Thursday, 15 December 2016

ది కాచర్ ఇన్ ది రై


ఇటీవల ఇంగ్లీష్ నుండి తెలుగు అనువాదంలో వచ్చిన జె. డి శాలింజర్ “ద కాచర్ ఇన్ ద రై” నవల చదివాక, అందులోని సారాంశం పూర్తిగా అర్థమైంది. అంతకు ముందు ఇంగ్లీష్ లో చదివినా ఇంత విపులంగా అర్థం కాలేదు. చదివాక నవలపై వ్యాసం రాయాలనిపించింది . రాసింది ఇంగ్లీష్ ,తెలుగు పెద్దగా రాని 24 ఏళ్ల టామ్ సాయర్ అనే కుర్రాడంటే ఇంకా ముచ్చటేసింది . ఇది చదివాక ఆ కుర్రాడికి ఇంగ్లీష్ , తెలుగు పెద్దగా రాదంటే వొప్పుకోలేం. శాలంజర్ భాషను అద్భుతమైన రీతిలో తెలుగులో అనువదించాడు.జె.డీ శాలంజర్ అనగానే అతని వివాదాస్పదమైన నవల“ద కాచర్ ఇన్ ద రై “ (1951) గుర్తొస్తుంది. అతనింకా కొన్ని కథలు నవలలు రాసినప్పటికీ ఈ నవలే అందరికీ గుర్తుంది.దీని తోటే పేరు ప్రఖ్యాతులు సంపాదించాడు. అమెరికాలో మాన్ హట్టన్లో 1910లో జనవరి 1 న జన్మించిన శాలింజర్ చిన్న వయసులోనే రచనావ్యాసంగం మొదలెట్టాడు. జీవితంలో ఎక్కువ కాలం అజ్ఞాతంలోనే గడిపిన శాలింజర్ 1965 లో చివరి రచనను ప్రచురించాడు, 1980లో చివరి ఇంటర్వూ ఇచ్చాడు. 2010లో అజ్ఞాతంలోనే మరణించాడు


రచయిత జె.డి శాలింజర్ ఆత్మకథగా చెప్పబడే ఈ నవల ఒక గొప్ప క్లాసిక్ (కళా ఖండంగా) ఇప్పుడు చెప్పబడుతున్నా , ఒకప్పుడు ఇది అమెరికాలో చాలా విద్యాలయాలలో నిషేదింప బడిన పుస్తకం. అయితే ఇది ఆ కాలం నాటి యువతను ఎక్కువ ఆకర్షించింది. శాలింజర్ 32 ఏళ్ల వయసులో 1951 లో ఈ పుస్తకం రాశాడు. "కాచర్ ఇన్ ది రై "నవల బిల్దంగ్స్ రోమన్ అనే సాహితీ ప్రక్రియలో రాయబడ్డది . ఈ పద్ధతిలో రాయబడ్డ నవలలో ప్రధాన పాత్రధారి బాల్యం నుండి పరిపూర్ణుడిగా ఎదగడం జరుగుతుంది. అయితే బిల్దంగ్స్ రోమన్ నవల విధానంలో కథానాయకుడిలా ఇక్కడ హొల్దన్ ఎదగడానికి ఇష్టపడడు, పైగా ఎదగడానికి నిరాకరిస్తాడు. నవల అంతా కౌమారదశలో పదహారేళ్ళ వయసులో వున్న హొల్దన్ ఒంటరితనం గురించి , అతను ఎలా అమాయకత్వం నుండి దూరమయాడో ఆ దశలో వుండే అందరు పిల్లలు ఎలా అదే రకమైన నైరాశ్యంలో మునిగి పోయారో వివరిస్తాడు. హొల్దన్ కాల్ఫీల్ద్ ను అచ్చంగా శాలింజర్ తనకు ప్రతిరూపంగా సృష్టించాడు. పెన్సిల్వేనియా రాష్ట్రం లోని ,ఏగర్స్ టవున్ లోని పెన్సి పెప్ అనే బోర్డింగ్ స్కూల్లో సరైన ప్రతిభను చూపలేని హోల్డన్ , ఫుట్ బాల్ మ్యాచ్ కు వెళుతూ టీమ్ మానేజర్ గా వుండి కూడా నిర్లక్ష్యoగా కిట్ ను సబ్వేలో పోగొట్టి అందరి ఆగ్రహానికి గురయ్యి ఆట ఆడకుండానే తిరిగి వస్తాడు. అదీకాక అతను నాలుగు సబ్జెక్ట్స్ తప్పాడు కాబట్టి స్కూలు నుండి తరిమేస్తే న్యూ యార్క్ లో అక్కడా ఇక్కడ తిరుగుతూ రోజంతా గడుపుతూ తన ఆలోచనలను పాఠకులతో పంచుకోవడమే నవలలో జరిగేది.


65 మిలియన్ల కాపీలు అమ్ముడు పోయి , ప్రపంచంలోని అన్ని బాషల్లోకి అనువదించబడిన ఈ పుస్తకం ఒక ప్రభంజనం సృష్టించింది. కౌమారంలో వున్న బాలలంతా హొల్దన్ ను తమ ప్రతినిధిగా భావించారు. ఈ నవలకు ఆతరంలోని బాలలంతా ఎంతో ప్రభావితులయ్యారు . నవల ఆ రోజుల్లో వున్న సంక్లిష్టమైన కొన్ని సమస్యల్ని గురించి చర్చించింది. ముఖ్యంగా పిల్లల్లో అమాయకత్వం కొరవడ్డం, గుర్తింపుకై ఆరాటం, ప్రేమ రాహిత్యం, లోపబూయిష్టమైన విద్యావిధానం, పిల్లలకు పెద్దలకు మధ్య పెరిగే ఎడం, అసహజ సెక్స్ సంబంధాలు, నవీనత పేరుతో చెడిపోతున్న మానవ సంబంధాలు, ఉజ్వలమైన భవిష్యత్తు పేరిట స్కూళ్ళలో పిల్లలపై పడుతున్న ఒత్తిడి, రెసిడెన్షియల్ స్కూళ్ళ పేరిట నిర్భంద విద్య మొదలైనవి. పుస్తకాన్ని పెద్దలు విద్యావేత్తలు ముఖ్యంగా పాఠశాల నిర్వాహకులు, ఉపాధ్యాయులు దీన్ని నిషేదించాలని పట్టుపట్టారు. అయినా ఈ నవల తన జైత్రయాత్రను కొనసాగించింది. ఇప్పటికి ఈ పుస్తకం ప్రతి ఏడూ 250,000 కాపీలు అమ్ముడవుతోంది. టైం 2005 లో ఇచ్చిన నివేదికలో ఈ నవల 1923 నుండి విడుదల అయిన 100 గొప్ప పుస్తకాల జాబితాలో చోటు చేసుకుంది. మోడ్రన్ లైబ్రరి 20 శతాబ్దంలో ఇంగ్లీషు భాషలో వచ్చిన 100 పుస్తకాల్లో ఒకటిగా ఈ నవలను చేర్చింది . రియలిస్టిక్ ఫిక్షన్ గా చెప్పబడే పంధాలో ఈ నవల నడుస్తుంది.


ఏ సాహితీ ప్రక్రియ అయినా అందులోని విషయం (థీమ్ ) గురించే ప్రధానంగా మేధావుల మధ్య చర్చించబడుతుంది. “ ద కాచర్ ఇన్ ది రై” నవలలో హొల్దన్ బాల్యానికి యవ్వనానికి మధ్యన సంధి స్థితిలో కౌమారంలో ఉంటాడు . ఈ నవల పేరు కు అర్థం "పిల్లలను అమాయకత్వం పోగొట్టుకోకుండా కాపాడడం “అని హొల్దన్ వివరిస్తాడు. మిగతావాళ్ళనుండి వేరుగా వుండడాన్ని (alienation ), తనను కాపాడుకోవడానికి ఒక సాధనంగా హొల్దన్ వాడుకుంటాడు . నవల ఆద్యంతమూ హొల్దన్ తన చుట్టూ వున్న ప్రపంచం వలన బాధితుడు కావడమే కాకుండా తనకు నచ్చిన విషయాల నుండి కూడా వేరు చేయబడ్డo మనం గమనించవచ్చు. ఇదే నవలలో ప్రధాన విషయం/వస్తువు. దీనికి అనుబంధంగా విద్యావ్యవస్థ, సామాజిక పరిస్థితులు, మనస్తత్వ పరిశీలన లాంటివి నవలలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.


హోల్డన్ కు కుటుంబం అంటే ఎంతో ఇష్టం, హాలీవుడ్ లో సినిమాలకు పనిచేసే అన్న డి. బి, చనిపోయిన తమ్ముడు అల్లే , ఫోబ్ అనే చిట్టి చెల్లెలంటే ఎంతో ప్రాణం. అంతే కాదు కుటుంబంతో గడపడం హోల్డాన్ కు ఎంతో బాగుంటుంది. కానీ హోల్డన్ ను బోర్డింగ్ పాఠశాలలో (మనం ఈ నాడు పిలుచుకునే రెసిడెన్షియల్ పాఠశాలలు) చేర్పించారు. అప్పటికే మూడు రెసిడెన్షియల్ పాఠశాలలు మారిన హోల్డన్ మళ్లీ ఇప్పుడున్న పాఠశాల నుండి తరిమివేయబడితే తల్లిదండ్రులు బాధపడ్డమే కాకుండా తనకు శిక్ష విధిస్తారని భయపడతాడు, బాధపడతాడు. అయితే నవల ఆరంభంలోనే తన తల్లిదండ్రుల్లో వుండే లోపాల్ని, అవి తనకు నొప్పి కలిగించినవి అయినప్పటికీ హొల్దన్ చెప్పడానికి ఇష్టం లేదంటాడు. ఎందుకంటే అవి చెబితే తన తల్లిదండ్రులు నొప్పిపడతారని అంటాడు. ఈ సంస్కారం హోల్డన్ కు వుండడం మనం గమనించవచ్చు. తల్లిదండ్రులు లేని సమయంలో స్కూల్ నుండి పారిపోయి రహస్యంగా ఇంటికి వచ్చిన హొల్దన్ తో "నిన్ను చూస్తే నాన్న చంపేస్తాడు” అని హోల్డన్ చెల్లెలు ఫోబ్ పదేపదే అంటుంది. భారత దేశం లో- అదీ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న చరిత్ర లాగా అనిపిస్తోంది కదా! నిజమే. విద్యావ్యవస్థ పసిపిల్లల మనస్తత్వంపై పెను ప్రభావం చూపుతుందనే సత్యాన్ని మనో విశ్లేషకులు ఏనాడో చెప్పారు. తల్లిదండ్రుల పెంపకం, గురువుల బోధన, స్నేహితులు, చుట్టూ వున్న సామాజిక, ఆర్థిక,సాంసృతిక పరిస్థితులు ఒక చిన్నాoరి కి వ్యక్తిత్వం ఏర్పడడంలో ప్రభావం చూపుతాయి ఇవి కాక వ్యక్తి తానుగా కూడా తన వ్యక్తిత్వాన్ని పెంపొందింప చేసుకుంటాడు. ఇప్పుడయితే ఇవి కాక, పిల్లలపై సినిమాలు, ఇంటర్నెట్, సెల్ ఫోన్, వాట్స్ ప్ లాంటివి కూడా ఎక్కువ ప్రభావం చూపుతున్నాయి .


వందేళ్ళ క్రితం పశ్చిమ దేశాల్లో వున్న రెసిడెన్షియల్ స్కూల్ పద్ధతి, క్రమశిక్షణలు, శిక్షలు, బలవంతపు చదువులు, అట్లాంటి చడువులతోనే భవిష్యత్తు ఉంటుందనే తల్లిదండ్రుల నమ్మకం లాంటివి నవల ప్రారంభంలోనే గమనించవచ్చు . వ్యాపార సంస్థలుగా మారిన విద్యాలయాల గురించి హోల్డన్ త్రీవ్రంగా విమర్శిస్తాడు. ఏకంగా నవల హొల్దన్ వ్యక్తిగత అభిప్రాయం కావొచ్చు. కానీ అది ఆనాటి విద్యావ్యవస్థ లో లోపాల్ని ,తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల నిరoకుశవైఖరినీ తేటతెల్లం చేస్తుంది. తమ ప్రేమ కంటే స్కూల్ లోని వ్యవస్థ, యాజమాన్యం పెట్టె క్రమశిక్షణతో తమ పిల్లల జీవితాలు బాగుపడతాయని తల్లిదండ్రులు ఆశించినట్లు మనకు నవలలో హోల్డన్ ఆవేదన వెల్లడి లో అర్థమవుతుంది .తమ జీవితంలో కానీ ఉద్యోగ నిర్వహణలో కానీ ఉపయోగపడని చదువులతో ఆనాటి అమెరికన్ విద్యావవస్థలో రావాల్సిన సంస్కరణల్ని రచయిత ఒక బాధితుడైన హోల్డన్ ద్వారా చెప్పకనే చెప్పిస్తాడు. తనకు ఏ మాత్రం ఆసక్తి కలిగించని చరిత్ర గురించి చదవడం, రాయడం హొల్దన్ కు నరకం లాగా వుంటుంది . కొందరు మంచి హృదయమున్న ఉపాధ్యాయులు కూడా విద్యను బలవంతంగానైనా నేర్పే ప్రయత్నం లో హొల్దన్ కు దూరమవుతారు. స్పెన్సర్ అనే వుపాధ్యాయునితో "తాను జీవితానికి మరొక ప్రక్క చిక్కుకు పోయా"నంటాడు హొల్దన్. అందుకే తాను బందీ అయిన ప్రపంచపు సంకెళ్ళ నుండి తప్పించుకునేందుకు నిరంతరం ప్రయత్నిస్తుంటాడు.


హోల్డన్ అతను చదువుకున్న స్కూల్ పెన్సి ప్రెప్ యాజమాన్యం ఇచ్చుకునే ప్రకటనలు గురించి చెప్పడం మనదేశంలో ఇప్పుడున్న పాఠశాలలు ఇచ్చే ప్రకటనలు గుర్తు చేస్తాయి. ” పెన్సి ప్రెప్ స్కూల్ గురించి వేయి పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం వలన ఆ స్కూల్ చాలా మందికి తెలుసు. ఆ ప్రకటనలో అందమైన అబ్బాయి గుర్రo మీద కూర్చుని కంచె దాటు తున్నట్లు వుటుoది. పిల్లలు పోలో ఆడుతున్నట్లు కూడా ఉంటుంది కానీ స్కూల్లో ఒక్కసారి కూడా ఒక్క గుర్రాన్ని కూడా చూడలేదంటాడు హోల్డన్. మన దేశంలో కూడా ఇంటర్నేషనల్ స్కూళ్లలో ఇలాంటి ప్రకటనలే మనం చూస్తాం . ఆ ప్రకటనల్లో నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో ఈ ప్రకటనల్లో అంత నిజం ఉంటుంది. ఆ రోజుల్లో ఆ ప్రకటనలు చూసి హోల్డన్ ను ఆ స్కూల్లో చేర్పించిన అతని తల్లిదండ్రులు ఎంత నిరాశకు లోనయ్యారో హోల్డన్ చెబుతాడు. ఇలాంటి ప్రకటను చూసి మన దేశంలోని తల్లిదండ్రులు ఎంతమంది హోల్డన్స్ ని తయారు చేస్తున్నారో… ఎవరికి తెలుసు? ఒకప్పుడు అమెరికాలో వున్న పద్ధతులకు బలయిన విద్యావ్యవస్థను వాళ్ళు సంస్కరించుకుని ఇప్పుడు పిల్లల హక్కుల్ని కాపాడడమే కాకుండా వాళ్ళ బాల్యాన్ని రక్షించే విద్యావ్యవస్థను ఏర్పర్చుకుంటుంటే మనం పిల్లల బాల్యాన్ని హరించే జైళ్ల లాంటి స్కూళ్లను ప్రోత్సహిస్తున్నాము. మన స్కూళ్ళు విద్యార్థులను డాక్టర్లుగా ఇంజనీర్లుగా తయారు చేసే కర్మాగారాలుగా తయారయ్యాయి కానీ పిల్లల అభిరుచికి , ఆసక్తికి తగిన ప్రొత్సాహం ఇచ్చే విద్యాబోధన ఇక్కడ జరగడం లేదు .


హొల్దన్ ఎప్పుడూ ఎరుపు రంగు హంటింగ్ హ్యాట్ ధరిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటాడు. హొల్దన్ మిగతా వారిలాగా కాకుండా తన కొక ప్రత్యేకత వుందని భ్రమిస్తాడు అందుకే అందర్నీ వదిలి ఏకాంతంగా ఉండడానికి ఇష్టపడతాడు. సత్యమేమిటంటే అతను ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అయోమయంలో ఇబ్బంది పడతాడు. తాను ప్రత్యకమైన వ్యక్తినని భావించడం వలన అది అతని ఆత్మ రక్షణ కవచంలా భావిస్తాడు .ఇదే అతనిలో కొంచం స్థిరత్వాన్ని కలిగిస్తుంది. నిజానికి అతని ఏకాoతమే / ఒంటరితనమే అతని బాధలకు కారణం , అతని భావాల్ని ఎప్పుడూ నేరుగా విప్పిచెప్పడు. అంతేకాదు తన సమస్యలకు కారణం కూడా అతను గ్రహించడు. అతనికి మానవ సంబంధాలు కావాలి, ప్రేమ కావాలి. అయితే అతను ఏర్పరచుకున్న అహం అడ్డుగోడలు అతన్ని ఏ సంబంధాలను గౌరవించనివ్వవు, ఏర్పర్చుకోనివ్వవు. అతని ఏకాంతమే అతని బలంగా ఒకసారి, అదే అతని సమస్యలకు కారణం అవుతుంటుంది. ఉదాహరణకు అ ఒంటరితనం అతన్ని స్యాలి తో డేటింగ్ కు ప్రేరేపిస్తుంది అంతలోనే ఒంటరిగా ఉండాలనే కోరికతో ఆమెను అవమానిస్తాడు. దాంతో ఆమె అతన్ని వదిలేసి వెళుతుంది అలాగే జేన్ తో ఒకప్పుడు వున్న స్నేహాన్ని పునరుద్ధరించుకోవాలని ఎంతో అనుకుంటాడు కానీ ఆమెను కలుసుకునేందుకు ఏ రకమైన ప్రయత్నం చేయడు. అతనెక్కువ ప్రేమించే అతని ఏకాంతమే అతన్ని నాశనం చేస్తుంది .


హొల్దన్ నాచురల్ హిస్టరీ మ్యూజియం వెళ్ళాక జీవరాశుల గురించి తెలుసుకోగానే అతనికి మార్పు అంటేనే భయం వేస్తుంది. మరీ అతనికి జీవితంలోని సంక్లిష్టతను భరించలేకపోతాడు. అతనికి ప్రతీదీ చాలా సులభంగా అర్థం కావాలని కోరుకుంటాడు ఏదీ మార్పుకు లోను కాకూడదని ఎలా వుండేది అలాగే వుండాలని,మ్యూజియంలో వున్న బొమ్మ ఎస్కిమోలలా, అమెరిన్డియన్ లా వుండాలని అతను తీవ్రంగా వాంఛిస్తాడు. హొల్దన్ ఎక్కువ భయపడతాడు కూడా, అపరాధభావాలతో, పాపభీతితో కూడా ఉంటాడు ఎందుకంటే ఇతరులలో అతను విమర్శించే తప్పులు అతనిలో వున్నాయి. అయితే దాన్ని అతను అంగీకరించడు. కొన్ని సార్లు మాత్రమే అతను దాన్ని అంగీకరిస్తాడు. ఉదాహరణకు చాప్టర్ 9 లో” నాకు సెక్స్ అంటే తెలియదు దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నా నాకు నిజంగా సెక్స్ అంటే తెలియదు” అంటాడు .


ఎదగడం అనేది తనను భయపెడుతుందని,అయోమయంలో పడేస్తుందని చెప్పడానికి బదులు హోల్డన్ పెద్దరికం అంతా సారం లేనిదని, పైకి ఒకటి లోపల ఒకటి చూపే నైజం కలదని (దీన్నే నవలలో ఎప్పుడూ ఫోనీనెస్ గా అంటాడు),పసితనం అంతా అమాయక ప్రపంచం, కుతూహలం, నిజాయితి కూడుకున్నదని అంటాడు. అతను పసితనాన్ని ఒక అద్భుత లోకంగా అక్కడ పిల్లలు అవధులు లేని ఆటపాటలలో ఉంటారని, ఎదగడం అనేది పిల్లలకు మరణంతో సమానమని , ఎదగడం అన్నది అత్యున్నత పర్వతం నుండి అఘాతంలోకి పడిపోవడం అని హొల్దన్ భావన. పసితనం, ఎదగడంలపై హొల్దన్ కున్న అపోహల వలన అతను తనకు తానే ఏర్పరచుకున్న ఒక తెరను కప్పుకున్నాడు.


హోల్డన్ ఎప్పుడూ పెద్దలపై తన క్రూరమైన విమర్శలు కురిపిస్తాడు. కానీ త్వరలోనే మిస్టర్ అన్టోలిని, అతని చెల్లెలు ఫోబేతో అతని అనుభవాలు అతని స్థిరత్వంలేని వ్యక్తిత్వంలోని డొల్లతనాన్ని చూపిస్తాయి. నవలలో ఫోనినెస్ అనే పదం శాలంజర్ ఎక్కువ వాడతారు. ఆ పదo పెద్దల్లో వున్న హిపోక్రిసీ, నటన, డొల్లతనాన్ని గురించి చెప్పడానికి వాడతాడు. 22 వ చాప్టర్లో పెద్దవాళ్ళ గురించి చెబుతూ వాళ్ళను ఫొనీనెన్ కు ప్రతీకలుగా, ప్రపంచంలోని చెడుకు ప్రతీకలుగా చెబుతాడు. తాను ఒంటరి తనం ఎన్నుకోవడానికికూడా ఫోనీ నెస్ ను కారణంగా చెబుతాడు . అలాగని హొల్దన్ పెద్దవాళ్లపై చేసిన అభియోగాలన్నీ సత్యదూరాలని అనుకోవడానికి వీల్లేదు. అతని సూక్ష పరిశీలన చాలా మంది పెద్దవాళ్ళ విషయంలో చాలా నిజం. సాల్లీ హేయస్, కార్ల్ లూస్ , మారిస్ మరియు సన్నీ , స్పెన్సర్ కూడా ఈ విషయంలో ఉదాహరణలుగా నిలుస్తారు. మారిస్ మరియు సన్నీ నిజంగానే చాలా ప్రమాదకరంగా కనిపిస్తారు. అయితే ఇతరులలోని లోపాల్ని ఎత్తిచూపడానికి హొల్దన్ ఎంతో శక్తియుక్తులు ఉపయోగిస్తాడు. కానీ తనలోని లోపాల్ని అతను గమనించడు. అతని అభియోగాలన్నీ నిజం కావు. కొన్ని ఎంత హేతురహితంగా ఉంటాయంటే అవి ఎంతో అవాస్తవమైనవి అంతేకాదు క్రూరమైన అభియోగాలు కూడా . ఇవే అతన్ని అపద్దం చెప్పే వ్యక్తిగా తయారు చేస్తాయి . న్యూ యార్క్ కు హోల్డన్ వెళ్లేప్పుడు శ్రీమతి మారో తో అతని ప్రవర్తన ఏమాత్రం నిజాయితీ లేనిది . చెడు, నిజాయితీ లేనితనం ,ఫోని నెస్ నిండిన ప్రపంచం అని విమర్శించే హోల్డన్ తాను మాత్రం మంచితనానికి మారుపేరుగా చెప్పుకున్నాడు.నిజానికి అతనిలో కూడా ఏమీ నిజాయితీ లేదని మనకు తెలుస్తుంది .


హోల్డన్ నమ్మకం ఏమిటంటే ప్రపంచం ఒక అందమైన ప్రదేశం అందులో మంచితనం అమాయకత్వం ఒక ప్రక్కవుంటే మరొక ప్రక్క, హిపోక్రిసీ, డొల్లతనం, ఫొనీనెన్ ఉన్నాయని. దీనికి హోల్డన్ ఒక ప్రతికూల సాక్ష్యం. అయితే అతను చూసిన విధంగా, కోరుకున్న విధంగా ప్రపంచం అందమైంది కాలేదు, ప్రజలపై మంచి చెడు తీర్పు ఇచ్చినట్లు, ప్రపంచం గురించి అతని తీర్పు అన్ని వేళలా ,అన్ని సందర్భాలలో , అందరి విషయంలో నిజం కాజాలదు .


నవలలో హోల్డన్ ఒంటరితనం అతన్ని ప్రపంచం నుండి వేరు చేసి ఏకాకిని చేస్తాయి. నవలకు అదే మూలం. నవల మొత్తం అతను సాహచర్యం కోసం చేసే ఉన్మాదపు వెతుకులాట, ఒక మతి లేని ప్రయత్నం నుండి మరొక మతిలేని ప్రయత్నం ముఖ్యమైన చర్చలుగా ఉంటాయి. అయితే అతను ఎప్పుడూ ఆత్మ పరిశీలన చేసుకోడు. అందువలనే అతను ఎప్పుడూ ప్రపంచాన్ని విమర్శనాత్మకంగానే చూస్తుంటాడు, దాన్నే తనను తాను రక్షించుకునే కవచంగా భావిస్తుంటాడు, మళ్లీ తన ఒంటరితనాన్ని పోగొట్టుకునే ప్రయత్నం తీవ్రంగానే చేస్తాడు. తన కారణంగానే అందులో ఓడిపోతాడు,అదే అతని బాధ, అదే అతని గెలుపు, అదే అతని ఓటమి.


అతని భౌతిక, మానసిక సంబంధాలు అతన్ని కొంచం ప్రపంచంలోకి తేవడానికి ప్రయత్నం చేస్తాయి . అయితే అవి పెద్దల అలవాట్లుగా,సంక్లిష్టత ,సంఘర్షణ కలవిగా ,ఎప్పుడూ మారిపోయే విషయాలుగా అనిపించి మళ్లీ వాటిని చేరడానికి హోల్డన్ భయపడతాడు. అతనికి న్యాచురల్ హిస్టరీ మ్యూజియంలో వున్న విధంగా ప్రపంచం స్థిరంగా, సాదాగా, స్తంభించిన విధంగా, నిశ్శబ్దంగా, మార్పు లేకుండా ఉండాలని కోరుకుంటాడు. అతని చెల్లెలు ఫోబ్ కూడా హోల్డన్ ఊహించినంత అమాయకంగా ఉండదు. ఎందుకంటే ప్రజలెలా వుంటారో ఎలా ప్రవర్తిస్తారో… ఎవరూ ఊహించలేరు. వాళ్ళు ఇంకా హోల్డన్ ఆత్మ విశ్వాసాన్ని, ఆత్మ బలాన్ని ప్రశ్నిస్తారు . హోల్డన్ తమ్ముడు అల్లే మరణం తర్వాత అతనిలో కొంత అనిశ్చిత మనస్తత్వం పెంపొందింది . ప్రాణంగా వున్న తమ్ముడి ఆకస్మిక మరణం, అదృశ్యం అతని బాల్యంలో ఒక అర్థం కానీ ప్రకృతి వైపరీత్యం . దాంతో అతను ఎవరికీ చేరువ కాలేని స్థితికి చేరుకున్నాడు. తన చుట్టూ ఎవరూ ఛేదించలేని ఒక విపరీతమైన, విచిత్రమైన మానసిక కవచాన్ని ఏర్పరచుకున్నాడు. అయినా ప్రతి క్షణం ఆ కవచం నుండి రావడానికి కొత్త ప్రేమ బంధాల్ని , స్నేహ సంబంధాలను పెంచుకోవడానికి ప్రయత్నిస్తాడు .


అపద్దాలు చెప్పడం ,మోసపూరితమైన పనులు చేయడం ఆత్మవంచనతో కూడుకున్నవి , దీన్నే పదేపదే ఫోని నెస్ గా హోల్డన్ చెబుతాడు. హోల్డన్ కూడా ఈ రెండు పనులు చేసినందుకు సిగ్గుపడతాడు. తానుకూడా హిప్పోక్రటిక్ గా మారడం సత్యమని అంగీక రిస్తాడు .


పుస్తకం పేరును శాలింజర్ రాబర్ట్ బర్న్ రాసిన ఒక పాట “కమింగ్ త్రూ ద రై “ నుండి తీసుకున్నాడు . ఈ పాట ఈ నవలకు ఆయువు వంటిది. హోల్డన్ 16 వ చాప్తర్ లోనే ఈ పాట పాడుకుంటూ పిల్లలు సహజంగా చేసినట్లే వీధికి ప్రక్కగా నడవకుండా (అదే ఫుట్ పాత్ మీద నడవకుండా ) వీధి మధ్యలో నడుస్తూ పోతాడు . మళ్లీ ఫోబ్ నీ జీవిత లక్ష్యం ఏమిటని అడిగినప్పుడు “కమింగ్ త్రూ ద రై “పాటలో అతను ఊహించుకున్న దృశ్యాన్ని వివరిస్తాడు. ఆ దృశ్యంలో “ఒక గోధుమచేలో ఎత్తైన కొండ దగ్గర పిల్లలంతా ఆడుకుంటూ పాడుకుంటూ ఎగురుకుంటూ గుమిగూడివున్నారు. వాళ్ళు ఎత్తైన కొండమీద వున్నారు కాబట్టి వాళ్ళు పడిపోకుండా పట్టుకొని కాపాడాలని” అతను ప్రయత్నిస్తాడు. ఆ పాటలో “ఇఫ్ ఎ బాడీ కాచ్ ఎ బాడీ కమింగ్ త్రూ ద రై “ అని హోల్డన్ పాడుకుంటాడు. కానీ అంతలోనే ఫోబ్ రాబర్ట్ బర్న్ పాటలో “ఇఫ్ ఎ బాడీ మీట్ ఎ బాడీ కమింగ్ త్రూ ద రై “.అని సరి చేస్తుంది. మీట్ (కలుసుకోవడం ) అని కాకుండా కాచ్ (పట్టుకోవడం) అన్న పదం హోల్డన్ వాడడంలో అమాయకత్వం అనే ఎత్తైన కొండల అంచులపై ఆడుకుంటున్న పిల్లల్ని “పట్టుకుని” (కాచ్ )పెద్దల జ్ఞాన ప్రపంచం అనే లోయలోకి పడిపోకుండా కాపాడ్డం అని అర్థం స్ఫురిస్తుంది.


హోల్డన్ తాను మారుతున్నాడు తప్ప నాచురల్ హిస్టరీ మ్యూజియంలో ఏవీ మారడం లేదు. అతనెన్ని సార్లు వచ్చినా మ్యూజియంలో అదే స్థితి ఉంది. అతని ఊహల్లో వున్న ప్రపంచంలో మార్పు లేదు, ఇక్కడా లేదు. అందుకే హోల్డన్ ఆ మ్యూజియంను అంత ఇష్టపడతాడు. అతనికి ఎప్పుడూ ఊహించని విధంగా మారే వాస్తవిక ప్రపంచం అంటే ఇష్టం లేదు. ఎందుకంటే ఆ ప్రపంచంలో ఊహించని ఎన్నో దారుణాలు ,మార్పులు జరుగుతాయి, హోల్డన్ కు ప్రియమైన అల్లే మరణం వలన ప్రపంచంలోని ఏ ప్రేమను కోరుకున్నా దాన్ని త్వరలో కోల్పోతానేమో అన్న భయంతో, ముందే ఆ బంధాల నుండి దూరం పోతాడు, ప్రేమలకు భయపడతాడు.


హోల్డన్ ఎప్పుడూ సెంట్రల్ పార్క్ లాగూన్లోని బాతులు చలికాలంలో ఎక్కడికి పోతాయో అని ఆలోచిస్తుంటాడు. ఈ ఆలోచన అతని లోని స్వచ్ఛమైన పసితనాన్ని సూచిస్తుంది అంతేకాదు మిగతా విషయాల్లో అతని ఆలోచనలు అంత ఆరోగ్యకరంగా ఉండవు. ప్రపంచంపై అతని కోపం ప్రతి విషయం లోను కనపడుతుంది ఒక్క బాతులగురించి తప్ప . బాతుల గురించి మాట్లాడినప్పుడు అతను విశ్వంలోని మర్మాల్ని తెలుసుకునే ఆసక్తిని కనపరుస్తాడు . ఇంకా మిగతా ఏ విషయం లోను అతను కుతూహలాన్ని ప్రదర్శించడు. అంతే కాక బాతులు మరొక కోణంలో గొప్ప జీవన సత్యాన్ని , ప్రకృతి రహస్యాన్ని కూడా హోల్డన్ కు పాఠకుడికి కూడా బోధిస్తాయి . కొలను లోని పట్టుదల గల బాతులు తమకు అనుకూలంగా లేని వాతావరణాన్ని వదిలి అదృశ్యం అయిపోతాయి మళ్లీ అనుకూలంగా మారగానే వచ్చేస్తాయి. విశ్వంలో కొన్ని మార్పులు అశాశ్వతమైనవి, అనివార్యమైనవి కూడా. ఇవి నిజానికి హోల్డన్ కు ఒక మంచి పాఠం చెబుతున్నాయి.అయితే తమ్ముడి అల్లే మరణం, అదృశ్యం అతన్ని త్రీవ్రంగా గాయపరిచాయి. అంతేకాదు జీవితం లోని ఆస్థిరతను, మార్పును, మరణంలో మర్మాన్ని అవి చెప్పకనే చెప్పాయి. అయితే అన్ని విషయాల్లో మార్పు శాశ్వతం కాదని, అది చక్రభ్రమణం కలిగి ఉంటుందని ,చలికాలం అదృశ్యం అయే బాతులు మళ్లీ వసంత ఋతువుకు తిరిగి వస్తాయని అందరూ గ్రహించాలని రచయిత అభిప్రాయం. కొలనులో నీళ్లు చలికాలం గడ్డకడతాయి, వసంతకాలం రాగానే కరుగుతాయి ఈ ప్రపంచం కూడా కొలను లాగానే “సగం గడ్డ కట్టి ఉంటుంది సగం కరిగి ఉంటుంది “. కొలను కూడా రెండు స్థితుల్లో ఉంటుంది హోల్డన్ ఎలాగైతే సగం ఇటు బాల్యానికి సగం అటు యవ్వనానికి మధ్య స్థితిలో వున్నాడో అలా .


జీవితం సర్దుబాటు అన్నట్లుగా ఎంత ఆ వ్యవస్థని వ్యతిరేకించినా, విమర్శించినా, పారిపోవడానికి ప్రయత్నించినా మనిషి కొన్నిటి నుండి తప్పించుకోలేడు.హోల్డన్ ఎంత తన స్కూలును, టీచర్లను, విద్యావ్యవస్థను, పెద్దలలోని ఫోనినెస్ ను విమర్శించినా చివరికి మళ్లీ స్కూలుకు వెళ్లినట్లు నవల ముగింపులో తానే చెప్పుకుంటాడు. మిస్టర్ ఆంటోలిని చెప్పే మాటల్ని ఇక్కడ మనం ఉదహరించవచ్చు .” నీకు మంచి అవగాహన ఉంటే స్కూల్లో నిన్ను నీవు అప్లయ్ చేసుకో. నువ్వు ఒక విద్యార్థివి… ఆ ఆలోచన నీకు ఆసక్తిగా అనిపించినా అనిపించకపోయినా నీవు విజ్ఞానం ప్రేమలో వున్నావ్. నీవు తెలుసుకుంటావని నేను అనుకుంటాను.. మానవుని ప్రవర్తనతో గందరగోళo పడి ,భయపడి ,ఆఖరికి విసిగిపోయిన వాళ్లలో నువ్వు మొదటి మనిషివి కాదని తెలుసుకుంటావు. ఈ విషయంలో నీవు ఏ మాత్రం ఒంటరి కాదు, అది తెలుసుకున్నందుకు ఎగ్జయిట్ అయి ఉత్తేజాన్ని పొందుతావు . చాలా మంది నైతికంగా ,ఆధ్యాత్మికంగా ఇబ్బంది పడుతున్నారు..ఇప్పుడు నీవు ఇబ్బంది పడుతున్నట్లు. వాళ్ళలో కొంతమంది వాళ్ళ ఇబ్బందులన్నిటిని సంతోషంగా దాటుకున్నారు . నువ్వు వాటినుంచి నేర్చుకుంటావు . ఒక వేళ నువ్వు అనుకుంటే . ఏదో ఒక రోజు,ఒక వేళ అందించడానికి నీ దగ్గర ఏదైనా ఉంటే ఎవరో ఒకరు నీ దగ్గర నుంచి దాన్ని అంది పుచ్చుకుంటారు. అది ఒక మంచి ఇచ్చి పుచ్చుకునే ధోరణి. ఆది కేవలం చదువు కాదు. అది ఒక చరిత్ర . అది ఒక కవిత్వం. చదువుకున్న మంచి విద్వత్తు వున్న మనుషులు, ఒకవేళ వాళ్ళు తెలివైన సృజనాత్మకత కలిగిన వాళ్ళయి ఉంటే - దురదృష్టవశాత్తు, అది చాలా అరుదైన విషయం. వాళ్ళు వాళ్ళ వెనకాల లెక్కలేనన్ని ఎక్కువ విలువైన సత్యాలను వదిలి వెళతారు.” వాటిని హోల్డన్ అంగీకరించినట్లేనా ?




ప్రచురణ విశాలాంధ్ర , డిశంబర్, 12,2016

No comments:

Post a Comment