ఆ ఇల్లు చాలా పరిశుభ్రంగా వుంది . మా అలికిడికి లోపలి నుండి ఒక 45 ఏళ్ళు పైబడిన స్త్రీ వచ్చింది. పచ్చటి చాయతో వున్నా రక్త హీనత తో పాలిపోయి వున్న ఆమె, ఆశ్చర్యంగా మమ్మల్ని,ముసలాయన్ని మార్చి మార్చి చూసింది. తర్వాత" మీరు ఎవరండి, ఎవరు కావాలి ?" అని " కూర్చోండి " అంది.

మేము అక్కడున్నకుర్చీల్లో,రమేష్ మంచం మీద కూర్చున్నాం.
"అమ్మ ఏదీ.నాన్నా.?.నువ్వు,అమ్మ నవీన్ దగ్గరికి పోలేదా ?"అంది వాళ్ళ నాన్న కేసి తిరిగి.
ముసలాయన పలకలేదు. మారు మాటాడకుండా బయట వున్న అరుగు మీద కూర్చున్నాడు .
"చెప్పండమ్మా ఎవరు మీరు.. నాకు గుర్తు రావడం లేదు " అంది ఆమెకు మేము వాళ్ళ నాన్నతో వచ్చామని తెలియలేదు.

రమేష్ గొంతు సవరించుకుని "అమ్మా ఈమె సరయు గారు ,ఆమె మాధురి గారు, నా పేరు రమేష్, నేను ఒక రిపోర్టర్ ని, మీ నాన్న నా దగ్గరకు వచ్చి మీరు అమ్మానాన్నని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారని చెప్పారు,వాళ్ళు ఈ వయసులో మీరు కాదంటే ఎక్కడికి పోతారు ? అందుకే మీకు నచ్చ చెప్పాలని వీళ్ళిద్దరి ని నేనే తీసుకొచ్చాను " అన్నాడు .

ఆ మాటలు వినగానే కోపం తోనో, అవమానం తోనో, ఆమె ముక్కుపుటాలు అదిరాయి,కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా అయాయి.దానితో పాటు ఆ కళ్ళలో కన్నీరు తిరిగింది . దు:ఖంతో నోట్లోంచి మాట రాలేదు. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఎంత సేపటికి ఆమె నుంచి సమాధానం లేదు .

సరయు నాకేసి చూసి, ఏమైనా అడుగు అన్నట్లు సైగ చేసింది .

నా కెందుకో ఆమెను చూస్తుంటే అంత సంస్కారహీనురాలు కాదనిపించింది.ఆవేశంలో ఏదో అనుకుని, అపార్థాలతో ఇలా జరిగిందేమో అనిపించింది, ఏమయినప్పటికీ ఎలాగూ వచ్చాం కాబట్టి, ఏదో విధంగా నచ్చ చెప్పడం మంచిదనిపించింది.
"చూడండి.... ఇది మీ కుటుంబ విషయమే , మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించాలి ,కానీ తల్లిదండ్రులు,వృద్ధులు కదా ... వాళ్ళు ఎక్కడికి పోతారు ..? ఆయన వయసు చూడండి ... పాపం ఎంత దీనంగా వున్నారో ... మా సంస్థ తరపున నుండి మీకు ఆర్ధిక సహాయం కూడా చేస్తాము .. వాళ్ళని మీ దగ్గరే ఉండనివ్వండి ." ఎందుకో చెప్పడం.. అయితే చెప్పాను,కానీ నాకు బాగా అనిపించలేదు.

ఆమె గట్టిగా నిట్టూర్పు వదిలింది.

"వృద్ధుల పట్ల , సమాజం పట్ల మీకు గల బాధ్యతను నేను గౌరవిస్తున్నాను . నేను మీలాగా పెద్ద చదువులు చదవలేదు, కాదు మమ్మల్ని చదివించలేదు .నా భర్త కు ఆరోగ్యం బాగాలేదు, మా ఆర్ధిక పరిస్థితి బాగా లేదు నా ఇద్దరు పిల్లలు డబ్బులేక మంచి చదువులు చదువుకోలేక నిరాశలో వుండి పోయారు ,ఈ సమస్యల్లో మాకు వీళ్ళిద్దరి ని, వాళ్ళు నా తల్లి దండ్రులే కావచ్చు,కానీ నేను పోషించలేను. అందుకే మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాను. అంతే కానీ వీళ్ళను నేను నా ఇంటి నుండి గెంటివేయలేదే ...!" ఆమె మాటల్లో స్థిరత్వం, నిజాయితి కనపడ్డాయి .



సరయు, నేను ఆశ్చర్యపోయాము . "ఆయనకు కొడుకులున్నారా ?" ఇద్దరం ఒకే సారి అన్నాము.

"ఇద్దరు కొడుకులున్నారు...అంతేకాదు వాళ్ళు చాలా స్థితిమంతులు ,మా నాన్న ఆస్తి అంతా కొడుకుల కిచ్చారు, ఆస్తి తీసుకున్న కొడుకులు కదా వీళ్ళను చూసుకోవాలి ... "

"తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కొడుకులైనా, కూతుర్లయినా ఒకటే కదండీ ... మీ దగ్గర వుండాలని ఉందేమో వాళ్లకు " అంది సరయు .

"చూడండి... మీరు విషయాన్ని ఒకే కోణం నుండి చూస్తున్నారు ... వృద్ధులైన నా తల్లిదండ్రుల గురించి మీరు సానుభూతి తో వున్నారు ... మధ్యతరగతి కుటుంబాల్లో ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రిందట ఆడపిల్లల పరిస్థితి ఏమిటో మీకు తెలియనట్టుంది, మా కుటుంబ విషయమే ఇది ,మేము ఎక్కడా ఈ విషయాలు ఎవరికీ చెప్పుకోలేదు ... ఈ రోజు మా తల్లిదండ్రులు మేం వాళ్ళని బయటికి గెంటి వేశాం అని పేపర్ వాళ్లకు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నా ..."

ఆమెకు కష్టం కలిగించే విషయమైనా, ఆమె స్పష్టంగా, నెమ్మదిగా చెప్పడం విన్నాం ...

"మా నాన్న ఒక చిన్న ఉద్యోగిగా పని చేసేవారు . ఆయనకు పెద్దగా చదువు లేకున్నా, డబ్బును చాలా జాగ్రత్తగా దాచి, దాన్ని పదింతలు చేసే తెలివితేటలు వున్నాయి. నేను, నా చెల్లెలు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు , మా అమ్మ చదువు కోలేదు, ప్రపంచం తెలియదు, కానీ నాన్న ఏది చెబితే, అదే సరి అయినదని నమ్మేది. నేను చెల్లి మున్సిపల్ స్కూల్లో చదివాం ,మా తమ్ముల్లిద్దర్నీ వానులో సెయింట్ జోసెఫ్ స్కూలుకు పంపేవారు. మా అమ్మ రోజూ మా తమ్ముల్లిద్దరికీ ఉదయాన్నే పాలు బోర్నవిటా,కోడిగుడ్డువుడకపెట్టి ఇచ్చేది ,మాకు బోర్నవిటా రుచి కూడా తెలియదు , మా చెల్లి ఆశగా చూసేది వాళ్ళు పాలు త్రాగుతూ వుంటే ; "మాకు కూడా కోడిగుడ్డు,బోర్నవిటా ఇవ్వమ్మా "అని అడిగేది ... "మగపిల్లలకు బలం వుండాలని మీ నాన్నవాళ్ళకే ఇవ్వమన్నాడు, ఆడపిల్లలు త్రాగితే తొందరగా ఎదుగుతారు, వద్దులే" అనేది. నేను వప్పుకున్నట్టుగా చెల్లెలు వప్పుకోలేకపోయేది. ఏడ్చేది,కొట్లాడేది. లాక్కునేది, దెబ్బలు తినేది. పాలు కోడిగుడ్డు మాకు అందని చందమామ. అమ్మకూడా తినేది కాదు. ఆమెకు కోరికలు అనేవి ఉండేవి కాదు నాన్న చెప్పినట్లు, ఆయనకు నచ్చినట్లు చేయడమే ఆమె జీవితం. ఆడపిల్లలంటే ఆమె లాగే ఉండాలనే ఆమె నమ్మేది ."

"మా చదువుల గురించి నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. పదోతరగతిలో నేను మా స్కూల్లో అత్యధిక మార్కులు సంపాదించి జిల్లా కలెక్టర్ తో బహుమతి అందుకున్నా . కానీ మా నాన్న నన్ను కాలేజిలో చేర్పించలేదు ,నా చెల్లెలు తొమ్మిదవ తరగతిలో ఉండగానే దానికి టైఫాయిడ్ వస్తే ,సరిగ్గా వైద్యం చేపించక , రోగం తిరగ పెట్టి అర్థ సంవత్సరం చడువుపోయింది . అయినా అది నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది . దాన్ని కూడా కాలేజ్ లో చేర్చలేదు. అయితే ఏడవతరగతి లో తప్పిన మా పెద్ద తమ్ముడ్ని ట్యూషన్లు చెప్పించి ,పరీక్ష రాస్తూ వుంటే సెంటర్ల చుట్టూ తిరిగాడు, మార్కులు వేయించి పాసు చేయించుకున్నాడు. "

"పదహారేళ్ళ వయసులో నన్ను ఒక్క మాట కూడా అడగకుండా, చదువులేని వ్యక్తితో , పెళ్లి నిశ్చయం చేశారు. నోరు తెరిచి నాకీ పెళ్లి ఇష్టం లేదనే ధైర్యం లేదు మాకా రోజుల్లో. సంపాదించిన డబ్బునంతా కొడుకులకు దాచకపోతే కూతురికి మంచి సంబంధం తేవాల్సింది అని హితవు ఎవరైనా చెప్పినా, నాన్న వినేవాడు కాదు . నా పెళ్లి అయిన రెండో సంవత్సరమే చెల్లికి కూడా యోగ్యత లేని, చదువు పెద్దగా లేని వాడి కిచ్చి పెళ్లి చేశాడు. తమ్ముల్లిద్దర్నీ కర్నాటక లో డొనేషన్ కట్టి ఇంజనీర్లను చేశాడు.. మేం ఎంత ఇబ్బందుల్లో వున్నా నాన్న మాకెప్పుడూ ఆర్ధిక సహాయం చేయలేదు."

"నాన్న తమ్ముళ్ళకు ఆస్తి పంచారు, తమ కంటూ కొంచం కూడా ఉంచుకోలేదు. పంపకాలు చేస్తున్నప్పుడైనా ఆడపిల్లలకు చెరి యాభై వేలు ఇవ్వమని పెద్దమనుషులు చెప్పినా, మా నాన్న ఒప్పుకోలేదు . ఏనాడో పెళ్లి అయిన ఆడపిల్లలకు ఎందుకివ్వాలని పెద్దమనుషులనే కోప్పడ్డాడు. మా అమ్మకు ఇవ్వాలని వున్నా, ఆమె మాట నెగ్గదని తెలిసి ఏమీ మాట్లాడలేదు. అమ్మా నాన్న సొంత ఇంట్లోనే వుండేవారు. తమ్ముళ్ళు అన్నీ అమ్మేసి తమ దగ్గరకు వచ్చేయమంటే , అమ్మేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయారు. బిజినెస్ కు డబ్బు అవసరమని పెద్ద తమ్ముడు నాన్న దగ్గరున్న డబ్బు ,అమ్మ బంగారం అంతా తీసుకుని నష్టపోయాడు . అమ్మా నాన్న బరువయ్యారు. పెద్ద తమ్ముని భార్య పోరుపడలేక, చిన్న తమ్ముని దగ్గరకు పోతే, అంతా పెద్దోడికే పెట్టావని చిన్న తమ్ముడు, వాడి భార్య సాధించారు . విధిలేక వూరికి వెళ్ళిపోయి అక్కడే వుండినారు. నేనే వీళ్ళు పడుతున్న బాధచూడలేక, కొంతకాలం క్రిందట నా దగ్గరకు తెచ్చుకున్నా. ఎంతకాలమైనా వీళ్ళు ,తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళే ఆలోచన చేయలేదు. "

"నా కుటుంబ పరిస్థితి ని బట్టి చాలా కాలంగా మా అమ్మా నాన్నబాధ్యత తమ్ముళ్ళకు వివరించి సహాయం అడుగుదామని చెబుతున్నా. వాళ్ళు ఏ మాత్రం నా మాటలు పట్టించుకోలేదు. తమ్ముళ్ళ తో నేను మాట్లాడతాను అన్నా వప్పుకోలేదు . ముందు చూపు లేకుండా వున్న దంతా కొడుకుల కిచ్చి వీధిన పడిన వీళ్ళకు ఈ స్థితి ఎందుకొచ్చింది ? మమ్మల్ని కూడా మా తమ్ముళ్ళ లాగా చదివించి వుంటే ఆడపిల్లలు, మగ పిల్లలు అనే తేడా లేకుండా పెంచి వుంటే , మేం మా భర్తల్ని ఎదిరించి అయినా సంపాదించి మా తల్లిదండుల్ని చూసుకునేవాళ్ళం . కానీ మా చేతుల్లో విద్యలేదు, డబ్బులేదు, మాకు స్వాతంత్యం కూడా లేదు , ఏమిచేయగలం ?"

ఆమె ఆగి ఊపిరి తీసుకుంది
ముసలాయన కేసి చూశాం. ఆమె చెప్పింది వినపడిందో, లేదో ..అర్థమయిందో, కాలేదో మరి, ఏ భావమూ లేదు అతని ముఖంలో. ఆమె ముఖం దీనంగా మారింది .

" వాళ్ళను మేం కోరేది ఒక్కటే ... మాకేమీ ఇవ్వొద్దు , వాళ్ళ అవసరాల కొసమైనా కొంత ఆస్తిని ,డబ్బును మీ దగ్గరుంచుకోమని ... ఎంత మంది కొడుకులు ఎంత హీనంగా చూసి వీళ్ళను తిరస్కరించినా వాళ్ళే తమ వారసులని ,తమ సంపాదన అంతా కొడుకులకే చెందాలనే మన తల్లి దండ్రుల నైజం మారాలి . ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఆస్తి ఇస్తున్నారు ? ఆస్తి గురించి కాదు, ఆమ్మాయిని ,అబ్బాయిని తేడా లేకుండా పెంచాలి.. ఇద్దరినీ వారసులు, వంశో ద్దారకులు గానే గుర్తించాలి. మీరు చదువుకున్నవారు ,సమాజసేవ చేసేవారు , మార్చండి ఈ వ్యవస్థలో కూతురుకున్న స్థానాన్ని. "

మాకేం చెప్పాలో తోచలేదు. మళ్ళీ ఆమే మాట్లాడింది

"మా అమ్మా నాన్న ను మీరు చెప్పడం వలన నేను చూసుకేలేనమ్మా ... తమ్ముళ్ళు చూసుకోని రోజు వాళ్ళు నా భాధ్యతే . నేను కోరింది ఒక్కటే వాళ్ళను ఆస్తి అంతా వాళ్ళ కిచ్చారు కదా ... మీకు ఇప్పుడు కావాలని అడగండి .. మీరు ఇచ్చింది మీరు అడగడం లో తప్పేముంది? వెళ్లి వాళ్ళని నిలదీయమని చెప్పాను. కానీ వీళ్ళకు కొడుకుల ఆనందం తప్ప , వీళ్ళ అవసరాలు కానీ, మా అవస్థలు కానీ అవసరం లేదు .ఈ దేశం లో ఆడపిల్లల గతి యింతేనమ్మా ... ఇప్పుడే కాదు ,రామాయణ కాలం నాటి నుంచి అంతే. దశరథుడు కూతురు శాంత తో తృప్తిపడ్డాడా... కొడుకులకోసం శాంతను రోమపాదునికి దత్తత ఇచ్చాడు . దశరథుని కొడుకుల ముచ్చట కూతురి వలన తీరిందనే సత్యం ఎంతమందికి తెలుసు ? శాంత ఔదార్యం ఎక్కడైనా కీర్తించ బడిందా ?"

"మా బిడ్డల సాక్షిగా చెబుతున్నానమ్మా ,మాకున్న దాంట్లోనే వాళ్లకు పెడతాం , చివరి వరకు మా అమ్మా నాన్నని నేను చూసుకుంటాను . ఎవరి సహాయం కూడా మాకు అవసరం లేదు. " కన్నీళ్ళతో ఆమె కళ్ళు నిండిపోయాయి. ఉద్వేగంతో గొంతు పెగల్లేదు.

నోరేత్తలేకపోయాం. మా దగ్గర మాటలు లేవు. ముగ్గురం ముఖాలు చూసుకున్నాం. రామాయణంలో రాముడికి ఒక అక్క వుందని , యూనివర్సిటి డిగ్రీలున్న మా ముగ్గురికి తెలియలేదు. మేడి పండులాంటి ఈ సమాజం లో ఎన్ని పురుగులున్నాయో ! ముసలాయన అరుగు మీదనే నిశ్చలంగా వున్నాడు . కూతురు గురించి చెప్పాడు కానీ ఇద్దరు కొడుకులు కూడా చూడ లేదని ఒక్క మాట కూడా అనలేదు . రక్తం లో జీర్ణించుకుపోయిన ఈ స్త్రీ పురుష తేడాలు ,ఎలా పోగొట్ట గలం ?

ఆమె లోపలి కి వెళ్లి నాలుగు గ్లాసుల్లో మజ్జిగ తెచ్చింది. మేము త్రాగి బయటికి వచ్చాము . బయట తండ్రికి గ్లాసు నోటికి అందించి మజ్జిగ త్రాపిస్తున్న ఆమెను చూసి మాకు హృదయం ద్రవించింది . నా కయితే ,ఆమె మహోన్నత వ్యక్తిత్వం ముందు మేము మరుగుజ్జులం అనిపించింది.ఆమెకు మేము కౌన్సిలింగ్ చేయడమేమిటి ? సమాజపు రీతుల గురించి ఆమె మాకు ఎంతో తెలియ చేసింది. మేమింక ముసలాయన దగ్గరకు కూడా పోలేదు. మా అవసరం అతనికి లేదు.

"మళ్ళీ కలుస్తాం మేడం " అన్నాడు రమేష్.

ఆమె ఏదో అనబోయి మౌనం వహించింది. చేతులు జోడించి కళ్ళతోనే వీడుకోలు తీసుకున్నాం .

"ఆమె పేరేంటో అడగనేలేదు మేడం ... ఆమె గురించి రాస్తాను . అమె సామాన్యంగా వున్న, సామాన్యుల్లో వున్న, చాలా గొప్ప మనిషి, మన జాతి సంపద " కార్లో కూర్చున్నాక అన్నాడు రమేష్.

"ఆమెకు పేరెందుకు ? ఆమె ఒక "కూతురు " అంది సరయు.

నాకు కూతురుంది, అనుకున్నా మనసులో తృప్తిగా

1 comment:

  1. మీరు బ్లాగ్ లో రాస్తుంటారని నాకు ఇప్పటి దాక తెలియదు. నేను ఇటువంటి మాధ్యమాలకు దూరం. నేను చీఫ్ ఇంజనీర్ నే కాని మీ ముందు బలాదూర్! పాత తరం వాడిని కావటం కారణం కావచ్చు.

    మీరు రాసిన ధోరణి కూడ బాగుంది. హృదయానికి హత్తుకొనేట్లు కథనం ఉన్నది.

    నేను గొప్ప సాహితీవేత్తల రాతలను చూసాను. అందులో తప్పులను చూసి బాధ కలిగేది. పట్టుకొందామన్నా ఒక తప్పు కూడ దొరకలేదు మీ రాతల్లో. ఆంగ్లం పంతులమ్మ తెలుగులో కూడ తిరుగు లేకుండ రాయటం విశేషమే!

    ReplyDelete