Sunday, 13 December 2015

పురుషులందు ....!


ఆఫీసు పని ఒత్తిడిలో చిరాగ్గా వున్ననాకు సెల్ లో నాగిరెడ్డి పేరు చూడగానే ఇంకా చిరాకేసింది.వాడికేం స్కూల్లో చెప్పాల్సిన చదువులు చెప్పేసి హాయిగా ఇంటికొచ్చి, స్నానం చేసి తెల్లటి జిబ్బా,పైజామా వేసుకుని ఇంటికి దగ్గర గా వున్నపార్కుకు వ్యాహ్యాళికి వచ్చేస్తాడు.అక్కడికి వచ్చినప్పటి నుండి ఎప్పుడొస్తావ్ అని నాకు ఫోన్ చేస్తూనే ఉంటాడు. నేను ఆఫీసు నుండి ఎంత ఆలస్యంగా వచ్చినా, నా కోసం ఎదురు చూస్తూనే ఉంటాడు. నేను వూర్లో లేకపోతే పార్క్ నుండే చెప్పాల్సిన కబుర్లు చెబుతాడు. నిజానికి నాగిరెడ్డి తో పార్కులో నడుస్తూ కబుర్లు చెప్పడం, వినడం కంటే ఆనందాన్ని ఇచ్చే విషయమే లేదు నాకు. నా వుద్యోగం జిల్లా పరిషత్లో సీనియర్ అసిస్టంట్, పని ఒత్తిడి ఎక్కువ, ఇంటికి వచ్చేప్పటికి ఒక్కోసారి ఏడు కూడా దాటుతుంది. పని ముగించుకుని ఇంటికి వస్తూ నాగిరెడ్డికి ఫోన్ చేశా.


"ఏరా బిజీనా.... ? "


"అంతే కదా ... తల వాచిపోతోంది ... నా వుద్యోగం సంగతి తెలుసు కదా! "


"అది కాదురా.. మా తమ్ముని స్నేహితుడు రహీమ్ అని మంచి గాయకుడు, మన స్కూల్లోనే చదివాడు, దుబాయ్ నుండి వచ్చాడు, పాటలు పాడించుకుందామని రమ్మన్నా మన పార్కుకు, సుబ్బన్న కూడా వూర్లో వున్నాడు, వస్తానన్నాడు,నువ్వు వుంటే బావుంటుందని ... "ఆగిపోయాడు నా చిరాకు పసిగట్టి.


నాగిరెడ్డి చాలా సాత్వికుడు,సైన్స్టీచర్ గా టవున్ కు దగ్గరగా వుండే గార్గేయపురం అనే పల్లెలోని హైస్కూల్లో పని చేస్తాడు.అందరితో కలుపుగోలుగా ఉంటాడు,అందరికి ఏదో చేయాలని ఆరాటపడుతుంటాడు, అతనికి అందరిలోనూ మంచే కనపడుతుంది,ఎవరికీ కష్టం వచ్చినా ముందుగా స్పందిస్తాడు. చేతుల్లో వున్నడబ్బును లేదనకుండా ఖర్చు చేస్తాడు. సహజంగానే కళల పట్ల కొంచం ఆరాధన వుంటుంది అలాంటి వాళ్లకు; ఇంక దుబాయ్ నుండి వచ్చిన ఆ గాయకుడ్నిఎంత ఆకాశానికి ఎత్తేస్తాడో ...! ఎంత ఖరీదైన శాలువ కొనుక్కొచ్చి ఉంటాడో అని నాలో నేను నవ్వుకుని, "సరే వస్తున్నాలే " అన్నా.


ఇంటికి పోకుండా పార్కు కే వెళ్ళా. మా ఇద్దరికీ తెలిసిన వాళ్ళని కొందరిని, మా చిన్ననాటి స్నేహితుల్నిఅక్కడ సమావేశ పరిచాడు నాగిరెడ్డి. రహీమ్ ను చూడగానే చిన్నప్పుడు చూసిన ముఖం గుర్తొచ్చింది, పరిచయాలు,పాతజ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం అయాక రహీమ్ పాటల సందడి మొదలయ్యింది. "పూలు గుసగుస లాడేనని, సైగ చేసేనని " పాటతో అక్కడ ఉత్సాహం వెల్లివిరిసింది."ఇదేపాట ప్రతిచోట", "శారదా నను చేరదా," "ఏ దివిలో విరిసిన పారిజాతమో," "శివరంజని నవరాగిణి ," ఇలా పాటలు సాగిపోతున్నాయి. అందరం మైమర్చిపోతున్నాం, నాగిరెడ్డి మాత్రం ఎవరికో తెగ ఫోన్ చేస్తున్నాడు, కలుస్తున్నట్లు లేదు, ప్రయత్నం చేస్తూనే వున్నాడు. రహీమ్ కాఫీ బ్రేక్ తీసుకున్నప్పుడు అడిగా నాగిరెడ్డిని "ఎవరికీ ఫోన్ పాటలు వినకుండా? "

"సుబ్బన్న వస్తానన్నాడు, రాలేదు, ... నిన్ననే చెప్పా, రహీమ్ వస్తున్నాడు, రమ్మని. ..గుర్తు చేయమన్నాడు, ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయలేదు...మధ్యానమే ఏదో సైట్ చూడ్డానికి వెళుతున్నాను, సాయంత్రం తప్పక వస్తానని ఫోన్ కూడా చేశాడు " అని మళ్ళీ ఫోన్ చేయడంలో మునిగిపోయాడు.


గాడిద కేమి తెలుసు గంధపు వాసన అని ఈ తిక్క నాగిరెడ్డి, సుబ్బన్నకు రహీమ్ పాటలు వినిపించాలని ప్రయత్నించడం ఏమిటి? భూమి సూర్యుని చుట్టూ తిరిగినట్లు సుబ్బన్న జీవితం అంతా రియల్ ఎస్టేట్ చుట్టూ తిరుగుతుంది. సుబ్బన్న హైస్కూల్ వరకు మా క్లాస్మేట్ .. పొట్టిగా చిన్నగా పీలగా ఉండేవాడు. గర్భంతో వున్న స్త్రీ తొమ్మిది నెలలు మాత్రమే బిడ్డను మోస్తుంది ,కానీ పొట్ట పెంచుకున్న మగాళ్ళు పాపం దాన్ని జీవితాంతం మోయాల్సిందే. సుబ్బన్న డబ్బుతో పాటు, బానపొట్టను, కబ్జా కింగ్ అనే పేరు కూడా సంపాదించాడు. ఇంటర్ తో చదువాపేసి చిన్నగా వ్యాపారంలో దిగి.. అంచెలంచలుగా ఎదిగాడు .పిల్లనిచ్చిన మామ,బావమరిది కూడా అదే ఫీల్డ్ కాబట్టి రాయలసీమ, సర్కారు, తెలంగాణా కాకుండా రాయచూరు, షోలాపూర్ లో కూడా చాలా వెంచర్స్ వేసి కోట్లు గడించాడు. నా కంటే నాగిరెడ్డి కి సుబ్బన్నతో చనువెక్కువ అప్పుడప్పుడు కలుస్తుంటాడు. నాగిరెడ్డి సుబ్బన్నచేసే కబ్జాల గురించి పేపర్లో వచ్చినప్పుడు చాలా విచారించేవాడు. 'వీడికి ఈ భూదాహం ఎప్పుడు తీరుతుందో?' అనేవాడు ... "వాడ్ని భూమిలో పాతి పెట్టినప్పుడు "అనుకునేవాడ్ని. ఇంతకూ ఈ రోజు సుబ్బన్న వచ్చేవరకు రహీమ్ ను ఇంటికి పంపడేమో !


నేను ఆలోచన్లలో ఉండగానే రహీమ్ శ్రోతల అభిరుచి మేరకు ఏయే పాటలు పాడాలో తెలుసుకుంటున్నాడు. "అందానికి అందం ఈ పుత్తడిబొమ్మ అందరికీ అందనిది పూచినకొమ్మ"పాట వింటుంటే రహీమ్ ను బాలసుబ్రమణ్యం ఆవహించినట్లు అనిపించింది. నాగిరెడ్డి కి సుబ్బన్న రాలేదన్న దిగులుతో పాటల పై ధ్యాస పెట్టలేదు. రహీమ్ ఏమీ పట్టించుకోకుండా పాటల ప్రపంచంలో వున్నాడు.


"కలిమి నిలవదు, లేమి మిగలదు, కలకాలం ఒక రీతి గడవదు, నవ్విన కళ్ళే చెమ్మగిల్లవా! వాడిన బ్రతుకే పచ్చగిల్లదా! ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగులరాట్నము ,బ్రతుకే రంగుల రాట్నము.


ఏనుగు పై ని నవాబు, పల్లకిలో షరాబు, గుర్రంమీది జనాబు, గాడిద పైని గరీబు. నడిచే దారుల గమ్యమొక్కటే, నడిపేవాడికి అందరొక్కటే !ఇంతేరా ఈ జీవితం, తిరిగే రంగుల రాట్నము.


కోరిక ఒకటి జనించు, తీరక ఎడద దహించు, కోరనిదేదో వచ్చు, శాంతి సుఖాలను తెచ్చు , ఏది శాపమో! ఏది వరమ్మో! తెలిసి తెలియక అలమటించుటే! ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగుల రాట్నము.


ఆగదు వలపు, ఆగదు వగపు, ఆగదు జీవనo ఆగదు, ఎవరు కులికినా, ఎవరు కుమిలినా ఆగదు, కాలం ఆగదు, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులరాట్నము.


ఇరుగింటి లోన ఖేదం, పొరుగింటి లోన ప్రమోదం,రాలిన పూవులు రెండు, పూచే గుత్తులు మూడు,


ఒకరి కనులలో చీకటి రేయి, ఇరువురి మనసుల వెన్నెల హాయి.


ఇంతేరా ఈ జీవితం.. తిరిగే రంగుల రాట్నం... బ్రతుకే రంగుల రాట్నం.


చివరిగా రంగులరాట్నం అనే పాత సినిమా నుండి జీవిత సారం బోధించే భుజంగరాయ శర్మ రాసిన పాటను రహీమ్ ఎంతో హృద్యంగా పాడాడు.అందరు నిశ్సబ్దంగా వుండి పోయారు. తొమ్మిది అవుతోండగా అందరం సెలవుతీసుకున్నాం. నాగిరెడ్డి ఎవరితోనో మాట్లాడుతుంటే నేను ఇంటికి వచ్చేశాను.


అర్థరాత్రి నాగిరెడ్డి ఫోన్ తో పరుగున గవర్నమెంటు హాస్పిటల్ కు చేరుకున్నా క్యాజువాలిటి లో శవమై పడివున్న సుబ్బన్నదగ్గర కన్నీళ్ళతో నాగిరెడ్డి. ఫార్మ్ హవుస్ లో ఒక్కడే వున్న సుబ్బన్నకు తీవ్రమైన గుండెపోటు రావడంతో మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. భోజనానికి పిలవడానికి వెళ్ళిన పనివాడు సెల్ లో నాగిరెడ్డి కాల్స్ చూసి నాగిరెడ్డికి ఫోన్ చేశాడట. నాగిరెడ్డి కి దు:ఖం ఆగడం లేదు."నిన్న నా మనసు కీడు శంకించింది ...వాడు ఫోన్ ఎత్తకుండా వుండడు, అందుకే నేను మామూలుగా ఉండలేకపోయాను." అన్నాడు . నిజమే నిన్న నాగిరెడ్డి ఆదుర్దా గుర్తొచ్చింది.మూడు రోజుల పాటు శవం మార్చురీలో వుంది. అమర్ నాథ్ యాత్రకు పోయిన భార్య, అమెరికా లో వుండే ఇద్దరు కొడుకులు వచ్చేప్పటికి చాలా ఆలస్యమయింది. సుబ్బన్నఅంత్యక్రియలు తోటలో చేయాలని, సమాధి కట్టాలని బంధువులు, సమాధి చేస్తే దీపం పెట్టె ఓపిక తనకి లేదని భార్య ,ఆమెను సమర్థించిన కొడుకుల వాగ్యుద్దాల మధ్య శవం లేచింది.


అయిదు అడుగులు మాత్రమే వుండే సుబ్బన్నకు ఆరు అడుగుల నేల కూడా అవసరం లేదు, కానీ భూమంతా తనకే కావాలని ఎంత తిరిగాడు, ఎన్ని కబ్జాలు చేశాడు? ఎన్ని మోసాలు చేశాడు! .ఎంతమంది ఆత్మీయుల్ని, స్నేహితుల్నిపోగొట్టుకున్నాడు, చివరికి భార్యా పిల్లలు కూడా అతన్నిపట్టించుకున్నట్లు కనపడలేదు...మనిషికి ఎంత నేల కావాలి ? నాకు ప్రపంచాన్ని జయించిన అలేక్జాండర్ సమాధి పై రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి, "సమాధి సరిపోయిన ఇతనికి ప్రపంచమంతా సరిపోలేదు".


నేను నాగిరెడ్డి, భూస్థాపితం అయాక ఇంటి దారి పట్టాము.


" ఏమి సాధించాడు? ఏమి తీసికెళ్ళాడు తనతో ? చివరికి వూరి బయట దిక్కులేని చావు చచ్చాడు...చచ్చేముందు తనవాళ్ళు లేరు, పాపం పుణ్యం లేకుండా సంపాదించింది ఏమి తిన్నాడు? వేల కోట్లు కొడుకులు,భార్య పంచుకుంటారు " అంటున్నాడు బంధువెవరో !


"నిజమే కదా...ఆయన అన్నది " అన్నాడు నాగిరెడ్డి


"నూటికి నూరుపాళ్ళు నిజం... మనిషికి కొంత ఆశ వుండాలి,కానీ అత్యాశ పనికి రాదు ... వేల కోట్లు సంపాదించాడు ... చివరికి మట్టిలోనే కదా చేరిపోయాడు" అన్నాను.


మరుసటి రోజు ఉదయాన్నే నాలుగు పేపర్లను తీసుకుని వచ్చాడు నాగిరెడ్డి. నిద్రమత్తు వదిలింది వాడు చెప్పిన విషయాలు వింటే. పేపర్లన్నీ సుబ్బన్న గురించే రాశాయి. అతని మరణ వార్తను ఓ మూల వేసిన పత్రికలు, ఇప్పుడు మొదటి పేజీల్లో అతని గురించి రాశాయి. జిల్లా ఎడిషన్ మొత్తం సుబ్బన్నగురించే, అతన్ని అభినవ రాబిన్ హుడ్ గా కీర్తించాయి. సుబ్బన్నఆస్తి మొత్తం వేయి కోట్ల విలువుంటుందని అంచనా. అతని లాయరు వెల్లడించిన వివరాల ప్రకారం, భార్యకు కొంత ఆస్తి రాశాడు, కొడుకులకు చిల్లిగవ్వఇవ్వలేదు,మొత్తం అతను రిజిస్టర్ చేసిన చారిటీకి రాశాడు.చారిటీని సంస్థలు గా విభజించాడు,వాటిని ఎలా ఏర్పాటు చేయాల్సింది,ఎవరు వాటిని నడపాల్సింది, చాలా అవగాహన కలిగి వున్నాడు.యాభై ఏళ్ల వయసుకు అతను చాలా సంపాదించాడు. అయితే చాలా గొప్ప పనులకు దాన్నిధారపోశాడు. తాను ఏ నిముషంలో మరణించినా, జరగాల్సిన మంచి పనులకు చాలా ముందు చూపుతో ప్రణాళిక బద్దంగా అన్నీ అమర్చి పెట్టాడు,ఆస్తుల వివరాలు,బాంక్ అకౌంట్ల వివరాలు ,టాక్సుల చెల్లింపులు,అన్నీ వివరంగా రాసి పెట్టాడు. వూర్లో వున్నగవర్నమెంట్ హాస్పిటల్ ఆధునీకరణకు ఎక్కువ మొత్తం కేటాయించడమే కాకుండా ఆ భాద్యతను గొప్ప సేవాభావం కలిగిన ఒక డాక్టర్ కు అప్పగించాడు. ఇంకా అతను తన విల్లులో రాసిన సంక్షేమ పతకాలు వాటి ఆచరణ కు అతను పెట్టిన నిభందనలు, తెలుసుకునే కొద్దీ, ఒక్కసారిగా మాకిద్దరికి ఏమీ అర్థం కాలేదు. అతని ఇంటర్ చదువుకు, అతని వ్యాపార ధోరణికి, ధన దాహానికి, అతని వీలునామాకు సంభంధం లేదు. నాకు తెలిసి ఇంత గొప్ప వీలునామా ఎవరూ రాయలేదు. వీలునామా రాయడమంటే మరణానికి సిద్ధపడడమే.అంటే సుబ్బన్న మరణాన్నిఅంత వేదాంత ధోరణిలో అంగీకరించాడా?


మరణం తర్వాత సుబ్బన్నగురించి ఎంతోమంది విమర్శలు కురిపించారు, స్నేహితులు గా మేం కూడా రాళ్ళు విసిరాం.మాకు అతని గురించి తెలిసింది చాలా కొంచం. వుద్యోగం చేసుకుంటూ, చెడు అలవాట్లు లేకుండా బుద్ధిగా సంసారం చేసుకుంటున్న మేం ఆదర్శమైన వ్యక్తులమని, మా లాంటి వాళ్ళు సంఘంలో నీతి నియమాల్ని,మంచిని పెంచుతారని మేం కాలరు ఎగరేశాం,సుబ్బన్నలాంటి వాళ్ళు సంఘానికి చీడపురుగుల ని తేల్చి పారేశాం. ఏ తప్పూ, పాపం చేయకుండా ఎవరమూ లేము. ఎవరు సమాజానికి ఎక్కువ మేలు చేశారు అన్నది ప్రశ్న. ఎలా సంపాదించాడో ఎందుకు? రాబందుల్ని కొట్టాడు...పిచ్చుకలకు పంచాడు.మరణం తర్వాత కూడా జీవించే పనులు చేశాడు. సుబ్బన్నఆకారానికి చిన్నగా ఉండొచ్చు,కానీ గుణానికి మాత్రం మహోన్నతుడు. మనసులోనే అతనికి జేజేలు పలికి నా హృదయo లోని కల్మషాన్ని తొలగించుకున్నా.


--

Published in Koumudi in June 2015

No comments:

Post a Comment