చాలా కాలం తర్వాత కలిసిన స్నేహితులంతా ఆనందంగా మాట్లాడుకుంటున్నాం. కర్నూల్లో నాలుగేళ్ల క్రిందట ఇంజనీరింగ్ చదివి ఉద్యోగ రీత్యా ఎక్కడెక్కడో ఉంటూ వినీత్ పెళ్లి కి అందరం ముందుగానే అనుకుని కలిసాం. మూడురోజులు సెలవులు కూడా కలిసి రావడంతొ రెండురోజులు అదనంగా సెలవుపెట్టుకుని వచ్చాం. పెళ్ళికొడుకు గా వినీత్ అప్పుడప్పుడు పెళ్లి ఆచారాలకు పెద్దవాళ్ళు పిలిచినప్పుడు వెళ్లి మళ్ళీ తీరిక దొరకగానే మాతోనే గడుపుతున్నాడు. రెండు రోజులు ఆనందంగా గడిచి పోయాయి. సాయంత్రం రిసెప్షన్ ఉండింది, మరుసటి రోజు ఉదయమే పెళ్లి .. పెళ్ళిలో అందమైన అమ్మాయిల వేటలో వున్నారు మిత్రులంతా. అందరికి పెళ్లి కావాల్సి వుంది..అమ్మాయిలు కూడా గడసరులయ్యాక అబ్బాయిలు మగ అహంకారం తగ్గించుకోవాల్సి వస్తోంది, అమ్మాయిలకు నచ్చినట్లు ఉండాల్సి వస్తోంది. ఇదయితే నాకు బాగా నచ్చిన పరిణామమే.
వినీత్ మరదలు కావ్య చాలా హుషారుగా మాకు మర్యాదలు చేస్తోంది. ఆ అమ్మాయి కళ్ళు దృవ్ మీద పడ్డం మేము గమనించాము. ఏదో ఒక పనిగట్టుకుని ఆ అమ్మాయి రావడం దృవ్ ని ఏమైనా కావాలా అని అడగడం మా అందరి కళ్ళలో పడింది కానీ దృవ్ మాత్రం అటుకేసి కూడా చూడకుండా మామూలుగా వున్నాడు. చక్కని చుక్క లాంటి అమ్మాయి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఎదురు చూస్తూ వుంటే, వీడి నిర్లిప్తత మాకు కొంచం మింగుడు పడలేదు. దృవ్ స్త్రీ పక్షపాతి. మా చర్చల్లో ఆడవాళ్ళ గురించి ఏ మాత్రం సెన్సారు మాటలు వచ్చినా...ఆపండి అని కోప్పడ్డమో..లేకపోతే అక్కడి నుండి వెళ్లిపోవడమో చేసేవాడు, చాలా సార్లు ఘర్షణ జరిగాక దృవ్ వుండగా అమ్మాయిల చర్చ రాకుండా జాగ్రత్త పడేవాళ్ళం. జీవితంలో ఒకే సారి ప్రేమలో పడాలని, ప్రేమించిన వ్యక్తితోనే జీవితం పంచుకోవాలని, అది అందరి మధ్యలో చర్చించి నవ్వుకునేంత సామాన్యమైన విషయం కాదని దృవ్ గట్టిగా నమ్మేవాడు. వాడి భావాల్ని అందరం గౌరవించేవాళ్ళం.
"కావ్యకు దృవ్ కు పరస్పరం నచ్చినట్లయితే, పెళ్లి గురించి ఆలోచిద్దాం, నువ్వు మాట్లాడు, నేను అడిగితే బావుండదు. " అన్నాడు వినీత్.
"కావ్యను చూసావా! బాగుంది,చదువుకుంది,నచ్చితే చెప్పు, వినీత్ నీకు చెప్పమన్నాడు, ఇంక నీ పెళ్లి కూడా త్వరలోనే మేం చూడొచ్చు ..." అన్నా.
"రాణా .. నా మనసులో ఓ అమ్మాయి వుంది..నీతో చెప్పాలని చాలా కాలంగా అనుకుంటున్నా. మనం ఫైనలియర్ లో వుండగా ఒక సారి సుంకేసుల డాం కు వెళ్లాo , ఆ రోజు నేనొక అమ్మాయిని నీళ్ళలో జారి పడితే కాపాడా గుర్తుందా ! ఆ అమ్మాయి తర్వాత నన్ను కలిసింది. తన ప్రాణాలు కాపాడి నందుకు కృతజ్ఞతలు చెప్పివెళ్లి పోయింది. నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను, చాలా రోజుల తర్వాత మేమిద్దరం మళ్ళి ఎక్జిబిషన్లో ఎదురు పడ్డాం. మాట్లాడాను. తర్వాత ఆమెంటే ఇష్టమని చెప్పా. తనకి కూడా ఇష్టమని, వాళ్ళ అక్క పెళ్లి అయాక, వాళ్ళ నాన్న గారితో మాట్లాడమంది. నేను వుద్యోగంలో చేరాక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతునే వున్నాo. ఆ తర్వాత ఏమయ్యిందో తెలియదు మూడు నెలలైంది ..తను ఫోన్ చేయలేదు ...నేను చేస్తే చాలా రోజులు ఫోన్ మ్రోగుతున్నాఎవరూ తీయలేదు. తర్వాత ఆ నంబర్ పై ఫోన్ లేదని వచ్చింది ...ఈ మధ్య చేస్తే వేరే వాళ్లకు ఆ ఫోన్ కేటాయించి నట్లు చెప్పారు. ఆమె పేరు భావన,వాళ్ళ నాన్నగారి పేరు రమాకాంత్,కర్నూల్ లోనే టీచర్ గా పనిచేసేవారు, ఆమె గురించి కనుక్కుందాం. నాకు ఆమె పై ఎంతోఅభిమానం, నమ్మకం వున్నాయి.. ఏదో బలమైన కారణం లేకపోతే ఆ అమ్మాయి అలా ఫోన్ చేయకుండా వుండదు రాణా ...."
" సో, యు లవ్ హర్..కనుక్కుందాం, అయితే...ఆమె నీ ప్రేమను సీరియస్ గా తీసుకోకుంటే, వేరే ఎవరినైనా ఇష్టపడివుంటే, ఇంక వదిలేసి వినీత్ మరదలో. .. ఇంకో అమ్మాయినో పెళ్ళిచేసుకుని ఆ అమ్మాయిని మర్చిపోవాలి ..సరేనా !"
" సరే, కానీ ఆ అమ్మాయి ఇంకో వ్యక్తిని వప్పుకునే పరిస్థితి లేదు ...నీకు కర్నూల్లో చాలామంది బంధువులు వున్నారు కదా, కనుక్కో ..ఇదిగో తన ఫోటో" తన వాలెట్ నుంచి తీసి చూపించాడు.
నిర్మలమైన ఆమె ముఖం చూసి"చాలా బాగుంది రా దృవ్..మేడ ఫర్ ఈచ్ అదర్ లా వున్నారు కనుక్కుందాంలే" అన్నా.
"ఇది మనిద్దరి మధ్యే వుండాలి...ఇది ఒకమ్మాయి జీవితం ..నన్ను ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా బయటి వాళ్లకు తెలియరాదు"
" ష్యూర్...నాకు తెలుసుగా "
దృవ్ ప్రేమ పట్ల నాకెంతో గౌరవం వుంది ....దృవ్ లాంటి వాడి ప్రేమను పొందిన అమ్మాయి ఎంతో అదృష్టవంతురాలు, కానీ ఆ అమ్మాయి ఫోన్ చేయకుండా ఎందుకుంది ? తల్లిదండ్రుల కట్టడి చేశారేమో! ఇంకెవరన్నా ఆకర్షించారేమో ..చెప్పలేం ఏమైనా జరగొచ్చు.. కానీ దృవ్ లాంటి వ్యక్తులు ప్రేమకు అత్యున్నత స్థాన మిస్తారు. వాని గురించి నేను చాలా ఆశ్చర్య పోతుంటాను ...వాడెంత కఠిన మైన నిజాయితి తో ఉంటాడో తెలిసిన నేను ఒక్కోసారి వణికి పోతుంటాను. అది అందరికి మింగుడు పడే మనస్తత్వం కాదు ....వాడి దగ్గర చాలా స్పష్టంగా, నిజాయితీగా ,సత్య ప్రవర్తన తో వుంటే తప్ప వాడితో కలిసి జీవించే అర్హత, వాడి ప్రేమ ను పొందే అదృష్టం కలగదు ...ఒక్క అసత్యం, ఒక్క హిప్పోక్రటికల్ ప్రవర్తన, ఒక్క అధర్మమైన పని చాలు వాడి మనసు విరిచేదానికి, వాడు ఎవరి తప్పును ఎంచి చూపకున్నా, వాడి మనసు నుంచి వాళ్ళు వైదొలుగుతారు అన్న విషయం నాకు తెలుసు,కొన్నిఆదర్శాలు ప్రపంచాన్ని మెప్పించగల్గుతాయి కానీ కుటుంబ సభ్యులను కాదు...ముఖ్యంగా భార్యను అసలు కాదు, కానీ ఆదర్శాలే ఇష్టపడే అమ్మాయి అయితే సమస్య లేదు.దృవ్ వరించిన అమ్మాయిని వెతికాలి ఇది నా బాధ్యత.గట్టిగా నిర్ణయించుకున్నాను .
పెళ్లి భోజనాలు చేసాక,మల్లికార్జున్ "శ్రీశైలం వెళదామా" అన్నాడు.
నా అనాసక్తి గమనించి "శ్రీశైలంవెళ్ళే దారిలోనలమల్ల ఫారెస్ట్డ్, డ్యాం బాగుంటుంది.పైగా వర్షాకాలంలోకొండల్లోవర్షం కురుస్తుంటే బాగుంటుంది చూట్టానికి " అన్నాడు.
ఇంకేం నాలోని ప్రకృతి ప్రేమికుడు నిద్ర లేచాడు.మల్లికార్జున్, నేను, షాహిద్ సరే అన్నాం. కానీ దృవ్ నా ప్రక్క అదోలా చూసాడు. నాకు గుర్తొచ్చింది అతని అజ్ఞాత ప్రియురాలి సంగతి కనుక్కుందాం, అనుకున్నాం కదా!..కానీ ఇక్కడ మెజారిటీ, శ్రీ శైలంకు వోటేశారు. ఇప్పుడు..దృవ్ కు నచ్చజెప్పాలి.
"శ్రీశైలం కర్నూల్ నుండి 190 కిలోమీటర్లు మూడు గంటల్లో వెళతాం సాయంత్రానికి వచ్చేస్తాం, తర్వాత, ఆ అమ్మాయిని వెతికే పని నాది.." దృవ్ చెవిలో అన్నాను.
వినీత్ మామగారు మాకు ఇన్నోవాతో పాటుగా గోపి అనే కత్తి లాంటి కుర్రాడిని మాతో పాటుగా పంపాడు. హుషారైన గోపి మమ్మల్ని తన సరదా కబుర్లతో..నవ్విస్తూ ..శ్రీశైలం అడవుల్లో తనకు తెలిసిన ప్రదేశాల గురించి చెబుతూ మమ్మల్నికాసేపు అడవుల్లోతిప్పి ఎలాగైతేనేం శ్రీశైలం చేర్చాడు. గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్ళాక అక్కడ మానేజర్ మా గది అర్జంటుగా ఎవరికో ఇవ్వాల్సి వచ్చిందని సంజాయిషీ చెబుతూ మాకు రెడ్ల సత్రం లో రెండు మంచి గదులు కేటాయించి నట్లు ..అక్కడ సర్దుకోమని ప్రార్థించాడు. షాహిద్ కాసేపు గొడవ చేసినా దృవ్ నచ్చజెప్పడంతొ, సర్దుకుని రెడ్ల సత్రం కు వెళ్ళిపోయాం, గదిలో కాసేపు విశ్రాంతి తీసుకుని రోప్ వే లో డ్యాం మరియు అక్కమ్మ గుహలు చూపిస్తానన్నాడు గోపి.
మల్లికార్జున్ దేవుని దర్శనానికి వెళ్ళాడు కాబట్టి మేము వాడికోసం చూస్తూ గదిలో వున్నాం. కాసేపయ్యాక నేను గోపి అలా బయటికి వచ్చాము, రిసెప్షన్ దగ్గర వున్న బుక్ స్టాల్ లో వున్న బుక్స్ చూశాను. వేమన పద్యాల పై వున్న సాహితీ విమర్శలని చూస్తున్న నాకు గోడలపై వ్రేలాడుతున్న ఫోటోలు కొంచం ఆసక్తికరంగా అనిపించాయి. తమ బంధువుల మరణాంతరం వాళ్ళ జ్ఞాపకార్థం అక్కడ కొన్ని గదులు కట్టించినట్లుగా అక్కడ రాసుకున్నారు.అలా చూస్తున్ననా కళ్ళు ఒక ఫోటో దగ్గర ఆగి పోయాయి. ఒక్క నిముషం నాకు కళ్ళు బైర్లు కమ్మాయి. మళ్ళి కళ్ళు నులుముకొని చూశా భూమిరెడ్డి..సాధన డాటర్ ఆఫ్ రజని కాంత్ కర్నూల్, అని వుంది. ఫొటోకు పెద్ద పూల దండ వేయబడి వుంది, అదింకా పూర్తిగా వాడలేదు. అంటే అది నిన్నో మొన్నో వేసారు ,ఆ ఫోటో నిన్న దృవ్ చూపించిన ఫోటో లోని అమ్మాయిదే. ఆమె మరణించిన తేది చూసి ఉలిక్కి పడ్డాను. సరిగ్గా మూడు నెలల క్రితం చనిపోయింది. ఎలా చనిపోయిందో! పాపం ..నా మనసంతా శూన్యం నిండింది .మేము బయటికి రావాలంటే ఇలాగే వెళ్ళాలి దృవ్ ఇది చూసాడంటే ఇంక జీవితం లో ఇంకో స్త్రీని ప్రేమించలేడు.అక్కడే వున్న మానేజర్ను మేము వెళ్ళేవరకు ఆ ఫోటోని తీసివేయమని అభ్యర్థించా. కారణం అడిగిన అతనికి దృవ్ ప్రేమకథ చెప్పా ... అతను మరు నిముషమే ఆ ఫోటోని అక్కడనుండి తొలగించాడు. మరణం ఆ అమ్మాయిని ఎలా వెంటాడిందో! ఆ రోజు దృవ్ రక్షించక పోతే నాలుగేళ్ల క్రితమే ఆ అమ్మ్మాయి మరణించేది ...కానీ ఇప్పుడు దృవ్ కు ఇది తెలిస్తే ఎలా? లేదు, తెలియ రాదు... .గోపి కి నా ఆదుర్దా, నేనా ఫోటో చూసి బాధపడటం, ఫోటోని తొలగించటం అంతా కొంచం ఆశ్చర్యంగా , కొంచం కుతూహలంగా అనిపించి అడిగేశాడు . ఆ అమ్మాయిని వెతికే పనిలో గోపి సహాయం తీసుకుందామని ఆలోచించిన నేను ఇప్పుడు దృవ్ కు ఆ అమ్మాయి మరణం గురించి తెలియకుండా దాట వేయడానికి గోపి సహాయమే తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చాను.
తర్వాత జరిగిన వేవి నా మనసులో లేవు, దృవ్ నవ్వు చూసిన ప్రతి సారి నా గుండె లయ తప్పింది. ఏదో భారం నా తలపై ఉన్నట్టుగా అనిపించింది. ప్రపంచమంతా తల్లక్రిందులుగా అయినట్లు అనిపించింది. రోప్ వే లో దృవ్, షాహిద్, మల్లికార్జున్ చేస్తున్న అల్లరి నేను గోపి మౌనంగా చూశాము. ప్రకృతి కి పరవశించే నా మనసు తెలిసిన మిత్రులకు నా మౌనం కొంచం ఆశ్చరంగా అనిపించింది. ప్రవాహం లా అల్లరి గా వుండే గోపి సైతం ఆ అమ్మాయి మరణానికి తల్లడిల్లి నిశ్శబ్దం వహించాడు. మా స్తబ్దత వాళ్ళను ఇబ్బంది పెట్టకుండా ఉండేందుకు,గోపి కొంచం సర్దుకుని హుషారయ్యాడు. నేను కూడా నవ్వు తెచ్చుకుని మామూలయ్యా . తిరిగి వచ్చేప్పుడు చీకటి పడింది.
" గోపికి తలనొప్పిగా వుందట నువ్వు డ్రైవ్ చెయ్యి రాణా ! అన్నాడు షాహిద్ నాతో.
"...వద్దు సార్ మేమిద్దరం అక్కడ జ్యూస్ త్రాగాక బాగాలేదు" అన్నాడు గోపి
మల్లికార్జున్ స్టీరింగ్ తీసుకున్నాడు. వినీత్ ను కలిసి స్నేహితుల్ని వాడికి అప్పజెప్పి నేను మా చిన్నాన్న వాళ్ళింటికి వెళుతున్నానని చెప్పాను. దృవ్ గుసగుసగా "మరి నే చెప్పిన విషయం గురించి ఎప్పుడు తెలుసు కుంటావు? అన్నాడు .
"ఆ పని మీదే కదా వెళ్ళేది "అన్నా. కానీ ఏదోగా అనిపించింది వాడికి అసత్యం చెప్పడం: కానీ బాధించే నిజాలకన్నా, కాపాడే అసత్యాలే మేలని నా మనసుకు సర్ది చెప్పుకున్నా. రజని కాంత్ టీచర్ గురించి వాకబు చేసాం ..పెళ్లి కెదిగిన కూతురు ఆక్సిడెంట్లో మరణిస్తే తట్టుకోలేక, వుద్యోగం చేయలేక వాలంటరి రిటైర్మేంట్ తీసుకుని సాంత ఊరుకు వెళ్లి పోయాడని చెప్పారు. బంధువుల్నికలిసి, అటు ఇటు తిరిగి మా తిరుగు ప్రయాణం సమయానికి నా స్నేహితుల్ని చేరుకున్నా... దృవ్ ఆసక్తి గా నా ప్రక్క చూసాడు ."కనుక్కున్నావా? " అన్నాడు . "వూ ...నీవు చెప్పిన అమ్మాయికి పెళ్ళయి పోయిందని చెబుతున్నారు, పైగా రజని కాంత్ గారు తమ సాంత వూరు వెళ్లి పోయారట ...ఇంకా ఆయన..ఎవరి తోను పెద్దగా కలవరట అందుకని..ఎవరికీ వాళ్ళ విషయాలు తెలియ లేదు , ఆ అమ్మాయి కయితే పెళ్లి అయిపొయింది ..." నేను దృవ్ కళ్ళ లోకి చూడకుండా అటు ఇటు చూస్తూ అన్నాను . షాహిద్ , మల్లి రావడంతొ నేను ఊపిరి పీల్చుకున్నా. సత్యాన్ని ప్రేమించే వ్యక్తులకు అసత్యం చెప్పడం అంత సులభం కాదు అనిపించింది. దృవ్ ఆ చర్చ మళ్లీ తేలేదు. బ్రతికి పోయాను అనుకున్నా.కానీ బెంగుళూరు వచ్చాక నేను దృవ్ ను మునుపటిలా చూడలేకపోతున్నా.నాలో అపరాధ భావం పెరిగి పోతోంది. అది మనసును తొలిచేస్తోంది .అప్పుడే నేను కంపెని మారే అవకాశం రావడంతో..పూనా వెళ్లి పోయా!
తర్వాత... ఆరు నెలలకు షాహిద్ ఫోన్ చేసాడు."దృవ్ పెళ్ళికి వస్తున్నావా? "అని
"ఎప్పుడు" అన్నా ఆశ్చర్యంగా!
"అదేంటి నీకు చెప్పలేదా ..ఎల్లుండే అనంతపూర్ లో " ఈ సారి ఆశ్చర్య పోవడం వాడి వంతయింది.
నాకు దృవ్ తన పెళ్లి కి పిలవక పోవడానికి కారణం అర్థం కాలేదు ...వాడి ప్రేమ విషయం నాకు తెలిసినందుకు ఫీల్ అవుతున్నాడా ...కానీ దృవ్ తత్వం అదికాదే ...కానీ ఎందుకు నన్ను అవాయిడ్ చేసాడు..? పూనా నుండి రిజర్వేషన్ లేకుండా అనంతపూర్ పోవడం కష్టమే కానీ, నేను బయలుదేరా! దానికి రెండు కారణాలు ఒకటి దృవ్ పట్ల నాకున్న ఇష్టం, రెండవది నన్నెందుకు పెళ్ళికి పిలవలేదో అన్న విషయం తెలుసుకునేందుకు. నే వెళ్ళే టప్పటికి పెళ్లి తంతు జరుగుతోంది. స్నేహితులతో కలసిపోయి కబుర్లలో పడ్డా. అక్కడ షాహిద్ కు తప్ప ఎవరికీ నేను ఆహ్వానం లేకుండా వచ్చానని తెలియదు.ఇన్విటేషన్ గురించి మాకంత పట్టింపులు లేవు కాబట్టి, షాహిద్ కూడా ఆ విషయం మర్చిపోయాడు. పెళ్లి మంటపం పైకి వెళ్లాం స్నేహితులమంతా. అందర్నీ తన భార్యకు పరిచయం చేస్తూ నన్నుచూసి ఖిన్నుడయ్యాడు దృవ్..అతని ప్రక్కనున్న అమ్మాయిని చూసి నేను అదిరి పోయాను. ఆమె నాకు దృవ్ చూపించిన ఫోటోలో అమ్మాయే ...శ్రీశైలం లో రెడ్ల సత్రంలో వున్న ఫోటో ఈమెదే ...పైగా రజని కాంత్ గారితో పాటుగా పని చేసిన టీచర్ కూడా చెప్పారు...కూతురి మరణం తర్వాత వెళ్లిపోయారని, ఇదంతా ఏంటి.....? నేనెక్కడ పొరబడ్డాను ...ఆలోచనల్లో ఉండగానే ..దృవ్ ముక్తసరిగా "రాణా నా క్లాస్ మేట్" అన్నాడు. కనీసం ఫ్రెండ్ అని కూడా పరిచయం చేయలేదు ...వాడు చాలా గాయపడ్డాడు, కానీ నేను వాడి మంచి కోరే అలా చెప్పాను వాడేమో నేను ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండా పెళ్ళయిందని అపద్దం చెప్పానని అపోహ పడ్డాడు. ఈ అపోహ పోగొట్టాడమెలా? షాహిద్, దృవ్ నాతో మునుపటిలా ఉండక పోవడం గమనించాడు.
"ఏమయ్యింది మీ మధ్య? మీరిద్దరూ చాలా క్లోజ్ కదా!" అన్నాడు. విషయం చెప్పా. షాహిద్ నేరుగా భోజనాల దగ్గరున్నపెళ్లి కూతురి నాన్న దగ్గరికి తీసికెళ్ళాడు. "సర్..మేము దృవ్ స్నేహితులం ఒక చిన్న సందేహం ... మీరు మరోలా అనుకోకండి .. మీరు ఈ మధ్య అంటే ఆరు నెలల క్రిందట శ్రీశైలం వెళ్ళారా ?"
ఆయన ఆశ్చర్యంగా చూసి "వెళ్ళాము " అన్నాడు.
" ఎప్పుడు వెళ్ళారు ? "
"అయినా మీరెందుకడుగుతున్నారు ?" అన్నారాయన కొంచం కటువుగా
"ప్లీజ్ సర్ ..చెప్పండి రెడ్ల సత్రం వెళ్ళారా "
"అవును మా అమ్మాయి పేరు మీద డొనేషన్ ఇవ్వడానికి వెళ్లాను,అయినా మీరెందుకు అడుగుతున్నారు"
"అప్పుడు మేము కూడా శ్రీశైలం వచ్చాం సర్ ..అక్కడ మిమ్మల్ని చూసాం అందుకని అడిగాం" అన్నాడు షాహిద్ తెలివిగా
"అవునా ! మా పెద్దమ్మాయి సాధన ఆక్సిడెంట్ లో చనిపోయింది ...ఆమె పేరు మీద పూజ చేయించి ఆమె జ్ఞాపకార్థం కొంచం డొనేషన్ ఇచ్చాం బాబు ఆరోజు రెడ్ల సత్రం లోనే వున్నాం."అన్నారు
దృవ్ భార్య, చనిపోయిన అమ్మాయి ఒకేలా వుండడం ,పేర్లు కూడా సాధన, భావన కావడంతొ నేను పొరపడ్డాను .ఇది దృవ్ ను నొప్పించింది. దృవ్ గాయపడ్డానికి కారణం తెలిసింది, అతని స్థానంలోఎవరున్నా అలాగే అనుకుంటారులే...అనుకుని స్థిమిత పడ్డా.
"దృవ్ కు విషయం చెబుదాం పద" అన్నాడు షాహిద్ .
"వద్దులేరా, పెళ్లి లో హ్యాపీగా వుండగా ఆ చర్చ ఎందుకు,ఇప్పుడు వేలూరు బస్ వుంది కర్నూల్ కు వెళ్ళిపోతున్నా..తర్వాత ఎప్పుడో చెబుదాం లే .. దృవ్ కు వెళ్ళానని చెప్పు, వాడ్నిడిస్టర్బ్ చేయడం నాకిష్టం లేదు. మన వాళ్ళందరికీ చెప్పానని చెప్పు..చూసారంటే నన్ను పోనీరు ..అమ్మానాన్నాను చూసి వెళతా! " బరువైన గుండెతో షాహిద్ దగ్గర సెలవు తీసుకుని బయలు దేరా. బస్సు లో కూర్చున్నా..ఏదో పోగొట్టుకున్న భావన ... దృవ్ కళ్ళలో..ద్రోహి అన్న భావన... ఎందుకో మరచిపోలేకున్నా! దృవ్ మంచి స్నేహితుడు ..మంచి మనిషి..వాడ్ని పోగొట్టుకోలేను ...వాడు నా నిజాయితిని గ్రహించి నప్పుడు కానీ నాకు ఓదార్పు లభించదు. బస్సు కదిలి వూరిబయటికి వచ్చింది. బరువైన గుండెతొ కళ్ళు మూసుకున్నా. ఒక్క కుదుపుతో బస్ ఆగింది..ఏదో గోల గోలగా కలకలం వినిపించింది కానీ నాకు కళ్ళు తెరవాలనిపించలేదు. ఒక చల్లని చేయి నన్ను సృజించినది..కళ్ళు తెరిచా.. ఎదురుగా పెళ్లి బట్టల్లోనే దృవ్... ఆ వెనకే షాహిద్..నా బ్యాగ్ తీసుకుని క్రిందికి లాక్కెళ్ళారు . రైట్ రైట్ అని గట్టిగా అరిచి బస్ ను పంపించేశారు. అయోమయంగా చూస్తున్న నన్ను ద్రువ్ హత్తుకున్నాడు. నాకర్థమయింది దృవ్ కేమి అర్థమయిందో !
"చెప్పకుండా వెళదామనే ..!" అంటూ నన్ను కార్లోకి లాక్కెళ్ళిపడేశారు. స్నేహితులందరూ గోల చేస్తుంటే, షాహిద్ ప్రక్కకు చూశా ! చిన్నగా నవ్వాడు. నా మనసు నిర్మలంగా ప్రశాంతంగా అయింది.
--
Published in Vemana Pathrika In April 2014
No comments:
Post a Comment