Tuesday 28 February 2017

మ్యాజిక్ రియలిజం - ఓ క్రొత్త వొరవడి తో మిడ్ నైట్ చిల్ద్రన్


ఇటీవల కాలం లో మ్యాజిక్ రియలిజం అనే అత్యాధునిక సాహితీ ప్రక్రియ బాగాప్రసిద్ది పొందింది..ప్రపంచాన్నితన రచనలతో ఓ వూపు వూపిన సాల్మన్ రష్ది తన 'మిడ్ నైట్ చిల్దరెన్' అనే నవలని మ్యాజిక్ రియలిజం లోనే వ్రాసారు.1920 లో యూరప్ లో ఫ్రాంజ్ రొహ్అనే కళా చరిత్రకారుడు ఇటాలియన్ పత్రిక " నోవోసేంటో" లో తన వ్యాసంలో కళల్లోఉండాల్సిన వాస్తవికత గురించి చెబుతూ మ్యాజిక్ రియలిజం పదాన్ని వాడాడు. 1949 లో అలిజో కార్పెంటియర్ అనే క్యూబా నవలా రచయిత మొదటిసారిగా సాహిత్యం లో వాడారు. లాటిన్ అమెరికన్ ప్రక్రియ గా చెప్ప బడే మ్యాజిక్ రియలిజం రచనల్లో సామాన్యమైన విషయాలకు కల్పన జోడించినా అసహజంగా అనిపించదు. ఇది ఒక దేశం లేక ప్రాంత చరిత్ర, రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కథ తో మమేకం చేస్తుంది. మ్యాజిక్ రియలిజం, అలిజో కార్పెంటియర్ ,జువాన్ కార్లోస్ ఒనేట్టి , జూలియా కార్టజర్, జార్జ్ లూయీ బోర్జెస్ , మిగెల్ ఏంజెల్ ఆస్తురియస్, కార్లోస్ ఫ్యుఎంతిస్, మారియో వర్గ ల్లోస మరియు గాబ్రియల్ గార్సియ మార్క్వెజ్ లాంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల చేతుల్లోపరిణితి చెందింది. లాటిన్ అమెరికన్ ప్రక్రియగా పేరు పొందిన మ్యాజిక్ రియలిజం మొట్ట మొదట గా జర్మనికి చెందిన గంటర్ గ్రాస్ చేతిలో ప్రతిభావంతంగా "టిన్ డ్రం" నవల గా రూపు దిద్దుకుంది .రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తర్వాత, జర్మనీలో ,పోలాండ్ లో వున్న రాజకీయ ,సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవనం ఎలా సాగిందో ఆస్కార్ అనే ముఖ్య పాత్రధారి (protagonist ) వివరిస్తాడు. తన తండ్రి ఎవరో తెలియని అనిశ్చిత పరిస్థితిలో, తన మూడో ఏట పెరగ కూడదని నిర్ణయించుకుని మరుగుజ్జుగా ఉండిపోయి,హిట్లర్ యొక్క అరాచకాలు, నాజీలకు యూదులకు మధ్య జరిగిన అమానుష సంఘటనలకి ప్రత్యక్ష సాక్షి గా నాటి జర్మన్ అక్రుత్యాలని వివరిస్తాడు. ఈ నవల గ్రాస్ కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. గ్రాస్, మ్యాజిక్ రియలిజంను "టిన్ డ్రం " నవలతో విశ్వవ్యాప్తం చేసాడు .

మ్యాజిక్ రియలిజం ను ప్రపంచవ్యాప్తం చేసిన మరోమహా కావ్యం మార్క్వెజ్ యొక్క 'వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యుడ్ " ఇది స్పానిష్ సాహితీ చరిత్రను తిరగ రాసింది. ఇంగ్లీషు తో పాటు ఎన్నో భాషల్లో కి అనువదించ బడిన ఈ నవల రచయితకు నోబెల్ పురస్కారాన్ని కూడా తెచ్చి పెట్టింది. నవలలో, ఏడు తరాల వారు, మకoడో అనే చిన్న పట్టణాన్ని నిర్మించి, అభివృద్ధి చేసి,ఎలాదాని వినాశనానికి కారకులవుతారో రచయిత వివరిస్తాడు .ఆధునిక మానవుని ఆశలు,హద్దులు దాటి అతని వినాశనానికి ఎలా హేతువులు అవుతున్నాయో మనం చదువుతాము. లాటిన్ అమెరికన్ చరిత్రతో పాటు, కొలంబియా లో జరిగిన ప్రతి సంఘటన బుయoడియ కుటుంబ సభ్యుల జీవితాల తో ముడిపడి వుంటాయి.నవల లోని లాటిన్ అమెరికన్ చరిత్ర చదువుతున్నపుడు వళ్ళుగగుర్పాటు కు గురవుతుంది .బాల్యంలో జరిగిన బనానా మస్సక్రే లేక అరటి తోట దగ్గరి మారణ హోమం మార్క్వెజ్ హృదయ ఫలకం నుండి చెదిరి పోలేదు . కథలో ఆర్లియనో బుయoడియ ఆ ఘోర సంఘటనకు సాక్షిగా నిలబడతాడు. నియంతల పాలన లో ప్రజల జీవితాలకు విలువే లేదు , కనపడడం లేదని అనుకున్న వ్యక్తిని ఇంక శాశ్వతంగా మర్చిపోవాల్సిందే,ప్రశ్నించడం ఆన్ని నేరాల్లోకి పెద్ద నేరం ,ఆ అభియోగం మీద వెళ్ళిన వారు తిరిగి రారు.నాగరికత పేరుతో మకాండోలోఎన్నో మార్పులు సంభవించాయి.సమిష్టి కుటుంబం చెదిరిపోయి,చివరికి వావి వరుస మరిచి వ్యామోహం లో పడ్డ అన్నాచెల్లికి, తోక తో పుట్టిన శిశువును చీమలు తినివేయడంతో నవల ముగుస్తుంది.భావితరం గతిని ముందుగానే ఊహించిన వుర్సుల బుయoడియ,తన కుటుంబాన్ని, మకాండోపట్టణాన్ని కాపాడడానికి చేసే ప్రయత్నం ఫలించదు.యదార్థ సంఘటనలతో పాటు కల్పన నిండిన ఈ రక్త చరిత్ర ను ప్రపంచమంతా,అబ్బురంగా చదివింది . అమ్మమ్మ తాతయ్యల చెంత పెరిగిన మార్క్వెజ్ ,కథ చెప్పడం తన అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నా నంటాడు నోబెల్ బహుమతి తీసుకుంటూ.

ఈ రెండు నవలల తర్వాత మ్యాజిక్ రియలిజం ప్రక్రియలో చాలా నవలలు వచ్చాయి అయితే మళ్ళి ఓ ప్రభంజనం సృష్టించింది మాత్రం సాల్మన్ రష్డి యొక్క "మిడ్ నైట్ చిల్దరన్". ఈ నవలతో రాత్రి కి రాత్రి రష్డి ఒక సెలబ్రిటీ అయిపోయాడు.మిడ్నైట్ చిల్డ్రన్ ఇంగ్లీషు సాహిత్యం లో ఒక గొప్ప స్థానాన్ని పొందడమే కాకుండా రష్డి మాన్ బుకెర్ బహుమతిని గెలుచుకున్న ప్రథమ భారతీయుడై తర్వాత తరం వారైన విక్రం సెత్, అరుంధతి రాయ్, కిరణ్ దేశాయ్, అరవింద్ అడిగ లాంటి వారికి బుకర్ బహుమతిని తన వారసత్వంగా అందించాడు. 1981లొ బుకర్ ప్రైజు ,1993 లో బుకర్ ఆఫ్ ది బుకర్ ను, 2008 లో ద బెస్ట్ బుకర్ ప్రైజు ను పొందిందిన ఏకైక గ్రంధమిదే.


రష్డి 1947 జూన్ 19 న బాంబే లో నగీన్ ,ఆనిస్ అహమ్మద్ రుష్ది దంపతులకు జన్మించాడు .ధనవంతులు, విద్యావంతులైన తల్లి దండ్రుల ప్రభావం వలన రష్డి కి చిన్ననాటి నుండి స్వేఛ్చ గా ఆలోచించడం అలవడింది.14 వ ఏటనే లండన్ లోని రగ్బీ పాఠశాలలో చేరాడు, తర్వాత కింగ్స్ కాలేజి, కేంబ్రిడ్జ్ లో చరిత్ర ప్రధానంగా బియ్యే చేసాడు. 1964లో రష్డి తల్లిదండ్రులు పాకిస్తాను లో స్థిరపడ్డారు ,రష్డి తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళినా, పాకిస్తాన్లోని పరిస్థితుల్ని జీర్ణించుకోలేక తిరిగి లండన్ వెళ్లి పోయాడు. మల్టీ మీడియా గ్రూపులో కొంతకాలం పని చేసాక, డేవిడ్ హారే, స్నూ విల్సన్, హోవార్డ్ బ్రెంతాన్, స్టీఫెన్ పోలియోకఫ్ లాంటి రచయితలతో పరిచయం పెంచుకున్నాడు.ఈ పరిచయాలు అతన్ని రచయితగా మారడానికి ఎంతో దోహదం చేశాయి. అతని మొదటి నవల "గ్రైమస్ "1979 లో వచ్చింది, కానీ అటు పాఠకుల్ని గానీ ఇటు విమర్శకుల్ని గానీ అది మెప్పించలేకపోయింది. రష్డి మంచి చదువరి ,అతని అపార జ్ఞానం,ఇంగ్లీషుపై అతని పట్టు ,ఇంగ్లీషు వారిని సైతం అబ్బుర పరిచింది .1981 లోవచ్చిన "మిడ్ నైట్ చిల్దరన్ ",భారతదేశం స్వాతంత్రానికి ముందు, తర్వాత, ఇందిరా గాంధి ఎమర్జెన్సి అరాచకాలను వివరిస్తుంది.అతను రాసిన "షేం("SHAME ) సాటానిక్ వెర్సెస్ (SATANIC VERSES ) "హరూన్ అండ్ సి ఆఫ్ స్టోరీస్ "(HAROUN AND SEA అఫ్ STORIES) నవలలు మ్యాజిక్ రియలిజం ప్రక్రియ ద్వారానే రాయబడ్డాయి. "సాటానిక్ వెర్సెస్" ముస్లిం ల మనోభావాల్ని కించపరిచే విధంగా వున్నదని ఆ నవలని మొట్టమొదటి సారిగా రాజీవ్ గాంధీ ప్రభుత్వం బహిష్కరించడం శోచనీయం. తరువాత ఇరాన్ ముస్లిం నాయకుడైన ఆయతుల్ల ఖుమేని, ఖురాన్నిఅవమానించిన గ్రంధంగాను దాని రచనకు భాద్యులై న వారినందరినీ ఇస్లాం మతవ్యతిరేకులు గా తీర్మానించి ఫత్వా విధించాడు. ప్రతి ముస్లిం రష్డి ని చంపడానికి ప్రయత్నించాలని పిలుపునిచ్చాడు. రష్దీ అజ్ఞాతంలోకి వెళ్లి పోయాడు. అతన్ని రక్షణ భారాన్ని అప్పటి మార్గరెట్ థాచర్ ప్రభుత్వం చాలా ప్రతిష్టాకరంగా తీసుకుంది.ప్రపంచవ్యాప్తంగా రష్దిపై ఫత్వాని అమానుషమైన చర్యగా వర్ణించాయి. అన్ని దేశాలు, ఫత్వాని వెనక్కి తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసాయి. కానీ ఖుమేని అందుకు అంగీకరించలేదు అన్ని ముస్లిం దేశాలు రష్డి పుస్తకాన్ని క్షుద్ర సాహిత్యంగా గా వర్ణించాయి. ఖుమేని మరణం తర్వాత రష్డి ఫత్వాని లెక్క చేయలేదు, తన సొంత సెక్యూరిటీతో సాహితీ సభలకు తిరుగుతూ వున్నాడు. ఒక లిటరరీ ఇకన్ గా వెలుగొందుతూ తర్వాత ది మూర్స్ లాస్ట్ సై,(THE MOOR 'S LAST SIGH ) The Ground Beneath Her Feet , Fury, Shalimar the Great, The Enchantress of Florance మరియు Luka and the Fire of Life నవలలను వ్రాసారు.

భారతదేశం వచ్చి తన బాల్యం గడిపిన ఇల్లు "విండ్సర్ విల్లా" ను చూసి రష్డి చలించి పోయాడు. బాంబే చూడగానే తన సొంతగూడు చేరుకున్న అనుభూతి కలిగిందని ,ఇదే తనను "మిడ్నైట్ చిల్డ్రన్" రాయడానికి ప్రేరేపించిందని అతను చెప్పుకున్నాడు. "మిడ్నైట్ చిల్దరన్" రాయడానికి గ్రాస్ యొక్క "టిన్ డ్రం", మార్క్వెజ్ యొక్క"వన్ హుండ్రేడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యు డ్" ఎంతో ప్రభావం చూపినట్లుగా రష్డి అంగీకరించాడు.. పాఠకులు రష్డి "వన్ హండ్రెడ్ యియర్స్ అఫ్ సాలిట్యుడ్ " నుండి మ్యాజిక్ ని, గ్రాస్ "టిన్ డ్రం" నుండి రియలిజం ను తీసుకున్నట్లు గ్రహిస్తారు.

మ్యాజిక్ రియలిజం కు కొన్ని సిద్దాంతాలు (manifestations) వున్నాయి. ఇది మ్యాజిక్ మరియు రియలిజం ల మిశ్రమం. కల్లోల ప్రాంతాల్లోనే ఎక్కువ గా రాయబడ్డ ఈ ప్రక్రియ పోస్ట్ కలోనియల్ (post colonial and post modern) అత్యoత ఆధునిక సాహిత్యం గా చెప్పబడుతోంది. "మిడ్ నైట్ చిల్దరన్ " నవల, సలీం సినాయ్ ఆత్మకథ. అతను తన స్నేహితురాలైన పద్మకు తన కథను వివరిస్తూ ఉంటాడు. తన ముప్పైవ ఏట అడుగు పెట్టె సమయం దగ్గర పడుతుండగా తన శరీరం చీలి పోతు న్నట్టు గా,తన అవయవాలన్నీ వీడి పోతున్నట్లుగా అనిపించడం తో తన అంతం దగ్గర పడుతుందని భావించిన సలీం తన కథను పద్మ కు చెబుతాడు. ఉత్తమ పురుషం లో మొదలయ్యే ఈ కథ సలీం నర్లికర్ నర్సింగ్ హోమ్ లో1947 ఆగస్టు 15 వ తేది అర్థరాత్రి భారతదేశానికి స్వాతoత్ర్యం ప్రకటించిన క్షణం లోనే పుట్టడం తోమొదలవుతుంది అదే సమయం లోనే మరో మిడ్ నైట్ చైల్డ్ శివ కూడా పుడతాడు .తర్వాత గంట వరకు పుట్టిన 1001 పిల్లలే మిడ్ నైట్ చిల్డ్రన్ .వీరికందరికి ఏదో ఒక మానవాతీత శక్తులు వుంటాయి .అయితే చాలామంది పిల్లలు బాల్యం లోనే చనిపోతారు. 581 పిల్లలు మాత్రం బ్రతికి సలీం తో మిడ్ నైట్ చిల్డ్రన్స్ కాన్ఫరెన్స్ లో తమ ఆలోచనలని పంచుకుంటారు.


సలీం 1915 సంవత్సరం నుండి కథ మొదలు పెడతాడు. కాశ్మీర్ కు చెందిన తన తాత గారైన డాక్టర్ ఆడం అజీజ్ గురించి మొదటి అధ్యాయం లో ప్రస్తావిస్తాడు. సంపన్న వర్గానికి చెందిన ఘని సాహెబ్ కూతురు నసీంను ఆడం ను 1918 లో పెళ్లి చేసుకుని ఆగ్రా వస్తున్నపుడు, గాంధి అరెస్టుకు నిరసనగా హర్తాల్ ప్రకటించినప్పుడు జరిగిన హింసాకాండలోభాగంగా, జలియన్ వాళభాగ్ ఉదంతం జరగడం,అక్కడ జరిగిన మారణ హోమం, జెనరల్ డయ్యర్ క్రూర చర్య , ఆడం అజీజ్, డాక్టర్ గా తన వృత్తి ధర్మం నిర్వహించి రక్త సితమైన దుస్తులతో రావడంతో,సలీం యొక్క కుటుంబ సభ్యులు భారత దేశ చరిత్ర లో చోటు చేసుకుంటారు. ఇది మొదలుకుని సలీం జీవిత చరిత్ర భారత దేశ చరిత్ర తో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తుంది.

ఆడం అజీజ్ నసీం లకు ముగ్గురు కూతుర్లు అలియ,ముంతాజ్, ఎమరాల్డ్ ,ఇద్దరు కొడుకులు ముస్తఫా,హనీఫ్. ఆడం అజీజ్ దేశ విభజనను వ్యతిరేకించే మియాన్ అబ్దుల్లా ను అభిమానిస్తాడు.అయితే మియాన్ అబ్దుల్లా హత్య చేయబడతాడు. అతని అనుచరుడైన నాదిర్ ఖాన్ కూడా ప్రమాదం లో వున్నాడని భార్యఅభిమతానికి వ్యతిరేకంగా అతనికి తన ఇంటిలో ఆశ్రయ మిస్తాడు.నాదిర్ ఖాన్ ముంతాజ్ ప్రేమ లో పడి రహస్యంగా పెళ్లి కూడా చేసుకుంటారు .అయితే రెండు సమత్సరాల తర్వాత కూడా కన్యగా వున్న ముంతాజ్ ను వదిలి పెట్టి నాదిర్ ఖాన్ పారి పోతాడు. పాకిస్తాన్ సైన్యాధికారి మేజర్ జుల్ఫీకర్ ఎమరాల్డ్ కు భర్తగా వస్తాడు.అంతవరకు అలియ ను పెళ్లి చేసు కోవాలనుకుంటున్న అహ్మద్ సినాయ్ అనే వ్యాపారి ముంతాజ్ ను పెళ్లి చేసుకుంటాడు.ముంతాజ్ తన పేరును అమీనా గా మార్చుకుని అతని తో డిల్లి కి పయనమవుతుంది.

గర్భవతిగా వున్నఅమీనాను చూసి ఆమె గర్భం లోవున్నబిడ్డ తన దేశాని కంటే పెద్ద వాడు,కాని చిన్న వాడు కాలేడని జ్యోతిష్కుడు చెబుతాడు. టెర్రరిస్టుల దాడిలో అహ్మద్ ఫ్యాక్టరీ కాలిపోవడంతో అతను డిల్లి వదిలి బాంబే కు మకాం మారుస్తాడు. అక్కడ విలియం మేతోల్ద్ అనే బ్రిటిష్ దేశస్థుని ఇల్లు కొనుక్కుంటాడు. మేతోల్ద్ ఎస్టేట్ గా పిలవబడే ఆప్రాంతం లో చాలా కుటుంబాలు వుంటాయి. వారి కందరికీ వీ విల్లి వింకి అనే గాయకుడు తన పాటలతో వినోదం పంచుతుంటాడు. అతని భార్య వనిత కూడా గర్భవతి. అయితే ఆమెకు మేతోల్ద్ తో వున్న అక్రమ సంభందం తో బిడ్డ కలగ బోతున్నాడు. అమీనా, వనిత, నర్లికర్ నర్సింగ్ హోమ లో 1947 ఆగస్టు 15 అర్థరాత్రి సరిగ్గా 12 గంటలకు మగబిడ్డల్ని ప్రసవిస్తారు. అయితే కమ్యూనిస్ట్ ప్రేమికుడు జోసెఫ్ దికోస్ట ప్రభావం వలన మేరి పెరిరియ అనే నర్సు ,పిల్లలిద్దరి పేర్ల ట్యాగులను మార్చి ధనవంతుల బిడ్డను పేదవారికి, పేదవారి బిడ్డను ను ధనవంతుల చెంతకు చేర్చడం ద్వారా సమాజం లోని అసమానతలు పోగొట్టడం లో తన వంతు పాత్ర పోషించానని అనుకుంటుంది. కానీ పాప భీతి తో అమీనా ఇంటికి ఆయాగా వచ్చి సలీం ను చూసుకుంటుంది. వనిత, శివ పుట్టగానే చనిపోతుంది. వీ విల్లి వింకి శివ ను తీసుకుని వెళ్లి పోతాడు. భారత దేశానికి స్వతంత్రం వచ్చిన నిముషం లోనే పుట్టిన సలీం కు ఆన్ని పత్రికలకు అత్యధిక ప్రాముఖ్యతను ఇస్తాయి. స్వతoత్ర భారతదేశం లో పుట్టిన మొదటి బిడ్డగా ప్రధాన మంత్రి నెహ్రు సైతం సలీం కు ప్రత్యేకంగా అభినందనలను వుత్తరం ద్వారా తెలుపు తారు. సలీం కు వెడల్పాటి ముఖము, అతిపెద్దదైన దోసకాయ వంటి ముక్కు,నీలికళ్ళు ఒక ప్రత్యేకతను ఇస్తాయి.


సలీం చెల్లెలు జమీల, ఆమెను బ్రాస్ మంకీ అని పిలుస్తుంటారు.సలీం తోటి పిల్లలు అతని ముక్కు, మొహం గురించి చేసే ఎగతాళి నుడి తప్పించుకోవడానికి స్నానాల గదిలో (washing chest ) లో దాక్కుంటాడు. అమీనా అది చూసి సలీంను ఒక రోజంతా మాట్లాడ కూడదని శిక్షిస్తుంది. మౌనంగా వున్న ఆ సమయంలో సలీం ఏవేవో శబ్దాల్ని వింటాడు.తనకు వేరే వాళ్ళ ఆలోచనల్ని చదివే శక్తీ మరియు టేలిపతి వున్నాయని గ్రహిస్తాడు.ఇక్కడినుండి రష్ది మ్యాజిక్ రియలిజం వుపయోగించి సలీం మానవాతీత శక్తులను సహజమైన ధోరణి లో పాఠకుడు గ్రహించెట్లు చేస్తాడు.ఇదే మ్యాజిక్ రియలిజం లోని మ్యాజిక్. సలీం తనతో పాటు జన్మించిన 1001 మంది పిల్లలలో 581 మంది మాత్రమే జీవించి తమ పదవ జన్మ దినాన్ని జరుపుకున్నారు.వీరందరికీ అద్భుత శక్తులు వున్నాయి. అర్థరాత్రికి దగ్గరగా జన్మించిన వాళ్లకి ఎక్కువ, తరవాత ...తరవాత పుట్టిన వాళ్లకితక్కువ శక్తులు వుంటాయి. సలీం తో పాటు జన్మించి సలీం స్థానం లోకి వెళ్లి పోయిన మరో పిల్ల వాడైన శివకు బలమైన పెద్ద మోకాళ్ళు వుండి ఎప్పుడూ యుద్ధం చేయడానికి సిద్దంగా ఉంటాడు. అతని స్థానాన్నిచేజిక్కుంచుకున్న తనను శివ ఏమి చేస్తాడో అని సలీం ఎప్పుడూ భయపడుతుంటాడు.

సలీం ఒక ప్రమాదంలో ఒక వేలు తెగినప్పుడు జరిపిన రక్త పరీక్షలో సలీం అమీనా అహ్మద్ ల కొడుకు కాదని తేలుతుంది. హాస్పిటల్ నుండి ఇంటికి రాగానే సలీం ను అతని మేన మామ హనీఫ్ ఇంటికి పంపుతారు. సలీం తిరిగి తన ఇంటికి వచ్చిన కొంతకాలానికి హనీఫ్ ఆత్మహత్య చేసుకుంటాడు.హనీఫ్ సంస్మరణ సభలో మేరి తాను చేసిన తప్పును అంగీకరిస్తుంది అహ్మద్ బాగా త్రాగడం అలవాటుచేసుకుని అమీనాను సలీం ను తీసుకుని బయటకు వెళ్ళ మనడంతో అమీనా పిల్లలిద్దరిని తీసుకుని పాకిస్తాన్లో వున్న తన సోదరి ఎమరాల్డ్ దగ్గరికి వెళ్లి పోతుంది. అక్కడ ఎమరాల్డ్ భర్త జుల్ఫీకర్ సైనిక తిరుగుబాటు చేయడంతో మార్షల్ లా విధిస్తారు.

నాలుగు సంవత్సరాల తర్వాత, అహ్మద్ కు గుండె జబ్బు రావడం తో అమీనా పిల్లలతో భారతదేశానికి తిరిగి వస్తుంది. చైనా భారత దేశంతో యుద్దానికి దిగుతుంది. సలీం ముక్కుకు సంభందించిన జబ్బు కు ఆపరేషన్ జరిగినప్పుడు అతని టేలిపతి శక్తులన్నీ పోతాయి, అయితే వాటి స్థానే వాసనలు గ్రహించే అద్భుతమైన శక్తి రావడం తో ఇతరుల వుద్వేగాల్ని అతను గ్రహించ గలుగుతాడు. చైనా తో జరిగిన యుద్ధం లో భారత దేశం ఎంతోమంది సైనికుల్ని కోల్పోతుంది. అహ్మద్ అమీనా శాశ్వతంగా పాకిస్తానులోనే స్థిరపడాలని నిర్ణయించుకుని పిల్లలను తీసుకుని భారతదేశం వదిలిపోతారు.జమీల పాకిస్తానులో ఒక గొప్ప గాయకురాలిగా పేరు సంపాదించుకుంటుంది. భారత దేశానికి పాకిస్తానుకు జరిగిన యుద్ధం లో జరిగిన వైమానిక దాడుల్లో సలీం, జమీల తప్ప సలీం కుటుంబంలో అందరూమరణిస్తారు. వైమానిక దాడుల్లో ఆడం అజీజ్ యొక్క వెండి ఉమ్మి తొట్టి సలీం తలపై పడడం తోఅతని మెదడు దెబ్బతిని గతాన్ని మర్చి పోతాడు. అతన్ని పాకిస్తాన్ మిలటరీ, వేట కుక్క లాగ ఉపయోగించుకుంటుంది.అతని వాసన పసిగట్టే శక్తిని పాకిస్తానీ సైనికులు, బంగ్లా దేశం కోసం యుద్ధం చేస్తున్నసైనికులను , భారత దేశపు గూడాచారులను కనిపెట్టే దానికి ఉపయోగిస్తారు. సలీం కు తాను మిలటరీ లోనికి ఎలా వచ్చింది తెలియదు అయితే జమీల తన సొంత చెల్లెలు కాదని తెలిసాక ఆమె పట్ల తన ప్రేమను ప్రదర్శించి నందుకు శిక్ష గానే అతన్ని మిలటరీ వాళ్లకు అప్పగించినట్లు సలీం అనుమానిస్తాడు. పాకిస్తాను సైన్యం లో ఉండగానే బంగ్లా దేశ స్వతంత్రం కోసం సహాయం చేస్తాడు. ఎన్నో భయంకరమైన ఉదంతాలను చవి చూసిన సలీం తన ముగ్గురు అనుచరులతో తప్పించుకుని సుందర్ బన్స్ చేరుకుంటాడు.అక్కడే సలీం మర్చిపోయిన తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడుకానీ అతని పేరు మాత్రం అతనికి గుర్తురాదు. సుందర వనాల్ని వదల గానే సలీం కు పార్వతి -మంత్రగత్తె కనిపిస్తుంది.ఆమె కూడా సలీం తో పాటు అర్థ రాత్రి పుట్టిన పిల్లలలో ఒకతి. పార్వతి సలీం కు తన పేరును గుర్తు చేయడమే కాకుండా అతన్ని క్షేమంగా తన బుట్టలో తీసుకుని భారతదేశం చేరుస్తుంది. సలీం, పార్వతి తో పాటు పాములాడించే పిక్చర్ సింగ్ తో మంత్రాల వాళ్ళు వుండే ఒక గుడి సెలో వుండి పోతాడు.సలీం పెళ్ళికి నిరాకరించడం తో పార్వతి, శివ తో స్నేహం చేస్తుంది. శివ ఇప్పుడు ఒక యుద్ధయోధుడు .కానీ ఏ మాత్రం నైతిక విలువలు పాటించని శివ తో పార్వతి ఉండలేకపోతుంది. శివ కు ఎంతోమంది అక్రమ సంతానం వుంటారు. అతని అరాచాకాలకి ఎంతోమంది స్త్రీలు బలవుతారు.

పార్వతి పెళ్లి కాకుండా శివ బిడ్డను తన గర్భం లో మోస్తూ తిరిగి పిక్చర్ సింగ్, సలీంల దగ్గరికి వస్తుంది.అయితే చుట్టుపక్కల వాళ్ళంతా పార్వతిని తమ దగ్గరకు రానివ్వరు అప్పుడు సలీం పార్వతిని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడే ఇందిరా గాంధి, కుమారుడు సంజయ్ గాంధి కుటుంబ నియంత్రణ పథకాన్నిమొదలు పెడతారు.పార్వతి కి బిడ్డ పుట్టగానే ఇందిరా గాంధి ప్రభుత్వం సలీం పార్వతి ఉంటున్న ప్రాంతాన్ని నాశనం చేస్తుంది .శివ బలవంతంగా సలీం ను కుటుంబ నియంత్రణ కేంద్రానికి తీసి కెళ్ళ గానే పార్వతి మరణిస్తుంది. సలీం, శివ ఆధీనం లో అర్థరాత్రి తన తో పాటు పుట్టిన వాళ్ళందరి పేర్లు చెబుతాడు . వాళ్ళందరికీ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయడం ద్వారా వాళ్ళ లోని అద్భుత శక్తుల్ని నాశనం చేయడం ద్వారా ఇందిరా గాంధి ప్రభుత్వానికి వున్న ప్రమాదాన్ని నివారించ గలిగినామని అనుకుంటారు. అయినప్పటికీ ఇందిరా గాంధి ఎన్నికల్లో వోడి పోతారు. సలీం తో పాటు అర్థరాత్రి జన్మించిన వారందరూ సలీం తో విడుదల అవుతారు.సలీం, పార్వతి బిడ్డ ఆడం ను వెతుక్కుంటూ వెళతాడు. పిక్చర్ సింగ్ దగ్గరున్న ఆడం ను తీసుకుని ముగ్గురు బాంబే వెళతారు.

బాంబే లో ఒక చోట చట్నితిన్నసలీం అది తన ఆయా మేరి చేసిన చట్నిగా గుర్తించి, ఆ చట్ని ఫాక్టరీ దగ్గరకు వెళతాడు అక్కడ గేటు దగ్గరే పద్మ కనపడుతుంది .సలీం మేరీ ని కలిసాక ఆడం సంరక్షణ ను పద్మకు అప్పగించి తన ఆత్మకథని వివరిస్తాడు. తన కథ విని తన ప్రేమను అర్థం చేసుకున్న పద్మ ను సలీం పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు.అయితే తన 31 వ పుట్టిన రోజున, అదే భారతదేశపు 31 స్వాతంత్రదినం రోజున తన శరీరం కోట్ల కొలది అణుదూళిగా మారడం వలన తన మరణం సంభవిస్తుందని సలీం జోస్యం చెప్పడం తో కథ ముగుస్తుంది.



మిడ్నైట్ చిల్దరన్ లో మ్యాజిక్ రియలిజం

ఈ కథను రష్డి మ్యాజిక్ రియలిజం లో ఎలా చెప్పాడన్నది అతని 647పేజీల నవల చదివితేనే సంపూర్ణంగా అర్థమవుతుంది . (Manifestations of Magic Realism ) మాజిక్ రియలిజం యొక్క సిద్ధాంతాల గురించి తెలుసుకుంటే నవల ఇంకా బాగా అర్థమవుతుంది. నవల భారతదేశ స్వాతoత్రానికి ముందు తర్వాత, ఇందిరా గాంధి ఎమెర్జెన్సిరోజుల గురించి వ్రాయబడ్డది. బ్రిటిష్ వారు వదిలి వెళ్ళాకకూడా మన దేశం ఏ మాత్రం ప్రశాంతంగా లేదు. దేశ విభజన , భారీ వలసల తో ,కాందిశీకుల ప్రవేశంతో, హిందూ ముస్లింల ఘర్షణలతో ,భాషాప్రయుక్త రాష్ట్రాల గొడవలతో, పొరుగు దేశాల సరిహద్దు సమస్యలతో చైనా ,పాకిస్తాను యుద్ధ కవ్వింపు లతో అతలాకుతలంగా వున్న అనిశ్చిత భారత రాజకీయ పరిస్థితుల్లో పెరిగిన రష్డి ,వాటి తో పాటు తల్లి తండ్ర్లు లు పాకిస్తాన్ కు వలస వెళ్ళడం ,తన కిష్టమైన, పుట్టి పెరిగిన బాంబే ని కోల్పోవడం లాంటి బాధాకరమైన ,సంఘటనల్ని తన నవలకి వస్తువుగా తీసుకున్నాడు. ఇలాంటి నేపథ్యమే మ్యాజిక్ రియలిజం లాంటి సాహితీ ప్రక్రియకు కావలసింది.


ఊహ కల్పనల తో పాటు ,అతీంద్రియ శక్తులు కలిగిన అర్థరాత్రి పుట్టినపిల్లలు మిడ్ నైట్ చిల్డ్రన్ నవలని మ్యాజిక్ కు దగ్గర చేస్తే, చరిత్రలో మరువలేని అధ్యాయాలు కొన్నిరియలిజం దగ్గర చేస్తాయి . ,మహాత్మ గాంధి 7 ఏప్రిల్ 1919 లో జరిపిన హర్తాల్ ,13 ,ఏప్రిల్ 1919 న జరిగిన జలియన్ వాలా భాగ్ లో జరిగిన మారణ కాండ,ఆ హింసాకాండలో గాయపడిన క్షతగాoత్రుల ను ఆడం అజీజ్ చికిత్స చేయడం ,ఆడం గుండె పై గాయం భారతదేశపు చరిత్రలో మానిపోని గాయంగా,చెదిరిపోని మచ్చగా వుండి పోయిందంటాడు రచయిత. ఇంకా అనేక మంది నాయకులు విభిన్న రీతుల్లో బ్రిటష్ వారితో పోరాడిన వైనం , మియాన్ అబ్దుల్లా ,నాదిర్ ఖాన్లు చరిత్రలో చరిత్ర హీనులుగా మిగిలిపోయిన కొందరి త్యాగం గుర్తుకొస్తుంది.1942 లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమం ,do or die ,నినాదం తో మొదలయ్యి కొన్ని చోట్ల హింసగా మారి అహ్మద్ ఫాక్టరీ కాలి పోతుంది. తర్వాత అతను బాంబే వెళ్లి పోవడం జరుగుతుంది.1947 లో స్వతంత్రం ప్రకటించడం ,అదే సమయం లోనే సలీం ,శివ, 1000ఇతరపిల్లలు జన్మించడం సలీం కు TheTimes of India బహుమతి తో పాటు ప్రధాన మంత్రి వుత్తరం అందుకోవడం,చరిత్రలోను నవలలోను చోటు చేసుకున్నా వుదంతాలే . కవాస్ మానెక్ షా నానావతి అనే నేవీ కమాండర్ తన స్నేహితుడైన ప్రేమ్అహుజ ను కాల్చి చంపడం 1959 లో సంచలనం కలిగించింది. కమాండర్ భార్య తో అక్రమ సంభంధం పెట్టుకుని ఆమెను పెళ్లి చేసుకోమని కోరినప్పుడు తిరస్కరించినందుకు గాను ఆహుజాను చంపినట్లు ,పోలీసులకు లొంగిపోయిన కమాండర్ చెబుతాడు..ఈ వార్తకు పత్రికలు చాలా ప్రధాన్యత నిచ్చాయి ఈ సంఘటన ఆధారంగా నవలలో సలీం ,తన ఇంటి పక్కనే వున్న కమాండర్ సబర్మతి భార్య లీలను ,ఆమె ప్రియుడు హోమీ కత్రాక్ లను హత్య చేసి పోలీసులకు లొంగి పోవడం గురించి చెబుతాడు. లీల హామీల శృంగారం, హత్యల, గురించి మాట్లాడుతూ, అవిదేయులైన భార్యలకు,తల్లులకు ఇదేగతి అని హెచ్చరిస్తాడు సలీం. అమీనా తన మొదటి భర్తను నాదిర్ ఖాన్ ను కలవడానికి వెళ్ళ బోతూ ఈ సంఘటనతో భయ పడి ఆగి పోతుంది.


సామాజిక, రాజకీయ సంఘటనల గురించి ఎన్నో ఉదాహరణలు నవలలో చూస్తాము గాంధి చంపబడినట్లు తెలియ గానే ముస్లింలు అందరూ ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుంటారు. సలీం కుటుంబం కూడా. కానీ రేడియో లో హంతకుడి పేరు విని ఆమీన,"అతను ముస్లిం కాదు , గాడ్సేఅవడం వలన అంటే ,హిందూ అవడం వలన మనల్ని బ్రతికించాడు" అంటుంది. 1957 లొభారతదేశం 14 రాష్ట్రాలు గాను,7 కేంద్రపాలిత ప్రాంతాలు గాను విభజించిన తరువాత , బాంబే మాత్రం చాలా బాషలు మాట్లాడే రాష్ట్రం కావడం తో అలాగే ఉంచారు.దానివలన 1957 ఫిబ్రవరి లో సంఘర్షణ మొదలైంది.ఇందులో భాగంగా సలీం కొంతమంది ఉద్యమకారుల చేతుల్లో చిక్కుతాడు గుజరాతిలో మాట్లాడమన్న వారితో తనకు తెలిసిన ఒక గుజరాతి పద్యం చెబుతాడు. .ఉద్యమకారులు ఆ పద్యం లోని ఒక వాక్యాన్ని తీసుకుని దాన్ని నినాదం గా మార్చుకోవడం తో సలీం,బాషా ప్రయుక్త రాష్ట్రాలకు కారణ భూతుడవడమే కాకుండా బాంబే రాష్ట్రంగా విడిపోవడాని కి ప్రత్యక్షంగా కారణమయాడు.


హృదయ విదారకమైన పేదరికంతో వుండే కొన్ని ప్రాంతాలు నాగరిక సమాజానికి మచ్చలాంటివి ,అయితే పేదరికం లేకుoడా చేయడం పాలకుల పని, భాద్య్హత, కానీ గుడిసల్ని కూలదోయడం కాదు, పిక్చర్ సింగ్, పార్వతి వాళ్ళు వుండే గుడిసెలు సంజయ్ గాంధి బుల్డోజర్లతో కూల్చి వేయడం లాంటి సంగతులను ఎన్నో చరిత్ర తనలో దాచుకున్నది. ఎన్నోసామాజిక,ఆర్ధిక అసమానతలకు తల్లడిల్లే జనం పై రాజకీయ నాయకులకు ఎంత బాధ్యత వుంటుందో ..వోటు పడగానే వోటర్ల ను మరిచే సంసృతి అలవడిన వాళ్ళు పేద వాళ్ళను ఎంత హీనంగా చూస్తారో ! తమ అభివృద్ధి కోసం అడ్డు వచ్చిన పేదవారిని అడ్డు తొలగించు కోవడం కోసం నాయకులు ఎంత గా దిగజారుతారో ..రష్డి వివరంగా రచించారు.


మ్యాజిక్ రియలిస్ట్ నవలలు చాలా కష్టమైన భాషలో వుంటాయి. "మిడ్నైట్ చిల్దరన్" కూడ ఇందుకు మినహాయింపు కాదు . రష్డి ఇంగ్లీష్ ను భారతీయం చేసారు.ఆయన చేతిలో అది ఒక ప్రత్యేకమైన భారతీయ భాషగా మారి పోయింది. భారతీయ భాష లోని ఎన్నో పదాల్ని అతను ఇంగ్లీషు లో కలిపి వాడాడు. ఇంగ్లీషు సాహిత్యం వ్రాసిన భారతీయులలో రష్డి లా ఖ్యాతి గడించిన వారు లేరు. అతని కి భాష పై గట్టి పట్టు వున్నది. కొత్త పదాల్ని ఉపయోగించడం లో రష్డి అందె వేసిన చెయ్యి."మిడ్ నైట్ చిల్దరన్ " షోకేసుల్లో పెట్టుకునే ఒక పుస్తకం మాత్రమే ,ఇది చదవడం అంత తేలిక కాదు "అని ఒక విమర్శకుడు అన్నాడు భారత దేశ చరిత్ర తో అవగాహన లేని వాళ్లకు ఈ నవల అంతా సులభంగా అర్థం కాదు.కానీ విచిత్రమేమంటే భారతీయుల కంటే దీన్ని భారతదేశ చరిత్ర తెలియని విదేశీయులే ఎక్కువ చదివినట్లు మిడ్నైట్ చిల్ద్రెన్ అమ్మకాలు..విమర్శలు,అవార్డులు తెలుపుతున్నాయి.


మ్యాజిక్ రియలిస్ట్ నవలల్లో అద్భుతాలు,అనూహ్య మైన సందర్భాలు, కల్పనలు, ఊహల్లో మాత్రమే సాధ్యమయే సంఘటనలు దర్సనమిస్తాయి .ఈ నవల పేరులోనే కల్పన వున్నది. స్వతంత్రం వచ్చిన గంట లోపల పుట్టిన పిల్లలకు అద్భుత శక్తులు వుండడం అన్నదే ఒక కల్పన. సాహిత్యమే కల్పన, ఊహలతో కూడుకున్నది.రష్డి ప్రతి పేజీలో ఊహను, కల్పనను,వాస్తవాన్ని కలిపి కథగా అల్లుతాడు. మిడ్ నైట్ చిల్దరన్ కల్పన వున్ననవలే కానీ వుట్టి కల్పన కాదు.


రష్డి కథ చెప్పే విధానం వినూత్న పద్దతిలో వుంటుంది. సలీం కథని తన శ్రోత ఆయిన పద్మతో , "ఒకానొకప్పుడు " అంటూ మొదలు పెడతాడు. అంతే కాదు,వర్తమానం నుండి గతం లోకి గతం నుండి భవిష్యత్తు లోనికి రచయిత వెళుతుంటాడు. 1918 లోకాశ్మీర్ లో అజీజ్ తో మొదలవాల్సిన కథ 1947 లొ సలీం తో బాంబే లో మొదలయ్యి మళ్ళి వెనక్కి వెళుతుంది. ఇది కూడా మ్యాజిక్ రియలిస్ట్ నవలలు నడిచే పద్దతే. జానపద కథను చెప్పే రీతిని రష్డి అద్భుతంగా,విజయవంతంగా ప్రయోగించి ఎంతో మంది కొత్త రచయితలకు మార్గదర్సకుడు అయాడు.


కొందరు రచయితలు ,ముఖ్యంగా తమ మాతృ దేశాన్నివీడడం వలన ఒకరకమైన దూరాన్ని(alienation) అనుభవిస్తుoటాడు.మ్యాజిక్ రియలిస్టు నవలాకారులు ఈ రకమైన కష్టాన్ని అనుభవిస్తారు ,సొంత గడ్డను వదిలి పరాయి దేశాల్లో వున్నప్పుడు మాతృ దేశం గురించి రాయడం ద్వారా కొంతవరకి త్రుప్తిని పొండుతారేమో! ఈ అభిప్రాయాన్ని రష్డి చాలా ఇంటర్వ్యులలో చెప్పారు. తమ అనుభవాలని, తమ జీవితం లో జరిగిన సంఘటనల్నిరచయిత తన కథలో చెప్పడం అన్నది చాలా సాధారణమైన అంశం.అలాగే ఈ నవల రష్డి ఆత్మకథలా అనిపించడం లో కూడా ఆశ్చర్యం లేదు. మిడ్నైట్ చిల్ద్రన్ నవల ముగింపు లో స్పష్టత లేదు. మ్యాజిక్ రియలిస్ట్ నవలలు ఇలాగే అస్పష్టంగా ముగుస్తాయి. పాఠకులు తమకు తోచిన ముగింపును అన్వయించుకోవచ్చు.


Vividha Andhrajyothi- 2014

1 comment: