Sunday, 9 March 2014

అభిమాని


"రోషన్ ..నీ అభిమాన హీరోయిన్ శ్రీలత మన వూర్లో షూటింగ్ కోసం వచ్చిందోయ్ " అభి ఫోన్లో ఉత్సాహంగా అరిచాడు.


ఇరవై ఏళ్ళ క్రిందట ఈ సమాచారం కానీ అందివుంటే .... ఉన్నపాటున ఎగిరి గంతేసి పరిగెత్తేవాడ్ని, కానీ ఇప్పుడు అలా ఎగురుతే క్రింద పడతామేమో! కాళ్ళు విరుగుతాయామో !అని ఆలోచించే వయసుకు వచ్చాను. అయినా మనసు ఒక వింత అనుభూతికి లోనయ్యింది.

"చూద్దాం లేరా... ఆ రోజులు వేరే కదా...! నాకు కలవాలనిపిస్తే .నీకు ఫోన్ చేస్తాలే." ఫోన్ పెట్టాను.

శ్రీ లత ఇరవై ఏళ్ళ క్రిందట నా ఆరాధ్య దైవం, నా కలల రాణి. డిగ్రీ చదువుతూ వుండగా స్నేహితులతో ఎక్కువ సినిమాలు చూసే వాడ్ని. మెల్లిగా సినిమా చూడటం వ్యసనంగా మారింది. నాన్న పంపే డబ్బు సగానికి పైగా సినిమాలకే అయేది. అందరూ అభిమాన హీరోల్ని కీర్తిస్తుంటే నేను హీరోయిన్ శ్రీలతను మూగగా ఆరాధించేవాడ్ని. గదినిండా ఆమె ఫోటోలు పెట్టేవాడ్ని. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.


"ఎక్కడరా షూటింగ్ ?" ఉద్వేగం లేకపోయినా, కుతూహలం నన్నువదల లేదు.మళ్ళీ అభికి ఫోన్ చేశాను.


"మనూళ్ళో నేలే, మా పిన్ని కొడుకు శ్రీకాంత్ అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేస్తాడు, వాడే చెప్పాడు శ్రీలత చాలాకాలం తర్వాత మళ్ళీ సినిమా చేస్తోందిట, మన కాలేజి రోజుల్లో నీవు పడి చచ్చే వాడివి కదా! గుర్తొచ్చావు. కలవాలనుకుంటే చెప్పు మా కజిన్ కు చెబుతాను .. తీసికెళ్ళి పరిచయం చేస్తాడు ...."


"చూడాలనిపిస్తే నీకు ఫోన్ చేస్తా... ఇప్పుడు బిజీ గా వున్నా ప్రాక్టికల్ ఎక్షామ్స్ వున్నాయి."


వారం రోజులు గడిచాయి. కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే, పాత కలెక్టర్ బంగళా దగ్గర ఏదో హడావుడి చూసి అక్కడ బైక్ ఆపి అడిగా. "షూటింగ్ జరుగుతోందట "అన్నారెవరో.


ఒక్క నిముషం మనసు పదిహేనేళ్ళ క్రిందట శ్రీలతను చూడటం కోసం పడిన అవస్థలు గుర్తు చేసుకుంది. నాకు తెలియ కుండానే నేను షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నా. అభికి ఫోన్ చేయ బోయి విరమించుకున్నా.


"శ్రీకాంత్.సార్...మిమ్మల్ని శ్రీలత మేడం పిలుస్తున్నారు..." అని ఓ కుర్రాడు గట్టిగా అరిచాడు.


ఓహ్హొ ఇతనే నన్నమాట శ్రీకాంత్ ...మాట్లాడిస్తేనో....అభి స్నేహితుడ్నని, చూద్దాం ఎలా స్పందిస్తాడో!..పైగా శ్రీలత ఇతన్ని పిలుస్తున్నారన్నాడు కదా!


నా విజిటింగ్ కార్డ్ వెనక ఫ్రెండ్ అఫ్ అభిరామ్ అని రాసిచ్చి శ్రీకాంత్ కు ఇవ్వమని పంపించా,అక్కడున్న ఒకబ్బాయితో.


మరు నిముషం లోనే శ్రీకాంత్ నా దగ్గరికి వచ్చాడు.


"రండి సార్ షూటింగ్ అయిపొయింది,మళ్ళీ గంట తర్వాత మొదలవుతుంది ."అంటూ నన్ను షామియానా వేసి వున్నచోటికి తీసికెళ్ళి కూర్చోబెట్టాడు.


"లేదు శ్రీకాంత్,..షూటింగ్ పై ఆసక్తి లేదు...శ్రీలత గారంటే చాలా ఇష్టo .. వీలయితే కలుద్దామని ... కానీ చాలా మంది ఆమెను కలవాలని వస్తారేమో...ఇబ్బందిగా ఉంటుందేమో కదా !"

"అందరూ హీరో హీరోయిన్లను చూడాలంటారు ,ఆమె నెవరు కలుస్తారు సర్ ... ఆమె ఫ్రీ గా వున్నారు.. రండి పరిచయం చేస్తాను, మంచావిడ .. "అంటూ గెస్ట్ హవుస్ కేసి నడిచాడు.

"లోపలికి వెళ్లి అడిగి వస్తాను సర్ " అని , శ్రీకాంత్ లోపలికి వెళ్ళాడు .

వెంటనే వచ్చి "రండి సార్ " అని లోపలికి తీసికెళ్ళాడు.

తెల్లటి కుర్తి పైజామా పై పసుపు పచ్చని చున్నీ లో నా అభిమాన నటి శివ్ ఖేర్ రాసిన "లివింగ్ విత్ ఆనర్" చదువుతోంది. నన్ను చూడగానే పుస్తకం క్రింద పెట్టి నిలుచుంది , నా ఫ్రెండ్ రోషన్ మేడం ... కాలేజ్ లో లెక్చరర్ , మీ అభిమాని, పరిచయం చేయాలని తీసుకొచ్చాను ..." అన్నాడు


"నమస్తే "అంది ఆమె చేతులు జోడించి.


"నమస్తే " అని చేతులు జోడించినా ఒకరకమైన ఉద్వేగం తో నాకు నోట మాట రాలేదు . "కూర్చోండి" ఆమె అనునయమైన గొంతు నాలో చాలా టెన్షన్ ని తగ్గించింది.

"మీరు మాట్లాడుతూ వుండండి ... కొద్ది సేపట్లో వస్తాను మేడం '" అన్నాడు శ్రీకాంత్.

"సరే వెళ్లి మీ పని చూసుకోండి " అంది శ్రీలత నా కేసి తిరిగి "మీరు కాలేజ్ లో లెక్చరర్ కదా ! ఏ సబ్జెక్ట్ ?"

"ఫిజిక్స్" అన్నా గొంతు సవరించుకుని.


"ఓహ్...చాలా కష్టమైన సబ్జక్ట్ ..నేను ఇంటర్లో చాలా కష్టపడ్డా ఫిజిక్స్ పాస్ అయేదానికి, ఇంకా నన్ను గుర్తు పెట్టుకునే అభిమానులున్నారా? నాకు చాలా సంతోషంగా వుంది రోషన్..ఈ సినిమా ప్రపంచం ఒక మాయా ప్రపంచం...ఇది లైం లైట్ లో వున్న వాళ్ళని మాత్రమే గౌరవిస్తుంది. ప్రజలు అంతే.. వెలుగుతున్న తారలనే చూస్తారు. ఇది సహజం. ఆరోజుల్లో నేను కూడా ఎవర్ని లెక్క చేసేదాన్ని కాదు...నిర్మాతలు క్యూలో నిలబడుతుంటే ఎవరికైనా అలాగే వుంటుంది, ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నిలబడడానికి భూమ్మీదకు రావసిందే కదా ! "

నేను నవ్వి వూర్కున్నా.

"మీ గురించి చెప్పండి రోషన్ "

"నా గురించి ఏమీ లేదండి. కాలేజ్,ఇల్లు, నా భార్య స్నేహ డాక్టర్, ఇద్దరు కూతుర్లు శ్రుతి,కృతి. తీరిక దొరికితే పుస్తకాలు చదువుతాను, పాత సినిమాలు చూస్తాను , ఇప్పుడు సినిమాలు అంత ఇష్టం లేదు...మీ సినిమా వచ్చాక చూస్తాను ."

శ్రీలత నవ్వింది ," నా గురించి తెలుసు కదా..మా వారు బిజినెస్ లో బిజీగా వుంటారు, అబ్బాయిలు కోమల్, నిర్మల్ మెడిసిన్ చదువుతున్నారు, సినిమా చేయాలని లేదు కానీ, నిర్మాత మా కుటుంబానికి స్నేహితుడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు, అతని అభ్యర్థనతో కాదనలేక రంగు వేసుకుంటున్నాను. "

ఆమె చాలా స్నేహంగా మాట్లాడే సరికి నాకు కొంత బెరుకు తగ్గింది


ఒకప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో శ్రీలతను కలవడానికి వెళ్లి నప్పుడు అక్కడి సెక్యూరిటీ ఎలా తోసేశారో...,శ్రీశైలంలో దైవ దర్శనానికి వచ్చిన శ్రీలతను చూడ్డానికి ప్రయత్నించినప్పుడు తగిలిన లాఠీ దెబ్బలు, ఆమెకు ఉత్తరం రాసి జవాబు కోసం చూసిన ఎదురు తెన్నులు, గదిలో అతికించిన శ్రీలత బొమ్మల్ని నాన్న వచ్చి చూసి చించి నప్పుడు కార్చిన కన్నీళ్లు ,శ్రీలత గురించి చెడు గా మాట్లాడిన స్నేహితుడ్ని కొట్టి వాడితో మళ్ళీ తిన్న దెబ్బలు, ఆమె పెళ్లి చేసుకుందని ఇంక సినిమాల్లో నటించదని పేపర్లో చదివి మౌనంగా రోదించిననప్పటి రోజుల గురించి చెప్పాను.


ఆమె సావధానంగా వినింది ... "రోషన్... ఎంతోమంది అభిమానుల కారణంగానే మేము ఎదిగాం ,మీ అభిమానం వలెనే మేం కోట్లు సంపాదించుకున్నాం, కానీ మేమెప్పుడూ అది గ్రహించలేదు , నేనే కాదు, చాలా మంది అది అప్పుడు గ్రహించరు.. నాకు మీ అభిమానం చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి ...మీ అభిమానానికి కృతజ్ఞురాలిని,. "


శ్రీకాంత్ రాకతో ఇద్దరం మౌనం వహించాం. " ఇక వెళతాను శ్రీలతగారు. మీరు మళ్ళీ నటనలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నా."

"థాంక్స్...రోషన్ చెన్నై వస్తే కలవండి ఇదిగో నా కార్డ్..నా పర్సనల్ నంబర్ అది, బయటివారికి ఇవ్వను, మీకు మాత్రమే ఇచ్చాను "


"చాలా సంతోషంగా వుందండి, మిమ్మల్ని కలవడం, చెన్నై వస్తే కలుస్తాను...వుంటాను" ఆమె తో, శ్రీకాంత్ తో సెలవు తీసుకుని వచ్చాను.


నా మనసంతా ఆనందంతో నిండి పోయింది, కుర్ర వయసులో ఆమె అంటే వున్న మొహం, ఆమె ఫోటోలు చూసుకుంటూ రాత్రులు గంటలు గంటలు గడిపింది, క్లాసులో పాఠాలు వినకుండా సితారలో ఆమె బొమ్మలు చూస్తూ వుంటే లెక్చరర్ వచ్చి లాక్కుని చించి వేస్తే .. ఆపై ఆయన క్లాసుకే పోకుండా ఉండిపోవడం గుర్తొచ్చాయి. ఇప్పుడు ఆమెను చూస్తే ఎంత స్నేహభావం, గౌరవం కలిగాయో !


ఆ వయసు అలా, ఈ వయసుకు ఇలా,నవ్వొచ్చింది నాకు. ఒక మరపురాని మధుర భావన ఆమెను కలవడం ద్వారా కలుగుతుందని అనిపించేది. కానీ అలా లేదు ఒక చిన్ననాటి స్నేహితురాలిని చాలా కాలం తర్వాత కలిసినట్లుంది. నా బండి తీసి ఇంటికి బయలు దేరాను. విసురుగా వీస్తున్న గాలికి చేతిలోని విజిటింగ్ కార్డ్ జారి పోయి ... చూస్తుండగానే ఎక్కడో పడింది. కాసింత దిగులయినా ముందుకు సాగాను . కాలం ఎంత విచిత్రమైంది ? అంతా కాలం చేసే గారడీ. అదే ఆమె ... అదే నేను, కానీ భావోద్వేగాలు కాలంతో మారి పోయాయి.

No comments:

Post a Comment