Thursday, 15 December 2016

జీవన గమనం


చల్లగాలి వీచే సాయం సమయానికి నా కాళ్ళు నాకు తెలియకుండానే అటు కేసి నడుస్తాయి విశాలమైన మైదానం లో పెద్ద పెద్ద చెట్లు ,బాగా పెరిగిన పచ్చిక పై సిమెంటు బెంచీలు వుంటాయి. ఈ బిజీ పట్టణం లో ప్రశాంతమైన ప్రదేశం ఇదొక్కటే .ఈ పార్కు లేకపోతే అన్నవూహ కూడా భరించలేను. రొదలమధ్య నుండి నిశ్శబ్దానికి ,అల్లరి ,హడావుడి నుండి నిర్మలత్వానికి అది ఆనవాలు .విభిన్నమైన మనుషులు మనస్తత్వాల సమ్మేళనం.ధనిక, పేద తార తమ్యాల్ని,కుల,మత, జాతి, రీతి విచారించని దివ్యక్షేత్రం. చల్లని నీడనిచ్చే చెట్టుకింద కూర్చున్నాను... పిల్లలు ఆడుకుంటున్నారు. కొందరు తల్లి దండ్రులే పిల్లల్ని ఆడిస్తున్నారు. చెట్ల క్రింద కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న రకరకాల జంటలు, ప్రేమలో పడి,మునిగి తేలుతున్న యువకులు ప్రియురాళ్ళ కళ్ళ లోకి చూస్తూ ప్రపంచాన్ని మరిచి పోతున్నారు.. వృద్ద దంపతులు కొంతమంది ఇంట్లో చెప్పుకోలేని, వివరించుకోలేని బాధల్ని ఇక్కడ వ్యక్తపర్చుకుంటున్నారు. మధ్య తరగతి భార్యా భర్తలు ఇరుకు గదుల్లో, పిల్లల మధ్య, కుటుంబ సభ్యుల మధ్య పొందలేని ఏకాంతాన్ని, సాన్నిహిత్యాన్ని పొందాలని వచ్చారు. వాళ్ళ మధ్య ఆర్తి ...ఏదో తెలియ జేయాలనే ఆరాటం , ఏదో చెప్పాలనే తపన, తమలోని ఆలోచనల్ని, భావాల్ని, బాధల్ని, గోడుని, తమ జీవిత భాగస్వామి తో పంచుకోవాలని, వాళ్ళ దగ్గర ఓదార్పు పొందాలనే ప్రయత్నం చేస్తుంటారు .ఆ ప్రయత్నాల్లో ఆవేశాలు కొందరిలో , కొందరిలో ఆవేదన, మరి కొందరిలో కన్నీళ్లు బయట పడుతుంటాయి .రోజూ కనిపించే జంటలే ఒక రోజు సంతోషంగా ,మరు రోజు ఉదాసీనంగా , ఇంకొక్కరోజు కన్నీళ్ళ పర్యంతం అవుతుంటారు .ఓదార్పు పొంది చిరునవ్వు తో తిరిగి పోయే వాళ్ళు కొందరు, గుండె బరువు దించు కుందామని గుండె విప్పి మరింత గాయంతో గుండె బరువుతో వెళ్ళే వాళ్ళు కొందరు ,తమ సమస్య ను చెప్పుకునే ఆరాటంలో తామెక్కడున్నామో మరిచి, అరిచి చుట్టు పక్క వాళ్ళు చూసాక సిగ్గుతో ,అవమానంతో మరింత బాధని మోసుకెళ్ళే వాళ్ళు మరికొందరు.

ప్రేమించే సమయంలో ప్రియురాళ్ళ అందమైన ముఖం తప్ప వేరే గుర్తురాని అబ్బాయిలకి, అమ్మాయి పెళ్లి ఊసు ఎత్తగానే ,అమ్మనాన్న ,కులం, మతం ,ఆస్తి ,అంతస్తు గుర్తు వస్తాయి .కొన్ని రోజులు దాట వేసే మాటలు జరుగుతాయి ,అమ్మాయి పట్టు విడవ కుండా అదే ప్రస్తావన తెస్తే ఇంక తర్వాత అబ్బాయి రాడు ,అమ్మాయి వచ్చి ఎదురు చూసి ఎదురు చూసి ,సెల్ ఫోన్ లోంచి ఎన్ని కాల్స్ పోయినా జవాబు రాదు, తర్వాత స్విచ్ ఆఫ్ వస్తుంది .కొన్ని రోజులు అమ్మాయి అదే చోటుకు వచ్చి జ్ఞాపకాలు వెదుకుతుంది ,కన్నీళ్లు వదులుతుంది. తర్వాత అమ్మాయి కనపడదు .అబ్బాయి కనపడడు. కొద్ది రోజుల తర్వాత కొన్ని సార్లు కొత్త అమ్మాయితో అబ్బాయి మళ్ళీ కనపడతాడు ,అమ్మాయి మరి కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుని భర్తను తీసుకుని ఆనందంగా నాలుగైదు రోజులు వరుసగా యిద్దరు కబుర్లు చెప్పుకుంటూ సంతోషంగా కనపడతారు ,మరి తర్వాత అత్త గారింటికో,భర్త దగ్గరికో వెళ్లి వుంటుంది కనపడదు. కొన్ని నెలలకు నిండు గర్భినిగా చల్లగాలి పీల్చుకోవడానికి వస్తుంది. తర్వాత బుడి బుడి నడకల పాపాయి ని తీసుకొచ్చి ఆడిస్తుంది . ఇది స్త్రీ జీవనగమనం.

పుస్త కాలు తలక్రింద పెట్టుకుని పడుకునే అబ్బాయిలు బహుశా అందులోసారాంశం నేరుగా తలలోకి పోతుందని నమ్ముతారనుకుంటా, తమకు ఇంట్లో చదువుకునేందుకు ప్రశాంతమైన ప్రదేశం లేదని ఇక్కడికొచ్చి,ఇక్కడ ప్రశాంతంగా వుందని నిద్రపోతారు, చదువు సంగతి మర్చిపోతారు. పరీక్షల్లో తప్పి జీవనగమనం తప్పి ,మళ్ళీ ఇదే పార్కుల్లో శాంతి వెతుక్కుంటారు.

అందరిని మౌనంగా చూస్తూ ....మనుషుల్లో కనపడే అనేక భావాల్ని నేను చదువుతూ వుంటాను .నేను ఏళ్ళ తరబడి ఇదే పార్కులో సాయంత్రాలు గడుపు తున్నాను అప్పటి నుండి ఎంతో మంది జీవనపోరాటాలు పరిశీలిస్తుంటాను, ఈ పార్కు నాకిష్టమైన, నా జీవితంతో ముడిపడ్డ ఒక అద్భుత మైన ప్రదేశం . ఇప్పుడు ఈ బంధాన్ని వీడి వెళ్ళాల్సి వస్తోంది.

ఇన్నాళ్ళు నే పనిచేసిన ఎయిడేడ్ కాలేజ్ లో హిస్టరీ సబ్జెక్ట్ తీసివేశారు. ఒకప్పుడు రాయల్ గ్రూప్ గా చెప్పబడ్డ బియ్యే కి విద్యార్థులు లేరు . హిస్టరీ ,ఎకనామిక్స్,పాలిటిక్స్ గ్రూప్ ఎవరూ తీసుకోవడం లేదు . మెరిట్ విద్యార్థులందరూ ఇంజనీరింగ్, మెడిసిన్ లకే వెళుతున్నారు ,ఇంక ఎంసెట్ లో క్యాలిఫై అయిన వాళ్ళకు కూడా ఇంజనీరింగ్ సీట్లు వున్నాయి . ఇంకా అందులో క్యాలిఫై కాని వారిలో కూడా ముందు ఎమ్పీసి ,తర్వాత ఏమ్యీసి ,ఆ తర్వాత బీకాం కంప్యూటర్స్ ఆఖర్న ఏదీ రానివారు ముఖ్యంగా లెక్కలు, సైన్స్ చదివి ఎన్నో సార్లు ఇంటర్లో ఫెయిల్ అయిన వాళ్ళు బియ్యే అదీ ఎంతో బాధతో చేరుతున్నారు .వాళ్లకు ఇంటర్లో సిలబస్ కూడా చెప్పించి ఓ దారికి తెచ్చాక ఆ విద్యార్థులు నిజానికి తర్వాత గ్రూప్ వన్,గ్రూప్ టూ సర్వీసస్ లో ఉత్తీర్ణులై మంచి భవిష్యత్ అందుకున్నారు బ్యాంక్ ఉద్యోగాలు కూడా సంపాదించుకున్నారు. కానీ సాఫ్ట్ వేర్ ఉద్యోగాల మోజులో ధనం సంపాదన ధ్యేయంగా మొదలవుతున్న విద్యార్జన మనిషిని ఏ రకంగా తయారు చేస్తుంది? లోపబూయిష్టమైన విద్యావిధానం, వ్యవస్థ పై సరి అయిన అవగాహన లేని పాలకులు,అధికారులు, పిల్లల అభిరుచిని అర్థం చేసుకోలేని తలిదండ్రుల సంకుచిత స్వభావం, అన్నీ సంఘంలో ఇప్పుడున్న అస్తవ్యస్త స్థితికి కారణం అయారు.


పాతికేళ్ళ అనుబంధం ఈ కాలేజ్ తో నాకు . విద్యార్థులు చేరని కోర్సులన్నిటిని ఇప్పుడు ప్రభుత్వం తొలగించి, మా పోస్ట్ లను ఆధీన పరచుకుని గవర్నమెంట్ కాలేజ్ లలో ఖాళీలు వున్న చోటికి మమ్మల్ని బదిలీ చేస్తోంది ఇన్నేళ్ళు కలిసివున్న లెక్చరర్లమంతా ఎక్కడెక్కడికో వెళ్ళాల్సి వస్తోంది. అందరూ వెళ్ళిపోయారు. చివరిగా నాకు ఇపుడున్న చోటి నుండి దూరంగా వున్న ఒక పట్టణానికి బదిలీ అయింది. కాలేజ్ లో వీడ్కోలు తీసుకుని వచ్చాక గుండె బరువుగా వుంది.


"ఒక్కదానివి ఎందుకమ్మా ఇంకా వుద్యోగం చేయడం ? నా దగ్గరికో అన్నయ్య దగ్గరికో రావొచ్చు కదా! " అంది కూతురు. నవ్వి ఊరుకున్నా . ఇంకో పదేళ్ళు విద్యార్థులతో గడిపే అవకాశం పోగొట్టు కోవడమా ! మనిషి తన గొంతు వినేదానికే అధికంగా ఇష్టపడతాడట ... టీచర్ గంట మాట్లాడితే ఎదురు మాట్లాడకుండా వినేది విద్యార్థులు మాత్రమే ... ! ఆ అదృష్టం వుపాధ్యాయిలకే! యువతరంతో ఎక్కువ సమయం గడిపే అవకాశం కూడా వీరికే వుంది.


ఇల్లు ఖాళీ చేసి లారీలో సామాను పంపి వెనుక కార్లో బయలు దేరబోతూ పార్కు దగ్గర ఆగాను , అంతా కలయ చూసి తోట మాలి రంగన్న దగ్గరకు వచ్చాను . ఎప్పుడూ తోటే ప్రాణంగా చూసుకునే అతనంటే నాకు చాలా గౌరవం , పిల్లలతో, కుర్రాళ్ళతో , పెద్దవాళ్ళతో అందరితో నవ్వుతూ నవ్విస్తూ ఉంటాడు , వయసు పైబడుతున్నా అతనిలో పార్క్ పట్ల నిర్లక్ష్యం చూడలేదు , డబ్బు ఇస్తుంటే "ఎందుకమ్మా...ఇది .. చల్లగా వుండు తల్లి ... బాబు అమ్మను బాగా చూసుకోండి "అన్నాడు మా అబ్బాయితో . వాడు నవ్వుతూ తలూపాడు


పూల మొక్కల్ని ,చల్లని నీడనిచ్చే పెద్ద చెట్లను అపురూపంగా చూసుకుంటుంటే కళ్ళు మసక బారాయి . అభి నా బుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా తీసుకున్నాడు. నా బాల్యం, చదువు, పెళ్లి , పిల్లలు ,అందమైన జ్ఞాపకాలన్న్తిటిని ఇచ్చిన ఈ ఊరిని ఈ పార్కును వదిలి వచ్చాను , మైలు రాళ్ళు ఒక్కొక్కటి పోతోంటే నేను ఏదో ప్రపంచపు దరిదాపులకు వెళుతున్నానని అనిపించింది .


తమ్ముడు లారీతో పాటు కొత్త ఇంటికి వెళితే, నేను, అభితో కాలేజ్ లో జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేదానికి వెళ్లాను. కాలేజ్ చాలా పెద్దది స్టాఫ్ కూడా చాలా మంది వున్నారు. ప్రిన్సిపాల్ పరిచయం చేయగానే అందరు స్నేహపూరితమైన ముఖాలతో సాదరంగా ఆహ్వానించారు. అన్ని క్లాసులకు ప్రిన్సిపాల్ వచ్చి పరిచయం చేశారు. అయిదు ఆరు మంది విద్యార్థులు మాత్రమే వుండే క్లాస్ చూసిన నాకు నలభై దాటిన విధ్యార్థులున్న క్లాస్ లు చూస్తే ఆనందం కలిగింది. మొత్తానికి కాలేజ్ చాలా బావుంది . అభి నా ప్రక్క చూసి నవ్వాడు . అంటే కాలేజ్ నచ్చింది కదా అని అర్థం. నేను సంతోషం తో తలూపాను.


కొత్త ఇల్లు నేను చూడనే లేదు తమ్ముడు, అభి నే చూశారు. చిన్న ఇల్లు ,ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు, మొక్కలు వేసుకోవడానికి చాలా స్థలం వుంది. లారీ లో తెచ్చిన కుండీలన్నిటిని చక్కగా సర్ది పెట్టారు . "ఇల్లు చాలా బావుంది... మొక్కలకు స్థలం వుంది '" తమ్ముడ్ని అభినందనగా చూస్తూ అన్నాను. మామ అల్లుడు నవ్వుకున్నారు. "నీ టెస్ట్ మాకు తెలుసుగా " అన్నాడు . మేం ముగ్గురం, ఇద్దరు పనివాళ్ళు కలిపి ఇల్లంతా సర్డుకున్నాము . మధ్యాహ్నం కంతా సర్ది హోటల్ నుండి భోజనం తెచ్చుకుని తిని పడుకున్నాము . సాయంత్రం లేచి తమ్ముడు బయలుదేరాలి కదా అన్నది గుర్తొచ్చింది .వాడు తయారయివున్నాడు . "జాగ్రత్త... మళ్ళీ వారం కు పిల్లలతో కలిసి వస్తానులే 'అన్నాడు. తలూపాను . రాత్రికి అభి కూడా వెళ్ళిపోతాడు మనసు బాధగా మూల్గింది . "అమ్మా... అలా బయటికి వెళదామా !' అన్నాడు అభి .


"వద్దులే నాన్నా అలిసిపోయాం ! పైగా .. రాత్రికి నీవు వెళ్ళాలి కదా "అన్నా .


"వూరికే అలా వెళదాం.. చూద్దాం ఇక్కడ వూరు ఎలావుందో !' అభి అనడంతో బయలుదేరాం .


వీధి సందు మలుపు తిరగగానే పెద్ద పార్కు . "అరె ఇక్కడ కూడా పార్క్ వుంది .. " నా సంతోషానికి అవధులు లేవు. పార్క్ చాలా చాలా బావుంది .అక్కడి పువ్వులు, లాన్, పెద్ద చెట్లక్రింద బెంచీలు .... అభి నాకేసి చూసి


" ఎలా వుంది కాలేజ్ ,ఇల్లు ,పార్క్ ?" అన్నాడు


" చాలా బావున్నాయి...నేను ఊహించనే లేదు మంచి కాలేజ్, మంచి ఇల్లు, దగ్గరలోనే ఇంత అందమైన పార్క్ కూడా.. అన్నీ చూశావు కదా ఇల్లు పార్క్ కు దగ్గరలోనే వుండాలని " అభి చేయిపట్టుకుని మురిపంగా చూసుకుంటూ అన్నాను .


"అవునమ్మా... మనం భౌతికమైన కొన్ని సౌకర్యాలు ఏర్పర్చుకొగలం... అవి మన చేతుల్లో వున్నాయి అలాగే మన ఆలోచనా విధానం లోనే మన సంతోషం,శాంతి వుంది... ముందు నువ్వు పని చేసిన కాలేజ్ ను , ఆ ఇంటిని, ఎంతో కాలంగా వున్న స్నేహితుల్ని ,ఎన్నో ఏళ్లుగా రోజూ నీవు వెళ్ళే పార్క్ వదలాల్సి వచ్చినందుకు నీవు ఎంత నలిగావో గుర్తుందా !కానీ ప్రపంచమంతా ప్రజలే కదమ్మా ... మనం స్నేహ హస్తం అందిస్తే వెనకడుగు ఎవరూ వేయరు , ప్రజలకి పార్కులు కావాలి ,నర్సరీలు ,గుళ్ళు ,సినిమా హాళ్ళు ,హోటళ్ళు కావాలి, కాబట్టి ప్రతి వూర్లో అవి వుంటాయి . మనం ఏ అడ్రెస్ లో వున్నా మన మన:స్థితి ఒకేలా వుంటుంది . ఇక్కడి నుండి రెండేళ్లకు మళ్ళీ నీకు ట్రాన్స్ఫర్ కావొచ్చు ... అప్పుడు మళ్ళీ దీన్ని వదలడానికి నీవు బాధపడకూడదు . ఈ నిముషం లో ఇది నీది, రేపు గురించి ఆలోచించకు ... నీవు సంతోషంగా వుండాలమ్మా ... నీవు బాధపడితే నేను చూడలేనమ్మా ..". అభి గొంతులో నా పట్ల వున్న ప్రేమకు , కన్సెర్న్ కు కదిలి పోయాను ... అదే నిముషం లో వాడు చెప్పిన సిద్దాంతం అమలు అంత సులభమా ! ఇప్పటి యువతరం మా తరం కంటే... గొప్పగా ఆలోచిస్తున్నారా ... ! మా తరం లోని సెంటిమెంట్స్ అంత విలువ లేనివా ! కానీ అభి చెప్పింది నిజమే ... ప్రపంచం ప్రేమ మయం... ఇస్తుంటే వస్తుంది , " అభిని కళ్ళతోనే మెచ్చుకుని భుజం తట్టా . రాత్రి అభి తన ఉద్యోగ ధర్మం కోసం వెళ్ళిపోయాడు . అమెరికాలో హడావుడిగా ఆఫీసుకు వెళుతున్న కూతురు అని తో కాసేపు ఫోన్లో మాట్లాడి పడుకున్నా .


ఉదయం క్లాస్ లో వున్న నన్ను ప్రిన్సిపాల్ పిలిపించారు ... "సారీ మేడం ముందున్న హిస్టరీ మేడం కోర్ట్ నుండి స్టే తెచ్చారు ... రిటైర్ అయేముందు ట్రాన్స్ఫర్ చేయకూడదని ... మీరు కమీషనర్ ఆర్డర్స్ వచ్చేవరకు వెయిట్ చేయాలి ... మీకు ఎక్కడ ఇస్తారో మరి, పాపం... నిన్ననే వచ్చారు , ముందయినా తెలిసివుంటే ,జాయిన్ కాకుండా వుండేవారు , మళ్ళీ ఎక్కడ వేస్తారో! మళ్ళీ ఇల్లు వెతుక్కోవడం ... అంతా పెద్ద ప్రయాస .. ఏంటో ఇలాగ జరిగింది ." సంజాయిషీ గా అన్నాడు


"పర్లేదు సర్... ఇది జీవన గమనం...మన ఉద్యోగాలు అంతేకదా ! ఎక్కడకు వేస్తే అక్కడికి వెళతాను ... " మనసులో కొంచం కూడా కల్లోలం లేకుండా ప్రశాంతంగా ఇంటికి వచ్చి పడుకున్నా. ఆర్డర్స్ వచ్చేవరకు చాలా చదవాల్సిన పుస్తకాలున్నాయి .. అన్నీ చదివేయాలి . అనుకుంటూ .


--

ప్రచురణ: జాబిల్లి, డిశంబర్ 2016

No comments:

Post a Comment