“నేను ఏ దేశం లో వున్నా లాటిన్ అమెరికాకు చెందిన వాడిగానే అనుకుంటాను, అయితే నా మాతృభూమి అరకటక పై నాకున్న స్వదేశీ బ్రాంతిని త్యజించలేదు, ఎందుకంటే అక్కడే నేను ఒకరోజు వాస్తవానికి, బ్రాంతికి మధ్య గల తేడాను నా కథకు వస్తువుగా కనుగొన్నాను.” - గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్
యాభై ఏళ్ల క్రిందట గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ తన నవల “సియన్ అన్యోస్ సోలేడెడ్” స్పానిష్ భాషలో రాశారు (దీన్ని ఇంగ్లిష్ లో “వన్ హండ్రెడ్ యియర్స్ ఆఫ్ సాలిట్యూడ్” గా అనువాదం చేశారు తెలుగులో మనం “వందేళ్ల ఏకాంతం“అనుకుందాం) ప్రపంచ సాహిత్యంలో ఒక ఉన్నతస్థానం అధిరోహించిన ఈ నవల అచ్చయి యాభై ఏళ్ళు అయినా తన ఆకర్షణను కోల్పోలేదు, ఇంకా ఎక్కువ ఆదరణకు నోచుకుంటోంది. ఇటీవలే ది హారి రాన్సం సెంటర్, టెక్సాస్ యూనివర్సిటీ $2.2 మిలియన్లు చెల్లించి అతని రచనల్ని సొంతo చేసుకున్నారు. అందులో స్పానిష్ లో టైప్ చేయబడిన మార్క్వెజ్ గొప్ప రచన “సియోన్ అనోస్ డే సొలిడెడ్” (వందేళ్ల ఏకాంతం) కూడా వుంది. ఈ గొప్ప నవలను రాయడానికి మార్క్వెజ్ ను ప్రేరేపించిన పరిస్థితులు ఏమిటో చూద్దాం.
ఉత్తర కొలంబియాలోని “అరకటక” అనే చిన్న పట్టణంలో మార్చ్ 6న 1928లో శాంటియాగో మార్క్వెజ్ , గేబ్రియల్ ఎలిగో మార్క్వెజ్ లకు గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ జన్మించారు. చాలా పేదరికంలో వున్న మార్క్వెజ్ తల్లిదండ్రులు మార్క్వెజ్ పెంపకాన్ని వాళ్ళ అమ్మమ్మ తాతయ్యలకు ఇచ్చారు. అదే సమయంలో బనానా బూమ్ స్ట్రైక్, దాన్ని అణచి వేయడానికి ప్రభుత్వo చేపట్టిన క్రూరమైన చర్యలు, వందలకొద్దీ సమ్మకారుల హత్యలు, వాళ్ళను ప్రభుత్వమే సామూహికoగా సమాధి చేయడం పట్టణాన్ని కుదిపివేశాయి. ఈ భయంకర నేపథ్యంలో మార్క్వెజ్ బాల్యం గడిచింది. ఇదే అతని “వందేళ్ల ఏకాంతం” లోను ఇంకా ఇతర రచనలలోనూ తరచు చర్చకు రావడం పాఠకులు గమనించవచ్చు.
మార్క్వెజ్ నిరాశలో కొట్టుమిట్టాడుతున్నప్పుడు జర్నలిస్ట్ గా తన కుటుంబానికి కనీస అవసరాలు కూడా తీర్చలేక ఘర్షణపడుతున్నప్పుడు అతని తల్లి అతన్ని “అరకటక” ఆమె స్వగ్రామం, మార్క్వెజ్ చిన్నప్పుడు పెరిగిన వూరికి తీసికెళ్ళింది. అరకటక లోని ప్రజల దైన్యాన్ని, పేదరికాన్ని, నిస్సహాయతని చూసి చలించిపోయిన మార్క్వెజ్, “అరకటక” ఆత్మఘోషని తన ఆత్మతో విన్నాడు. అదే అతని నవల “వందేళ్ల ఏకాంతం”లో “మకాండో “ గ్రామంగా ఊపిరి పోసుకోవడానికి కారణం మయింది. ఆ గ్రామం జీవనాడిని పట్టుకున్న “వందేళ్ల ఏకాంతం “నవల లాటిన్ అమెరికన్ సాహిత్యంలో ఒక మైలు రాయిగా నిలిచిపోయింది. కొలంబియా లోని “అరకటక ” “మకాండో” అనే వూహ గ్రామంగా ఎలా రూపు దిద్దుకుంది? దీనికి మనకు మార్క్వెజ్ కుటుంబచరిత్ర తో పాటు కొలంబియా చరిత్ర కూడా తెలియాలి. ఎందుకంటే ఇదే అతని “వందేళ్ల ఏకాంతం”నవలకు, ఇంకా అనేక కథలకు,నవలలకు నేపథ్యంగా ఉంటుంది కాబట్టి.
కొలంబియా చరిత్ర
కొలంబియా 1810లో స్పెయిన్ నుండి స్వాతంత్రం పొందిoది. కొలంబియా లాటిన్ అమెరికన్ దేశాల్లో మొట్టమొదటి ప్రజాస్వామ్య దేశం అయినప్పటికీ, స్వతంత్రం వచ్చి వందేళ్లు అయినా శాంతిభద్రతలు, న్యాయం, ధర్మం, చట్టం అక్కడ కొరవడ్డాయి. ఇంగ్లిష్, స్పానిష్ పాలకులు కొలంబియా భూమిని బంగారం కొరకు చిన్నాభిన్నం చేశారు. నెపోలియన్ స్పెయిన్ రాజును 1810లో కొలంబియా నుండి తరిమివేశాక కొద్దీ కాలం స్వేచ్ఛను అనుభవించిన కొలంబియా, మళ్ళీ 1815లో జనరల్ మురీల్లో దాడులతో అట్టుడికి పోయింది. 1820లో సైమన్ బోలివర్ దేశాన్ని దాస్యం నుండి విముక్తి కలిగించి మొట్టమొదటి ప్రెసిడెంట్ గా బాధ్యతను తీసుకున్నాడు. దేశం “లిబరల్స్”, “కన్జర్వేటివ్స్” అనే రెండు రాజకీయ పార్టీలు గా విడిపోయి తమ జగడాన్ని పునరావృతం చేశాయి. ఈ రెండు పార్టీల గురించి మనకు మార్క్వెజ్ రచనల్లో అవగతమవుతుంది. రెండు పార్టీలు ఏ రకమైన నైతిక విలువలకు కట్టుబడి వుండవు, రెండూ అవినీతిని, లంచగొండితనాన్ని ప్రోత్సహించాయి మరియు ఎపుడూ పరస్పరం నిందించుకునేవి కూడా. నిజానికి కొలంబియా విషాదచరిత్ర మొత్తంలో రెండు పార్టీలు ఎప్పుడూ ప్రత్యక్ష యుద్ధం చేస్తున్నట్లుగా అనిపించేది.
19వ శతాబ్దం మొత్తం తిరుగుబాటుదారులు, స్థానికంగాను, జాతీయ స్థాయిలోను అంతర్యుద్ధం చేస్తూనే వున్నారు. ఒక శతాబ్దపు రక్తపాతం “వెయ్యి రోజుల యుద్ధం“ తో 1902 లో లిబరల్స్ ల ఓటమితో అంతమైంది. 10లక్షల మంది ప్రాణాల్ని బలిగొన్న ఈ యుద్ధంలో ఎక్కువగా రైతులు, రైతుకూలీలు వాళ్ళ పిల్లలు బలయ్యారు. మార్క్వెజ్ తాతగారు ఈ యుద్ధంలో పాల్గొన్నారు, ఇంకా మార్క్వెజ్ బంధువులు అనేక పాత్రలరూపంలో ఈ యుద్ధంలో అమరులవడం మనం మార్క్వెజ్ రచనల్లో చూడగలం.
కొలంబియా చరిత్రలో మరొక విషాదకర ఘట్టం 1928 లో జరిగిన “బనానా సమ్మె - ఊచకోత”. దీని ప్రభావం మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” లోను, ఇంకా ఇతర రచనలలోనూ గమనించగలరు. అరటిపళ్ళు కొలంబియా ఆర్ధిక వ్యవస్థపై ఎంతో ప్రభావం చూపేవి.ఎందుకంటే కొలంబియా మొత్తం అరటిపళ్ళను పండించేవారు. వాటిని “యునైటెడ్ ఫ్రూట్ కంపెనీ” ఒక్కటే కొనుగోలు చేసి గుత్తాధిపత్యం చేయడమే కాకుండా తక్కువ ధర ఇచ్చి రైతులను దోపిడీ చేసేది. అరకటక ప్రాంతమంతా కూడా అరటి పండించేవారు. అక్టోబర్ 1928 లో “సియెనగా” అనే ప్రాంతంలో “అరకటక”కు 30 కిలోమీటర్లు దూరం లో 32000 మంది రైతులు కూలీలు సమ్మె ద్వారా తమ నిరసన వ్యక్తం చేయడానికి గుమిగూడారు. సమ్మెను అణచి వేయడానికి ప్రభుత్వం సైనికులను పంపింది. నిరాయుధులైన రైతులపై, కూలీలపై సైనికులు జరిపిన కాల్పుల్లో వందల కొద్దీ మరణించారు. తర్వాత కూడా కొన్ని నెలలపాటు ఎంతో మంది ప్రజలు అదృశ్యం అయ్యారు.వాళ్లకు సంబంధించిన వివరాలు ఎవరికీ తెలియలేదు, సీయోనగా ఉదంతం జరిగినట్లు అధికారులు అంగీకరించలేదు, దాని గురించి విచారణ జరగలేదు. అంతేకాదు ఆ ఉదంతం ఎక్కడా ప్రస్తావించడం జరగకపోగా చరిత్ర పుస్తకాల నుండి కూడా దాన్ని తొలగించారు. దీన్ని మార్క్వెజ్ పూస గుచ్చినట్లు తన “వందేళ్ల ఏకాంతం” నవలలో వివరంగా సజీవoగా చూసినట్లు రాశారు. ఒక నవల మరుగున పడ్డ చరిత్రను త్రవ్వి తీసి చరితార్థం చేయగలదు అనడానికి ”వందేళ్ల ఏకాంతం“ ఒక మంచి ఉదాహరణ. అంతేకాదు వాస్తవాన్ని గ్రంధస్తం చేయడం ద్వారా దానికి అమరత్వాన్ని కూడా రచయిత ఆపాదించగలడు.
“లా వయిలెన్స్” లేక “ది వయిలెన్స్” మార్క్వెజ్ నవలలో తరచుగా వినపడే పదాలు. దీనికి మూలాలు “బనానా ఊచకోత“ లో వున్నాయి. జోర్గ్ ఎలిసెర్ గైటాన్ అనే రైతు నాయకుడు పేదలపాలిట పెన్నిధిగా ఉంటూ పార్టీ నాయకుడుగా ఎదిగాక 1947లో ఎన్నికలప్పుడు హత్య చేయబడ్డాడు. పట్టణమంతా మూడురోజులపాటు అల్లర్లు, మారణకాండ చెలరేగాయి, 2500 మంది దాకా చనిపోయారు. రెండు పార్టీల వాళ్ళకు గెరిల్లా సైన్యం వుంది. గెరిల్లా సైన్యం చేసిన ఘాతుకాలు దేశాన్ని ఉడికించాయి. పల్లెలు, పట్టణాలు మంటలకు ఆహుతి అయ్యాయి, వేలకొద్దీ ప్రజలు ఆ మంటల్లో కాలిపోయారు. వారిలో స్త్రీలు, పిల్లలు వున్నారు. సైనికులు పంటలు పoడించకుండా పొలాల్ని జ్యప్తు చేశారు. లక్షల కొద్దీ రైతులు దేశాన్ని విడిచి పెట్టి పోయారు. 1949 లో కన్సర్వేటివ్ పార్టీ వాళ్ళు లిబరల్ పార్టీ నాయకుడ్ని కాంగ్రెస్ హాల్లోనే అతను ఉపన్యాసం ఇస్తుండగా చంపివేశారు. కాంగ్రెస్ ను రద్దు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నామని చాటి లిబర్లల్స్ ని వేటాడి వేటాడి చంపివేశారు. దేశాన్ని ఛిద్రం చేసిన “లా వయిలెన్స్” 150,000 కొలంబియన్స్ ని 1953 వరకు బలి తీసుకుంది. ఇదే నేపథ్యం “వందేళ్ల ఏకాంతం”లో మనకు కనపడుతుంది.
మార్క్వెజ్ కుటుంబం - పెంపకం ప్రభావం
మార్క్వెజ్ కుటుంబంలోని వ్యక్తులు, బంధువులు అతని పెంపకంపై ప్రభావం చూపినట్లు ఆయన తన రచనల్లో తరచు పేర్కొంటారు. అందరిలోకి మార్క్వెజ్ అమ్మమ్మ ట్రాంక్విలోనా ఇగురాన్ కోట్స్ , తాతయ్య కల్నల్ నికోలస్ రికార్డో మార్క్వెజ్ మెజా ప్రభావం ఎక్కువుంది.మార్క్వెజ్ తాతయ్య లిబరల్ పార్టీకి చెందిన ప్రముఖుడు. “వార్ అఫ్ థౌజండ్ డేస్” లో పాల్గొన్నాడు. “అరకటక” నిర్మాణానికి అతనే బాధ్యుడు, వూర్లో కూడా కథానాయకుడిగా, పెద్ద మనిషిగా గుర్తింపు వున్నవాడు. ఎందుకంటే బనానా ఊచకోత జరిగినప్పుడు అతను ఒక్కడే అధికారుల్ని నిలదీశాడు. 1929 కాంగ్రెస్ లో జరిగిన మారణహోమం గురించి తన గొంతెత్తి ప్రశ్నించినవాడు కల్నల్ నికొలస్. కల్నల్ నికొలస్ మంచి కథకుడు, అతనెన్నో రహస్యాల్ని తనలో దాచుకున్నాడు.అతను వయసులో ఉండగా ద్వందయుద్ధంలో ఒకతన్ని చంపాడు. ఆ హత్య అతని జీవితాంతం అపరాధభావం కలిగేట్లు చేసిందని మనుమడైన మార్క్వెజ్ తో చెప్పాడు. ఆ రోజుల్లో యుద్ధం చేయడం కుర్రాళ్ళకు తుపాకులతో చేసే ఒక ఆట లాగా అనిపించిందoటాడు.
మార్క్వెజ్ కు అతను చిన్నప్పుడు ఎన్నో కథలు చెప్పేవాడు, ప్రతి ఏడు సర్కస్ కు తీసికెళ్ళేవాడు అంతేకాదు ఐస్ ను మొట్ట మొదటిసారిగా మార్క్వెజ్ కు అతనే పరిచయం చేశాడు. ఈ విషయాలన్నీ మార్క్వెజ్ తన రచనల్లోని పాత్రలతో చెప్పిస్తాడు. మార్క్వెజ్ అమ్మమ్మ ట్రాంక్విలోనా ఇగురాన్ కోట్స్ కూడా అతని పై చాలా ప్రభావం చూపింది. ఆమె చాలా మూఢనమ్మకాలు కలిగివుండేది. జానపదుల కుండే విశ్వాసాలు, దెయ్యాలు, భూతాలు, శకునాలను నమ్మేది. కథల్లో ఈ నమ్మకాల్ని కలిపి మార్క్వెజ్ కు కథలు చెప్పేది. అయితే మార్క్వెజ్ తాతయ్య కు ఇవేవీ నమ్మకం ఉండేదికాదు, పైగా వీటిని నమ్మొద్దని మార్క్వెజ్ ను హెచ్చరించేవాడు. అయితే మార్క్వెజ్ వాటిని నమ్మేవాడు. ఆమె కథ చెప్పే విధం ప్రత్యేకంగా ఉండేది, అతనికి తెగ నచ్చేది. అవి ఎంత ఊహాజనకంగా వున్నా, ఎంత నమ్మశక్యం కాకున్నా మార్క్వెజ్ కు ఆమె కథలను నమ్మే విధంగా చెప్పేది అవి నిజంగా జరిగినట్లుగా అతనికి అనిపించేవి. ఇదే పద్దతిని కథ చెప్పడానికి ముప్పై ఏళ్ల తర్వాత మార్క్వెజ్ అవలంభించి ప్రపంచ పాఠకుల్ని మెప్పించాడు. మార్క్వెజ్ తన రచనల్లో ఉపయోగించే మౌఖిక కథనం అతను బాల్యంలో అతని అమ్మమ్మ దగ్గర విని నేర్చుకున్నదే అయితే దాన్ని ప్రకటించిన విధానం అతని రచనలకు చాలా బాగా సరిపోయింది. అంతేకాదు నిజ జీవితంలో వున్న వాటికంటే ఎక్కువ వివరణ ఇవ్వడానికి మౌఖిక కథనంతో పాటు మాజిక్ రియలిజం అనే సాహితీ ప్రక్రియ అతనికి ఎక్కువ ఉపయోగపడింది.
ఏకాంతంలో ఉద్భవించిన వందేళ్ల ఏకాంతం
తన తల్లితో కలిసి “అరకటక” లోని మరమ్మత్తు చేయడానికి వీలుకాని తన తాతగారి ఇల్లు అమ్మడానికి వెళ్ళినప్పుడు మార్క్వెజ్ తన చిన్ననాటి జ్ఞాపకాల సుడిగుండాల్లో చిక్కుకుపోయారు. ఆ పట్టణమంతా స్తంభించిన కాలం చిక్కుకుపోయిందనిపించింది. అప్పటికే అరకటకలోని ఆ ఇంటిలో తన జ్ఞాపకాల నేపథ్యంతో “లా కస“ అనే నవల రాయాలని అనుకున్నాడు. “అరకటక” వచ్చివెళ్లిన అనుభవాల్ని నేపథ్యంగా అతని మొదటి చిన్న నవల “లీఫ్ స్టార్మ్ “ రాశాడు. అది ఒక రకమైన శక్తివంతమైన ప్రేరణతో నడిచింది. నిజానికి దానికి “ మకాండో ” అని పేరు పెట్టాడు. “మకాండో” అంటే బంటు భాషలో “అరటి” అని అర్థం. అయితే దాన్ని 1952 లో పబ్లిషర్లు తిరస్కరించారు. మార్క్వెజ్ దాన్ని టేబిల్ డ్రాయర్లో గిరాటేశాడు. తిరస్కారం, పేదరికంలో వున్నా, వేశ్య లుండే ఒక అపార్ట్మెంట్ లోనే ఒక గదిలో ఎంతో మంది స్నేహబృందం చుట్టూ ఉండగా మార్క్వెజ్ ఎంతో సంతోషంగా ఉండేవాడు. “ఎల్ హెరాల్డో “ అనే పత్రికకు “కాలమ్” రచయితగా పనిచేసేవాడు. సాయంత్రాలు కాఫీలు, సిగరెట్లు, స్నేహితుల మధ్య రచనలు చేసేవాడు.
1953 లో అతనిలో అకస్మాత్తుగా ఒకరకమైన అలజడి మొదలైంది. కొంతకాలం గమ్యం లేకుండా ప్రయాణం చేశాడు. కొన్ని కథలకు కావాల్సిన ముడి సరుకు కోసం ఆలోచనలు చేస్తుండేవాడు. కమ్యూనిస్ట్ పార్టీ లో కొంతకాలం సభ్యత్వం తీసుకున్నాడు, చిన్నప్పుడు తాతగారు తీవ్రవాద లిబరల్ నాయకుడిగా మార్క్వెజ్ పై ఎంతో ప్రభావం వుంది. మార్క్సిస్టు భావాల్ని ప్రేమించడం అతనికి స్కూల్ టీచర్లు నూరి పోశారు. అయితే మార్క్వెజ్ కమ్యూనిస్టులతో వుండే దురభిమానంను వ్యతిరేకించాడు. కానీ వామపక్షాల విషయాల పట్ల మార్క్వెజ్ సుముఖంగా ఉండేవాడు భావిలో సోషలిజమే ప్రపంచాన్ని నిర్దేశిస్తుందని నమ్మేవాడు.
“లా వయిలెన్సియా“ కాలంలో రచయితగా జర్నలిస్ట్ గా తన ధర్మం చేస్తున్నా అప్పటి నియంత రోజర్స్ పినిల్లా కంటపడకుండా ఉండడం అప్పుడు తప్పని సరిగా ఉండేది. 1955 లో “ఎల్ ఎస్పెక్టేటర్“ లో అదృశ్య రచయితగా పనిచేశాడు. పినిల్లా గవర్నమెంట్ “ఎల్ ఎస్పెక్టేటర్” మూయించడంతో మార్క్వెజ్ వుద్యోగం పోయింది. అప్పుడే హేమిoగ్వే రచనలు అతన్ని విపరీతంగా ఆకర్షించాయి.”ఇన్ ది ఈవిల్ అవర్ “ అనే నవల రాశారు. కానీ అతని మెదడులో తుఫాన్ రేపుతున్న “మకాండో “అతన్ని వదిలి పెట్టడం లేదు . అయితే “మకాండో “ కథను కాగితంపై పెట్టడానికి అతనికి సరైన ప్రేరణ లభించలేదు.
కమ్యూనిజం కూడా “లా వయిలెన్సియా“తో లాగే హింసాత్మకంగా మారడంతో మార్క్వెజ్ నిర్వేదానికి, నిరాశకు లోనయ్యాడు. కొలంబియా అధ్యక్షుడు మెమెంటోస్ అమెరికన్ సామ్రాజ్యవాదానికి, నిక్సన్ కు లొంగిపోవడంతో మార్క్వెజ్ దంపతులు మెమొంటోస్ ప్రభుత్వం నుండి దూరం వెళ్లిపోయారు. తర్వాత మార్క్వెజ్ కాస్ట్రో ఉద్యమానికి ఆకర్షితులు కావడం ఆ తర్వాత కాస్ట్రో వార్త ఏజెన్సీ” ప్రేన్సా లాటినా“ లో పని చేయడంతో పాటు కాస్ట్రో కు మంచి స్నేహితుడయ్యాడు. కొన్ని సినిమాలకు సబ్ టైటిల్స్ రాయడం తో పాటు కొన్ని కాల్పనిక నవలలు రాశాడు. “నో వన్ రైట్స్ టు ది కల్నల్ “ 61లో “బిగ్ మమాస్ ఫ్యునెరల్” 62 లో ప్రచురితం అయ్యాయి. అతని ఏ నవల కూడా 700 కాపీల కంటే ఎక్కువ అమ్ముడు పోకపోగా, నవలలపై ఏ రాయల్టీ రాకపోయినా మార్క్వెజ్ మనసులో “మకాండో” మీద నవల రాయడం మీద మనసు తగ్గలేదు.
జనవరి 1965లో కుటుంబంతో సెలవులో గడపడానికి వెళుతుండగా మార్క్వెజ్ కు అకస్మాత్తుగా మెరుపులా మకాండో వాణి వినిపించింది.మార్క్వెజ్ కు ఆ వాణి “వందేళ్ల ఏకాంతం” నవల ఎలా రాయాలో స్పష్టంగా తెలిపినట్లైంది. ఎంత స్పష్టంగా అంటే అప్పటికప్పుడు ఆయన టైపిస్ట్ కు మొదటి చాప్టర్ లోని పదం, పదం డిక్టేట్ చేయగలిగేంత స్పష్టంగా. మార్క్వెజ్ తన భార్య మెర్సిడెస్ కు కుటుంబ బాధ్యత అప్పహించి తాను 18 నెలల వరకు తన గదిలో తనని తానే బందీని చేసుకున్నాడు. ఇల్లు జరగడానికి కారు అమ్మేశారు,ఇంట్లో వస్తువులన్నీ కుదవకు వెళ్లిపోయాయి. స్నేహితుల సహాయంతో పాటు అప్పులవాళ్ళు కూడా ఉదారంగా అప్పులిచ్చారు ఎందుకో అందరికి ఒక గొప్ప రచన వెలువడుతోందని అనిపించింది.
మెక్సికో సిటీలో ప్రశాంత వాతావరణం వున్న ఒక ఇంటిలో రాతబల్ల (స్టడీ టేబిల్) దగ్గర అంతకు ముందెప్పుడూ అనుభవంలోకి రాని తర్వాత కూడా అలాంటి అనుభవం తెలియని స్థితిలో రోజుకు 60 సిగరెట్లు కాలుస్తూ మార్క్వెజ్ తన ఏకాంతాన్ని కనుగొన్నాడు. రికార్డు ప్లేయర్ నడుస్తుండేది. కరీబియన్ పట్టణం “మకాండో” యొక్క చరిత్ర, బుయండియాస్ వంశవృక్షాన్ని తెలిపే పటాలున్న గోడపై మార్క్వెజ్ చూపులు నిలిచిపోయేవి. మార్క్వెజ్ భౌతికంగా వున్నది 1960లలో మెక్సికోలో, అతని అంతరంగం మాత్రం 1920లో కొలంబియాలో ఉండేది. మార్క్వెజ్ టైప్ రైటర్ ముందు కూర్చుంటే కొలంబియా గత చరిత్రలోని పాత్రలు ఆవహించేవి. అతనా సమయంలో మకాండో ప్రజలు నిద్రలేమి అనే వ్యాధితో ఎలా బాధపడేవారో చూడగలిగేవాడు, సాహసికులైన యువకులు కొలంబియా అంతర్యుద్ధంలో ఎలా పాల్గొన్నారో అతని కళ్ళకు కట్టినట్లుండేది, బనానా ఊచకోతకు గురైన అమాయకుల శవాలు రాత్రికి రాత్రి ఎలా రైళ్లలో రవాణా అయ్యాయో మార్క్వెజ్ కు తెలుస్తుండేది. తప్పిపోవడం అంటే ఇంకెప్పుడూ కనపడకుండా పోవడం అనే సత్యాన్ని జీర్ణించుకోవడాన్ని ఆపై ఎప్పుడూ పోలీసుల్ని తప్పి పోయిన వాళ్ళ గురించి విచారించమని అడగరాదనే జ్ఞానాన్ని కుటుంబ సభ్యుల కలిగివుండడం చూసి విస్మయం చెందేవాడు. “కలల్లో నేను సాహిత్యాన్ని కనుగొన్నాను “ అన్నాడు మార్క్వెజ్. బయటి ప్రపంచం ఏమిటో తెలియకుండా గదిలో తనని తాను బంధించుకున్న మార్క్వెజ్ గది తలుపులు భోజనం వేళకు, సిగరెట్ల కోసం మాత్రమే తెరుచుకునేవి.
రోజులు గడుస్తున్నకొద్దీ టైప్ చేయబడిన గొప్ప నవల పేజీలు పెరుగుతున్నకొద్దీ అతనింట్లో అన్ని వస్తువులు తాకట్టు కు వెళ్లిపోయాయి.1966 సంవత్సరం ఆఖరుకు నవల పూర్తయింది. తర్వాత ప్రెస్ నుండి మే 30, 1967లో బయటికి వచ్చిన ఈ నవల స్పానిష్ పాఠకలోకాన్ని బీటిల్స్ కంటే ఎక్కువ ఉర్రూతలూగించింది. “వందేళ్ల ఏకాంతం” వెలువడ్డాక వారం లోపల 8000 కాపీలు అమ్ముడుపోయాయి, మూడేళ్ళలో 5లక్షల కాపీలు అమ్ముడయ్యాయి. మార్క్వెజ్ కు అప్పటికి 39ఏళ్ల వయసు. అభిమానుల అభినందనలు,ఇంటర్వూలు, అవార్డులు ఎంతో కీర్తి ఆ వయసుకు అది గొప్ప ఘనకార్యమే .
మాజిక రియలిజం అనే లాటిన్ అమెరికన్ సాహితీ ప్రక్రియను మార్క్వెజ్ తాను తీసుకున్న లాటిన్ అమెరికన్ చరిత్ర చెప్పడానికి ఎంతో నేర్పరితనంతో వాడాడు. ఒక కొత్త ఒరవడిని సృష్టించిన ఈ నవల మరియు నవలాకారుడు మార్క్వెజ్ ఒక అద్భుతంగా చూడబడ్డారు. 1970 లో దీన్ని గ్రెగొరీ రాబసా ( Gregory Rabassa ) ఇంగ్లిష్ లోకి అనువాదం చేశాక 1970లో పేపర్ బ్యాక్ ఎడిషన్ మండే సూర్యుడి చిత్రం తో వచ్చిన “వందేళ్ల ఏకాంతం“ నవల ఆ దశాబ్దం సాహిత్యంలో విజయ చిహ్నాంగా ఉండిపోయింది. 1982 లో మార్క్వెజ్ కు నోబెల్ ప్రయిజ్ వచ్చాక ప్రపంచపు నలుమూలలకు “ఏకాంతం” వెళ్లగలిగింది. “డాన్ కిక్సాస్” (Don Quixote ) నవల తర్వాత స్పానిష్ సాహిత్యంలో అంతగా ప్రభావం చూపిన నవలగా“ వందేళ్ల ఏకాంతం“ పేరొందింది.
మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” గురించి మాట్లాడుతూ ఇలా అన్నారు“ నేను నా నవల రాసేప్పుడు మా అమ్మమ్మ కథ చెప్పే పద్ధతినే పాటించాను ఎందుకంటే ఆమె కథలో అతీంద్రియ శక్తుల గురించి గానీ, అద్భుతాల గురించి చెప్పేటప్పుడు ఎంతో సహజంగా ఉండేది ఆమె ముఖకవళికల్లో ఏ రకమైన మార్పు ఉండేది కాదు. నేను ముందు రాసిన పుస్తకాల్లో కథ చెప్పేప్పుడు అమ్మమ్మ చెప్పినవి పాటించలేదు . ఇప్పుడు నాకు తెలిసింది ఆ అద్భుతాల్ని నమ్మిన తర్వాతనే అలా భావరహితమైన వదనంతో అమ్మమ్మలా కథ చెప్పగలనని.”
“వందేళ్ల ఏకాంతం “ నవల మార్క్వెజ్ సమకాలికులైన రచయితల మనోభావాల్ని కూడా వ్యక్తం చేసింది . తాము చెప్పలేని భావాల్ని మార్క్వెజ్ తన నవలలో చెప్పారని రచయితలు భావించారు . “ఏకాంతం “ ఒక సంపూర్ణమైన నవల, అది లాటిన్ అమెరికాను సామాజిక, ఆర్ధిక, సాంసృతిక, రాజకీయ, చారిత్రక, పౌరాణిక, ఇతిహాసిక కోణంలో కలవరపరిచే విధంగా అతి సహజంగా ఆవిష్కరించింది. “ఏ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం? నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణత్వం, నరజాతి చరిత్ర సమస్తం, దరిద్రులను కాల్చుకుతినడం, బలవంతులు దుర్బలజాతిని, బానిసలను కావించారు..నరహంతకులు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధి కెక్కిరి,రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదకిన దొరకదు..గతమంతా తడిసె రక్తమున, కాకుంటే కన్నీళులతో ” శ్రీ శ్రీ చెప్పిన ఈ మాటల్లో లాటిన్ అమెరికా దేశమే ఏమీటి, భారత దేశమే ఏమిటి ? సమస్త భూప్రపంచము యొక్క చరిత్ర ఉందని అనిపిస్తుంది.
మార్క్వెజ్ పై ప్రభావాలు తన అమ్మమ్మే కాకుండా కాఫ్కా ప్రభావo కూడా తన రచనలపై ఉందని మార్క్వెజ్ చెప్పాడు. ఫాక్నర్ పౌరాణిక పట్టణం యోక్నాపఠాఫా (Yoknapatawpha) నుండి మకాండో ఉద్భవించిందని, మార్క్వెజ్ ”ఏకాంతం” నవలకు ముందు రాసిన రచనల్లో ఏదో కొరవడిందని అవి మరీ సంక్షిప్తంగా ఉన్నాయనిపిస్తోందని, అవి కేవలం మేధస్సు మధనంతో రాసినవి తప్ప, హృదయ స్పందనతో రాసినవి కాదని, వాటిలో జీవం నింపడానికి ఫాక్నర్ లాంటి వాళ్ళ రచనలు దోహదం చేశాయని, రచయిత తనకు చేరువగా వున్న వాటిని పరిశీలించి రాయాలన్న విషయాన్ని తాను గ్రహించాకే తనకు తృప్తి కలిగించే రచనలు చేశానని చెప్పుకున్నారు.
సోఫుకల్స్ “ ఎడిపస్ రెక్స్”, “ అంటిగొనే ” నుండి కూడా సంఘం, అధికారం, దాని దుర్వినియోగం లాంటి విషయాలు” ఏకాంతం” నవలకు తీసుకున్నానని, మొట్టమొదటి సారిగా మాజిక్ రియలిజాన్ని తన నవలలో వాడిన అలీజో కార్పెంటర్ ప్రభావం కూడా ఉందని చెప్పుకున్నారు.
ఏకాంతం నవలలో ఏముంది ?
మొదటి సారి “వందేళ్ల ఏకాంతం “చదివినప్పుడు నవల ఒక ప్రాంతం యొక్క చరిత్రగా మకాండో అనే పట్టణo గురించి, బుయాండియో కుటుంబలోని ఏడు తరాల చరిత్ర చదువుతున్నట్లుగా అనిపిస్తుంది. ఈ స్థానిక చరిత్ర నిజానికి ప్రత్యేకించి కొలంబియాను మరియు లాటిన్ అమెరికన్ దేశాల స్థితిగతుల్ని, విధివిధానాల్ని తెలియజేస్తుంది. అస్పష్టమైన ఇతిహాసకాలం నుండి జరుగుతున్న చరిత్ర, ఈనాటికీ జరుగుతూ వున్న అంతంలేని అంతర్యుద్ధాలు, వాటికి కారకులైన నియంతలు, సైనిక తిరుగుబాట్లు, కొద్ది కాలమే నిలిచిన ప్రజాస్వామ్యాలు, ప్రజల అగచాట్లు, తిరుగుబాట్లు, సమ్మెలు, అణచివేతలు, విప్లవాలు , విప్లవనాయకుల వెన్నుపోటు రాజకీయాలు, మరియు అమెరికా నావికాదళం చొరబాటు, విప్లవాన్ని అణచడానికి CIA విరాళాలు ఎక్కువ రావడం, ఇవన్నీ ఒక దేశాన్ని ఎంతగా నాశనం చేయొచ్చో అంత చేశాయి.
నవలలో 15 వ శతాబ్దంలో కొలంబియా పై స్పానిష్ విజయానికి చిహ్నంగా స్పానిష్ “రాగి పథకం ” మునిగి పోయిన అతి పెద్ద వ్యాపార ఓడ సూచిస్తాయి. తర్వాత వరుసగా స్థానిక ఇండియన్స్ తో నీగ్రో బానిసలతో మంతనాలు ఆ తర్వాత వరుసగా అంతర్యుద్ధాలు, అమెరికన్స్ రావడం తోటి ఆధునిక 20 శతాబ్ద సామ్రాజ్యవాదం, ఇంకా మరికొన్ని సంఘటనలు నిజంగా జరిగినవి. ఇవన్ని నవలలో లాటిన్ అమెరికా దేశ లక్షణాలుగా మనం గమనించవచ్చు.
మార్క్వెజ్ ప్రస్తుతాన్ని గతంగా మార్చి మకాండో లోని జీవన పరిస్థితి తెలుపుతాడు. అందులో పేదరికం ,అన్యాయం ఉంటాయి. ఏడు తరాలలో జొస్ ఆర్కాడియో బుయాండియా, అతని వారసులు నిరంతరం ఒకరికొకరు కనిపిస్తూనే వుంటారు.వాళ్ళు వంశానికి వారసులే కాకుండా పేర్లకు కూడా వారసులు. వాళ్ళ కోపాలు, ద్వేషాలు, కొనసాగుతున్న వైరాలు, యుద్ధాలు, వాళ్ళ పీడకలలు, వావి వరుస లేని శృంగారకాంక్షలు, వావి వరుస తప్పినచో వాళ్లకు పంది తోక తో బిడ్డ పుట్టడంతో వంశనాశనం జరుగుతుందనే జోస్యం గురించిన భయం , అయినా కోర్కెలకు దాసోహమయి అదే జరగడం.మకాండో నాశనంతో నవల ముగుస్తుంది. లాటిన్ అమెరికా చరిత్ర నడుస్తుండగా మకాండోలో బుయాండియోల ఆవిర్భావాల నుండి వినాశనం వరకు జరుగుతున్న చరిత్ర నవల సారాశం.
ఏకాంతం తెచ్చిన ఖ్యాతి, ప్రఖాతి
“వందేళ్ల ఏకాంతం” ఒక్క సారిగా మార్క్వెజ్ ను ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వ్యక్తిగా చేసింది.1969 లో ఇటలీ దేశపు “చయించియానో “అవార్డుతో పాటు బుక్ అఫ్ ది ఇయర్ కూడా 1969లో గెలుచుకుంది. 1970 లో ఇంగ్లిష్ లో తర్వాత 37 భాషల్లోకి అనువదింపబడింది. 30 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయి గొప్ప నవలగా పేరొందింది. రొములో గాల్లెగో ప్రయిజ్, నే వ్ స్టెడ్ట్ ప్రయిజ్ కూడా వరించాయి. అంతేకాకుండా ఈ నవల అతన్ని ఆర్థికంగా కూడా ఎంతో ఎత్తుకు తీసికెళ్ళింది. రాజకీయంగా కూడా అతనికో ప్రత్యేకతను తెచ్చి పెట్టింది. పెద్ద ఇల్లు కట్టుకోవడానికి ఇంకా తన సొంత ఖర్చుతో ప్రచారానికి దిగి రాజకీయ, సామాజిక చైతన్యం కోసం ప్రయత్నించాడు. అతని రచనల ద్వారా వచ్చిన డబ్బును, విరాళాలను కమ్యూనిస్ట్ వ్యవస్థను బలపర్చడానికి ఖర్చు చేశాడు. మార్క్వెజ్ 1981లో ఫ్రెంచ్ లెజియన్ గౌరవ మెడల్ను, 1982 లో నోబెల్ బహుమతిని అందుకున్నారు. “వందేళ్ల ఏకాంతం“ నవలను ఒక్క అర్జెంటీనా లోనే ఒక వారంలోనే 8 వేల కాపీలు అమ్ముడు పోయింది అంతకుముందెప్పుడు దక్షిణ అమెరికా నవలకు ఇక్కడ ఇంత ఆదరణ లభించలేదు. కూలివాళ్ళు, గృహిణులు, ప్రొఫెసర్లు, వేశ్యలు కూడా చదివారు. “ ఏకాంతం” నవల ఎప్పుడో విడిపోయిన స్పానిష్ భాష మాట్లాడే సాహితీ ప్రియులందరిని ఏకం చేసింది. స్పెయిన్, లాటిన్ అమెరికా, పల్లె, పట్టణం, పరాయిదేశ (స్పెయిన్) పాలకులకు, పాలింపబడిన లాటిన్ అమెరికా దేశస్థులకు కూడా ప్రియమైన పుస్తకమయింది.
“వందేళ్ల ఏకాంతం”పై సమకాలీన రచయితల అభిప్రాయాలు ఏకాంతం నవలను గ్రెగరీ రబాసా చేసిన ఇంగ్లిష్ అనువాదం” వన్ హండ్రెడ్ యియర్స్ అఫ్ సాలిట్యూడ్” కూడా చాలా ప్రఖ్యాతి చెందింది. మార్క్వెజ్ గార్సియా తన స్పానిష్ నవల కంటే రాబాసా ఇంగ్లిష్ అనువాదమే బావుందని అనడంతో పాటు ,ఇంగ్లిష్ లో రాసిన లాటిన్ అమెరికన్ రచయితలలో రబాసా ప్రముఖుడని మెచ్చుకున్నాడు.
విలియం ఫాక్నర్ నవల గురించి ఇలా అంటారు “ గతం ఇక్కడ మరణించదు… నిజానికి ఇది గతం కాదు “
జాన్ లియొనార్డ్ “టైమ్స్“ అనే దినపత్రికలో “ఒక్క ఏకాంతం నవలతో ఒక్కసారిగా మార్క్వెజ్ గంటర్ గ్రాస్, నాబోకావ్ ల చెంతకి చేరుకున్నారు, అతని ఆకలి అతని వూహ కంటే విశాలమైనది, అతని విధినియక్తం ఈ రెండింటికంటే అద్భుతమైంది.”అన్నారు
విలియం కెన్నెడీ , న్యూయార్క్ టైమ్స్ బుక్ రివ్యూ లో ఇలా అన్నారు "బైబిల్ తర్వాత మానవాళి అంతా చదవతగ్గ ఒకే ఒక సాహిత్యం "వందేళ్ల ఏకాంతం" .ఈ నవల ద్వారా మార్క్వెజ్ పాఠకునిలో జీవితం పట్ల లోతైన భావనతో పాటు జీవితం పట్ల శూన్యతని కూడా పెంపొందిస్తాడు"
మాజిక్ రియలిజం యొక్క మాజిక్
మాజిక్ రియలిజం నిజానికి ఆవిర్భవించింది లాటిన్ అమెరికా లోనే. ఆ సాహితీ ప్రక్రియ అక్కడి నుండి ప్రపంచమంతా ప్రయాణం చేసింది అయినా లాటిన్ అమెరికాను వీడలేదు. మొట్టమొదటి సారిగా సాహిత్యంలో మాజిక్ రియలిజంను ప్రయోగించింది అలిజో కార్పెంటర్ తన “ది కింగ్ డం అఫ్ దిస్ వల్డ్ ” నవలలో. మార్క్వెజ్ ”ఏకాంతం” నవల కంటే ముందు గుంటర్ గ్రాస్ తన “టిన్ డ్రమ్” నవల రాశారు. అందులో ప్రపంచయుద్ధంకు ముందు తర్వాత జర్మన్ చరిత్ర ను ఆయన ఎంతో హృద్యంగా రాశారు. గ్రాస్, మార్క్వెజ్ లు మాజిక్ రియలిజంను అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్ళారు. అంతేకాదు సాల్మన్ రష్ది, టోనీమోరీసన్, ఇసబెల్ అలెండ్ లాంటి లబ్దప్రతిష్టులైన రచయితల్ని ప్రభావితం చేశారు.
మాజిక్ రియలిజంను నిజానికి మార్క్వెజ్ కళ ద్వారా ప్రకృతి నియమాల్ని ఉల్లంఘించటానికి వాడుకున్నాడు. అయితే అంతిమంగా నవల బలమంతా పాఠకునికి బుయండియాలను వాళ్ళ ఇరుగు పొరుగు వాళ్ళను సజీవంగా ముందు నిలబెడుతుంది.
మార్క్వెజ్ మాజిక్ రియలిజం లో రాసిన “ఏకాంతం “చదివాక ప్రభావితమైన రచయితలు చాలా మంది వున్నారు. విలియం కెన్నెడీ “ఇరన్ వీడ్”లో చనిపోయిన శిశువు సమాధి నుండి తన తండ్రితో మాట్లాడడం, ఆలిస్ వాకర్ తన “ది కలర్ పర్పుల్”లో ఇనుప చువ్వలు మెత్తబడడం గురించి రాయడం , దేవుడికి పంపిన ఉత్తరాలకు సమాధానం రావడం, ఇసబెల్ అలెండ్ నవల “ది హవుస్ అఫ్ స్పిరిట్స్ ”లో చనిపోయిన ఒక చిలి ప్రెసిడెంట్ బంధువు ఆధునిక చిలి కథను ఒక కుటుంబ గాథగా చెప్పడం కూడా మాజిక్ రియలిజం పద్దతిలోనే రాయబడ్డాయి.
మార్క్వెజ్ నవల గురించి మాట్లాడుతూ సాల్మన్ రష్ది ఇలా అంటారు " మార్క్వెజ్ “వందేళ్ల ఏకాంతం” రాసే నాటికి మతం,మూఢనమ్మకాలు ప్రజల జీవితాల్ని ఎంతో ప్రభావం చూపుతుండేవి. పరాయి దేశపాలనలో కొలంబియా మ్రగ్గుతున్న సమయంలో ధనికులకు పేదలకు మధ్య ఎంతో వత్యాసం ఉండేది, మధ్యతరగతి వాళ్ళు అతి తక్కువుండేవాళ్లు, నియంతల నిరంకుశపాలనతో పాటు పాలకుల లంచగొండితనం ఆందోళనకరంగా ఉండేది. ఇక్కడ ఏదైతే వింతగా కనిపిస్తున్నాయో అవి నాకు అతి సహజంగా అనిపిస్తున్నాయి. ఇది మార్క్వెజ్ యొక్క గొప్ప విజయం ఎలాగంటే ఏ కాలంలో అయినా సాహిత్యo ఏదీ గుర్తించాలో ఆయన తెలియ చేశారు. యదార్థం నిజానికి సహజంగా ఉండాల్సిన అవసరం లేదు. ఇది మనం గ్రహించి గుర్తించాల్సిన సమయం వచ్చింది.”
వార్గాస్ ల్లోసా నోబెల్ గ్రహీత “వందేళ్ల ఏకాంతం” లోని మాజిక్ రియలిజంగురించి మాట్లాడుతూ “మార్క్వెజ్ శైలిలోని స్పష్టత, పారదర్శకత వలన ఈ పుస్తకం స్పానిష్ భాష మాట్లాడే వాళ్లందరినీ ఏకం చేయగలిగింది.అంతేకాదు . అంతేకాదు ఇది లాటిన్ అమెరికాను ప్రాతినిధ్యం వహించింది.లాటిన్ అమెరికా అంతర్యుద్ధాల్ని, అసమానతలను, లాటిన్ అమెరికా ప్రజలకు సంగీతం పై గల మక్కువ, వాళ్ళ కల్పనలు , నవలలో యదార్థం మరియు అద్భుతాలు ప్రతిభావంతంగా కలగలిపి పొందుపరచబడ్డాయి”.
యాభై ఏళ్ళయినా గేబ్రియల్ గార్సియా మార్క్వెజ్ నవల తన అస్థిత్వాన్ని కోల్పోలేదు, ఇంకా ఎక్కువ ఆదరణకు నోచుకుంటోంది. ప్రపంచ సాహిత్యం లో రెండవ ప్రపంచయుద్ధం తర్వాత “ఏకాంతం “ నవల చాలా మంది పాఠకుల్ని అలరించింది. అది ఎంతోమంది రచయితల కు స్ఫూర్తినిచ్చింది. టోనీ మోరీసన్ నుండి సాల్మన్ రష్ది వరకు “ఏకాంతం “ నవల చూపిన ప్రభావం గొప్పది. ఈ నవల శృంగారం, వినోదం , రాజకీయం, విప్లవ ధోరణి నింపి ఎలా విజయాన్ని సాధించింది అన్నది సాహిత్య చరిత్రలో ఈ అర్థ శతాబ్దం లో చాలా మందికి తెలియదు.
ఇప్పుడు వందేళ్ల ఏకాంతాన్ని ఎవరు ప్రాతినిధ్యం వహిస్తారు? ఇప్పుడు ఇది ఎవరికీ తెలియదు. కానీ బుయండియోలు మరియు వాళ్ళ గ్రామం మకాండో ఇప్పటికి వుంది. దానికి జాతి, మత, ప్రాంత, బేధం లేదు. మార్క్వెజ్ నవలలో గుంపులు గుంపులుగా ఎగిరే పసుపు పచ్చని సీతాకోక చిలుకలు ఎగరడం ఎంత సహజంగా వర్ణించారో అంత సహజంగా ఈ కాలంలో కూడా బుయాండియోలు వున్నారు మరి. ఏడు తరాలు వాళ్లయితే మనం ఎనిమిదో తరం.
ప్రచురణ ఆంధ్రజ్యోతి అక్టోబర్ 12,2016
No comments:
Post a Comment