Sunday, 9 March 2014

గిలకల మంచం


"ఉదయ్ వున్నాడామ్మా .. ? " మా బాటని లెక్చరర్ సుబ్బారెడ్డి సార్ గొంతులా అనిపిస్తే షేవింగ్ చేసుకుంటున్న నేను బయటికి తొంగి చూశాను.


"వున్నారు రండి సార్" అంటూ అప్పటికే చరిత సార్ ను లోపలికి ఆహ్వానించింది.


"నమస్తే సర్ ... ఇప్పుడే వస్తాను .... చరితా సర్ కు కాఫీ ఇచ్చి మాట్లాడుతూ వుండు " అని షేవింగ్ ముగించి స్నానానికి వెళ్లాను.


స్నానం చేస్తూ సర్ ఎందుకొచ్చి ఉంటారో ఆలోచిస్తున్నాను. సర్ రిటైర్ అయి ప్రశాంత జీవితం సాగిస్తున్నారు. ఆయనకు నేనంటే చదువుకునే రోజుల నుండి ప్రత్యేకమైన అభిమానం, సెక్షన్ కటింగ్ నేను చాలా బాగా చేస్తానని ఇన్నేళ్ళ సర్వీస్ వున్నా... సర్ కూడా నాలా చేయలేనని మెచ్చుకుని, అందరికి నా రికార్డ్స్, నా సెక్షన్ కటింగ్ చూపించేవారు, ఇప్పుడు నేనున్న వీధి ప్రక్క వీధి లోనే వుంటారు కాబట్టి వాకింగ్ కి వెళుతూ, బజారుకు పోతూ కనపడి మాట్లాడుతారు. నా క్లాస్మేట్స్ సంగతులు అడుగు తుంటారు, తన పిల్లల గురించి చెబుతుంటారు. టీచర్స్ డే రోజో ఎవరైనా మా బిఎస్సీ క్లాస్మేట్స్ వస్తే లెక్చరర్ల గురించి చర్చ వస్తే, వాళ్ళుసుబ్బారెడ్డి సర్ ను చూడాలంటే, సర్ ఇంటికి తీసి కెళుతుంటాను, కానీ సర్ మా ఇంటికి వచ్చేది చాలా తక్కువ. ఆలోచిస్తూ బయటికి వచ్చేప్పటికి సర్ కాఫీ ముగించి పేపర్ చూస్తున్నారు.


"చెప్పండి సర్...ఆరోగ్యం ఎలావుంది? అమ్మగారు,నవీన్ ఎలా వున్నారు?"


"ఆ .. బావుంది .. అందరూ బావున్నారు ... ఉదయ్ నీతో పనుంది అలా బయటికి వెళదామా ?"


"టిఫిన్ చేసి వెళుదురు గానీ...ఉదయ్.. సర్ ను పోనీకండి "అంది చరిత


"లేదమ్మా నా టిఫిన్ అయింది ... ఉదయ్ పద "అన్నాడు బయటికి దారి తీస్తూ.


ఈ మధ్య పెద్దగా పరిశీలించలేదు కానీ సర్ బాగా నీరసించారు, వయసు పైబడ్డం వలనేమో వంగిపోయారు. జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నించినా తూలుతున్నారు. చేయి పట్టుకుని నడిపిస్తూ ... బయట లాన్ లో వున్నకుర్చీలో కూర్చోపెట్టా.


" ఉదయ్ నాకు నీవొక సాయం చేసి పెట్టాలి "


"చెప్పండి సర్' అన్నా ఆయన అడిగే సాయం ఏముంటుందో అన్నటెన్షన్ మాత్రం కలిగింది.


"మరేం లేదు ఉదయ్.....మా తాతల నాటి టేకు గిలకల మంచం ఒకటుండేది ,దాన్ని మా నాన్న గుర్తుగా చూసుకుంటున్నా,పురాతన వస్తువులంటే నాకిష్టం . దాని కాలు విరిగి పోతే రిపైర్ చేయమని సాయిబాబా థియేటర్ దగ్గరున్న ఒక కార్పెంటర్ కు ఇచ్చాను, వాడు నా టేకు మంచం కొట్టేసి ఏదో మంచానికి రంగేసి మీదే ఇది తీసుకుపొమ్మని మోసపు మాటలు చెబుతున్నాడు, నువ్వు వాడ్ని భయపెట్టి, నా మంచం నాకు ఇప్పించాలి. " దీనంగా అన్నాడు


వయసు పైబడిన అయన కళ్ళలో దీనత్వం చూసి నాకు మనస్సు చివుక్కుమంది, వృద్దాప్యం అంటేనే భయం వేసింది. మేము ఆయన్ని హీరోలా ఆరాధించేవాళ్ళం, నీట్ గా టక్ చేసుకుని ఉంగరాల జుట్టుతో చాలా అందంగా వుండేవారు. ఆడపిల్లలయితే ఆయన క్లాసంటే పడి చచ్చేవారు, ఆయన టీచింగ్ కూడా అద్భుతంగా వుండేది, క్లాస్ లో సరిగ్గా వినకున్నా, మాట్లాడినా, స్టూడెంట్స్ ను బయటికి పంపేవారు. ఆయనకు గండరగండడు అని పేరు పెట్టారట మా సీనియర్లు ,ఇప్పుడాయన ఎంత నెమ్మదిగా, నిస్సహాయంగా వున్నారో ... కాలం ఎంత గారడీ చేస్తుంది కదా! ఎంతవారైనా దానికి తలవంచాల్సినదే కదా !


నేను ఆ రోజుల్లో మాస్ హీరోలా ఎప్పుడూ గొడవలకు దిగేవాడ్ని, ఎవరైనా అమ్మాయిల్ని కామెంట్ చేసినా , జూనియర్లను సీనియర్లు ఏడిపించినా, వాళ్ళ తరపున నిలబడేవాడ్ని. చివరికి లెక్చరర్లను స్టూడెంట్స్ ఎవరైనా ఎదిరించినా నా ప్రమేయం తోనే వాళ్ళను సరిచేసేవాడ్ని. గొడవలు ,అల్లర్లు ,చేసినా అవన్నీమంచిని కాపాడడానికే చేస్తున్నానని గ్రహించిన వారంతా నన్ను కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశారు. కుర్రకాలం గడిచిపోయింది . బాధ్యతల బాట పట్టి ఇరైవై ఏళ్లయింది. బ్యాంక్ మానేజార్ గా నెమ్మదిగా వుండే వ్యక్తిగా పేరున్నా ,ఇవాళ సుబ్బారెడ్డి సర్ నా దగ్గర కొచ్చి కార్పెంటర్ ని బెదిరించమని అడుగు తున్నారంటే ఒకప్పుడు మనం నడిపిన జమానా వలనే.


"కార్పెంటర్ ను కలిసి నేను కనుక్కుంటాలే సర్...మీ మంచం తెప్పించే బాధ్యత నాది ,మీరు దిగులు పడొద్దు " అని చెప్పి సార్ ను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశాను.


బ్యాంక్ నుండి నేరుగా సాయిబాబా థియేటర్ దగ్గరున్న కార్పెంటర్ దగ్గరకు వెళ్లాను .


"సుబ్బారెడ్డి సార్ మంచం నీకేనా రిపేరు కిచ్చింది ? ఆయన టేకు మంచం ఏం చేశావ్? " .


"అయ్యో సార్ ఆయన మంచం రిపేరు చేసి పాలిష్ చేసి పెట్టాను ... విరిగిన మంచం కోళ్ళు మార్చాను ,గిలకలన్నీ ఊడిపోతే వాటిని తీసేసి కొత్త రీపర్ వేశాను ,ఇప్పుడాయన గిలకలు లేవు కాబట్టి అది నా మంచమే కాదంటున్నాడు చూడండి సార్ .... పైగా ఆ మంచం నేను కొట్టేయడానికి దాన్నెవరు కొంటారు సార్ ?... ఆయన కు చెప్పలేక నాకు తల వాచి పోతోంది,, ఆ మంచం చూసి మీరైనా ఆయనకు చెప్పండి సార్... " కార్పెంటర్ మొత్తు కున్నాడు.


కార్పెంటర్ చూపించిన మంచం చూస్తే అతను చెప్పినదాంట్లో నిజం వుందనిపించింది .కానీ సార్ ను సంతృప్తి పెట్టె విధంగా చేయడమే నా ధర్మం అనిపించింది.


"చూడయ్యా... ఆయన మా గురువు గారు ఆయనకు సంతోషం కలిగించే పద్దతిలో చేద్దాం ... ఆయన ముందు నిన్ను గట్టిగా అరుస్తాను, తిడతాను...ఆయనకు గిలకల మంచం తయారు చేసి పెట్టు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచుకో "


"సార్ ... మీరెందుకు... డబ్బిస్తారు ? ఆయన మంచమే అని నచ్చ చెప్పండి "


"అదంతా కుదర్దు లే, ఆయనకు నచ్చ చెబితే కాదు ఆయన నా నుండి ఆశించేది వేరే వుందిలే.... అచ్చంగా ఆయనిచ్చిన విధంగానే ఆ మంచానికి గిలకలు పెట్టేయ్ ... పేపర్ కొట్టి దాన్ని పాత మంచంలాగే చెయ్యి "


కార్పెంటర్ తలవూపాడు "సరే సార్ ఏదైనా పాత మంచం దొరికిచ్చుకుని ఆయన పాత గిలకల మంచంచేస్తానులెండి " వద్దంటున్నాబలవంతంగా అతని చేతిలో రెండు వేలు పెట్టి వచ్చా.

నాలుగు రోజుల తర్వాత సాయంత్రం సార్ ను తీసుకుని కార్పెంటర్ దగ్గర కెళ్లాను. ఈసారి, సార్ గొంతు ధైర్యంగా లేచింది.


"అది నా మంచం కాదు, మా తాతల నాటి గిలకల టేకు మంచం ... ఏదో ముసలాయన ఏం చేసుకుంటాడులే అని ధైర్యమా? ఇదిగో మా ఉదయ్ వచ్చాడు, వీడి సంగతి నీకు తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళని అదరగొట్టాడు ...నా టేకు గిలకల మంచం తెచ్చిస్తావా లేకుంటే మావాడి చేతుల్లో కాళ్ళు చేతులు విరగ్గొట్టు కుంటావా? "

కార్పెంటర్ భయం నటిస్తూ నా ప్రక్కచూశాడు.

"ఏమయ్యా! మా గురువు గారి మంచం ఏం చేశావ్? ఆయన టేకు మంచం ఇస్తే ఏదో ఇస్తానంటావట. ఏంటి సంగతి ..? మా సార్ మంచం తెచ్చివ్వు లేకపోతే ఇక్కడ పని చేసుకుని బ్రతుక లేవు...! "చాలా ఏళ్ళ క్రిందట మర్చిపోయిన రౌడీజం ప్రదర్శించడానికి, ఆహాకాదు ... నటించడానికి ప్రయత్నింఛి సార్ ప్రక్కకు చూశా.

ఆయన మొహం వెలిగి పోతోంది ... దర్పంగా కార్పెంటర్ ప్రక్కకు చూశాడు .

కార్పెంటర్ నవ్వును ఆపుకుంటూ భయం నటిస్తూ." సరే సార్ మీ గిలకల మంచం మూడు రోజుల్లో ఇస్తాను... ఎందుకు లెండి సార్ మళ్ళీ ఉదయ్ సార్ ను ఇబ్బంది పెడతారు", అన్నాడు.

సార్ మొహం దేదీప్యమానంగా వెలిగి పోతోంది."అది టేకుతో చేసిన గిలకల మంచం, ఎలా ఇచ్చానో అలాగే వుండాలి "అన్నాడు.

కార్పెంటర్ మారు మాటాడకుండా తల ఊపాడు.


"... అలా రా దారికి, మా వాడు వచ్చాక నా మంచం ఇస్తున్నావ్ లేకపోతే నన్ను లెక్క చేశావా ! అన్యాయం గెలవదు మేం మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తాం. పద...పద ఉదయ్" అని నా కారు కేసి నడిచాడు నా చెయ్యి పట్టుకుని.

మూడు రోజుల తర్వాత, సాయంత్రం మళ్ళీ ఇద్దరం కార్పెంటరు దగ్గరికి వెళ్లాం. చిత్రం ...భళారే విచిత్రంమంచాన్ని సార్ కోరుకున్నట్లే తయారు చేశాడు. గిలకలున్నాయి దానికి, పాలిష్ చేసి క్రొత్తగా వున్నమంచాన్ని మళ్ళీ పాత దాని లాగా చేశాడు. అతని నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కానీ ఏమీ ఎరగనట్లు "సార్ ఇది మీ మంచమేనా ?" అడిగాను.

"అవును , చూశావా ఉదయ్...ఇది నా మంచమే , దీన్ని దాచి వేరేది చూపించి మనల్ని బోల్తా కొట్టించాడు.ఆ రోజుల్లో ఎంత మంచి టేకు వాడారో ఎంత బాగా గిలకలు చేశారో... చూశావా .. నీవు రాక పోయినట్లయితే వీడు నా మంచం ఇచ్చేవాడు కాదు... థాంక్స్ రా ఉదయ్ ... "

"చూడయ్యా,, దీన్ని సార్ ఇంటికి పంపించు ... ఏదో మా సార్ మంచం ఇచ్చేశావు కాబట్టి వదిలేస్తున్నా ... ఇంకెవరికీ ఇలా చేయకు " కోపం నటించా .

"ఇదిగో మంచం రిపేరు చేశావు కదా... ఇంటికి పంపేందుకు బండి కి "అంటూ ఎంతో మరి కార్పెంటర్ చేతిలో పెట్టాడు. కార్పెంటర్ ఇచ్చింది ఎంతో చూసుకోకుండా జేబులో పెట్టుకున్నాడు.

సార్ ను ఇంటి దగ్గర వదిలి కార్పెంటర్ దగ్గరికి వెళ్లాను . చాలా థాంక్స్ బాబూ ...మరోలా అనుకోకు మా సార్ కోసం అలా చేయాల్సి వచ్చింది " అన్నా.


"మీకు చదువు చెప్పిన గురువంటే మీకెంత గౌరవం సార్ ...అయినా మిమ్మల్ని రౌడి అంటాడేమిటి ? ఇంతకు మీరేం చేస్తారు ? "రెండు వేలు వెనక్కి ఇస్తూ అన్నాడు.


"నేనా....బ్యాంక్ మానేజర్ని, కాలేజ్ రోజుల్లో మంచిని ఉద్ధరించాలని చేసిన పనికి వచ్చిన గుర్తింపు ... మా సార్ సంతోషం నాకు కావాలి. అది సరే గాని అంతా ఇచ్చేశావేంటి ? సార్ మంచం చాలా రిపేరు చేశావు కదా ! ".


"సార్... ఆ మంచం రిపేరు చేసినందుకు ఏదో ముట్టింది లెండి ..ఇంకా వద్దు . మీకు గురువంటే గౌరవం ఉన్నట్లే గురువుల్ని గౌరవించే మీలాంటి వాళ్ళంటే నాక్కూడా గౌరవం సార్ ... ,పెద్దగా చదువుకోలేదు నాకు గురువు లెవరూ గుర్తు లేరు" అన్నాడు చమర్చిన కళ్ళతో


ఆప్యాయంగా అతని బుజం తట్టి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ". కష్టజీవివి తప్పు లేదు తీసుకో .. బ్యాంక్ లో ఏదైనా లోన్ కావాలంటే రా ,నీలాంటి నిజాయితి కస్టమర్లు మాకు కావాలి. " అని చెప్పి రెండు వేలు అతని చేతుల్లో బలవంతంగా పెట్టి బయటికి వచ్చా.


--


ప్రచురణ : వేమన, జనవరి 2014

No comments:

Post a Comment