Sunday, 13 December 2015

స్త్రీ


కొద్ది కాలం క్రిందట మేము అమ్మమ్మ గారి వూరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. మా తాతగారితో పిల్లలందరికీ బాగా చనువు, నేను ఆయనకు మొదటి మనుమరాల్నికావడంతో నన్ను బాగా ముద్దు చేసేవారు. సమయం దొరికితే చాలు ఆయన్ని కథలు చెప్పమని వేధించేవాళ్ళం. చాలా చిన్నప్పుడు పేదరాసి పెద్దమ్మ కథలు; తర్వాత సింద్ బాద్, ఆలీబాబా కథలు, చరిత్రలోని గొప్పవాళ్ళ గురించి చెప్పేవారు.వాళ్ళ జీవిత చరిత్రలు చదివి మాకు వినిపించేవారు. సెలవుల్లో మేము,మా చిన్నమ్మ,మామయ్యల పిల్లలు అందరం కలిసి మెలిసి, ఆటలు, పాటలు, అల్లర్ల తో గడిపే వాళ్లము.తాతయ్య చాలా పనిలో తలమునకలై వుండేవారు. మూడు ఊర్లకు ప్రెసిడెంట్ గా ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో తాతయ్య ఇల్లు ఎంతో హడావుడిగా వుండేది. అయినా తాతయ్య కు కొంచం తీరిక దొరకగానే "పిల్లలు రండర్రా" అని దగ్గర కూచో పెట్టుకుని మా చదువుల గురించి, వాకబు చేసి తర్వాత మమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మా జ్ఞానాన్ని మా సమాధానాల ద్వారా కని పెట్టేవారు. కథలు చెప్పి మమ్మల్ని ఊహా ప్రపంచం లో విహారింపజేసేవారు అదే సమయం లో ఏది చేయాలో, ఏది చేయకూడదో మంచి నీతి ని బోధించే విషయాన్నిఆధారంగా చేసుకుని చెప్పేవారు. మేము పెద్దగయ్యాక ఆటలు అవి తగ్గించాక అలా తాతయ్య దగ్గర కూర్చుని కథలు చెప్పించుకోవడం తగ్గి పోయింది. ఒక సారి పెద్ద మామయ్య కొడుకు అజయ్, ఇంకో మామయ్య కొడుకు అనుష్, ఆడ వాళ్ళగురించి తక్కువ చేసి మాట్లాడ్డం తాతయ్య విన్నట్టు గా వుంది. మమ్మల్ని అందరిని దగ్గరగా కూర్చో పెట్టుకుని మామూలుగా అవి ఇవి మాట్లాడుతూ," మీ సంస్కారo మీరు స్త్రీలకు మీరిచ్చే గౌరవాన్ని బట్టి వుంటుంది" అన్నారు. ఆడపిల్లలం అందరం కాసేపు వెలిగి పోయాం. అబ్బాయిలు కొంచం చిన్న బుచ్చుకున్నారు. తర్వాత తాతయ్య నెమ్మదిగా చాలా ఏళ్ళ క్రిందట జరిగిన ఒక సంఘటన చెప్పడం ప్రారంభించారు.

"నాకు స్త్రీలంటే విపరీతమైన కోపం వుండేది, దానికి కారణం మా సవతి తల్లి. మా అమ్మ నేను చిన్నగా వున్నప్పుడు, నా తమ్ముడు పుట్టగానే చనిపోయింది. నాకప్పుడు నాలుగేళ్ళు. అమ్మ ప్రేమ కానీ ఆమె రూపం కూడా నాకు గుర్తు లేదు. పిన్ని మమ్మల్ని పట్టించుకునేది కాదు. పనివాళ్ళ చేతుల్లోనే పెరిగాము ఇద్దరం. పిన్ని నాన్నని తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఆడించేది. మాకు అన్నం తినడానికి కూడా భయంగా వుండేది. ఏ నిముషం లో ఆమెకు కోపం వస్తుందో, వీపు విమానం మోత మ్రోగుతుందో మాకు తెలియదు. అన్నం తినేప్పుడు ఒక్క మెతుకు క్రింద పడ్డా, నీళ్ళు త్రాగేప్పుడు ఒక్క చుక్క వొలికి పోయినా, ఎప్పుడు వచ్చి మా వీపు చీరేస్తుందో అని భయంతో బిక్క పడి చచ్చేవాళ్ళం. దీనికి తోడు అమ్మమ్మ వాళ్ళింటికి వెళితే అక్కడ మామయ్యలు మమ్మల్ల్ని అపురూపంగా చూసుకుంటుంటే, అత్త లిద్దరూ మాకెందుకీ పీడ అని మా ముందే ఈసడించేవాళ్ళు. దాంతో నాకు ఆడవాళ్ళలోనే చెడు ఆలోచనలు ఉంటాయని, ప్రేమ విలువలు తెలియవని, మానవత్వం లేని మర బొమ్మలనే నిర్ధారణకి వచ్చాను. అది తప్పని నాకు చెప్పేవాళ్ళు లేకపోయారు. పైగా నాకు కనిపించిన స్త్రీలంతా నాకు అదే అభిప్రాయాన్ని కలిగించారు. నాకు పదిహేనేళ్ళు వచ్చేప్పటికి మా పిన్నికి ఒక కొడుకు, తర్వాత కాన్పులో ఆడపిల్లను ప్రసవించి చనిపోయింది.పదవ తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చేప్పటికి తమ్ముళ్ళు, వారం రోజుల పసికూన వున్నారు.

ఆ పసి కూన సైతం ఆడపిల్ల కావడం తో నాకు దాన్ని చూడ్డం కూడా ఇష్టం వుండేది కాదు. తర్వాత అదే వూర్లో వుండే పిన్ని అమ్మగారు పసిపిల్లని తీసుకెళ్ళి పోయారు. తల్లి లేని మమ్మల్ని సరిగా చూడకుండా మమ్మల్ని సాధించిన పాపానికి, ఆమె బిడ్డలకు కూడా అదే గతి పట్టిందని కసిగా అనుకున్నాను. తర్వాత కొంత కాలానికి నాన్నకూడా గుండె పోటుతో కాలం చేసారు. పి.యు.సి. చదువును ఆపేసి వ్యవసాయం చేయక తప్పలేదు. నా తమ్ముల్లిద్దరూ అప్పుడప్పుడు వెళ్లి చెల్లిని చూసోచ్చే వాళ్ళు..పిన్ని కొడుకును నా తమ్ముడి గా అంగీకరించాను, కానీ చెల్లి పట్ల నాకే భావం వుండేది కాదు. తమ్ముల్లిద్దర్నిచదువుకు పంపాను. ముందు నుంచి ఏ ఆధారం లేక మా ఇంట్లోనే వుండి పనులు చేసే మా దూరపు చుట్టం సూరమ్మ మాకు వండి పెట్టేది. పెళ్లి చేసుకోమని ఇంటిని చూసుకునే ఇల్లాలు వస్తే ఇంటికి దీపం పెడుతుందని ఆ సూరమ్మ చేతి వంట తప్పించుకోవచ్చని బంధువులు ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు.నేను నవ్వి వూరుకునేవాడ్ని .కానీ రాను రాను సలహా కాస్త సతాయింపుగా మారేటప్పటికి నాకు స్త్రీలపై వున్న ద్వేషం,అసహ్యం పెల్లుబికాయి. పిన్నిని, అత్తయ్యల్ని ఉదాహరణ గా చెప్పి వాళ్ళతో ఘర్షణ పడ్డం ఇష్టం లేక తమ్ముళ్ళు అభివృద్ధిలోకి వచ్చేదాకా పెళ్లి ప్రశక్తి లేదని తీర్మానించాను. అయినా అప్పుడప్పుడు బంధువులో, ఆడపిల్లల తల్లిదండ్రులో నన్ను వేధించేవారు. నాలో రోజు రోజుకు స్త్రీలంటే అసహ్యం, వ్యతిరేకత పెరిగి పోయాయి. ఎప్పుడైనా చెల్లి కనపడి మాట్లాడడానికి ప్రయత్నించినా ముభావంగా ఉండేవాడిని. స్నేహితులు ఆడవాళ్ళ గురించి మాట్లాడినా, ప్రేమలో పడ్డట్టు చెప్పినా తీవ్రంగా నిరసించేవాడిని. ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్ళే వాడ్ని కాదు. తప్పని సరయిన పెళ్ళిళ్ళు అయితే తమ్ముళ్ళను పంపే వాడిని. నేను ప్రత్యేకించి చెప్పక పోయినా నేను స్త్రీ ద్వేషిననే విషయం చాలా మందికి తెలిసి పోయింది."అలాగా!" అని నన్ను ఎవరైనా అడిగినా ఖండించకుండా నవ్వి ఊరుకునే వాడిని.

ప్రేమకు ప్రతిరూపంగా వుండే తాతయ్యేనా తాను స్త్రీ ద్వేషినంటున్నాడు ... ఆశ్చర్యపోయా . తాతయ్య చెప్పడం మొదలు పెట్టాడు


"ఒక రోజు ఒక స్నేహితుడ్ని కలిసేందుకు ఓ పదిమైళ్ళ దూరంలో వున్న పక్క వూరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మనూరినుండి బస్సుల్లేవ్. ఎద్దులబండి ఒక్కటే ఆధారం ..మంచి వ్యవసాయం పనులు జరిగే కాలమది, కాబట్టి నా ఎద్దులబండి కాకుండా వేరే స్నేహితుడి బండి వెళుతుంటే వెళ్లాను. వూరికి వచ్చేందుకు తిరుగు ప్రయాణం అడవి గుండా చేయాల్సి వచ్చింది. ఆ దారి వెంట చాలా సార్లు ప్రయాణం చేసినా, ఒంటరిగా నడిచి ప్రయాణం ఎప్పుడూ చేయలేదు. వేటికి భయపడని నేను ధైర్యంగా బయలు దేరాను. హుషారుగా నడక సాగించాను...పచ్చని చెట్లమధ్య కాలిబాటలో ప్రయాణం అద్భుతంగా వుంది. పియ్యూసీ లో చదువుకున్న రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన "స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవెనింగ్" పద్యం గుర్తు వచ్చి,గట్టిగా పాడుకుంటూ, అడవిలో నాకంఠం ప్రతిధ్వనిస్తూ వుంటే అదోకరకమైన అనుభూతికి లోనై పరవశించి ముందుకు పోతూవున్నా.

ఎవరో నావెనకే నడుస్తున్నట్టు అనిపించి తిరిగి చూశా!ఒక ఇరవై,ఇరవై ఐదుకు మధ్య వయసున్నఒక నిండు చూలాలు చేతిలో ఒక సంచితో నడుస్తూ వస్తోంది.సహజంగానే నాకున్న స్త్రీ ద్వేషంతో ఆమెను పట్టించుకోకుండా ముందుకు సాగాను. నేను ఎంత వేగంగా నడిచినా అతి తొందరలోనే ఆమె నా సమీపంలోకి రాగలుగుతోంది.ఆమె ఎత్తైన పొట్ట చూస్తే నాకు అసహ్యం వేసింది.ఎంత చీత్కారంగా తిట్టుకున్నానో...! యింత అందమైన ప్రకృతిలో,అందమైన సమయంలో ఛీ ఈవిడ తగిలిందేమిటి నాకు అనుకున్నా.నేను వేగంగా వెళ్ళేకొద్దీ ఆమె వేగం పెంచుతోంది.ఆమె ఆయాసంగా ఊపిరి తీస్తున్న శబ్దం నాకు వినపడుతోంది.అయినా వొంటరిగా ఇలా అడవిలో బయలు దేరిందేమిటి? నాలో నేను అనుకుంటూ వేగంగా ముందుకు పోయాను. ఎండిన ఆకులపై ఆమె అడుగుల సవ్వడి నాకు వినపడలేదు.హమ్మయ్య!ఇంక నా వేగానికి ఆమె రాలేదు.. ఒకరకమైన నిశ్చింతతో ఊపిరి పీల్చుకున్నా! చాలా దూరం నడిచాక నాకు కాస్త విశ్రాంతి తీసుకొవాలనిపించినా, మళ్ళి ఆమెను చూడాల్సి వస్తుందని భయం వేసి ముందుకు అడుగు వేశా! ఇంతలోనే కారుమబ్బులు కమ్మినయ్, చూస్తూండగానే ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయి,పెద్దగా అయింది.చెట్లకొమ్మలు గాలికి ఎక్కడ విరిగి నాపై పడతాయో అన్న భయం వేసింది.అడుగు ముందుకు పడ్డం లేదు, బురద బురదగా వున్న దారిలో కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నా!ఎలాగో దగ్గరలోనే ఒక పాడుపడిన సత్రం కనిపించింది. వెళ్లి దాంట్లో తలదాచుకున్నా!వర్షం తీవ్రమైoదే తప్ప తగ్గలేదు.చూస్తుండగానే చీకటి పడింది.సత్రం అరుగుపై కూర్చుని వర్షం ఎపుడు తగ్గుతుందో అని ఎదురు చూస్తున్నా! తోడులేకుండా దూరాభారాలు పోకూడదని పెద్దలెందుకంటారో అర్థమైంది.వెంటనే నిండుచూలాలు గుర్తుకొచ్చింది.ఆమె ఏమయిపోయిందో అన్న ఆలోచనని, నాకెందుకు? అన్ననిరాసక్తతతో అణచివేశాను. తర్వాత వర్షం తగ్గే సూచన కనిపించక పోయేటప్పటికి అరుగు మీదే పడుకున్నాను.చలిగా వుంది,ఆకలిగా వుంది అయినా అలసటగా నిద్రపోయాను.ఎప్పుడో ఏదో ఆక్రందన వినిపిస్తే ఉలికి పడిలేచాను.


నావెంటే వస్తూన్న ఆమె ఏమయ్యిందోఅనుకున్నా!ఎప్పుడో ఆమె నేనున్న సత్రానికే చేరుకుంది."అన్నా!ఒక్క దాన్నిఅమ్మగారింటికిపోతా వున్నా! నన్నుతీస్కపోవడానికి, ఈరోజు రేపు అంటూ మా అన్నరాకపాయ,ఇంట చూడ ఎవరు లేకపోయిరి,నా మొగుడు పని కోసమని బోయి శాన్నాల్లయింది,విశయం తెలియరాలా!ఒక్క దాన్ని వూరు చేరేవరకు నీ తోడుగా నడుస్తా,వేగం వెళ్ళ మాక" అంది.

పలకకుండా వుండిపోయా.ఏమనుకుందో తర్వాత ఆమె మాట్లాడలేదు కానీ మూల్గుతూ వుంది. నాకు ఆమె అక్కడ ఉందన్న ఊహనే చికాకు కలిగించింది. ఆమెను పట్టించుకోకుండా కాసేపు గడిపాను.వర్షం తగ్గుముఖం పట్టినా ఆ చీకట్లో..బురదలో నడవడం సాధ్యపడదు.ఒక ఆడదానితో...ప్చ్ ఈ సత్రంలో ఉండాల్సి రావడం ఛ ఛ ...ఏం ఖర్మం రా! మనం దేన్నీ అసహ్యించు కుంటామో అదే మన నెత్తిన పడుతుంది ...అలాగే వుంది నా పరిస్థితి.తర్వాత ఎలాగో తంటాలు పడి అరుగు మీదే నిద్రపోయా...! ఉరుము శబ్దానికి ఉలికి పడి లేచాను. మరొక ప్రక్క అరుగుపై ఆమె మెలికలు తిరిగి పోతోంది.పొట్ట పట్టుకుని మూల్గుతోంది. నా నిర్లక్ష్యపు వైఖరి అర్థమైన ఆమె, నన్నేమీ పలకరించలేదు.నేను లేచి కూర్చున్నా,మెరుపుల వెలుతురులో ఆమె ముఖంలోబాధని,పళ్ళబిగువున ఆపుకుంటున్నఏడుపుని చూడగలిగాను. ఆమెకేమయ్యిందో నాకు అర్థం కాలా! సమయం ఎంతైందో కూడా తెలియలేదు! ఆమె ఆక్రందన పెద్దగయ్యింది.మూలుగునుండి ఆమె ఏడుపు కేకలుగా మారింది. అమ్మా, అమ్మా అంటూ ఆమె చేసే ఆర్తనాదం నా హృదయాన్ని పిండివేయ సాగింది. నాకు తెలియకుండానే నేను స్పందించ సాగాను.ఏమైనా చేయగలనా అనిపించ సాగింది.కానీ ఏమి చెప్పాలో, ఏమి అడగాలో ఆలోచించుకునే లోపలే తెల్ల వారసాగింది.ఆమె అరుపులు తీవ్రమయినై, నాకు అర్థమైంది ఆమెకు ప్రసవం అవుతోందని...నేనేమి చేయగలను? అభిమానవతి లాగుంది నన్ను ఏ సహాయమూ అడగలేదు. నా మనస్సును కుదుట పర్చుకుని ఆమె దగ్గరకు వెళ్లాను.నాకు ఒక్కసారి కళ్ళు తిరిగాయి.ఆమె బట్టలన్నీ రక్తసితం అయ్యాయి. ఆమె కళ్ళ కొనల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి.ఎత్తుగా వున్న పొట్టపై చేతులు వేసి గట్టిగా నొక్కు కుంటూ ఆమె అరుస్తోంది.


"ఏమి కావాలి? నేనేమి చేయగలను ?" నా జీవితంలో ఒక స్త్రీ తో నా అంతకు నేనే మాట్లాడ్డం అదే మొదటి సారి. నీళ్ళు అన్నట్టు సైగ చేసింది. నీళ్ళు తెచ్చేందుకు అక్కడ ఏమీ లేదు.నా బుజాన వున్నతుండును వర్షం నీటితో తడిపి పిండి వేసి మళ్ళి తడిపి ఆమెకు అందించాను. అరిచి అరిచి ఎండిపోయిన గొంతుకు ఆమె నీటిని ఆ తుండు నుండి పిండుకోలేకుంది. నేను ఆమె నోటి దగ్గర నీటిని పిండి త్రాపించాను. ఆమె సైగ చేసి తన సంచి ఇవ్వమని అడిగింది ,ఆ సంచిలోంచి బట్టలు తీసి సత్రం నేల మీద పరచమంది.ఆమె చెప్పినట్లు చేసాను.మెల్లిగా లేచి నిలబడింది.ఆమె కాళ్ళమధ్యనుండి రక్తం ధారగా కారుతుండగా కదిలింది.నేలపై పడుకోవడానికి ఆమెకు సహాయం చేసాను.గట్టిగా నా చేయి పట్టుకుంది. నేను స్పృహలో వుండగా ఏ స్త్రీ స్పర్శ ను ఎరగను. ఆమె అమ్మా అనే అరుపుకు బదులుగా అన్నాఅన్నా అని అరవ సాగింది.నా చేతిని వదలకుండా మెలికలు తిరగ సాగింది.ఆమె పరిస్థితికి నాకు కన్నీరు ఆగలేదు.నా బుద్ధి ఎరిగి నప్పటి నుండి నేను ఏడవలేదు. ఇప్పుడు ఒక అనామకురాలి కోసం ఏడుస్తున్నాను.ఆమెతో పాటు ఏడుస్తున్నాను,నాకు తెలియకుండానే ఆమె తలని నా వొడిలో పెట్టుకున్నాను.విలా విలా ఏడుస్తూ, మూల్గుతూ,అరుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వుంటే ఆమెకు మరణం తప్పదని నాకు అనిపించింది.నా మనసును చదివినట్లు గా ఆమె "అన్నా.. నాకేమన్నాఅయితే నా బిడ్డని మా అమ్మకు అప్పగించన్నా! మా అమ్మ పేరు.... మళ్ళి నొప్పితో కేకలేయసాగింది. రక్తపు మడుగులో మునిగి వున్న ఆమెను చూస్తూ నేను నా అంతరంగంలోని మలినాన్ని కడుక్కున్నాను.ప్రార్థన తెలియని నేను ఈ సృష్టికి కారణమైన ఏ అపూర్వ శక్తి అయినా వుంటే ఆమెను కాపాడాలని ప్రార్థించాను. ఎత్తుగా వున్న ఆమె పొట్ట కిందికి జార సాగింది.ఆమె అరుపులు ఎక్కువయి కొద్ది సేపు ఆమె మూర్చపోయింది.మళ్ళీ కేక వేస్తూ కొట్టు మిట్టాడింది.అంతలోనే పసిబిడ్డ అరుపు వినపడింది.ఆమె అరుపు ఆగిపోయింది.... కాసేపు నాకేమి తోచలేదు. క్యారు క్యారు మంటూ పిల్లాడి ఏడుపు...కానీ ఏదో సందేహం కాసేపు అలాగే ఉండిపోయాను...ఆమెకు స్పృహ లేదు..గుండె దిటవు చేసుకుని ఆమె తలను సంచి పై పెట్టి ఆమె కాళ్ళ మధ్య వున్న బిడ్డను లాగాను జిడ్డు జిడ్డుగా రక్తపు ముద్దగా వున్న బిడ్డకు బొడ్డు నుండి వేలాడుతున్న ప్రేగులాంటి దాన్ని చూసి ఏమి చేయాలో తోచలేదు.బిడ్డను ఆమె కాళ్ళ ప్రక్క వేసి,ఆమెను సమీపించాను.తట్టి లేపాను పలక లేదు. ఎంత కదిలించినా ఆమె కదల లేదు.పుట్టిన బిడ్డ బొడ్డునుండి వ్రేలాడుతున్నది వేరు చేస్తారని తెలుసు కానీ ఎలా చేయాలో, ఏమి చేయాలో అర్థం కాలా! ఏ పని చేసినా తప్పు పట్టడానికి వీల్లేకుండా చేస్తానని నాకు చుట్టు ప్రక్క ఊర్లలో పేరు ప్రఖ్యాతులున్నాయి.నమ్మిన వారిని ఆరు నూరయినా,నూరు ఆరయినా ఆదుకుంటానని..పేరు పొందాను.కానీ ఇప్పుడు ఈ పసికూనని,ఆ తల్లిని ఎలా కాపాడాలో తోచడం లేదు.... నన్ను నమ్మి అన్నా అని పిలిచి నా చేతుల్లో ప్రాణాలు పెట్టిందే ఈ అభాగ్యురాలు! అయ్యో ఏమిటి చేయడం? నాలో నేను తీవ్రంగా కుమిలి పోయాను. ఏడుస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా చలిగాలికి చిగురుటాకులా వణికి పోతోంది.ఏదో స్పురించి బిడ్డను అక్కడే పడుకోబెట్టి బయటకు పరిగెత్తాను.వర్షపు నీటిలో తడిసి అడవంతా బురదగా వుంది.పదునుగా వున్న రాయి కోసం వెదకి పట్టుకున్నా,నిలిచి వున్న నీటిలో రాయిని కడగి .. మొలత్రాడు త్రెంచి పసిబిడ్డ బొడ్డును కట్టి రాయితో కోసాను. బిడ్డను ఆమె సంచిలోంచి బట్టలు తీసుకుని చుట్టేసాను.మళ్ళీ తల్లిని కదిలించి చూసాను ప్రాణం వున్నట్టుగానే వుంది కానీ పలుకు లేదు.ఏడుస్తున్న బిడ్డకు ఆకుల మీద నీటి బిందువుల్నిత్రాపించాను. ఏడుపు ఆపింది.ఇంక బిడ్డను గుండెలకు అదుముకుని.. పరుగులాంటి నడకతో వేగంగా వూరు చేరి, బిడ్డను సూరమ్మ చేతిలో పెట్టి వూర్లో పురుడు పోసే మంత్ర సానిని వెంట తీసుకుని బండి కట్టమని ఓబులేసును పురమాయించి,వైద్యం తెలిసిన వూర్లో పెద్దాయనను తీసుకుని బయలు దేరాను.ఎడ్ల పందాల్లో గెలుపు కోసం కూడా నేను నా ఎద్దులని అలా తొందర పెట్టలేదు.


నా అజ్ఞానాన్నిపోగొట్టడానికే ఆ మాతృమూర్తి నా వెనక వచ్చిందేమో! ఒక తల్లి తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి,నరకయాతన అనుభవించి, యింత భయంకరమైన నొప్పిని తట్టుకుని, ప్రాణ కోటిని ఈ ప్రపంచానికి అందజేస్తుందా! మగవాడి క్షణిక సుఖానికి ఫలితంగా స్త్రీ యింత దుర్భర మైన వేదన పొంది బిడ్డల్ని కంటుందా! నన్ను కన్నతల్లి కూడా ఇలాగే ..ఇలాగే మరణయాతన అనుభవించి నను కన్నదా! ఆ ప్రసవ వేదనలోనే నా తల్లి, పిన్ని మరణించారు.పిన్నిని ద్వేషించానే ...కానీ పిన్ని గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదు.చిన్నవయసు ఆమెకు, నాన్నను పెళ్లి చేసుకునేప్పటికి.. ఆటపాటల వయసులో పెళ్లి, బాధ్యత తెలియని భర్త, పిల్లల భారం, కుటుంబ భారం, ఎదగని వయసులో చెప్పుడు మాటల ప్రభావం.. పాపం ఏమిచేస్తుంది? చాతనయిన కోపం మాపై చూపించింది. ఏ పాపం చేసినా స్త్రీ పుణ్య మూర్తే!ఆమె అన్నితప్పుల్ని కడిగే మంత్రజలం మాతృత్వం! ఆనాటి నుండి ప్రతి స్త్రీ నాకు వున్నతురాలు... నాలోని స్త్రీ ద్వేషి స్థానే సాత్వికుడైన స్త్రీ పక్షపాతి ఉదయించాడు.మా అమ్మ ఫోటో ప్రక్కనే పిన్ని ఫోటోను కూడా పెట్టుకున్నా.స్త్రీల గురించి అగౌరవంగా ఎవరు మాట్లాడినా, స్త్రీ యొక్క గొప్పతనాన్ని వివరించేవాడ్ని.నాకు చాతనయినంత విధంగా చుట్టు ప్రక్కల గ్రామాలో ప్రసూతికి అనువైన వైద్య సేవలు అందించడానికి ప్రయతిస్తూనే వున్నాను.నన్ను మనిషిని చేసిన ఆ తల్లికి నేను ఎప్పుడూ రుణ పడి వుంటాను..." తాతయ్య రెండు చేతులు జోడించి నమస్కరించాడు.

"తాతయ్యా ఆమె కేమయ్యిందో చెప్పలేదు..." తడి నిండిన కళ్ళను తుడుచుకుంటూ,మాట రాని గొంతును పెగల్చుకుని అడిగాను.


"ఏమయ్యుంటుంది? వెళ్ళింది...చిన్నరెడ్డా మరెవరన్నానా! పరుగు తీసింది ఎద్దుల పోటీల్లో ఎదురులేని మా పొట్లగిత్తలురా!తల్లి చల్లగా వుంది.. ఆ బిడ్డకి నేనే దగ్గరుండి పెళ్లి చేశా.."

"అర్థ మయిందా ఆడవాళ్ళ విలువ! సంస్కారవంతుడు ఎప్పుడూ ఏ స్త్రీని తక్కువ చేసి చూడడు...చూసాడా! వాడికున్న మిగతా ఔన్యత్యం అంతా శూన్యమే! నా తప్పును నేను తెలుసుకున్నట్లే, మీరు తెలుసుకోవాలనే ఇది చెప్పాను"

అందరూ గంభీరంగా వుండి తర్వాత నిట్టూర్పు వదిలారు.అనుష్,అజయ్ తాతయ్యకు దగ్గరగా వెళ్ళారు,మౌనంగా తలలు వంచి నిలుచున్నారు. తాతయ్య వాళ్ళ తలల్ని ప్రేమగా నిమిరారు.


--

(ప్రేరణ; చిన్నప్పుడు చదివిన ఒక అనువాద రష్యన్ కథ. పేరు గుర్తులేదు)
Published in Vakili in June 2014

No comments:

Post a Comment