"మా చవిటిపల్లెలో తిరుణాల మీరు అందరూ రావాలి " సరస్వతి అంటి పిలవడం తో నేను సిద్దమయాను.తిరణాల అనగానే చిన్నతనంలో అమ్మమ్మ గారివూరు కలమల్ల వెళ్ళే రోజుల్లో వెళ్ళిన రామేశ్వరం తిరణాల గుర్తు కొచ్చింది.చిన్నప్పటి నుంచి నాకు పల్లెలన్నా,పొలాలన్న చాలా ఇష్టం .సెలవులన్ని దాదాపుగా అమ్మమ్మ వాళ్ళ వూర్లోనో లేక నానమ్మ వాళ్ళ వూర్లోనో గడిపే దాన్ని.కాలేజీ చదువు కొచ్చేసరికి మెల్లిగా ప్రయాణాలు తగ్గి పోయాయి. అమ్మ మా చదువులపై శ్రద్ధ పెట్టి అమ్మగారింటి పై సీత కన్ను వేసింది. అప్పుడప్పుడు బంధువుల పెళ్లిళ్లకు కూడా నేనే హాజరు వేసుకునే దాన్ని. చిన్ననాటి స్నేహితుల్ని కలవడానికి అప్పుడప్పుడు పల్లెలకు వెళ్ళినా తిరుణాళ్ళు జాతరలు పోవడం కుదరడం లేదు .దాదాపు ఇరవై ఏళ్ళనాడు చూసిన తిరుణాలే,తర్వాత చూడ లేదు. ఇదిగో మళ్ళి ఇప్పుడే.
కారులో కొండాపురం చేరుకున్నాక రైల్వే స్టేషన్ చూడగానే రామచంద్రారెడ్డి మామయ్య గుర్తుకొచ్చారు. దాదాపుగా అమ్మమ్మ గారి వూరికి వచ్చి నపుడంతా కొండాపురం లో ఒకటి, రెండు రోజులు వుండే వాళ్ళం. అత్తమామల దగ్గర నేను, చెల్లి తమ్ముళ్ళు చేసిన గారాబం గుర్తుకొచ్చింది .ఆయన హేడ్మాస్తారుగా వుండే వారు, మమ్మల్ని స్కూలుకు తీసికెళితే పిల్లలు ,టీచర్లు కూడా మా పక్క అభిమానంగా చూసేవారు.ఆడపిల్లలు పొడవాటి లంగాలు వేసుకున్నది చూసి పొట్టిగా వున్న నా గౌను చూసుకుంటే సిగ్గేసేది. అందరూ మాకేసి పరీక్షగ చూస్తే అంతా వరకు తెలియని బిడియమేదో కలిగేది. మాతో స్నేహంగా ఉండేదానికి అమ్మాయిలు ప్రయత్నిస్తే అబ్బాయిలు మా తమ్ముళ్ళను తమతో తీసికెళ్ళేవారు.మమ్మల్ని చూసి అబ్బాయిలు సిగ్గుపడి దూరంగా పోయే వారు .మళ్ళి దొంగచూపులతో స్నేహంగా చూసేవారు వాళ్ళంతా ఇప్పుడేమయ్యారో.. ఏమ్చేస్తున్నారో! చదువుకున్నారో లేక వ్యవసాయం చేస్తున్నారో! అమ్మాయిలందరూ పెళ్ళిళ్ళు చేసుకుని ఎక్కడికి వెళ్లి పోయారో !వాళ్ళందరికీ చిన్ననాటి ఇందిర వచ్చింది రండి అని వూర్లో దండోరా వేస్తే వస్తారేమో! .ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ జరిగిందేమో అప్పుడు అందరూ రామచంద్రారెడ్డి సర్ మేన కోడలు ఇందిర కర్నూల్ నుండి వచ్చేది కదా అని తలుచు కున్నారేమో .. ఎంత అద్భుతంగా వుంటుంది వాళ్ళందరిని కలిస్తే.!.మామయ్య చనిపోయాక అత్త పల్లెకు వెళ్లి పోయింది, మళ్ళి కొండాపురం వచ్చే అవకాశమే లేకపోయింది..
సరస్వతి అంటి అన్న గారింట్లో దిగాం.వాళ్ళబ్బాయి ప్రతాప్ అతని భార్య లక్ష్మి తో వాళ్ళ పిల్లతో సరదాగా సాయంత్రం గడిచింది .ఎపుడెప్పుడు తెల్ల వారుతుందా! ఎపుడెపుడు చవిటి పల్లె తిరుణాల చూద్దామా అని నా మనసు ఆత్రుత పడుతోంది తెల్ల వారగానే స్నానాలు ముగించి తయారయ్యాను.ఆంటీ కొడుకులు వచ్చారు.కానీ వాళ్ళ భార్యలు పిల్లలు చదువుల చట్రంలో ఇరుక్కుని రాలేక పోయారని తెలిసినప్పుడు వాళ్ళు ఒక అధ్బుతాన్ని కోల్పోతున్నారని అనిపించింది. కారులో బయలు దేరాము,దారి వెంబడి నా కళ్ళు పచ్చదనం కోసం వెతికాయి .ఎక్కడ చూసినా దుమ్ము రేగుతోంది ,
"కంప చెట్లు తప్ప పొలాలు లేవేంటి "అంటి ని అడిగాను .
"ప్రాజెక్ట్ కింద పొలాలన్నీపోయి బాగా డబ్బు లొచ్చాయి అందరూ వ్యవసాయం వదిలేసారు ,వ్యాపారం, కాంట్రాక్టులు చేసుకుంటున్నారు, ఇరవై ఏళ్లుగా బీడు పోయాయి పొలాలు."అంది.
ఎక్కడా ఎద్దుల బండ్లు కనపడలేదు ,మోటార్ సైకిళ్ళ పై భార్య భర్తలు పిల్లల్ని ఎక్కించుకుని వెళ్ళే వాళ్ళని చూసి, ఓహో మన గ్రామాల్లో సైతం అభివృద్ధి జరిగిందని సంతోషం వేసింది. దారివెంట అంతా కార్లు జీపులు ,ట్రాక్టర్లు మోటారు సైకిళ్ళు తప్ప ఇరవై ఏళ్ళ క్రిందట నేను చూసిన గ్రామ వాతావరణమే లేదు. చవిటిపల్లెలో ఇరుకు సందులో పెద్ద కారు అతికష్టం మీద వెళుతోంది, ఎదురుగా మరో పెద్ద కారు రావడం తో రెండు కార్లు ఆగి పోయాయి నువ్వు వెనక్కి వెళ్ళమంటే నువ్వు వెళ్ళమని కాసేపు వాగ్యుద్ధం జరిగింది .కాసేపు తర్వాత యిద్దరు ఎలా సర్డుకున్నారో మరి కారు కదిలింది. వీధులన్నీ నీళ్ళ మయి వున్నాయి
"ఇదేంటి ఎక్కడా వర్షం పడకుండా వీధుల్లోకి నీళ్ళు ఎలా వచ్చాయి? అడిగాను పక పక నవ్వేసి "ఇవి మురికి నీళ్ళు అంటే బాత్రూం నీళ్ళు " అంది
"అదేంటి ఇన్ని నీళ్ళా...మొత్తం దారి వెంట, కాలువ లేకున్నా, కనీసం గుంత తవ్వి దానిలోకి వదల వచ్చును కదా!
"సిమెంటు రోడ్లు వేసారు, స్థలం లేక మురికి నీళ్ళు ఇలా వదిలారు, ఇక్కడ ఎవరు పట్టించుకోరు" అంది.
ఓ ఇంటి ముందు కారు ఆగింది ,అంతకు ముందే అక్కడ రెండు కార్లు ,రెండు మోటార్ బైకులు ,ఒక ట్రాక్టరు వున్నాయి. చాలా ఇళ్ళముందు కార్లు వున్నాయి .ఇంటి లోకి అడుగు పెట్ట గానే నాకు పల్లె ఇల్లు చూసినా సంతోషం కలిగింది .ఎంతో కాలం కిందటి ఆ ఇల్లు చెక్కు చెదరకుండా వుండటం ఆశ్చర్యం కలిగించింది .ఆ తర్వాత ఇంటిలోని ఫ్రిజ్, ఏ .సి ,అవెన్ ,మినెరల్ వాటర్ చూసి ఇండియా వెలిగి పోతోంది అన్న వాజపేయి మాటలు నిజమైనాయా! పచ్చదనం లేదని,పల్లె వాతావరణాన్ని గుర్తు చేసే ఎద్దుల బండ్లు లేవని కాసేపు బాధ పడ్డా, మన పల్లెలు సాధించిన ప్రగతి చూసి కుదుట పడ్డాను .
"లింగమయ్య మా ఇంటి దేవుడు, మా పూర్వీకులకు పొలం దున్నుతుండగా దొరికాడట అందుకే ఈ తిరుణాల సంబరం అంతా మా వంశం వారి ఆధీనంలో వుంటుంది, ఇదే ఆఖరి తిరుణాల కావచ్చు, నీళ్ళు వదిలితే వూరు మునిగి పోతుంది, మరి దేవుడ్ని కొండ పై నిలుపు తారేమో " అంది అంటి స్థలపురాణం వివరిస్తూ ."మా ఇంటి నుంచే దేవుడ్ని తీసుకు వెళతాము, అక్కడ గుడి లేదు, తిరణాల రోజు మాత్రమే దేవుడి ని అలంకరించి పెడతారు, మిగతా రోజుల్లో శివ లింగం మాత్రమే వుంటుంది. పిల్లలు లేని వాళ్ళు చాలా దూరం నుంచి ఇక్కడకి వచ్చి మొక్కు చేసుకుని పోతారు,తరువాత పిల్లలు పుట్టిన వాళ్ళు పెద్ద కానుకలు ఇస్తారు.చాలా మహిమ గల దేవుడు" అంది.
ఏదో గొడవలు లేవదీసారు దేవుడి హుండీ డబ్బు గురించి ....ఆ గొడవని అంటి కొడుకు శంకర్ ఎంతో నేర్పుగా పరిష్కరించాడు. అతని లౌక్యం తో ప్రశాంతత నెలకొనింది. మెచ్చుకోలుగా అతన్ని చూసాను .టెంకాయలు కొడుతూ వుండ గానే పక్కనే ఒక మేకని తెచ్చి బలి ఇవ్వడంతో నేను వణికి పోయాను. రక్తం చిమ్మిన ఆప్రదేశం లో ఉండాలంటే నాకు వళ్ళు జలదరించింది. త్వరగా అక్కడినుండి శివాలయం కేసి నడిచాను అంటి, లక్ష్మితో.శివాలయం లో పూజారి గుడి స్థితి గతుల గురించి చెబుతున్నాడు. కుర్రాళ్ళు అక్కడి కొచ్చిసిగరెట్లు ,మందు తాగడం ,పేకాడ్డం మరియు చిల్లర పనులు చేయడం, అదేమని అడిగితే పూజారిని బెదిరించడం చేస్తారని వాపోయాడు,అతని గోడు వినే దానికి వూర్లో ఎవరూ లేరని వాపోయాడు.మారిన విలువలు, మారిన మనుషుల్ని,మారిన జీవన విధానం చూసి బాధపడ్డం వృధా అని పూజారికి ఎవరు చెబుతారు ? ఏది భక్తి? ఏది ముక్తి? ఏది ఆచారం? ఏది అనాచారం? కొంతమంది గుడిలో టెంకాయకొట్టడం, గుడిఆవరణ లోనే సిగరెట్టు కాల్చడం చూసి విస్తుపోయాను.
తిరుణాల సంబరం నన్ను ఊరిస్తోంది.బంధువుల పలకరింపులు ,ఎవరెవరు ఏమి చదువుతున్నారో విచారిస్తున్నప్పుడు. పల్లె లోని పిల్లలందరూ మంచి మంచి కాలేజీల్లో చదువుతున్నారు. ఎవరికీ ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలు లేరు . చాలా మంది విదేశాల్లో కూడా వున్నారని తెలిసింది .అదంతా వింటూ వుంటే అజ్ఞానాన్ని వదిలి పల్లె ప్రజలు ప్రగతి దిశకు నడుస్తున్నారని అనిపించింది. కానీ ఎందుకో నాకు ఈ అభివృద్ధి కంటే ఒకప్పుడు ప్రజల్లో వున్నఅజ్ఞానం తో మాత్రమే సాధ్యమయే అమాయకత్వం,ఆరాటం లేక వున్నదాని తోనే త్రుప్తి పడే ప్రశాంత జీవితమే మేలైనది అనిపిస్తుంది.
విశాలమైన రోడ్లు,అపార్ట్మెంట్లు లేవన్న మాటేకానీ జీవన విధానం లో ,మాకు వీళ్ళకు తేడా కనిపించ లేదు . పప్పు.బదులు సాంబారు, చనిక్కాయల రోటి పచ్చడి స్థానం లో మిక్సి పచ్చడి, ప్రియ ఊర గాయాలు ,ఆమ్లెట్లు... వుహూ ఇది పల్లె మెను కాదు.నానమ్మ వూర్లో తిన్న కొర్ర అన్నం గుర్తొచ్చింది. సూపెర్ మార్కెట్లో కొర్రలు తెచ్చి అప్పుడప్పుడు అమ్మ వండుతుంది గానీ ఈ పల్లెల్లోఎవరూ కొర్ర అన్నం తినడం లేదట . మార్పు అనివార్యం ..కానీ అది మానవుని ఉన్నతస్థాయి జీవనం వైపుకు తీసి కెల్లాలి కదా.!
"తిరునాలకి వెళదాము.. ఏంటి ఆలోచిస్తున్నావు?" అంటి అనడంతో, దేశ ప్రగతికి గ్రామాలు పట్టు కొమ్మలు టాపిక్ నుండి మనసుని మరలించి ఉత్సాహంగా బయలుదేరాము .ఉదయాన్నే వెళ్ళిన శివాలయం ,లింగమయ్య గుడి ప్రాంతం లోనే చాలా అంగల్లు వెలిశాయి .ఫిబ్రవరి నెలకే సూర్యుడు నిప్పులు చెరుగు తున్నాడు .చెరుకు గడల అంగడి దగ్గర ఆగాము .తిరుణాల అంటేనే చెరుకు గడలు ...అక్కడ చెరుకులు కొంటూ ఉండగానే పక్కనే ఒక జీపు మమ్మల్ని దాదాపుగా తాకినట్లుగా వచ్చి దుమ్ము మా మొహాల పై వెదజల్లి వెళ్ళింది. ఒక్క సారి వులికిపడి చెరుకుల అంగడి ప్రక్కకు ఒదిగి నుంచున్నాము .ఆ వేగాని కి నా గుండె అదిరిపడింది ... నా కళ్ళలో కనపడ్డ భయమే అందరి కళ్ళ లోను కనపడింది .ఎక్కడ చూసినా కార్లు మోటార్ బైకులు తిరణాల అందాన్ని చెడగోట్టాయి. అవి రేపిన దుమ్ము అందరి కళ్ళలో మొహమ్మీద పడుతూ చిరాకు కలిగిస్తున్నాయి .ఎద్దుల బండ్లు అసలు కనపడలా ,వాటి గంటల శబ్దం అసలు వినపడలా. రేగుతున్న దుమ్ము లో అలాగే వెళ్ళాము . గాజుల అంగల్లు చూడగానే నాకు సరోజినీ నాయుడు బ్యాంగిల్ సెల్లర్స్ పద్యం గుర్తోచ్చింది . గాజుల అంగడిలో గాజులు కొంటూ వుండగా పెద్దగా కేకలు వినపడ్డాయి, యిద్దరు ఆడవాళ్ళూ జుట్లు పట్టుకుని చెప్పనలవి కానీ తిట్లు తిట్టుకుంటూ కొట్టు కుంటున్నారు .ఒకరి బేరం మరొకరు లాక్కున్నారని వాళ్ళ అభియోగం .అందరూ చోద్యం చూస్తూ నిల్చున్నారు. ".వొళ్ళు కొవ్వెక్కి కొట్టుకు చస్తున్నారు విడిపించండహే" ఎవరో గట్టిగా కేకేశారు. తమని అందరూ చూస్తున్నారని కానీ, అందరిలో నీచంగా చూడ బడుతున్నామని గాని వాళ్లకు స్పృహ లేదు. జీవిత పోరాటంలో వాళ్లకు పరిసరాలు కనపడలా. వాళ్ళను చూస్తుంటే నాకు కన్నీళ్ళు తిరిగాయి .మురికి పట్టిన బట్టలు, రేగిన జుట్టు,శరీరం లో కనపడని కండ, నల్లటి శరీరాలు చలికి పగిలి చీలి వున్నాయి ,వాళ్ళే కాదు దాదాపుగా అందరిలో అదే దీనత్వం,పోటీతో బేరాలు లాక్కోవాలని తాపత్రయ పడే తత్వం ,ఒడిలో పిల్లల్ని పెట్టుకున్న వాళ్ళు, నడుముకు పిల్లల్ని కట్టుకున్న వాళ్ళు, ఏడుస్తున్న పిల్లల్ని లాలించలేక ఏదో చేతిలో పెట్టి సముదాయించే వాళ్ళు ,మండు తున్న ఎండలో చెమటలు కారుతున్నా,తమ వస్తువుల్ని అమ్ముకునే ఆత్రం తప్ప మరేమీ లేదు . మట్టి బొమ్మలు కన పడలా ...ఎక్కడా చూసినా ప్లాస్టిక్ బొమ్మలే ...గాజులు కోన్నానే గానీ ఎందుకో ఆనందం లేదు .పిలుస్తున్న ప్రతి అంగడి దగ్గర వాళ్ళ గాజులు ,బొమ్మల కంటే వాళ్ళ దైన్యమే నాకు కన పడుతూ నన్ను కలతకు గురి చేసింది.
అన్యమనస్కంగా అందరితో నడుస్తున్నా....అంతలో తప్పెట్ల శబ్దం వినబడింది ....అంతలోనే ఆ శబ్దం మాకు దగ్గరగా వచ్చింది,దేవుడి ఊరేగింపు తో పాటు ఓ పది ,పన్నెండు మంది దాకా తప్పెట్లు కొడుతూ ఊగుతున్నారు ,వాళ్ళు బాగా తాగి వున్నారు ...చాలా చాలా తాగివున్నారు.. సరస్వతి ఆంటిని ఆపి తప్పెట్లు వాయించి ,పిచ్చి పిచ్చిగా ఎగురుతున్నారు ,ఆత్మాభిమానం వదిలి అందర్నీ డబ్బులు అడుగుతున్నారు ...అడిగినవారికి లేదనలేని శంకర్ పర్సు ఖాళి అయ్యేంతవరకు సతాయించి తీసుకున్నారు ,మిగతావాళ్ళు తప్పించుకుని పోయెకొద్దీ వెంటపడి అడుగుతున్నారు ...డబ్బు చేతిలో పడగానే మళ్ళి మళ్ళి తాగి వచ్చి ఆడుతున్నారు .వృద్దులు కుర్రాళ్ళు ,మద్య వయస్కులు ,వారు వీరనకుండా తాగి వున్నారు ,తాగుతూనే వున్నారు . మందలించిన వారికి సంవత్సరానికి వొక్క సారే కదా అని మొండి కేసి మరీ డబ్బులు ఇచ్చేంత వరకి వదలడం లేదు .
భారతదేశం మార లేదు ,భారత దేశం వెలిగిపోవడం లేదు ..ఈ దేశం లో చాలా మార్పులొచ్చాయి , ప్రతి వూరికి కరెంటు వచ్చింది , రోడ్లు , బస్సులు ,టెలిఫోను, స్కూళ్ళు ,హాస్పిటళ్ళు ,వీడియో షాపులు ,సినిమా థియేటర్లు వచ్చాయి , ప్రతి ఇంటికి ,ఒక చిన్న గుడిసెకు కూడా టీవీ వుంది,ఫ్రిజ్ లు కార్లు మోటారు. వాహనాలు సామాన్య మైపోయాయి, ప్రతి మనిషికి చెప్పులు లేకున్నా సెల్ ఫోన్ చేతిలో వుంది.పల్లెలు పట్నం తేడా లేకుండా సౌకర్యాల తో మానవుడు ఎదిగాడని దేశం ప్రగతి పథం లోకి దూసుకు పోతున్నదనుకున్న నా ఆనందాన్ని ఈ తప్పెట్ల మోత హరించింది ,ఎన్నో ఏళ్లుగా కొంచమైనా మార్పులేనిది పేద ప్రజల జీవితాల్లో. కూలి వంద సంపాదించినా వంద యాభై సంపాదించినా , సంపాదించింది తాగుడుకు తగలబెట్టి ,ఆత్మాభిమానం అంగట్లో తాకట్టు పెట్టి మరీ తాగి ,భార్యా పిల్లల్ని ఆకలికి ,అవమానాలకు గురిచేసి ,నరకములోనే స్వర్గం చూసుకునే హరిజన పేదవాడి జీవితాలలో మార్పు రాలేదు. నేను చిన్నప్పుడు తిరుణాలలో రంగు రంగు గాజులు చూసాను,రంగు వెలిసిన వాళ్ళ జీవితాలు చూడలేదు , మట్టితో చేసిన బొమ్మలు చూసాను కానీ సమాజం లోని కుల వ్యవస్థలో కీలు బొమ్మల్ని చూడలేదు, తియ్యటి చెరుకుగడలు చూసాను చేదయిన అసమానతల అడ్డుగోడలు చూడలేదు, గిర గిర తిరిగే రంగుల రాట్నం చూసాను ఆర్ధిక సంస్కరణలు లేని మన ఆర్ధిక విధానమనే ఇనుప చట్రం లో ఇరుక్కుని రక్తం ఒడుతున్నఅభాగ్యుల్నిచూడలేదు. నేను చూస్తున్న పల్లెలు నా చిన్ననాటివి కావు ,అవసరంలేని మార్పులతో, మార్పుతెచ్చుకోని జీవితాలతోవున్న ఈ నడుస్తున్నశవాల్ని, వాటిని మోస్తున్నశ్మశానాల్ని. చిన్ననాటి నుండి తిరుణాల అన్న అద్భుతమైన ఒక వూహ నాలో ఎప్పటికి పదిలంగా వుండేది, సామాజిక స్పృహతో ఈ మారిన నవనాగరిక తిరుణాలను,మారని పేదవాళ్ళ జీవితాల్నిచూడక పోయినట్లయితే.