Tuesday 28 February 2017

సముద్రం


ఇచ్చాపురంలో మురళి పెళ్లి అనగానే నా మనసు ఒక రకమైన ఉద్వేగానికి లోనయ్యింది. ఇచ్చాపురం కు అయిదు మైళ్ళ దూరంలో వుండే కవిటి అనే వూర్లో నాకు వూహ తెలిసిన బాల్యం మొదలయ్యింది. నాకు ఏడు నుండి పదేళ్ళు వచ్చేవరకు మేము నాన్న బ్యాంకు ఉద్యోగరీత్యా అక్కడే ఉన్నాము. తర్వాత నాన్న కు హైదరాబాదు బదిలీ అయింది. మా చదువు గురించి అమ్మ, నాన్నకు వేరే వూరు బదిలీ అయినా మమ్మల్ని హైదరాబాదులోనే హాస్టల్లో పెట్టి కొంతకాలం, అమ్మ మాతో వుంటే నాన్నే శని , ఆదివారాలు సెలవులో రావడం ఇలా జరిగి పోయి హైదరాబాదు తప్ప వేరే లోకం, ప్రాంతాలు తెలియకుండా పోయాయి. తర్వాత బదిలీ లేని సాఫ్ట్ వేర్ వుద్యోగంలో యంత్రాల్లా పనిచేయడం, శని, ఆదివారాల్లో ఇంట్లో పనులు చూసుకోవడం, పిల్లల్ని సినిమాకో బజారుకో తీసికెళ్ళి గడిపేయడం, లేదా హైదరాబాదులోనే జరిగే దగ్గరి వాళ్ళ పెళ్ళిళ్ళకో, ఇంకేదైనా సంబరాలకు మొక్కుబడిగా వెళ్లి వచ్చేయడం ... ఇలా జీవితం సగం గడిచిపోయింది. ఎన్నోసార్లు కవిటి జ్ఞాపకం వస్తూ వుంటుంది ...అక్కడికి వెళ్లి రావాలని ఎంతో కాలంగా అనుకుంటూనే వున్నాను ...ఇప్పటికి అవకాశం దొరికింది. మురళికి ఇచ్చాపురం అమ్మాయి పరిచయం ,ప్రేమ, పెళ్లి జరగడం నా కవిటి పర్యటన కోసమే అన్నట్టుంది .


ఆనందంగా తలంబ్రాలు పోసుకుంటున్న వధూవరులపై ఆశ్చింతలు వేసి, కళ్ళతోనే వీడుకోలు పలికి కవిటి బయలుదేరాను. ఇచ్చాపురం బస్స్టాండ్ లో కవిటి వెళ్ళే బస్సు కోసం చూస్తుంటే షేరింగ్ ఆటో వాళ్ళ ఆహ్వానాల దాడికి ఆశ్చర్యపోయాను . ఎన్ని ఆటోలో ! ఆ రద్దీ కి ఆటోలో ప్రయాణం ప్రమాదమని గ్రహించి బస్సు ఎక్కేశాను. చిన్నప్పుడు సెలవుల్లో అమ్మమ్మగారి వూరు కడపకు వెళ్ళాలంటే పెద్ద ప్రహసనంగా వుండేది. కవిటి నుండి ఇచ్చాపురం బస్సులో వచ్చి ,లేకుంటే పలాస 60 కిలోమీటర్లు వెళ్లి, హైదరాబాదు కు 950 కిలోమీటర్లు వెళ్ళాలి. మళ్ళీ అక్కడి నుండి కడపకు వెళ్ళడానికి 400 మైళ్ళు . అందుకే ఎండాకాలంలో తప్ప వూరికి ప్రయాణాలు ఉండేవి కాదు .దసరా, సంక్రాంతి సెలవుల్లో నాన్న గారు చుట్టుప్రక్కల వున్న ప్రదేశాలు చూపించేవారు. కవిటి దారి వెంట మార్పులు నన్ను ఆశ్చర్య పరుస్తూండగానే కవిటి వచ్చేసింది. బస్ దిగి చుట్టూ చూశాను .ఆటోలు తప్ప నా చిన్ననాటి గుర్రం జట్కా బళ్ళు, రిక్షాలు ఒక్కటి కూడా లేవు.


కవిటిలో ఒకటవ తరగతిలో చేరాను, అన్నయ్య మూడో తరగతి, ఇద్దరం బుజానికి బ్యాగు లేసుకుని ప్రభుత్వ అప్పర్ ప్రైమరి స్కూలు కు వెళ్ళే దారి వెంట తెగ కబుర్లు చెప్పుకునేవాళ్ళం .అన్నయ్యకు అన్ని తెలుసనే భావనలో వుండి ప్రతి సందేహాన్ని అన్నయ్యకు చెప్పి నివృత్తి చేసుకునే వాడ్ని. ఒరిస్సా రాష్ట్రo ప్రక్కనే కాబట్టి ఒరియా భాషా ప్రభావం అక్కడ బాగా వుండేది, చాలా మంది ఒరియా మాట్లాడేవాళ్ళు , మాక్కూడా ఒరియా బాగానే వచ్చేది . కానీ ఇప్పుడొక పదం కూడా గుర్తులేదు . ఆటో ఎక్కి ముందుగా నేను నాన్న గారి బాంక్ చూడదలచుకున్నాను. స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ దగ్గరకు వెళ్ళమన్నాను. ఆటో దిగి బ్యాంక్ ముందు దిగి ఆశ్చర్య పోయాను. నాన్న పనిచేసేరోజుల్లో ఎంత చిన్నగా వుండేది, రెండే గదుల్లో వుండేది. అంతా వేరుగా వుంది ...! అచ్చంగా ఆధునిక బ్యాంకు కు వుండే హంగులన్నీ అమరి వున్నాయి .చెక్క బల్లల స్థానాన ,అందమైన డేకోలం టేబుళ్లు ,అల్మైరాలు , మానేజరు రూము ప్రత్యేకంగా వుంది ...అప్పుడయితే నాన్నకు ప్రత్యేకంగా రూం వుండేది కాదు ..మిగతా స్టాఫ్ తో పాటే వుండేవారు. నాన్న కూర్చునే చోటు కోసం చూశా ..వుహూ అది ఎక్కడో కూడా అర్థం కాలా! ఒక రకమైన నిరాశ నన్ను ఆవరించింది. బ్యాంకు పని మీద కాక మరేదో పని మీద వచ్చానని గ్రహించిన అక్కడి క్లర్క్ "ఏమి కావాలి సర్ " అన్నాడు. ఏమి చెప్పాలో తోచక, నవ్వి బయటకు వచ్చేశాను.


నా జ్ఞాపకాల్లో వున్న నాన్న బ్యాంకు రూపు రేఖలు కాలంతో మారిపోవడం చాలా సహజమైన మార్పు కాని ..అలాగే వుండాలని మనసు కోరుకోవడం కూడా అంతే సహజం కాబోలు. అక్కడి నుండి మేము చిన్నప్పుడున్న శివాలయం వీధికి తీసికెళ్ళమని చెప్పా ఆటో అబ్బాయితో . శివాలయం వీధికి వెళ్ళాక, "ఎక్కడాపమంటారు ?" అన్నాడు


ఎక్కడని చెప్పను ? అందుకే దిగి ఆటో అబ్బాయికి డబ్బు లిచ్చి , ఆ వీధిని పరిశీలిస్తూ నడిచా. మా ఇల్లు వీధికి మధ్యలో వుండేది ...ఎంత ప్రయత్నించినా ...నా చిన్ననాటి రోజుల్లో వున్న ఇల్లు ఒక్కటి కూడా కనపడలా ...! మేమున్నది ఇరవై అయిదేళ్ళ క్రిందటి మాట .. ఇంకా మార్పులు జరగకుండా ఉంటాయా ! అయినా మా ఇల్లు వున్న ప్రదేశానికి వెళ్లి అక్కడ వున్న ఒక మధ్య వయస్కుడ్ని అడిగా " ఇక్కడ దశరథ రామయ్య గారి ఇల్లు వుండేది ..ఆయన టీచర్ గా పని చేసేవారు...మీకు తెలుసాండి ?"అని


"తెలియదండి " ముక్తసరిగ్గా చెప్పి వెళ్లి పోయారు .


చాలా మందిని అడిగా ..చివరిగా ఒక పెద్దాయన "దశరథ రామయ్య గారు చాలా కాలం క్రిందటే పోయారు బాబు ఆయన కొడుకులు ఇల్లు ఎప్పుడో అమ్మేశారు, కొన్న వాళ్ళు పాతదాన్ని కూలదోసి క్రొత్త గా కట్టి బాడుగాకిచ్చారు అదే చూడు బాబు "అన్నాడు.


ఒక లేత ఆకుపచ్చరంగు వేసిన ఇల్లు చూపిస్తూ. ఒకప్పుడు చుట్టూ ప్రహరి గోడతో విశాలమైన ఖాళీ స్థలంలో తోట ,పెద్ద వరండాతో విశాలమైన గదులతో వుండే ఆ ఇల్లు ...ఎంత బాగుండేది ? ఇంటి ముందు అశోక చెట్టు ..అన్ని పండ్ల మొక్కలు వేసి వున్నారు దశరథ రామయ్య గారు.ఆయన బాడుగ తీసుకోవడానికి వచ్చినప్పుడు మొక్కలన్నీ చూసి , వాటిని బాగా చూసుకోమని చెప్పేవారు. దాని స్థానంలో ఇప్పుడు అగ్గి పెట్టేల్లాంటి చిన్న ఇళ్ళు, క్రింద పైన కట్టారు ,మొక్కలకు అసలు స్థలమే లేదు. వుస్సూరన్నది ప్రాణం. తమాయించుకున్నా. మా ఇంటికెదురుగా వుండే బాబ్జి వాళ్ళ నాన్న పోస్టాఫీసులో పని చేసేవారు ...వాళ్ళెక్క డున్నారో ! మా ఇంటికి నాలుగిళ్ళ తర్వాత రాజారామ్ అనే అబ్బాయికి పోలియో వచ్చి కాళ్ళు సన్నగా అయిపోయాయి, ఆడుకోవడానికి వచ్చి ఆడలేక చూస్తూ కూర్చునేవాడు. వాడితో నాకు బాగా స్నేహం వుండేది ,అమ్మ ఇచ్చిన తాయిలం ఇద్దరం పంచుకునేవాళ్ళం . నాన్నకి బదిలీ అయ్యాక మేము హైదరాబాద్ వస్తుంటే వాడి దు:ఖం నా కళ్లలో ఇప్పటికి మెదులుతోంది .ఎక్కడున్నాడో... ఏమయ్యాడో ! కాలం ఎవరిని ఎక్కడికి తీసు కెలుతుందో! ఎదురింట్లో అడిగా బాబ్జి గురించి వాళ్ళ నాన్న గురించి .కానీ వాళ్ళు కూడా ఎప్పుడో బదిలీ అయి వెళ్లి పోయారు కాబట్టి ఎవరికీ తెలియలేదు .రాజారామ్ వాళ్ళు కూడా అక్కడ లేరు. నాకు గుర్తు వున్న పేర్లన్నీ అడిగా కానీ ఎవరూ లేరు .అన్నయ్యకు కూడా నాకు గుర్తున్న వ్యక్తులే గుర్తున్నారు. వీధి మొత్తం ఒక క్రొత్త ప్రపంచం అయిపొయింది నాకు ...ఉండ లేకపోయా ! ఈ వీధిలో ఒకప్పుడు ఆడుకున్న ఆటలు ..చేసిన అల్లరి అన్నీ కళ్ళముందు మెదిలాయి.



వీధి చివరకు వచ్చి ఒక్క సారి వెను తిరిగి చూశాను .దగ్గరలో తొక్కుడు బిళ్ళ ఆడుతూ చింపిరి జుట్టు తో రెండు జళ్ళ సీత కనపడింది .నాకు ఆశ్చర్యం వేసింది ఇరవై అయిదేళ్ళ క్రిందటి సీత మాత్రం అలాగే ఎలా వుందో అర్థం కాలా ! నాకు నవ్వొచ్చింది ..! గతం జ్ఞాపకాల్లో నాకు మతి బ్రమించినట్ట్లుంది ..లేకపోతే సీత రాగిరంగు జుట్టుతో అలాగే ఎలావుంటుంది ? పూజారి కూతురు సీత రెండు జడలేసుకుని వాటికి రిబ్బన్లు కట్టుకుని మాతోటే ఆడేది. అంతా బ్రమ ...! నా ఆలోచనలు సీత చుట్టూ తిరిగాయి ..సీత వాళ్ళ నాన్న గారు దగ్గరలోని గుడిలోపూజారి. మేము సాయంత్రమయే సరికి అమ్మ కొంగు పట్టుకుని గుడి దారి పట్టేవాళ్ళం ..అమ్మ రాని రోజుల్లో కూడా వెళ్లి ఆటలాడి, గుడికి వెళితే పూజారి గారు ప్రసాదం పెట్టేవారు. అయితే గుడిలోని బావి దగ్గర చేతులు కడుక్కుని శుభ్రమైన చేతులు చూపిస్తే తప్ప ఆయన ప్రసాదం పెట్టేవారు కాదు. ఆ చక్కర పొంగలి,పులిహోర రుచి ఇప్పుడు నా నాల్కపై నీరూరేటట్టు చేసింది ...తల విదిలించి ముందుకు సాగాను .శివాలయం వెళదామని ..అంతలోనే నాకు గుడి కంటే దగ్గరలో వున్న బడి గుర్తొచ్చింది. నా చిన్నప్పటి బడి ఎలావుందో ....మరి!



శివాలయం వీధి నుండి నేను బడి వున్న తూర్పు ప్రాంతానికి వెళ్లాను ... అప్పుడు బడి దగ్గరలో ఇళ్ళేవి లేవు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతం అంతా ఇళ్ళే వున్నాయి . వూరు పెద్దగా అవలేదు రోడ్లు అంతంత మాత్రంగానే వున్నాయి, పరిశుభ్రత విషయానికి వస్తే ఆ రోజుల్లో ఆటోలు ,మోటార్ సైకిళ్ళు,కార్లు ,సిటి బస్సులు లేవు కాబట్టి ఇంత కాలుష్యం లేదు .వూరు శుభ్రంగా , ప్రశాంతంగా వుండేది. మనం శాస్త్రీయ విజ్ఞానం పెరిగే కొద్దీ ఆనందాన్ని ,సహజత్వాన్ని కోల్పోతున్నాo అనిపిస్తుంది. బడి దగ్గరకు వెళ్ళాక నాకేమీ అర్థం కాలేదు .మా స్కూలు హైస్కూల్ అయింది, చెట్లతో ఎంతో ఆహ్లాదకరంగా వుండే మా బడి ఇప్పుడు కేవలం సిమెంట్ నిర్మాణంలా అయింది, గురుకులం లాగా వుండే మా బడికి ఆ ఆనవాళ్ళు ఇప్పుడు లేవు. బడి భవంతి పెద్దగా అయినా గోడలన్నీ రంగులు వెలిసి పోయి, బడి ప్రాంగణమంతా పిచ్చి పిచ్చి మొక్కల తో నిండి పోయి బడి రూపు రేఖలు మారిపోయాయి. బడిలోకి వెళ్లి హెడ్ మాస్టర్ గదిలోకి వెళ్లాను. “నేను చిన్నప్పుడు ఇక్కడే చదివాను అప్పుడున్న టీచర్లు ఎవరైనా వున్నారా?” అని అడిగాను, స్టాఫ్ రిజిస్టర్ ఇచ్చారు చూసుకోమని. నాకు గుర్తున్న టీచర్లు ఎవరూ లేరు. హెడ్ మాస్టారు ఉదాసీనంగా చూశారు .ఇన్నేళ్ళ తర్వాత తన చిన్న నాటి బడిని చూసుకోవడానికి వచ్చిన ఒక పూర్వ విద్యార్థినయిన నా పట్ల ఆ బడి హెడ్ మాస్టారుకు కొంచం అయినా ఆసక్తి చూపించాల్సిన బాధ్యత వుంది అనిపించింది .కాని ...ప్చ్... మనం వుండాలి బాధ్యత గా. అంతేకానీ ఎదుటి వ్యక్తిని ఇలా వుండాలని నిర్దేశించే హక్కు మనకెక్కడిది ? బడి ముందు వుండే వేప చెట్టు కోసం చూశాను, లేదు, ఆ ప్రాంతంలో ఒక గొనెసంచి పరచుకుని పిప్పరమెంట్లు, బెల్లంచిక్కీలు, వేరుసెనగకాయలు అమ్మే ముసలావిడ గుర్తొచ్చింది… ఎక్కడుందో! ...ఏమయ్యిందో! ఎలా కనుక్కోవడం? బయటికి వచ్చా ..అదోకరకమైన నిరుత్సాహం ..నిరాశ. ఇంటర్వెల్ కొట్టడంతో పిల్లలందరూ పరుగున బయటికి వచ్చారు...ఇప్పుడు మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వాళ్ళు సైతం కార్పోరేట్ స్కూళ్ళకు పంపుతున్నారు, ప్రభుత్వ బళ్ళకు ఇంక ఏమాత్రం చదువు ఆసక్తి లేనివాల్లో, మధ్యాహ్నం భోజనం కోసమో... వస్తున్నారు..పెద్ద పిల్లల్ని ఆసక్తిగా చూసి అడిగా ఇక్కడ ఒక ముసలావిడ పళ్ళు పిప్పరమెంట్లు అమ్మ్మేది చూశారా మీరు ఇప్పుడు పదో తరగతికి వచ్చారు కదా చిన్నప్పుడు మీ ఒకటో తరగతిలోనో రెండో తరగతిలోనో ?"



"వుహూ మేము చూడలేదు అంకుల్, ఇక్కడ ముసలావిడ ఎవరూ ఏమీ అమ్మడం లేదు, మేము అక్కడ షాపు దగ్గర కొంటాము" అన్నారు. నెమ్మదిగా బడి దాటి నడిచాను ...ఆకలిగా వుంది ...కానీ ఏమీ తినాలన్పించలేదు. ఆకాశం మేఘావ్రుతంగా వుంది కానీ వాన కురిసేలా లేదు ...చల్లగానే వుంది ....వూరు మొత్తం తిరిగాను ...ఎక్కడా పరిచయమైన ముఖాలు కనపడలేదు ....అశోక్ సినిమా హాలు దగ్గర ఆగాను. ఆ హాలులోనే సినిమాలు ఎక్కువగా చూశాము ...మాయాబజారు సినిమాలో ఆ మంత్రాలు మాయలు చూసి పొందిన ఆనందం గుర్తొచ్చింది .సమయం చూసుకున్నా అయిదవుతోంది ..గుడి దగ్గరకు వెళ్ళొచ్చు, పూజారిగారు వచ్చి వుంటారు సీత గురించి తెలుస్తుంది ... అందరికి బదిలీలు వుంటాయి పూజారి గారికి వుండవు కదా! నాలో ఉత్సాహం కలిగింది. గుడి దగ్గర పడుతోంటే ఒక రకమైన గుండె దడ కలిగింది ... ఏదో తెలియని అనుభూతి ..గుడి అలాగే వుంది కానీ పాడు పడి పోయింది.. మెట్లన్నీ రాళ్ళు జారి వున్నాయి, పిచ్చి చెట్లన్ని పెరిగి వున్నాయి. ఎప్పుడూ భక్తులతో ముఖ్యంగా ఆడ వాళ్ళతో కళ కళ లాడే గుడి ఇంత నిర్మానుష్యంగా ఉందేమిటి ? గుడిలో దీపం వెలగక పోతే నేనింక గుడి మూతపడింది అనుకోవాల్సి వచ్చేది. గుడి బయటే ఓ సన్నని ఇరవై ఏళ్ళ కుర్రాడు కూర్చుని వున్నాడు .వేషధారణ బట్టి పూజారి అనిపించింది..మరి సీత వాళ్ళ నాన్న గారు ఏమయ్యారు ?


"గుడిలో పూజారి మీరేనా?"


"అవునండి "


"ముందుండే పూజారి ..రమణ శాస్త్రి గారు లేరా "


" ఆయన చనిపోయారండి ..వాళ్ళబ్బాయి పౌరోహిత్యం నేర్చుకోలేదండి ...ఏదో ఫ్యాక్టరీ లో వుద్యోగం చేస్తారండి ...అందుకే నేను చేస్తున్నానండి "అన్నాడు


"వాళ్ళబ్బాయి ...మిగతా కుటుంబం ఎక్కడుంది మీకు తెలుసా "


"శివాలయం వీధిలోనే ముందు వున్న చోటే ఉన్నారండి...ముందున్న స్థలం లో కిరాణా షాపు వుంది చూడండి "


కిరాణా అంగడి వుండటం మూలాన వాళ్ళ ఇల్లు కనుక్కోలేక పోయా నన్నమాట...సీత ఎక్కడుందో ! పెళ్ళయి వుంటుంది ..పిల్లలు కూడా వుంటారు?.. ఎక్కడుందో అడ్రస్ కనుక్కుని సీతను కలవాలి వీళ్ళ ఆచూకి ఒక్కటే తెలిసింది ..." కొంచం సంతోషం వేసింది .


"అర్చన చేయించామంటారా?" పూజారి అడిగాడు


శిథిలమై పోయిన గుడిని, వైభవం ,ప్రాభవం కోల్పోయిన దేవుడ్ని చూస్తే నాస్తికుడ్ని అయినా ఆ గుడి పరిస్థితి కి కృంగి పోయాను. గుడికి పెద్దగా భక్తులు వచ్చేట్టు కనపడలేదు...ప్రజలు కొత్త దేవుళ్ళని ...కొత్త గుళ్లని మాత్రమే దర్శిస్తున్నారన్న మాట .


"అర్చన చేయించమంటారా..సార్ ?" మళ్ళీ అడిగాడు


".. అర్చనా ! ..ఆ ..చేయించండి "అన్నా


"గోత్రం "అడిగాడు


"తెలియదు ..." అన్నా కుటుంబ సభ్యుల పేర్లు అడిగాడు, చెప్పాను


హారతి ఇచ్చాడు. నవ్వుకుంటూ కళ్ళ కద్దు కున్నా . వెను తిరగ బోతూ చిరిగిన ధోవతితో పేదరికం, దైన్యం కనిపిస్తున్న ఆ పూజారిని చూస్తే నాకు ఏదో చేయాలనిపించింది ..వాలెట్ లోంచి వేయి రూపాయల నోటు తీసి జాగ్రత్తగా పళ్ళెం లో వేశాను .


"నా దగ్గర చిల్లర లేదు సార్ " అన్నాడు నమ్రతగా ..


"మీకే ..ఉంచుకోండి " అన్నా. అతని కళ్ళు మెరిశాయి .


మెట్లు దిగుతుంటే బాధేసింది. ఈ మెట్ల మీద ఆడుకున్న స్నేహితులేరి? ఆ అందమైన బాల్యం ఏది? కాలం ఎంత క్రూరమైనది? మనసులో వివరించలేని నొప్పి కలిగింది .


శివాలయం వీధిలో కిరాణం కొట్టు వెనకాల వున్న పూజారి ఇల్లు చూడగానే నాకు ఉత్సాహం వచ్చింది ...బయటే ఉదయం కనపడ్డ రాగిరంగు జుట్టున్న రెండు జళ్ల అమ్మాయి అచ్చు సీత లా వుంది, సీత కూతురేమో ..ఉదయం చూసింది బ్రమ కాదన్న మాట ...నాకు ఆశ్చర్యం తో మాట రాలేదు . తేరుకుని "రమణ శాస్త్రి గారిల్లు ఇదేనా ?"అడిగా .


"అవునండి..కానీ తాతయ్య పోయారు ...మీరెవరు ?"


"తెలుసమ్మా నీ పేరేంటి?"


"సీతామహాలక్ష్మి ."


"సీత కూతురివా? మీ అమ్మ ఉందా ..? నేను మీ అమ్మ చిన్నప్పటి స్నేహితుడ్ని."


"అమ్మ కూడా పోయారండి నే పుట్టగానే,అందుకే తాతయ్య నాకు అమ్మ పేరే పెట్టారటండి ...అమ్మమ్మ ఉన్నారండి, కానీ ఎవర్ని గుర్తుపట్టలేరండి ..మామయ్యేమో ఇంకా ఫ్యాక్టరీ నుండి రాలేదండి ...రండి లోపలి ..."


జీవితం ఇంత సంక్లిష్టమైనదా ! కాలం ఇంత గారడీ చేస్తుందా ... షెల్లీ మార్పు జీవన సూత్రం అంటాడు. కానీ ఎందుకు ఈ మార్పు ను నేను తట్టుకోలేకపోతున్నాను. గిరుక్కున వెనుతిరిగి బయటికి వచ్చాను .ఆలోచనకు అందని విధంగా మొద్దుబారి పోయింది నా బుర్ర, నాకు తెలియకుండానే ఎలాగో నా చివరి మజిలి సముద్రతీరం చేరాను.


అప్పుడప్పుడే చీకటి పడుతోంది ...ఆకాశం ఏ చిత్రకారునికి కలపడం సాధ్యం కాని లేత పసుపు, కనకాంబరం కలిసిన రంగులో వుంది ...ఆకాశం క్రింద ఇంకో అద్భుతం ...ఈ సంద్రం! ..ఈ గాలి ...అప్పుడే సముద్ర గర్భం నుండి పైకి లేస్తున్న పూర్ణ చంద్ర బింబం వెదజల్లుతున్న వెన్నెలలు, ఎగసి పడుతున్న అందమైన అలలు !ఆహా ఎంత ఆహ్లాదకరంగా వుందీ ప్రదేశం! ఇరవై అయిదేళ్ళ తర్వాత నా చిన్ననాటి జ్ఞాపకాల్లోనివి ఏవీ లేవు, వున్నా అలాగే లేవు, అన్ని మారి పోయాయి ..కానీ ఈ సంద్రం ....ఈ అలలు ..వెండి పొడి లాంటి ఇసుక...అలాగే వున్నాయి. నేను అన్నయ్య ఆడుకున్న ఇసుకలో మా పాదాల గుర్తులు లేవు ...మేము కట్టుకున్న గుజ్జన గూళ్ళు లేవు, కానీ ఇసుక అలాగే వుంది, అవే ఎగిసిపడే అలలు,అదే చందమామ ,అదే అలల నురుగు ..అవే కొబ్బరి చెట్లు, అవే మెరిసే తారకలు .... అదే చల్లగాలి. ఈ సహజమైన ప్రకృతికి మార్పు లేదు, మరణం లేదు. మనసు నిండా హాయి నింపుకుని అక్కడే కూర్చున్నా. నాకు తెలియకుండానే ఇసుకలో నా చేతులు గుజ్జన గూళ్ళు కట్టడం మొదలెట్టాయి.

No comments:

Post a Comment