Tuesday, 15 December 2015

అమ్మ విశ్వ ప్రేమ స్వరూపిణి - మేధావుల మాటల్లో అమ్మ



విశ్వంలోకి జీవo ఎలా వచ్చింది? అన్నప్రశ్నకు సృష్టి సిద్దాంతం(Creative theory)ప్రకారం దేవుడు ముందుగా జీవరాశిని, ఆపై మానవుడ్ని సృష్టించాడని, అన్ని మత గ్రంధాలు చెబుతుంటాయి. జీవకోటి ఆవిర్భావం గురించి తమ మత గ్రంధాలలో ఏది చెప్పారో అది హేతుబద్దంగా లేనప్పటికీ దాన్నే చాలా మంది నమ్ముతుంటారు. డార్విన్పరిణామ సిద్దాంతం మానవుడ్ని డోలామాయ స్థితికి తీసికెళ్ళింది. మతము, శాస్త్రం ఈ విషయంలో విభిన్నమైన అభిప్రాయాల్ని కలిగివున్నాయి. కానీ సృష్టికి కారణం ఏదయినా, అన్ని జీవుల జన్మకు కారణం జనని , సర్వచరాలకు వూపిరినిస్తున్నది ఆడప్రాణి అనే విషయం అందరూ అంగీకరించినదే. కోడిపెట్ట పిల్లల్ని పొదగగానె వాటిని కాపాడుకోవడానికి బలమైన గద్దల్ని సైతం పొడిచి పారద్రోలుతుంది. పిల్లి ఏడుసార్లుతన పిల్లల్ని నోటకరచుకుని తిరిగి తిరిగి సురక్షితమైన ప్రదేశం చేరుస్తుంది. కుక్కలు తమ పిల్లల్ని కాపాడుకునేందుకు యజమానిని కూడా దరి చేరనివ్వవు. పక్షులు సైతం తమ పిల్లల్ని సురక్షితంగా గూటిలో దాచుకుని, ఆహారాన్ని నోట కరచుకుని తెచ్చి పిల్లల నోటికి అందిస్తాయి. కంగారూలు తమ శరీరం లోనే సంచుల్ని కలిగి తమ బిడ్డల్నిఎదిగేంత వరకు మోస్తాయి. జంతువుల్లోనే ఇంత మాతృ ప్రేమ వున్నప్పుడు సృష్టిలో ఉత్కృష్టమైన జన్మ కలిగి,పరిణామంలో అత్యున్నతమైన మేధోసంపద పెంపొందించుకున్నమానవ జాతి మాతృత్వంలో విశిష్టత లేకుండా ఎలా వుంటుంది? రాబర్ట్ బ్రౌనింగ్ అనే విక్టోరియన్ ఇంగ్లీష్ కవి తల్లి గురించి ఎంత గొప్పగా చూడండి ..


"Motherhood : All love begins and ends there." - Robert Browning




అమ్మ ప్రేమకు, త్యాగానికి, సహనానికి సమానమైనది లేనేలేదు. అమ్మగొప్పతనంమాటల్లో వర్ణించలేనిది. చిత్రాల్లో చిత్రించలేనిది. అయినా కవులు ఆమె గురించి పద్యాలు రాశారు , ఎంతోమంది ఆమె ఔన్యత్యాన్ని కీర్తించారు. కాలం మారినా, దేశాలు, సంస్కృతులు, నాగరికతలు, సామాజిక పరిస్థితులు మారినా అమ్మ నైజం మారని "నిజం" . ఏ ఇజం లోను అమ్మ విలువ చెదరని ప్రిజమ్. పదినెలలు మోసి, పాలిచ్చి, పెంచి, పెద్దవాళ్ళని చేసినా, చివరి క్షణం వరకు పిల్లల సంక్షేమం కోసం తల్లడిల్లే తల్లి కి మించిన దైవం ఎక్కడుంది?


"No language can express the power, and beauty, and heroism, and majesty of a mother’s love. It shrinks not where man cowers, and grows stronger where man faints, and over wastes of worldly fortunes sends the radiance of its quenchless fidelity like a star. ~Edwin Hubbell Chapin


ఉన్నాడో లేడో తెలియని దైవం కోసం ప్రార్థనలు చేసే మానవులు జన్మ నిచ్చి,కష్టాలు,కన్నీళ్ళ కోర్చి,పిల్లల్ని పెంచి పెద్దచేయడానికి, విద్యాబుద్దులు చెప్పడానికి ఎన్నిఅవస్థలు పడుతుందో, ఎన్ని త్యాగాలు చేస్తుందో! అలాంటి తల్లిని నేటి తరం విస్మరిస్తున్నారు. తల్లి సమక్షానికి మించిన గుడి, మసీదు, చర్చీ , గురుద్వారా, సినగాగ్ లేదు. అమ్మ ప్రేమ గురించి రొమాంటిక్ సాహిత్యానికి చెందిన ప్రముఖ కవి శామ్యూల్ టేలర్ కాల్రిడ్జ్ వుపాచ :


“The love of a mother is the veil of a softer light between the heart and the heavenly Father.” Samuel Taylor Coleridge


ఈ ప్రపంచంలో చెడ్డ తండ్రి , చెడ్డ అన్న, తమ్ముళ్ళు ,చెడ్డ అక్క చెల్లెళ్ళు, చెడ్డ గురువు, చెడ్డ స్త్రీ వుంది కానీ చెడ్డ తల్లి లేదు. కీర్తి శేషులు, ప్రముఖ రచయిత్రి మాలతి చందూర్గారి (ఆంద్రప్రభ పత్రికలో) ప్రశ్నలు జావాబు ల శీర్షికలో ఒక యువకుడు ఇలాప్రశ్నించాడు. "నేను చాలా బాగా చదువుకుని ఒక ఉన్నతమైన వుద్యోగం సంపాదించాను,నా తండ్రి నా చిన్నప్పుడే చనిపోయాడు, నా తల్లి నా చదువుకుకావాల్సిన డబ్బు పంపడానికి ఎంతో కష్టపడింది, అయితే ఆమె నాకు డబ్బు పంపడానికి వ్యభిచారం కూడా చేసిందని నాకు తెలిసింది. ఇది నేను జీర్ణించుకోలేక పోతున్నాను. ఆమె ముఖం కూడా చూడలేకపోతున్నాను. చచ్చి పోవాలనిపిస్తోంది. మీరేం సలహాఇస్తారు ?"


"చచ్చిపో..! తల్లి కష్టాన్ని, త్యాగాన్నిగుర్తించలేని కొడుకు ఈ భూమికి భారం " అని సమాధానం ఇచ్చారట.


Motherhood is priced

Of God, at price no man may dare

To lessen or misunderstand.

~Helen Hunt Jackson



ఒక తల్లి తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి, నరకయాతన అనుభవించి, భయంకరమైన నొప్పిని తట్టుకుని, ప్రాణ కోటిని ఈ ప్రపంచానికి అందజేస్తుంది! మగవాడి క్షణిక సుఖానికి ఫలితంగా తొమ్మిది నెలలు గర్భం లో శిశువును మోసి. దుర్భర మైన ప్రసవ వేదనపొంది బిడ్డల్ని కంటుంది ! ఏ పాపం చేసినా స్త్రీ పుణ్య మూర్తే! ఆమె అన్నితప్పుల్ని కడిగే మంత్రజలం మాతృత్వం! పన్నెండేళ్ళ పసితనం లో తల్లయినా, ప్రౌఢ ప్రాయం లో తల్లయినా, ఆరోగ్యంలో తల్లయినా, అనారోగ్యం లో తల్లయినా ,డబ్బున్న స్థితిలో అయినా, పేదరికంలో అయినా తల్లి పాత్రలో తేడా లేదు. మానసిక స్థితి సరిగ్గా లేని స్త్రీని ఏ కామాంధుడో తల్లిని చేస్తే అంతటి దుర్భలురాలు సైతం తన బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. వంటి మీద బట్టలు వున్నాయో లేవో చూసుకోలేని ఆ తల్లి బిడ్డను పొత్తిళ్ళలో దాచుకుంటుంది. ప్రకృతి స్త్రీని తల్లిని చేసి ఆమెను ఉన్నతురాలిని చేసిందా? లేక బలహీనురాలిని చేసిందా? మాతృత్వం అన్నివేళలా స్త్రీకి వరం కాదు, కొన్ని సార్లు అది పాపమై,శాపమై ఆమెను నిస్సహాయురాల్ని చేసి సమాజం లో దోషిగానిలబెడుతుంది. ఆనాటి భారతం లోని కుంతీ దేవి నుండి ఎన్నో ఉదాహరణలు దీనగాధలు. అయినా ఆమె ఎక్కడా మాతృమూర్తిగా వోడిపోలేదు. బలాత్కారానికి గురయ్యి తల్లయినా, మోసపోయి తల్లయినా, గర్భానికి కారణ మైన మగవాడి పై ఎంత ద్వేషం , అసహ్యం వున్నా కడుపున మోసిన బిడ్డపై ఆమె మమకారం ఒకేలా వుంటుంది.


All women become like their mothers. That is their tragedy. No man does. That’s his.

~Oscar Wilde,


అమ్మ పాడిన లాలిపాట మరణించే టప్పుడు సైతం వినపడుతుంది. నాన్న చేసే పని ఉదయం పది నుండి సాయంత్రం దాకే, మరి అమ్మ విశ్రమించేది పది దాటాకే,అది కూడాఅందరు నిద్రపోయాకే. అమ్మ ప్రేమ రెక్కలు విచ్చుకుంటున్న పువ్వులా సున్నితమైంది. పిల్లలను ఆ పరిమళ సౌరభాలు ఎప్పటికి వీడవు. అమ్మ ప్రేమ దేవాలయం, అమ్మఉనికి విద్యాలయం. అమ్మ కాంతి పంచే ఉదయం, వెన్నెల పంచే రాత్రి. అమ్మ శాంతి కపోతం. దయా పారావతం, అమ్మ ప్రేమ జలపాతం ,అమ్మ వెచ్చని హిమపాతం. అమ్మ వొడి మన మొదటి బడి.



Because I feel that in the heavens above

The angels, whispering one to another,

Can find among their burning tears of love,

None so devotional as that of "Mother,

~Edgar Allan Poe”


ప్రపంచ ప్రఖ్యాతి పొందిన చక్రవర్తులు, రాజులు , వీరులు శూరులు, విప్లవకారులు, కవులు రచయితలు, గాయకులు విప్రవకారులు ,రచయితలు తల్లి తోడ్పాటు తోనే తమ భవిష్యత్తు నిర్మించుకున్నారు. అలెక్షాoడర్ ప్రపంచాన్ని జయించి నప్పటికీ తన తల్లి వొలింపస్ సహకారం తోనే ఆమె అండ దండలతోనే రాజ్యాధి కారం చేపట్టాడు, ప్రపంచ వీరుడయ్యాడు. అతని తండ్రి సహకారం ఇందులో తక్కువే.


Mother love is the fuel that enables a normal human being to do the impossible. ~Marion C. Garretty,


అబ్రహం లింకన్ మానవత్వానికి మరో పేరు. 216 సంవత్సరాల క్రిందట పుట్టిన ఆయనకు ఈనాటికి అదే నివాళి ఇస్తోంది ప్రపంచం. అమెరికా 16 వ ప్రెసిడెంట్ గా ఆయన సాధించిన విజయాలు నీగ్రోల బానిసత్వపు సంకెళ్ళ ను చేధించాయి. హానెస్ట్ అబే గా (Honest Abe ) చిన్నతనం నుండి పేరొందిన లింకన్ తన విజయాలకు ,అభివృద్ధికి, వ్యక్తిత్వానికి తన తల్లి, తన చిన్నమ్మ (step mother) కారణమని ఆయన గర్వంగా ఇలా చెప్పుకున్నారు.


“All that I am, or hope to be, I owe to my angel mother. I remember my mother's prayers and they have always followed me. They have clung to me all my life.” Abraham Lincoln


చత్రపతి శివాజీ వీరత్వానికి , ఉన్నత మైన వ్యక్తిత్వానికి ,విలువలకు పెట్టింది పేరు . శివాజీ తండ్రి షాహాజి భోంస్లే , శివాజీని తల్లి సంరక్షణలోనే వదిలి కర్నాటక వెళ్ళిపోయారు .అతని తల్లి జిజియా బాయ్ పెంపకం లోనే శివాజీ ఒక ప్రత్యేక మైన వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నాడు . స్త్రీలను గౌరవించడం వారిని తల్లిగానో చెల్లి గానో చూడాలని బోధించడమే కాకుండా ,తన సైనికులు ,ప్రజలు పాటించే విధంగా చూశారు. హెన్రి బికర్ స్టేత్ ఏమంటారో చూడండి -


"If the whole world were put into one scale, and my mother in the other, the whole world would kick the beam. ~Lord Langdale Henry Bickersteth.


ఈ మధ్యే చెన్నై లో ఆకాష్ వైద్యశాలలో ఒక తల్లి, అరవై దాటిన వయసులో తన కూతురు కోసం సరొగసి తల్లిగా మారి తన కూతురికి కూతురిని బహుమతి గా ఇచ్చి, ఒక అరుదైన తల్లిగా చరిత్ర లో నిలిచిపోయింది. తల్లి చేయని త్యాగం ఇలలో లేదు.


If you have a mom, there is nowhere you are likely to go where a prayer has not already been. ~Robert Brault.



మన జాతిపిత మహాత్మా గాంధి తల్లి పుతలి బాయ్. మహాత్ముని గొప్ప గుణాలైన ,సత్యం ,అహింస , వోర్పు, పట్టుదల, మాట తప్పని నైజం తన తల్లి దగ్గర నేర్చుకున్నదే. ఆమె మహా భక్తురాలు.ఉపవాసాలు అతి కఠినంగా పాటించేది.రెండు మూడు రోజులు తినకున్నా ఆమె ఎంతో చలాకీగా వుండేది. ఈ ఆత్మ నిగ్రహాన్నితల్లి దగ్గర నుండి గాంధి గ్రహించి "సత్యాగ్రహం" అనే గొప్ప ఆయుధంగా చేసుకుని రవి అస్తమించని బ్రిటిషు సామ్రాజ్యాన్ని కూకటివేళ్ళతో పెకిలించి వేసి, భారత దేశానికి స్వాతంత్ర్యం తెచ్చాడు. పుతలి బాయ్ చేసుకున్న పుణ్యం ,ఆమె గాంధీని తీర్చి దిద్దిన వైనం మన బానిసత్వాన్ని పోగొట్టింది .ప్రతి పురుషుని విజయం వెనుక ఒక స్త్రీ మూర్తి వుంటుంది. చాలా సార్లు అమె తల్లి అయి వుంటుంది.




Mother is a name held sacred It means great love and sacrifice

From the very day of birth,

A love that's so full of beauty,

So tender, so very true!

Something, seemingly, from Heaven

That has come to me and you.

There's no love so understanding

And so faithful to the end

As a Mother's love—God bless her!—

That to us our Lord did send.

~Gertrude Tooley Buckingham, "Mother" (1940s)



అమ్మ క్షమకు మారు పేరు. ఎన్ని తప్పులు చేసినా ఆమె తన పిల్లల్ని క్షమిస్తుంది . భూదేవి సహనం ఆమె సహజ గుణం తనను ఆదరించకున్నా ,ఎంత నిర్దయగా ఆమెను ఇంటి నుండి గెంటి వేసినా తన సంతానం బాగుండాలని ఆమె కోరుకుంటుంది. తల్లి ప్రేమకు రుజువులు అవసరం లేదు . తల్లి ప్రేమకు పరీక్ష పెట్టిన వారు మానవత్వాన్ని మరిచిన వారు . ఎంత ఎత్తుకు ఎదిగినా ,తాము నిలబడ్డది వార్ధక్యం తో వంగిపోతున్న ఒక తల్లి భుజాల పై అని గ్రహిస్తే ,ఆమెను నిరాదరణకు గురి చేయరు . భారతీయ సంస్కృతిలో తల్లిని మాతృ దేవో భవ అని కీర్తించారు.శ్రవణ కుమారుడు తల్లిదండ్రుల్ని కావడిలో మోసుకుంటూ వాళ్ళను ఎన్నో తీర్థయాత్రలు తిప్పాడు . దశరథుని బాణానికి కుప్పకూలిన శ్రావణ కుమారుని ఆఖరి కోర్కె తన తల్లి దండ్రులకు నీళ్ళు అందజేయమని . కొడుకు మరణ వార్త విన్న వాళ్ళు మరణించడం విడ్డూరం కాదుకదా !




 

The heart of a mother is a deep abyss at the bottom of which you will always find forgiveness. ~Honoré de Balzac



తన పిల్లలనే ప్రేమించడమే కాకుండా ఆమె తల్లి కాగానే అందర్నీ ప్రేమించే గుణం ఆమెకు అలవడుతుంది. ఏ బిడ్డ ఏడ్పు విన్నా తల్లి హృదయం ద్రవిస్తుంది . తన ,పర అన్న బేధం లేకుండా దగ్గర తీస్తుంది. ఆంజెలిన జోలి అనే హాలివుడ్ నటి తన ముగ్గురు పిల్లలనే కాకుండా కంబోడియాకు చెందిన ఒక అబ్బాయి ని ,వియాత్నం కు చెందిన ఒక అబ్బాయిని ,యుథియోపియా కు చెందిన అమ్మాయిని దత్తత తీసుకుంది. ఎంతో పెద్ద నటిగా ప్రఖ్యాతి పొందిన ఆమె వివిధ దేశాలకు చెందిన అనాధల్ని ఆదరించడం ఆమెను గొప్ప మాతృ మూర్తిగా చేశాయి . కన్న బిడ్డల్ని ప్రేమించడమేమీ గొప్ప కాదు , అది ప్రకృతి సహజంగా స్త్రీకి కలుగుతుంది అయితే తాను తల్లే కాకుండా సుస్మిత సేన్ మాజీ విశ్వ సుందరి ఒక అనాథకు తల్లిగా మారి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచింది.



Who fed me from her gentle breast

And hushed me in her arms to rest,

And on my cheek sweet kisses prest?

Who ran to help me when I fell,

And would some pretty story tell,

Or kiss the place to make it well?

My mother.

~Ann Taylor



అమ్మ విశ్వంతర్యామి . ఆమె ప్రేమ ఎడారిలో ఒయాసిస్ . ఆమె దయ ఎన్నటికి ఎండిపోనీ ఊట బావి ,ఆమె కరుణ చల్లటి నీరిచ్చే చెలిమ . ఆమె అనురాగం అనంతమైన ప్రేమ సాగరం . ఆమె హృదయం ఆకాశమంత విశాలం . ఆమె రూపం ప్రకృతిలా మనోహరం . అమ్మ ఒక వ్యక్తి కాదు . అమ్మతనం అపురూపమైన దివ్య సాక్షాత్కారం . అమ్మ సృష్టి కారణం, నిత్యo మోస్తుంది మానవజాతి సంరక్షణ భారం . అమ్మకు జేజేలు ,అమ్మ విశ్వ ప్రేమకు నీరాజనాలు.


A mother is the truest friend we have, when trials heavy and sudden, fall upon us; when adversity takes the place of prosperity; when friends who rejoice with us in our sunshine desert us; when trouble thickens around us, still will she cling to us, and endeavor by her kind precepts and counsels to dissipate the clouds of darkness, and cause peace to return to our hearts. ~Washington Irving



Published inAbdul Rahim Rtd I.G 'S Souvenir on Mother

Sunday, 13 December 2015

సాహితీ ఇంద్రజాలికుడు -గంటర్ గ్రాస్


ప్రఖ్యాత రచయిత,మాజిక్ రియలిజం అనే క్రొత్త సాహితీ ప్రక్రియను ప్రపంచానికి తన నవల "టిన్ డ్రం "ద్వారా పరిచయం చేసి, రెండవ ప్రపంచ యుద్ధసమయంలో, తర్వాత జర్మని పరిస్థితిని తన నవలల్లో నిర్భయంగా చాటి నోబెల్ బహుమతి పొంది యావత్ ప్రపంచంలో అభిమానుల్ని సంపాదించుకున్న గంటర్ గ్రాస్ తన 87 ఏట ఏప్రిల్ 13, 2015 న జర్మని లోని ల్యుబెక్ పట్టణంలో తుదిశ్వాస వీడారు. 28, మార్చ్,2015 న తన నవల "టిన్ డ్రం" ఆధారంగా ప్రదర్శించబడుతున్న నాటకం యొక్క ప్రీమియర్ షో ను తన కుటుంబసభ్యులతో చూసి ఆనందించిన గ్రాస్ తర్వాత ప్రపంచానికి కనపడలేదు. కొద్దిపాటి అస్వస్థతతో హాస్పిటల్లో చేరిన ఆయన మరణించడం అందర్నీదిగ్భ్రాంతికి గురి చేసిందని గ్రాస్ సెక్రటరి వోహోసిలింగ్ పత్రికా విలేఖర్లకు తెలియజేసింది. శాంతికాముకుడైన గ్రాస్ న్యూక్లియర్ మిసైల్ ను జర్మని తయారు చేయడాన్ని ధైర్యంగా వ్యతిరేకించారు.


గ్రాస్ జర్మని ఆక్రమిత ప్రాంతం లోని డాన్జింగ్ అనే స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన పట్టణంలో (ఇప్పుడది గ్దాన్స్క్గా పిలువబడుతూ పోలాండ్ లో వుంది )1827 లో జన్మించాడు. అతని తండ్రి విల్ హెల్మ్ జర్మన్ దేశస్థుడు,తల్లి హెలెన్ పోలండ్ దేశస్తురాలు. చిల్లర కొట్టు నడుపుకుంటూ బ్రతికేది గ్రాస్ కుటుంబం. 1944 లోఅతని పదహారవ ఏట హిట్లర్ సైన్యంలో భాగంగా నడపబడుతున్న "వాఫన్-ఎస్.ఎస్" అనే సైనిక విభాగం లో ట్యాంక్ గన్నర్ ట్రైనీగా పని చేస్తున్నప్పుడే గాయపడి అమెరికన్ సైనికులకు బందీగా చిక్కి, రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత విడుదల అయాడు. అయితే ఈ విషయం 2006లో అతని ఆత్మకథ "పీలింగ్ ద ఆనియన్ "పుస్తకం విడుదల అయేవరకు ప్రపంచానికి తెలియదు.తర్వాత గ్రాస్ శిల్పాలరాళ్ళు మలచే పని నేర్చుకుంటున్నప్పుడే అతనికి మాజీ నాజీ సైనికులతో ఒకప్పుడు పని చేసిన వారితో, కమ్యూనిజం ఆకర్షణలో వుండి తర్వాత వదిలేసిన వారితో పరిచయం ఏర్పడింది. అప్పుడే గ్రాస్ కు అతివాద ధోరణి కంటే సంశయవాదం, మితవాదం మేలని అనిపించింది. ఈ సిద్ధాంతాన్నే అతను జీవితాంతం పాటించాడు.


ఆరోజుల్లో అందరు కళాకారులకు పారిస్ ఒక ఆశాదీపంగా అగుపించినట్లే గ్రాస్ సైతం పారిస్ లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనే ప్రయత్నం తోనే పారిస్ చేరుకొని తన మొట్టమొదటి నవల "టిన్ డ్రం" రాశారు.ఈ నవల 1959లో అచ్చయింది. తీవ్ర మైనవిమర్శల, ప్రతిఘటనలు, బహిరంగంగా నవలను తగులబెట్టడాలు జరగడo అయాక కూడా నవల అద్భుతంగా అమ్ముడుపోయింది. ఒక్క రోజులో గ్రాస్ గొప్ప రచయితగా కీర్థించబడ్డాడు. మాజిక్ రియలిజం అనే లాటిన్ అమెరికన్ ప్రక్రియగా చెప్పబడుతున్న సరికొత్త సాహితీ ప్రక్రియను విజయవంతంగా తన నవలలో ఉపయోగించడమే కాకుండా ఆ ప్రక్రియను తను చెప్పాలనుకున్న విషయానికి సరైన న్యాయం చేసేట్లుగా కథను మలచుకున్నాడు. మాజిక్ రియలిజాన్ని లాటిన్ అమెరికా తర్వాత మొదట ప్రయోగించి గ్రాస్ ఎంతో మంది రచయితలకు ప్రేరణగా నిలిచాడు.ఈ నవల 20వ శతాబ్దపు మొదటి యాభై సంవత్సరాల జర్మన్ చరిత్రతో పాటు రెండవ ప్రపంచ యుద్ధ పోకడల్ని, యుద్ధ సమయంలో దేశాల మధ్య చెలరేగిన ద్వేషాలు, వైషమ్యాలు, అప్పుడు జరిగిన మారణకాండ, విద్వంసం, వినాశనం, అమానుషత్వం మొదలైన వాటిని కళ్ళకు కట్టినట్లు వివరించింది, అంతెందుకు "ది టిన్ డ్రం " అనే మూడు పదాలు 20 శతాబ్దాన్నినిర్వచించాయి. పెరగడానికి నిరాకరించిన నవలానాయకుడు ఆస్కార్ జీవితమే


"టిన్ డ్రం" నవల కథాంశం. "బిల్దంగ్స్రొ)మన్" అనే జర్మన్ నవల శైలిలో కథానాయకుడు ఆస్కార్ మానసికంగాను, శారిరకంగాను పసితనం నుండి ఎదగడం ఇందులో వివరిస్తారు. నాజీల దురాగతాలకు ఎన్నో దశాబ్దాల వరకు జర్మన్లు నైతిక బాధ్యత వహించాలని గ్రాస్ తన రచనల్లో హెచ్చరించాడు. అచ్చయిన 40 ఏళ్ల తర్వాత ఈ నవలకు నోబెల్ పురస్కారం అందింది. గ్రాస్ పుస్తకాల గురించి మాట్లాడుతూ "సరదా సరదాగా ఉండేలా అనిపించినప్పటికీ వాస్తవం, కల్పన మిళితమైన ఈ కుటుంబ కథ జర్మన్ల గతించిన చీకటి చరిత్రగా రాయబడింది."అని స్వీడిష్ అకాడమి పేర్కొంది.


గ్రాస్ అద్భుత సృష్టి మాజిక్ రియలిజం


1920 లో యూరప్ లో ఫ్రాంజ్ రొహ్అనే కళా చరిత్రకారుడు ఇటాలియన్ పత్రిక " నోవోసేంటో" లో తన వ్యాసంలో కళల్లోఉండాల్సిన వాస్తవికత గురించి చెబుతూ "మ్యాజిక్ రియలిజం" పదాన్ని వాడాడు. 1949 లో అలిజో కార్పెంటియర్ అనే క్యూబా నవలా రచయిత మొదటిసారిగా మాజిక్ రియలిజాన్నిసాహిత్యంలో వాడారు. లాటిన్అమెరికన్ ప్రక్రియగా చెప్పబడే మ్యాజిక్ రియలిజం రచనల్లో సామాన్యమైన విషయాలకు కల్పన జోడించినా అసహజంగా అనిపించదు. ఇది ఒక దేశం లేక ప్రాంత చరిత్ర, రాజకీయ, ఆర్ధిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను కథతో మమేకం చేస్తుంది. మ్యాజిక్ రియలిజం, అలిజో కార్పెంటియర్, జువాన్ కార్లోస్ ఒనేట్టి , జూలియా కార్టజర్, జార్జ్ లూయీ బోర్జెస్ , మిగెల్ ఏంజెల్ ఆస్తురియస్, కార్లోస్ ఫ్యుఎంతిస్, మారియో వర్గ ల్లోస మరియు గాబ్రియల్ గార్సియ మార్క్వెజ్, సాల్మన్ రష్దీ లాంటి లబ్ద ప్రతిష్టులైన రచయితల చేతుల్లోపరిణితి చెందింది.


అయితే లాటిన్ అమెరికన్ ప్రక్రియగా పేరు పొందిన మ్యాజిక్ రియలిజం మొట్ట మొదటగా గంటర్ గ్రాస్ చేతిలో ప్రతిభావంతంగా "టిన్ డ్రం" నవలగా రూపు దిద్దుకుంది. రెండవ ప్రపంచ యుద్ధానికి ముందు, తర్వాత, జర్మనీలో, పోలాండ్ లో వున్న రాజకీయ, సామాజిక, ఆర్ధిక పరిస్థితుల్లో ప్రజల యొక్క జీవనం ఎలా సాగిందో ఆస్కార్ అనే ముఖ్య పాత్రధారి (protagonist ) వివరిస్తాడు. తన తండ్రి ఎవరో తెలియని అనిశ్చిత పరిస్థితిలో, తన మూడో ఏట పెరగకూడదని నిర్ణయించుకుని మరుగుజ్జుగా ఉండిపోయి, హిట్లర్ యొక్క అరాచకాలు, నాజీలకు యూదులకు మధ్య జరిగిన అమానుష సంఘటనలకి ప్రత్యక్ష సాక్షి గా నాటి జర్మన్ అక్రుత్యాలని వివరిస్తాడు. ఈ నవల గ్రాస్ కి నోబెల్ బహుమతి తెచ్చిపెట్టింది. గ్రాస్, మ్యాజిక్ రియలిజంను "టిన్ డ్రం " నవలతో విశ్వవ్యాప్తం చేసారు . తన "మిడ్నైట్ చిల్దరన్" తో విశ్వవిఖ్యాత రచయిత గా ఎదిగిన సాల్మన్ రష్ది తన నవలకి "టిన్ డ్రం " ప్రేరణ అని గ్రాస్ తనను ఎంతో ప్రభావితం చేసిన రచయిత అని రష్దీ "మిడ్నైట్ చిల్దరన్" విజయ రహస్యం వివరించాడు . తర్వాత గ్రాస్ రష్దికి మంచి స్నేహితుడయ్యాడు . స్వేచ్ఛను ప్రేమించే గ్రాస్ రష్ది "సెటానిక్ వెర్సెస్ " తర్వాత ఇరాన్ మతాధికారి ఆయతుల్లా ఖుమేని "ఫత్వా " (మరణదండన ) విధించినప్పుడు రష్దీ ని సమర్థించి రచయితల కు తమ అభిప్రాయాల్ని వ్యక్తపర్చే స్వేఛ్చ వుందని ఎలుగెత్తి చాటారు.


గంటర్ గ్రాస్ - గొప్ప రచన టిన్ డ్రం

గంటర్ గ్రాస్ ఆత్మ ఘోష "టిన్ డ్రం". అతనొక బలమైన వ్యక్తిత్వం కల రచయిత. రచయితలు కానీ ఏ కళాకారులు కానీ స్వేచ్చతో వ్యవహరించే పరిస్థితి వుండాలి అప్పుడే రచయిత సామాజిక వ్యక్తిగత హక్కులను గౌరవించినట్లు ఈ విషయంలో గ్రాస్ చాలా అదృష్టవంతుడు, అతను జర్మన్ల అభిమానాన్ని చూరగొన్నారు. అంతేకాదు అతను మన కాలానికి చెందిన ఒక గొప్ప కవి, రచయిత, సామాజిక తత్వవేత్త, అతను సాహితీ రంగానికి చేసిన సేవ సాటిలేనిది. అతని నవలలు, కథలు,నాటకాలు,కవితలు అన్ని రకాల సాహితీ ప్రక్రియలు అతని గొప్ప రచయితగా నిలబెట్టాయి. గ్రాస్ ఘనాపాటి ,మేధావి సున్నిత మనస్కుడు వీటన్నిటికంటే ముందు అతను మానవతావాది, "ప్రపంచం చూడని కోణంలో జర్మన్ చరిత్ర ను తన మనోనేత్రంతో చూడగలిగిన గొప్ప దార్శనీకుడు గ్రాస్" అని వాషింగ్టన్ పోస్ట్ శ్లాగించింది . గ్రాస్ ఎంతో ప్రతిభ గలిగిన కళాకారుడు. రచయితగానే కాకుండా శిల్పిగా, కవిగా, నాటక కర్తగా, వ్యాసకర్తగా, గ్రాఫిక్ కళాకారుడిగా, రాజకీయాల్లో కూడా తన ప్రతిభను చాటాడు. గొప్ప కథకుడుగా, చారిత్రక నేపథ్యం తీసుకుని ,మాజిక్ రియలిజం శైలిలో రెండవ ప్రపంచయుద్ధకాలం జర్మన్ చరిత్రలోని నగ్న సత్యాల్ని, తన మాజిక్ కల్పనలతో, సమకాలీన రాజకీయాలపై గొప్పపట్టుతో ఆస్కార్ మాట్జరిత్(టిన్ డ్రంనాయకుని) సృష్టించాడు. గ్రాస్ ను బహుశ సమకాలీన రచయితల్లో అగ్రగణ్యుడిగా చెప్పవచ్చునేమో! అతను నాజీకాలం నాటి తరం ప్రజల స్వరంగా అవతరించారు. తనని తాను యువతరానికి వినూత్న ఉత్తేజకర్తగా, గొప్ప బోధకునిగా చేసుకున్నారు. "రచయితలు తమ ఊపిరితో ప్రజల చెవుల్లోకి కృత్రిమ శ్వాసని అందించి మానవత్వాన్ని ప్రపంచం లో సజీవంగా ఉంచాలని" " గ్రాస్ ఒకచోటఅంటారు.మరొకచోట "పుస్తకాలునేరాన్ని చేయిస్తాయని,అలజడికి,అసూయ,ద్వేషాలకుకు కారణమవుతాయని, అయితే ఇవన్నీ దేశం పట్ల వాళ్ళకున్న ప్రేమగాను, ఆ దేశం యొక్క నేల ప్రభావంగాను తెలుసుకున్నాను, అందుకే నేను వివాదాల్లో వ్యక్తినైనాను."అంటారు. నోబెల్ బహుమతి అందుకున్న తరుణంలో ఇచ్చిన ఉపన్యాసంలో .



గ్రాస్ తన నవల "టిన్ డ్రం "రాయడానికి ఎన్నుకున్న "మాజిక్ రియలిజం" అనే సాహితీ ప్రక్రియ- సంక్లిష్ట రాజకీయ, ఆర్ధిక, కల్లోల పరిస్థితులు వున్న ప్రాంతాల్లోనే ఎక్కువ ఆదరణ పొందింది. యుద్ధ మేఘాలు కమ్మిన ప్రాంతాల్లోను, వలస నుండి విముక్తులైన దేశాల్లోను, ఒక దేశంలోని ప్రజల సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక, రాజకీయ, మత పరిస్థితులు హీన పర్చబడినప్పుడు, అవమానానికి గురైనప్పుడు, అన్ని రకాలుగా దెబ్బతిన్న ప్రాంతాలలోను మాజిక్ రియలిజం నేపథ్యం కల రచనలు చాలా ఆదరణ పొందాయి. గ్రాస్ "అంతర్గత వలస" అనే పదాన్ని వాడతారు "టిన్ డ్రం "నవలలో చాలాసార్లు. ఇది జర్మన్ కళాకారుల, రచయితల గురించి వచ్చిన విమర్శ గురించి రాయబడ్డది. నాజీ పాలనలో వీరంతా వేరేదేశానికి వలస పోకుండా నాజీ పాలనను సమర్థించకుండా వున్నారు. గ్రాస్ సొంతవూరైన దాన్జింగ్ పట్టణం జర్మన్ ఆక్రమిత ప్రాంతం లో వుండేది ,ఇప్పుడు అది పోలాండ్ లో వుంది, మొదటి ప్రపంచయుద్ధం తర్వాత నెలకొన్న పరిస్థితులు గ్రాస్ ని చాలా ఆందోళనకు గురి చేశాయి. ఇవే పరిస్థితులు అతన్ని" టిన్ డ్రం " నవలకు ప్రేరణ గా నిలిచాయి.


గాయం నుండి బాధ, బాధనుండి ఆందోళన,ఆక్రోశం;వీటినుండి ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితి నుండి గ్రాస్ లోని రచయిత మేల్కొన్నాడు. ఇదే అతన్ని"టిన్ డ్రం"లాంటి నవలను రాసేట్టు చేసింది. జర్మన్ చీకటి రక్తచరిత్రను అనేక కోణాల్లో నీలం రంగు సిరాతో ఆయన రాస్తే నలుపు రంగు అక్షరాలతో పుస్తకం అచ్చయింది.నిజానికి రంగు మారినా ప్రతి అక్షరం లో ఎర్రటి రక్తమే పాఠకుడికి కనపడుతుంది. గ్రాస్ "టిన్ డ్రం" తో ప్రపంచ ప్రఖ్యాతి పొందాడు . తర్వాత అతని నవలలు "క్యాట్ అండ్ మౌస్ "1961లో వచ్చింది , 1963లో వచ్చిన "డాగ్ ఇయర్స్" కూడా టిన్ డ్రం లాగే గతించిన జర్మన్ చీకటి రోజుల్ని రెండవ ప్రపంచయుద్ధంలో ప్రపంచ సానుభూతి అంతా యూదుల పట్ల ,మిత్ర మండలి పట్ల వున్నప్పుడు ,రష్యన్ సబ్ మెరైన్ జర్మన్లు ప్రయాణిస్తున్న ఓడను ముంచేయడం గురించి రాసిన నవల ఇది. దీన్ని "టిన్ డ్రం" కొనసాగింపుగా అనుకోవచ్చు "డాన్జింగ్ త్రయంగా" చెప్పబడే ఈ మూడు నవలలు విస్తుల నది ప్రవాహక ప్రాంతంతో ముడిపడివుంటాయి. అంతే కాకుండా అనేక జాతుల మధ్య విభేదాలు, అనేక జాతుల, సంస్కృతుల చరిత్రల గురించి అద్భుతమైన భాషా ప్రయోగంతో ఉత్తేజకరంగా గ్రాస్ నవలలు రాయబడ్డాయి.



గ్రాస్ పసితనంలో ఎదుర్కొన్న భాదాకరమైన అనుభవాల సారాన్ని, తగిలిన గాయాల్ని తన రచనల్లో తన రాజకీయ ఉపన్యాసాలలో పొందుపరిచాడు. గ్రాస్, అతని సమకాలికులైన రచయితలతో పాటు జర్మనీకి వ్యతిరేకంగా పోరాడాడు . తన తప్పుల్ని మరచిన జర్మని ప్రవర్తనను "తృప్తి తో కట్టుకున్న అందమైన సమాధి" గా అభివర్ణించాడు. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మని పునర్నిర్మాణం అమెరికా సహాయం తో జరిగింది దాంతో జర్మని తాను గతం లో చేసిన అరాచాకాల్ని మరిచింది దానివలన జరిగిన నష్టాన్నికూడా మరిచింది. ఇదే సమయంలో"టిన్ డ్రం" ఒక ఉరుముతున్న పిడుగులా వచ్చింది. గ్రాస్ తన తోటి రచయితలకు, దేశాభక్తులకు జర్మని గత చరిత్రతో పాటుగా, భావితరం సిగ్గు పడనీయకుండా,భాధ్యతాయుతంగా దేశాన్ని అభివృద్ధి చేయాలని పిలుపు నిచ్చాడు.


"టిన్ డ్రం" 1959లో అచ్చయితే 1962 లో "రాల్ఫ్ మన్హెమ్ "దాన్ని ఇంగ్లీష్ లోకి అనువదించారు. అచ్చయిన నాటి నుండి "టిన్ డ్రం" ఆధునిక సాహిత్యం లో ఒక క్రొత్త వొరవడి సృష్టించి ప్రభంజం సృష్టించింది. మాజిక్ రియలిజం అనే సాహితీ ప్రక్రియకు "టిన్ డ్రం " ఒక నిర్వచనంగా మారింది. "తర్డ్ రీచ్ " లేక నాజీల పాలన ఎలా ఎత్తుకు ఎదిగిందో, హిట్లర్ దురాగతాలకు ఎంత మంది యూదులు, ఇతరజాతులు బలయ్యాయో, ఆ తర్వాత నాజీల పతనం ఎలా సంభవించిందో ... ! "టిన్ డ్రం"నవలలో ఆస్కార్ అనే కథానాయకుని కళ్ళతో మనం చూస్తాం. జర్మని చీకటిరోజుల్ని, రాజకీయ అనిశ్చిత స్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రిస్తుంది "టిన్ డ్రం" నవల. ఇది సాహసోపేతమైన ప్రయత్నం - నిజమైన జర్మన్ చరిత్రను నేపథ్యంగా తీసుకుని గగుర్పాటు కలిగించే ఊహను మిళితం చేసి , శక్తివంతమైన పదాలతో రాయబడ్డ సర్రియలిజం ప్రభావిత నవల ఇది కానీ ఇది సర్రియలిజం కాదు. ఇది గ్రాస్ గుర్తించిన రెండు ప్రపంచ యుద్ధాల మధ్య,యుద్ధాల తర్వాత కూడా నలిగిన జర్మని కథ. గ్రాస్ జర్మని గతం, వర్తమానం,భవిష్యత్తు గురించే మాట్లాడతారు. నవల అంతా గ్రాస్ కోల్పోయిన సొంతవూరైన డాన్జింగ్ నగరంలో జరుగుతుంది, గ్రాస్ సొంత వూరి పై వున్న అనురాగం, అనుబంధం, దాన్ని కోల్పోయినందుకు గ్రాస్ ఆవేదన, చిన్ననాటి జ్ఞాపకాల దొంతర మెదులుతుండగా గ్రాస్ పడే ఆక్రోశం మనకు నవలలో కనిపిస్తుంది. గ్రాస్ మరియు అనేక మంది జర్మన్ రచయితలు నాజీల పాలనలో ప్రభావితం అయారు ,దాన్నే నేపథ్యంగా చాలా మంది రచనలు చేశారు. అయితే గ్రాస్ తన ప్రతి రచనలో ఈ ప్రభావాన్ని చూపిస్తారు. గ్రాస్ తన రచనలతో దశాబ్దాల పాటు నిర్వీర్యమై పోయి, నైతికంగా పతనమైన జర్మన్ సాహిత్యానికి ఒక క్రొత్త ఊపిరిని పోశాడు. ఈ నవలతో గ్రాస్ ప్రపంచం మరిచిపోయిన జర్మని చరిత్రను మాజిక్ రియలిజం ద్వారా ప్రపంచపటం మీదికి తేవడమే కాకుండా అగాధాన దాగివున్న, నాశనమై పోయిన సమాజపు చీకటి వేర్లను బయటికిలాగాడు. మాజిక్ రియలిజంతో గ్రాస్ వాడే తీక్షణమైన విమర్శ తో కూడుకున్న జర్మన్ జానపదాలు,ఊహాత్మక చిత్రణలు, చిత్రీకరణలు నాజీల అవాస్తవక, పతనావస్థలో వున్న లోపభూయిష్టమైన సిద్ధాంతాల్ని ఎండగొట్టాయి. సర్వత్రా తానై వుండి విచిత్ర వ్యక్తిత్వం, అత్మసంస్కారం కొరవడిన ఆస్కార్ పాత్ర చిత్రణ సమకాలీన ఆధునిక సాహిత్యం లో ఒక గొప్ప వోరవడిగా, నూతన ఆవిష్కరణగా పేరుగాంచింది. మూడు అడుగుల కంటే ఎక్కువ పెరగ కూడదనే ఆస్కార్ నిర్ణయం తిరుగులేనిది, ఎందుకంటే దారుణమైన పరిస్థితుల్ని చూసి పెరగడం ఎందుకనే అతని వాదన "ఎప్పటికీ మూడేళ్ళ వాడిగా వుండే టిన్ డ్రమ్మర్" (eternal three-year-old drummer ) గా వుంచేసింది . ఆస్కార్ పాత్ర రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మన్లు మోసిన పాపభారానికి నిదర్శనంగా ఉండిపోయింది .ఆస్కార్ లోని అసహజమైన గుణాలు ఉదాహరణకు అతని కీచుగొంతు గాజు అద్దాల్ని పగలగొట్టడం లాంటివి, నాజీలు చేసే కొన్ని అరాచాకాల్ని వివరించడానికి గ్రాస్ కు ఉపయోగపడ్డాయి. గ్రాస్ వాడే మాజికల్ కవిత్వం తో కూడుకున్న చిత్రణలు యుద్ధకాలం నాటి నాజీల రాజకీయ ,సామాజిక అరాచకాలను ఎంతో సహజంగా వున్నట్లు చిత్రీకరించడానికి దోహద పడ్డాయి. పాఠకులు ఆస్కార్ ను నాజీల క్రూరత్వానికి ప్రతీకగా గుర్తిస్తారు. చివరికి ఆస్కార్ ఒక సంక్లిష్టమైన , చిత్ర విచిత్ర లక్షణాలతో వుండి నాజీ పార్టీ అరాచకాలకు సంకేతంగా ఉంటూ దాని సర్వ నాశనానికి పుట్టిన పాత్రగా మనం గుర్తిస్తాము. భారతంలో శకుని పాత్ర ఎలా కురువంశ నాశనానికి కారణమవుతుందో అలా ఆస్కార్ జర్మన్ హిట్లర్ -నాజీల పతనానికి కారకుడవుతాడు. ఆస్కార్ తన ముప్పైవ ఏట బందీగా చేయబడి తర్వాత పిచ్చాసుపత్రికి పంపబడతాడు. నవల చివర్లో ఆస్కార్ తన జీవితం గురించి చెప్పేనిరాశ, నిర్వేదంతో కూడుకున్న మాటలన్నీ 1950 లలో జర్మని వున్న పరిస్థితిని తెలుపుతాయి."టిన్ డ్రం " ప్రచురితమైన ఇరవై ఏళ్ల తర్వాత 1999 లో సినిమాగా వచ్చింది. ప్రఖ్యాత దర్శకుడు వోల్కర్ స్కోలన్దోర్ఫ్ చేతిలో రూపుదిద్దుకున్న ఈ చలన చిత్రం కేన్స్ చిత్రోత్సవం లో పాలుపంచుకోవడమే కాకుండా ఉత్తమ విదేశి చిత్రంగా ఆస్కార్ అవార్డు గెలుచుకుంది.


రాజకీయాలపై గ్రాస్ అభిప్రాయాలు

సాహిత్యంతో వచ్చిన పేరు ప్రతిష్టలతో గ్రాస్ రాజకీయాల్లోకి అడుగు పెట్టారు, అంతే కాదు సోషియల్ డెమోక్రటిక్ పార్టి తరపున విల్లీ బ్రన్డిట్ నాయకత్వాన్నిబలపరిచారు. అయితే వియత్నాంకు వ్యతిరేకంగా చేసే రాజకీయాల్ని దుయ్యబట్టారు. గ్రాస్ తీవ్రవాదాన్ని వ్యతిరేకించారు. 1960ల కాలం నాటి జర్మన్లు నిజాయితీగా లేరని గ్రాస్ వాదన. జర్ల్మన్ల పాపభీతి, తప్పు చేశామనే భావన చాటున ఎంతోమంది అమాయకమైన జర్మన్లను బలి అయ్యారు. ముఖ్యంగా డాన్జింగ్ నుండి, ఇంకా తూర్పు యూరప్ నుండి లక్షల మంది జర్మన్లను బలవంతంగా పంపించివేశారు. గ్రాస్ అమ్మగారు కూడా రష్యన్ సైనికులు చేతుల్లోఅవమానాల పాలయ్యి, బలాత్కారానికి గురయ్యి కాందిశీకుల గుడారాల్లో తలదాచుకుంది ,తమ మాన,ప్రాణాలను కాపాడుకోవడానికి జర్మన్లు పడ్డ వేదన ప్రపంచం దృష్టిలోకి రాలేదు. జర్మన్లకు జరిగిన అన్యాయాల్నిచెప్పుకోవడానికి, అప్పటికే ప్రపంచయుద్ధంలో ఓటమిని జీర్ణించుకోలేని జర్మన్ ప్రభుత్వానికి ఇష్టం లేకపోవడంతో ఆ సంఘటనలు చరిత్రలో చోటు చేసుకోలేదు. "క్రాబ్ వాక్ "అనే నవలలో గ్రాస్ ఈ విషయాల్ని వివరంగా రాశారు. మిగతా గ్రాస్ నవలల లాగే ఇది కూడా బయటికి రాని జర్మన్ చారిత్రక సత్యాల పైనే రాయబడింది. ఇది కూడా 1845 లో రష్యన్ సబ్ మెరైన్ బాల్టిక్ సముద్రంలో ముంచి వేసిన జర్మన్ ఓడ లోని ప్రజల దీన గాధ, ఇందులో 9.,000 జర్మన్ కాందిశీకులు వున్నారు. ఇందులో వున్నవాళ్ళు అధికులు పిల్లలు ,స్త్రీలు. ఇలా జర్మన్ల కు జరిగిన అన్యాయం వారు చేసిన అన్యాయాల మరుగున దాగిపోయింది . అయితే జర్మన్లు యూదులు ఇతర జాతుల వారికి చేసిన ద్రోహానికి ఇది ప్రతీకారం అయినప్పటికీ , ఇది చరిత్రలో చేరకపోవడం ప్రపంచానికి తెలియక పోవడం మాత్రం చాలా దారుణమైన విషయం అంటారు గ్రాస్.


గ్రాస్ కు నివాళులు

గ్రాస్ మరణ వార్త వినగానే ప్రపంచం నలుమూలల నుండి అతనికి నివాళులు తెలియచేయడం ప్రారంభమయింది . జర్మని ప్రెసిడెంట్ జోచిం గాక్- గ్రాస్ భార్య యుటే గ్రాస్ కు సంతాప సందేశం పంపుతూ గ్రాస్ కు నివాళులు చెబుతూ ఇలా అన్నారు. "గ్రాస్ తన చుట్టూ వున్న పరిస్థితుల్ని చూసి కదిలిపోయారు, వాటి గురించిన ఆలోచనలలో చిక్కుకు పోయారు, సాహిత్యం, ఇతర కళలతో మన దేశ ప్రజలను ఆలోచింప చేశారు. సాహిత్యం ఆయనకు ప్రపంచమంతటా గుర్తింపు తెచ్చి పెట్టింది. సాహిత్యంలో అతనికి వచ్చిన నోబెల్ బహుమతి ఒక తార్కాణం మాత్రమే; అతని నవలలు, చిన్న కథలు,కవిత్వం అన్నీ జర్మని లోని మనతరం వాళ్ళ ఆశలు, బ్రమలు,భయాలు,కోరికలని ప్రతిబింబించాయి"

జర్మన్ చాన్సలర్ ఆంగెల మెర్కెల్ గ్రాస్ మృతికి నివాళులర్పిస్తూ " గ్రాస్ తన కళల తోను ,సామాజిక, రాజకీయ సంభందాల తోను రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత జర్మని చరిత్రను తానుగా తీర్చి దిద్దడమే కాకుండా దానికొక రూపాన్ని ఇవ్వగలిగారు."అన్నారు


గ్రాస్ మరణ వార్త తెలియగానే వెంటనే ట్వీట్ లో స్పందించిన రచయితలలో సాల్మన్ రష్దీ ఒకరు. రష్దీ "ఇది చాలా విచారకరం, అతను మహోన్నత శిఖరం, గొప్ప ప్రేరణ, మంచి స్నేహితుడు ,ఆస్కార్ ఆయనకు నగారా మ్రోగించు " అన్నారు.


టర్కీకి చెందిన నోబెల్ గ్రహీత ఆప్హన్ పముఖ్ మాట్లాడుతూ " గ్రాస్ రాబెలాస్ ,సేలిన్ నుండి చాలా నేర్చుకున్నారు మాజిక్ రియలిజం కు ప్రాముఖ్యత తేవడంలో గ్రాస్ కు సాటి ఎవరూ లేరు. ఇతని ద్వారానే కథకు కొత్తదనం తేవడం అనే పద్దతిని నేర్చుకున్నాం. ఆకథ సారాంశం క్రూరమైనదైనా, హింసతో కూడుకున్నదైనా,రాజకీయాలతో నిండి వున్నదైనా."


గ్రాస్ పుస్తకాల బ్రిటిష్ ఎడిటర్ జెఫ్రీ మల్లిగాన్ అంటారు-" ఆయన ప్రపంచ సాహిత్యంలో మహోన్నతుడు, ఏ వ్యక్తి అయినా ఒక కళలో ఆరితేరడం చూస్తాము, అయితే గ్రాస్ ఒక గొప్ప కళాకారుడు, శిల్పి ,కవి ,నాటక కర్త ,నవలా రచయిత గా కూడా ఎంతో ప్రావీణ్యత చూపడం చూస్తాము . వ్యక్తిగా కూడా చాలా సరదా మనిషి ,ఉదాత్తత కలిగిన అపురూపమైన వ్యక్తి "అని కొనియాడారు.


"టిన్ డ్రం"నవలను సినిమాగా తీసే సాహసం చేయడమే కాకుండా,దానికి ఆస్కార్ అవార్డ్ గెలుకున్న ప్రసిద్ధి చెందిన దర్శకుడు, అతని మంచి స్నేహితుడైన గ్రాస్ గురించి చాలా ఆలోచించేవిధంగా తన అభిప్రాయం చెప్పారు -" గ్రాస్ స్వరం తన దేశంలోను, విదేశాలలోనూ వినపడింది, అతని స్వరం జర్మనీదైనా, అతను పాల్గొన్న రెండవ ప్రపంచ యుద్ధం తర్వాతకూడా ప్రపంచం అతన్ని వినేట్టు చేసుకున్నాడు. అతనికి తెలుసు తాను రాస్తున్న విషయం ఏమిటో, దానికి ప్రపంచం ఎలా ప్రతిస్పందిస్తుందో కూడా అతనికి తెలుసు , టైప్ రైటర్ అతని టిన్ డ్రం, దాన్ని ఎలావాడాలో అతనికి తెలుసు ,అతను రాసింది అతని పాఠకులకోసం, అతని దేశం కోసం,ఎందుకంటే అతను దేశ భక్తుడు."


జాన్ ఇర్వింగ్- ప్రముఖ రచయిత ఇలా అంటారు 'అతను నా హీరో ... రచయితగానే కాదు ,నైతిక దిక్సూచి గా కూడా "


గ్రాస్ అభిప్రాయాలు - భావాలు, నమ్మకాలు

"నేను మౌనంగా వున్నాను,ఎందుకంటే చాలామంది మౌనంగా వున్నారు కాబట్టి, కానీ ఆ ఆకర్షణ బలమైనది. ..ఒకరిపై నిందారోపణను అందరి పాపంఖాతాలోకి జమ కట్టడం, తన గురించి తానే అలంకార ప్రాయంగా ఉత్తమ పురుషలో మాట్లాడ్డం .... అతను వున్నాడు, చూశాడు, చేశాడు,చెప్పాడు ,అతను మౌనం వహించాడు.” "పీలింగ్ ది ఆనియన్" (2006)అనే పుస్తకం నుండి.


"నేను అడవుల్ని చూసి ఆశ్చర్యానికి లోనవుతుంటాను. నేను నా రచనల్లో సృష్టించే అద్భుతాల కంటే ప్రకృతి సృష్టించే అద్భుతాలు మరింత అద్భుతమైనవని తెలుసుకున్నాను, అంతేకాదు ఈ సృష్టి గురించి నేను ఇంకా చాలా తెలుసుకోవాలి."( గార్డియన్ కు 2010 లో ఇచ్చిన ఇంటర్వూ లో)

"కళ విచిత్రంగా హేతుబద్దంగా వుండదు, అందులో ప్రత్యేకించి విషయమేమీ వుండదు, అయినప్పటికీ కళ అన్ని కాలాల్లో అవసరమే . " న్యు స్టేట్స్ మెన్ కు 1990లో ఇచ్చిన ఇంటర్వూలో.


గ్రాస్ తాను చేపట్టిన ప్రతి కళలోను ప్రఖ్యాతి గాంచాడు. కవిత్వం నుండి నాటకం దాకా,శిల్ప కళలోను, గ్రాఫిక్ కళలోను తనదంటూ ముద్రవేశారు.జర్మన్ చాన్సలర్ విల్లి బ్రాన్డిట్ కు గ్రాస్ ఉపన్యాసాలు రసేవారు. తనకున్న కీర్తి ప్రతిష్టల్ని ఉపయోగించుకుని ఆయన పర్యావరణ సంక్షేమం కోసం,శాంతి కోసం పోరాడారు. జర్మని ఏకీకరణకు అతను వ్యతిరేకంగామాట్లాడడానికి సాహసించారు. అంతేకాదు దాన్ని హిట్లర్ ఆస్ట్రి)యా ఆక్రమణతో పోల్చారు.


"ప్రస్తుతo ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకం మరియు ఉత్తరాలు రాసే కళ అంతరించి పోవడం ఒక కొత్త నిరక్షరాస్యతకు దారి తీసిందని "అంటారు. "దీని పరిణామం భాష యొక్క లేమిని తెలపడమే కాకుండా, ఇది మన సంస్కృతిలో వున్న అన్ని విషయాలను మరిచే పరిస్థితికి తీసికెళుతుంది. " అని ఆవేదన పడ్డారు.


ప్రజలు గుర్తించే మేధావిగా వుండడం కంటే సామాన్య పౌరునిగా వుండాలని కోరుకునే అతి కొద్ది మంది జర్మన్ రచయితలలో గ్రాస్ ఒకరు. 87 ఏళ్ల వయసులో కూడా ఆయన చాలా చలాకీగా ప్రజల్లోకి వెళ్ళేవారు. మరణించే వారం ముందుకూడా అతను చాలా విస్తృతంగా ప్రజల మధ్య కనపడ్డారు. ఫిబ్రవరి 2015లోజర్మన్ టీవీ WDR కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో అతని ఆఖరి పుస్తకం "గ్రిమ్మ్స్ వర్డ్ " నుండి కొన్ని వాక్యాలు చదువుతూ తన పుస్తకం జర్మన్ భాష పట్ల తనకున్న ప్రేమను వ్యక్తపరచడం అని అన్నారు. అందుకే ఆయన ఒక ఆదర్శ జర్మన్ పౌరునిగా వుండిపోయారు.


Published in Vividha Andhra Jyothi

కూతురు

"అమ్మా నీవు స్నానానికి వెళ్ళినప్పుడు సరయు అంటి ఫోన్ చేశారు, మళ్ళీ ప్రోగ్రాం కానీ వేశారా? నేను హాస్టల్ కు వెళ్ళేంత వరకు ఏమీ పెట్టుకోవద్దమ్మా ప్లీజ్", అంది నా కూతురు మైత్రి.

అల్ ఇండియా హెల్ప్ల్ లెస్ విమెన్ అండ్ చిల్ద్రెన్ సంస్థలో వాలంటీర్ గా నా స్నేహితురురాలు సరయు కౌషిక్ పనిచేస్తోంది . భర్త పెద్ద పారీశ్రామిక వేత్త , సరయు అందరు డబ్బున్న వాళ్ళలాగా విలాసాలు, వినోదాలు, కిట్టి పార్టీలు వగైరా లో ఆనందం వెతుక్కోకుండా, సామాజిక సేవ పట్ల ఇష్టం, బాధ్యత పెంచుకుంది. తన సంస్థ తరపు నుండే కాకుండా , తను వ్యక్తిగతంగా చాలా డబ్బు ఖర్చుపెడుతుంది . ఎంతో మందిని ఎన్నో రకాలుగా ఆదుకుంటుంది . ఆమె ఎప్పుడూ గుర్తింపు, పొగడ్త కోరుకోవడం నేను చూడలేదు.సరయు పరిచయం అయాక చాలా సార్లు కలిసి పనిచేసే అవకాశం వచ్చింది. బాగా చదువుకున్న ,తెలివైన, కరుణ కలిగిన వ్యక్తిగా ఆమెంటే నాకు చాలా గౌరవం వుంది. అందుకే వుద్యోగం చేసే నేను, తీరిక సమయం దొరికి నప్పుడు, ఉడతా భక్తిగా సరయుకు సహాయం చేస్తుంటాను .


సరయుకు ఫోన్ చేశా...


"మాధురీ ... ... ఒక రిపోర్టర్ నాకు ఫోన్ చేశాడు కూతురు ఇంటి నుండి గెంటి వేసిందని ఒక ముసలాయన న్యూస్ పేపర్ వాళ్లకు వచ్చి చెప్పాడట . దీన్ని సెన్సేషన్ న్యూస్ గా వేయడం కంటే, టీవీలో చూపడం కంటే ఆ కూతుర్ని కొంచం కౌన్సిలింగ్ చేసి బాధ్యత గలిగిన వ్యక్తిగా మారిస్తే మేలు కదా ! అన్నాడు. నాకు అదే మంచిది అనిపించింది. మనం వాళ్ళింటికి వెళదాం. మీరు నాతో వస్తే బావుంటుందని అనిపించింది . ప్లీజ్ వస్తారా!"

"తప్పకుండా ... వస్తాను "అన్నాను.

పిలానీలోఇంజనీరింగ్ చదువుతున్న నా కూతురు మైత్రి సెలవులని వారం కిందట వచ్చింది. సెలవుల్లో తనని వదిలి ఎక్కడికి వెళ్ళవద్దని మారాం చేసే కూతుర్నిఎలాగో బుజ్జగించి సరయుతో బయలు దేరా. రిపోర్టర్ తో వున్న ముసలాయనను చూసి, మనసుకు కష్టం వేసింది. 80 ఏళ్ల వయసులో ఆయన్ని కూతురిలా తరమడం అన్యాయం, కొడుకులు చేశారంటే వింటున్నాం కానీ ... కూతురు ఇలా చేసిందంటే కొంచం ఆశ్చర్యం, సందేహం కూడా కలిగాయి..


ఆయన్ని అడిగాం ఏమయ్యింది ? అని

"నన్ను, నా భార్యను నా కూతురు మీకు తిండి పెట్టలేను వెళ్లి పొండి అంది తల్లీ, కనీ, పెంచి, పెద్ద చేశాం, పెళ్లి చేశాం, మాకింత ముద్ద పెట్ట మంటే చాతకాదు పొమ్మంది . నా భార్యను నా చుట్టాలింట్లో పెట్టి, పేపరోళ్ళ కు చెప్పమని నాకూతురింటికి దగ్గరలో వున్నఆసామి చెబితే వచ్చాను" అన్నాడు.

"సరే పదండి, మీ అమ్మాయితో మాట్లాడి, మీకు న్యాయం చేస్తాం. ఆమె కాదు, కూడదంటే అప్పుడు మిమ్మల్నివృద్ధుల ఆశ్రమం లో వదులుతాను, సరేనా...దిగులు పడకండి" అంది సరయు.

ముగ్గురం ఆ ముసలాయన చూపిన ఇంటి దగ్గర దిగాం . చిన్న సందులో చిన్న ఇల్లు అది. చుట్టుపక్కల వాళ్ళు ఆ ఇంటికి మేము, ముసలాయన రావడాన్నిఆసక్తిగా, ఆశ్చర్యంగా చూశారు. ఇంట్లోకి వెళ్లాం, రెండు పాత ప్లాస్టిక్ కుర్చీలు , ఓ ప్రక్క మంచం, పరుపు వున్నాయి . పేదరికం తెలుస్తున్నా ,ఆ ఇల్లు చాలా పరిశుభ్రంగా వుంది . మా అలికిడికి లోపలి నుండి ఒక 45 ఏళ్ళు పైబడిన స్త్రీ వచ్చింది. పచ్చటి చాయతో వున్నా రక్త హీనత తో పాలిపోయి వున్న ఆమె, ఆశ్చర్యంగా మమ్మల్ని,ముసలాయన్ని మార్చి మార్చి చూసింది. తర్వాత" మీరు ఎవరండి, ఎవరు కావాలి ?" అని " కూర్చోండి " అంది.

మేము అక్కడున్నకుర్చీల్లో,రమేష్ మంచం మీద కూర్చున్నాం.

"అమ్మ ఏదీ.నాన్నా.?.నువ్వు,అమ్మ నవీన్ దగ్గరికి పోలేదా ?"అంది వాళ్ళ నాన్న కేసి తిరిగి.

ముసలాయన పలకలేదు. మారు మాటాడకుండా బయట వున్న అరుగు మీద కూర్చున్నాడు .

"చెప్పండమ్మా ఎవరు మీరు.. నాకు గుర్తు రావడం లేదు " అంది ఆమెకు మేము వాళ్ళ నాన్నతో వచ్చామని తెలియలేదు.

రమేష్ గొంతు సవరించుకుని "అమ్మా ఈమె సరయు గారు ,ఆమె మాధురి గారు, నా పేరు రమేష్, నేను ఒక రిపోర్టర్ ని, మీ నాన్న నా దగ్గరకు వచ్చి మీరు అమ్మానాన్నని ఇంట్లోంచి వెళ్ళిపోమని చెప్పారని చెప్పారు,వాళ్ళు ఈ వయసులో మీరు కాదంటే ఎక్కడికి పోతారు ? అందుకే మీకు నచ్చ చెప్పాలని వీళ్ళిద్దరి ని నేనే తీసుకొచ్చాను " అన్నాడు.

ఆ మాటలు వినగానే కోపం తోనో, అవమానం తోనో, ఆమె ముక్కుపుటాలు అదిరాయి,కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా అయాయి.దానితో పాటు ఆ కళ్ళలో కన్నీరు తిరిగింది . దు:ఖంతో నోట్లోంచి మాట రాలేదు. మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఎంత సేపటికి ఆమె నుంచి సమాధానం లేదు .

సరయు నాకేసి చూసి, ఏమైనా అడుగు అన్నట్లు సైగ చేసింది .

నా కెందుకో ఆమెను చూస్తుంటే అంత సంస్కారహీనురాలు కాదనిపించింది.ఆవేశంలో ఏదో అనుకుని, అపార్థాలతో ఇలా జరిగిందేమో అనిపించింది, ఏమయినప్పటికీ ఎలాగూ వచ్చాం కాబట్టి, ఏదో విధంగా నచ్చ చెప్పడం మంచిదనిపించింది.

"చూడండి.... ఇది మీ కుటుంబ విషయమే , మీ ఆర్థిక పరిస్థితి కూడా ఆలోచించాలి ,కానీ తల్లిదండ్రులు,వృద్ధులు కదా ... వాళ్ళు ఎక్కడికి పోతారు ..? ఆయన వయసు చూడండి ... పాపం ఎంత దీనంగా వున్నారో ... మా సంస్థ తరపున నుండి మీకు ఆర్ధిక సహాయం కూడా చేస్తాము .. వాళ్ళని మీ దగ్గరే ఉండనివ్వండి ." ఎందుకో చెప్పడం.. అయితే చెప్పాను,కానీ నాకు బాగా అనిపించలేదు.

ఆమె గట్టిగా నిట్టూర్పు వదిలింది.

"వృద్ధుల పట్ల , సమాజం పట్ల మీకు గల బాధ్యతను నేను గౌరవిస్తున్నాను . నేను మీలాగా పెద్ద చదువులు చదవలేదు, కాదు మమ్మల్ని చదివించలేదు .నా భర్త కు ఆరోగ్యం బాగాలేదు, మా ఆర్ధిక పరిస్థితి బాగా లేదు నా ఇద్దరు పిల్లలు డబ్బులేక మంచి చదువులు చదువుకోలేక నిరాశలో వుండి పోయారు ,ఈ సమస్యల్లో మాకు వీళ్ళిద్దరి ని, వాళ్ళు నా తల్లి దండ్రులే కావచ్చు,కానీ నేను పోషించలేను. అందుకే మా తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళమన్నాను. అంతే కానీ వీళ్ళను నేను నా ఇంటి నుండి గెంటివేయలేదే ...!" ఆమె మాటల్లో స్థిరత్వం, నిజాయితి కనపడ్డాయి .

సరయు, నేను ఆశ్చర్యపోయాము . "ఆయనకు కొడుకులున్నారా ?" ఇద్దరం ఒకే సారి అన్నాము.

"ఇద్దరు కొడుకులున్నారు...అంతేకాదు వాళ్ళు చాలా స్థితిమంతులు ,మా నాన్న ఆస్తి అంతా కొడుకుల కిచ్చారు, ఆస్తి తీసుకున్న కొడుకులు కదా వీళ్ళను చూసుకోవాలి ... "

"తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కొడుకులైనా, కూతుర్లయినా ఒకటే కదండీ ... మీ దగ్గర వుండాలని ఉందేమో వాళ్లకు " అంది సరయు .

"చూడండి... మీరు విషయాన్ని ఒకే కోణం నుండి చూస్తున్నారు ... వృద్ధులైన నా తల్లిదండ్రుల గురించి మీరు సానుభూతి తో వున్నారు ... మధ్యతరగతి కుటుంబాల్లో ఓ ఇరవై ముప్పై ఏళ్ల క్రిందట ఆడపిల్లల పరిస్థితి ఏమిటో మీకు తెలియనట్టుంది, మా కుటుంబ విషయమే ఇది ,మేము ఎక్కడా ఈ విషయాలు ఎవరికీ చెప్పుకోలేదు ... ఈ రోజు మా తల్లిదండ్రులు మేం వాళ్ళని బయటికి గెంటి వేశాం అని పేపర్ వాళ్లకు చెప్పే పరిస్థితి వచ్చింది కాబట్టి చెబుతున్నా ..."


ఆమెకు కష్టం కలిగించే విషయమైనా, ఆమె స్పష్టంగా, నెమ్మదిగా చెప్పడం విన్నాం ...

"మా నాన్న ఒక చిన్న ఉద్యోగిగా పని చేసేవారు . ఆయనకు పెద్దగా చదువు లేకున్నా, డబ్బును చాలా జాగ్రత్తగా దాచి, దాన్ని పదింతలు చేసే తెలివితేటలు వున్నాయి. నేను, నా చెల్లెలు తర్వాత ఇద్దరు తమ్ముళ్ళు , మా అమ్మ చదువు కోలేదు, ప్రపంచం తెలియదు, కానీ నాన్న ఏది చెబితే, అదే సరి అయినదని నమ్మేది. నేను చెల్లి మున్సిపల్ స్కూల్లో చదివాం ,మా తమ్ముల్లిద్దర్నీ వానులో సెయింట్ జోసెఫ్ స్కూలుకు పంపేవారు. మా అమ్మ రోజూ మా తమ్ముల్లిద్దరికీ ఉదయాన్నే పాలు బోర్నవిటా,కోడిగుడ్డువుడకపెట్టి ఇచ్చేది ,మాకు బోర్నవిటా రుచి కూడా తెలియదు , మా చెల్లి ఆశగా చూసేది వాళ్ళు పాలు త్రాగుతూ వుంటే ; "మాకు కూడా కోడిగుడ్డు,బోర్నవిటా ఇవ్వమ్మా "అని అడిగేది ... "మగపిల్లలకు బలం వుండాలని మీ నాన్నవాళ్ళకే ఇవ్వమన్నాడు, ఆడపిల్లలు త్రాగితే తొందరగా ఎదుగుతారు, వద్దులే" అనేది. నేను వప్పుకున్నట్టుగా చెల్లెలు వప్పుకోలేకపోయేది. ఏడ్చేది,కొట్లాడేది. లాక్కునేది, దెబ్బలు తినేది. పాలు కోడిగుడ్డు మాకు అందని చందమామ. అమ్మకూడా తినేది కాదు. ఆమెకు కోరికలు అనేవి ఉండేవి కాదు నాన్న చెప్పినట్లు, ఆయనకు నచ్చినట్లు చేయడమే ఆమె జీవితం. ఆడపిల్లలంటే ఆమె లాగే ఉండాలనే ఆమె నమ్మేది ."

"మా చదువుల గురించి నాన్న అసలు పట్టించుకునేవాడు కాదు. పదోతరగతిలో నేను మా స్కూల్లో అత్యధిక మార్కులు సంపాదించి జిల్లా కలెక్టర్ తో బహుమతి అందుకున్నా . కానీ మా నాన్న నన్ను కాలేజిలో చేర్పించలేదు ,నా చెల్లెలు తొమ్మిదవ తరగతిలో ఉండగానే దానికి టైఫాయిడ్ వస్తే ,సరిగ్గా వైద్యం చేపించక , రోగం తిరగ పెట్టి అర్థ సంవత్సరం చడువుపోయింది . అయినా అది నా కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది . దాన్ని కూడా కాలేజ్ లో చేర్చలేదు. అయితే ఏడవతరగతి లో తప్పిన మా పెద్ద తమ్ముడ్ని ట్యూషన్లు చెప్పించి ,పరీక్ష రాస్తూ వుంటే సెంటర్ల చుట్టూ తిరిగాడు, మార్కులు వేయించి పాసు చేయించుకున్నాడు. "

"పదహారేళ్ళ వయసులో నన్ను ఒక్క మాట కూడా అడగకుండా, చదువులేని వ్యక్తితో , పెళ్లి నిశ్చయం చేశారు. నోరు తెరిచి నాకీ పెళ్లి ఇష్టం లేదనే ధైర్యం లేదు మాకా రోజుల్లో. సంపాదించిన డబ్బునంతా కొడుకులకు దాచకపోతే కూతురికి మంచి సంబంధం తేవాల్సింది అని హితవు ఎవరైనా చెప్పినా, నాన్న వినేవాడు కాదు . నా పెళ్లి అయిన రెండో సంవత్సరమే చెల్లికి కూడా యోగ్యత లేని, చదువు పెద్దగా లేని వాడి కిచ్చి పెళ్లి చేశాడు. తమ్ముల్లిద్దర్నీ కర్నాటక లో డొనేషన్ కట్టి ఇంజనీర్లను చేశాడు.. మేం ఎంత ఇబ్బందుల్లో వున్నా నాన్న మాకెప్పుడూ ఆర్ధిక సహాయం చేయలేదు."


"నాన్న తమ్ముళ్ళకు ఆస్తి పంచారు, తమ కంటూ కొంచం కూడా ఉంచుకోలేదు. పంపకాలు చేస్తున్నప్పుడైనా ఆడపిల్లలకు చెరి యాభై వేలు ఇవ్వమని పెద్దమనుషులు చెప్పినా, మా నాన్న ఒప్పుకోలేదు . ఏనాడో పెళ్లి అయిన ఆడపిల్లలకు ఎందుకివ్వాలని పెద్దమనుషులనే కోప్పడ్డాడు. మా అమ్మకు ఇవ్వాలని వున్నా, ఆమె మాట నెగ్గదని తెలిసి ఏమీ మాట్లాడలేదు. అమ్మా నాన్న సొంత ఇంట్లోనే వుండేవారు. తమ్ముళ్ళు అన్నీ అమ్మేసి తమ దగ్గరకు వచ్చేయమంటే , అమ్మేసి వాళ్ళ దగ్గరికే వెళ్ళిపోయారు. బిజినెస్ కు డబ్బు అవసరమని పెద్ద తమ్ముడు నాన్న దగ్గరున్న డబ్బు ,అమ్మ బంగారం అంతా తీసుకుని నష్టపోయాడు . అమ్మా నాన్న బరువయ్యారు. పెద్ద తమ్ముని భార్య పోరుపడలేక, చిన్న తమ్ముని దగ్గరకు పోతే, అంతా పెద్దోడికే పెట్టావని చిన్న తమ్ముడు, వాడి భార్య సాధించారు . విధిలేక వూరికి వెళ్ళిపోయి అక్కడే వుండినారు. నేనే వీళ్ళు పడుతున్న బాధచూడలేక, కొంతకాలం క్రిందట నా దగ్గరకు తెచ్చుకున్నా. ఎంతకాలమైనా వీళ్ళు ,తమ్ముళ్ళ దగ్గరికి వెళ్ళే ఆలోచన చేయలేదు. "

"నా కుటుంబ పరిస్థితి ని బట్టి చాలా కాలంగా మా అమ్మా నాన్నబాధ్యత తమ్ముళ్ళకు వివరించి సహాయం అడుగుదామని చెబుతున్నా. వాళ్ళు ఏ మాత్రం నా మాటలు పట్టించుకోలేదు. తమ్ముళ్ళ తో నేను మాట్లాడతాను అన్నా వప్పుకోలేదు . ముందు చూపు లేకుండా వున్న దంతా కొడుకుల కిచ్చి వీధిన పడిన వీళ్ళకు ఈ స్థితి ఎందుకొచ్చింది ? మమ్మల్ని కూడా మా తమ్ముళ్ళ లాగా చదివించి వుంటే ఆడపిల్లలు, మగ పిల్లలు అనే తేడా లేకుండా పెంచి వుంటే , మేం మా భర్తల్ని ఎదిరించి అయినా సంపాదించి మా తల్లిదండుల్ని చూసుకునేవాళ్ళం . కానీ మా చేతుల్లో విద్యలేదు, డబ్బులేదు, మాకు స్వాతంత్యం కూడా లేదు , ఏమిచేయగలం ?"

ఆమె ఆగి ఊపిరి తీసుకుంది.

ముసలాయన కేసి చూశాం. ఆమె చెప్పింది వినపడిందో, లేదో ..అర్థమయిందో, కాలేదో మరి, ఏ భావమూ లేదు అతని ముఖంలో. ఆమె ఈ సారి ఆమె ముఖం దీనంగా మారింది .

" వాళ్ళను మేం కోరేది ఒక్కటే ... మాకేమీ ఇవ్వొద్దు , వాళ్ళ అవసరాల కొసమైనా కొంత ఆస్తిని ,డబ్బును మీ దగ్గరుంచుకోమని ... ఎంత మంది కొడుకులు ఎంత హీనంగా చూసి వీళ్ళను తిరస్కరించినా వాళ్ళే తమ వారసులని ,తమ సంపాదన అంతా కొడుకులకే చెందాలనే మన తల్లి దండ్రుల నైజం మారాలి . ఎన్టీ రామారావు గారు ఆడవాళ్ళకు ఆస్తి హక్కు ఇచ్చారు. ఎంతమంది తల్లిదండ్రులు ఆడపిల్లలకు ఆస్తి ఇస్తున్నారు ? ఆస్తి గురించి కాదు, ఆమ్మాయిని ,అబ్బాయిని తేడా లేకుండా పెంచాలి.. ఇద్దరినీ వారసులు, వంశో ద్దారకులు గానే గుర్తించాలి. మీరు చదువుకున్నవారు ,సమాజసేవ చేసేవారు , మార్చండి ఈ వ్యవస్థలో కూతురుకున్న స్థానాన్ని. "

మాకేం చెప్పాలో తోచలేదు. మళ్ళీ ఆమే మాట్లాడింది


"మా అమ్మా నాన్న ను మీరు చెప్పడం వలన నేను చూసుకేలేనమ్మా ... తమ్ముళ్ళు చూసుకోని రోజు వాళ్ళు నా భాధ్యతే . నేను కోరింది ఒక్కటే వాళ్ళను ఆస్తి అంతా వాళ్ళ కిచ్చారు కదా ... మీకు ఇప్పుడు కావాలని అడగండి .. మీరు ఇచ్చింది మీరు అడగడం లో తప్పేముంది? వెళ్లి వాళ్ళని నిలదీయమని చెప్పాను. కానీ వీళ్ళకు కొడుకుల ఆనందం తప్ప , వీళ్ళ అవసరాలు కానీ, మా అవస్థలు కానీ అవసరం లేదు .ఈ దేశం లో ఆడపిల్లల గతి యింతేనమ్మా ... ఇప్పుడే కాదు ,రామాయణ కాలం నాటి నుంచి అంతే. దశరథుడు కూతురు శాంత తో తృప్తిపడ్డాడా... కొడుకులకోసం శాంతను రోమపాదునికి దత్తత ఇచ్చాడు . దశరథుని కొడుకుల ముచ్చట కూతురి వలన తీరిందనే సత్యం ఎంతమందికి తెలుసు ? శాంత ఔదార్యం ఎక్కడైనా కీర్తించ బడిందా ?"


"మా బిడ్డల సాక్షిగా చెబుతున్నానమ్మా ,మాకున్న దాంట్లోనే వాళ్లకు పెడతాం , చివరి వరకు మా అమ్మా నాన్నని నేను చూసుకుంటాను . ఎవరి సహాయం కూడా మాకు అవసరం లేదు. " కన్నీళ్ళతో ఆమె కళ్ళు నిండిపోయాయి. ఉద్వేగంతో గొంతు పెగల్లేదు.

నోరేత్తలేకపోయాం. మా దగ్గర మాటలు లేవు. ముగ్గురం ముఖాలు చూసుకున్నాం. రామాయణంలో రాముడికి ఒక అక్క వుందని , యూనివర్సిటి డిగ్రీలున్న మా ముగ్గురికి తెలియలేదు , మేడి పండులాంటి ఈ సమాజం లో ఎన్ని పురుగులున్నాయో ! ముసలాయన అరుగు మీదనే నిశ్చలంగా వున్నాడు . కూతురు గురించి చెప్పాడు కానీ ఇద్దరు కొడుకులు కూడా చూడ లేదని ఒక్క మాట కూడా అనలేదు . రక్తం లో జీర్ణించుకుపోయిన ఈ స్త్రీ పురుష తేడాలు ,ఎలా పోగొట్ట గలం ?

ఆమె లోపలి కి వెళ్లి నాలుగు గ్లాసుల్లో మజ్జిగ తెచ్చింది. మేము త్రాగి బయటికి వచ్చాము . బయట తండ్రికి గ్లాసు నోటికి అందించి మజ్జిగ త్రాపిస్తున్న ఆమెను చూసి మాకు హృదయం ద్రవించింది . నా కయితే ,ఆమె మహోన్నత వ్యక్తిత్వం ముందు మేము మరుగుజ్జులం అనిపించింది.ఆమెకు మేము కౌన్సిలింగ్ చేయడమేమిటి ? సమాజపు రీతుల గురించి ఆమె మాకు ఎంతో తెలియ చేసింది. మేమింక ముసలాయన దగ్గరకు కూడా పోలేదు. మా అవసరం అతనికి లేదు.
 

"మళ్ళీ కలుస్తాం మేడం " అన్నాడు రమేష్.
 

ఆమె ఏదో అనబోయి మౌనం వహించింది. చేతులు జోడించి కళ్ళతోనే వీడుకోలు తీసుకున్నాం .
 

"ఆమె పేరేంటో అడగనేలేదు మేడం ... ఆమె గురించి రాస్తాను . అమె సామాన్యంగా వున్న, సామాన్యుల్లో వున్న, చాలా గొప్ప మనిషి, మన జాతి సంపద " కార్లో కూర్చున్నాక అన్నాడు రమేష్.

"ఆమెకు పేరెందుకు ? ఆమె ఒక "కూతురు " అంది సరయు .
నాకు కూతురుంది, అనుకున్నా మనసులో తృప్తిగా


Published in Koumudi in December 2014

స్త్రీ


కొద్ది కాలం క్రిందట మేము అమ్మమ్మ గారి వూరికి వెళ్ళినప్పుడు జరిగిన సంఘటన ఇది. మా తాతగారితో పిల్లలందరికీ బాగా చనువు, నేను ఆయనకు మొదటి మనుమరాల్నికావడంతో నన్ను బాగా ముద్దు చేసేవారు. సమయం దొరికితే చాలు ఆయన్ని కథలు చెప్పమని వేధించేవాళ్ళం. చాలా చిన్నప్పుడు పేదరాసి పెద్దమ్మ కథలు; తర్వాత సింద్ బాద్, ఆలీబాబా కథలు, చరిత్రలోని గొప్పవాళ్ళ గురించి చెప్పేవారు.వాళ్ళ జీవిత చరిత్రలు చదివి మాకు వినిపించేవారు. సెలవుల్లో మేము,మా చిన్నమ్మ,మామయ్యల పిల్లలు అందరం కలిసి మెలిసి, ఆటలు, పాటలు, అల్లర్ల తో గడిపే వాళ్లము.తాతయ్య చాలా పనిలో తలమునకలై వుండేవారు. మూడు ఊర్లకు ప్రెసిడెంట్ గా ఎప్పుడూ వచ్చేపోయే జనాలతో తాతయ్య ఇల్లు ఎంతో హడావుడిగా వుండేది. అయినా తాతయ్య కు కొంచం తీరిక దొరకగానే "పిల్లలు రండర్రా" అని దగ్గర కూచో పెట్టుకుని మా చదువుల గురించి, వాకబు చేసి తర్వాత మమ్మల్ని కొన్ని ప్రశ్నలు వేసి మా జ్ఞానాన్ని మా సమాధానాల ద్వారా కని పెట్టేవారు. కథలు చెప్పి మమ్మల్ని ఊహా ప్రపంచం లో విహారింపజేసేవారు అదే సమయం లో ఏది చేయాలో, ఏది చేయకూడదో మంచి నీతి ని బోధించే విషయాన్నిఆధారంగా చేసుకుని చెప్పేవారు. మేము పెద్దగయ్యాక ఆటలు అవి తగ్గించాక అలా తాతయ్య దగ్గర కూర్చుని కథలు చెప్పించుకోవడం తగ్గి పోయింది. ఒక సారి పెద్ద మామయ్య కొడుకు అజయ్, ఇంకో మామయ్య కొడుకు అనుష్, ఆడ వాళ్ళగురించి తక్కువ చేసి మాట్లాడ్డం తాతయ్య విన్నట్టు గా వుంది. మమ్మల్ని అందరిని దగ్గరగా కూర్చో పెట్టుకుని మామూలుగా అవి ఇవి మాట్లాడుతూ," మీ సంస్కారo మీరు స్త్రీలకు మీరిచ్చే గౌరవాన్ని బట్టి వుంటుంది" అన్నారు. ఆడపిల్లలం అందరం కాసేపు వెలిగి పోయాం. అబ్బాయిలు కొంచం చిన్న బుచ్చుకున్నారు. తర్వాత తాతయ్య నెమ్మదిగా చాలా ఏళ్ళ క్రిందట జరిగిన ఒక సంఘటన చెప్పడం ప్రారంభించారు.

"నాకు స్త్రీలంటే విపరీతమైన కోపం వుండేది, దానికి కారణం మా సవతి తల్లి. మా అమ్మ నేను చిన్నగా వున్నప్పుడు, నా తమ్ముడు పుట్టగానే చనిపోయింది. నాకప్పుడు నాలుగేళ్ళు. అమ్మ ప్రేమ కానీ ఆమె రూపం కూడా నాకు గుర్తు లేదు. పిన్ని మమ్మల్ని పట్టించుకునేది కాదు. పనివాళ్ళ చేతుల్లోనే పెరిగాము ఇద్దరం. పిన్ని నాన్నని తన చెప్పు చేతల్లో ఉంచుకుని ఆడించేది. మాకు అన్నం తినడానికి కూడా భయంగా వుండేది. ఏ నిముషం లో ఆమెకు కోపం వస్తుందో, వీపు విమానం మోత మ్రోగుతుందో మాకు తెలియదు. అన్నం తినేప్పుడు ఒక్క మెతుకు క్రింద పడ్డా, నీళ్ళు త్రాగేప్పుడు ఒక్క చుక్క వొలికి పోయినా, ఎప్పుడు వచ్చి మా వీపు చీరేస్తుందో అని భయంతో బిక్క పడి చచ్చేవాళ్ళం. దీనికి తోడు అమ్మమ్మ వాళ్ళింటికి వెళితే అక్కడ మామయ్యలు మమ్మల్ల్ని అపురూపంగా చూసుకుంటుంటే, అత్త లిద్దరూ మాకెందుకీ పీడ అని మా ముందే ఈసడించేవాళ్ళు. దాంతో నాకు ఆడవాళ్ళలోనే చెడు ఆలోచనలు ఉంటాయని, ప్రేమ విలువలు తెలియవని, మానవత్వం లేని మర బొమ్మలనే నిర్ధారణకి వచ్చాను. అది తప్పని నాకు చెప్పేవాళ్ళు లేకపోయారు. పైగా నాకు కనిపించిన స్త్రీలంతా నాకు అదే అభిప్రాయాన్ని కలిగించారు. నాకు పదిహేనేళ్ళు వచ్చేప్పటికి మా పిన్నికి ఒక కొడుకు, తర్వాత కాన్పులో ఆడపిల్లను ప్రసవించి చనిపోయింది.పదవ తరగతి పరీక్షలు రాసి ఇంటికి వచ్చేప్పటికి తమ్ముళ్ళు, వారం రోజుల పసికూన వున్నారు.

ఆ పసి కూన సైతం ఆడపిల్ల కావడం తో నాకు దాన్ని చూడ్డం కూడా ఇష్టం వుండేది కాదు. తర్వాత అదే వూర్లో వుండే పిన్ని అమ్మగారు పసిపిల్లని తీసుకెళ్ళి పోయారు. తల్లి లేని మమ్మల్ని సరిగా చూడకుండా మమ్మల్ని సాధించిన పాపానికి, ఆమె బిడ్డలకు కూడా అదే గతి పట్టిందని కసిగా అనుకున్నాను. తర్వాత కొంత కాలానికి నాన్నకూడా గుండె పోటుతో కాలం చేసారు. పి.యు.సి. చదువును ఆపేసి వ్యవసాయం చేయక తప్పలేదు. నా తమ్ముల్లిద్దరూ అప్పుడప్పుడు వెళ్లి చెల్లిని చూసోచ్చే వాళ్ళు..పిన్ని కొడుకును నా తమ్ముడి గా అంగీకరించాను, కానీ చెల్లి పట్ల నాకే భావం వుండేది కాదు. తమ్ముల్లిద్దర్నిచదువుకు పంపాను. ముందు నుంచి ఏ ఆధారం లేక మా ఇంట్లోనే వుండి పనులు చేసే మా దూరపు చుట్టం సూరమ్మ మాకు వండి పెట్టేది. పెళ్లి చేసుకోమని ఇంటిని చూసుకునే ఇల్లాలు వస్తే ఇంటికి దీపం పెడుతుందని ఆ సూరమ్మ చేతి వంట తప్పించుకోవచ్చని బంధువులు ఉచిత సలహా ఇచ్చేవాళ్ళు.నేను నవ్వి వూరుకునేవాడ్ని .కానీ రాను రాను సలహా కాస్త సతాయింపుగా మారేటప్పటికి నాకు స్త్రీలపై వున్న ద్వేషం,అసహ్యం పెల్లుబికాయి. పిన్నిని, అత్తయ్యల్ని ఉదాహరణ గా చెప్పి వాళ్ళతో ఘర్షణ పడ్డం ఇష్టం లేక తమ్ముళ్ళు అభివృద్ధిలోకి వచ్చేదాకా పెళ్లి ప్రశక్తి లేదని తీర్మానించాను. అయినా అప్పుడప్పుడు బంధువులో, ఆడపిల్లల తల్లిదండ్రులో నన్ను వేధించేవారు. నాలో రోజు రోజుకు స్త్రీలంటే అసహ్యం, వ్యతిరేకత పెరిగి పోయాయి. ఎప్పుడైనా చెల్లి కనపడి మాట్లాడడానికి ప్రయత్నించినా ముభావంగా ఉండేవాడిని. స్నేహితులు ఆడవాళ్ళ గురించి మాట్లాడినా, ప్రేమలో పడ్డట్టు చెప్పినా తీవ్రంగా నిరసించేవాడిని. ఎవరు పెళ్ళికి పిలిచినా వెళ్ళే వాడ్ని కాదు. తప్పని సరయిన పెళ్ళిళ్ళు అయితే తమ్ముళ్ళను పంపే వాడిని. నేను ప్రత్యేకించి చెప్పక పోయినా నేను స్త్రీ ద్వేషిననే విషయం చాలా మందికి తెలిసి పోయింది."అలాగా!" అని నన్ను ఎవరైనా అడిగినా ఖండించకుండా నవ్వి ఊరుకునే వాడిని.

ప్రేమకు ప్రతిరూపంగా వుండే తాతయ్యేనా తాను స్త్రీ ద్వేషినంటున్నాడు ... ఆశ్చర్యపోయా . తాతయ్య చెప్పడం మొదలు పెట్టాడు


"ఒక రోజు ఒక స్నేహితుడ్ని కలిసేందుకు ఓ పదిమైళ్ళ దూరంలో వున్న పక్క వూరు వెళ్ళాల్సి వచ్చింది. ఆ రోజుల్లో మనూరినుండి బస్సుల్లేవ్. ఎద్దులబండి ఒక్కటే ఆధారం ..మంచి వ్యవసాయం పనులు జరిగే కాలమది, కాబట్టి నా ఎద్దులబండి కాకుండా వేరే స్నేహితుడి బండి వెళుతుంటే వెళ్లాను. వూరికి వచ్చేందుకు తిరుగు ప్రయాణం అడవి గుండా చేయాల్సి వచ్చింది. ఆ దారి వెంట చాలా సార్లు ప్రయాణం చేసినా, ఒంటరిగా నడిచి ప్రయాణం ఎప్పుడూ చేయలేదు. వేటికి భయపడని నేను ధైర్యంగా బయలు దేరాను. హుషారుగా నడక సాగించాను...పచ్చని చెట్లమధ్య కాలిబాటలో ప్రయాణం అద్భుతంగా వుంది. పియ్యూసీ లో చదువుకున్న రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన "స్టాపింగ్ బై వుడ్స్ ఆన్ ఏ స్నోయి ఈవెనింగ్" పద్యం గుర్తు వచ్చి,గట్టిగా పాడుకుంటూ, అడవిలో నాకంఠం ప్రతిధ్వనిస్తూ వుంటే అదోకరకమైన అనుభూతికి లోనై పరవశించి ముందుకు పోతూవున్నా.

ఎవరో నావెనకే నడుస్తున్నట్టు అనిపించి తిరిగి చూశా!ఒక ఇరవై,ఇరవై ఐదుకు మధ్య వయసున్నఒక నిండు చూలాలు చేతిలో ఒక సంచితో నడుస్తూ వస్తోంది.సహజంగానే నాకున్న స్త్రీ ద్వేషంతో ఆమెను పట్టించుకోకుండా ముందుకు సాగాను. నేను ఎంత వేగంగా నడిచినా అతి తొందరలోనే ఆమె నా సమీపంలోకి రాగలుగుతోంది.ఆమె ఎత్తైన పొట్ట చూస్తే నాకు అసహ్యం వేసింది.ఎంత చీత్కారంగా తిట్టుకున్నానో...! యింత అందమైన ప్రకృతిలో,అందమైన సమయంలో ఛీ ఈవిడ తగిలిందేమిటి నాకు అనుకున్నా.నేను వేగంగా వెళ్ళేకొద్దీ ఆమె వేగం పెంచుతోంది.ఆమె ఆయాసంగా ఊపిరి తీస్తున్న శబ్దం నాకు వినపడుతోంది.అయినా వొంటరిగా ఇలా అడవిలో బయలు దేరిందేమిటి? నాలో నేను అనుకుంటూ వేగంగా ముందుకు పోయాను. ఎండిన ఆకులపై ఆమె అడుగుల సవ్వడి నాకు వినపడలేదు.హమ్మయ్య!ఇంక నా వేగానికి ఆమె రాలేదు.. ఒకరకమైన నిశ్చింతతో ఊపిరి పీల్చుకున్నా! చాలా దూరం నడిచాక నాకు కాస్త విశ్రాంతి తీసుకొవాలనిపించినా, మళ్ళి ఆమెను చూడాల్సి వస్తుందని భయం వేసి ముందుకు అడుగు వేశా! ఇంతలోనే కారుమబ్బులు కమ్మినయ్, చూస్తూండగానే ఈదురుగాలులతో కూడిన వర్షం మొదలయి,పెద్దగా అయింది.చెట్లకొమ్మలు గాలికి ఎక్కడ విరిగి నాపై పడతాయో అన్న భయం వేసింది.అడుగు ముందుకు పడ్డం లేదు, బురద బురదగా వున్న దారిలో కాలు తీసి కాలు పెట్టలేకపోతున్నా!ఎలాగో దగ్గరలోనే ఒక పాడుపడిన సత్రం కనిపించింది. వెళ్లి దాంట్లో తలదాచుకున్నా!వర్షం తీవ్రమైoదే తప్ప తగ్గలేదు.చూస్తుండగానే చీకటి పడింది.సత్రం అరుగుపై కూర్చుని వర్షం ఎపుడు తగ్గుతుందో అని ఎదురు చూస్తున్నా! తోడులేకుండా దూరాభారాలు పోకూడదని పెద్దలెందుకంటారో అర్థమైంది.వెంటనే నిండుచూలాలు గుర్తుకొచ్చింది.ఆమె ఏమయిపోయిందో అన్న ఆలోచనని, నాకెందుకు? అన్ననిరాసక్తతతో అణచివేశాను. తర్వాత వర్షం తగ్గే సూచన కనిపించక పోయేటప్పటికి అరుగు మీదే పడుకున్నాను.చలిగా వుంది,ఆకలిగా వుంది అయినా అలసటగా నిద్రపోయాను.ఎప్పుడో ఏదో ఆక్రందన వినిపిస్తే ఉలికి పడిలేచాను.


నావెంటే వస్తూన్న ఆమె ఏమయ్యిందోఅనుకున్నా!ఎప్పుడో ఆమె నేనున్న సత్రానికే చేరుకుంది."అన్నా!ఒక్క దాన్నిఅమ్మగారింటికిపోతా వున్నా! నన్నుతీస్కపోవడానికి, ఈరోజు రేపు అంటూ మా అన్నరాకపాయ,ఇంట చూడ ఎవరు లేకపోయిరి,నా మొగుడు పని కోసమని బోయి శాన్నాల్లయింది,విశయం తెలియరాలా!ఒక్క దాన్ని వూరు చేరేవరకు నీ తోడుగా నడుస్తా,వేగం వెళ్ళ మాక" అంది.

పలకకుండా వుండిపోయా.ఏమనుకుందో తర్వాత ఆమె మాట్లాడలేదు కానీ మూల్గుతూ వుంది. నాకు ఆమె అక్కడ ఉందన్న ఊహనే చికాకు కలిగించింది. ఆమెను పట్టించుకోకుండా కాసేపు గడిపాను.వర్షం తగ్గుముఖం పట్టినా ఆ చీకట్లో..బురదలో నడవడం సాధ్యపడదు.ఒక ఆడదానితో...ప్చ్ ఈ సత్రంలో ఉండాల్సి రావడం ఛ ఛ ...ఏం ఖర్మం రా! మనం దేన్నీ అసహ్యించు కుంటామో అదే మన నెత్తిన పడుతుంది ...అలాగే వుంది నా పరిస్థితి.తర్వాత ఎలాగో తంటాలు పడి అరుగు మీదే నిద్రపోయా...! ఉరుము శబ్దానికి ఉలికి పడి లేచాను. మరొక ప్రక్క అరుగుపై ఆమె మెలికలు తిరిగి పోతోంది.పొట్ట పట్టుకుని మూల్గుతోంది. నా నిర్లక్ష్యపు వైఖరి అర్థమైన ఆమె, నన్నేమీ పలకరించలేదు.నేను లేచి కూర్చున్నా,మెరుపుల వెలుతురులో ఆమె ముఖంలోబాధని,పళ్ళబిగువున ఆపుకుంటున్నఏడుపుని చూడగలిగాను. ఆమెకేమయ్యిందో నాకు అర్థం కాలా! సమయం ఎంతైందో కూడా తెలియలేదు! ఆమె ఆక్రందన పెద్దగయ్యింది.మూలుగునుండి ఆమె ఏడుపు కేకలుగా మారింది. అమ్మా, అమ్మా అంటూ ఆమె చేసే ఆర్తనాదం నా హృదయాన్ని పిండివేయ సాగింది. నాకు తెలియకుండానే నేను స్పందించ సాగాను.ఏమైనా చేయగలనా అనిపించ సాగింది.కానీ ఏమి చెప్పాలో, ఏమి అడగాలో ఆలోచించుకునే లోపలే తెల్ల వారసాగింది.ఆమె అరుపులు తీవ్రమయినై, నాకు అర్థమైంది ఆమెకు ప్రసవం అవుతోందని...నేనేమి చేయగలను? అభిమానవతి లాగుంది నన్ను ఏ సహాయమూ అడగలేదు. నా మనస్సును కుదుట పర్చుకుని ఆమె దగ్గరకు వెళ్లాను.నాకు ఒక్కసారి కళ్ళు తిరిగాయి.ఆమె బట్టలన్నీ రక్తసితం అయ్యాయి. ఆమె కళ్ళ కొనల నుండి కన్నీళ్లు ధారాపాతంగా కారుతున్నాయి.ఎత్తుగా వున్న పొట్టపై చేతులు వేసి గట్టిగా నొక్కు కుంటూ ఆమె అరుస్తోంది.


"ఏమి కావాలి? నేనేమి చేయగలను ?" నా జీవితంలో ఒక స్త్రీ తో నా అంతకు నేనే మాట్లాడ్డం అదే మొదటి సారి. నీళ్ళు అన్నట్టు సైగ చేసింది. నీళ్ళు తెచ్చేందుకు అక్కడ ఏమీ లేదు.నా బుజాన వున్నతుండును వర్షం నీటితో తడిపి పిండి వేసి మళ్ళి తడిపి ఆమెకు అందించాను. అరిచి అరిచి ఎండిపోయిన గొంతుకు ఆమె నీటిని ఆ తుండు నుండి పిండుకోలేకుంది. నేను ఆమె నోటి దగ్గర నీటిని పిండి త్రాపించాను. ఆమె సైగ చేసి తన సంచి ఇవ్వమని అడిగింది ,ఆ సంచిలోంచి బట్టలు తీసి సత్రం నేల మీద పరచమంది.ఆమె చెప్పినట్లు చేసాను.మెల్లిగా లేచి నిలబడింది.ఆమె కాళ్ళమధ్యనుండి రక్తం ధారగా కారుతుండగా కదిలింది.నేలపై పడుకోవడానికి ఆమెకు సహాయం చేసాను.గట్టిగా నా చేయి పట్టుకుంది. నేను స్పృహలో వుండగా ఏ స్త్రీ స్పర్శ ను ఎరగను. ఆమె అమ్మా అనే అరుపుకు బదులుగా అన్నాఅన్నా అని అరవ సాగింది.నా చేతిని వదలకుండా మెలికలు తిరగ సాగింది.ఆమె పరిస్థితికి నాకు కన్నీరు ఆగలేదు.నా బుద్ధి ఎరిగి నప్పటి నుండి నేను ఏడవలేదు. ఇప్పుడు ఒక అనామకురాలి కోసం ఏడుస్తున్నాను.ఆమెతో పాటు ఏడుస్తున్నాను,నాకు తెలియకుండానే ఆమె తలని నా వొడిలో పెట్టుకున్నాను.విలా విలా ఏడుస్తూ, మూల్గుతూ,అరుస్తూ కాళ్ళు చేతులు కొట్టుకుంటూ వుంటే ఆమెకు మరణం తప్పదని నాకు అనిపించింది.నా మనసును చదివినట్లు గా ఆమె "అన్నా.. నాకేమన్నాఅయితే నా బిడ్డని మా అమ్మకు అప్పగించన్నా! మా అమ్మ పేరు.... మళ్ళి నొప్పితో కేకలేయసాగింది. రక్తపు మడుగులో మునిగి వున్న ఆమెను చూస్తూ నేను నా అంతరంగంలోని మలినాన్ని కడుక్కున్నాను.ప్రార్థన తెలియని నేను ఈ సృష్టికి కారణమైన ఏ అపూర్వ శక్తి అయినా వుంటే ఆమెను కాపాడాలని ప్రార్థించాను. ఎత్తుగా వున్న ఆమె పొట్ట కిందికి జార సాగింది.ఆమె అరుపులు ఎక్కువయి కొద్ది సేపు ఆమె మూర్చపోయింది.మళ్ళీ కేక వేస్తూ కొట్టు మిట్టాడింది.అంతలోనే పసిబిడ్డ అరుపు వినపడింది.ఆమె అరుపు ఆగిపోయింది.... కాసేపు నాకేమి తోచలేదు. క్యారు క్యారు మంటూ పిల్లాడి ఏడుపు...కానీ ఏదో సందేహం కాసేపు అలాగే ఉండిపోయాను...ఆమెకు స్పృహ లేదు..గుండె దిటవు చేసుకుని ఆమె తలను సంచి పై పెట్టి ఆమె కాళ్ళ మధ్య వున్న బిడ్డను లాగాను జిడ్డు జిడ్డుగా రక్తపు ముద్దగా వున్న బిడ్డకు బొడ్డు నుండి వేలాడుతున్న ప్రేగులాంటి దాన్ని చూసి ఏమి చేయాలో తోచలేదు.బిడ్డను ఆమె కాళ్ళ ప్రక్క వేసి,ఆమెను సమీపించాను.తట్టి లేపాను పలక లేదు. ఎంత కదిలించినా ఆమె కదల లేదు.పుట్టిన బిడ్డ బొడ్డునుండి వ్రేలాడుతున్నది వేరు చేస్తారని తెలుసు కానీ ఎలా చేయాలో, ఏమి చేయాలో అర్థం కాలా! ఏ పని చేసినా తప్పు పట్టడానికి వీల్లేకుండా చేస్తానని నాకు చుట్టు ప్రక్క ఊర్లలో పేరు ప్రఖ్యాతులున్నాయి.నమ్మిన వారిని ఆరు నూరయినా,నూరు ఆరయినా ఆదుకుంటానని..పేరు పొందాను.కానీ ఇప్పుడు ఈ పసికూనని,ఆ తల్లిని ఎలా కాపాడాలో తోచడం లేదు.... నన్ను నమ్మి అన్నా అని పిలిచి నా చేతుల్లో ప్రాణాలు పెట్టిందే ఈ అభాగ్యురాలు! అయ్యో ఏమిటి చేయడం? నాలో నేను తీవ్రంగా కుమిలి పోయాను. ఏడుస్తున్న బిడ్డను చేతుల్లోకి తీసుకున్నా చలిగాలికి చిగురుటాకులా వణికి పోతోంది.ఏదో స్పురించి బిడ్డను అక్కడే పడుకోబెట్టి బయటకు పరిగెత్తాను.వర్షపు నీటిలో తడిసి అడవంతా బురదగా వుంది.పదునుగా వున్న రాయి కోసం వెదకి పట్టుకున్నా,నిలిచి వున్న నీటిలో రాయిని కడగి .. మొలత్రాడు త్రెంచి పసిబిడ్డ బొడ్డును కట్టి రాయితో కోసాను. బిడ్డను ఆమె సంచిలోంచి బట్టలు తీసుకుని చుట్టేసాను.మళ్ళీ తల్లిని కదిలించి చూసాను ప్రాణం వున్నట్టుగానే వుంది కానీ పలుకు లేదు.ఏడుస్తున్న బిడ్డకు ఆకుల మీద నీటి బిందువుల్నిత్రాపించాను. ఏడుపు ఆపింది.ఇంక బిడ్డను గుండెలకు అదుముకుని.. పరుగులాంటి నడకతో వేగంగా వూరు చేరి, బిడ్డను సూరమ్మ చేతిలో పెట్టి వూర్లో పురుడు పోసే మంత్ర సానిని వెంట తీసుకుని బండి కట్టమని ఓబులేసును పురమాయించి,వైద్యం తెలిసిన వూర్లో పెద్దాయనను తీసుకుని బయలు దేరాను.ఎడ్ల పందాల్లో గెలుపు కోసం కూడా నేను నా ఎద్దులని అలా తొందర పెట్టలేదు.


నా అజ్ఞానాన్నిపోగొట్టడానికే ఆ మాతృమూర్తి నా వెనక వచ్చిందేమో! ఒక తల్లి తన ప్రాణాల్ని ఫణంగా పెట్టి,నరకయాతన అనుభవించి, యింత భయంకరమైన నొప్పిని తట్టుకుని, ప్రాణ కోటిని ఈ ప్రపంచానికి అందజేస్తుందా! మగవాడి క్షణిక సుఖానికి ఫలితంగా స్త్రీ యింత దుర్భర మైన వేదన పొంది బిడ్డల్ని కంటుందా! నన్ను కన్నతల్లి కూడా ఇలాగే ..ఇలాగే మరణయాతన అనుభవించి నను కన్నదా! ఆ ప్రసవ వేదనలోనే నా తల్లి, పిన్ని మరణించారు.పిన్నిని ద్వేషించానే ...కానీ పిన్ని గురించి ఒక్క సారి కూడా ఆలోచించలేదు.చిన్నవయసు ఆమెకు, నాన్నను పెళ్లి చేసుకునేప్పటికి.. ఆటపాటల వయసులో పెళ్లి, బాధ్యత తెలియని భర్త, పిల్లల భారం, కుటుంబ భారం, ఎదగని వయసులో చెప్పుడు మాటల ప్రభావం.. పాపం ఏమిచేస్తుంది? చాతనయిన కోపం మాపై చూపించింది. ఏ పాపం చేసినా స్త్రీ పుణ్య మూర్తే!ఆమె అన్నితప్పుల్ని కడిగే మంత్రజలం మాతృత్వం! ఆనాటి నుండి ప్రతి స్త్రీ నాకు వున్నతురాలు... నాలోని స్త్రీ ద్వేషి స్థానే సాత్వికుడైన స్త్రీ పక్షపాతి ఉదయించాడు.మా అమ్మ ఫోటో ప్రక్కనే పిన్ని ఫోటోను కూడా పెట్టుకున్నా.స్త్రీల గురించి అగౌరవంగా ఎవరు మాట్లాడినా, స్త్రీ యొక్క గొప్పతనాన్ని వివరించేవాడ్ని.నాకు చాతనయినంత విధంగా చుట్టు ప్రక్కల గ్రామాలో ప్రసూతికి అనువైన వైద్య సేవలు అందించడానికి ప్రయతిస్తూనే వున్నాను.నన్ను మనిషిని చేసిన ఆ తల్లికి నేను ఎప్పుడూ రుణ పడి వుంటాను..." తాతయ్య రెండు చేతులు జోడించి నమస్కరించాడు.

"తాతయ్యా ఆమె కేమయ్యిందో చెప్పలేదు..." తడి నిండిన కళ్ళను తుడుచుకుంటూ,మాట రాని గొంతును పెగల్చుకుని అడిగాను.


"ఏమయ్యుంటుంది? వెళ్ళింది...చిన్నరెడ్డా మరెవరన్నానా! పరుగు తీసింది ఎద్దుల పోటీల్లో ఎదురులేని మా పొట్లగిత్తలురా!తల్లి చల్లగా వుంది.. ఆ బిడ్డకి నేనే దగ్గరుండి పెళ్లి చేశా.."

"అర్థ మయిందా ఆడవాళ్ళ విలువ! సంస్కారవంతుడు ఎప్పుడూ ఏ స్త్రీని తక్కువ చేసి చూడడు...చూసాడా! వాడికున్న మిగతా ఔన్యత్యం అంతా శూన్యమే! నా తప్పును నేను తెలుసుకున్నట్లే, మీరు తెలుసుకోవాలనే ఇది చెప్పాను"

అందరూ గంభీరంగా వుండి తర్వాత నిట్టూర్పు వదిలారు.అనుష్,అజయ్ తాతయ్యకు దగ్గరగా వెళ్ళారు,మౌనంగా తలలు వంచి నిలుచున్నారు. తాతయ్య వాళ్ళ తలల్ని ప్రేమగా నిమిరారు.


--

(ప్రేరణ; చిన్నప్పుడు చదివిన ఒక అనువాద రష్యన్ కథ. పేరు గుర్తులేదు)
Published in Vakili in June 2014

కుడి ఎడమైతే

ఆమాల్ కు చాలా నెర్వస్ గా వుంది. జీవితంలో యింత టెన్షన్ ఎప్పుడూ అనుభవించ లేదు. టెన్త్ పరిక్షలు రాసి కూల్ గా అమ్మమ్మ వాళ్ళ వూరు వెళ్లి కజిన్స్ తో ఫుల్ గా ఎంజాయ్ చేసోచ్చాడు. ఇంటర్, ఎంసెట్, ఐ ఐ టి పరిక్షలన్ని ముగించి ఢిల్లీ లో వున్న మామయ్య వాళ్ళింట్లో వుండి ఇండోర్, ఔట్డోర్ గేమ్స్ తో పాటు సినిమాలు, షికార్లు చేసి,రిసల్ట్ గురించి ఒక్క సారి కూడా ఆలోచన చేయలేదు, ఐ ఐ టి చెన్నై లో సీట్ వచ్చాక నాలుగేళ్ళలో చదువు కూడా ఏనాడు ఇబ్బంది పెట్టలా! వుద్యోగం వెంట పడి వచ్చింది ....ఆపై.వుద్యోగం లో కూడా చెప్పుకోదగ్గ సమస్య లేదు...నాలుగేళ్ళలో రెండు ప్రమోషన్లతో...మంచి జీతం తో చాలా కంఫర్టబుల్ గా వున్నాడు ....ఏ రకమైన వత్తిళ్ళు లేని అతని జీవితం లోకి ...ఈ తన్వి వచ్చి ఆమాల్ ను కష్టాల సుడిగుండం లోకి నెట్టింది. కాలేజి లో స్నేహితులంతా ప్రేమలో పడి కొట్టుమిట్టాడుతుంటే ఆమాల్ నవ్వుకునే వాడు . ప్రియురాళ్ళ ముచ్చట్లు తీర్చలేక అప్పుల పాలయ్యే స్నేహితులకు కొంతలో కొంత సహాయం చేసి...ఆపై ఎంత హితబోధ చేసినా...మారని స్నేహితుల్ని చూసి జాలి పడే వాడు. అమ్మాయిల వెంట తిరుగుతూ చదువు ఎత్తిపెట్టి పేపర్లన్నీ పెండింగులో పెట్టె వాళ్ళను తిట్టేవాడు...'నీకూ మాలా భాధలు కలుగుకాక' అని చాలా మంది శపించినా, ఆమాల్ కు అంట్లాంటి వికారం కలగనే లేదు. స్నేహితులంతా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారని ...నీ సంగతేంటని అమ్మా నాన్న అడిగితే ఆలోచనలలో పడ్డాడు అమాల్.


జీవిత భాగస్వామి పై అతనికి కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలు వున్నాయి.బాపు బొమ్మలా కాకపోయినా బాపు సినిమాలో హీరోయిన్ లా నిండుగా వుండి, బారెడు వాలుజడ ఖచ్చితంగా వుండాలని ,జీరో సైజ్ అంటూ ఎముకల గూడులా కాకుండా చబ్బి చీక్స్ తో పాటు డింపుల్ చిన్ కాకపోయినా బుగ్గ మీద మాత్రం నవ్వితే సొట్ట పడాలని ఎప్పుడో నాన్న చూస్తున్న 'అనుపమ' సినిమా లో షర్మిలా టాగోర్ ని చూసి నిర్ణయించుకున్నాడు. అతని క్లాసు మేట్స్ లో ఆ లక్షణాలు వున్నాయో లేవో అతను గమనించనే లేదు. అతని ధ్యాసంతా చదువు పైనే వుండేది , అమ్మాయిలతో మాట్లాడినా అతనికి పెద్ద జెండర్ ఫీలింగ్ వుండేది కాదు. చదువుకు సంభందించిన డిస్కషన్ కు అతను అమ్మాయిల్నిఅబ్బాయిల్ని ఒకేలాచూడటం అతనికి 'ఐ ఐ టి' నేర్పిస్తే, అమ్మాయిల్ని గౌరవంగా చూడటం, అతి చనువు ప్రదర్శించకుండా వుండడం అతని కుటుంబం నేర్పింది. అమాల్ కు తనకు కావాల్సిన లక్షణాలు వున్న అమ్మాయి ఎక్కడా కనపడలా! తనతో పాటు పని చేసే వాళ్ళలో చీర తో అటుంచి చుడిదార్ వేసుకునే వాళ్ళేలేరు. అమాల్ అతని అమ్మలా, వదినలా భారతీయత కల్గిన స్త్రీ కోసం వెతికి వెతికి దిగులు పడిపోయాడు. తనకు నచ్చిన తర్వాత, పరిచయం చేసుకుని ..అభి ప్రాయాలు తెలుసుకుని తర్వాత ప్రపోస్ చేసి, ఆమె అమ్మ నాన్నలకు, ఇతని అమ్మ నాన్నలకు తెలియ చేసి, ఆ తర్వాత ప్రేమ లేఖలు లాంటి మేసెజ్ లు ఇచ్చుకుని, విరహం లాంటి ఫీలింగ్స్ ని ఎంజాయ్ చేసి, కొంత కాలం తర్వాత పెళ్లి చేసుకోవాలనే అతని వూహ ఊహగానే ఉండిపోయింది. చేసేదిలేక ఇక అన్న వదిన, అమ్మానాన్నలకే అమ్మాయిని వెతికే పని అప్పచెప్పాడు.


ఈలోగా ప్రాజెక్ట్ వర్క్ కోసం రెండు నెలలు చికాగో వెళ్ళాల్సి వచ్చింది. అప్పుడే అతని వదిన సుజన అనే అమ్మాయి ఫోటో నెట్ లో పంపారు.అమ్మాయి బావుంది కానీ బాపు హీరొయిన్ లా లేదు ...చుడిదార్ వేసుకున్నాఆ హెయిర్ స్టైల్ చూడగానే జీన్స్ లో వుంటుంది, పెళ్లి చూపుల ఫోటో కి అలా తీసి పంపారు అనిపించింది. వదిన రమ తో ఆ మాట అంటే,


"ఇంక ముత్యాల ముగ్గు హీరొయిన్ సంగీతకు కూతురుందేమో చూద్దాం. పెళ్లి పుస్తకం హీరొయిన్ దివ్యవాణికి, ఆమనికి, స్నేహ కు కూడా పెళ్ళైపోయింది, .ఇంకా బాపు శ్రీ రామరాజ్యం హీరోయిన్ నయన తార , ప్రభుదేవాను వదిలేసింది ,.ఇంకా చార్మికూడా బాపు హీరోయిన్ ట్రై చేద్దామా నీ వయసే " అంది.


"వద్దు బాబోయ్....ఆ నయనతార .... చార్మి..వద్దు వద్దు" అన్నాడు.


"బాపు గారి సినిమాలో మేకప్ లో అలా వుంటారు,ఈ అమ్మాయి ని నీకిష్ట మైనట్లు మలుచుకోవచ్చు కదా"అంది.


ఏదో అసంతృప్తి వెంటాడినా ..నా ఇష్టాలు తెలిసిన వాళ్ళే కదా నాకు నచ్చేట్టు ఉంటేనే కదా వీళ్ళు కూడా ఒప్పుకునేది అనిసరి పెట్టుకున్నాడు.


మళ్ళి "నేను వచ్చి చూసాక చెబుదాం" అన్నాడు


"నీవు వచ్చే వరకు ఆగమంటే ఎలా ? నచ్చింది కదా మళ్ళి రెండు నెలలవరకు వాళ్లకు ఏమీ చెప్పక పోతే ఎలా? ఓకే చెప్పేద్దాము, నీకు తప్పకుండా నచ్చుతుంది ...కావాలంటే సుజన తో మాట్లాడు" కోప్పడింది వదిన.


ఆమాల్ కు సుజన తో మాట్లాడి నప్పుడు కూడా ఏదోలా అనిపించింది. అప్పుడప్పుడు ఫోన్ చేస్తే బాగానే మాట్లాడింది.కొంచం కొంచం ఇష్టం అయ్యింది సుజన అంటే, ఎంతయినా కాబోయే భార్యకదా ఫీలింగ్స్ తెచ్చుకోవాలి అనుకున్నాడు.


"సుజన ఎలా వుంది?" అడిగాడు వదినతో.


"ఇంప్రూవ్ అయావు.. ఎయిర్ పోర్ట్ కి తీసుకురానా ?"అంది.


"వస్తుందా!" "ఆశగా అన్నాడు.


" ట్రై చేస్తా.. మీ అన్నయ్య తొ నేను వస్తే తీసుకు వస్తా .."అంది.


కానీ ఎయిర్ పోర్ట్ కి ఆమాల్ అన్నయ్య ఒక్కడే రావడం తో ఆమాల్ కాస్త నిరాశ పడ్డాడు.


కార్ దిగి లగేజ్ సంగతి కూడా చూడకుండా ఆమాల్ ఇంట్లోకి పరుగు తీసాడు అమ్మని చూడక ఎంతో కాలమైనట్లుంది. ఎదురుగా వస్తున్న అమ్మాయి కి డీ కొట్టాడు ..తల పట్టుకున్న అమ్మాయి కోపంగా చూసింది ఆ తర్వాత ఆమాల్ ఆ ఇంటి అబ్బాయే అనుకుని సారీ చెప్పి మెల్లిగా ప్రక్కకు తప్పుకుని వెళ్లి పోయింది. ఒక్క క్షణంలో ఆమాల్ కు తల తిరిగింది. డీ కొట్టడం వలన కాదు ...తన ఊహల ఊర్వశిని క్షణంలో వెయ్యోవంతులో గుర్తు పట్టాడు .ఒక వేళ ఈమే సుజన కాదుకదా ... వుహూ ..ఆ పెద్ద జడ ..ఆ గుండ్రటి ముఖం ఆ పెద్ద బొట్టు, నవ్వలేదే... నవ్వితే బుగ్గలపై డింపుల్ పడుతుందా! చుట్టూ అందరూ చేరి కబుర్లు మొదలెట్టినా ఆమాల్ గుండె వాలుజడ చిన్న దానితో వెళ్లి పోయి, అన్య మనస్కంగానే వున్నాడు. సుజన చర్చ రానే లేదు,వదిన ను ఆ అమ్మాయి ఎవరో అడుగు దామని అనుకున్నాడు కానీ రమ ఒంటరిగా దొరక లేదు.


అమ్మ వొడిలో పడుకుని ముచ్చట్లు చెబుతున్నఆమాల్..".రమక్క లేరా ఆంటీ ?" అని సంశయంగా ఆగిన ఆ అమ్మాయిని చూసి గభాల్న కూర్చున్నాడు.


"ఈ అమ్మాయి రమ కు డిస్తంట్ కజిన్, తన్వి, మైక్రోబయాలజీ లో PhD చేస్తోంది, మా అబ్బాయి ఆమాల్ బెంగుళూర్ లో జాబ్ చేస్తాడు " తల్లి పరిచయం చేయడంతో


"హలో'అన్నాడు.


"హలో "..అని డీ కొట్టింది గుర్తు వచ్చి కాబోలు నవ్వింది.


హిప్ .హిప్ హుర్రే అని గట్టిగా అరవ బోయి తమాయించుకున్నాడు. నవ్వగానే ఆమె ఎడమ బుగ్గపై పడిన డింపుల్ అతన్నిఆకాశo లో విహరింపచేసి, ఈ మగువ సుజన కాదు అన్న తలపు దభాల్న భూమ్మీద వచ్చి పడేసింది.


రమ, తన్వి గొంతు విని గది లోపలి నుండే, "రా లోపలి, నోట్స్ రాస్తున్నా "అంది .


'ఎక్జ్క్యూజ్ మీ" అని లోపలి వెళ్ళింది తన్వి. లోపలి నుండి ఒకటే నవ్వులు .సుజన ను తీసుకొస్తానని చెప్పిన వదిన ఆ ఊసే తేలేదేమిటి అనుకున్నాడు. ఆమాల్ కు ప్రపంచమంతా తన్విలా అనిపించసాగింది. దేని మీద ద్యాస కలగలా! వదిన తన్విని అలా గదిలోనే ఉంచేయడం నచ్చలేదు , తన్వి బయటికి వస్తుందేమోనని అతని కళ్ళు రమ గది కేసి చూస్తూండిపోయాయి.అతనికి అర్థమైంది ప్రేమ అంటే ఎలావుంటుందో ! స్నేహితుల శాపాలు ఫలించాయి. తొలి చూపులో ప్రేమ లో పడ్డం సాధ్యమా! అనుకునే వాడు ఏదీ తన వరకు వస్తే గాని అర్థం కాదు. ఇపుడు అర్థమైంది ప్రేమంటే ! మనసంతా ఆమే! ఆలోచనలన్నీ ఆమె గురించే ...తన్వి ఎంత మంచిపేరు ! కానీ సుజన తో పెళ్లి కి వొప్పుకున్నాడే ...ఇప్పుడు ఇంకో నచ్చిన అమ్మాయి కనపడిందని, మాట ఇచ్చిన అమ్మాయికి మోసం చేయడం తగునా! మధన పడుతున్నాడు ఆమాల్.


బోజనానికి తన్వి కూడా కూర్చుంది ఆమాల్ కి ఎదురుగా. రమ ఆమాల్ ఫీలింగ్స్ కనిపెట్టింది... ఏదో తేడాగా వున్నాడనుకుంది.


"తన్వి... మా ఆమాల్ ఇంకో వారం ఉంటాడు పాపం ఎవరూ స్నేహితులు లేరు, నేను మీ బావ కాలేజ్ కి పోతే మామ గారు ఆఫీసుకు వెళితే అత్తయ్య ఒక్కటే వుంటారు, ఎలాగూ నీవు కూడా ఉంటావుగా ఇంకో వారం, కొంచం కంపెని ఇవ్వు"


"ష్యూర్ అక్కా" అంది కానీ తన్వి పెద్దగా మాట్లాడ లేదు.


రమ తీరిగ్గా వుండగా "సుజన రాలేదా మీరు చెప్పారుగా నేను వస్తున్నానని ..తను రాలేదేం ?" అన్నాడు.


"ఓహ్ మర్చిపోయా! తను వూర్లో లేదు ఏదో మారేజ్ కి వెళ్ళింది. రాగానే కాల్ చేస్తానన్నది. అంది."


తన్వి, రమ,క్యారమ్స్ ఆడ దామన్నారు, ఆమాల్ అమ్మగారుకూడా ఓకే అన్నారు. ఆమాల్ ని కూడా ఆడమన్నారు. తన్వి ఆమాల్ ఒక జట్టు, రమ, అమ్మగారు ఒక జట్టు ...ఎప్పుడూ వోడిపోయే ఆమాల్ విజ్రుంభించి ఆడాడు. తన్వి కూడా కమాన్ ఆమాల్ బ్లాక్ వెయ్యి, రెడ్ వెయ్యి అంటుంటే వేసేయ్య గలిగాడు. అతనికి తన్వి మాట వేదంగా అనిపించింది. జీవితం అంతా క్యారమ్స్ గేం ఆడుతూ ..తన్వీని చూస్తూ గడిచిపోతే చాలనిపించింది ఆమాల్ కు. వారం గడిచి పోయింది. తన్వి హైదరాబాద్ వెళుతున్నానని చెప్పింది ..ఇంట్లో ఆందరూ తన్వి ని ఇష్టపడతారు అందరితో సరదాగా వుంటుంది.ఆమాల్ కి కూడా జాయినింగ్ టైం అయిపోతోంది ..ఆమె అంటే ఇష్టమని తన్వి తో చెప్పెయ్యాలి...అనుకున్నాడు. కానీ సుజన.. ? తను చూడని, కలవని అమ్మాయి కోసం తన కలల కన్యను వదులు కోవడమా! ధర్మ సందేహం ఒక ప్రక్క, ప్రేమించిన అమ్మాయికి ప్రేమ వ్యక్త పరచలేని నిస్సహాయత ఒక ప్రక్క ...సంఘర్షణ, అనిశ్చిత స్థితిలో...మరీ ఆలోచించడానికికూడా సమయం లేదు .... తన్వి రేపు వెళ్లి పోతుంది.ఇవాళ చెప్పలేక పోతే ..ఇంక అంతే ఫోన్ లో ఆమెకు ఆన్ని వివరాలు చెప్పడం, ప్రపోస్ చెయ్యడం అబ్సర్డ్ గా ఉంటుందేమో కూడా ...! ధైర్యే ....సాహసే...తన్వి అనుకున్నాడు.



"మీతో మాట్లాడాలి" ...రమ లేనప్పుడు అన్నాడు.


"చెప్పండి " అంది.


"ప్లీజ్ ఇక్కడ కాదు బయట"


తన్వి బెదురు కళ్ళతో "ఎందుకు?" అంది.


అది చూసి అంత టెన్షన్ లోను నవ్వు వచ్చింది ఆమాల్ కు, "మరేం లేదు..ప్లీజ్..కంగారుపడకండి, మిమ్మల్ని డ్రాప్ చేయమని అడగండి " అన్నాడు.


తల ఊపింది తన్వి ... ఉత్సాహంగా వెళ్లి తయారయ్యి వచ్చాడు.


"వెళ్లొస్తాను అక్కా....ఆంటీ రేపు మార్నింగ్ వెళుతున్నా హైదరాబాద్ కి ,ఆమాల్ సీ యు,బాయ్ "అంది.అందరూ వీడుకోలు పలికారు రోజూ ఆమె నడిచే వెళుతుంది, వాళ్ళ ఇల్లు దగ్గరే కాబట్టి. కానీ తన్వి డ్రాప్ చేయమని అడగ లేదు.


కాసేపు తటపటాయించి "..తన్వి నేను బయటికి వెళుతున్నావుండు డ్రాప్ చేస్తా" అన్నాడు.


రోజూ బైక్ లో బయటికి వెళ్ళే ఆమాల్ కార్ తీసి డోర్ తీసి పెట్టి తన్వి కూర్చున్నాక వెళ్లి డ్రైవింగ్ సీట్ లో కూర్చున్నాడు. నవ్వుతూ చూస్తున్న వదిన్ని చూసి కొంచం బెదిరాడు. కార్ ను వూరికి దూరంగా వున్న పురాతన ఆలయం దగ్గర ఆపాడు.


"మీరు నాస్తికులని చెప్పింది అక్క" అంది తన్వి.


"గుడికి భక్తులే రానక్కర లేదు ..నాకీ కోవెల చాలా ఇష్టం ఆ ప్రక్కనే లోటస్ పాండ్ వుంటుంది మా నాన్న చిన్నప్పుడు ఇక్కడికి తీసుకోచ్చేవాడు."


"ఆహా ..చాలా బావుంది నేను క్రొత్త కదా ఈ వూరికి .. చెప్పండి..ఏదో మాట్లాడాలన్నారు!."మౌనంగా వున్న ఆమాల్ ని చూసి తన్వికి కూడా ఎమీతోచలేదు. టెన్షన్ తో అతనికి చమటలు పట్టాయి.ఆమాల్ పడే టెన్షన్, తనతో ప్రత్యేకంగా మాట్లాడాలంటే అతను ప్రపోజ్ చేసేదానికే అని అర్థమైంది తన్వికి. ఆమాల్ లాంటి అందగాడు,మంచి జాబ్ లోవున్నవాడు,'చాలా మంచివాడు' అన్న ట్యాగ్ వున్నవాడు ...కానీ అతనికి పెళ్లి ఫిక్స్ అయినట్లు చెప్పినట్టు అమ్మ చెప్పిందే మరి ..రమక్క మాత్రం చెప్పలేదు కానీ మరి మరి.. ఆలోచనలలో పడింది తన్వి.


నేలపై నున్నగడ్డిపరకల్ని లాగుతున్న ఆమె చేతివేళ్లు చూసాడుఆమాల్. గోర్లు పెంచని, నాజూకైన ఆ వేళ్ళకు నైల్పాలిష్ కూడా లేదు..అతనికి గోర్లు పెంచుకోవడం అంటే ఇష్టం లేదు, లేత గులాబి రంగు చుడిదార్ లో ఆమె పచ్చటి ఛాయ మెరిసిపోతోంది.. ముందు ఆమె మనసులో ఎవరూ లేరని తెలిస్తే అప్పుడు తన ప్రేమను తెలపోచ్చు, తొందర పడరాదు అనుకున్నాడు.


"తన్వి మీరు ఎవరి నైనా ప్రేమించారా? "


"లేదు, ఎందుకలా అడిగారు?"


"యింత అందమైన మిమ్మల్ని ఎవరూ ప్రపోజ్ చేయలేదా "


"నేనెవ్వరిని ఇష్టపడలేదు "


"ఎందుకు?"


"నాక్కొన్ని ప్రిన్సిపుల్స్ వున్నాయి, వాటిని అంగీక రించే వ్యక్తి నాకు కనపడలేదు"


"ఎలాంటివి ?"


"ఖచ్చితంగా..ఇవని ..చెప్పలేను"


"నేను చికాగోలో వుండగా ఒకమ్మాయి ఫోటో వదిన పంపారు ..నాకు నచ్చిన అమ్మాయి దొరకక వీళ్ళ నిర్ణయానికే వదిలేసాను ఆ అమ్మాయి పేరు సుజన, వదిన ఫ్రెండ్ చెల్లలే అట, ఫోటో చూసి ఓకే అన్నా, రెండు సార్లు ఫోన్లో మాట్లాడా ..కానీ ...మిమ్మల్ని చూడగానే నేనుకోరుకున్న స్త్రీ మీరే అనిపించింది ..మీ రంటే నాకు ..చాలా ఇష్టం... ..మీకు ఇష్టమైతే, నేను వదినకు అమ్మా నాన్నకు చెబుతాను...సుజన తో జీవితం ఊహించుకోలేకపోతున్నా ...ఇందులో మిమ్మల్ని నొప్పించే విషయం ఏమైనా వుంటే సారీ ..."


"నేనంటే ఎందుకిష్టం ?" విప్పారిన కళ్ళను మరింత పెద్దవిగా చేస్తూ అంది


"మీరు కోప్పడకూడదు..."


"వుహూ "..నవ్వునాపుకుంటూ అంది


"మీ పెద్ద జడ, నవ్వితే పడే డింపుల్ ..మొత్తంగా మీరు నచ్చారు నా ఊహల్లో వున్న రూపం మీరు "


"నాక్కూడా మీరు ఇష్టం...కానీ మా అమ్మ మీకు త్వరలో పెళ్లి అంటే నేనేమి ఆ దృష్టి లో చూడలేదు..రమక్కమీ గురించి చెప్పినప్పుడు ..మీ ఆలోచనలు ,అమాయకత్వం చెప్పినప్పుడు , మిమ్మల్ని మిస్ అయ్యాను అనుకున్నా...నేను కూడా మీలాంటి వ్యక్తినే కోరుకున్నా..ఆకర్షణలకు, డబ్బు, హోదాలకు కాక నాలాంటి సామాన్యమైన వ్యక్తిని మీరు ఇష్టపడు తున్నా రంటే ...అది నా అదృష్టం ."


"అయితే..నేను మీకు ఐ లవ్ యు చెప్పొచ్చా.... ?"


రెండు చేతుల్లో ముఖం దాచుకుంది ...తన్వి ..ఆ సిగ్గు తెరలలో ఆమెను చూస్తూ ... "ఇ లవ్ యు.."అన్నాడు.


జీవితంలో మొట్టమొదటి సారిగా ఆ వాక్యాన్ని పలకడానికి అతని హృదయం ఉప్పొంగిపోయింది. తొలి ప్రేమ జ్వరం లాంటిది అన్నాడొక కవి ...ఆ జ్వరం నూటయిదు డిగ్రీలతో తాకింది ఆమాల్ కు.


జరిగినదంతా చెప్పాడు వదినతో ...


"అయితే సుజనను ఏంచేద్దాం ?" అంది కోపంగా


"తన్వి మీ చెల్లెలేగా... చూసారుగా...ఆమె ఫోటో పంపకుండా ఇంకెవరో సుజన ఫోటో ఎందుకు పంపారు?" ..


"సుజన కంటే తన్వి బాగుందా!..."


"చాలా.... అచ్చు నా ఊహల ఊర్వసి...వదినా... ప్లీజ్ ఎలాగోలా నాకు తన్వి తో పెళ్లి జరిపించు....కావాలంటే ఆ సుజనకు మంచి వరుడ్ని చూద్దాం "


"ముందు చూడు, కట్నం వగైరా నువ్వే ఇవ్వు ..పెళ్లి కూడా జరిపించు ...తర్వాత మీ పెళ్లి సంగతి చూద్దాం .."


"ప్లీజ్ వదినా నాన్నకు తెలిసిందంటే నా మెడలు వంచి సుజన తోనే పెళ్లి జరిపిస్తాడు..."


"మరి నాకేంటి లాభం ?"


"అంటే ..లాభం కోసం ..."


" అవునయ్యా .....లాభం లేనిదే నేనెందుకు రిస్క్ తీసుకోవాలి ?"


"సరే చెప్పండి ...."


"నాకు డైమండ్ సెట్ కావాలి..పెళ్లి లో మా అమ్మావాళ్ళు పెట్టలేదు ,మీ వాళ్ళు పెట్టలేదు .. మీ అన్నను సాధిస్తే డైమండ్ సెట్ సంగతి తెస్తే కాశికి వెళ్లి సన్యాసం స్వీకరిస్తానని బెదిరిస్తున్నాడు ఇంక ఇప్పుడు నీవు తెచ్చిస్తానంటే ఆ రిస్కేదో తీసుకుని ఆ ముచ్చట తీర్చు కుంటా. "


"వదినా జోక్స్ వేయకండి ...ప్లీజ్ .."


"ఓకే...ఓకే ...సుజనని మన దారి లోంచి తప్పించాలి... తన్విని సీన్ లోకి తేవాలి అంతేనా ...ఒక పని చేద్దాం ...సుజన భర్తకి చెప్పేద్దాం ..."


"సుజన భర్త ఏంటి .... ? " కంగారుగా అన్నాడు.


"లక్కీ ఫెలో ...సుజనకు పెళ్లి అయిపోయింది ...నీవు వచ్చే రోజే...ఎన్నాళ్ళు గానో ఆ అమ్మాయిని ఇష్ట పడ్డబ్బాయి, నీతో పెళ్లి ఫిక్స్ అయిందనగానే వచ్చి ఏడ్చాడట ..ఆ అబ్బాయి అంటే సుజన కు కూడాఇష్టమట... వచ్చి నాకు చెప్పింది... ఏమి చేయను ? అలాంటి అమ్మాయిని చూసావేంటి అని అందరూ అడుగుతారని హడలి చస్తున్నా ...ఇంతలోనే తన్వి వాళ్ళు ట్రాన్స్ఫర్ మీద రావడం తో తన్వి ని నిజానికి నీకు చూడాలని అనుకుంటున్నా, అయితే సుజన సంగతి నీవు పదే పదే అడిగాక..కొంచం కంగారు పడ్డా !..బ్రతికించావు బాబు...తన్విని ఇష్ట పడి, లేక పోతే,అందరితో ఆశ్చింతలు, మీ అన్న తో నాకుండేవి అంతం లేని సాంత బాణీలు .."


"తన్వి సంగతి తర్వాత ... ముందు సుజన సంగతి చెప్పకుండా ఉండడానికి ముందు నాకు షరతులున్నాయి .."


"అదేంటి..."


"మీరు మా హానీమూన్ ఖర్చు భరిస్తానంటేనే... ఈ విషయం అన్న వరకు పోకుండా వుంటుంది ..."


"అమ్మో అమ్మో ఇవి నీ తెలివితేటలు కాదు "


"అవును ... మీవే....మిమ్మల్ని చూసి నేర్చుకున్నా... "


గట్టిగా నవ్వుకుంటున్న వదిన మరిదిని చూసి...లోపలి వచ్చిన అత్త మామల్ని చూసి రమ నవ్వాపింది. నవ్వుకుంటూ వాళ్ళమ్మను నీకో విషయం చెప్పాలంటూ పక్కకు తీసికెళ్ళా డు ఆమాల్.

--


Published in Gotelugu.com in April 2015

మొగలిపొద


"జిస్ గలీమే తెరా ఘర్ న హో బాలమా ఉస్ గలి సే హమే తో గుజరానా నహి," సెల్ లో వస్తున్నముకేష్ పాటతో పాటు తాతయ్య కూనిరాగం తీసుకుంటూ తోటలో కలుపు మొక్కలు తీస్తున్నాడు. క్యాట్ మోడల్ పరీక్ష రాసి, కాస్త చిరాగ్గా వున్నఅర్నవ్ బండి పెట్టేసి నేరుగా తాతయ్య దగ్గరకు వెళ్ళాడు.


"ఎలా రాశావు కన్నా.. ?" తాతయ్య అడిగాడు.


"బాగా రాశా తాతయ్యా ఈ పాట అర్థం ఏమిటి? మీరు ఎక్కువ వింటుంటారు . "


" ఏ వీధిలో అయితే నీకు ఇల్లు లేదో ఆ వీధిలో నేను ప్రవేశించను,నీ ఇంటికి చేర్చని దారిలో నేను నా పాదం మోపను"


"చాలా బాగుంది తాతయ్యా...మీకు హిందీ పాటల మీద అంత ఇష్టం కలగ డానికి కారణమేంటి ?"


"మేము చదువుకునే రోజుల్లో మీలాగే సినిమాలు చూసేవాళ్ళం ..టీవీ, క్రికెట్ , సెల్ ఫోన్లు,ఇంటర్నెట్ లేవు , పుస్తకాలు కూడా కాలేజి లైబ్రరి లోనో లేకుంటే తాలూకా గ్రంధాలయం వెళ్లి తెచ్చి చదువు కోవాల్సిందే. సినిమా చూశాక రేడియోలో పాట వస్తే రాసుకుని పాడుకునే వాళ్ళం ...ఒక్కసారికి రాసుకోలేక పోయే వాళ్లము...ఆ పాట మళ్లి వచ్చినప్పుడే రాసుకోవాలి ..రేడియోలో కేవలం రెండు సార్లే పాటలు వచ్చేవి. హిందీ పాటలు ఇక్కడ స్టేషన్లలో వచ్చేవి కాదు. రేడియో సిలోన్ లో మాత్రమే వచ్చేవి, నేను ఎమ్మే చేసింది పూనా లో కాబట్టి హిందీ, మరాఠి పాటలు అక్కడ వినేవాళ్ళం, ఇంటికొస్తే శ్రీశ్రీ, జంధ్యాల పాపయ్యశాస్త్రి, దేవులపల్లి పాటలు,పద్యాలు పాడుకోవడం మా ఆనందం.. కానీ అర్నవ్ మేము చాలా సంతోషంగా వుండేవాళ్ళం ...చిన్న ఆనందాలు మమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసేవి ...మీకిప్పుడు అన్ని అమరుతున్నాయి ...కానీ సంతోషం లేదు, కోరుకోకముందే అన్నీవస్తుంటే వాటి విలువ తెలియడం లేదు.... జీవితం వడ్డించిన విస్తరి కాకూడదు ..." తాతయ్య చెప్పుకు పోతున్నాడు.. .


అర్నవ్ నెమ్మదిగా అక్కడినుండి జారుకోవడానికి మార్గం చూస్తున్నాడు. తాతయ్యచెప్పేది వినకుండా వెళ్లినట్టు తాతయ్య గ్రహించడం అతనికి ఇష్టంలేదు. చుట్టూ వున్నమొక్కల్ని చూస్తూన్న అర్నవ్ కు ఖాళీగా ఉన్న ఎదిరింటిలోకి దిగుతున్న కుటుంబాన్ని చూశాడు. రాత్రేమో సామాన్లు దించిన శబ్దాలు వినపడ్డాయి. కారులోంచి తెల్లగా పొడుగ్గా అందంగా వున్న45 ఏళ్ళ వ్యక్తి ,ఇటు ప్రక్కనుండి తెల్లగా పొట్టిగా లావుగా వున్నఒకావిడ, గుజరాతినో ,రాజస్తానీనో మరి చీర అదోరకంగా కట్టుకుంది . వెనకనుండి తళుకు మనే తారలా ఒక అమ్మాయి దిగింది, అర్నవ్ గుండె లయ తప్పింది ...క్షణంలో వెయ్యోవంతులోనే ప్రేమలో పడిపోయాడు. బస్తా మైదా పిండిలో అయిదు లీటర్ల తేనె,ఓ అయిదు కేజీల పసుపు కలిపి బొమ్మను చేస్తే ఎలావుంటుందో అలావుంది ఆ అమ్మాయి. నల్లటి స్లీవ్ లెస్ టాప్ ..నల్లటి షార్ట్...నడుము వరకు వున్న వత్తైన జుట్టు ...బాప్ రే ... ఏ రాం గోపాల వర్మో ,ఏ రాజమౌళి కళ్ళలో పడివుంటే ఇంకేమైనా ఉందా! వద్దు ఎవరి కళ్ళలో కూడా పడకూడదు ... అనుకుంటుండగానే వాళ్ళు లోపలి పోవడం, పనివాళ్ళు గేటు వేయడం జరిగి పోయింది .అర్నవ్ కు ఒక్కసారి ప్రపంచమంతా చీకటి క్రమ్మి నట్లైంది. గీతలో విష్ణువు యొక్క తేజోవంతమైన విశ్వరూపం చూశాక కళ్ళు బైర్లు క్రమ్మిన అర్జునినిలాగా అయిపోయాడు.


అది మొదలు అర్నవ్ కు ప్రపంచంలో జరిగేవీ తెలియడం లేదు, ఫేస్ బుక్ సంగతి మర్చిపోయాడు , స్నేహితుల్ని కలవడం మానేశాడు, సినిమాలు ఆకర్షించడం లేదు , షటిల్ ఆడడానికి వెళ్ళడం లేదు. అన్నిటికంటే ముఖ్యమైన తన జీవిత ద్యేయం క్యాట్ పరీక్ష కు చదవడం కూడా లేదు , దానిపై ఏకాగ్రత కుదరడం లేదు . మనసంతా ఎదురింటి అమ్మాయి పైనే వుంది, మనసును మళ్ళించు కోవడానికి ప్రయత్నించినా, వుహూ.. అది వినడం లేదు. మెరుపులా కన్పించి మాయమయే ఆ అమ్మాయి కోసం అర్నవ్ తనకు తెలియకుండానే వెతుకుతున్నాడు.


మామూలుగా అర్నవ్ గది దాటి వచ్చేది తినడానికి, అతని గదిలోనే టీవీ, కంప్యూటరు , పుస్తకాలు వుంటాయి, అప్పుడప్పుడు తాతయ్య అతని గదిలో చొరబడి పుస్తకాలు, బట్టలు, సర్ది అతని పడక పైనున్నచెత్త చెదారం తీసి సర్ది, దుప్పటి మార్చి పని మనిషి తో దగ్గరుండి శుభ్రం చేయిస్తారు. అలాంటిది ఈ మధ్య గది కిటికీలు తీసిపెడుతున్నాడు. హాలులో, వరండాలో, బయట లాన్ లో కుర్చీ వేసుకుని కూడా చదవడం మొదలు పెట్టేప్పటికి తేడాగా అనిపించినా ...మంచి గాలి, వెలుతురు వున్న చోట చదివితే మంచిదని చెప్పడం వలన అలా చేస్తున్నానని అర్నవ్ చెబితే, అలాగా అనుకున్నారు. ప్రేమ గుణం ఏమిటంటే అది తన మత్తులో ఉన్నవారిని ఏమైనా చేయించగలదు , అసత్యవాదుల్ని సత్యహరిశ్చంద్రులు గాను, సత్య ప్రేమికులకు అసత్యాలు చెప్పడం నేర్పగలదు. అర్నవ్ దీనికి మినహాయింపేమి కాదు .

లాన్ లో కూర్చుని చదువు నటిస్తున్న అర్నవ్ ఎదురింటి గేట్ శబ్దం కాగానే తలెత్తి చూశాడు. ఎర్రటి టి షర్ట్ ,నీలం రంగు జీన్స్ లో ఆ అమ్మాయి తమ ఇంటి వైపు వస్తోంది ... తాను కలగంటున్నాడో లేక నిజమో అర్థం కాలేదు "ఎక్స్క్యూజ్ మి నా పేరు టీనా , మేం ఎదురింట్లో దిగాం, హిందూ పేపర్ లేక టైమ్స్ అఫ్ ఇండియా కానీ వస్తుందా మీకు, మాకూ వేయమని చెబుతారా ! " హిందీలో అడిగింది. ఆమె సెల్ లో తాతయ్య ఎప్పుడూ వినే పాత హిందీపాట," ఆ లౌట్ కె ఆజా మేరే మీత్ తుజే మెరే గీత్ బులాతే హై " వస్తోంది.


"ష్యూర్... ష్యూర్.. ఐ యాం అర్నవ్ " అన్నాడు. తానెంతో మంది అమ్మాయిల్ని చూశాడు ,ఇంజనీరింగ్ చదివేప్పుడు క్లాస్మేట్స్ ని,స్నేహితుల చెల్లెళ్ళ ని, బందువుల అమ్మాయిల్ని, ఎంతోమంది కనిపించేవారు కానీ వాళ్ళు అమ్మాయిలనే ధ్యాస కూడా కలిగేది కాదు, వుహూ ... ఎవ్వరూ ఇలా మత్తు జల్లలా ... ఏమి అందం ! అర్నవ్ గాలిలో తేలిపోతూ అనుకున్నాడు. ఆ అమ్మాయి థాంక్స్ చెప్పేసి వెళ్ళిపోయింది.


పేపర్ వాడు ఎప్పుడేస్తాడో! ఎప్పుడు డబ్బులు తీసుకుంటాడో అర్నవ్ కు తెలియదు, కానీ ఇప్పుడు తెలుసుకుంటాడు. ఎదురింటి టీనా కు హిందూ పేపర్, టైమ్స్అఫ్ ఇండియా పేపర్ వస్తున్నాయి. ఏపని చేస్తున్నా టీనా రూపం తప్ప మరేమీ కనపడ్డం లేదు, ఆమె మాటలు తప్ప మరింకేమీ వినపడలేదు రెండురోజులు.


నెమ్మదిగా మామూలు అవుతున్న సమయంలో ఉదయాన్నే అర్నవ్ నాన్నని రైల్వే స్టేషన్ లో దింపి నిద్రకళ్ళతో మళ్ళీ ముసుగు తన్నేసి పడుకుందామని లోపలికి పోతుండగా టీనా ఎదురయింది. ఇంకా పూర్తిగా తెల్లారనే లేదు.వాకింగ్ కేమో వెళుతూ ఉన్నట్టుంది. ట్రాక్ సూట్, షూస్ లో వుంది. మొత్తం వీధి అంతా నిర్మానుష్యంగా వుంది .


"హాయ్.. గుడ్మానింగ్ " అంది తనే.


"హాయ్ గుడ్మానింగ్ " నిద్ర మత్తు వదిలించుకుని అన్నాడు .


ఆమె సెల్ లోంచి లతా మంగేష్కర్ పాత హిందీ పాట.."ఆయెగా ఆనేవాలా "ఇయర్ ఫోన్స్ పెట్టుకోకుండా వుండడం వలన చిన్నగా విన్పిస్తోంది. ఆమె ఏదో హిందీలో అంది, అర్థం కాలేదు.


"నాకు హిందీ రాదు పెద్దగా, ఇంగ్లీషులో చెప్పండి " అన్నాడు.


"హిందీ రాదా.. హైదరాబాద్ లో వుండి కూడా, హిందీ మన నేషనల్ లాంగ్వేజ్ కూడా కదా!" అంది ఇంగ్లీషులో


చ..చ హిందీ అర్జంటుగా నేర్చుకోవాలి.. దృఢoగా అనుకున్నాడు.


"వాకింగ్ వెళుతున్నాను ఇక్కడ ఎవరూ తోడు లేరు" అంది


నేను వస్తాలే అనబోయి ఇవాళ నాన్నను డ్రాప్ చేయడానికి నానమ్మ గంట ముందు మొదలు పెట్టి ఎలా లేపిందో గుర్తొచ్చి ఆగిపోయాడు.


" ఆరోరలో ఇంజనీరింగ్ అయిపొయింది .. క్యాట్ కు ప్రిపేర్ అవుతున్నా మీరు ... అర్నవ్?"


" J N T U లో ఇంజనీరింగ్ అయింది, నేను క్యాట్ కి ప్రిపేర్ అవుతున్నా "


" వాట్ ఏ లక్ .. J N T U లో అంటే మంచి ఇంటెలిజెంట్ అన్నమాట... ఎక్కడ కోచింగ్ తీసుకుంటున్నారు ?"


" లేదు ...ఏ కోచింగ్ వెళ్ళను, టైం వాళ్ళు పెట్టె టెస్ట్ లు మాత్రమే రాస్తాను ."


"ఏమైనా డవుట్స్ వస్తే అడగొచ్చునా ?"


"ష్యూర్... ష్యూర్ " అన్నాడు ఉత్సాహంగా ... !


మెల్లిగా అర్నవ్ అలవాట్లన్నీ మారిపోయాయి, హిందీ అంటేనే చెడ్డ చిరాగ్గా వుండేది, టెన్త్ వరకు ఎలాగో నెట్టుకొచ్చాడు. హిందీ సినిమాలు చూసినా పూర్తిగా అర్థం కాదు, మాట్లాడ్డం కూడా రాదు. హిందీ డిక్షనరీ తీసాడు, హిందీ చానల్సు , న్యూస్ చూడ్డం, స్నేహితులతో హిందీలో మాట్లాడ్డం మొదలెట్టాడు. పాత హిందీ పాటలు మాత్రం కష్టమైంది.అంత నెమ్మదిగా వున్న పాటలు అతనికి అసలు నచ్చలేదు. అవి ఎవరు పాడారో,ఏ సినిమాలోనో తెలియడం లేదు డౌన్ లోడ్ చేసి విందామంటే. ఇంక తాతయ్యతో అడుగుదామంటే ఇంత వరకు అసలు ఆసక్తి చూపకుండా ఇప్పుడు అడిగేది ఎలా? అనుకున్నాడు.


తాతయ్య యోగా చేసుకుంటూ పాటలు వింటున్నాడు.అయేదాకా చూస్తూ కూర్చున్నాడు .


"ఏంటి కన్నా ఇలా వచ్చావు ?"


నవ్వి ఊర్కున్నాడు "కోయీ జబ్ తుమ్హారా హృదయ్ తోడ్ దే తడప్ తా హువా కోయీ చోడ్ దే , తబ్ తుమ్ మేరేపాస్ ఆనా ప్రియే...."కొంచం కొంచం ఆ పాట అర్థం అయినా పూర్తి గా అర్థం కాలా! కానీ ఎంతో శ్రావ్యంగా హృద్యంగా అనిపించింది.


"తాతయ్యా ఈ పాట ఎంత బావుందో! అర్థం ఏంటి ?"


"ఇది మనోజ్ కుమార్ గారి "పూరబ్ అవుర్ పశ్చిం" సినిమాలోది, ముకేష్ పాడారు," నీ హృదయాన్ని ఎవరైనా గాయ పర్చారా ? నిన్ను బాధించి ఎవరైనా వదిలి పెడితే,నా దగ్గరికి వచ్చేయ్, నా ఇంటి తలుపులు నీ కోసం ఎప్పటికి తెరిచే వుంటాయి." తాతయ్య పాట అర్థం అంతా వివరించాడు. "పాత హిందీ పాటల్లో వేదాంతం గొప్పగా వుంటుంది నాన్నా! ఆంధ్రజ్యోతిలో సోమవారం బమ్మెర అనే రచయిత "జీవన గీతం" అనే శీర్షికతో పాత హిందీ పాటల గురించి రాస్తారు, ఇదిగో అన్నీ కట్ చేసి పెట్టా, చదువు."


అవన్నీ చదివాక మొట్టమొదటి సారిగా అర్నవ్ కు పాత సినిమా పాటల్లో గొప్పసాహిత్యం వుందని వాటిని అర్థం చేసుకుంటేనే వాటిని అభినందించగలనని అనుకున్నాడు. ఆ పాటల్లోని అద్భుతమైన వేదాంతధోరణి అర్థం చేసుకోవడానికి ఎంతో హృదయ సంస్కారం కావాలని తాతయ్య అనడం అతనికి గుర్తొచ్చింది.


"తాతయ్యా అమేజింగ్! నేనెప్పుడూ అంత ఏకాగ్రతతో పాటలు వినలేదు, నాకు ఈ పాటలు చాలా నచ్చాయి ఆ సీడీ ఇవ్వరూ..."


తాతయ్య ముందుగా ఆశ్చర్యపోయాడు,తర్వాత పొంగి పోయాడు. మనవడు వినే కొత్త పాటలలో సాహిత్యం, సంగీతం లేదని, పాట కూడా ఒక బాష లో లేకుండా తెలుగు ఇంగ్లీషు తమిళం కలిపేసి జుగుప్సాకరంగా వుండే అర్థాలు వున్నాయని, ఇలాంటివి ఎందుకు వింటావు అని చెప్పాలనిపించేది. కానీ తరాల అంతరాలు తెలిసిన మేధావి కాబట్టి వూరికే ఉండిపోయాడు. తన దగ్గరున్న పాత తెలుగు, హిందీ పాటల సీడీలిచ్చాడు.


" ముందు హిందీవన్నీ విన్నాక తెలుగు తీసుకుంటా తాతయ్యా " అన్నాడు.


అర్నవ్ టీనా స్నేహం కంటే ముందు, హిందీ బాష పై పట్టు కోసం పట్టు పట్టాడు. భాష రానిదే టీన తో మాట్లాడాలంటే బెరుకుగా వుంది.ఆమె హిందీలోనే మాట్లాడుతుంది. హుషారుగా వుంది జీవితం టీనా అప్పుడప్పుడు ఒక చిరునవ్వు విసురుతుంది కనపడితే. ఆమె గదిలో నుండి, తోటలో తిరుగుతూ వుంటే సెల్ లో పాత హిందీపాటలు ఎడతెగకుండా వస్తూ వుంటాయి. లత పాటల సందడి ఒక రోజు, కిషోర్ ఖవ్వాలి ఒకరోజు, రఫీ కచేరి మరో రోజు,ముకేష్ ములాఖాత్ ఇంకో రోజు వుంటుంది. టీనా నిద్రపోయినప్పుడు తప్ప ఎప్పుడూ పాటలు వినపడుతూనే వుంటాయి.


టీనా స్కూటిలో పోవడం చూశాడు ఉదయమే. అర్నవ్ బయటికి వస్తూంటే ఎదురయ్యింది స్కూటి ఆపి పలకరించింది . "ఎలా వుంది ప్రిపరేషన్ ?"


నవ్వాడు బదులుగా .


"మొన్న టెస్ట్ లో పెర్సంటైల్ ఎలా వచ్చింది?"


"సెంట్ "


"ఓ గాడ్... నాకు 95 దాటడం లేదు ...మాత్స్ నాకు ప్రాబ్లం, హెల్ప్ చేయరూ "


"ష్యూర్ "


"ఇవాళ మీ ఇంటికి రానా! లేక మీరు వస్తారా? "


అర్నవ్ గుండె వేగంగా కొట్టుకుంది " నేనే వస్తాలెండి "అన్నాడు


"మీరు హిందీ బాగా మాట్లాడుతున్నారు..." మెచ్చుకుంది టీనా


అర్నవ్ గుండె పొంగిపోయింది. యాహూ అనుకున్నాడు మనసులో .


రోజూ టీనా ఇంటికి వెళ్లి టీనాకు లెక్కలు చేయడం లోని మెళకువలు చెబుతున్నాడు అర్నవ్. టీనా తొందరగానే గ్రహిస్తోంది. ఆమె పర్సంటైల్ బాగా వస్తోంది. టీనా తన తల్లిదండ్రుల్ని పరిచయం చేయలేదు ,కనీసం వాళ్ళు అర్నవ్ కు ఎక్కువ కనపడలేదు కూడాను. కనపడ్డప్పుడుకూడా ఒక చిరునవ్వుతో పలకరించేవారు అంతే. అర్నవ్ కు టీనా అందం,ఆమె ముద్దు మాటలు మత్తెక్కిస్తున్నాయి. ఇద్దరికీ క్యాట్ లో మంచి పర్సంటైల్ వచ్చినట్లూ,ఇద్దరూ ఒకే కాలేజ్ లో చదివినట్లూ, చెట్టా పట్టాల్ వేసుకుని తిరిగినట్లూ, ఆతర్వాత టీనాని పెళ్లి చేసుకున్నట్లు, ఆమెతో ఆనందమయ జీవితం గురించి కలలు కంటున్నాడు.


ఒకరోజు అకస్మాత్తుగా టీనా


" మీ ఇంట్లో కూడా రోజూ పాత హిందీ పాటలు వినపడుతుంటాయి ....మీకు ఇష్టమా ?"అంది


"యా... యా " అన్నాడు కానీ ఆమె పాటల గురించి అడిగితే కష్టమని వెంటనే" మా తాతయ్య పెడుతుంటారు ,నేను వింటుంటాను "అన్నాడు


రోజులు ఆనందంగా గడుస్తున్నాయి. మోడల్ టెస్ట్ లలో అర్నవ్ పర్సంటైల్ పడిపోతోంది ... టీనా పర్సంటైల్ బాగా వస్తోంది. అర్నవ్ దాని గురించి పెద్ద బాధపడలేదు. మళ్ళీ కొంచం శ్రమపడితే ముందులా స్కోర్ చేయోచ్చులే అనుకున్నాడు. రాత్రి ఎక్కువ చదివి ఉదయం పది వరకు లేవకుండా వుండే అర్నవ్ ఉదయమే లేవడం ,లేవగానే ఎదురింటికి పరిగెత్తడం, ఇంట్లో వున్నా పాటలు డౌన్ లోడ్ చేయడం ,తాతయ్య తో కానీ నానమ్మ తో కానీ అసలు మాట్లాడకుండా వుండడం, వాళ్ళ అమ్మకు కూడా అసలు ఫోన్ చేయడం లేదని చేసినా బిజీ గా వున్నానని చెబుతున్నాడని అనడం, తాతయ్య కళ్ళలో పడింది.


అర్నవ్ ప్రవర్తనలో వచ్చిన తేడాను తాతయ్య గమనించాడు.అర్నవ్ నాన్నకు ట్రాన్స్ఫర్ అయితే ..అర్నవ్ అమ్మానాన్న వెళ్ళిపోయినా, అర్నవ్ కోసం హైదరాబాద్ లోనే ఉండిపోయారు అర్నవ్ తాతయ్య,నానమ్మ. కానీ అర్నవ్ మునుపటిలా చదవడం లేదని, చదువే లోకంలా లేడని తాతయ్యకు అర్థమైంది.కానీ తాతయ్య గ్రహించినాడని అర్నవ్ గ్రహించలేదు.


రోజులా అర్నవ్ టీనా దగ్గరకు వెళ్ళాడు, అప్పటికే టీనా ఏదో సీరియస్ గా చదువుతోంది.


"రేపు పరీక్షకి ఒక సారి మళ్ళీ చదువుదాం "అన్నాడు


"అర్నవ్ ఇప్పుడు నాకు మాత్స్ భయం లేదు బాగా చేస్తున్నా.. మీ కారణంగానే ... నిజంగా మీకు నేను చాలా రుణపడి వున్నాను.... దగ్గరగా వచ్చి అతని భుజం పై చెయ్యి వేసి అంది. అర్నవ్ నరాలలో విద్యుత్ ప్రవహించింది , టీనాను అమాంతం దగ్గరకు లాక్కోవాలనే కోర్కెను అతి కష్టం మీద నిగ్రహించుకున్నాడు. ఆమె అందం అతన్ని చాలా సార్లు కవ్వించేది... ఆమె వేసుకునే బట్టలు ఆమెను మరింత ఆకర్షణీయంగా కన్పించేలా చేస్తాయి. ఏదో ఫోన్ రావడంతో టీనా అర్నవ్ తో ఒక్క నిముషం అని లోపలి వెళ్ళింది. అర్నవ్ చాలా సేపు ఎదురు చూశాడు.ఇంక వెళ్లి పోదాం అనుకున్నప్పుడు బయటికి వచ్చింది.


ఇద్దరూ కూర్చుని మాత్స్ చేశారు, అర్నవ్ మనస్సు మనస్సు లో లేదు. అతని లోని మగవాడు పదేపదే బయటికి రాసాగాడు . అతనక్కడే వుంటే ఎలా ప్రవర్తిస్థాడో అని భయం వేసి తొందరగా బయటికి వచ్చాడు.


ఇంటికి వచ్చాక అతని కి మరింత అలజడిగా అనిపించింది . ఇంతలో టీనా దగ్గర నుండి ఫోన్ వచ్చింది . "ఎందుకలా తొందరగా వెళ్ళిపోయారు?"


నా భావాల్ని ఈ పాటలో వినండి అంటూ "భూల్ గయా సబ్ కుచ్, యాద్ నహీ అబ్ కుచ్... ఎక్ ఎహీ బాత్ న భూలీ.. .. జూలీ ఐ లవ్ యూ " పాట పెట్టాడు .


ఆ ప్రక్కనుండి గట్టిగా నవ్వు వినపడింది. తర్వాత "అయితే జూలిని లవ్ చేస్తున్నారా !"అని మళ్ళీ నవ్వ సాగింది . చ చ అనుకుని తాను నవ్వాడు.


"ఐ లవ్ యూ టూ అర్నవ్ ... ఇప్పుడు ప్రేమ పాఠాలు కాదు, క్యాట్ పరీక్ష అయే వరకు కేవలం చదువు మాత్రమే...రైట్ ... ప్లీజ్ మీరు డిస్టబ్ కావద్దు నన్ను డిస్టబ్ చేయొద్దు . మన ద్యేయం చదువు కదా ...!" అంది టీనా


అర్నవ్ కు కాస్త సిగ్గేసింది." సారీ ...నా ప్రేమ చెప్పకుండా ఉండలేకపోయాను.నా మనసంతా నువ్వే వున్నావు టీనా.. ఒకే .. చదువు అయి పోయేదాకా ఆ ప్రసక్తి తేను." బుద్ధిగా అన్నాడు.


తర్వాత అర్నవ్ మామూలుగా టీనాకు మాత్స్ ప్రాక్టీస్ చేపిస్తున్నా అతని తలపులు ఆమె మీదికే పోతున్నాయి. చదువు పై ఆమె కున్న ఏకాగ్రత తనకు లేదని అతనికి అర్థమవుతోంది . ఈ సారి మోడల్ టెస్ట్ లో మాత్స్ లో అర్నవ్ కంటే టీనాకే ఎక్కువ మార్కులు రావడంతో అతనికేమవుతోందో అతనికే అర్థం కాలేదు. టీనాను తాను ప్రేమించాడు, ఆమె కూడా ప్రేమిస్తున్నట్లు ఒప్పుకుంది కానీ ఆమె ఏ మాత్రం ఏకాగ్రత కోల్పోలేదు. ఆమె ఆలోచనల నుండి మనసును మరలించడానికి అతను ప్రయత్నం చేసేకొద్దీ మనసు ఆమె వైపే పోతోంది. క్యాట్ పరీక్ష ఇంక వారం ఉందనగా ఆఖరి మోడల్ పరీక్షకు ఇద్దరూ చాలా శ్రద్దగా కూర్చున్నారు, అర్నవ్ ఒక ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే టీనా కళ్ళు మూత పడుతున్నాయి, నిద్రను బలవంతంగా ఆపుకుంటోంది కానీ కాసేపటికి నిద్రే ఆమెను జయించింది, అలాగే కుర్చీ లోనే వెనక్కి వాలిపోయి నిద్ర పోయింది. ఆమె లేస్తుందేమోనని కాసేపు చూశాడు, కానీ ఆమె లేవలేదు. కిటికీ లోనుండి వస్తున్న చల్లగాలికి ఆమె జుట్టు చెదిరి ఆమె ముఖం పై పడుతున్నాయి. అతనికి ఆమెను చూస్తుంటే చౌదమీకా చాంద్ హో పాట గుర్తొచ్చింది.గురు దత్ వహిదా రహమాన్ అందాన్ని ఎంత అద్భుతంగా వర్ణిస్తాడు తన పాటలో ! వావ్ వాట్ ఎ బ్యూటి! అనుకున్నాడు. అతనికి ఆమెను లేపడం ఇష్టం లేకపోయింది అలాగని వుండటం కూడా ఇబ్బందిగా అనిపించ సాగింది.ఆలోచనలు అతన్ని చుట్టుముట్టాయి .... వెళ్ళిపోదామని లేచాడు , అడుగుల శబ్దం వినపడకుండా నెమ్మదిగా రాబోతూ తిరిగి చూశాడు. ఇర్రేసిస్ట్ బుల్ అనుకున్నాడు, ఆమెకు దగ్గరగా వెళ్లి ఆమె జుట్టును సవరించాలనే కోర్కెను అతను ఆపుకోలేక పోయాడు. రెండు అడుగులు ఆమె కేసి వేశాడు. అంతలోనే ఆమె అన్నమాటలు గుర్తొచ్చాయి, వెనక్కి తిరిగాడు. మరీ ఆమెను చూశాడు .ఇంకేం ఆలోచించకుండా వెళ్లి ఆమె ముఖం పై పడ్డ జుట్టును సవరించి ఆమె బుగ్గపై ముద్దుపెట్టుకున్నాడు. ఆమె లేవ లేదు, వణుకుతున్న గుండెతో బయటికి పరుగులా వచ్చాడు. అతనికి మొదటి సారి హత్య చేసినప్పుడు హంతకుని లో రేగిన ఘర్షణ లాంటిది జరిగింది. తప్పు చేశానన్న భావన అతన్ని క్రుంగ దీసింది. వచ్చి తాతయ్య కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. చిన్నప్పటినుండి మంచి చెడు బోధించిన ఆ తాతయ్య అర్నవ్ కు తొలి గురువు. అర్నవ్ అశాంతితో రగిలిపోతున్నాడు,అతనికి టీనా పై వున్నది ప్రేమా, వ్యామోహమా అర్థం కాలేదు, అతనికి తాను చేసింది ఘోరమైన తప్పని అనిపించసాగింది ...ఒక పక్క ప్రేమించిన ప్రియురాల్ని ముద్దు పెట్టుకుంటే తప్పేమిటని మనసు సమాధాన పరుస్తోంది. మరొక ప్రక్క మనసు వివేకాన్నినిద్రలేపి, చేసింది సరైనది కాదని చెబుతోంది.


"... ఏంటి కన్నా.. ఏమైంది ?" తాతయ్య అనునయంగా అడిగాడు అర్నవ్ ముఖాన్ని తన రెండు చేతుల్లోకి తీసుకుని ,


అర్నవ్ తాతయ్య కళ్ళలోకి చూడలేక పోయాడు.తలవంచుకుని అలాగే తలని తాతయ్య ఒడిలోకి పెట్టాడు.


" ఏమీ లేదు తాతయ్యా... మీకు దగ్గరగా వుండాలని వుంది "


"నీకు పరీక్ష దగ్గర కొస్తోంది ...నీ మనసును ఏకాగ్రత ప్రక్క కు మళ్ళించు...టెన్షను పడకు...అయినా నీకెప్పుడూ లేదు కదా టెన్షను".


సెల్ మ్రోగేప్పటికి తీసి చూశాడు,టీనా కాల్ అది. తాతయ్యను విడిచి పెట్టి బయటికి వచ్చి "హలో" అన్నాడు అదురుతున్న గుండెతో.


"సారీ నిద్రపోయా... ఏంటి అలా వెళ్లి పోయారు, సోజా రాజకుమారి సోజా అని, నన్ను లేపాల్సింది "


"సారీ ఫర్ ఎవ్రితింగ్... కొంచం కంట్రోల్ తప్పాను "


"నో సారి, నో థాంక్స్ బిట్వీన్ అజ్, ఇప్పుడు వస్తారా ఆ చాప్టర్ కంప్లీట్ చేద్దాం. "


"లేదు టీనా ఇప్పుడు రాలేను ప్లీజ్ మరోలా అనుకోకండి .. కొంచం బాగాలేదు, "


'ఏమి బాగాలేదు ... ? నా దగ్గరకు రండి ఐ విల్ సెట్ యువర్ మైండ్ ... ప్లీజ్ డు కం ! మనకు టైం తక్కువుంది.. "


"వస్తున్నా ... " అర్నవ్ కీ ఇచ్చిన బొమ్మ లాగా ఎదురింటికి పోవడం చూస్తూ అతని అలజడికి కారణం ఏమై ఉంటుందా అని ఆలోచిస్తూ వుండిపోయారు తాతయ్య .
క్యాట్ పరీక్ష రానే వచ్చింది. ఆఖరి నిముషంవరకు అర్నవ్ టీనా కష్టపడి చదివారు, పరీక్ష అయాక అర్నవ్ కు అర్థమైంది తాను సరిగ్గా చేయలేదని, ఏ "ఐ ఐ ఎమ్" నుండి కాల్ వచ్చే అవకాశం లేదని, కానీ తన ప్రేమ పరీక్షలో నెగ్గానని, టీనా ప్రేమ పొందడమే తన విజయంగా భావించాడు. సెంటర్ నుండే టీనాకు ఫోన్ చేశాడు. "ఎలా చేశావు పరీక్ష ? "


"బాగా చేశా... అన్ని కాల్స్ వస్తాయి అనుకుంటున్నా...నీవు ఎలా చేశావు ? "


"సరిగ్గా చేయలేదు, పోయింది.. కానీ నాకు నీవున్నావు, నీ ప్రేమ వుంది, నీవు బాగా చేశావు చాలు... ఇంక ... నేను .. "


"సరే, అర్నవ్ వుంటాను, టాక్ టు యు లేటర్" ఫోన్ పెట్టేసింది.


అర్నవ్ కు కొంచం బాధ కలిగింది. ఇంటికి వచ్చాడు . తాతయ్య గేట్ దగ్గరే వున్నాడు అర్నవ్ కోసం ఎదురు చూస్తూ, "ఎలా రాశావు కన్నా?"


బాగా రాశానని చెప్పలేకపోయాడు అర్నవ్..." పరీక్ష పోయినట్లే తాతయ్యా ... "


తాతయ్య పలకలేదు ... అర్నవ్ మూడు నెలల క్రిందటి వరకు ఎంత ఏకాగ్రత తో చదివేవాడో .. మోడల్ టెస్టుల్లో ఎంత మంచి రిజల్టు వచ్చేదో ఆయనకు తెలుసు .. తర్వాతి పరిణామాల్ని ఆయన గమనించాడు ,కానీ చేయగలిగింది ఏమీలేదని ఆయనకు తెలుసు .

టీనా ఇంటికి వచ్చి వుంటే తనతో కాసేపు మాట్లాడితే కొంచం బావుంటుంది అనిపించి ఫోన్ చేశాడుఅర్నవ్.


"నేను చాలా బిజీ గా వున్నా, బంధువులు వచ్చారు ఫ్రీ అయాక కాల్ చేస్తాను ప్లీజ్.... "అంది


పరీక్ష ఎలా చేశారో అని ఫ్రెండ్స్ ను ఫోన్ చేసి అడిగాడు,


అతని క్లాస్మేట్ లాస్య ను కూడా అడిగాడు.

లాస్య "కోజికోడ్ ఇండోర్ కాల్స్ రావచ్చు... కోచింగ్ తీసుకున్న మన ఫ్రెండ్స్ లో ఎవరికీ అన్ని కాల్స్ వస్తాయనే పెద్ద హాప్ లేదు, నీకు అన్నీ వస్తాయనుకుంటా ... " అంది

"లేదు లాస్యా..పోయింది. నేను బాగా చేయలేక పోయాను."అర్నవ్ కు బుర్ర మొద్దుబారి పోయింది .


టీనా అర్నవ్ ఫోన్ కు జవాబివ్వడం లేదు , అతనికి ఆమెందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు మెసేజ్లు ,మెయిల్సు ఎన్ని పెట్టినా ప్రయోజనం లేదు. అతనికి పిచ్చి పిచ్చిగా వుంది. కనిపించినవన్నీ పగలగొట్టాలని వుంది. టీనా ను ఆమె తల్లిదండ్రులు కట్టడి చేస్తున్నారేమో అన్న అనుమానం వచ్చింది . ప్రేమ వ్యవహారం తెలిసి ఆమెను దండించారేమో అని కూడా అనుకున్నాడు . వెంటనే వాళ్ళింటికి వెళ్లాలని గబ గబా బట్టలు మార్చుకుని బయటికి పోతుంటే నానమ్మ అడిగింది. "భోజనం సమయానికి ఎక్కడికి నాన్నా?"


"ఇప్పుడే వస్తా.. నాన్నమ్మా టీనా దగ్గరకు వెళ్ళొస్తా అయిదే నిముషాలు."


"వాళ్ళు లేరు..నాన్నా! టీనా నీకు చెప్పలేదా ఉదయమే టీనా నాన్నగారు మాకు చెప్పి ముంబై వెళ్ళారు టీనా నిశ్చితార్థం అట ! "తాతయ్య అన్నాడు


అర్నవ్ అక్కడున్న సోఫాలో కుప్ప కూలిపోయాడు. తాతయ్య కు అర్నవ్ పరిస్థితి అర్థమవుతోంది. వారం రోజులుగా మనవడు పడుతున్న ఘర్షణ చూస్తున్నాడు. కానీ ఎదిగిన మనవడ్నినిలదీసి అడగలేకపోయాడు. తానై బయటపడితే చూద్దాం అనుకున్నాడు.పరీక్ష సరిగ్గా చేయలేదని అతను వేదన పడడం లేదని అర్థమయింది .... టీనాతో పరీక్ష అయినప్పటినుండి కలవ లేదని కూడా తెలుస్తోంది. మెల్లిగా అర్నవ్ ను లేపి అతని నానమ్మగమనించకుండా గదిలోకి తీసికెళ్ళాడు.

"ఏమయ్యింది కన్నా? పరీక్ష గురించా....పోతే.... పోనీలే! ఓటమి విజయానికి మెదటి మెట్టుకదా !"


"పరీక్ష గురించి కాదు తాతయ్యా... టీనాను నేను చాలా ఇష్టపడ్డా .. ప్రేమించా, తను కూడా నన్ను ప్రేమించాననింది,ఇప్పుడు ఇంకెవర్నో పెళ్లి చేసుకోబోతోంది ... ఎలా సాధ్యం తాతయ్యా .. ప్రేమ అంత విలువ లేనిదా ?అంత అవలీలగా ఇంకొకర్నిఎలా స్వీకరిస్తారు తాతయ్యా ?" అర్నవ్ కళ్ళ నుండి ధారాపాతంగా కన్నీళ్లు జారిపోతున్నాయి. తాతయ్య గుండె ద్రవించింది. తన చిన్నారి మనవడి కంట్లో కన్నీటి చుక్క అతనేనాడు చూడలేదు. అర్నవ్ మనసులోని గాయం మాటలతో మాన్పేది కాదని,కాల మొక్కటే దానికి సమాధానమని తెలిసినా, చెప్పాల్సిన మాటలు చెప్పే దానికే నిర్ణయించుకున్నాడు .


" టీనా కు నీ పట్ల అంత నిభద్ధత లేదేమో అర్నవ్ ..అ అమ్మాయికి నీ సహాయం అవసరం ఉండింది కాబట్టి నీతో స్నేహంగా ఉండిందేమో ....లేక నిన్ను ఆ అమ్మాయి కేవలం స్నేహితుడిగా చూసిందేమో ! నీవు ఆ అమ్మాయి స్నేహాన్ని మరోలా అర్థం చేసుకున్నావేమో? "


"లేదు తాతయ్యా తను నన్ను ప్రేమిస్తున్నానని చెప్పింది, పరీక్షలయే దాకా ప్రేమ సంగతి వద్దు .పరీక్షల తర్వాత అవన్నీ అని, నాలో ఆశలు రేపింది తాతయ్యా ...ప్రేమంటే ఇంతేనా తాతయ్యా ... టీనా ఎందుకలా చేసింది తాతయ్యా ? "ముఖం చేతుల్లో దాచుకున్నాడు


"జీవితం లో ఆటుపోట్లు సహజమే ...కదా ! విలువలకు విలువనివ్వని ఆ అమ్మాయి గురించి నీవు వేదన పడకు . నీ ప్రేమ అనే నిచ్చెన సహాయం తో ఆ అమ్మాయి తన జీవిత ధ్యేయాన్ని అధిరోహించింది. నీవు ఆకర్షణ అనే పాము నోట్లో పడి క్రిందికి జారి పోయావు. ఇది నీవు సృష్టించుకున్న అశాంతి. పగిలి ముక్కలైన నిన్నటి నీ విశ్వాసం గురించి బాధపడుతుంటే అందమైన ఈ రోజును, ఆశను రేపే రేపును కూడా పోగొట్టుకుంటావు. మార్చలేని గతంతో పోరాటం చేయకు ,శాంతి ఒప్పందం చేసుకో.... భవిష్యత్తును నీ చేతుల్లోకి తీసుకో... మొగలిపొద లాంటిది ప్రేమ, ఆకర్షణ, ఆ మత్తులో మునిగామా ....మిన్నాగుల కాటుకూడా తప్పవు.... "


"తాతయ్యా నేను తప్పు చేశానా? ఎందుకిలా అయింది ? ఆమె ఆకర్షణలో నేను ... ఇలా ఎందుకు పాడయి పోయాను? "


"నీవేమీ తప్పు చేయలేదు నాన్నా! ప్రతి వ్యక్తి జీవితoలో నీ వయసులో ఆకర్షణలు, ప్రేమలు వుంటాయి. అప్పుడు వివేకం పనిచేయదు ,ఎవరి సలహాలు చెవికెక్కవు ...నీ ప్రేమను అర్థం చేసుకోని ఆ అమ్మాయిని నీ మదిలోంచి తీసివెయ్యి. ఆమెను నిందించకు, ద్రోహం చేసిందని వాపోకు ...అది ఆమెకు నష్టం కలిగించదు,నీకే కష్టం కలిగిస్తుంది.ఎదుటి వ్యక్తి లోని తప్పుల్ని వాళ్ళ బలహీనతగా క్షమించు. ఆ అమ్మాయి నీకు ఒక పాఠం నేర్పిందనుకో ....అప్పుడే నీవు ప్రశాంతంగా వుండగలవ్ "


"నన్నిప్పుడు ఏం చేయమంటావు తాతయ్యా ? నేను ఐ ఐ ఎం అహమ్మదాబాదులొనే చదవాలి "


"నీ కలలను సాకారం చేసుకో అర్నవ్ ...అవధులు లేని విజయాలను సొంతం చేసుకోవడానికి ఆశ, ,ఆశయాలు వుంటే సరిపోదు. ఏకాగ్రతతో, చిత్త శుద్ధి తో, కృషి తోనే సాధ్యమవుతుంది. ఇంత జీవితం లో ఒక సంవత్సరం పోతే నష్టం లేదు, మళ్ళీ నీవు చేసే ప్రయత్నం నీకు విజయం తెచ్చిపెడుతుంది.... నీవు ఎప్పుడూ చదువులో నీ ప్రథమ స్థానాన్ని కోల్పోలేదు ... ఈ సారి నీ విజయం తథ్యం ... ఈ ఓటమి, ప్రేమ విషయo లోను చదువు విషయం లోను నిన్ను మరింత పట్టుదల, పంతం కలిగిన వ్యక్తిగా తయారు చేయాలి,చేస్తుంది కూడాను .... '

"మీకు నాపై విశ్వాసం ఉందా తాతయ్యా? " బేలగా అడిగాడు


" పూర్తిగా... పద భోంచేద్దాం.ఈ విషయం మనిద్దరి మధ్యే ... నాన్నమ్మ, అమ్మా నాన్నకు తెలియ రాదు.. " ఇద్దరూ భోజనానికి కూర్చున్నారు.


నెమ్మదిగా అర్నవ్ గుండెలో నుండి వారం రోజులుగా వేధిస్తున్నవేదన వీడసాగింది ... ఒక్కో సారి తీవ్ర మైన నొప్పికి గురి కావడమే మంచి మార్పుకు కారణ మవుతుందేమో...!


తాతయ్య గదిలో నుండి రఫీ పాట వస్తోంది ... తేరీ గలియోమ్మే న రఖేంగే కదం ఆజ్ కె బాద్... తేరే మిల్నే కో న ఆయెంగే సనమ్ ఆజ్ కె బాద్ " ( నీవున్న వీధిలో నేను నా పాదం పెట్టను,నిన్ను కలవడానికి ఇక మీదట రాను ") మంచి జీవిత పాఠం నేర్పింది టీనా....అంతే కాదు హిందీ నేర్పింది ,పాత హిందీ పాటల మాధుర్యాన్నిఅర్థం చేసుకోవడం నేర్పింది. గుండెల నిండా ఊపిరి తీసుకుని "థాంక్ యు టీనా " అనుకున్నాడు అర్నవ్.

--

Published in Vaakili in April 2015

జాతస్య మరణం ధృవం


ప్రతి ప్రాణికి మరణం తప్పదని తెలుసు, కానీ చివరి వరకు ప్రాణాంతకమైన రోగాలతో బాధపడుతూ కూడా జీవించాలని పోరాడే తత్వమే చూశాను తప్ప, ఇక చాలు ఈ జీవితం చాలిద్దామని అనుకున్న వాళ్ళని, ప్రశాంతంగా మరణాన్ని ఆహ్వానించిన వాళ్ళని నేను చూడలేదు. ఎంతో నిబ్బరంగా వుండేవాళ్ళు సైతం, మరణం తప్పదని తెలిసినప్పుడు వాళ్ళలో కలిగే మానసిక సంఘర్షణ, జీవించాలనే తపన, బ్రతకడానికి ఏదైనా మంచి మందులున్నాయేమో అని తమ ఆత్మీయుల్ని వేధించడం, ఎవరూలేని వాళ్ళు, ఎవరైనా వుండి వుంటే మంచి మందులు వాడితే బ్రతికే అవకాశం ఉంటుందని ఆరాటపడ్డం, చాలా బాధగ వుంటుంది పాలియేటివ్ కేర్ లో డాక్టర్ గా వుండే నాకు ఈ దీనమైన పరిస్థితిలోవాళ్ళను చూస్తుంటే. పాలియేటివ్ కేర్ అంటే మనదేశంలో మరణానికి చేరువగావున్న వ్యక్తుల్ని మాత్రమే చూసుకునే ఒక ఆశ్రమం లాంటి హాస్పిటల్. అయితే నేను అమెరికాలో వుండగా పని చేసే హాస్పిటల్ కు అనుబంధంగా పాలియేటివ్ కేర్ వుండేది. అక్కడ పనిచేసే డాక్టర్లు కొంతకాలం పాలియేటివ్ కేర్ లో పనిచేయడం తప్పని సరి. మొదట్లో భయంగా వున్నా , ఆ వార్డుకు నెమ్మదిగా అలవాటు పడ్డాక జనరల్ మెడిసిన్ వార్డును నేను పూర్తిగా మర్చిపోయాను.


కాలం చేసిన గారడిలో నేను మళ్ళీ మనదేశం వచ్చాను. మనశ్శాంతి వెతుకులాటలో సేవే నాకు మార్గంగా తోచింది. మళ్ళీ పాలియేటివ్ కేర్ లోనే పనిచేయడానికి సిద్దపడ్డాను. అమెరికాలో వున్న పరిస్థితికి, ఇక్కడి పరిస్థితికి భయపడడం, బాధ పడడం అయాక, అలవాటు పడడం కూడా అయింది . ఇక్కడ వున్న వాళ్ళలో చాలా మందికి కుటుంబాలున్నాయి, కానీ వాళ్లకు వీళ్ళ బాధ్యత తీసుకునే తీరిక,కోరిక లేదు. జబ్బుతో వున్న వీళ్ళను, ప్రేమతో చూసుకోలేక పోవడానికి కారణాలు అనేకం. అలాంటివాళ్ళని పాలియేటివ్ కేర్ దగ్గర తీస్తుంది. వ్యక్తిగతమైన విషయాల్నితెలుసుకునే


ఆసక్తి లేక పోయినా, అక్కడ వుండే ప్రతి వ్యక్తి జీవితం గురించి మాకు తెలిసి పోయేది. ఎయిడ్స్ వ్యాధి గ్రస్తులు, కీమో థెరపీతో చిక్కి శల్యమైన రోగులు, మందులకు లొంగని అస్తమాతో బాధపడేవారు, ఆర్త్రైటిస్ తో కదలలేని వారు, పల్మనరి ఫైబ్రోసిస్ జబ్బుతో నలిగేవాళ్ళు,అనేక ప్రాణాంతక రోగాలతో బాధపడేవారు , తమ వ్యథ, బాధ,జీవిత గాథలు వినేందుకు, ఓదార్పు మాటలు చెప్పేందుకు, ఆత్మీయ స్పర్శ ఇచ్చేందుకు ఓ స్నేహ హస్తం కావాలని ఆరాటపడుతుంటారు, ఆక్రోశిస్తుంటారు.


అమెరికా,యూరప్ దేశాల్లో ఎప్పటినుండో పాలియేటివ్ కేర్ ఉన్నప్పటికీ,భారత దేశంలో 1994లో ప్రపంచ ఆరోగ్య సంస్థ సహకారంతో భారత


పభుత్వం సహాయంతో ఇండియన్ అసోషియేషన్ అఫ్ పాలియేటివ్ కేర్ ఏర్పడింది. పెద్ద నగరాల్లో మాత్రమే వున్నపాలియేటివ్ కేర్ సంస్థలు, అన్ని నగరాల్లో, పట్టణాల్లో రావాల్సిన అవసరం ఈనాటి జీవన విధానం,మానవ సంబంధాలు కలిగిస్తాయి. ఇక్కడ నాతో పాటుగా ఇద్దరు ఫిజీషియన్లు, ఒక సర్జన్, ఒక సైకాలజిస్ట్, పది మంది నర్సులు, నలుగురు ఆయాలు, నలుగురు అటెండర్లు వున్నారు. అయితే


ఇక్కడ ఎక్కువ సమయం గడిపే డాక్టర్ని నేనే. రోగుల్లో బాధని తగ్గించేదానికి, మానసికంగా కృంగే వారికి వోదార్చేదానికి, మరణం అనివార్యమని, సహజమైన ప్రక్రియ అని,మరణం కొరకు తొందరపడకూడదని,అలాగని వాయిదా వేయడం సాధ్యం


కాదని రోగులకు తెలియజేయడానికి డాక్టర్లు ప్రయత్నిస్తారు. 21వ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అఫ్ ఇండియన్ అసోషియేషన్ అఫ్ పాలియేటివ్ కేర్ లో పాల్గొనడానికి, కటక్ లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ సెంటర్ కు వెళ్ళాను. అక్కడ నాకు పాలియేటివ్ కేర్ గురించి మరింతగా తెలుసుకునే అవకాశం కలిగింది. నేను తిరిగి వచ్చేప్పటికి వాళ్ళంతా నాకోసం ఎంతగా ఎదురు చూశారో చెబుతుంటే ఎంతో ఉద్విగ్నతకు గురయ్యాను. బ్రాంకైటిస్తో ಭಾ ధపడుతున్న రాజయ్య తీవ్రమైన స్ట్రో)క్ తో చనిపోవడం, అతని మంచం ఖాళీగా వుండడం నన్ను నిస్పృహ కు గురి చేసింది. అతని ప్రేమ పూరితమైన పిలుపు” చిట్టితల్లీ" చెవుల్లో గింగురుమన్నది. వాళ్ళకు ధైర్యం చెప్పే నేను వారి కష్టాలకు చలించిపోతుంటాను. ఒక్కో పేషంటు మరణo, ఖాళీ అయిన ఆ ప్రదేశాన్ని చూసి, మానవ జీవితం యొక్క అస్థిరతను గుర్తు చేసుకుని వేదాంత ధోరణికి రావడం, మళ్ళీ మామూలవడం జరుగుతుంటుంది.


నామనసు త్రీవ్రమైన కష్టానికి గురయినపుడంతా కేర్ లోని రోగుల్ని తలుచుకుంటాను.అపుడు నా బాధను మర్చిపోయినాబాధ్యతను గుర్తిస్తాను. నాకు అకస్మాత్తుగా వీళ్ళకు ఆరోగ్యం బాగయితే ఏమి చేయాలనుకుంటారో అనే ఆలోచన వచ్చింది. మాట్లాడలేని స్థితిలోని వారు కాక, జబ్బు నయమయే అవకాశం వున్నవాళ్ళు, కాకపోయినా కొoతకాలం బ్రతికే అవకాశo వున్నవాళ్ళువన్నారు. ముందుగా ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ వుండే శరత్ గారతో మాట్లాడాలనుకున్నాను.ఆయనకు 60 ఏళ్ళుంటాయి. ఆయనకు


కార్దియోమ్యోపతి అంటే గుండె కండరాల జబ్బు వుంది. అతనికి ఆల్కహాల్ కానీ పొగ త్రాగడం కానీ అలవాటు లేదు. బహుశ జెనిటికల్ గా ఈ జబ్బువచ్చిందేమో. ఇది అతని గుండె పనిచేయడాన్ని ప్పుడైనాఆపేయగలదు. తన గురించి మీ చెప్పరు. అతన్నికలవడానికి ఎరూ రారు. అతనే అప్పుడప్పుడు బయటకు వెళుతుంటారు. అతను కేర్ సెంటర్ కు పెద్ద మొత్తంలో


విరాళమిచ్చారని చెప్పారు. బెరుకుగానే ಆయన దగ్గరికి వెళ్లాను. అది రొటీన్ విజిట్ కాదని అతనికి అర్థమైంది. అతని చేతిలో


డాఫెన్ డు మారియర్ "రెబెక" నవల "సర్… మీరు చదివాక నాకిస్తారా? " అన్నాను


"తీసుకోండి " నవల మూసిపెట్టి నాకిస్తూ, పక్కనే వున్న బుచ్చిబాబు గారి నవల "చివరకు మిగిలేది " తీసుకున్నారు. నేనేదో చెప్పబోయేలోగానే పుస్తకంలో తలదూర్చారు. అంటే అతనికి మాట్లాడే ఆసక్తి లేదన్నమాట.


బ్రెస్ట్ కాన్సర్ కు కీమో థెరపి తీసుకుంటున్న సావిత్రి గారి దగ్గరకు వెళ్లాను."నయమయాక ఏం చేస్తారు ?”


"మా ఇంటికి వెళ్ళిపోతాను " “మీ కొడుకు కోడలు చూడకపోతేనే కదా మీరిక్కడికి వచ్చారు ... మిమ్మల్ని చూడడానికి కూడా రారు కదా?" "నిజమే...ఆరోగ్యం బాగాలేక


నేనేమీ చేయలేను, నాకే వాళ్ళు చేయాలి, ఇద్దరూ ఉద్యోగాలు చేస్తారు,


మనువడికి కష్టం, స్కూల్ నుంచి వచ్చేప్పటికి నేనుంటే ఏదో ఒకటి చేసి పెడతాను.కోడలు కొడుకు వచ్చేప్పటికి ఇంత వండి పెట్టొచ్చు." వాళ్ళ గురించి చెబుతున్నప్పుడు ఆమె కళ్ళలో మెరుపు చూశాను. ఎంత దయగల హృదయాలు తల్లులవి! కేర్ లో ఆమెను చేర్పించేటప్పుడు, ఎంత విసుగు చూశాను కొడుకు, కోడలు కళ్ళలో! ఆమె ఆరోగ్యం గురించి కొడుక్కి ఫోన్ చేసినప్పుడు కూడా వాళ్ళు సరిగ్గా స్పందించలేదు. కానీ ఈమె వాళ్ళపై ఎంత అనురాగం పెంచుకుంది? ఈ తరం తల్లిదండ్రులకు ప్రేమ నివ్వడమే తప్ప తీసుకునే అదృష్టం లేదు.


బ్లడ్ కాన్సర్ కు బోన్ మారో ట్రీట్మెంట్ తీసుకుంటున్న అనిరుధ్ లాప్టాప్ చూస్తున్నాడు. తెల్లటి కుర్రాడు అనిరుధ్, ట్రీట్మెంట్ వలన కందిపోయాడు. జుట్టు మొత్తం పోయింది. అనాధశరణాలయంలో పెరిగాడు, బాగా చదువుకున్నాడు, మంచి వుద్యోగం వచ్చి మంచి జీవితం అందుకునే సమయంలో ఈ భయంకరమైన జబ్బు వచ్చింది."ఏమ్చేస్తున్నావ్ అనిరుధ్ ? "


"శంకరాభరణం సినిమా చూస్తున్నా..అక్కా "చెవుల్లోంచి ఇయర్ ఫోన్స్ తీస్తూ అన్నాడు. "అదేంటి… మీ యువతరం ఇలాంటి సినిమాలు కూడా చూస్తారా?"


"నేను దేవదాస్, మల్లీశ్వరి, పాతాళ భైరవి లాంటి పాత సినిమాలు చూస్తుంటాను, ఎంత గొప్ప సినిమాలు అవి! నాకు సినిమా డైరెక్షన్ చాలా ఇష్టం, నా జీవిత ద్యేయం సినిమా తీయడమే...నాకు బాగావుతుంది కదక్కా? " నా గుండెలో కల్లుక్కు మంది, ఎన్ని ఆశలున్నాయి పాపం!


"ఖచ్చితంగా అనిరుధ్...నీవు తొదరగా తేరుకుంటావు, మంచి సినిమా చేస్తావు, అప్పుడు ఈ సినిమా చేసింది మా అనిరుధ్ అని గర్వంగా చెప్పుకుంటాము." అనిరుధ్ కళ్ళలో ఉత్సాహం కదలాడింది.


ఎయిడ్స్ తో రోగ నిరోధక శక్తి దెబ్బతిన్న జోసఫ్ తోటలో పచార్లు చేస్తుంటాడు. ఎయిడ్స్ వింగ్ వేరుగా వుంటుంది వాళ్లకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇంజెక్షన్ ఇచ్చేప్పుడు సైతం గ్లోవ్ వేసుకోవడం,ఇంకా అనేక జాద్రత్తలు వున్నాయి . కానీ వాళ్ళని ఇతర పేషంట్లతో కలవరాదని నిభందన ఏదీ లేదు . ఎయిడ్స్ పేషంట్ల పట్ల ప్రజల వ్యతిరేకత మునుపటిలా లేదు. మందుల సహాయంతో వాళ్ళ జీవన ప్రమాణం మెరుగయ్యింది కిటికీలో నుండి అనిరుధ్ తో నా సంభాషణ విని,"ఏంటి డాక్టర్ ఇవాళ అనిరుధ్ చాలా ఉత్సాహంగా వున్నాడు ? "అన్నాడు “నేను అతని ట్రీట్మెంట్ అయాక ఏమ్చేస్తావని అడిగా ... చెబుతూ వున్నాడు." అన్నా "నన్ను అడగరా ? అయినా నేను బ్రతికి బయటికి పోనని మీకు తెలుసుకదా? “అన్నాడు. నా మనస్సు ఒక్క నిముషం విలవిలలాడింది. జోసఫ్ కు ముప్పై ఏళ్ళు వుంటాయి,అతనికి మరణం అతి చేరువలో వుంది. అనిరుద్ దగ్గరనుండి ప్రక్కనే వున్న తలుపు నుండి తోట లోకి దారితీశా. జోసెఫ్ నా దగ్గరకు వచ్చాడు .


"మీరు కూడా కోలుకుంటారు...బాగయ్యాక ఏమ్చేస్తారు ?”ధైర్యవంతమైన అపద్దం చెప్పడానికి అలవాటు పడిపోయాను.


"నిజం చెప్పమంటారా! చెప్పాక కోప్పడి నన్ను ఇప్పుడేఇంజెక్షన్ ఇచ్చి చంపేయరు కదా? ముందు మాటివ్వండి " "ఛ అవేం మాటలు? అలా ఎప్పటికి చేయను .. …చెప్పండి " "మిమ్మల్ని... మిమ్మల్ని రోజూ చూస్తుంటే నాకు మీరు కావాలని వుంది. ఎంతో మందితో గడిపాను, కానీ నాకు అదే ధ్యాస వుంటుంది, ఆ క్రమం లోనే ఎయిడ్స్ తెచ్చుకున్నా...కానీ నాకు సెక్స్ మానియా తగ్గలేదు " జోసెఫ్ మాటలకు నేను వణికి పోయాను.మరణం అంచున వుండి కూడా అతను ఇంకా ఆ కోరికల నుండి విమిక్తి పొంద లేదంటే నాకు దిగులయ్యింది. కాసేపు అతన్ని నేరుగా చూడలేక పోయాను. నెమ్మదిగా తేరుకుని చూశా. అతని ముఖంలో ఏ రకమైన అసభ్యత, కుసంస్కారం కనపడలేదు నాకు, అతని బలహీనత అతన్నిపతనానికి లాగింది, అతనెక్కువ కాలం బ్రతకడు. అసహజమైన అతని కోర్కెకు నిందించి నన్ను నేను గాయపర్చుకోదల్చుకోలేదు. "జోసెఫ్...స్త్రీ తన వయసు మగవాళ్ళని స్నేహితులుగాను, తన కంటే చిన్నవాళ్ళని తమ్ముళ్ళు గాను, పెద్దవాళ్ళని అన్నలు, తండ్రులుగాను చూస్తుంది. కానీ చాలా మంది పురుషులు తాము ఏ వయసులో వున్నా, ఏ వయసులోని స్త్రీనయినా, స్త్రీగానే,సెక్స్ ఆబ్జక్ట్ గానే చూస్తారు.దీనికి మీరు మినహాయింపేమీ కాదు. మీ కోర్కెల నిస్సహాయతకు సహాయం చేయలేను,సేవ చేయగలను డాక్టర్ గా. పదండి మీ కేస్ షీట్ చూడాలి" అన్నాను ఎయిడ్స్ వార్డు కేసి వెళుతూ. అతని కేస్ షీట్ చూసి ఇవ్వాల్సిన ఇంజక్షన్ కోసం సిస్టర్ మాలతిని పిలిచా. "మాలతి వద్దు,గుచ్చి గుచ్చి చంపుతుంది...మీరే ఇవ్వండి... విషం ఇవ్వండి...పర్లేదు " కన్నీళ్లు జారుతున్నాయి,చిక్కి శల్యమైన బుగ్గలపై నుండి పెరిగిన గడ్డంపై . మాలతి తెచ్చిన గ్లోవ్ వేసుకుని ఇంట్రావీనస్ ఇచ్చి, "జోసఫ్..! బాగవుతుంది,నిద్రపోండి “ అతని నుదిటిపై చేయి ఆన్చాను.


"సారీ డాక్టర్ " జోసఫ్ గొంతులోంచి దు:ఖంతో, పశ్చాత్తాపంతో కూడుకున్న పదం వినపడి తేరుకున్నా.


సైకాలజిస్ట్ ప్రశాంత్ అందర్ని ఉత్సాహపరచి వచ్చాడు. "సీతా.. మీ హీరో స్కూల్ కు వెళుతున్నాడా ?" "ఆదివారం కూడా వెళ్ళాలంటాడు, స్కూల్ చూపిస్తే కానీ వదలడం లేదు, స్కూల్ కబుర్లు, రైమ్స్ బోలెడు చెబుతాడు." "పుత్రోత్సాహం " నవ్వాడు ప్రశాoత్ "ఆ... సీతా ... శరత్ గారి దగ్గరకు వెళదాం పదండి. "


"మీరు వెళ్ళండి ప్రశాంత్... ఆయన మరీ ముభావంగా వుంటారు"


"ప్లీజ్ రండి... ఆయన ఇంట్రావర్ట్ ...అంతే ... నాకు చాలా ఇష్టం ఆయనంటే, మాట్లాడిద్దాం "


ప్రశాంత్ తో పాటు వార్డ్ లోకి వెళ్ళినా, నారాయణ గారి దగ్గరున్న నర్స్ ఆదుర్దా చూసి దగ్గరికి వెళ్ళా, వృద్దాప్యం , బలహీనతతో పాటు ఆయనకు ఇడియోపతిక్ పల్మనరి ఫైబ్రాసిస్ వుంది. కోర్టికో స్టిరాయిడ్స్ ఇచ్చినా, అతను వూపిరి తీసుకోలేక పోతున్నాడు .మత్తు ఇచ్చి ప్రక్కకు వచ్చా. ప్రశాంత్ శరత్ గారి దగ్గరే వున్నాడు. శరత్ గారు ఎవరితో మాట్లాడక పోయినా ప్రశాంత్ తో మాట్లాడ్డం చూశా. అందరూ నేను వాళ్ళ దగ్గర వుండాలని, వాళ్ళ బాధలు వినాలని కోరుకుంటారు,కానీ శరత్ గారు వేరే. డాక్టర్ సుచరిత రాగానే చెప్పా, "ఇవాళ మా అబ్బాయి పుట్టిన రోజు,వాడ్ని వాటర్ వల్డ్ తీసికెళ్ళాలి వెళతాను, నారాయణ గారికి ప్రేడిన్సోన్ పెట్టాను, క్రిటికల్ గా వుంది చూసుకోండి."


"నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి .. ఈ ఫైవ్ స్టార్ బాబుకు ఇవ్వండి " అంది.


ప్రశాంత్ నా దగ్గరకు వచ్చి "హీరోకు నా విషెస్, బాబును చూడాలి… వస్తాను సాయంత్రం " "రండి ప్రశాంత్ ... ఎప్పుడైనా సరే,4 కు వచ్చేస్తాం , సునీతను తీసుకురండి "


వాటర్ వల్డ్ లో చేతన్ బాగా ఆడుకున్నాడు. దూరంగా శరత్ గారు కూర్చుని వున్నారు. నాకు ఆశ్చర్య మేసింది. ఆయన అప్పుడప్పుడు బయటికి వెళుతుంటారు.నిజానికి ఆయనకు పాలియేటివ్ కేర్ లో ఉండాల్సిన అవసరం లేదు. డాక్టర్లని, నర్సుల్ని పెట్టుకుని సౌకర్యంగా ఉండొచ్చు , ఎందుకో కేర్ లోనే వుంటారు. దగ్గరకు వెళ్లి పలకరించా, అమ్మానాన్నకు పరిచయం చేశా. “చేతన్ ఇంకో తాతయ్య” అని పరిచయం చేశా! ఆయన చిరునవ్వు నవ్వి చేతులు చాచాడు చేతన్నిరమ్మని. చేతన్ వెళ్ళకుండా నాన్న వెనుక దాక్కున్నాడు.


"తప్పు ...తాతయ్య పిలుస్తున్నారుగా వెళ్ళు ' అన్నారు నాన్న. వాడ్ని దగ్గరగా తీసుకుని ఎత్తుకున్నారు, కష్టం మీద గుండెలకు హత్తుకున్నారు. ఆయన కళ్ళలో సంతోషం చూసి నాకు ఆశ్చర్యమేసింది.ఇదే మొదటి సారి ఆయన్ను అలా చూడడం. చేతన్ కోసం బొమ్మలు కొన్నారు , వాడు బొమ్మలు, చాక్లెట్లు చూడటంతో శరత్ గారి దగ్గర చాలాసేపు ఉండిపోయాడు.


సాయంత్రం ప్రశాంత్ సునీత వచ్చారు."సీతా ఇంక కేర్ సెంటర్ రాలేను, నాన్న బిజినెస్ చూసుకోవాలి, శరత్ గారి గురించి మీకు చెప్పాలి.ఆయన నాన్న స్నేహితుడు, పెద్ద పారిశ్రామిక వేత్త ,డబ్బునంతా చారిటీలకేఇస్తారు. తెలుసుగా మన కేర్


సెంటర్ కు ఆయన చాలా విరాళం ఇచ్చారు. శరత్ గారి భార్య పెళ్ళయిన ఏడాదికే, ముప్పై ఏళ్ల క్రిందట మనస్పర్థలతో అతన్నివదిలేసి అమెరికా వెళ్ళిపోయిందట. వెళ్ళేప్పటికి ఆమె గర్భవతి, అయినా బిడ్డ సమాచారం కూడా ఇవ్వలేదట, శరత్ గారు మళ్ళీ పెళ్లి చేసుకోలేదు.ఈ మధ్యే శరత్ గారి భార్య గురించి సమాచారం అoదింది, ఆమె చనిపోయిందట, ఆమె కొడుకు అమెరికాలోనే డాక్టర్ గా పని చేస్తూ ఆక్సిడెంట్లో చనిపోయాడట. అది విన్నాక ఆయన చాలా కృంగిపోయారు,కొడుకు ఫోటోఅయినా చూడాలనే ఆయన ఎంతో వెతుకుతున్నారు. అతని వివరాలు ఎక్కువ తెలియదు, ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఈయన ఆరోగ్యం క్షీణిస్తోంది. క్లినికల్ గా ఆయన మృత్యువకు చేరువగా వున్నారు.ఆయన జీవితం అంతా శోధనే. మీరు ఆయన్నిపలకరిస్తూ వుండండి, అప్పుడప్పుడు


నేను కూడా వస్తుంటాను. ఇది చెప్పాలని చాలా రోజులుగా అనుకుంటున్నా " ప్రశాంత్ నిట్టూర్పు వదిలాడు. "సరే ప్రశాంత్, కేర్ లో ప్రతి ఒక్కరి ఆఖరి శ్వాస వరకు ప్రేమ, అత్మీయతలతో సంతోషంగా వుంచేదానికి ప్రయత్నిస్తాను! నేను US లో ఐదేళ్ళువున్నాను, చాలా మంది తెలుసు నేనుకూడా ప్రయత్నిస్తాను .శరత్ గారి భార్య,పేరు చెప్పండి, ఏ ప్రాంతం వాళ్ళు చెప్పండి, ఆమె ఫోటో ఉందా?" “శరత్ గారి భార్య,పేరు వాహిని ...ఆమె హిందూపూర్ వాసి, ముందు టెక్సాస్ లో వున్నారట, తర్వాత వాషింగ్టన్ డీసీ వెళ్ళిపోయిందట. శరత్ అoకుల్ దగ్గర వున్నఫోటో ఒకటి నా మెయిల్ లో వుంది ఫార్వార్డ్ చేస్తాను." ప్రశాంత్,సునీత వెళ్ళిపోయారు. శరత్ గారి గురించి అమ్మా నాన్నతో మాట్లాడా, వాళ్ళు కొద్దికాలం అన్నయ్య దగ్గరకు వెళ్లాలని అనుకున్నారు.


మరుసటి రోజు కేర్ సెంటర్లో అన్నీ యథావిధిగానే మొదలయ్యాయి.శరత గారి దగ్గరకు వెళ్ళడానికి మనసు లాగింది. కానీ నిర్మల అనే అమ్మాయికి క్రానిక్ హెపటైటిస్ బి,ఆమె పరిస్థితి ఇవాళ మరింత దిగజారింది, సాయంత్రం నాల్గు గంటలకు మరణించింది. నిర్మల కళ్ళు ఆఖరిగా తన తండ్రి కోసం వెతికాయి.ముందురోజు రాత్రి అతనికి పరిస్థితి వివరించి ఫోన్ చేశారు,చాలా దూరంలో వున్నానని, రాలేనని చెప్పారట, మరణవార్తకు కూడా అదే సమాధానమట. ఎంత దయలేనివాడు? కన్నబిడ్డ పై మమతలేనివాడు ఏం మనిషి? కడవరకు చెదరని మమకారం కొందరికి, కన్నవారిని, తాము కన్నవారిని పట్టించుకోని స్వార్థం కొందరికి! ఎందుకింత విపరీతమైన వైవిధ్యం మనుషుల్లో ?అక్కడి మిగాతా రోగులలో నిరాశ నిస్పృహలు ఆవరించాయి. అందరితో కలిసి మెలసి వుండే అమ్మాయి మరణం అందర్నీ కలిచి వేసింది. నిర్మల నయమయాక మళ్ళీ స్కూల్ కు వెళతానని అనేది. ఎప్పుడూ స్కూల్ పుస్తకాలు ముందేసుకుని చదువుకునేది. ఆరోగ్యం బాగా క్షీణించిన తర్వాత కూడా వెళ్ళి పరీక్షలు రాసింది. ఎన్నో కలలతో, ఆశలతో నిండిన ఆ కళ్ళు శాశ్వతంగా నిదురబోయాయి. ఈ ప్రపంచం ఎందుకింత వేదన భరితం?


రోగి పరిస్థితి ఎంత ఎంత దారుణంగా వున్నా, వాళ్లకు సపర్యలు చేస్తూ ఉండగలను,కానీ వాళ్ళు ప్రాణం వదిలిన మరుక్షణం నేను అక్కడ ఉండలేను. చనిపోయిన వ్యక్తి తాలూకు వాళ్ళ కు విషయం తెలియజేయడం,వాళ్ళు ఆసక్తి చూపకపోతే, ఇక్కడినుండే వాళ్ళకు అంతిమ సంస్కారం చేయడం జరుగుతుంది. రఘురాం తర్వాతి పనులన్నీ చూసుకుంటారు. మనసును నిర్మల పైనుండి మరలించి నిర్మలం చేసుకోవడానికి గదిలో కాసేపు ఉండిపోయాను ఆత్మీయుల కోసం వీళ్ళ ఆక్రందన నాకు చాలా బాధకలిగిస్తుంది.మేం ఎంత బాగా చూసుకున్నా, చివరి క్షణాల్లో వాళ్ళ అత్న్మీయులు కనపడాలని ఎంతో ఆక్రోశిస్తారు. ఏం నష్టం ప్రేమ పంచితే? ఏం కోల్పోతారు వాళ్ళని ప్రేమగా చూసుకుంటే ? ఎoదుకింత క్షోభతో వాళ్ళు ఈ ప్రపంచం వదలాలి ? ఈ ప్రశ్నకు నాకు సమాధానమే లభించలేదు .


నాకు శరత్ గారు గుర్తొచ్చారు. ఆయన దగ్గరకు వెళ్లాను. చిరునవ్వు నవ్వారు. "మీరు మా ఇంటికి వస్తారా ? మా


అమ్మా నాన్న వూరెళ్ళారు, చేతన్ వాళ్ళని మిస్ అవుతున్నాడు, మీరు వాడితో కొద్ది సమయం గడుపుతారా అంకుల్ ?" ఆయన కళ్ళలో వెలుగు చూసి నాకు చాలా సంతోషం కలిగింది.


"ఆ... చేతన్ ఎలా వున్నాడు ? వస్తాను, ఎప్పుడు వెళదాం ? డ్రైవర్ని రమ్మంటాను" ఉత్సాహం అతని మాటల్లో. "నా కార్లో వెళదాం, రేపు చేతన్ కు సెలవు కూడాను, నేను కూడా సెలవు తీసుకుంటాను." ఆయన తల ఊపారు.


శరత్ గారిని సంతోషంగా వుంచే ప్రయత్నం చేయడానికి నాకు ఉత్సాహంగా వుంది. ఇంటికెళ్ళి రోజంతా ఫోటో షాప్ లో వాహిని గారి ఫోటోని మార్ఫింగ్ చేయడానికి శ్రమించాను. శరత్ గారికి ఆనందం కలిగించే దృశ్యాల్ని గదిలో పెట్టేప్పుడు చాలా జ్ఞాపకాలు నన్ను బాధించాయి. కానీ ఏదో ఉత్సాహం నన్ను ఆ క్రీనీడల నుండి కాపాడింది. మరుసటి రోజు శరత్ గారిని ఇంటికి తీసుకొచ్చాను. కార్లోనే చేతన్ ఆయన కలిసి పోయారు. ఆయనకు ఊపిరి తీసుకోవడం


కష్టంగా వుంటుంది, కానీ ఆయన తను తెచ్చిన బొమ్మల్ని ఎలా నడపాలో చూపించడానికి శ్రమ పడుతూనే వున్నారు ఆయన వొడిలోనే చేతన్ నిద్రపోయాడు. వాడ్ని గదిలో పడుకోబెట్టి, బయటికి వచ్చాను. మౌనంగా కూర్చున్నారు. "మీరు ఈ గదిలో విశ్రాంతి తీసుకోండి ,చేతన్ ఓ గంటకు లేస్తాడు,తర్వాత ముగ్గురం భోంచేద్దాం " "లేదమ్మా... నేను వెళతాను... "ఆయన లేచి నుంచున్నారు.


నాకేం చెప్పాలో అర్థం కాలా.”..మీరు ఒక్క సారి ఆ గదిలోకి వెళ్లి చేతన్ ను చూసి వెళ్ళండి" అన్నాను


"నిద్రపోతున్నాడుగా ... ! అని మళ్ళీ "ఒక సారి చూసి వెళతాను "అన్నాడు, అతనితో పాటు గదిలోకి నడిచాను. గదిలోకి రాగానే ఆయన కళ్ళు గోడ మీద వున్న స్త్రీ ఫోటో పై నిలిచాయి. ఆ ప్రక్కనే చైతన్య చిన్నప్పటి ఫోటో నుండి చేతన్ పుట్టే వరకు వున్నఫోటోలను ఆయన ఖిన్నుడై చూశారు. కన్నీళ్ళ తో మసకబారిన కళ్ళను తుడుచుకుంటూ నా ప్రక్క చూసి " అంటే....అంటే చేతన్ .... నా .... " అతని గొంతు దాటి మాట రాలేదు. "అవును...చేతన్ మీ మనువడు... చైతన్య మీ అబ్బాయి, నా భర్త, వాహిని గారు మీ భార్య, నాకు అత్త గారు..." చేతన్ ఫోటో చైతన్య ఫోటో ఒకేలా వున్నాయి ఒక చోట.ఆయనకు ఉద్వేగాన్నిఅదుపులో ఉంచుకోవడం చాలా కష్టంగా వుంది. అది చూడలేక బయటికి వచ్చా. చాలాసేపు ఆయన బయటికి రాలేదు. నేనే ధైర్యం చేసి లోపలి వెళ్ళా. నిద్ర పోతున్న చేతన్ ని చూస్తూ వున్నారు. ఆయన కళ్ళు కమిలి పోయిన తామర పువ్వుల్లా వున్నాయి.


"ఇది మన ఇల్లు మీరు ఇక్కడే వుంటారు మీ మనువడితో,మీకు మేమున్నాము."ఎదురుగా నిలబడి


అన్నా . నా ప్రక్క చూసి,మళ్ళీ చేతన్ ని చూస్తూవుండిపోయారు.ఆయన చిరునవ్వులు చూస్తూ నాకు అనిపించింది జాతస్యమరణం ధృవం అయితే అ ముగింపు ఆత్మీయుల సంరక్షణలో అయితే సహజమైన వీడ్కోలు లాగా వుంటుందేమో!