Sunday, 9 March 2014

అభిమాని


"రోషన్ ..నీ అభిమాన హీరోయిన్ శ్రీలత మన వూర్లో షూటింగ్ కోసం వచ్చిందోయ్ " అభి ఫోన్లో ఉత్సాహంగా అరిచాడు.


ఇరవై ఏళ్ళ క్రిందట ఈ సమాచారం కానీ అందివుంటే .... ఉన్నపాటున ఎగిరి గంతేసి పరిగెత్తేవాడ్ని, కానీ ఇప్పుడు అలా ఎగురుతే క్రింద పడతామేమో! కాళ్ళు విరుగుతాయామో !అని ఆలోచించే వయసుకు వచ్చాను. అయినా మనసు ఒక వింత అనుభూతికి లోనయ్యింది.

"చూద్దాం లేరా... ఆ రోజులు వేరే కదా...! నాకు కలవాలనిపిస్తే .నీకు ఫోన్ చేస్తాలే." ఫోన్ పెట్టాను.

శ్రీ లత ఇరవై ఏళ్ళ క్రిందట నా ఆరాధ్య దైవం, నా కలల రాణి. డిగ్రీ చదువుతూ వుండగా స్నేహితులతో ఎక్కువ సినిమాలు చూసే వాడ్ని. మెల్లిగా సినిమా చూడటం వ్యసనంగా మారింది. నాన్న పంపే డబ్బు సగానికి పైగా సినిమాలకే అయేది. అందరూ అభిమాన హీరోల్ని కీర్తిస్తుంటే నేను హీరోయిన్ శ్రీలతను మూగగా ఆరాధించేవాడ్ని. గదినిండా ఆమె ఫోటోలు పెట్టేవాడ్ని. ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది.


"ఎక్కడరా షూటింగ్ ?" ఉద్వేగం లేకపోయినా, కుతూహలం నన్నువదల లేదు.మళ్ళీ అభికి ఫోన్ చేశాను.


"మనూళ్ళో నేలే, మా పిన్ని కొడుకు శ్రీకాంత్ అసిస్టంట్ డైరెక్టర్ గా పని చేస్తాడు, వాడే చెప్పాడు శ్రీలత చాలాకాలం తర్వాత మళ్ళీ సినిమా చేస్తోందిట, మన కాలేజి రోజుల్లో నీవు పడి చచ్చే వాడివి కదా! గుర్తొచ్చావు. కలవాలనుకుంటే చెప్పు మా కజిన్ కు చెబుతాను .. తీసికెళ్ళి పరిచయం చేస్తాడు ...."


"చూడాలనిపిస్తే నీకు ఫోన్ చేస్తా... ఇప్పుడు బిజీ గా వున్నా ప్రాక్టికల్ ఎక్షామ్స్ వున్నాయి."


వారం రోజులు గడిచాయి. కాలేజ్ నుండి ఇంటికి వస్తుంటే, పాత కలెక్టర్ బంగళా దగ్గర ఏదో హడావుడి చూసి అక్కడ బైక్ ఆపి అడిగా. "షూటింగ్ జరుగుతోందట "అన్నారెవరో.


ఒక్క నిముషం మనసు పదిహేనేళ్ళ క్రిందట శ్రీలతను చూడటం కోసం పడిన అవస్థలు గుర్తు చేసుకుంది. నాకు తెలియ కుండానే నేను షూటింగ్ జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నా. అభికి ఫోన్ చేయ బోయి విరమించుకున్నా.


"శ్రీకాంత్.సార్...మిమ్మల్ని శ్రీలత మేడం పిలుస్తున్నారు..." అని ఓ కుర్రాడు గట్టిగా అరిచాడు.


ఓహ్హొ ఇతనే నన్నమాట శ్రీకాంత్ ...మాట్లాడిస్తేనో....అభి స్నేహితుడ్నని, చూద్దాం ఎలా స్పందిస్తాడో!..పైగా శ్రీలత ఇతన్ని పిలుస్తున్నారన్నాడు కదా!


నా విజిటింగ్ కార్డ్ వెనక ఫ్రెండ్ అఫ్ అభిరామ్ అని రాసిచ్చి శ్రీకాంత్ కు ఇవ్వమని పంపించా,అక్కడున్న ఒకబ్బాయితో.


మరు నిముషం లోనే శ్రీకాంత్ నా దగ్గరికి వచ్చాడు.


"రండి సార్ షూటింగ్ అయిపొయింది,మళ్ళీ గంట తర్వాత మొదలవుతుంది ."అంటూ నన్ను షామియానా వేసి వున్నచోటికి తీసికెళ్ళి కూర్చోబెట్టాడు.


"లేదు శ్రీకాంత్,..షూటింగ్ పై ఆసక్తి లేదు...శ్రీలత గారంటే చాలా ఇష్టo .. వీలయితే కలుద్దామని ... కానీ చాలా మంది ఆమెను కలవాలని వస్తారేమో...ఇబ్బందిగా ఉంటుందేమో కదా !"

"అందరూ హీరో హీరోయిన్లను చూడాలంటారు ,ఆమె నెవరు కలుస్తారు సర్ ... ఆమె ఫ్రీ గా వున్నారు.. రండి పరిచయం చేస్తాను, మంచావిడ .. "అంటూ గెస్ట్ హవుస్ కేసి నడిచాడు.

"లోపలికి వెళ్లి అడిగి వస్తాను సర్ " అని , శ్రీకాంత్ లోపలికి వెళ్ళాడు .

వెంటనే వచ్చి "రండి సార్ " అని లోపలికి తీసికెళ్ళాడు.

తెల్లటి కుర్తి పైజామా పై పసుపు పచ్చని చున్నీ లో నా అభిమాన నటి శివ్ ఖేర్ రాసిన "లివింగ్ విత్ ఆనర్" చదువుతోంది. నన్ను చూడగానే పుస్తకం క్రింద పెట్టి నిలుచుంది , నా ఫ్రెండ్ రోషన్ మేడం ... కాలేజ్ లో లెక్చరర్ , మీ అభిమాని, పరిచయం చేయాలని తీసుకొచ్చాను ..." అన్నాడు


"నమస్తే "అంది ఆమె చేతులు జోడించి.


"నమస్తే " అని చేతులు జోడించినా ఒకరకమైన ఉద్వేగం తో నాకు నోట మాట రాలేదు . "కూర్చోండి" ఆమె అనునయమైన గొంతు నాలో చాలా టెన్షన్ ని తగ్గించింది.

"మీరు మాట్లాడుతూ వుండండి ... కొద్ది సేపట్లో వస్తాను మేడం '" అన్నాడు శ్రీకాంత్.

"సరే వెళ్లి మీ పని చూసుకోండి " అంది శ్రీలత నా కేసి తిరిగి "మీరు కాలేజ్ లో లెక్చరర్ కదా ! ఏ సబ్జెక్ట్ ?"

"ఫిజిక్స్" అన్నా గొంతు సవరించుకుని.


"ఓహ్...చాలా కష్టమైన సబ్జక్ట్ ..నేను ఇంటర్లో చాలా కష్టపడ్డా ఫిజిక్స్ పాస్ అయేదానికి, ఇంకా నన్ను గుర్తు పెట్టుకునే అభిమానులున్నారా? నాకు చాలా సంతోషంగా వుంది రోషన్..ఈ సినిమా ప్రపంచం ఒక మాయా ప్రపంచం...ఇది లైం లైట్ లో వున్న వాళ్ళని మాత్రమే గౌరవిస్తుంది. ప్రజలు అంతే.. వెలుగుతున్న తారలనే చూస్తారు. ఇది సహజం. ఆరోజుల్లో నేను కూడా ఎవర్ని లెక్క చేసేదాన్ని కాదు...నిర్మాతలు క్యూలో నిలబడుతుంటే ఎవరికైనా అలాగే వుంటుంది, ఎంత ఎత్తుకు ఎదిగినా మళ్ళీ నిలబడడానికి భూమ్మీదకు రావసిందే కదా ! "

నేను నవ్వి వూర్కున్నా.

"మీ గురించి చెప్పండి రోషన్ "

"నా గురించి ఏమీ లేదండి. కాలేజ్,ఇల్లు, నా భార్య స్నేహ డాక్టర్, ఇద్దరు కూతుర్లు శ్రుతి,కృతి. తీరిక దొరికితే పుస్తకాలు చదువుతాను, పాత సినిమాలు చూస్తాను , ఇప్పుడు సినిమాలు అంత ఇష్టం లేదు...మీ సినిమా వచ్చాక చూస్తాను ."

శ్రీలత నవ్వింది ," నా గురించి తెలుసు కదా..మా వారు బిజినెస్ లో బిజీగా వుంటారు, అబ్బాయిలు కోమల్, నిర్మల్ మెడిసిన్ చదువుతున్నారు, సినిమా చేయాలని లేదు కానీ, నిర్మాత మా కుటుంబానికి స్నేహితుడు, ఆర్థికంగా దెబ్బతిన్నాడు, అతని అభ్యర్థనతో కాదనలేక రంగు వేసుకుంటున్నాను. "

ఆమె చాలా స్నేహంగా మాట్లాడే సరికి నాకు కొంత బెరుకు తగ్గింది


ఒకప్పుడు హైదరాబాద్ లో జరుగుతున్న షూటింగ్ లో శ్రీలతను కలవడానికి వెళ్లి నప్పుడు అక్కడి సెక్యూరిటీ ఎలా తోసేశారో...,శ్రీశైలంలో దైవ దర్శనానికి వచ్చిన శ్రీలతను చూడ్డానికి ప్రయత్నించినప్పుడు తగిలిన లాఠీ దెబ్బలు, ఆమెకు ఉత్తరం రాసి జవాబు కోసం చూసిన ఎదురు తెన్నులు, గదిలో అతికించిన శ్రీలత బొమ్మల్ని నాన్న వచ్చి చూసి చించి నప్పుడు కార్చిన కన్నీళ్లు ,శ్రీలత గురించి చెడు గా మాట్లాడిన స్నేహితుడ్ని కొట్టి వాడితో మళ్ళీ తిన్న దెబ్బలు, ఆమె పెళ్లి చేసుకుందని ఇంక సినిమాల్లో నటించదని పేపర్లో చదివి మౌనంగా రోదించిననప్పటి రోజుల గురించి చెప్పాను.


ఆమె సావధానంగా వినింది ... "రోషన్... ఎంతోమంది అభిమానుల కారణంగానే మేము ఎదిగాం ,మీ అభిమానం వలెనే మేం కోట్లు సంపాదించుకున్నాం, కానీ మేమెప్పుడూ అది గ్రహించలేదు , నేనే కాదు, చాలా మంది అది అప్పుడు గ్రహించరు.. నాకు మీ అభిమానం చెబుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి ...మీ అభిమానానికి కృతజ్ఞురాలిని,. "


శ్రీకాంత్ రాకతో ఇద్దరం మౌనం వహించాం. " ఇక వెళతాను శ్రీలతగారు. మీరు మళ్ళీ నటనలో ఉన్నత శిఖరాలకు చేరాలని ఆశిస్తున్నా."

"థాంక్స్...రోషన్ చెన్నై వస్తే కలవండి ఇదిగో నా కార్డ్..నా పర్సనల్ నంబర్ అది, బయటివారికి ఇవ్వను, మీకు మాత్రమే ఇచ్చాను "


"చాలా సంతోషంగా వుందండి, మిమ్మల్ని కలవడం, చెన్నై వస్తే కలుస్తాను...వుంటాను" ఆమె తో, శ్రీకాంత్ తో సెలవు తీసుకుని వచ్చాను.


నా మనసంతా ఆనందంతో నిండి పోయింది, కుర్ర వయసులో ఆమె అంటే వున్న మొహం, ఆమె ఫోటోలు చూసుకుంటూ రాత్రులు గంటలు గంటలు గడిపింది, క్లాసులో పాఠాలు వినకుండా సితారలో ఆమె బొమ్మలు చూస్తూ వుంటే లెక్చరర్ వచ్చి లాక్కుని చించి వేస్తే .. ఆపై ఆయన క్లాసుకే పోకుండా ఉండిపోవడం గుర్తొచ్చాయి. ఇప్పుడు ఆమెను చూస్తే ఎంత స్నేహభావం, గౌరవం కలిగాయో !


ఆ వయసు అలా, ఈ వయసుకు ఇలా,నవ్వొచ్చింది నాకు. ఒక మరపురాని మధుర భావన ఆమెను కలవడం ద్వారా కలుగుతుందని అనిపించేది. కానీ అలా లేదు ఒక చిన్ననాటి స్నేహితురాలిని చాలా కాలం తర్వాత కలిసినట్లుంది. నా బండి తీసి ఇంటికి బయలు దేరాను. విసురుగా వీస్తున్న గాలికి చేతిలోని విజిటింగ్ కార్డ్ జారి పోయి ... చూస్తుండగానే ఎక్కడో పడింది. కాసింత దిగులయినా ముందుకు సాగాను . కాలం ఎంత విచిత్రమైంది ? అంతా కాలం చేసే గారడీ. అదే ఆమె ... అదే నేను, కానీ భావోద్వేగాలు కాలంతో మారి పోయాయి.

గుప్పెడు మనసు


సెప్టంబరు రెండు ...నాకొక పీడకల ...నా జీవితంలో ఆ రోజు చేసిన గాయాన్ని మరువ లేను ..ఆ రోజు గడిచి పోయి మూడు నెలలైనా, అది మిగిల్చిన చేదు జ్ఞాపకాలు... వాటి కారణంగా చెదిరిన నా ప్రశాంతత !...ఎంత చీకూ చింతా లేని జీవితం నాది! ఒక్కసారి ఎంత అలజడి రేపింది ఆ రోజు! మామూలుగానే మొదటి పీరియడ్ మెకానికల్ బ్రాంచి కి క్లాసు తీసుకుంటున్నా... బయట అంతా కోలాహలం. అందరూ పరుగులా నడుస్తున్నారు. కొందరి ఏడుపులు కూడా వినపడడంతో బయటికి వచ్చాను. మోటార్ సైకిలు మీద వస్తున్న నాతో పాటు పని చేసే పీటర్, ప్రతిమలని కాలేజి దగ్గర లోనే లారి కొట్టేసి వెళ్ళిపోయింది. ఇద్దరు అక్కడే మరణించారు.

ఆరోజు వాళ్ళ పాప బెట్సి కి జ్వరం వస్తున్న కారణంగా - పర్మిషన్ తీసుకుని, హాస్పిటల్ లో చూపించి, స్కూల్లోదింపి, రాబోతూ మృత్యువు వాతపడ్డారు. రోజూ కళ్ళ ముందు కదలాడే ప్రతిమ, అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ నవ్వించే పీటర్ - ఇద్దరూ ఇకలేరు. ఒకరి కోసం ఒకరు తమ వారినందరినీ వదులుకున్నారు. ఎంతో సరదాగా తుళ్ళుతూ నవ్వుతూ వుండే - ఆ జంట రక్తపు మడుగులో రోడ్డుపై పడివున్నారు.హిమకర్ కు ఫోన్ చేసి ఏడ్చేసాను. పదినిముషాల్లో హిమకర్ సహాయంతో పోలీసులు రావడం, మార్చురికి తరలించడం అయింది. వాళ్ళ బంధువులెవరూ మాకు పెద్దగా తెలియదు. హిమకర్, వాళ్ళ సెల్ ఫోన్ లో వున్న నంబర్లు చూసి కొందరికి తెలియచేశాడేమో....!

ఆరేళ్లుగా ఒకటే చోట పనిచేస్తూ వాళ్ళిద్దరూ నాకు మంచి స్నేహితులు .తల్లి దండ్రుల అండ లేని ప్రతిమ అప్పుడప్పుడు వాళ్ళ గురించి బాధపడేది. పీటర్ తమిళ్ క్రిస్టియన్, ప్రతిమ హిందూ తెలుగమ్మాయి . ప్రేమ కు అడ్డు రాని కులమతాలు పెళ్ళికి అడ్డు వచ్చాయి. ప్రతిమ కన్వెర్ట్అయింది, కానీ ఇటు అత్త గారి మనసు గెలవలేక పోయింది. అటు కన్నవారి గుండెను కరిగించలేకపోయింది. భార్యాభర్తలు మాత్రం చాలా సంతోషంగా వుండేవాళ్ళు. వాళ్ళ పాప బెట్సికి ఎనిమిదేళ్ళు. మా పిల్లలు చదివే స్కూల్లోనే మూడవ తరగతి చదువుతోంది. సెలవుల్లో ఎక్కువ ప్రతిమ, బెట్సీ మా ఇంటిలోనే గడిపే వాళ్ళు. సొంత అపార్టుమెంట్ కూడా వదిలేసి మా ఇంటి దగ్గరకు మారాలని ఆలోచిస్తూ వుండే వారు. బజారుకు వెళ్ళాలన్నా, ఇంకెక్కడికి వెళ్ళాలన్నా ప్రతిమ తోనే వెళ్ళేదాన్ని. పీటర్ చాలా సరదా మనిషి ... ప్రపంచం అంతా చుట్టేయ్యాలని ఆశించేవాడు. ప్రతిమ,బెట్సీ అతని లోకం. వాళ్ళను అపురూపంగా చూసుకునేవాడు. ప్రతిమ మంచి అమ్మ్మాయి. ఎవరినైనా పలకరించి ..వాళ్ళ కష్టం సుఖం విచారించేది. స్టూడెంట్స్ తోను, స్టాఫ్ తోనూ ఎంతో బాగుండేది. అలాంటిది ఇప్పుడు ప్రతిమ నిర్జీవంగా మార్చురీ లో వుంది. పీటర్ తో చివరి ప్రయాణానికి సిద్ధంగా వుంది. హిమకర్ నన్ను ఇంటికి పంపించాలని చాలా ప్రయత్నించినా, నేను వెళ్ళలేక పోయాను .. కాలేజి స్టాఫ్, స్టూడెంట్స్ - అందరూ అక్కడే వున్నారు. అందరూ వాళ్ళ అన్నోన్యతను, మంచితనాన్ని గుర్తు చేసుకుంటున్నారు. కాల మెంత విచిత్రమైంది? నిన్ననే కదా ఎంత సరదాగా గడిపాం! ఇవాళ ...అయ్యో ! కన్ను మూసి తెరిచేలోగా ఎంత మారిపోయింది !

బెట్సి కి ఏమీ అర్థం కావడం లేదు. అమ్మమ్మ తాతయ్య ల దగ్గరకు కానీ, నానమ్మ దగ్గరకు కానీ వెళ్ళలేదు. నన్ను అంటి పెట్టుకుని ఉండి పోయింది. పదేళ్లుగా దూరంగా వున్న తల్లిదండ్రులు - బిడ్డల శవాల్నిచూసి కన్నీరు మున్నీరయ్యారు. పీటర్, ప్రతిమల చివరి యాత్రను చూసి తల్లడిల్లిన బెట్సి ని చూసి ఒక నిర్ణయానికి వచ్చాను. ప్రేయర్ మీటింగ్ అయేవరకు పీటర్, ప్రతిమల తల్లి దండ్రులు మా దగ్గరే వున్నారు. ఇద్దరి తల్లి దండ్రులు బెట్సిని తమతో తీసు కెళ్ల డానికి ప్రయత్నించారు. నా దగ్గరే వుంటుంది; కొద్దికాలం తర్వాత ఆలోచిద్దాం అన్నాను వాళ్ళతో. అందరూ దు:ఖంతో భారంగా వెళ్లి పోయారు. కొడుకును, కూతుర్ని పోగొట్టుకున్న ఆ వృద్ధుల్ని.... తల్లి దండ్రుల్ని పోగొట్టుకున్న బెట్సిని చూసి నాకు జీవితం పై విరక్తి కలిగింది. వివరించలేని దు:ఖం నన్ను వెంటాడ సాగింది. కాలేజికి వెళ్ళాలంటే కూడా మనసొప్ప లేదు. నా పిల్లల సంగతి పట్టించుకోలేదు. హిమకర్ బలవంతంగా అన్నం తినిపిస్తే తప్ప, తినడానికి కూడా వెళ్ళకుండా ఉండిపోయాను. బెట్సి మెల్లిగా కోలుకుంటోంది . స్వీటి, హానిలతో పాటు స్కూల్ కు వెళుతోంది. అపుడప్పుడు దిగులుగా వున్నా, నేను దగ్గరగా తీసుకుంటే మామూలవుతోంది.

కాలం అన్ని గాయాల్నిమాన్ప గలదు...నేను కొద్దిగా మామూలవుతున్నాను. హిమకర్ పడుతున్నబాధకూడా నన్ను కొంచం ఆలోచింప చేసింది. నా స్నేహితుల పట్ల అతను చూపిన ఆదరణకు నా మనసు ద్రవించింది.
"హిమూ..బెట్సిని మనమే పెంచుకుందాం. "
హిము పలక లేదు ...
"ఏంటి పలకవు ?
"చాలా రాత్రయింది పడుకో..... ఇలారా నా యెద పైకి .."
"ముందు ఇది చెప్పు బెట్సి ని మనమే...పెంచుకుందాం , మనకింకో కూతురుంది అనుకుందాం "
"బి ప్రాక్టికల్ ...మనకిద్దరు పాపలు, టెన్త్ కొచ్చారు..పెద్దగా అయారు..మనమూ నలభైలోకి వచ్చాం ..వాళ్ళిద్దరూ హాస్టల్ కి వెళ్తే ,మనం వెళ్ళాల్సి వుంటుంది.. పైగా ఆ అమ్మాయికి ఊహ తెలిసింది. ఏ మాత్రం తేడా కనపడినా బాధపడుతుంది . క్రిస్టియన్ అయిన ఆ అమ్మాయిని నీవు చర్చ్ కు తీసికొని వెళ్తావా ? నీవు నమ్మవు కాబట్టి మాన్పిస్తావా!? బెట్సి పేరు మారుస్తావా!? మన పోలికలు లేని ఆ పాపని మన పాప గా ఎలా ప్రపంచాన్ని నమ్మిస్తావు? రేపు పెళ్లి చేయడానికి ఏ పద్ధతి పాటిస్తావు? ఏ మతం వాడిని తెస్తావు ? ఏ పండుగ చేస్తావు ...ఏ ప్రార్థన చేపిస్తావు ? చెట్టంత కొడుకుని కోడల్ని పోగొట్టుకున్న ఆ వృద్దులకు ఈ అమ్మాయి ఓదార్పు నిస్తుంది. నీ స్నేహితుల పాప కాబట్టి మనకు బాధ్యత వుంది ..సహాయం చేద్దాం ..వెళ్లి చూసొద్దాం ..సెలవుల్లో తీసుకొద్దాం ..బాధ్యత తీసుకుని సరిగ్గా నెరవేర్చలేక పోవడం కంటే; బాధ్యత బయట వుండి సహాయం చేయడం మంచిది ." నెమ్మదిగా చెబుతున్నా, అతని మాటల్లో - స్పష్టంగా వున్న నిర్ణయం తెలుస్తోంది.
"లేదు...నేను నిర్ణయించుకున్నాను..వాళ్ళ నాయనమ్మ అమ్మమ్మలు - ప్రతిమ, పీటర్ నే ఆక్సెప్ట్ చేయలేకపోయారు. బెట్సీని ఇంకేం చూస్తారు !? బెట్సిని నేను అడాప్ట్ చేసుకుందామనుకుంటున్నా!" నేను నా మనసులో వున్న అభిప్రాయాన్ని స్పష్టంగానే చెప్పాను.
"వద్దు...ప్రశాంతమైన మన జీవితం లో అనవసరమైన గొడవలు రావడం నా కిష్టం లేదు. ఆ ఆలోచన వదిలేయ్."
"ఒక వేళ ఈ నిర్ణయం నీదయితే,,నేను సమర్థించే దాన్ని ..నేను సమర్ధించకున్నా నువ్వు చేసే వాడివి ."
"నేను ..మనిద్దరి బాధ్యత తో కూడు కున్న విషయాల్లో ఎప్పుడూ ఏక పక్ష నిర్ణయాలు తీసుకోలేదు. డోంట్ బి టూ ఎమోషనల్, బీ ప్రాక్టికల్ .,.."
"నేను కూడా నీలాగే చదువుకున్నా, జాబ్ చేస్తున్నా, సంపాదిస్తున్నా...కొన్ని నిర్ణయాలు చేయడం లో నాకెందుకు హక్కు లేదు? బెట్సి మనతో వుంటుంది. ఈ విషయంలో ఇంకేమి మాట్లాడవద్దు ..." కోపంగా హిమకర్ కి దూరంగా జరిగి పడుకున్నా .
"నాకిష్టం లేదని చెప్పాను. అంతేకాని నీకిష్ట మైంది చేయొద్దని చెప్పలేదు కదా...! ముందే జరిగిన దానికి ఎంతో నలిగి పోయావు. మళ్ళీ ఇవన్నీ ఆలోచించి మనసు పాడు చేసుకుని ఆరోగ్యం పోగొట్టుకోవద్దు ..కొద్ది కాలం జరిగాక ఆలోచిద్దాం లే "
"ఎంతకాలం అయినా నా నిర్ణయం లో మార్పు లేదు..." నా చేతిని అతని చేతుల్లోంచి లాక్కుని పడుకున్నా.
నాలో చెప్పలేనంత నిరాశ ..హిమకర్ లాంటి వున్నతుడే ఒక మంచి పనికి సపోర్టు ఇవ్వకపోతే ఇంకెవరిస్తారు...? కళ్ళముందు కదలాడే స్నేహితులు చనిపోతే, వాళ్ళ పాపని దగ్గర తీయలేని నా బ్రతుకెందుకు! ప్రపంచం లో ఇట్లాంటి మంచి పని చేయడానికి మహాత్ములే కావాలా! నేను హిము తో మాట్లాడలేదు ..ఒకసారి పలకరించబోతే నేను పలకలేదు ..తర్వాత తను కూడా మాట్లాడలేదు..ముభావంగా ఉండిపోయాడు. నేను టిఫిన్ కూడా తయారు చేయలేదు.ఇడ్లీలు తెచ్చి పెట్టాడు. స్వీటి, హాని, బెట్సి తిని స్కూల్ కు వెళ్లి పోయారు. నాకోసం పెట్టిన ఇడ్లీలు నేను తినకున్నా, హిము ఏమీ పిలవలేదు. సాధారణంగా నేను అలగడం, హిము నన్ను ప్రాధేయ పడడం మామూలే. తప్పు నాదైనా కూడా అతను సారీ చెప్పడం- నన్ను ప్రసన్నం చేసుకోవడం- మళ్ళీ అతని ప్రేమకు, నిజాయితీకి కరిగి పోయి నేను సారీ చెప్పడం - అంతా కొద్ది సేపే..... కానీ ఇది పెద్ద సంగతి అయింది. నేను కాలేజికి వెళ్లక పోతే హిమకర్ లంచ్ కి వస్తాడు, కానీ ఇవాళ రాలా ! ప్రతిమ పీటర్ల మరణం తో పాటు, నా మాటకు హిము విలువ ఇవ్వలేదన్న విషయం చాలా గాయపర్చింది. హిము యింత సామాన్యంగా ఆలోచించడం కూడా నన్నుచాలా బాధించింది. ఇంట్లో వుండాలని అనిపించలేదు. అమ్మకు ఫోన్ చేశా- మనసేం బాగాలేదు వస్తానని. అమ్మ రమ్మంది. అత్తగారికి ఫోన్ చేశా - కొద్ది రోజులు అమ్మా వాళ్ళింటికి వెళతాను- పిల్లలకి స్కూల్ దూరం - పైగా పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి - వచ్చి ఉండమని. ఎలాగూ వాళ్లకి ప్రతిమ పీటర్ ల మరణం గురించి తెలుసు కాబట్టి ..వచ్చేస్తామని చెప్పారు. సాయంత్రానికి అత్తా మామలు దిగారు. స్కూల్ నుండి పిల్లలు కూడా వచ్చారు. పిల్లలకు జాగ్రత్త చెప్పి, బెట్సిని తీసుకుని అమ్మ వాళ్ళింటికి వచ్చాను.

బెట్సిని స్కూల్ దగ్గర వదిలి కాలేజికి వెళ్ళా. ప్రతిమ, పీటర్ చనిపోయిన తర్వాత కాలేజికి వెళ్ళడం ఇదే మొదటి సారి. మా అనుబంధం తెలిసిన వారు నన్ను ఓదార్పుగా పలకరించారు. బెట్సి నా దగ్గరే ఉందన్న సంగతి తెలిసిన వారు బెట్సి భవిష్యత్తు గురించి అడిగారు. నాతోనే వుంటుందని గట్టిగా చెప్పలేకపోయాను. నాలో తీవ్రమైన అసంతృప్తి, నిరాశ, పట్టుదల పెరిగాయి. దాంతో ఘర్షణ కూడా పెరిగింది. హిము ఫోన్ చేస్తే కూడా నేను తీయలేదు. ఇంత మొండిగా నేనెప్పుడూ లేను. కానీ ఎందుకో పంతంగా వుంది. కోపంగా వుంది. చెప్పలేని నిరాశ. నా బాధని హిము అర్థం చేసుకోలేదనే ఆవేదన.... నాకున్న ఏకైక ప్రాణమిత్రుడు హిమునే. అతను కూడా నేను ఇలా వున్నప్పుడు ...ఎందుకు బాధించాలి?

కాలేజ్ నుండి అమ్మవాళ్ళ ఇంటికి వచ్చేశా. బెట్సిని తీసుకోచ్చేది మర్చిపోయా! నా మతి మరుపుకు నాపై నాకు కోపం, నా ఆలోచనా రాహిత్యానికి , నా మానసిక స్థితికి, నేను అంగీకరించలేని- ప్రతిమ పీటర్ల మరణమే కారణం. లోపల పెట్టిన కారుని తీస్తుండగా హిము వచ్చాడు, బెట్సీని తీసుకుని..కొద్దిగా సిగ్గనిపించింది.
"నువ్వు రాలేదేం ఆంటీ ..చాలా సేపు చూసి అంకుల్ కు ఫోన్ చేసింది మా మేడం .."అంది బెట్సీ హిము వొళ్ళో కూర్చుని. అమ్మ హిముకు కాఫీ తెచ్చిచ్చింది . నేనేమీ మాట్లాడలేదు హిముతో.
"ఎప్పుడొస్తావు?..అన్నాడు.
నవ్వి వూర్కున్నా.
"వెళ్ళొస్తాను అత్త గారు ..ఉంటాను డియర్ ..బై బెట్సీ ..."
"నేనొస్తా అంకుల్ ..నాకిక్కడ బాగాలేదు" బెట్సీ వెళ్లి హిము చెయ్యి పట్టుకుంది. నాకు ఒక నిముషం ఏమీ అర్థం కాలా!
"వద్దు నాన్నా, మీ ఆంటీకి తోడుగా వుండాలి కదా! నాకు బయట పనుంది. మళ్ళీ అక్క వాళ్ళనికూడా తీసుకు రావాలి కదా ! ఎప్పుడైనా నేను కానీ, అంటీ కానీ రాలేక పోతే, అక్కవాళ్ళు వచ్చేంత వరకు ఆడుకుని వాళ్ళతో ఆటో లో వచ్చేయి. కంగారు పడకు సరేనా ..!" బుజ్జగించి వెళ్లి పోయాడు.
బెట్సీ హిము కొనిచ్చిన చాక్లెట్స్ తింటూ కూర్చుంది...
"అన్ని చాక్లెట్స్ తింటే పళ్ళు పాడవుతాయమ్మా!"కొన్ని తీసుకోబోయా ..
"వుహూ అంకుల్ నాకోసమే కొనిచ్చారు .".దూరంగా వెళ్ళింది... పీటర్ ఎన్ని చాక్లెట్స్ కోనేవాడో గుర్తొచ్చింది ! వివరించలేని బాధ ఏదో గుండెల్లో చేరి బరువుగా వుంది.

తలనొప్పిగా వుందని పడుకున్నా... అమ్మ వచ్చి ప్రక్కన కూర్చుంది. అమ్మ వొడిలోకి తల పెట్టుకున్నా .." ఎందుకలా కుమిలి పోతున్నావు - మనం చేయగలిగింది ఏముంది చెప్పు? హిమకర్ చెప్పాడు - నువ్వు ఆ సంఘటనకు తట్టుకోలేక పోతున్నావని .... కొన్ని రోజులు నిన్ను రమ్మని పిలవమని చెప్పాడు .. ఇంతలో నీవే వచ్చావు .." అమ్మ అనునయ వాక్యాలకు నాకు దు:ఖం ఆగలేదు. అమ్మ తల నిమురుతూ వుండి పోయింది.
హిమకర్, పిల్లలు వస్తున్నారు - పోతున్నారు. నేను మాత్రం ఎవ్వరితోని మామూలుగా ఉండలేక పోతున్నా! బెట్సీ కూడా దిగులుగా ఉంటోంది, ..అక్కడుంటే స్వీటి హానీలతో ఆడుకుంటూ కొంచెం బాగుండేది. హిముకు, పిల్లలకు దూరంగా ఎంతకాలం ఉండగలను ? బెట్సీ విషయం ఎలా పరిష్కరించడం ? ఆలోచించి.. ఆలోచించి బుర్ర వేడెక్కడం తప్ప, ఏమీ అర్థం కావడం లేదు.

"ఆంటీ... మమ్మీ డాడి జీసస్ దగ్గర ఉంటారా? క్రిస్టమస్ కి దేవుడు పుడతాడు కదా, అప్పుడు మమ్మీ డాడీని ని మన దగ్గరకు పంపుతాడా!" బెట్సీ ప్రశ్నకు నాకేమి చెప్పాలో తోచలేదు.
బెట్సీ మనసు మరలించేందుకు బయటికి తీసికొని వెళ్ళి మంచి గౌన్లు కొనిచ్చా..అవి ట్రయల్ రూం లో వేసుకుని చూసి మురిసిపోయింది. బొమ్మలు కొనిచ్చి మరింత సంతోష కలిగేట్టు చేసి ఇంటికి తీసుకొచ్చా. కార్లోనే నిద్రపోయింది బెట్సీ . ఎంత ప్రయత్నించినా లేవ లేదు. ఎత్తుకుని రావడానికి నాకు చాత కాలేదు. ఇంట్లోకి వచ్చి అన్నయ్యకు చెబితే, ఎత్తుకొచ్చి నా బెడ్ మీద పడుకో బెట్టాడు. బెట్సీ ప్రక్కనే పడుకున్నా. ఆలోచనలు గమ్యం లేనివి, అర్థం లేనివి- చుట్టుముట్టాయి. అలాగే నిద్రపోయా ..ఎప్పుడో అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. హిమకర్ కోసం చేతులు వెతికాయి...బెట్సీ గట్టిగా పట్టుకుంది.
నిరాశగా పడుకున్నా ..హిమకర్ కి ఫోన్ చేద్దామని ఫోన్ తీసుకున్నా ..మళ్ళీ ఏదో అభిమానం నన్ను వెనక్కి లాగింది.
నిద్ర మత్తులో అమ్మా ..అమ్మా అన్న పిలుపు తో లేచా....ఎదురుగా స్వీటి, హాని. ఇద్దర్ని దగ్గరగా తీసుకున్నా ..!
"ఎలా వున్నారు? ..నానమ్మ తాతయ్య బాగున్నారా ?"
"రాత్రి నాన్న వాళ్ళని వూరి దగ్గర డ్రాప్ చేసి వచ్చారు. నీకు ఫోన్ చేస్తే నువ్వు ఫోన్ ఇంట్లో పెట్టి షాప్ కెళ్లావని అమ్మమ్మ చెప్పింది. అమ్మా మన ఇంటికి వెళదాం .. ప్లీజ్ ...ఇలా చూడు బెట్సీ కొత్త డ్రెస్సులో ఎంత బాగుందో ...!" స్వీటి అంది.
నాకు డ్రెస్సు చూపించి పరుగున వెళ్లి పోయింది . బయటికి వచ్చేప్పటికి హిమకర్ వొడిలో వుంది. బెట్సీ చేతుల్లో బోలెడు చాక్లెట్లు.
"హ్యాపీ క్రిస్మస్ ..".నవ్వుతూ విష్ చేసాడు హిమకర్.
"విష్ యు ది సేమ్ " అన్నా.
"అమ్మా ఇంటికి వెళుతున్నా... మళ్ళీ సాయంత్రం వస్తా .."అన్నా.
"అదేంటి..అల్లుడు గారితో ఏదైనా గొడవా ? " అనుమానంగా అంది అమ్మ.
మాట్లాడకుండా వచ్చి నా కారులో కూర్చున్నా..పిల్లలు నా తోనే వచ్చారు. హిము నవ్వుకుంటూ "పార్టీ ఫిరాయింపా " అన్నాడు. ముగ్గురూ ఒకటే అల్లరి. బెట్సీ ఆనందం చూసి కొంచెం తేలిగ్గా అనిపించినా, మళ్ళీ, ప్రతిమ,పీటర్ క్రిస్మస్ చేసే హడావుడి అంతా గుర్తొచ్చిమనసు వికలమైంది. ఇంట్లోకి రాగానే నన్ను హాల్ లోకి లాక్కెళ్ళారు పిల్లలు. అక్కడ క్రిస్మస్ చెట్టు ఎంతో బాగా అలంకరించారు.
"అంతా నాన్న చేసారమ్మా..నానమ్మ తాతయ్య కు ఇష్టం ఉండదని వాళ్ళని వూరికి పంపించారు ..స్టార్ కూడా కట్టామమ్మా... చూద్దువురా !"అన్నది హాని.
పిల్లలు వరండాలో కట్టిన స్టార్ చూపించారు .హిమకర్ నవ్వు తూ నన్ను చూస్తున్నాడు.
"మేము చర్చ్ కి వెళ్తున్నాం, వస్తావా అమ్మా" అన్నారు పిల్లలు .
హిమకర్ కేసి చూశా! రావా! అన్నట్లు చూసాడు.
చర్చ్ లో మమ్మల్ని చూసి చాలా మంది ఆశ్చర్య పోయారు. ..తర్వాత బెట్సీ సంగతి తెలుసుకుని కొందరు సమాధానపడ్డారు.
ఇంటికి వచ్చాక హిమూను చూడాలంటేనే సిగ్గుగా అనిపించింది . అతని మహోన్నత వ్యక్తిత్వం ముందర నేను సూర్యుని ముందు దివిటి లాగా అనిపించాను. ...పిల్లలు టీవీలో ఏదో చూస్తుండగా హిముని పిలిచాను. దగ్గరగా వచ్చాడు. అతని చుట్టూ చేతులు వేసి అతని గుండెల్లో తలదాచుకున్నా! ఇన్నిరోజులు అనుభవించిన అశాంతి అంతా పోయింది. భార్య భర్తల దగ్గరితనాన్నిదూరం చేయగల వేవీ లేవు ..నిజానికి ఇలాంటివి - కొద్ది దూరాన్ని తెచ్చి అతి దగ్గర చేస్తాయి.
"నీ ఇష్టం.. నీకు నచ్చినట్లు చెయ్యి. నీకూ, అందరికి సంతోషం కలిగేలా చెయ్యి ..కానీ నువ్వు బాధపడకు. నిన్ను బాధపెట్టానంటే నా జీవితం వృధా! నీజీవితం లో ఆనందం నింపుతానన్న నా వాగ్దానాన్ని నేనెప్పుడూ మరువను. బెట్సిని నేను మన బిడ్డగా అంగీకరిస్తున్నాను...లీగల్ గా కూడా కావాలంటే చేద్దాం...... నిజమే నీకు నిర్ణయం చేసే హక్కు వుంది. కాదన్నందుకు సారీ ! "
"వద్దు హిమూ..నీవు చెప్పిందే కరెక్ట్ ...బెట్సిని పీటర్ వాళ్ళ తల్లిదండ్రులకే ఇద్దాం . వాళ్ళ సంప్రదాయాలతో, వాళ్ళ మతాచారాలతో, వాళ్ళ రక్త సంబంధం తోనే పెరగనీ . సెలవుల్లో తెచ్చుకుందాం ..వెళ్లి చూసివద్దాం ..మనం సరిగ్గా న్యాయం చేయలేనప్పుడు బాధ్యత బరువవుతుంది ..అప్పుడు మనం బెట్సికి న్యాయం కంటే అన్యాయం ఎక్కువ చేసిన వాళ్ళ మవుతాం." నా ఆలోచనల్లో వచ్చిన మార్పును..చెప్పేసాను.
"ఒకే ..ఒకే.. డోంట్ వర్రీ ! బెట్సికి అన్నీ మంచిగా జరిగేలా చేస్తాను. బెట్సీ పట్ల నా బాధ్యతను ఎప్పుడూ విస్మరించను... .ప్రామిస్." నా చేతిని తీసుకుంటూ అన్నాడు హిము.
"ఛ ప్రామిస్ ఎందుకు? నీ మాటే - నీ ప్రామిస్ నాకు తెలుసు." అతని గుండెలపై నిశ్చింతను అనుభవిస్తూ అన్నాను.


గిలకల మంచం


"ఉదయ్ వున్నాడామ్మా .. ? " మా బాటని లెక్చరర్ సుబ్బారెడ్డి సార్ గొంతులా అనిపిస్తే షేవింగ్ చేసుకుంటున్న నేను బయటికి తొంగి చూశాను.


"వున్నారు రండి సార్" అంటూ అప్పటికే చరిత సార్ ను లోపలికి ఆహ్వానించింది.


"నమస్తే సర్ ... ఇప్పుడే వస్తాను .... చరితా సర్ కు కాఫీ ఇచ్చి మాట్లాడుతూ వుండు " అని షేవింగ్ ముగించి స్నానానికి వెళ్లాను.


స్నానం చేస్తూ సర్ ఎందుకొచ్చి ఉంటారో ఆలోచిస్తున్నాను. సర్ రిటైర్ అయి ప్రశాంత జీవితం సాగిస్తున్నారు. ఆయనకు నేనంటే చదువుకునే రోజుల నుండి ప్రత్యేకమైన అభిమానం, సెక్షన్ కటింగ్ నేను చాలా బాగా చేస్తానని ఇన్నేళ్ళ సర్వీస్ వున్నా... సర్ కూడా నాలా చేయలేనని మెచ్చుకుని, అందరికి నా రికార్డ్స్, నా సెక్షన్ కటింగ్ చూపించేవారు, ఇప్పుడు నేనున్న వీధి ప్రక్క వీధి లోనే వుంటారు కాబట్టి వాకింగ్ కి వెళుతూ, బజారుకు పోతూ కనపడి మాట్లాడుతారు. నా క్లాస్మేట్స్ సంగతులు అడుగు తుంటారు, తన పిల్లల గురించి చెబుతుంటారు. టీచర్స్ డే రోజో ఎవరైనా మా బిఎస్సీ క్లాస్మేట్స్ వస్తే లెక్చరర్ల గురించి చర్చ వస్తే, వాళ్ళుసుబ్బారెడ్డి సర్ ను చూడాలంటే, సర్ ఇంటికి తీసి కెళుతుంటాను, కానీ సర్ మా ఇంటికి వచ్చేది చాలా తక్కువ. ఆలోచిస్తూ బయటికి వచ్చేప్పటికి సర్ కాఫీ ముగించి పేపర్ చూస్తున్నారు.


"చెప్పండి సర్...ఆరోగ్యం ఎలావుంది? అమ్మగారు,నవీన్ ఎలా వున్నారు?"


"ఆ .. బావుంది .. అందరూ బావున్నారు ... ఉదయ్ నీతో పనుంది అలా బయటికి వెళదామా ?"


"టిఫిన్ చేసి వెళుదురు గానీ...ఉదయ్.. సర్ ను పోనీకండి "అంది చరిత


"లేదమ్మా నా టిఫిన్ అయింది ... ఉదయ్ పద "అన్నాడు బయటికి దారి తీస్తూ.


ఈ మధ్య పెద్దగా పరిశీలించలేదు కానీ సర్ బాగా నీరసించారు, వయసు పైబడ్డం వలనేమో వంగిపోయారు. జాగ్రత్తగా నడవడానికి ప్రయత్నించినా తూలుతున్నారు. చేయి పట్టుకుని నడిపిస్తూ ... బయట లాన్ లో వున్నకుర్చీలో కూర్చోపెట్టా.


" ఉదయ్ నాకు నీవొక సాయం చేసి పెట్టాలి "


"చెప్పండి సర్' అన్నా ఆయన అడిగే సాయం ఏముంటుందో అన్నటెన్షన్ మాత్రం కలిగింది.


"మరేం లేదు ఉదయ్.....మా తాతల నాటి టేకు గిలకల మంచం ఒకటుండేది ,దాన్ని మా నాన్న గుర్తుగా చూసుకుంటున్నా,పురాతన వస్తువులంటే నాకిష్టం . దాని కాలు విరిగి పోతే రిపైర్ చేయమని సాయిబాబా థియేటర్ దగ్గరున్న ఒక కార్పెంటర్ కు ఇచ్చాను, వాడు నా టేకు మంచం కొట్టేసి ఏదో మంచానికి రంగేసి మీదే ఇది తీసుకుపొమ్మని మోసపు మాటలు చెబుతున్నాడు, నువ్వు వాడ్ని భయపెట్టి, నా మంచం నాకు ఇప్పించాలి. " దీనంగా అన్నాడు


వయసు పైబడిన అయన కళ్ళలో దీనత్వం చూసి నాకు మనస్సు చివుక్కుమంది, వృద్దాప్యం అంటేనే భయం వేసింది. మేము ఆయన్ని హీరోలా ఆరాధించేవాళ్ళం, నీట్ గా టక్ చేసుకుని ఉంగరాల జుట్టుతో చాలా అందంగా వుండేవారు. ఆడపిల్లలయితే ఆయన క్లాసంటే పడి చచ్చేవారు, ఆయన టీచింగ్ కూడా అద్భుతంగా వుండేది, క్లాస్ లో సరిగ్గా వినకున్నా, మాట్లాడినా, స్టూడెంట్స్ ను బయటికి పంపేవారు. ఆయనకు గండరగండడు అని పేరు పెట్టారట మా సీనియర్లు ,ఇప్పుడాయన ఎంత నెమ్మదిగా, నిస్సహాయంగా వున్నారో ... కాలం ఎంత గారడీ చేస్తుంది కదా! ఎంతవారైనా దానికి తలవంచాల్సినదే కదా !


నేను ఆ రోజుల్లో మాస్ హీరోలా ఎప్పుడూ గొడవలకు దిగేవాడ్ని, ఎవరైనా అమ్మాయిల్ని కామెంట్ చేసినా , జూనియర్లను సీనియర్లు ఏడిపించినా, వాళ్ళ తరపున నిలబడేవాడ్ని. చివరికి లెక్చరర్లను స్టూడెంట్స్ ఎవరైనా ఎదిరించినా నా ప్రమేయం తోనే వాళ్ళను సరిచేసేవాడ్ని. గొడవలు ,అల్లర్లు ,చేసినా అవన్నీమంచిని కాపాడడానికే చేస్తున్నానని గ్రహించిన వారంతా నన్ను కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ గా చేశారు. కుర్రకాలం గడిచిపోయింది . బాధ్యతల బాట పట్టి ఇరైవై ఏళ్లయింది. బ్యాంక్ మానేజార్ గా నెమ్మదిగా వుండే వ్యక్తిగా పేరున్నా ,ఇవాళ సుబ్బారెడ్డి సర్ నా దగ్గర కొచ్చి కార్పెంటర్ ని బెదిరించమని అడుగు తున్నారంటే ఒకప్పుడు మనం నడిపిన జమానా వలనే.


"కార్పెంటర్ ను కలిసి నేను కనుక్కుంటాలే సర్...మీ మంచం తెప్పించే బాధ్యత నాది ,మీరు దిగులు పడొద్దు " అని చెప్పి సార్ ను ఇంటి దగ్గర దిగబెట్టి వచ్చేశాను.


బ్యాంక్ నుండి నేరుగా సాయిబాబా థియేటర్ దగ్గరున్న కార్పెంటర్ దగ్గరకు వెళ్లాను .


"సుబ్బారెడ్డి సార్ మంచం నీకేనా రిపేరు కిచ్చింది ? ఆయన టేకు మంచం ఏం చేశావ్? " .


"అయ్యో సార్ ఆయన మంచం రిపేరు చేసి పాలిష్ చేసి పెట్టాను ... విరిగిన మంచం కోళ్ళు మార్చాను ,గిలకలన్నీ ఊడిపోతే వాటిని తీసేసి కొత్త రీపర్ వేశాను ,ఇప్పుడాయన గిలకలు లేవు కాబట్టి అది నా మంచమే కాదంటున్నాడు చూడండి సార్ .... పైగా ఆ మంచం నేను కొట్టేయడానికి దాన్నెవరు కొంటారు సార్ ?... ఆయన కు చెప్పలేక నాకు తల వాచి పోతోంది,, ఆ మంచం చూసి మీరైనా ఆయనకు చెప్పండి సార్... " కార్పెంటర్ మొత్తు కున్నాడు.


కార్పెంటర్ చూపించిన మంచం చూస్తే అతను చెప్పినదాంట్లో నిజం వుందనిపించింది .కానీ సార్ ను సంతృప్తి పెట్టె విధంగా చేయడమే నా ధర్మం అనిపించింది.


"చూడయ్యా... ఆయన మా గురువు గారు ఆయనకు సంతోషం కలిగించే పద్దతిలో చేద్దాం ... ఆయన ముందు నిన్ను గట్టిగా అరుస్తాను, తిడతాను...ఆయనకు గిలకల మంచం తయారు చేసి పెట్టు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గరుంచుకో "


"సార్ ... మీరెందుకు... డబ్బిస్తారు ? ఆయన మంచమే అని నచ్చ చెప్పండి "


"అదంతా కుదర్దు లే, ఆయనకు నచ్చ చెబితే కాదు ఆయన నా నుండి ఆశించేది వేరే వుందిలే.... అచ్చంగా ఆయనిచ్చిన విధంగానే ఆ మంచానికి గిలకలు పెట్టేయ్ ... పేపర్ కొట్టి దాన్ని పాత మంచంలాగే చెయ్యి "


కార్పెంటర్ తలవూపాడు "సరే సార్ ఏదైనా పాత మంచం దొరికిచ్చుకుని ఆయన పాత గిలకల మంచంచేస్తానులెండి " వద్దంటున్నాబలవంతంగా అతని చేతిలో రెండు వేలు పెట్టి వచ్చా.

నాలుగు రోజుల తర్వాత సాయంత్రం సార్ ను తీసుకుని కార్పెంటర్ దగ్గర కెళ్లాను. ఈసారి, సార్ గొంతు ధైర్యంగా లేచింది.


"అది నా మంచం కాదు, మా తాతల నాటి గిలకల టేకు మంచం ... ఏదో ముసలాయన ఏం చేసుకుంటాడులే అని ధైర్యమా? ఇదిగో మా ఉదయ్ వచ్చాడు, వీడి సంగతి నీకు తెలియదు. పెద్ద పెద్ద వాళ్ళని అదరగొట్టాడు ...నా టేకు గిలకల మంచం తెచ్చిస్తావా లేకుంటే మావాడి చేతుల్లో కాళ్ళు చేతులు విరగ్గొట్టు కుంటావా? "

కార్పెంటర్ భయం నటిస్తూ నా ప్రక్కచూశాడు.

"ఏమయ్యా! మా గురువు గారి మంచం ఏం చేశావ్? ఆయన టేకు మంచం ఇస్తే ఏదో ఇస్తానంటావట. ఏంటి సంగతి ..? మా సార్ మంచం తెచ్చివ్వు లేకపోతే ఇక్కడ పని చేసుకుని బ్రతుక లేవు...! "చాలా ఏళ్ళ క్రిందట మర్చిపోయిన రౌడీజం ప్రదర్శించడానికి, ఆహాకాదు ... నటించడానికి ప్రయత్నింఛి సార్ ప్రక్కకు చూశా.

ఆయన మొహం వెలిగి పోతోంది ... దర్పంగా కార్పెంటర్ ప్రక్కకు చూశాడు .

కార్పెంటర్ నవ్వును ఆపుకుంటూ భయం నటిస్తూ." సరే సార్ మీ గిలకల మంచం మూడు రోజుల్లో ఇస్తాను... ఎందుకు లెండి సార్ మళ్ళీ ఉదయ్ సార్ ను ఇబ్బంది పెడతారు", అన్నాడు.

సార్ మొహం దేదీప్యమానంగా వెలిగి పోతోంది."అది టేకుతో చేసిన గిలకల మంచం, ఎలా ఇచ్చానో అలాగే వుండాలి "అన్నాడు.

కార్పెంటర్ మారు మాటాడకుండా తల ఊపాడు.


"... అలా రా దారికి, మా వాడు వచ్చాక నా మంచం ఇస్తున్నావ్ లేకపోతే నన్ను లెక్క చేశావా ! అన్యాయం గెలవదు మేం మళ్ళీ మూడు రోజుల తర్వాత వస్తాం. పద...పద ఉదయ్" అని నా కారు కేసి నడిచాడు నా చెయ్యి పట్టుకుని.

మూడు రోజుల తర్వాత, సాయంత్రం మళ్ళీ ఇద్దరం కార్పెంటరు దగ్గరికి వెళ్లాం. చిత్రం ...భళారే విచిత్రంమంచాన్ని సార్ కోరుకున్నట్లే తయారు చేశాడు. గిలకలున్నాయి దానికి, పాలిష్ చేసి క్రొత్తగా వున్నమంచాన్ని మళ్ళీ పాత దాని లాగా చేశాడు. అతని నైపుణ్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయాను. కానీ ఏమీ ఎరగనట్లు "సార్ ఇది మీ మంచమేనా ?" అడిగాను.

"అవును , చూశావా ఉదయ్...ఇది నా మంచమే , దీన్ని దాచి వేరేది చూపించి మనల్ని బోల్తా కొట్టించాడు.ఆ రోజుల్లో ఎంత మంచి టేకు వాడారో ఎంత బాగా గిలకలు చేశారో... చూశావా .. నీవు రాక పోయినట్లయితే వీడు నా మంచం ఇచ్చేవాడు కాదు... థాంక్స్ రా ఉదయ్ ... "

"చూడయ్యా,, దీన్ని సార్ ఇంటికి పంపించు ... ఏదో మా సార్ మంచం ఇచ్చేశావు కాబట్టి వదిలేస్తున్నా ... ఇంకెవరికీ ఇలా చేయకు " కోపం నటించా .

"ఇదిగో మంచం రిపేరు చేశావు కదా... ఇంటికి పంపేందుకు బండి కి "అంటూ ఎంతో మరి కార్పెంటర్ చేతిలో పెట్టాడు. కార్పెంటర్ ఇచ్చింది ఎంతో చూసుకోకుండా జేబులో పెట్టుకున్నాడు.

సార్ ను ఇంటి దగ్గర వదిలి కార్పెంటర్ దగ్గరికి వెళ్లాను . చాలా థాంక్స్ బాబూ ...మరోలా అనుకోకు మా సార్ కోసం అలా చేయాల్సి వచ్చింది " అన్నా.


"మీకు చదువు చెప్పిన గురువంటే మీకెంత గౌరవం సార్ ...అయినా మిమ్మల్ని రౌడి అంటాడేమిటి ? ఇంతకు మీరేం చేస్తారు ? "రెండు వేలు వెనక్కి ఇస్తూ అన్నాడు.


"నేనా....బ్యాంక్ మానేజర్ని, కాలేజ్ రోజుల్లో మంచిని ఉద్ధరించాలని చేసిన పనికి వచ్చిన గుర్తింపు ... మా సార్ సంతోషం నాకు కావాలి. అది సరే గాని అంతా ఇచ్చేశావేంటి ? సార్ మంచం చాలా రిపేరు చేశావు కదా ! ".


"సార్... ఆ మంచం రిపేరు చేసినందుకు ఏదో ముట్టింది లెండి ..ఇంకా వద్దు . మీకు గురువంటే గౌరవం ఉన్నట్లే గురువుల్ని గౌరవించే మీలాంటి వాళ్ళంటే నాక్కూడా గౌరవం సార్ ... ,పెద్దగా చదువుకోలేదు నాకు గురువు లెవరూ గుర్తు లేరు" అన్నాడు చమర్చిన కళ్ళతో


ఆప్యాయంగా అతని బుజం తట్టి నా విజిటింగ్ కార్డ్ ఇచ్చి ". కష్టజీవివి తప్పు లేదు తీసుకో .. బ్యాంక్ లో ఏదైనా లోన్ కావాలంటే రా ,నీలాంటి నిజాయితి కస్టమర్లు మాకు కావాలి. " అని చెప్పి రెండు వేలు అతని చేతుల్లో బలవంతంగా పెట్టి బయటికి వచ్చా.


--


ప్రచురణ : వేమన, జనవరి 2014