Sunday, 16 February 2014

స్నేహితుడు
















అత్త గారి ఆరోగ్యం చాలా బాగాలేదని ఆడపడుచు సుమ ఫోన్ చేస్తే ఏమీ తోచలేదు, రఘుకు ఫోన్ చేస్తే కంగారు పడి వెంటనే బయలు దేరతాడని చెప్పలేదు. మూడేళ్ళుగా రఘు ముంబైలో అవుట్ అఫ్ స్టేట్ సర్వీస్ చేస్తున్నారు స్టేట్ బ్యాంకులో ఆఫీసర్ గా. జూనియర్ కాలేజ్ లో లెక్చరర్ గా నా వుద్యోగం కర్నూల్లో, ,పిల్లల చదువులు, ఆడపడుచు పెళ్లి లాంటి మధ్యతరగతి కుటుంబ భాద్యతలు సమర్థవంతంగా పూర్తి చేసినా,ఇంకా వెంటపడే కొన్ని బాధ్యతల్లో తరచు జబ్బు పడే అత్తగార్ని చూసుకోవడం ఒకటి. ఆమె ఆస్తమా పేషంటు...డాక్టర్ దగ్గరికి తరచు తీసుకుపోవాల్సి వుంటుంది. ఒక్కో సారి హాస్పిటల్ లో చేర్పించి చూసుకోవాల్సి వస్తుంది. కాలేజ్ కు ఒక రోజు సెలవు పెట్టి, మరోరోజు పర్మిషన్ పెట్టి, పిల్లల సాయంతో ఎలాగో నెట్టుకోస్తున్నా.

ఈ సారి అత్తగారు ఆడపడుచు సుమ దగ్గరకు వెళ్లి జబ్బుపడ్డారు. తిరుపతి పరిగెత్తక తప్పలేదు. నాల్గురోజుల అనంతరం ఆవిడని తీసుకుని కర్నూల్ వెళ్లి పోదామంటే సమైఖ్యాంద్ర ఉద్యమం కారణంగా బస్సులు లేవు, రైలు రిజర్వేషణ్ దొరక లేదు. ఇప్పటికే తడిసి మోపెడైన ఖర్చుల్లో ఆకాశాన్ని అంటివున్న టాక్సీధరల్ని అందుకోలేక, సెలవు లేని కారణంగా అత్తగార్ని అక్కడే వదిలి వెంకటాద్రి కి వెళ్ళడానికి నిర్ణయించుకున్నాను. సాయంత్రం అత్తగార్ని చూసి ఆటే రైల్వే స్టేషన్ కు బయలు దేరాను. సమైక్యాంధ్ర ఉద్యమ పోరులో సమ్మెలో వున్నఆర్టీసి పుణ్యమా అని హాస్పిటల్ నుండి రైల్వే స్టేషన్ కు వంద తీసుకున్న ఆటోవాడిపై కోపాన్ని చూపలేక, నాలోనే దిగమింగుకున్నాను. ఒక చేతిలోనాసూట్కేస్, మరో చేతిలో అత్తగారి బట్టలున్నబ్యాగ్ వున్నాయి. జారిపోతున్నచీరెను సర్దుకోలేక, ముఖం మీద నుండి కారుతున్న చమటను తుడుచుకోలేక అవస్థ పడుతుంటే, ఇసకేస్తే రాలని జనసాగరoలో, వెంకటాద్రి మూడవ ప్లాట్ ఫార్మ్ లో ఉందన్న విషయం గుండె జారెట్టు చేసింది. కనీసం పోర్టర్ ను మాట్లాడుకుందామంటే.ఒక్కడు లేడు. వారం రోజులుగా హాస్పిటల్లో నిద్రలేని రాత్రులు ,పిల్లలిద్దరిని వదిలి వచ్చాననే దిగులు, కాలేజ్ నడవకపోయినా పోవాల్సిన బాధ్యత, రఘు లేకుండా వొంటరిగా చేస్తున్న జీవన పోరాటంలో ఎన్నడూ బేల కాని నాకు, దు:ఖం తన్నుకు వచ్చింది. సంసారం సాగరం దు:ఖం అని ఎందుకన్నారో అర్థమైంది. చేతులు నొప్పి పెడుతుంటే సూట్కేస్, బ్యాగ్ క్రిందపెట్టి ఫ్యాన్ కింద నుంచున్నా ... !

"హలో సంధ్యా ... " ప్రక్కనే వినపడడంతో ఉలికి పడి చూశా ...

చిరునవ్వుతో అన్వర్...! సంవత్సరం క్రిందట మా కాలేజ్ లో పనిచేసి ట్రాన్సఫర్ అయి తిరుపతికి వెళ్ళారు.

"హలో అన్వర్ ఎలా వున్నారు ?"

"బాగున్నాను, మీరేంటి ఇలా ఇక్కడ... ! ఎప్పుడూ ఫ్రెష్ గా వుండేవారు, అలా డల్ గా వాడిపోయారు, ఏమైంది ? "

"ఏమీ లేదు అన్వర్ .. మా అత్తగారికి బాగాలేదు, హాస్పిటల్ లో చేర్చాము ... వారం రోజులుగా ఒకటే టెన్షన్, రఘు కేమో హాఫ్ ఇయర్లీ క్లోజింగ్..పైగా అతనకి సెలవులు లేవు, నాకు సుమకు తప్పలేదు, వెంకటాద్రికి కర్నూల్ వెళ్ళాలి అని వచ్చా, రిజార్వేషణ్ కూడా లేదు,జనరల్ లో వెళ్ళాలి, బస్సులు కూడా లేవు కదా! బాగా రద్దీగా వుంటాయి..ఎలా?"

"వెంకటాద్రి గంట లేట్..ఇందాకే కనుక్కున్నా ... వేరే ఫ్రెండ్ చెన్నై పోతుంటే వీడ్కోలు ఇవ్వడానికి వచ్చా ... దిగులు పడకండి ...మిమ్మల్ని ట్రయిన్ ఎక్కించి వెళతాను ...కరీమాతో చెబుతా... " ఫోన్ చేసి అన్వర్ మాట్లాడి నాకిచ్చాడు.

కరీమ ఇంటికి రమ్మని చాలా అడిగింది .. తనకి ఇప్పుడు వచ్చే వీలు లేదని ఈ సారి వస్తానని సర్ది చెప్పా.

ముందుగా నా సూట్కేస్, బ్యాగ్ రెండు చేతుల్లోకి తీసుకుని "పదండి ... ముందు వెయిటింగ్ రూం లో ఫ్రెష్ అవండి " అని దారి తీశాడు.

లేడిస్ వెయిటింగ్ రూమ్ లో ఫ్రెష్ అయేప్పటికి చాలా బాగా అనిపించింది.

"ఇంకా గంట వుంది సమయం, లగేజ్ క్లాక్ రూం లో పెట్టి వచ్చా..పదండి... బయటికి వెళ్లి టిఫిన్ చేసి వద్దాం."

"వద్దు అన్వర్.. ట్రైన్ లో ఏదో ఒకటి తింటాలే".

"అదేం కుదర్దు...ఈ వారం రోజులు ... అసలు తిండి తిన్నారో లేదో! ... మొహం అంతా వాడి పోయింది. కాస్త టిఫిన్ తిందురు కానీ, ఇంకేం చెప్పకండి... పదండి".

ఇంకేం చెప్పలేక కదిలాను. నేను ఏమీ చెప్పకుండానే దోశ,ఇడ్లీ చెప్పాడు. మారు మాటాడకుండా తినేశాను,కూల్ డ్రింక్ త్రాగాక, బుక్ షాప్ లో, ఇండియా టుడే, వీక్, నవ్య మాగజైన్లు కొన్నాడు. నేను డబ్బులివ్వబోతుంటే

"మగవాళ్ళు వుండగా ఆడాళ్ళు పర్స్ తీస్తే అది పెద్ద అవమానంగా భావిస్తారు మగవాళ్ళు ... సో ... వద్దు".

నవ్వి ఊర్కున్నా మళ్ళీ స్టేషన్ లోకి వచ్చాం.

"ఇక్కడ ఒక ఫ్రెండ్ వున్నాడు రిజర్వేషన్ లో ఖాళీ ఉందేమో కనుక్కుంటా ... ప్రయత్నం చేద్దాం." అని అన్వర్ వెళ్లి పోయాడు.

ఆకలి తీరడంతో పాటు, ఫ్రెష్ గా ముఖం కడుక్కోవడం, బరువు మోత తప్పడంతో మనసు తేలికైంది . అన్వర్ నవ్వుకుంటూ వచ్చాడు.


"సంధ్యా...టీసీతో మాట్లాడి ప్రయత్నం చేస్తా అన్నాడు నా ఫ్రెండ్ ... టికెట్ తీసుకొస్తా... రిజర్వేషన్ చార్జెస్ అక్కడ కట్టచ్చు ... ఏసీ దొరికినా పర్లేదు అని చెప్పాను అతనికి, ప్రయత్నం చేద్దాంలే, ప్రయాణం సుఖంగా వుండాలి, మళ్ళీ మీరు మరుసటి రోజంతా పని చేయాలి కదా! "

"టికెట్ కు డబ్బులు... ప్లీజ్ అన్వర్ " అంటున్నా వినిపించుకోకుండా వెళ్లి పోయాడు.

"సేఫ్ సైడ్ జనరల్ టికెట్ తీసుకున్నా...స్లీపర్ లేకుంటే, ఏసీ ఏదయినా చూడమన్నా, కాసేపట్లో నాకు ఫోన్ చేస్తాడు. మనం కొంచం ప్రశాంతంగా వుండే చోటుకు వెళదాం."

కొంచం దూరంగా రద్దీ లేని చోట ఒక బెంచ్ పై కూర్చున్నాం. రఘు గురించి, నా పిల్లల గురించి, తన పిల్లలగురించి కరీమా ఆదుర్దా గురించి, సినిమాల గురించి, పుస్తకాల గురించి, మా కాలేజ్ లో తనున్నప్పుడు వున్న కొలీగ్స్ గురించి, సరదా సరదాగా అన్వర్ మాట్లాడుతుంటే కాలం హాయిగా గడిచి పోయింది. బాధ్యతల పట్ల నా కమిట్మెంట్ ను, లెక్చరర్ గా నా ప్రతిభను, కలీగ్స్ తో నా అనుబంధాన్ని, ఎప్పుడూ నవ్వుతూ వుండే నా నైజాన్ని మెచ్చుకున్నాడు, నా గురించి మిగతా కలీగ్స్ ఎలా అభినందించేవారో, కొంతమంది ఎలా అసూయ పడేవారో చెప్పి నవ్వించాడు. నాలో అంతకు ముందున్న విచారం స్థానంలో ఉత్సాహం, ఆనందం చేరింది. చిన్ని చిన్ని ప్రశంసలు ఎంత రీచార్జ్ చేస్తాయి! ఇంతలో అన్వర్ ఫ్రెండ్ ఫోన్ చేయడంతో థర్డ్ ఏసీ లో నా టికెట్ కన్ఫర్మ్ అయిందని తెలిసాక ఇంకా హాయిగా అనిపించింది.

ఒక బ్యాగ్ కూడా నా చేతికివ్వకుండా అన్వరే రెండూ మోసుకొచ్చి ట్రైన్లో పెట్టారు. నీళ్ళ బాటిల్, పండ్లు తెచ్చిచారు, టీసీ దగ్గరకు వెళ్లి ఏమి మాట్లాడారో ఏమో అతను నాకేసి చూసి తలవూపారు, తనే డబ్బు కట్టి రిసీట్ నాకు తెచ్చిచ్చాడు . కట్టిన డబ్బు మొత్తం ఇవ్వ బోతే...

"పర్లేదు సంధ్యా దాంట్లో ఏముంది? స్నేహం లో అలాంటివి పట్టించుకోరాదు...ప్లీజ్ డోంట్ మైండ్...వోపికున్నంతసేపు చదువుకోండి .. తర్వాత హాయిగా నిద్రపోండి. రెండు పదికి వెళుతుంది కర్నూల్....అలారం పెట్టుకోండి సెల్ లో. బాబు వస్తాడు కదా స్టేషన్ కు ..వెళ్ళగానే మెసేజ్ పెట్టండి ... ఇదిగోండి నా నంబర్ " విజిటింగ్ కార్డ్ అందించాడు.

"థాంక్స్ అన్వర్...నా కోసం ఎంత సమయo... డబ్బు ఖర్చు చేశారు..మీకు రుణపడ్డాను " సంతోషం ఒక ప్రక్క అతను నాకోసం ఖర్చుపెట్టడం అనేది ఇబ్బందిగా అనిపించింది.


"భలే వారే.. రుణమా ... అయితే నేను ఋణం తీర్చుకున్నాలెండి .. మా చిన్న బాబు పుట్టినప్పుడు, మాకెవరూ లేకపోతే, వారం రోజులు క్యారియర్ పంపారు... మా పెద్ద బాబును చూసుకున్నారు ... మళ్ళీ ఇంటికొచ్చాక కూడా మీ ఇంటి నుండి క్యారియర్లు వస్తూనే ఉండేవి .. మీ ఇంటికి మా ఇల్లు చాలా దూరం, కానీ మీరు ఒక చోట పని చేసేవారమని మా ఇబ్బందుల్లో ఎంతో సహాయం చేశారు...అది మీరు స్నేహంతో చేశారు, ఇది నేను స్నేహంతో చేశాను.'ఋణం' అనే మాట స్నేహం లో లేదండి."


నేనేమీ మాట్లాడలేకపోయాను.అతని ఆత్మీయతకు ఆనందించడం తప్ప. ట్రయిన్ కదలడడంతో అన్వర్ దిగాడు. కనిపించేవరకు అతను చేయి ఊపుతూనే వున్నాడు. అన్వర్ ఇవాళ కనపడకుండా వుంటే ఆ జనరల్ కంపార్ట్ మెంట్ లో సీట్ కూడా దొరక్క, రాత్రంతా నిద్ర లేక, ఎంత ఇబ్బంది పడేదాన్నో...! ఊహించుకుంటే భయం వేసింది . మళ్ళీ అన్వర్ చిరునవ్వు ముఖం గుర్తొచ్చి ... నవ్వుకున్నా ... స్నేహ బంధo ... ఎంత మధురం !


--
జనవరి, 2014,ఆంధ్ర ప్రదేశ్ పత్రిక